36. పంచమీ కల్పాంతర్గత శ్రావణిక నాగపంచమీ వ్రత వర్ణనము

మూ. గౌతమ ఉవాచ :-

 “కీదృశం సర్పదష్టస్య సర్పీణ్యాః కీదృశంభవేత్ కుమార దుష్టః దృక్యాత్సూతికా దంశితస్యచ

రూపం నపుంస కే నేహ వ్యంతరేణచ కీదృశమ్ ఏతదాఖ్యాహి మే సర్వమేభిర్దిష్టస్యలక్షణమ్”

కశ్యప ఉవాచ : -

అతః పరం ప్రవక్ష్యామి నాగానాం రూప లక్షణమ్ సర్పదష్టస్యచ తథా సమాసాద్ద్విజపుంగవ!

అధసర్పేణ దష్టస్య ఊర్థ్వ దృష్టిః ప్రజాయతే సర్పదష్టస్య చ తథా అధోదృష్టిః ప్రజాయతే

కన్యా దష్టస్య వామా స్యాద్దృష్టిర్ద్విజ వరోత్తమ! కుమారేణాపి దష్టస్య దక్షిణ ఏవ జాయతే

గర్భిణ్యావాథ దష్టస్య తథా స్వేదశ్చ జాయతే రోమాంచః సూతికాయాస్తు వేపథుశ్చాపిజాయతే నపుంసకేన దష్టస్య అంగమర్దః ప్రజాయతే

 పన్నగ్యః ప్రభవో రాత్రౌ, దివా సర్పోవిషాధికః నపుంసకస్తు సంధ్యాయాం కశ్యపేనతు భాషితమ్

అంధకారే తు దష్టో య ఉదకే గహనే వనే సుప్తోవా చేత్ప్రమత్తో వా యది సర్పం న పశ్యతి దష్టరూపాణ్యజానన్వై కథం వైద్య చికిత్సతమ్?

చతుర్విథా ఇహప్రోక్తాః పన్నగాస్తు మహాత్మనా దర్వీకరా మండలినో రాజిలా వ్యంతరా స్తధా

దర్వీకర వాతవిషా మండలా పైత్తికాః స్మృతాః శ్లేష్మలా రాజిలా జ్ఞేయా వ్యంతరా సన్నిపాతికాః

తా॥ గౌతముడిట్లనెను. “మగపాము. ఆడపాము, పిల్లపాము, తల్లిపాము. మగతనము లేని పాము, వ్యంతర సర్పము కాటువేసినప్పుడు, దష్టుని లక్షణము లేట్లుండునో విడివిడిగా నాకు తెలియఁజెప్పుడు”. కశ్యపుడిట్లనెను. “ఇప్పుడు నాగుల రూపలక్షణములు, అవి కాటువేసినప్పుడు మనుష్యునిలోనేర్పడు మార్పులు సాకల్యముగా వివరింతును. పాము కఱచిన వానికి పైచూపు, లేక క్రిందుచూపు ఏర్పడును. కన్యాసర్పము కఱచిన యెడల దృష్టి ఎడమవైపునకు, కుమార సర్పము కఱచినచో దృష్టి కుడివైపునకు మరలును. కడుపుతోనున్న పాము కఱచిన చెమటపట్టును, ప్రసవించిన పాము కఱచిన రోమాంచము, వణుకు పుట్టును. నపుంసక సర్పము కాటువేసిన శరీరము మర్దించినట్లుండును. మగ పాము పగలు, ఆడపాము రాత్రి, నపుంసకసర్పము సంధ్యాసమయమున, ఎక్కువ విషముతో కూడియుండును. ఇది కశ్యపవాక్యము. చీకటిలో గాని, నీటియందుగాని, దట్టమైన అడవిలో గాని, నిద్రించియున్నప్పుడుగాని, ప్రమత్తుడైయున్నప్పుడు కాటువేసినగాని, కాటువేసినపాము కనబడకున్నగాని, పాముకాటు లక్షణములు తెలియకుండును. అట్టితటి వైద్య చికిత్స ఎట్లు సాధ్యమగును?. కశ్యపప్రజాపతి సర్పములను నాలుగు విధములుగా వింగండించెను. దర్వీకరములు, మండలులు రాజిలములు, వ్యంతరములు, అనునది ఆ విభాగము. దర్వీకరములు వాత స్వభావ విషము, మండలులు పిత్తస్వభావ విషము రాజిలములు శ్లేష్మస్వభావ విషము, వ్యంతరములు సన్నిపాత స్వభావ విషము గలవిగా చెప్పబడినవి. ()

మూ. రక్తం పరీక్షయేదేషాం సర్పాణాంతు పృథక్పృథక్ కృష్ణం దర్వీకరాణాంతు జాయతే నాల్పముల్బణమ్

రక్తం ఘనంచ బహుశః శోణితం మండలీకృతమ్ పిచ్ఛిలం రాజీలే స్వల్పం తద్వద్వ్యంతరకే తథా

సర్పాజ్ఞేయాస్తుచత్వారః పంచమోనోపలభ్యతే బ్రాహ్మణః క్షత్రియోవైశ్య: శూద్రశ్చైవ చతుర్థకః

బ్రాహ్మణే మధురం దద్యాత్తిక్తం దద్యాత్తథోత్తరే వైశ్య కర్షఫలం దద్యాచ్ఛూదే త్రిస్థూణమేవచ

 బ్రాహ్మణేన తు దష్టస్య దాహో గాత్రేషు జాయతే మూర్ఛా చ ప్రబలాస్యాద్వై నా త్మాన మభిజానతే

శ్యామ వర్ణం ముఖంచ స్యాత్మజ్ఞా స్తంభశ్చ జాయతే తస్య కుర్యాత్పతీకారం యేన సంపద్యతే సుఖమ్

అశ్వగంధాప్యపామార్గః సిందువారం సురామయమ్ ఏతత్సర్పిః సమాయుక్తం పానే న స్యేచ దాపయేత్ ఏతేనైవోపచారేణ సుఖీభవతి మానవః

 క్షత్రియేణతు దష్టస్య కంపోగాత్రేషు జాయతే మూర్ఛామోహస్తథాస్యాద్వై నాత్మానమభివేత్తి సః

జాయతే వేదనా తస్య ఊర్ధ్వం చైవ నిరీక్షతే తస్య కుర్యాత్ప్రతీకారం యేన సంపద్యతే సుఖమ్

అర్కమూల మపామార్గం ప్రియంగుమింద్రవారుణీమ్ ఏతత్సర్పిః సమాయుక్తం పానం నస్యంచ దాపయేత్ ఏతైనైవోపచారేణ సుఖీభవతి మానవః

తా॥  ఈ సర్పముల రక్తమును విడివిడిగా పరీక్షింపవలెను. దర్వీకరముల రక్తము నలుపు వర్ణములో ఎక్కువ తక్కువలుగాక సమముగానుండును. మండలీజాతి సర్పముల రక్తము ఎఱ్ఱగను, గాఢముగను, ఎక్కువగను ఉండును. రాజిలముల, వ్యంతరముల రక్తము పేరినట్లుండును. తక్కువగా కూడ నుండును. సర్పములిట్లు నాలుగు విధములుగనుండును.ఐదవ విధము ఉండదు. వీనిలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర భేదముచే నాల్గేసి విధములుగనుండును. బ్రాహ్మణ సర్పము కలచిన వానికి తీపిని, క్షత్రియ సర్పదష్టునకు చేదును, వైశ్యసర్పముచే కాటువేయబడిన వానికి తాండ్రను, శూద్రసర్పముచే కటువబడినవానికి సొంటి, పిప్పలు, విరియాలును ఈయవలెను. బ్రాహ్మణసర్పము కఱచిన వానికి అవయములలో 'మంట'పుట్టును. ప్రబలమైన మూర్చకలిగి తనను తాను గుర్తింప జాలని స్థితి యేర్పడును. ముఖము నలుపు వారును. మజ్జస్తంభించును. ఇట్టి స్థితిలో రోగికీ సుఖము కలిగించు ప్రతిక్రియ చేయవలెను. పెన్నేరు (అశ్వగంధ) ఉత్తరేను, వావిలి, వీనిని నేతితో బాగుగా మర్దించి త్రాగింపవలేను. పొడిని నస్యముగా పీల్పించవలెను. ఈ ఉపచారము చేత సర్పదష్టుడు సుఖము పొందును. క్షత్రియ సర్పము"కఱచిన వానికి అంగములలో వణుకు పుట్టును. మెదడు స్తంభించి మూర్చకలిగి తనను తాను గుర్తింపజాలని స్థితి యేర్పడును. వేదన కలుగును. ఊర్ధ్వ దృష్టి యేర్పడును. అట్టివానికి సుఖము కలిగించు ప్రతిక్రియ చేయవలెను. జిల్లేడు వేరు, ఉత్తరేను, పిప్పలి, పెద్దపొఁపర, వీనిని నేతిలో బాగుగా మర్దించి పానముగా, నస్యముగా నీయవలెను. దీనితో రోగికి శాంతి కలుగును.

మూ. వైశ్యేనాపిహి దష్టస్య శృణురూపాణి యానితు శ్లేష్మప్రకోపో లాలాచ నచో ద్వహతి చేతనమ్

మూర్ఛాచ ప్రబలా యస్య ఆత్మానం నాభినందతి తస్యకుర్యాత్ప్రతీకారం యేన సంపద్యతే సుఖమ్

అశ్వగంథా సగోమూత్రా గృహధూమం సగుగ్గులమ్ శిరీషార్కపలాశేన శ్వేతాచ గిరికర్ణికా

గోమూత్రేణ సమాయుక్తం పానం నస్యంచ దాపయేత్ ఏషవైశ్యేన దష్టానామగదః పరికీర్తితః

శూద్రేణాపి హి దష్టస్య శృణు తత్వేన గౌతమ! కుధ్యతే వేపతే చైవ జ్వరః శీతంచ జాయతే

అంగాని చులుచులాయంతే శూద్రదష్టస్య లక్షణమ్ తత్రాగదం ప్రవక్ష్యామి యేన సంపద్యతే సుఖమ్

పద్మంచ లోధ్రకంచైవ క్షౌద్రం పద్మస్య కేసరమ్ మధూకసారం మధుచ శ్వేతాంచ గిరి కర్ణికామ్

 ఏతాని సమభాగాని పేషయేచ్ఛీత వారిణా పానలేపాంజనైర్న స్యైః సుఖీభవతి మానవః

పూర్వాహ్ణేచరతే విప్రో మధ్యాహ్నేక్షత్రియశ్చరేత్ అపరాహ్ణే చరేద్వైశ్య: శూద్రఃసంధ్యాచరో భవేత్

 ఆహారో వాయుపుపుష్పాణి బ్రాహ్మణానాంవిదుర్బధాః మూషికా క్షత్రియాణాంచ ఆహోరో ద్విజసత్తమ వేశ్యామండూక భక్షాశ్య శూద్రాః సర్వాశినస్తథా

తా॥  వైశ్య సర్పము కఱచిన వాని లక్షణములను వినుము. కఫము ప్రకోపించును. చొంగకారును. ప్రాణమెగబట్టును. మూర్ఛప్రబలమై తన్నుతాను మచిపోవును. అట్టి స్థితిలో రోగికి సుఖము కలిగించు చికిత్స చేయవలెను. అశ్వగంధ, దిరిసెన, జిల్లేడు, గృహధూమము, గుగ్గులు, మోదుగు, తెల్లనిదింటెన- ఇవి ఆవు మూత్రములో మర్దన చేసి పానముగా, నస్యముగా నుపయోగింపవలెను. ఇది వైశ్య సర్ప దష్టున కీయవలసిన యౌషధము. గౌతమా! ఇక శూద్రసర్పముచే కాటు వేయబడిన వాని లక్షణములను వినుము, దుర్గంధము పెరిగిపోవును. వణుకుచుండును, చలిజ్వరము వచ్చును. అవయవములలో 'చిమచిమ' పుట్టును, ఇది శూద్ర సర్పదష్ట లక్షణము. రోగి శాంతించు నౌషధము చెప్పెదను. తామర, లొద్దుగు, తేనె, తామర అకరువు, ఇప్పమూలగ, కల్లు, తెల్లదింటెన. వీనిని సమభాగములుగ తీసికొని చల్లని నీటిలో కలిపి మర్దించవలెను. దీనిని త్రాగించుట, ఒంటికిపూయుట, కన్నులకాటుకగా పెట్టుట, నస్యముగా పీల్పించుట చేసినచో దష్టుడు బాధనుండి ముక్తుడగును. బ్రాహ్మణ సర్పము పూర్వాహ్లమున, క్షత్రియసర్పము మధ్యాహ్నమున, వైశ్యసర్పము మూడవజామున శూద్రసర్పము సాయంకాలమునచరించుచుండును. బ్రాహ్మణ సర్పములు గాలి, పుష్పములు, క్షత్రియ సర్పములు ఎలుకలను, వైశ్యసర్పములు కప్పలను శూద్ర సర్పములు అన్నింటిని ఆహారముగా తీసికొనును.

మూ. అగ్రతో దశతే విప్రః క్షత్రియో దక్షిణేనతు వామపార్శ్వే సదావైశ్యః పశ్చాద్వై శూద్ర ఆదశేత్

మదకాలేతు సంప్రాప్తే పీడ్యమానామహావిషాః అవేలాయాం దశంతేవై మైథునార్తా భుజంగమాః

 పుష్పగంథాః స్మృతావిప్రాః క్షత్రియాశ్చందనావహా: వైశ్యాశ్చ ఘృత గంధావై శూద్రాస్యుర్మత్స్యగంధినః

వాసం తేషాం ప్రవక్ష్యామి యధావదను పూర్వశః వాపీ కూప తడాగేషు గిరిప్రసవణేషుచ వసంతి బ్రాహ్మణాః సర్పా గ్రామద్వారే చతుష్పథే

ఆరామేషు పవిత్రేషు శుచిష్వాయ తనేషు చ వసంతి క్షత్రియా నిత్యం తోరణేషు సర్వసు చ

శ్మశానే భస్మశాలాసు పలాలేషు తటేషుచ గోష్ఠేషు పథి వృక్షేషు విప్రవైశ్యా వసంతిచ

అవివిక్రేషు స్థానేషు నిర్జనేషు వనేషుచ శూన్యాగారే శ్మశానేచ శూద్రావిప్ర వసంతిచ

శ్వేతాశ్చ కపిలాశ్చైవ యేసర్పాస్త్వనల ప్రభా: మనస్విసః సాత్వికాశ్చ బ్రాహ్మణాస్తే బుధైః స్మృతాః

రక్త వర్ణాః సువర్ణాభాః ప్రవాల మణి సన్నిభాః సూర్యప్రభాస్తథా విప్ర! క్షత్రియాస్తే భుజంగమాః

నానా విచిత్ర రాజీభిరతసీ వర్ణ సన్నిభాః బాణ పుష్ప సవర్ణాభా వైశ్యాస్త్వై భుజంగమాః

 తా॥  బ్రాహ్మణ సర్పములు ముందు భాగమున, క్షత్రియ సర్పములు కుడివైపున, వైశ్యసర్పము లెప్పుడును ఎడమవైపున, శూద్ర సర్పములు వెనుకవైపున కాటు వేయుచుండును. మహావిష సర్పములు, మదించిన కాలమున, పీడ్యమానములై, మైధునేచ్చ మిక్కుటమగుటచేత అకాలమున కాటు వేయుచుండును. పుష్ప పరిమళము గలవి బ్రాహ్మణ సర్పములు. చందనపు సువాసన గలవి క్షత్రియ సర్పములు, నేతి వాసన గలవి వైశ్య సర్పములు. చేపల వాసన గలవి శూద్రజాతి సర్పములని తెలియవలెను. క్రమముగా వాని నివాస స్థానములను గుఱించి చెప్పెదను. పెద్దబావులయందు, చేదబావులయందు, చెఱువులందు, కొండలందలి సెలయేటి యూటలందును, గ్రామద్వారములందు, నలుత్రోవల కూడలులయందును బ్రాహ్మణ సర్పములు నివసించుచుండును. పవిత్రములైన తోటలయందు, శుభ్రమైన గృహములందు, గుడులలోను, తోరణముల పైన, సరస్సులలోనను క్షత్రియ సర్పములు వాసము చేయుచుండును. శ్మశానములందు, బూడిద కుప్పలయందు, వరి గడ్డి గల తావులందు, ఒడ్డులందు, ఆవులమందల దాపులలోను, దారులందును, చెట్ల పైనను వైశ్యసర్పములుండును. అపవిత్ర స్థలములందు, జనసంచారము లేని అడవులలోను, మనుష్యులుండని పాడుబడిన యిండ్లలోను, శ్మశానములందును శూద్రసర్పములు వసించుచుండును. తెల్లనివి, గోరోజనము వంటి వన్నెగలవి, అగ్నివలె ప్రకాశించునవి బ్రాహ్మణ సర్పములు. ఇవి సాత్వికమైన మంచి స్వభావము గలవిగా బుధులచే చెప్పబడును. ఎఱ్ఱనివి, బంగారు వన్నెగలవి, పగడపు వర్ణముగలవి, మణులవలె ప్రకాశించునవి, సూర్యుని తేజస్సువలె మెఱయునవి క్షత్రియ సర్పములు. వివిధములైన చిత్రరేఖలు గలవి, నూనెయగిసే వన్నెగలవి, నల్లగోరింట పువ్వు వన్నెవంటి వన్నె గలవి, వైశ్యసర్పములు.

మూ. కాకోదర నీభాః కేచిద్యేచ అంజన సన్నిభాః కాకవర్ణా ధూమ్ర వర్ణా స్తే శూద్రాః పరికీర్తితాః

యస్య సర్పేణ దష్టస్య దంశమంగుష్ఠమంతరమ్ బాలదష్టం విజానీయా త్కశ్యపస్య వచో యధా

యస్య సర్పేణ దష్టస్య దంశం ద్వ్యంగుల మంతరమ్ యౌవన స్థేన దష్టస్య ఏతద్భవతి లక్షణమ్ 

యస్య సర్పేణ దష్టస్య సార్థం ద్వ్యంగుల మంతరమ్ వృద్ధ దష్టం విజానీయా త్కశ్యపస్య వచో యథా

అనంతః ప్రేక్షతే పూర్వం వామ పార్శ్వేతు వాసుకి: తక్షకో దక్షిణే నేహ కర్కోటః పృష్ఠతస్తథా

చలతే భ్రమతే పద్మో మహాపద్మో నిమజ్జతి విసంజ్ఞస్తిష్ఠతే చైవ శంఖపాలో ముహుర్ముహుః

సర్వేషాం కురుతే రూపం కులికః పన్నగోత్తమః అనంతస్య దిశా పూర్వా వాసుకేస్తు హుతాశనీ

 దక్షిణా తక్షక స్యోక్తా కర్కోటస్యతు నైరృతీ పశ్చిమా పద్మనాభస్య మహాపద్మస్య వాయుజా ఉత్తరా శంఖపాలస్య ఐశానీ కంబలస్యతు

 అనంతస్య భవేత్పద్మం వాసుకేః స్యాత్తథోత్సలమ్ స్వస్తికం తక్షకస్యోక్తం కర్కోటస్యతు పంకజమ్

 పద్మస్యతు భవేత్పద్మం శూలం పద్మేతరస్యచ శంఖపాలే భవేచ్ఛత్రం కులికస్యార్ధచంద్రకమ్

తా॥  శూద్రసర్పములు కొన్ని కాకి కడుపు వర్ణమునను, కొన్ని కాటుక వన్నెలోను, మఱికొన్ని కాకి రంగులోను, ఇంకను కొన్ని పొగవన్నెలోను ఉండును. పాముకాట్లు అంగుళము మేరయున్నచో అది పిల్లపాముకాటనియు. రెండంగుళముల అంతరముతోనున్న యువకసర్పపు కాటనియు. రెండంగుళములు న్నర మేరలోనున్నచోనది వృద్ధసర్పపు కాటనియు కశ్యప వాక్యముననుసరించి గ్రహింపవలెను. అనంతుడు ముందుకు, వాసుకి ఎడమవైపు, తక్షకుడు కుడివైపు, కర్కోటకుడు వెనుకవైపు, దృష్టికలిగియుందురు. పద్ముడటునిటు తిరుగుచుండును. మహాపద్ముడు స్నానమాడుచుండును. శంఖపాలుడు మఱల మఱల సైగలు చేయుచుండును. కులికుడను పన్నగోత్తముఁడివియన్నియు చేయుచుండును. అనంతుడు తూర్పు, వాసుకి ఆగ్నేయము. తక్షకుడు దక్షిణము, కర్కోటకుడు నైరృతి, పద్ముడు పడమర, మహాపద్ముడు వాయవ్యము, శంఖపాలుడుత్తరము, కంబలుడు ఈశాన్యమునకును అధిపతులు. అనంతునికి పద్మము, వాసుకికి ఉత్పలము, తక్షకునకు స్వస్తికము, కర్కోటకునకు పంకజము. పద్మునకు పద్మము, మహాపద్మునకు శూలము, శంఖపాలునకు ఛత్రము, కులికునకు అర్ధచంద్రుడు చిహ్నములు.

 మూ. అనంతకపిలౌవిప్రౌ, క్షత్రియా శంఖవాసుకీ మహాపద్మస్తక్షకశ్చ వైశ్యౌ విప్ర! ప్రకీర్తితౌ పద్మకర్కోటకే శూద్రౌ సదాజ్ఞేయౌ మనీషిభిః

అనంత కులికే శుక్లౌ, వర్ణతో బ్రహ్మ సంభవౌ వాసుకిఃశంఖపాలశ్చ రక్తాహ్యగ్ని సముద్భవౌ

తక్షకశ్చ మహాపద్మ ఈషత్పతౌ బభూవతుః పద్మకర్కోటకే విప్ర! సర్పౌ కృష్ణౌ బభూవతుః

హయం యానం వృషం ఛత్రం రాజానమదపావకమ్ ధరణీ ముత్పాద్య ధృతానేతాన్సిద్ధికరాన్విదుః,

 పూర్ణకుంభః పతాకాచ కాంచనం మణయస్తధా శిరీషం మాణికం కంఠే జీవ జీవేతి సువ్రత! ఏతేషాం దర్శనం శ్రేష్ఠం కన్యాచైక ప్రసూయకా

 చతుషష్టిః సమాఖ్యాతా భోగినోయేతు పన్నగాః అదృశ్యాస్తేషు షట్రింశద్దృశ్యాస్త్రింశన్మహీచరాః

వింశశ్చ స్రగ్విణః ప్రోక్తాః సప్త మండలి నస్తథా రాజీవన్తో దశ ప్రోక్తాః దర్వ్యః షోడశ పంచచ

దుందుభో డుండుభశ్చైవ చేటభశ్చంద్రవాహనః నాగపుష్ప సవర్ణాఖ్వా నిర్విషా యేచ పన్నగాః ఏవమేవతు సర్పాణాం శతద్వినవతి స్మృతమ్

వరాహ కర్ణీం గజపిప్పలించ గాంధారికాం పిప్పల దేవదారు మధూక సారం సహసిందువారం హింగుంచపిష్టాగుటికాచకార్యా

సుమంతురువాచ : -

ఇత్యుక్తవాన్పురా వీర! గౌతమస్య ప్రజాపతిః లక్షణం సర్వనాగానం రూప వర్ణౌ విషం తథా

తస్మాత్సం పూజయేన్నాగాన్సదా భక్త్యా సమన్వితః విశేషతస్తు పంచమ్యాం పయసాపాయ సేన చ

శ్రావణే మాసి పంచమ్యాం శుక్ల పక్షే నరాధిప! ద్వారస్యోభయతో లేఖ్యా గోమయేన వీషోల్బణాః

పూజయేద్విధి వద్ద్వారం దధిదూర్వాక్షతైః కుశైః గంధ పుష్పోప హారైశ్చ బ్రాహ్మణానాంచ తర్పణైః:

యేత్వస్యాం పూజయం తీహ నాగాన్భక్తి పురస్సరాః నతేషాం సర్వతో వీర! భయం భవతి కర్హిచిత్

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్ధ సాహస్ర్యం సంహితాయాం బ్రాహ్మే పర్వణి పంచమీ కల్పే శ్రావణిక నాగపంచమీ వ్రత వర్ణనం నామ షడ్రింశోఽధ్యాయః

తా॥ అనంతుడు, కపిలుడు బ్రాహ్మణులు; శంఖుడు, వాసుకి క్షత్రియులు; మహాపద్ముడు తక్షకుడు వైశ్యులు; పద్ముడు కర్కోటకుడు శూద్రులు. అని తెలియవలెను. అనంతకులికులు తెల్లనివారు, బ్రాహ్మసంభవులు వాసుకి, శంఖపాలుడు ఎఱ్ఱనివారు వీరు అగ్నిసంభవులు. తక్షకుడు, మహాపద్ముడు కొంచెము పసుపువన్నెగలవారు (ఇంద్రసంభవులు) పద్మకర్కోటకులు నల్లనివారు (యమసంభవులు). గుఱ్ఱము, రధము, ఎద్దు, గొడుగు, రాజు, అగ్ని, భూమి చిహ్నములను కల్పించి ధరించినచోనవి సిద్దిప్రదములని బుధుల అభిప్రాయము. పూర్ణకుంభ, ధ్వజ చిహ్నములు, బంగారము, మణులు, దిరిసేన, మాణిక్యము కంఠమునందు ధరించిన దీర్ఘాయువులగుదురు. వీని దర్శనము కూడా శ్రేష్టమైనది. సంతానమును కనగల కన్య లభించును. అరువది నాలుగు సర్పజాతులుండునని చెప్పబడినది. వానిలో ముప్పదియాఱు జాతులు కనపడకుండును. ఇరువది యెనిమిది జాతులు భూమి పై తిరుగుచుకనపడుచుండును. (ముప్పది యాంటీలో రెండు జాతులరుదుగ కనుబడుచుండును.). ఇందు దాదాపుగా నిరువది స్రగ్విణులు, ఏడు మండలులు, పది రాజిలములు, ఇరువది యొకటి దర్వీకరములుగా విభజింపనగును. దుందుభములు, డుండుభములు, చేటభములు, చంద్రవాహనములు, పొన్న పూవు వన్నెగలవి విషములేని సర్పములు, ఈ విధముగ పాములు నూట తొంబది రెండు, విధములుగ చెప్పబడినవి. వరాహకర్ణి, గజపిప్పలి, గంజాయి, పిప్పలి, దేవదారు, ఇప్ప(మధూకసారము), వావిలి, ఇంగువ-వీనిని మెత్తగా పిండిచేసి గుండ్రని మాత్రలుగా చేసియుంచుకొనవలెను (ఇది సర్పవిషమును హరించునౌషధము)”. సుమంతుముని యిట్లనెను. “ఈ విషయములన్నింటిని పూర్వము కశ్యపప్రజాపతి గౌతమునకు చెప్పి యుండెను అన్నివిధములైన సర్పముల లక్షణములు, రూపములు, వర్ణములు, విషములు, మొదలగు వివరములన్నింటిని వివరించియుండెను. అందువలన ఎల్లప్పుడును-ముఖ్యముగా పంచమితిథులలో పాలు, పాయసము నైవేద్యములతో నాగులను పూజింపవలెను. శ్రావణ మాస శుక్ల పక్ష పంచమి దినమున ద్వారమున కిరువైపుల నావు పేడతో సర్పాకృతులను లిఖింపవలేను. పెరుగు, గణిక, అక్షతలు, దర్భ, గంధము, పుష్పములు, వివిధములైన ఉపహారములు, బ్రాహ్మణసంతర్పణలు మున్నగు వానిచే చిత్రీకృత సర్పములు గల ద్వారమును యధావిధిగ పూజింపవలేను. నాగపంచమి నాడు భక్తిపురస్సరముగ నాగులను పూజించువారికి ఎప్పుడును సర్పభీతియుండదు.

శతార్ధ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్యమహాపురాణమునందలి బ్రహ్మపర్వమున పంచమీ కల్పాంతర్గత " శ్రావణిక నాగపంచమి వ్రత వర్ణసమను పేరుగల ముప్పది యాఱవ అధ్యాయము సమాప్తము.