99. సప్తమీ కల్పమున మహాజయా కల్ప వర్ణనము

బ్రహ్మోవాచ :

 మూII  శుక్లపక్షేతు సప్తమ్యాం యథాసంక్రమతే రవిః మహాజయా తదాసావై సప్తమీ భాస్కరప్రియా

స్నానం దానం జపోహోమః పితృదేవాభిపూజనమ్ సర్వం కోటిగుణం ప్రోక్తం భాస్కరస్య వచో యథా

 యస్తస్యాం మానవో భక్త్యా ఘృతేన స్నాపయేద్రవిమ్ సోఽశ్వమేథ ఫలం ప్రాప్య స్వర్గలోక మవాప్నుయాత్

 పయసా స్నాపయేద్యస్తు భాస్కరం భక్తిమాన్నరః విముక్తః సర్వపాపేభ్యో యాతి సూర్యసలోకతామ్

కర్పూరేణ విమానేన కింకిణీ జాలమాలినా తేజసా హరి సంకాశః కాంత్యాసూర్య సమస్తథా

 స్థిత్వా తత్ర చిరంకాలం రాజాభవతి చాంజసా మహా జయైషా కధీతా సప్తమీ త్రిపురాంతక!

యాముపోష్య నరో భక్త్యా భవతే సూర్యలోకగః తతో యాతి పరంబ్రహ్మ యత్ర గత్వానశోచతి

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే బ్రా హ్మేపర్వణి సప్తమీ కల్పే

మహాజయాకల్ప వర్ణనంనామ ఏకో న శతతమోఽధ్యాయః

తా॥  బ్రహ్మదేవుడుడిట్లనెను. “శుక్లపక్ష సప్తమీనాడు రవి సంక్రమణము జరిగిన నది మహాజయ సప్తమీగా, సూర్యునకు ప్రియమైనదిగా పేర్కొనబడును. సూర్య భగవానుడే చెప్పినట్లాదినమున చేసిన స్నానము, దానము, జపము, హోమము, పితృతర్పణము, దేవతార్చన మున్నగు నే పుణ్యకర్మయైనను కోటిరెట్లు ఫలమొసంగునని చెప్పనైనది. ఆనాడు ఏ మానవుడు భక్తితో సూర్యునకు ఘృతస్నానము చేయించునో అట్టివాడశ్వమేధ ఫలమున పొంది స్వర్గలోకమునకుఁబోవును. భాస్కరదేవుని యందు భక్తికలిగి యాతనికి క్షీరాభిషేకము చేసినవాడు పాపములన్నింటి నుండియు ముక్తుడై సూర్యలోకమునకు బోవును. విష్ణు తేజమువంటి తేజము గలవాడై, కాంతిచేత సూర్యునితో సమానుడై, చిరుమువ్వలతో నలంకరింపబడిన కర్పూర విమానము నందు పయనించి సూర్యలోకము చేరును. అచట చిరకాలము వసించి వెంటనే రాజగును. ఇదియే ‘మహాజయ' యను పేరుగల సప్తమీ. త్రిపురాంతకా! దీనియందునుపవసించి సూర్యభక్తిగలవాడై వ్రతాచరణము చేసినవాడు సూర్యలోక గతుడగును. ఆ పిదప పరబ్రహ్మప్రాప్తినంది శోకరహీతుడగును.

శ్రీ భవిష్య మహాపురాణము నందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు మహాజయా కల్పవర్ణనమను తొంబది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.