45. షష్ఠి కల్పమున కార్తికేయ వర్ణనము

మూ. బ్రహ్మో వాచ :

ఇదం శృణు మమాఖ్యాతం తర్క పూర్వమిదం వచః యుష్మాకం సంశయే జాతే కృతే వై జాతి కర్మణోః

పునర్వచి నిబోధధ్వం సమాసాన్నతువిస్తరాత్ సంసిద్ధిం యాంతి మనుజా జాతికర్మ సముచ్చయాత్

సిద్ధిం గచ్ఛేద్యథా కార్యం దైవ కర్మ సముచ్చయాత్ ఏవం సంసిద్ధిమా యాతి పురుషో జాతి కర్మణోః

ఇత్యేవ ముక్తవాన్పూర్వం శిష్యాణాం బోధనేపురా యోగీశ్వరో మహాతేజాః సమాసాన్నతు విస్తరాత్

 సుమంతురువాచ :

ఇతి పృష్టః పురాబ్రహ్మ ఋషీంప్రాగ్రోవాచ భారత! సవితర్కమిదం వాక్యం విప్రర్షే

 జాతి కర్మణోః

 తస్మాత్త్వయా మహాబాహో! నకార్యో విస్మయోనృప! కార్తికేయం ప్రతి సదా దేవానాం దుర్విదాగతిః

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్థసాహస్ర్యం సంహితాయాం బ్రాహ్మేపర్వణి

షష్ఠి కల్పే కార్తికేయ వర్ణనం నామ పంచ చత్వారింశోధ్యాయః

తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. “మీకు జాతి కర్మలను గూర్చిన సంశయము కలుగుచుండగా నేను చెప్పెడి సహేతుకమైన ఈ మాట వినుడు. వివరముగ కాకున్నను సమగ్రముగ మఱల చెప్పెదను. వినుడు. మనుష్యులు జాతి, కర్మ అను రెండింటి కలయిక తోడనే సంసిద్ధిని పొందెదరు. దైవము, పురుష ప్రయత్నము రెండును కూడినప్పుడే ఫలప్రాప్తి కలుగునట్లు జాతి, కర్మ అను రెండు కలిసినప్పుడే పురుషుడు సిద్ధి పొందును. పూర్వము మహాతేజస్వియైన యోగీశ్వరుడు తన శిష్యులకు బోధించునప్పుడిటులే చెప్పియుండెను. సంక్షేపముగనైనను సాకల్యముగఁజెప్పెను”. సుమంతుముని యిట్లనెను. “రాజా! పూర్వము ఋషులడిగిన ప్రశ్నకు బ్రహ్మదేవుడిట్లే సమాధానము చెప్పియుండెను. జాతకర్మల సముచ్చయమును గూర్చిన ఈ బ్రహ్మర్షి వాక్యము హేతుబద్ధమైనది. అందువలన కార్తికేయుని గుణించి నీవాశ్చర్యపడనక్కరలేదు. దేవతల మార్గమెప్పుడును దుర్వియమై యుండును.

శతార్ధ సాహస్రసంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున షష్టీకల్పమునందు కార్తికేయ వర్ణనమను నలుబదియైదవ అధ్యాయము సమాప్తము.