1 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - బ్రహ్మ ఖండము

Table of Contents

20 - ఉపబర్హణుని జన్మ వృత్తాంతము

సౌతిరువాచ- సౌతి మహర్షి ఇట్లనెను –

ఉపబర్హణ గంధర్వుడు తన భార్యయైన మాలావతితో, ఇతర స్త్రీలతో కలిసి తనకు మిగిలిపోయిన కాలమును సుఖముగా గడిపెను.

ఉబర్హణుని తండ్రియైన గంధర్వరాజు తన భార్యా పుత్రులతో సంతోషములో నుండి మిక్కిలి పుణ్యమును కలిగించు అనేక యాగములను చేసి కుబేర భవనము వంటి తన ఇంటిలో సుఖముగా నుండెను. ఆ గంధర్వరాజ తనకాలము తీరిన పిదప గంగాతీరమున భార్యా సమేతముగా ప్రాణములు వదలి వైకుంఠమునకు పోయెను. ఆతడు శైవుడైనను తన పుత్రుని విష్ణు సేవవల్ల, శివుని యొక్క అనుగ్రహమువలన వైకుంఠమున నాల్గు భుజములు కల విష్ణుదాసుడాయెను.

ఉబర్హణ గంధర్వుడు తల్లిదండ్రులకు శ్రాద్ధాది సత్కారము చేసి బ్రాహ్మణులకు అనేకములైన దానములు చేసెను, ఆతడు కూడ తన కాలము తీరుటవలన బ్రహ్మశాపమువలన ప్రాణములు వదలి పెట్టి దాసీగర్భమున బ్రాహ్మణుని వలన జన్మవెత్తెను.

మాలావతీ పుష్కర క్షేత్రమున యజ్ఞకుండమున బడీ తన ప్రాణములను వదిలెను. ఆమె మనువంశమున పుట్టిన సంజయుడను వాని ఇంట ఆతనికి కూతురుగా పుట్టెను. ఆమె పాతివ్రత్య మహిమవలన తన పూర్వ జన్మమును స్మరించుకొనుచు, ఈజన్మమునందును మరల ఉబర్హణ గంధర్వుడే భర్త కావలెనని కోరుచుండెను.

శౌనక ఉవాచ: శౌనకుడిట్లనెను -

ఉపబర్హణ గంధర్వుడు బ్రాహ్మణుని వలన శూద్రస్త్రీ యందు ఏ విధముగా పుట్టెనో ఆ వృత్తాంతమంతయు వివరించుడు.


 

సౌతిరువాచ- సౌతీ మహర్షి ఇట్లనెను-

కాన్యకుబ్జ దేశమున ద్రుమిళుడను రాజుగలడు. అతని భార్య పేరు కళావతి. ఆమె పతివ్రతయైనప్పటికి భర్తయందున్న లోపమువలన పుత్రులు కలుగలేదు. అందువలన భర్తయొక్క ప్రేరణవలన ఆడవిలో తపస్సు చేసికొనుచున్న కశ్యపవంశ సంజాతుడైన నారదుడమ ముని వద్దకు వెళ్ళాను. ఆ మునీ బ్రహ్మ వర్చస్సు కలిగి శ్రీకృష్ణునీ గురించి ధ్యానము చేయుచుండెను. గ్రీష్మ కాలమందలి మధ్యాహ్న సూర్యుని వంటి కాంతితో ప్రకాశించుచున్న ఆ మునిని కళావతి సమీపించలేకపోయినది.

ఐనను శ్రీకృష్ణభక్తుడైన ఆ ముని తన ధ్యానము చివర తనముందు ఆందముగా అలంకరించుకొని, మంచి సౌందర్యము, మంచి వనములతో నున్న ఆ కళావతిని చూచెను.

ఆమె చంపకపుష్పమువలె పచ్చనైన మేలిమి బంగారు రంగు కలది. శరత్కాలమందలి కలువలవంటి కన్నులు కలది. బృహన్నితంబము, బలిసిన పయోధరములు కలది. పచ్చని చీరకట్టుకొని మద్యము త్రాగినందువలన ఎజని కన్నులు కలది. నొసట సిందూరపు చుక్కతో, భూషణములలో, కాటుక గల కళ్ళతో, పాదములకున్న పారాణితో ఊర్వశివలె కనిపించినది.

ఆమె మునిరూపమును చూచి మోహించి తన చన్నులు కన్పడునట్లు చేయుచు తన మనస్సులోని భావమెరింగించెను. నిర్జన వనములో తనకెదురుగా వికృతపు చేష్టలు చేయుచున్న ఆమెను చూచి ముని, నీవెవరవు? నీభర్త పేరేమి? నిజము చెప్పుమని గద్దించెను.

మునియొక్క మాటలు విని కళావతీ భయపడుచు మనస్సులో శ్రీహరిని తలచుచు వినయముతో నిట్లనెను.

కళావత్యువాచ- కళావతి ఇట్లనెను –

ఓ మహర్షీ! నేను ద్రుమీలుడను రాజు భార్యను, గోపికను, నా భర్తయొక్క ఆజ్ఞవలననే పుత్రులను కోరుకొని మీ దగ్గరకు వచ్చితిని. దగ్గరకు వచ్చిన స్త్రీని ఉపేక్షించుట తగనిది, అగ్ని ఏవిధముగా అన్నిటినీ భక్షించునో తేజస్సు కలవారికి దోషములంటవు. అందువలన నాకు పుత్రులు కలుగునట్లు చేయుము.

శూద్రస్త్రీయగు కళావతి మాటలు విని ముని కోపముతో వణకుచున్న పెదవులతో, నీతియుక్తమైన మాటను ఇట్లు పలికెను.

కాశ్యప ఉవాచ- కాశ్యపుడిట్లనెను

అనుభవించుటకు తగిన తన లక్ష్మిని. ఇతరులకిచ్చుటకు ఎవడిష్టపడునో అతనీనీ ఆ లక్ష్మి వీడు మూడుడని వేదవాదరతుడని భావించి వదలి పెట్టును. నీవు చేయుచున్న పనివలన నీవు మరల ద్రుమిలునికి అనుభవయోగ్యవు కాజాలవు. అతడు వీరకుడై నిన్ను వదలి పెట్టి మరల నిన్ను స్వీకరించడు.

మానసిక దౌర్బల్యముతో బ్రాహ్మణుడు శూద్రుని భార్యను స్వీకరించినచో అతడు చండాలుడగును. ద్విజుడు చేయు కర్మకు అనర్హుడగును. ఆతనికి పితృశ్రాద్దమున, యజ్ఞమున. దేవతార్చనయందు ఆర్హత ఉండదని బ్రహ్మదేవుడనెను. అట్లే అతడు కుంభీపాకమనే నరకమున పడును. తనకు, తన తల్లికి ముందున్న పదితరముల వారివి. తరువాతనున్న పదితరముల వారిని కూడ కుంభీపాక నరకమునకు పంపును. ఆతడుచేసిన తర్పణములు పిండములు పితృదేవతలకు పనికిరావు. అతడు సాలగ్రామశిలను ముట్టుకొనినచో మూడు రాత్రులుపవాసముండవలెను. ఆతడు పెట్టిన నైవేద్యమును, అన్నమును దేవతలుగాని, సన్యాసులుగాని బ్రాహ్మణులుగాని స్వీకరించరు. శూద్రుల ఉచ్చిష్టమును, దానితో సమానమైన శూద్రస్త్రీయొక్క పెదవులను సేవించినవాడు తనకు ఇటు, ఆటు ఇరువది ఒక్క తరములవారినీ కుంభీపాక నరకమునకు పంపును. శూద్రుడు మానసిక దౌర్బల్యముచే బ్రాహ్మణ స్త్రీతో సంగమించీనచో అతడు పదునలుగురు ఇంద్రులు గతించువరకు నరకములోనుండును. ఆ బ్రాహ్మణ స్త్రీ కూడ పదునెనిమిది మంది ఇంద్రులు గతించు వరకు నరకమున బాధలు పడును. తరువాత కూడ ఆమె చండాలుర ఇంటిలోనే పుట్టును. ఆ శూద్రుడు కుష్టురోగమును పొందును.

ఇట్లు కాశ్యపముని చెప్పగా కళావతి ఎండిన పెదవులతో ఏమియు మాటాడుటకు తోచక ఊరకుండెను.

ఆ సమయమున అటువైపుగా పోవుచున్న మేనకయొక్క తొడలను, స్తనములను చూచిన కాశ్యపునకు వీర్యపాతము జరిగినది. ఋతుస్నాతమైన కళావతి ఆఏర్యమును త్రాగి సంతోషముతో ఆచ్చటినుండి తన భర్త దగ్గరకు వెళ్ళినది. ఆమె ఇంటికి వెళ్ళి తనగర్భమునకు కారణమైన వృత్తాంతమంతయు చెప్పినది. ద్రుమిలుడు కళావతి మాటలు విని సంతోషపడి తన భార్యతో ఇట్లు పలికెను.

ద్రుమిల ఉవాచ- ద్రుమిలుడిట్లనెను –

వైష్ణవుడు, మహాత్ముడైన బ్రాహ్మణుని యొక్క వీర్యము నీగర్భమున ఉన్నందువలన నీకు పుట్టబోవు బాలుడు వైష్ణవుడు అగును. అందువలన నీవు చాలా అదృష్టవంతురాలవు. వైష్ణవుడు ఎవరి గర్భమున జనించునో, ఎవరి వీర్యమువలన పుట్టునో వారి వేయి తరములవారు వైకుంఠమునకు పోదురు.

ఓ కళావతీ! నీవు ఒక బ్రాహ్మణుని ఇంటికిపొమ్ము. నీమరణానంతరము నాదగ్గరకు, వైకుంఠమునకు రాగలవు. అని ఆ గోపకులరాజగు ద్రుమిలుడు స్నానము చేసి తర్పణము లిచ్చి తన అభీష్ట దేవతను పూజించి బ్రాహ్మణులకు అనేక విధములైన దానములు చేసి చివరకు రత్నభూషణములతో నున్న తన భార్యను ఒక బ్రాహ్మణునకు అప్పగించి తన మనస్సులో, బయట (వాక్కుతో) శ్రీహరిని స్మరించుచు మనోవేగమున బదరీనారాయణమునకు వెళ్ళెను. అచ్చట గంగాతీరమున ఒకనెలవరకు తీవ్రమైన తపస్సుచేసి యోగమార్గమున తన ప్రాణములను వదలి పెట్టెను. తరువాత ఆ ద్రుమిలుడు రత్నములు. ఇంద్రమణులచే నిర్మింపబడిన విష్ణువిమానమున విష్ణుదూతలు వెంటరాగా వైకుంఠమును చేరెను. అచ్చట ఆతడు విష్ణువునకుదాసుడయ్యెను.

ఇక కళావతి వృత్తాంతమునిప్పుడు వినుము –

కళావతి తన నాథుడు చనిపోయిన విషయము తెలుసుకొని పెద్దగా ఏడ్చి ప్రాణములను వదలుటకు సిద్ధపడెను, అప్పుడు ఆ బ్రాహ్మణుడు తల్లి అని కళావతిని పిలిచి ఆమెను చావకుండా రక్షించి తన ఇంటికి తీసుకొనిపోయెను.

కళావతి ఆ బ్రాహ్మణునింటిలో బ్రహ్మతేజస్సుతో ప్రకాశించుచున్న బంగారు రంగువంటి కొడుకును కనెను. అచ్చట ఉన్న స్త్రీలు గ్రీష్మకాల మధ్యాహ్నమున ప్రకాశించుచున్న సూర్యునివంట బ్రహ్మతేజస్సు కలవాడును. మన్మథుని కంటే మించిన రూపము, చంద్రునికంటే అందమైన ముఖము, తామరలవంటి కళ్ళు, అందమైన చెక్కిళ్ళు, పద్మ చక్రాంకితమైన పాదములు, చేతులు కలిగి పాలకొరకు ఏడ్చుచున్న బాలకుని చూచి సంతోషించిరి.

ఆ బాలుడు శుక్లపక్ష చంద్రునివలె దిన దిన ప్రవర్ధమానుడగుచుండగా చూచి బ్రాహ్మణుడు భార్యాపుత్రులతో కలసి చాలా సంతోషించెను. ఆ బ్రాహ్మణుడు కళావతిని  ఆమె కొడుకును ఇద్దరిని పోషింపసాగెను.

 శ్రీబ్రహ్మ వైవర్త మహాపురాణమున బ్రహ్మ ఖండమునందు సౌతి శౌనక సంవాదమున ఉపబర్హణుని జన్మ వృత్తాంత కథనమను ఇరువదియవ అధ్యాయము సమాప్తము.