54. రథ సప్తమి కల్పమున సూర్యమహిమా వర్ణనము

రుద్ర ఉవాచ :

 మూ॥ అహో హంసస్య మహాత్మ్యం వర్ణితం భవతేదృశమ్ కథ్యతాం పునరేవేదం మహాత్మ్యం భాస్కరస్యతు

బ్రహ్మోవాచ :

ఆదిత్య మంత్రమఖిలం త్రైలోక్యం సచరాచరమ్ భవత్యసాజ్జగత్సర్వం సదేవాసురమానుషమ్

రుద్రేంద్రో పేంద్ర చంద్రాణాం విప్రేంద్ర త్రిదివౌకసామ్ మహాద్యుతిమతాం కృత్స్నం తేజో యత్సార్వలౌకికమ్

 సర్వాత్మా సర్వలోకేశో దేవదేవః ప్రజాపతిః సూర్య ఏష త్రిలోకస్య మూలం పరమదైవతమ్

అగ్నౌ ప్రాస్తాహుతిః సమ్యగాదిత్య ముపతిష్ఠతి ఆదిత్యాజ్ఞాయతే వృష్టి ర్వృష్టేరన్నం తతః ప్రజాః

సూర్యాత్ప్రసూయతే సర్వం తత్రచైవ ప్రలీయతే భావా భావౌహిలోకానా మాదిత్యాన్నిఃసృతౌపురా

 ఏతత్తు ధ్యానినాం ధ్యానం మోక్షం చాప్యేష మోక్షిణామ్ అత్ర గచ్ఛంతి నిర్వాణం జాయంతేఽ స్మాత్పునః ప్రజాః

 క్షణా ముహూర్తా దివసా నిశాః పక్షాశ్చ నిత్యశః మాసాః సంవత్సరాశ్చైవ ఋతవోఽధ యుగాని చ

సదా దిత్యాదృతే హ్యేషా కాల సంఖ్యాన విద్యతే కాలాదృతే ననియమో నాగ్నిర్నహవన క్రియా

 ఋతూనామవి భాగాచ్చ పుష్పమూలఫలం కుతః కుతః సస్య ఏనిష్పత్తిస్తృణౌషధి గణాః కుతః

 తా॥ రుద్రుడిట్లనెను. " అహో! మీరు చెప్పిన ఈ సూర్యుని మాహాత్మ్యమద్బుతము కదా! దీనినింకను చెప్పుడు”. బ్రహ్మదేవుడిట్లనెను. “సచరాచరమగు త్రైలోక్యమంతటికిని సూర్యుడే మూలము. దేవతలు, రాక్షసులు, మానవులతో కూడిన జగత్తంతయును సూర్యుని నుండియే కలుగుచున్నది. రుద్రుడు, ఇంద్రుడు, ఉపేంద్రుడు, చంద్రుడు, బ్రహ్మ, విష్ణు, శివుడు మొదలగు మహా తేజస్వులలోను, బ్రహ్మణోత్తములలోను సార్వభౌకికమైన ఈతని తేజమే వ్యాప్తమైయున్నది. ఈతడు సర్వాత్ముడు, సర్వలోకములకునీశ్వరుడు, దేవతలకు దేవత, ప్రజాపతి. ముల్లోకములకు మూలమైనవాడు. అందఱికిని పరమదైవతము. అగ్నియందు వ్రేల్చబడిన యాహుతులు చక్కగా ఆదిత్యుని చేరును. ఆదిత్యుని నుండి వర్షము కలుగును. వర్షము వలన అన్నము కలుగును. దానినుండి ప్రాణి సృష్టి జరుగును. సూర్యభగవానుని నుండియే సర్వము పుట్టును. తిరిగి అతనియందే లీనమగును. లోకములందలి సదసత్పదార్థములన్నియు పూర్వమతని నుండియే వెలువడినవి. ధ్యానము చేయువారికతడే ధ్యానస్థానము. మోక్షార్హులకితడే మోక్షము. మానవులు (ప్రాణులు) ఇతనియందే నిర్వాణము పొంది మఱలనితనీ నుండియే జన్మించుచుందురు. క్షణములు, ముహూర్తములు, దినములు, రాత్రులు, పక్షములు, మాసములు సంవత్సరములు, ఋతువులు, యుగములు. ఎల్లప్పుడు సూర్యునివలననే కలుగుచున్నవి. ఈయనవలన కాక కాలమునకు గణనము లేదు. కేవల కాలమునకు నియమమేలేదు. అందువలన అగ్నిలేదు. హవనము లేదు. ఋతువిభాగము లేనిదే పుష్పము ఎక్కడ? అది మూలముగాగల ఫలము ఎక్కడ? సస్యముల ఉత్పత్తి ఎక్కడిది? తృణాదులు, ఓషధులును ఎక్కడివి?

 మూ. అభావో వ్యవహారాణాం జంతూనాం దివిచేహచ జగత్ర్పతపనమృతే భాస్కరం వారీ తస్కరమ్

నా వృష్ట్యా తపతే సూర్యోనా వృష్ట్యా పరివిశ్యతే నా వృష్ట్యా వికృతింధత్తే వారిణి దీప్యతే రవిః

 వసంతే కపిలః సూర్య: గ్రీష్మే కాంచన సప్రభః శ్వేతో వర్ణేన వర్షాసు పాండు: శరది భాస్కరః

హేమంతే తామ్ర వర్ణస్తు శిశిరే లోహితో రవిః ఇతి వర్ణాః సమాఖ్యాతాః శృణు వర్ణఫలం హర!

 కృష్ణో భయాయ జగతస్తామ్రః సేనాపతిం వినాశయతి పీతో నరేంద్రపుత్రం శ్వేతస్తు పురోహితం హంతి

 చిత్రోధ వాపి థూమ్రో రవీ రశ్మివ్యాకులం కరోత్యుచ్చైః తస్కర శస్త్ర నిపాతైర్యదిన సలిలమాశు పాతయతి

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్ధ సాహస్ర సంహితాయాం బ్రా హ్మేపర్వణి

రథ సప్తమి కల్పే సూర్యమహిమా వర్ణనం నామ చతుష్పంచాశత్తమోఽధ్యాయః

తా॥ జగత్తునకు వేడి వెలుగులనిచ్చువాడు, క్షార జలాదులహరించి వృష్టినిచ్చువాడైన సూర్యభగవానుడు లేనిచో ఆకాశమున, భూలోకమున గల ప్రాణుల వ్యవహారములన్నియు హుళక్కియగును. వర్షములేనిదే సూర్యుడు తపింపడు, ప్రకాశింపడు, ఆహారమీయడు, వికృతమగును. నీటిచేతనే అతడు దీపించుచుండును. సూర్యభగవానుడు వసంత ఋతువున కపిలవర్ణము, గ్రీష్మమున స్వర్ణవర్ణము, వర్షములయందు తెలుపువన్నె, శరత్కాలమున తెలుపుమించిన పచ్చవన్నె. హేమంతర్తువున రాగివన్నె, శిశిరమున ఎటువు వన్నె కలిగి ప్రకాశించుచుండును. ఇవి ఆయా ఋతువులందలి సూర్యవర్ణములు. ఇక వర్ణఫలమును వినుము. సూర్యబింబము నలుపువారినచో జగత్తునకు భయము కలుగును. రాగివన్నెకలిగెనేని సేనాపతికి వినాశము, పసుపువారిన రాజపుత్రున కరిష్టము తెలుపువన్నెలో ప్రకాశించిన పురోహితునకపాయము కలుగును. చిత్రవర్ణము లేక ధూమ్ర వర్ణములోనుండినచో దొంగల భయము శస్త్రభయములేర్పడును. ఈవర్ణములేర్పడిన వెంటనే వర్షము పడకుండిననే ఇట్టి ఫలములు కలుగును.

శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్యపురాణమునందలి బ్రహ్మపర్వమున రథసప్తమికల్పమున సూర్యమహిమా వర్ణనమను ఏబదినాల్గవ అధ్యాయము సమాప్తము.