భవిష్య మహా పురాణము
64. సప్తమి కల్పమును ఫలసప్తమి వర్ణనము
మూ॥ దీండిరువాచ :
ఉపవాసైః సురశ్రేష్ఠ కథం తుష్యతి భాస్కరః పరిహారాంస్తథాచక్ష్వ యేత్యాజ్యాశ్చోప వాసిభిః
యద్యత్కార్యం యథాచైవ భాస్కరారాధనే నరైః తత్సర్వం విస్తరార్ర్బహ్మన్యథావద్వక్తు మర్హసి
బ్రహ్మోవాచ :
స్మృతః సంపూజితో ధూప పుష్పాన్నై ర్భానురాదరాత్ భోగినాముపకారాయ కింపునశ్చోపవాసినామ్
ఉపావృతస్యపాపేభ్యో యస్తువాసో గుణైః సహ ఉపవాసః సవిజ్ఞేయః సర్వభోగ వివర్జితః
ఏకరాత్రం ద్వారాత్రంవా త్రిరాత్రం నక్తమేవచ ఉపవాసీ రవిం యస్తు భక్త్యాధ్యాయతి మానవః
తన్నామ జాపీ తత్కర్మరతః తద్గతమానసః నిష్కామః పురుషోదిండే సబ్రహ్మపరమాప్నుయాత్
యంచకామ మభిధ్యాయ భాస్కరార్పిత మానసః ఉపోషతి తమాస్నోతి ప్రసన్నే ఖగమేఽఖిలమ్
దీండీరువాచ :
బ్రాహ్మణోః క్షత్రియై ర్వైశ్యైః శూద్రైః స్త్రీ భిశ్చకంజజ! సంసార గర్తె పంకస్థే సుగతిః ప్రాప్యతే కథమ్?
బ్రహ్మోవాచ :
అనారాధ్య జగన్నాధం గోపతిం ధ్వాంత నాశనమ్ నిర్వ్యలీకేన చిత్తేన కః ప్రయాస్యతి సద్గతిమ్
విషయగ్రాహీ వైయస్య వచిత్తం భాస్కరార్పితమ్ సకథం పాప పంకాక్తో నరేయాస్యతి సద్గతిమ్
తా॥ దిండియిట్లనెను. “భాస్కరదేవుడు ఉపవాసములతో నెట్లు తుష్టినందును? ఉపవాసముచేయువారు ఏ ఏ వస్తువులను పరిహరింపవలెను. దేనిని వదలి పెట్టవలెనో తేలుపుడు-1, ఓ బ్రహ్మదేవా! సూర్యుని పూజించుటయందు ఏ ఏ కార్యములను ఎట్లు చేయవలెనో అంతయును సవిస్తరముగఁజెప్పుడు”-2. బ్రహ్మదేవుడిట్లనెను. “పుష్పధూపదీపనైవే ద్యములతో నా దేవుని పూజించి భుజించువారలైనను ఫలమును పొందుదురన్నచోనిక ఉపవసించుచునుపాసించువారి మాట చెప్పనేల?-3. పాపములచే నావరింపబడినవాడు, భోగములను విడిచిపుచ్చి, పాపములకు దూరముగను గుణములతో కూడియు నియమముతో నుండుటయే ఉపవాసమని యెఱుంగవలయును-4. ఒకరాత్రి, రెండు రాత్రులు, లేక మూడు రాత్రులు 'నక్తభోజనము' మాత్రము చేయుచు సూర్యునారాధించు మానవుడు,-5. సూర్యనామమునే జపించుచుండువాడును, అతనీయందే మనస్సు నుంచి యతనికి సంబంధించిన కర్మలలో నిమగ్నుడైయుండువాడును పరబ్రహ్మపదమును పొందుదురు-6. ఏదేని కోరికను మనస్సుననుంచుకొని, సూర్య భగవానుని యందు భక్తి కలిగి ఉపవసించినవాడు సూర్యానుగ్రహముచే సమస్తమును పొందును”-7. దిండి యిట్లనెను. “బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, వర్ణములవారు, స్త్రీలును సంసారమనెడు బురదగుంటలోనున్నవారేట్లు సద్గతిని పొందెదరు?”-8. బ్రహ్మయిట్లనెను. “జగన్నాథుడు, గ్రహరాజు, చీఁకట్లను పారఁద్రోలువాడునైన సూర్య భగవానుని నిష్కల్మష బుద్ధితో నారాధింపక ఎవడైనను సద్గతినెట్లు పొందును?-9. విషయలాలసుడు, సూర్యాయత్త చిత్తములేనివాడు, పాపపు బురదనంటుకొని యున్నవాడు సద్గతినెట్లు పొందును?”.
మూ॥ యది సంసార దుఃఖార్తః సుగతిం గంతుమిచ్ఛసి తదారాథయ సర్వేశం భాస్కరం జ్యోతిషాం పతిమ్
పుష్పైః సుగం ధైర్హృద్యైశ్చ ధూపైః సాగరు చందనైః వాసోభిర్భూషణైః ర్భక్యై రుపవాస పరాయణః
యది సంసారనిర్వేదా దభివాంఛసి సద్గతిమ్ తదారాధయ మార్తాండం భక్తి ప్రవణ చేతసా
పుష్పాణి యదితేనస్యుః శస్తపాదప పల్లవైః దూర్వాంకురైరపి దిండే! తదభావేఽర్చయార్యమమ్
పుష్పపత్రాంబుభిర్దూ పైర్యథా విభవ మాత్మనః పూజితస్తుష్టిమతులాం భక్త్యా యత్యేక చేతసా
యః సదాయతనే భానో: కురుతే మార్జన క్రియామ్ సయాత్యుత్తమకే స్థానే సర్వపాపం వ్యపోహతి
యావత్యః పాంసు కణికా మార్జ్యంతే భాస్కరాలయే దినాని దివి తావంతి తిష్ఠత్యర్క సమానరః
అహన్యహని యత్పాపం కురుతే గణనాయక గోచర్మ మాత్రం సం మార్జ్యహంతి తద్భాస్కరాలయే
యశ్చానులేపనం కుర్యాద్భానో రాయతనే నరః సోఽపిలోకం సమాసాద్య హం సేన సహమోదతే
మృదా ధాతు వికారైర్యా వర్ణకైర్గోమయేనవా ఉపలేపనకృద్యాతి మత్పురం యానమాస్థితః
తా॥ సంసార దుఃఖముతో బాధపడునీవు సుగతి నంద దలచినచో సర్వేశ్వరుడు ఖగోళ నాయకుడైన సూర్యదేవు నారాధింపుము-11. సుగంధ పుష్పములు, అగరుచందనములతో గూడిన మనోజ్ఞమైన ధూపములు, వస్త్రములు, భూషణములు, భక్ష్యములు మొదలగువానితో నుపవాస పరాయణుడవై పూజింపుము-12. సంసార బాధ నుండి విముక్తుడవై సద్గతిని పొందుట కిచ్చయించితివేని భక్త్యాసక్తమైన మనస్సుతో సూర్యదేవునారాధింపుము-13. నీకు పుష్పములు లభింపనిచో ప్రశస్తమైన చెట్ల చిగుళ్లు, గజీక మున్నగుపోనితోను, అవియును లభింపని పక్షమున ఊరక పూజింపవచ్చును-14. నీ సంపదననుసరించి పూలు, పత్రములు, నీరు, ధూపములు మున్నగువానీతో నేకాగ్రచిత్తుడవై పూజించిన యెడల నా దేవుడసమానమైన తృప్తినందును-15, సూర్యుని మందిరమున ప్రతిదినము ఊడ్చి శుభ్రము చేయువాడు పాపములనుండి ముక్తుడై యుత్తమ స్థితి నందును-16. భాస్కరాలయమున నెన్ని కసవు రేణువుల నూడ్చివేయునో అన్ని దీనములోతడు సూర్య సమానుడై స్వర్గ లోకముననుండును 17 దినదినముచేయు పాపము, దిన - దీనము గోచర్మ మాత్రమైన ప్రదేశమును శుభ్రము చేయుటచే నశించిపోవును-18. సూర్యాలయమున నలికి శుభ్రము చేయువాడు సూర్య లోకమునకుఁబోయి సూర్య భగవానునితో కూడ నానందించును-19. మట్టిచేత, ధాతు వికారములచేత, వివిధ వర్ణములచేత, ఆవు పేడచేత సూర్య దేవాలయమున నలికిపూయుచో వాహనారూఢుడై నా లోకమునకు వచ్చును.
ఉదకాభ్యుక్షణం భానోర్యః కరోతి సద్గృహే సోఽపి గచ్ఛతి యాత్రాస్తే భగవాన్యాదసాంపతిః
పుష్పప్రకరమత్యర్థం సుగంధం భాస్కరాలయే అనులిప్తే నరో దత్వా నదుర్గతి మవాప్నుయాత్
విమానమతి శోభాడ్యం సర్వర్తు సుఖ భూషితమ్ సమాప్నోతి నరోదత్వా దీపకం భాస్కరాలయే
యస్తు సంవత్సరం పూర్ణం తిలపాత్ర ప్రదోనరః ధ్వజంచ భాస్కరే దద్యాత్సమమత్ర ఫలంలభేత్
విధూతో హంతి వాతేన దాతురజ్ఞానతః కృతమ్ పాపం కర్తుర్గృహే భానోర్దివారాత్రే నరాధిప!
గీతవాద్యాదిభిర్భానుం య ఉపాస్తే తమోపహమ్ గంధర్వైర్నృత్య గీతైః సవిమానస్థో ని షేవ్యతే
జాతి స్మరత్వం మేథాంచ తథైవోపరమే స్మృతిమ్ ప్రాప్నోతి గణశార్దూల! కృత్వాపుస్తకవాచనమ్
ఏవం ఖగేశ్వరో భక్త్యా యేన భానురుపాసితః సప్రాప్నోతి గతిం శ్లాఘ్యం యాం యామిచ్ఛతి చేతసా
దేవత్వం మనుజైః కైశ్చిధ్గంధర్వత్వం తథాపరైః విద్యా ధరత్వ మపరైః సంరాధ్యేహ దివాకరమ్
శక్రః క్రతుశతేనేశ మారాధ్య జ్యోతిషాం పతిమ్ దేవేంద్రత్వం గతస్తస్మాన్నాన్యః పూజ్యతమః క్వచిత్
తా॥ ఎల్లప్పుడును సూర్య గృహమునందు సూర్య దేవునకభి షేకము చేయువాడు (నీళ్ళు చల్లువాడు) వరుణలోకమునకు బోవును-21. పూఁతలతో నలంకరింపబడిన సూర్యదేవాలయమునందు మిక్కుటమగు సుగంధ పుష్పరాశులను సమర్పించు వాడెప్పుడును దుర్గతినందడు-22. భాస్కరాలయమున దీపము వెలిగించువాడు, అన్ని ఋతువులయందును సుఖమునిచ్చు మిక్కిలి సుందరమగు విమానమును పొందును-23. ఒక సంవత్సరమునకై సూర్యునకు తలపాత్ర, ధ్వజమునిచ్చు వాడు కూడ అదే ఫలమునందును-24. అట్టి దానకర్త తెలియక చేసిన పాపములు పతాకపు గాలిచేత రాత్రింబవలు కదలిపోయి నశించును-25. చీఁ కట్లను తొలగించు నా సూర్య దేవుని గీత వాద్యాదులచే నుపాసించువాడు గంధర్వుల నృత్య గీతములచే దివ్య విమానమునందు సేవింపబడును-26 సూర్యాలయమున పురాణ కాలక్షేపము నేర్పాటు చేయువాడు, అఖండ మగు మేథాశక్తిని, తన జన్మ పరంపరల జ్ఞానమును, జన్మ చాలించిన పిదప స్మృతిని పొందగలడు-27. ఖగేశ్వరుడైన భానుదేవుని ఈ విధముగ నుపాసించువాడు తన మనస్సున నెట్టి స్థితిని కోరునో అట్టి శ్లాఘ్య స్థితిని పొందును-28. అతని నారాధించిన మానవులు కొందఱు దేవత్వమును మ కొందఱు గంధర్వత్వమును, ఇంకను కొందఱు విద్యాధరత్వమును పొందుదురు-29. ఇంద్రుడు నూఱు యజ్ఞములచే సూర్యదేవు నారాధించియే ఇంద్ర పదవిని పొంది దేవతలకు నాయకుడయ్యెను. కావున సూర్యుని వంటి పూజ్యతము లింకేవరును లేరు.
మూ!! బ్రహ్మచారి గృహస్థానాం వన స్థానాం గణాధిప! నాన్యః పూజ్యస్తథా స్త్రీణామృతే దేవం దివాకరమ్
మధ్యే పరివ్రాజకానాం సహస్రాంశుం మహాత్మనామ్ మోక్షద్వారం విశంతీహ తం రవిం విజితాత్మనామ్
ఏవం సర్వాశ్రమాణాంహి సహస్రాంశుః పరాయణమ్ సర్వేషాం చైవ వర్ణానాం గ్రహేశోవై గతిః పరా
శృణుష్వ గదతః కామ్యానుపవాసాం స్తథాపరాన్ శృణు దిండే మహా పుణ్య ఫలకాం సప్తమిం పరామ్
ఆదిత్యారాధనా యేనాం సర్వపాపహరాం శివామ్ యాముపోష్యనరో భక్త్యా ముచ్యతే సర్వపాతకైః
తథా లోక మవాప్నోతి సూర్యప్యామిత తేజసః అథ భాద్రపదే మాసి శుక్లపక్షే సమాగతే
సోపోష్యా ప్రథమం తాత! విధానం శృణుతత్రవై అయాచితం చతుర్ధ్యాంతు పంచమ్యామేక భోజనమ్
ఉపవాస పరఃషష్ఠ్యాం జితక్రోధో జితేంద్రియః అర్చయిత్వాదినకరం గంధధూప నివేదనైః
పురతః స్థండిలే రాత్రౌ స్వస్యాద్దేవస్య పుత్రక! ప్రధ్యాయన్మనసాదేవం సర్వభూతార్తినాశనమ్
సర్వ దోష ప్రశమనం సర్వపాతక నాశనమ్ విబుద్ధస్త్వధ సప్తమ్యాం కుర్యాద్భ్రాహ్మణ భోజనమ్
తా॥ బ్రహ్మచారులకు, గృహస్థులకు, వానప్రస్థులకు, స్త్రీలకును - సూర్య భగవానునికి సాటిగ పూజింపదగిన ఇతర దైవము లేదు-31. తమ్ము తాము జయించిన వారిలో, మహాత్ములలో, యతీశ్వరులలోను సూర్యోపాసకులే మోక్ష ద్వార రూపమగు సూర్యుని చేరుదురు-32. ఇట్లన్ని ఆశ్రమములవారికిని, అన్ని వర్ణములవారికిని సూర్యదేవుడే ఆశ్రయింపఁదగినవాడు. ఆతఁడే పరమ గతియునైయున్నాడు-33. దిండీ! ఇక నితరములగు కామ్యోపవాసములను, మహా పుణ్య ఫలద్రమైన సప్తమితిథిని గుజించి చెప్పుచున్నాను. వినుము-34. సమస్త పాపములను నశింపజేయునది, మంగళ ప్రదమైనదియునైన ఆ తిథినాడు సూర్యారాధన కొఱకై భక్తితోనుపవసించువాడు సర్వపాపములనుండి ముక్తుడగును-35. అటు పైన అమిత తేజస్వియైన సూర్యునిలోకమును పొందును. భాద్రపద మాసమునందలి శుక్లపక్షమున వచ్చు సప్తమినాడు ఉపవాసము చేయవలెను. మొదటి నుండి దాని విధానమును వినుము. చతుర్థినాడు ఎవరిని యాచింపకుండ లభించు నాహారము తీసికొనవలెను. పంచమినాడు ఒకే పూట భుజింపవలెను-37. షష్ఠినాడు ఉపవాసపరుడై జయించిన క్రోధముగలవాడై ఇంద్రియములను నిగ్రహించి, గంధ ధూప నైవేద్యాద్యుపచారములతో సూర్యదేవుని పూజచేసి-38. ఆ దేవుని యెదుటనే ఒక స్థండిలమేర్పరచి దానిపై సర్వ ప్రాణుల శోకమును నశింపజేయగలుగు సూర్య భగవానుని ధ్యానించుచు రాత్రి పరుండవలెను-39. సూర్యదేవుడే సర్వ దోషములను శమింపజేయగలవాడు, సర్వపాపములను నశింపజేయగలవాడని భక్తితో ధ్యానించుచు నిద్రింపవలెను. సప్తమినాడు మేల్కొని సూర్యదేవ నిమిత్తకముగ బ్రాహ్మణ భోజన సంతర్పణమును సాగింపవలేను.
మూ! పూజయిత్వా దినకరం పుష్పధూపవిలేపనైః నైవేద్యం తాత! దేవస్య ఫలాని కథయంతి హి
ఖర్జూర నాలికేరాణి తథా చామ్ర ఫలానితు మాతులింగ ఫలాన్యేవ కథితాని మనీషిభిః
ఏతైశ్చ భోజయేద్వి ప్రానాత్మనాచ ప్రభక్షయేత్ తథైషాంచాప్య భావేన శృణుచాన్యాని సువ్రత!
శాలి గోధూమ పిష్టాని కారయేద్గణ నాయక! గుడ గర్భకృతానీహ ఘృత పాకేన పాచయేత్
చాతుర్యావక మిశ్రాణి ఆదిత్యాయ నివేదయేత్ అగ్ని కార్యమధోకృత్వా బ్రాహ్మణాన్భోజయేత్తతః
ఇత్థం ద్వాదశవై మాసాన్కార్యం వ్రతమనుత్తమమ్ మాసిమాసి ఫలాహారః ఫలదాయీ ఫలార్చనః
వర్షాంతేత్వథ కుర్వీత శక్త్యా బ్రాహ్మణ భోజనమ్ స్నాన ప్రాశనయోశ్చాపి విధానం శృణు సువ్రత!
గోమూత్రం గోమయం క్షీరం దధిసర్పి: కుశోదకమ్ తిల సర్షపయోః కల్కం శ్వేతా మృచ్చాపి సువ్రత!
దూర్వాకల్కం ఘృతం చాపి గోశృంగ క్షాలితం జలమ్ జాతి గుల్మ వినిర్యాసః ప్రశస్తః స్నానకర్మణి
ప్రాశనే చాప్య ధైతాని సర్వపాప హరాణివై ఆదౌకృత్వా భాద్రపదం యథా సంఖ్యం విదుర్బుధాః
తా॥ సప్తమినాడు పుష్పధూప నైవేద్యములతో సూర్యుని పూజించిన పిమ్మట, బ్రాహ్మణ భోజనములను సాగింపవలెను. సూర్య దేవుని నైవేద్యమునకు ఫలములే శ్రేష్ఠములని చెప్పుదురు-41. ఖర్జూరములు, కొబ్బరికాయలు, మామిడిపండ్లు, మాదీఫలములు ఈ ఫలములే మనీషులచే చెప్పబడినవి-42. బ్రాహ్మణ భోజనమునకు కూడ వీనినే వినియోగింపవలెను. తాను కూడ వీనినే భుజింపవలెను. ఇవి దొరకని పక్షమున నితరములను వేని నుపయోగింపవలేనో చెప్పెదను వినుము.-43. బియ్యము, గోధుమలు పిండి చేయింపవలెను. వానిని గుడ గర్భములుగ నేతిలో వేసి పాకము చేయవలెను-44. నాలుగు విధములైన అలసందెల మిశ్రమమును ఖాద్య యోగ్యములుగఁ జేసి సూర్యునకు నివేదింపవలెను. అగ్ని కార్యముచేసిన పిదప బ్రాహ్మణులను భుజింపజేయ వలెను-45. ఇట్లే శ్రేష్ఠమగు వ్రతమును పన్నెండు మాసములాచరింపవలెను. ప్రతి మాసము సూర్యదేవుని ఫలములతోడనే అర్పించుచు, తాను కూడ ఫలములనే ఆహారముగ తీసికొనుచున్న యెడలనది ఫలదాయక వ్రతమగును-46. సంవత్సర సమాప్తియందు శక్తి కొలదిగ బ్రాహ్మణ భోజన సమారాధన చేయవలెను. ఇఁక స్నాన ప్రాశన విధానమును వినుము-47. ఆవు మూత్రము, పేడ, పాలు, పెరుగు, నేయి, దర్భలు కలిపిన నీరు, నువ్వులు, ఆవాల మడ్డి, తెల్లని మట్టి-48. గజికతో చేసిన కల్కము, నేయి, ఆవుకొమ్ము కడిగిన నీరు, జాజి చెట్టుబంక, ఇవి స్నానమునకు ప్రశస్తమైనవి-49. ప్రాశనమునకు కూడా ఇవియే ప్రశస్తములు. పాపములన్నింటిని పోగొట్టునవి. భాద్రపదమాసమున ఈ వ్రతమును ప్రారంభించి పన్నెండు మాసములు పూర్తియగునంత వఱకు కొనసాగింపవలెనని పెద్దలు చెప్పుదురు.
మూ॥ ఇత్థం వర్షాంత మాసాద్య భోజయిత్వాద్విజోత్తమా, దివ్యాన్భోగాన్మహాదేవ! తత స్తే భ్యోనివేదయేత్
ఫలానితాత హేమాని యథాశక్త్యా గణాధిప! సవత్సామథవాధేనుం భూమిం సస్యాన్వితామథ
ప్రసాద మథవాభౌమం సర్వధాన్య సమన్వితమ్ దద్యాచ్ఛుక్లాని వస్త్రాణి తామ్ర పాత్రం సవిద్రుమమ్
శక్తియుక్తస్య చైతాని దరిద్రస్యతు మే శృణు ఫలాని పిష్టకాన్యేషాం తిలచూర్ణాన్వితానితు
భోజయిత్వా ద్విజాన్దద్యాద్రాజతాని ఫలానితు ధాతురక్తం వస్త్ర యుగ్మ మాచార్యాయ నివేదయేత్
సహిరణ్యం మహాదేవ! పంచరత్న సమన్వితమ్ ఇత్థం సమాప్యతే తాత! పారణం వార్షికాంతకమ్
ఇత్యేషావై పుణ్యతమా సప్తమి దురితాపహా యాముపోష్యనరాః సర్వే యాంతి సూర్య సూలోకతామ్
పూజ్యమానః సదా దేవైర్గంధర్వాప్సరసాం గణైః: అనయా మానవో నిత్యం పూజయే ద్భాస్కరం సదా
దారిద్ర్య దుఃఖ దురితైర్ముక్తోయాతి దివాకరమ్ బ్రాహ్మణో మోక్షమాయాతి క్షత్రియశ్చంద్రతాం వ్రజేత్
వైశ్యో ధనదసాలోక్యం శూద్రో విప్రత్వ మాప్నుయాత్ అపుత్రో లభతే పుత్రం దుర్భగా సుభగా భవేత్
యాముపోష్యచ నారీమాం సప్తమిం లోకపూజితామ్ విధవా వా సతీ భక్త్యా అనయా పూజయే ద్రవిమ్
నాన్య జన్మని వైధవ్యం నారీ ప్రాప్నోతి మానద! చింతామణి సమా హ్యేషా విజ్ఞేయా ఫలసప్తమి
పఠతాం శృణ్వతాం దిండే! సర్వకామ ప్రదాస్మృతా
ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్థ సాహ్యం సంహితాయాం బ్రా హ్మేపర్వణి బ్రహ్మదండి సంవాదే సప్తమికలే ఫలసప్తమి వ్రత వర్ణనం నామ చతుఃషష్టితమోఽ ధ్యాయః
తా॥ ఇట్లు సంవత్సరాంతము వఱకు సాగించి, బ్రాహ్మణులను భోజనములతో తృప్తి పఱచి, వారికి దివ్యమైన భోగములను నివేదింపవలెను-51. యథాశక్తిగ వారికి బంగారు ఫలములు, లేగతో కూడిన ఆవు, సన్యముతో కూడిన పంట పొలము(భూమి)-52. సర్వ ధాన్యములతో కూడిన సంబారములు, తెల్లని వస్త్రములు, పగడము(ల)తో కూడిన తామ్ర పాత్ర మొదలగునవి ఈయవలెను-63. ఇవి ధనికులైన వారియవలసిన వస్తువులు. పేదవారైనచో చెప్పెదను వినుము. పిండితో చేసినవి, నువ్వుల పొడితో చేసినవియునైన 'ఫలము'లీయవచ్చును-54. బ్రాహ్మణులు భోజనము చేసిన పిదప వెండితో చేయబడిన “పండ్లు', గైరికాదిధాతువుల వర్ణమువలె నుండు ఎఱ్ఱని జంట వస్త్రములు, ఆచార్యున కీయవలెను-55. వీనిని పంచరత్నములతో కూడిన బంగారముతో కూడ నీయవలెను. సంవత్సరాంతమునందు పారణమిట్లు సమాప్తము చేయబడును-56. ఈ విధముగ నీ సప్తమితిథి పాపహరము, పుణ్యకరమునైనది. ఈ దినమున నుపవసించు వారందఱు సూర్యలోకమునకు బోవుదురు-57. గంధర్వులు, అప్సరసలు సూర్యదేవుని సదా పూజించుచుందురు. కావున మానవుడు కూడా నిత్యమితనిని పూజింపవలేను-58. సూర్యారాధన చేయువాడు దారిద్ర్య దుః ఖమునుండి ముక్తుడగును. బ్రాహ్మణుడైనచో మోక్షమునందును. క్షత్రియుడింద్ర సమాన పదవిని పొందును-59. వైశ్యుడు కుబేరుని లోకమునకు బోవును. శూద్రుడు బ్రాహ్మణత్వమును పొందును. పుత్రుడు లేనివానికి పుత్రుడు కలుగును. దౌర్భాగ్యవతి యగు స్త్రీ సౌభాగ్యవతి యగును-60. ఈ సప్తమినాడుపవసించిన స్త్రీకి ఇట్టి ఫలము కలుగును. భర్త చనిపోయిన స్త్రీయైనను భక్తితో సూర్యదేవుని పూజింపవలెను-61. అటులజేసిన స్త్రీ ఇతర జన్మలయందు వైధవ్యమును పొందదు. ఈ ఫలసప్తమి వ్రతము చింతామణి'తో సమానమైనది. (కోరిన కోరికలిచ్చును)-62. ఇది చదివిననున వినినను సర్వకామ ప్రదమని చెప్పబడినది.
శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహా పురాణము నందలి బ్రహ్మ పర్వమున బ్రహ్మ దిండి సంవాదమునందు సప్తమి కల్పమున ఫలసప్తమి వర్ణనమను అటువది నాలుగవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 64 of the Bhavishya Mahā Purana is as follows:
The Phala-saptamī vrata involves the offering of specific fresh fruits to Sūrya on the saptamī tithi. Different fruits are associated with different aspects of Sūrya's grace: offering coconuts brings progeny, offering sugarcane brings sweetness and prosperity to relationships, offering mangoes brings sovereignty and leadership qualities, offering pomegranates brings abundance. The chapter is simultaneously a practical vrata manual and a subtle teaching on the principle of correspondence between the outer world (fruit types) and the inner world (desired qualities). The votary is instructed to offer the fruit that corresponds to the specific quality she or he most deeply wishes to cultivate, making each Phala-saptamī offering a personalised act of devotional intention.