1 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - బ్రహ్మ ఖండము

Table of Contents

24 –  బ్రహ్మనారదోక్త సంసారసుఖాసుఖ వర్ణనం

శ్రీ బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడిట్లనెను-

నారదా! నీవు తపస్సుచేసికొనుటకు ఆడవికి వెళ్ళుము. నాకుకూడ ఈ సంసారముతో పనియేమి? నేనుకూడ పరమేశ్వరుడైన శ్రీకృష్ణుని సేవించుకొనుటకు గోలోకమునకు పోవుదును.

సనకుడు, సనందుడు, మూడవ వాడైన సనాతనుడు, సనత్కుమారుడు, యతి, హంసుడు, ఆరుణి, వోడుడు, పంచశీఖుడు, మొదలైన తపస్వినులైన పుత్రులుండగా నేను సంసారము చేయవలసిన పనియేమి?

ఆట్లే వచస్కరుడు, మరీచి, అంగిరసుడు, భృగువు, రుచి, అత్రిమహర్షి, కర్దముడు. ప్రచేతసుడు, క్రతువు, మనువు, వసిష్ఠుడు మొదలైన మహర్షులైన పుత్రులు, ఇంకను వివేకహీనులు, నామాటను లక్ష్యపెట్టని ఇతర పుత్రులు ఉండగా నేను సంసారము చేయవలసిన పనియేమి?

ఐనను పరంపరగా వచ్చుచున్నదియు, ధర్మార్థకామమోక్షములనే చతుర్వర్గముల ఫలమునిచ్చునదియు శుభమైన వేదోక్త వచనమును జాగ్రత్తగా వినుము.

విజ్ఞాలైన వారందరు వేదములందున్నట్టి, సభలలో మహర్షులు తెలిపినట్టి ధర్మార్ధ కామమోక్షములనే చతుర్వర్గములను కోరుకొందురు.

ధర్మము వేదమున చెప్పబడినది. అధర్మమనగా ధర్మమునకు భిన్నమైనది. బ్రాహ్మణుని ధర్మమేమనగా అతడు తొలుత ఉపనయనము చేసికొని, యజ్ఞోపవీతమును ధరించి వేదములను అధ్యయనము చేయవలెను. గురుపునొద్ద విద్యాభ్యాసము పూర్తియైన తర్వాత తన గురువునకు యథాశక్తి గురుదక్షిణనొసంగి ఉన్నతవంశములో పుట్టిన వినయ సంపన్నురాలిని వివాహము చేసికొనవలెను.

ఉన్నతవంశములో పుట్టిన స్త్రీ, భర్బ సేవాపరాయణయైన పతివ్రత కాగలదు. మంచివంశములో దుష్ట స్త్రీలు పుట్టుట అసంభవము. ఎట్లనగా పద్మరాగమణులు పుట్టుచోట గాజురాయి పుట్టునా!

తల్లిదండ్రులయొక్క దోషమువలన చెడిపోయిన కులములో పుట్టిన స్త్రీ వినయము లేక సమస్త కర్మలను తానే స్వతంత్రించి చేయుచు దుష్టురాలు కాగలదు.

వత్స! నారదా! స్త్రీలందరు చెడ్డవారుకారు. పైగా వారందరు లక్ష్మీదేవియొక్క ఆంశ వలన పుట్టినవారు. చెడు వంశములో పుట్టిన కులటలు దేవవేశ్యలైన అప్సరసలయొక్క ఆంశవలన పుట్టినవారు.

పతివ్రతయైన స్త్రీ తన భర్త సుగుణవంతుడు కాకపోయినను అతనిని సేవించుచు తన భర్తను గూర్చి నలుగురిలో పొగడుచుండును. అట్లే కులట తన భర్త గుణవంతుడైనను అతనిని చీటికి మాటికి తిట్టుచుండును.

అందువలన , మంచివాడు ఉన్నత వంశములో పుట్టిన కన్యను వెదకి వెదకి పెండ్లి చేసికొనవలెను. ఆమెయందు సంతానమును పడసి ముసలితనము రాగానే తపస్సునకై బయలుదేరవలెను.

మాటిమాటికి కలహములు పెట్టుకొనుచు భర్త మనస్సునకశాంతి కలిగించు స్త్రీ దగ్గర ఉండుటకన్న నిప్పులోనైనా, సర్పముయొక్క ముఖములోనైనా, ముళ్ళ పొదరింటిలోనైనను ఉండుట మేలు.

నారదా! నీవు నావద్ద వేదములను చదువుకొనినందువలన నాకు గురుదక్షిణను ఇవ్వవలసియున్నది. ఆ గురుదక్షిణగా నీవు వివాహమును తప్పక చేసికొనవలెను.

నీవు ఉన్నత వంశములో పుట్టిన నీ పూర్వజన్మమందలి భార్యను మాలావతిని మంచి దినమున వివాహము చేసికొనుము. ఆమె మనువంశమున పుట్టిన సృంజయునింట పుట్టి, నీకొరకు భారతదేశమున తపస్సు చేయుచున్నది. ఈ జన్మమున ఆమె పేరు రత్నమాల. లక్ష్మీదేవియొక్క అంశతో పుట్టిన ఆ రత్నమాలను నీవు వివాహము చేసికొనవలెను. ఈ భారతదేశమున చేసిన తపస్సు ఎప్పుడును వ్యర్థము కాదు. కావున నీవామెను వివాహము చేసికొనుము.

మానవుడు మొదట వివాహము చేసికొని గృహస్థుడై, అటు పిమ్మట వానప్రస్థాశ్రమమును స్వీకరించవలెను. ఆటుపిమ్మట మోక్షమునకై సన్యాసాశ్రమమును స్వీకరించవలెనని వేదములందు చెప్పబడినది.

అట్లే వైష్ణవులు శ్రీహరిపూజను, తపస్సును చేయవలెనని వేదములలో చెప్పబడినది. ఆందువలన వైష్ణవుడవైన నీవు ఇంటిలోనే ఉండి శ్రీకృష్ణపరమాత్మయొక్క పాదములను ఆర్చింపుము.

ఎవ్వరి మనస్సులో, బాహ్యమైన వాక్కులో సదా శ్రీహరి ఉండునో ఆ పుణ్యపురుషునకు తపస్సు లేకపోయినను ఏమికాదు. అట్లే ఎవ్వరి మనస్సులో, బాహ్యమైన వాక్కులో సదా శ్రీహరి ఉండడో ఆతడు ఎంత తపస్సుచేసినను లాభము లేదు. శ్రీహరినీ తపస్సుచేతనే ఆరాధింపవలెను. అతనిని ఆరాధించుటకు ఇతరోపాయములేవియును కన్పించవు. శ్రీకృష్ణుని సేవయే గొప్పనైన తపస్సు.

ఆందువలన నామాటననుసరించి ఇంటిలోనుండియే శ్రీకృష్ణుని భజింపుము. నీవు పెండ్లి చేసికొని గృహస్థుడవు కమ్ము. గృహస్థులకు ఎల్లప్పుడు సుఖమే ఉండును. తాను కోరుకొన్న స్త్రీతో చేసిన సంభోగము స్వర్గభోగములతో సమానమైనదందురు. మోక్షము నర్థించువారు సహితము ఆమెయొక్క దర్శనమును, స్పర్శను కోరుకొందురు. సమస్తమైన స్పర్శసుఖములకన్న స్త్రీ స్పర్శసుఖము చాలమిన్న.

స్త్రీ దర్శన, స్పర్శసుఖములకంటె పుత్ర దర్శనము పుత్రస్పర్శనము చాలా గొప్పనీవి. స్త్రీ అందరికన్న ప్రియమైనది. కావుననే ఆమెను ప్రేయసి అని పిలిచిరి.

స్త్రీకి ప్రయోజనము పుత్రుని గనుట. అందువలన వందమంది స్త్రీలకంటెను పుత్రుడు చాలా ఇష్టమైనవాడు. ఈ లోకమున పుత్రుని మించిన బంధువులేడు, అట్లే పుత్రునకన్న ప్రియమైన వాడెవరు ఈ లోకమున కన్పించరు. తండ్రి అందరినుండి జయమును కోరుకున్నను పుత్రునినుండి మాత్రము ఓటమినీ కోరుకొనవలెను. తనకు ప్రియతరమైనది ధనముమాత్రము కాదు. ఏలన పుత్రుని ఆ ధనముకంటె మిన్నగా మనము చూచుకొందుము.

అందువలన తాను సంపాదించిన ధనమునంతయు తండ్రి తనకు చాలా ఇష్టమైన పుత్రునకు అప్పగించవలయును.

ఈవిధముగా బ్రహ్మదేవుడు తనకుమారుడైన నారదునితో చెప్పగా పరమజ్ఞానియైన నారదుడు తండ్రికి ఇట్లు ప్రత్యుత్తరమునీచ్చెను.

నారద ఉవాచ- నారదుడిట్లనెను-

వేదములు, శాస్త్రములయొక్క ఆర్థమును స్వయముగా తెలిసికొని, పుత్రునకు వాటిని తెలిపి డుమార్గమున వెళ్ళుమని అనెడువాడు దయగల తండ్రి ఎట్లు కాగలడు.

ఈ సంసారమంతయు నీటి బుడగవలె అశాశ్వతమైనది. నీటిపై గీచిన గీతవలె ఈ ముల్లోకములు మిథ్యయైనవి.

ఈ మానవజన్మ దుర్లభమైనది. ఇట్టి మానవజన్మను హరిధ్యానము లేక మనస్సును విషయాసక్తము చేయుచు నిష్పలముచేయుట తగనిది.

ఇచ్చట ఎవరు ప్రియురాలు, ఎవరు పుత్రుడు? అందరు తమతమ కర్మలనెడు అలలచే కలిసిపోవుచున్నారు. అవి నశించిపోవగా విడిపోవుచున్నారు.

మంచి పనులను చేయించువాడే తండ్రి లేక గురువు లేక స్నేహితుడు. చెడుబుద్ధిని కలిగించువాడు. శత్రువు గాక తండ్రి యెట్లగును?

ఓ తండ్రీ! నేను శాస్త్రప్రమాణములననుసరించి వేదతత్వమును నీకు తెలిపితిని. ఐనను పుత్రునిగా నీయొక్క ఆజ్ఞను. తప్పక పరిపాలింతును. నేను మొదలు నర, నారాయణ ఋషులు నివసించు బదరికాశ్రమమునకు పోయి, ఆక్కడ నారాయణుని కథను విని నీవు చెప్పినట్లుగా వివాహమును చేసికొందును.

నారదుడిట్లు తండ్రితో పలికి యూరకుండగా అతనిపై వెంటనే పుష్పవర్షము కురిసినది. అతడు క్షణకాలమాగి మరల తండ్రితో ఇట్లనెను.

శ్రీనారద ఉవాచ- నారదుడిట్లు పలికెను-

ఓతండ్రి నాకు ఇష్టమైన శ్రీకృష్ణమంత్రమును, దానికి సంబంధించిన జ్ఞానమును, ఆతని గుణగణ వర్ణన కలదానిని నాకు ఇమ్ము. నీవు నాకు మంత్రోపదేశము చేసిన తరువాత నీవు కోరినట్లు నేను వివాహమును చేసికొందును. తన కోరిక తీరిన తరువాత పనిచేయు మానవుడు సుఖముగా ఉండును.

పై నారదుని మాటలు విని బ్రహ్మదేవుడు చాలా సంతోషించి జ్ఞానవంతులలో శ్రేష్ఠుడైన నారదునితో ఇట్లనేమ.

బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడిట్లనేను-

జ్ఞానవంతులు భర్తనుండి, తండ్రినుండి మంత్రమును స్వీకరించరాదు. అట్లే వివిక్త్యాశ్రమమున నున్న సన్యాసి, బ్రహ్మచారులనుండి నేర్చుకొను మంత్రము సుఖమునివ్వదు.

మానవులకు, గురువు, భర్త లేక భార్య, విద్య, సుఖము, భయము, దుఃఖము అనునవి వారి పూర్వజన్మ సంస్కారము అదృష్టముననుసరించి దొరకును. కానీ వారికి ఈ విషయమున స్వేచ్చ అనునది లేదు.

నీకు మహేశ్వరుడే గురువు. శాంతుడు మంగళప్రదుడు జ్ఞానులకు సహితము గురువైన ఆ శంకరుని దగ్గరకు వెళ్ళి ఆయనవల్ల శ్రీకృష్ణ మంత్రమును, ఆ మంత్రమునకు సంబంధించిన జ్ఞానమును, నారాయణుని కథను నీవు పొందగలవు.

ఆ తరువాత తిరిగి నా దగ్గరకు వెంటనే తిరిగి రాగలవు.

ఇట్లు బ్రహ్మదేవుడు నారదునితో చెప్పగా అతడు తండ్రికి భక్తిపూర్వకముగా నమస్కరించి కైలాసమునకు వెళ్ళాను.

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున సౌతి శౌనకుల సంవాదరూపమైన బ్రహ్మఖండమున బ్రహ్మదేవుడు నారదులచే చెప్పబడిన సంసారసుఖాసుఖవర్ణనమను ఇరువదినాలుగవ అధ్యాయము సమాప్తము.