1 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - బ్రహ్మ ఖండము

Table of Contents

26 - ఆహ్నిక కార్యక్రమముల వివరణ

సౌతిరువాచ- సౌతి మహర్షి ఇట్లనెను-

దేవరీయైన నారదుడు పరమశివుని హరిస్తోత్రమును, కవచమును, మంత్రమును, పూజావిధిని, ధ్యానాదీకములను తెలుపుమని ప్రార్థించగా నతడు నారదుడు కోరినవన్ని ఇచ్చెను.

శంకరుని వల్ల తన కోరిక తీరగా నారదుడు భక్త జనవత్సలుడైన శంకరునకు భక్తితో నమస్కరించి ఇట్లు పలికెను.

నారద ఉవాచ- నారదుడిట్లనెను.

వేదార్థములన్ని తెలిసిన వారిలో శ్రేష్టుడవైన మహేశా బ్రాహ్మణులకు స్వధర్మపరిపాలన దేనితో ప్రతి దినము నిర్వహించబడునో ఆ బ్రాహ్మణాహ్నికమును నాకు వివరముగా తెల్పుము.

శ్రీ మహేశ్వర ఉవాచ- శ్రీ మహేశ్వరుడిట్లనెను-

ప్రతి నిత్యము (బ్రాహ్మీ ముహూర్తమున నిద్రలేచి రాత్రిపూట ధరించిన వస్త్రములు వదలి నూతన వస్త్రములు ధరించి కూర్చొని తన బ్రహ్మరంధ్రమందున్న సహస్రారకమలమున వ్యాఖ్యాముద్రను ధరించినవాడును. స్మిత వదనుడు, శిష్యులపై వాత్సల్యము కలవాడు నగు తన గురుదేవుని తొలుత ధ్యానింపవలయును.

ఆగురువు ప్రసన్నమైన ముఖము కలవాడు, నిత్యసంతోషి సాక్షాత్సర బ్రహ్మస్వరూపుడు. అతనిని తన సహస్రారకములమున ధ్యానించి తరువాత గురుదేవుని అనుజ్ఞను గైకొని సమయోచితమైన కార్యక్రమములు నిర్వహింపవలెను.

తొలుత గురువును ధ్యానించి అతనికి నమస్కరించి మానసిక పూజను శాస్త్ర ప్రకారము నిర్వర్తించి తరువాత గురువుయొక్క ఆజ్ఞ ప్రకారము ఇష్టదేవతను పూజింపవలెను.

గురువు దేవుని అతని మంత్రపూజాదికములను జపవిధిని తెలుపును. కాని దేవుడు గురువును చూపించడు. అందువలన దేవునికంటే గురువు శ్రేష్ఠుడు. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, ఈశుడు మొదలైన దిక్పాలకులు, ప్రకృతి, వాయువు, వరుణుడు, తల్లి దండ్రులు, స్నేహితుడు, సర్వము గురువే. చివరకు పరబ్రహ్మ కూడ గురువే. అనగా గురువు సర్వదేవతా స్వరూపుడు. అందువలన గురువుకంటే పూజించతగిన వాడెవ్వరు లేరు,

ఇష్టదేవత కోపగించినను గురువు అతనిని రక్షించును. కానీ గురువు కోపించినచో అతడు నూరు బ్రహ్మహత్యలు చేసిన ఫలమును తప్పక పొందును. అందువలన ఇష్టదేవత కన్న ఎక్కువగా గురువే పూజింపతగినవాడని శ్రీహరి స్వయముగా సామవేదమున తెలిపెను.

గురువును, ఇష్టదేవతను ధ్యానించి, స్తుతించి, నిర్మలమైన స్థలమున మూత్ర పురీషములను వదలి పెట్టవలెను.

జలము, జలసమీపము, పుట్టలున్నచోటు, దేవాలయ సమీపము, చెట్టు మొదలు, త్రోవ, నాగలి దున్నిన ప్రాంతము, సస్యములున్న ప్రాంతము, పశువుల కొట్టము, నదులలోను, గుహలలోను, ఉద్యానవనములు, బురుద ఉన్న ప్రాంతము, గ్రామము యొక్క మధ్య, మనుషులున్న ఇండ్ల సమీపము, శంకువు పాతిన చోటు, వంతెన, రెల్లు పొద, శ్మశానము, నిప్పు ఉన్న ప్రాంతము, దర్భలున్న స్థలము, చెట్లు నాటిన స్థలము, ఏదేని ఒక కార్యమునకై చదును చేసి పెట్టుకొన్న స్థలము, సూర్యుని ఎండ పడని చోటు వీటినన్నిటిని వదలి చిన్న గోతిని తీసి మలమూత్రములు వదలి పెట్టవలయును.

మలమూత్రములను పగటిపూట ఉత్తరాభిముఖుడై విసర్జించవలెను. రాత్రివేళ పశ్చిమాభిముఖుడై, సాయంకాలమున దక్షిణాభిముఖుడై విసర్జింపవలెను. మౌనముగా మలమూత్రముల దుర్గంధము ముక్కులోనికి పోకుండ ఉచ్వాస నిశ్వాసములను మెల్లగా చేయవలెను తరువాత మలమును మట్టితో కప్పివేయవలెను. తరువాత ప్రక్షాళన చేసికొనవలెను.

తొలుత మట్టితో క్షాళన చేసి అటుపిమ్మట జలముతో ప్రక్షాళన చేసికొనవలెను.

శౌచమునకై తీసికొను మట్టి జలముల పరిమాణములివి.

మూత్ర విసర్జన తరువాత ఒకసారీ మట్టితో లింగమును కడిగి తరువాత నీటితో కడుగుకొనవలెను. అట్లే ఎడమ చేతిని నాలు పర్యాయములు, రెండు చేతులను రెండుసార్లు మట్టితోను నీటితోను కడుగుకొనవలెను. ఇదీ మూత్ర శౌచము.

మైథునము తరువాత మూత్రము చేసినచో సైదానికి రెట్టించి శుభ్రము చేసికొనవలెను. లేక మలమూత్రములు విసర్జించినచో దానికి నాలురెట్లు ఎక్కువగా శుద్ధి చేసికొనవలెను.

ఒకమారు లింగమును, మూడుమార్లు గుదమును, ఎడమ చేతిని పదిమారులు, రెండు చేతులను కలిపి ఏడు మారులు పాదములు ఆరుమారులు మట్టితో జలముతో శుభ్రము చేసికొనవలెను.

ఇది గృహస్థాశ్రమమున ఉన్న బ్రాహ్మణులు చేయవలసిన మలశుద్ధి. భర్త చనిపోయిన స్త్రీలు పైదానికి రెట్టించిన సంఖ్యతో మలశుద్ధి చేసికొనవలెను. వైష్ణవులైన సన్యాసులు, బ్రహ్మచారులు, గృహస్థాశ్రమమున నున్న వారి కంటెను నాల్గురెట్లు ఎక్కువగా మలశుద్ధిని చేసికొనవలెను.

ఉపనయనము కానంతవరకు బ్రాహ్మణుడు కూడ శూద్రుడే. అట్లే స్త్రీ, శూద్రుడు జలముతో మలమును శుద్ధిచేసికొన వలెను. క్షత్రియులు, వైశ్యులు బ్రాహ్మణులవలెనే మలమును శుద్ధిచేసికొనవలెను. కాని వైశ్యక్షత్రియ జాతులలోని వైష్ణవులు మునులు తమ జాతీవారికంటెను. రెండు రెట్లు అధికముగా శుద్ధి చేసికొనవలయును.

పైవిధముగా కాక ఆ సంఖ్యలో ఎక్కువ తక్కువలు చేసినచో విధిగా ప్రాయశ్చిత్తము చేసికొనవలెను.

ఓ నారదా! శౌచనియమమును వినుము. బ్రాహ్మణుడు మట్టిచేతనే శుచి యగుచున్నాడు. లేనిచో అతడు అశుచియే.

పుట్టమన్నును, ఎలుకలు త్రవ్విన మన్నును, తడిసిన మట్టిని, లోపల క్రిమి కీటకాలు కలదానిని, ఆకులతో కప్పబడిన దానిని, సొగలిచే దున్నబడిన దానిని, దర్భలు గరిక, రావిచెట్టు మొదళ్ళనుండి తీయబడినదానిని, అట్లే పడుకొను స్థలమునుండి తీసిన మట్టిని, చతుష్పథము. కొట్టము, సస్యము వేసిన స్థలము, పొలము, ఉద్యానములకు చెందిన మట్టిని, శౌచమునకుపయోగించగా మీగిలిన మట్టిన శౌచమునకు ఉపయోగించరాదు.

స్నానము చేసినను చేయకున్నను పైవిధముగా మలమూత్రాదుల శుద్ధి చేసికొనని బ్రాహ్మణుడు సమస్త కర్మలకు ఆనర్హుడగుచున్నాడు. అందువలన పైవిధముగా మలమూత్రముల శుద్ధి చేసికొని ముఖ ప్రక్షాళనము చేయవలెను.

ముఖ ప్రక్షాళనము చేయుటకు ముందు పదునారు మార్లు నీటిని పుక్కిలించి ముఖమును కడుగుకొని, పండ్లపుల్లతో పండ్లుతోముకొని మరల పదునారుమార్లు నీటిని పుక్కిలించి ముఖముకడుగుకొనవలెను.

సామవేదమున ఆహ్నికక్రమము చెప్పు సందర్భమున శ్రీహరి పండ్లు తోముకొనుటకు ఏఏ చెట్ల పుల్లలు వాడవలెనో తెలిపెను. అవి నేరెడు, వావిలి, మామిడి, గన్నేరు, చండ్ర, శిరీషం, జాజి, లొద్దిగ, ఆశోకము, మద్దీపాలచెట్టు, కడిమి, పొగడ, మోదుగ, పుల్లలు చాలా ప్రశస్తమైనవి. కానీ రేగు, దేవదారు, మందార, బూరుగు, రావి, చింత, ఈత, ఖర్జూరము. కొబ్బరి, తాటిచెట్టుపుల్లలు, ముండ్ల చెట్లపుల్లలు, పండ్లు తోముకొనుటకు వాడకూడదు. పండ్లు తోముకోననిచో సమస్తమైన పరిశుద్ధి. లేని వాడగును. వాడు శుచిత్వము లేనివాడు కావున సమస్త పుణ్య కర్మలకు ఆర్హుడు కాకుండా పోవును.

అందువలన శౌచాచారములను పాలించి స్నానము చేసి అన్ని విధములుగా నిర్మలుడై ఉతికిన బట్టలు కట్టుకొని, ఇంటికి వచ్చి ఉదయ కాలపు సంధ్యావందనము చేయవలెను.

ప్రాతర్మధ్యాహ్న సాయంకాల సంధ్యాసమయములందు సంధ్యావందనము చేయు బ్రాహ్మణుడు సమస్త తీర్థములలో స్నానము చేసిన వానితో సమానుడగును. మూడు సంధ్యాకాలములలో సంధ్యావందనము చేయని బ్రాహ్మణుడు సమస్తవైదిక కర్మలు చేయుటకు అనర్హుడగుచున్నౌడు. ఆ దినము చేసిన సమస్త పుణ్యకర్మల ఫలితముననుభవించలేడు. ప్రాతస్సంధ్యావందనమును సాయం సంధ్యావందనమును చేయనివాడు సమస్త వైదిక కర్మలకు దూరమగును. అట్లే త్రికాలములందు సంధ్యావందనము చేయని వానికి బ్రహ్మహత్యాఫలము ఆత్మహత్యా ఫలము ప్రతిదినము కలుగును. ఏకాదశీ వ్రతానుష్టానమును సంధ్యావందనమును చేయనివాడు కలకాలము నరకమున ఉండును.

ఉదయము సంధ్యావందనము చేసి తన గురువును, తన ఇష్టదేవతను, సూర్యుని, త్రిమూర్తులను, లక్ష్మీపార్వతీ సరస్వతులను నమస్కరించి నేతిని, అద్దమును, తేనెను. బంగారమును ముట్టుకొనవలెను,

ప్రతి దినము స్నానము చేయవలసిన పద్ధతి ఇట్లుండును.

 ప్రతిదినము స్నానసమయమున పుష్కరిణిలోనైనా బావిలోనైనా స్నానము చేయవలెను. స్నానము చేయటకు ముందు ఐదు ముద్దల మట్టిని ఆపుష్కరిణి లేక దిగుడు బావినుండి తీసి బయట వేయవలెను, స్నానమును నదిలోగాని పశ్చిమాభిముఖముగా ప్రవహించు నదమున కాని లేక పుణ్య తీర్థమునగాని స్నానము చేయవచ్చును. స్నానము చేసిన తరువాత స్నాన సంకల్పము చెప్పుకొని మరల స్నానము చేయవలెను. ఆసంకల్పమును మహాత్ములైన వైష్ణవులు శ్రీకృష్ణుని ప్రీతికొరకు చెప్పుకొనగా సామాన్యులు తాము చేసికొనీవ పాపముల నివృత్తికొరకు చెప్పుకొందురు. బ్రాహ్మణుడు సంకల్పము చెప్పికొనిన తరువాత శరీరమునందంతట తడిమట్టిని పూసికొనవలెను. ఆతరువాత మహానారాయణమునందలి "అశ్వక్రాంతే రథక్రాంతే" అను వేదమంత్రములను చదువుచు స్నానము చేయవలెను. ఆ వేదమంత్రముయొక్క ఆర్థమిది.

“ఓ భూమాతా! గుజ్జములు, రథములు నీపై సంచరించుచున్నవి. నీవు త్రివిక్రముడైన విష్ణువు యొక్క పాదములచే ఆక్రమింపబడివదానవు. ఈ మట్టి నేను చేసిన పాపములనన్నిటినీ పోగొట్టుమ. నీవు వందల కొలది బాహువులు గల నల్లని ఆదివరాహమూర్తి చేత ఉద్దరింపబడినదానవు."

నీవు నా శరీరమును తాకి నేను చేసిన పాపములనన్నిటిని తొలగింపుము. ఓభూమాతా! నాకు పుణ్యమునొసగి స్నానమున కనుజ్ఞనిమ్ము.

పై వేదమంత్రమును చదువుచూ బొడ్డువరకున్న నీటిలో నాలు హస్తముల (ఎనిమిది మూరల) మేర మండలము నేర్పరచి ఆ మండలమున చేతితో సమస్త తీర్థముల నావాహనచేయవలెను.

నేను స్నానము చేయుచున్న జలములో గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరీనదులు ప్రవేశించుగాక.

అట్లే స్నానము చేయుచున్నప్పుడు నళిని, నందిని, సీత, మాలినీనది, విష్ణుపాదములనుండి పుట్టిన గంగానది, పద్మావతి, భోగవతి, స్వర్ణరేఖ, కౌశికి, దక్ష, పృథివి, విశ్వకాయ, శివామృత, విద్యాధరి, గోమతి, సావిత్రి, తులసి, దుర్గ, మహాలక్ష్మి, సరస్వతి, రాధ, లోపాముద్ర, దితి, రతి, అదితి, సంభై స్వాహా. ఆరుంధతి. శతరూప, దేవహూతి మొదలైన వారిని స్మరించవలెను.

స్నానమును రెండుసార్లు చేసి పవిత్రమై భుజములపై, ముఖము పై, కంఠముపై, రొమ్ముపై బొట్టు పెట్టుకొనవలెను. ముఖముపై బొట్టు పెట్టుకొననిచో చేసిన స్నానము, దానము, తపస్సు. హోమము, దేవపూజ, పితృతర్పణము అన్నియు వ్యర్థము కాగలవు.

బ్రాహ్మణుడు బొట్టు పెట్టుకొని సంధ్యావందనమును, పితృతర్పణమును, దేవతాపూజను చేసికొని ఇంటికి వెళ్ళవలెను. ఇంటికి వెళ్ళిన తరువాత పాదములను కడుగుకొని, ఉతికిన బట్టలను కట్టుకొనవలెను.

పాదప్రక్షాళనము చేసికొనక ఇంటిలోకి వెళ్ళినచో అతడు చేసిన స్నానాదికములు జపహోమాదులు అన్నియు వ్యర్థమై పోవును. లక్ష్మీదేవి కోపముతో శాపము పెట్టి అతని ఇంటిని వదలిపోవును. అట్లే పిక్కలపై భాగమువరకు కాళ్ళు కడుగు కొన్నచో గంగానదిని చూచువరకు చండాలుడగును.

పుష్కరిణ్యాదులలో స్నానము చేసి ఇంటికి తిరిగివచ్చి కాళ్ళు కడుగుకొని ఆసనముపై కూర్చుండి భక్తికలవాడై వేదవిహిత పద్దతితో పూజ చేయవలెను.

సాలగ్రామమున, మణియందు, మంత్రమున, ప్రతీమయందు, జలమున, స్థలమున, గోవృష్ఠభాగమున, గురువులో, విప్రునిలో శ్రీహరిని భావించి పూజచేయుట ఉత్తమమైనది. వీటిలోను సాలగ్రామపూజ అన్నిటికంటే శ్రేష్టమైనది. సాలగ్రామాభిషేక తీర్థమును తన శిరస్సుపై ప్రతిదినము ప్రోక్షించుకొను వ్యక్తి సమస్త తీర్థములలో స్నానము చేసినవాడు, సమస్త యజ్ఞములలో దీక్షను స్వీకరించినవాడగుచున్నాడు.

ఎవరి ఇంటిలో సాలగ్రామశీలాచక్రము ఉండునో ఆ ఇంటిలో చక్రసహితుడైన శ్రీహరి నివసించును. అచ్చట సమస్త తీర్థములు కూడా ఉండును. సాలగ్రామ చక్రమున్న ఇంట్లో తెలిసియో తెలియకుండనో చనిపోయివ వ్యక్తి శ్రీహరి భటులు వెంట రాగా రత్నములచే నిర్మించబడిన విమానమున శ్రీహరిస్థానమును చేరుకొనును. సాధుపురుషులు సాలగ్రామము లేక హరిపూజను చేయనే చేయరు. ఎందుకనగా సాలగ్రామమున హరిపూజ చేసినచో పరిపూర్ణమైన ఫలితము నిచ్చునని వారికి తెలియును.

ఇంతవరకు పూజచేయవలసిన వస్తువుల గూర్చి చెప్పితిని. ఇకముందు పూజాక్రమము ఏవిధముగా ఉండునో తెల్పుదును.

కొందరు షోడశోపచారములతో అర్చించగా మరికొందరు ద్వాదశోపచారములతో, పంచోపచారములతో కూడ యథాశక్తి పూజింతురు. పూజచేయునప్పుడు ఉపచారముల సంఖ్య ప్రధానము కాదు. భక్తియే ప్రధానమైనది.

ఆసనము, అర్ఘ్యము, పాద్యము, ఆచమనము, వస్త్రము, పుష్పము, చందనము, దూపము, దీపము, సాధారణ నైవేద్యము, గంధము, మాల్యము. మహా నైవేద్యము, జలము, తాంబూలము శయ్య అనునవి పదునారు ఉపచారములు. వీటిలో గంధము, అన్నము, (మహానైవేద్యము) తాంబూలము శయ్య అను నాలుగు ఉపచారములను వదిలినచో మిగిలినవి ద్వాదశోపచారములు. అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, నైవేద్యము, పుష్పసమర్పణ అనునవి పంచోపచారములు.

గురువుచే ఉపదేశించబడిన మూలమంత్రమును చదువుచు పై షోడశోపచారపూజను లేక ద్వాదశోపచారపూజను, పంచోపచార పూజను చేయవలెను.

ఆర్చన ప్రారంభించుటకు ముందు భూతశుద్ధిని చేసి ప్రాణాయామ పూర్వకముగా దేశకాలాదులను తెలిపి అంగప్రత్యంగములయందు మంత్రన్యాసముమ వర్ణన్యాసమును చేసి అర్ఘ్య పాద్యాది పాత్రలనుంచవలెను. తరువాత త్రికోణమును, మండలమును {ముగ్గుతో) వేసి అచ్చట ఆదీకూర్మమును భావించుకొని పూజించవలెను. శంఖమున జలమును పోసి ఆ శంఖమును కూర్మము పైనుంచి విధిగా సమస్త తీర్థములను ఆ జలమున ఆవాహన చేయవలెను. ఆ జలముతో పూజోపకరణములను శుద్ధిచేసి పుషమును తీసికొని యోగాసన విధిని నిర్వర్తించవలెను. ఆ తరువాత గురూపదీపమైన మంత్రముతో ఆర్ఘ్యపాద్యాదులను ఇవ్వవలెను. ఆయా తంత్రములందు చెప్పబడినట్లు అంగప్రత్యంగ దేవతలతో కలిపి శ్రీహరిని ఆరాధించి యథాశక్తి మూలమంత్రమును, దేవతామంత్రమును జపించవలెను. అటుపిమ్మట నైవేద్యమును సమర్పించి వివిధ స్తోత్రములచే స్తుతించి, కవచమును చదువవలెను. తరువాత తానొర్చిన పూజలో ఏవైనా తప్పులు చేసినచో వాటికై క్షమాపణ చెప్పుకొని, శ్రాతస్మార్తాగ్నితో యజ్ఞము చేసి, ఆ తరువాత, భూతబలిని పెట్టవలెను. నిత్య శ్రాద్ధమును నిర్వర్తించి యథాశక్తి దానము చేయవలెను.

ఇది వేదవిహితమైన పూజావిధానము-

ఓ నారద! ఇంతవరకు నీకు బ్రాహ్మణులు ప్రతిదినము ఆచరించవలసిన వేదములలో చెప్పబడిన ఆహ్నిక క్రమము వివరించితిని. ఇంకను నీవేమైనా వినదలచినచో చెప్పెదను.

శ్రీ బ్రహ్మవైవర్తమహాపురాణమున బ్రహ్మఖండములోని శివనారద సంవాదమున ఆహ్నిక నిరూపణమను ఇరువది యారవ అధ్యాయము సమాప్తము.