కూర్మ మహా పురాణము
36 - ప్రయాగ మహాత్త్యము
ఋషు లిట్లు పలికిరి.
మంచి నియమము కలవాడా ! అవిముక్త క్షేత్రము యొక్క మహత్త్వమును గూర్చి ఉన్నదున్నట్లుగా నీ చేత తెలుపబడినది. ఇక ఇప్పుడు ప్రయాగ క్షేత్రము యొక్క మాహాత్మ్యమును గూర్చి తెలుపుము.
ఆ ప్రదేశములో ఏయే తీర్థములు శ్రేష్ఠములైనవి, ప్రసిద్ధములైనవి కలవో, వానిని గూర్చి మాకిప్పుడు తెలుపుము. ఓ సూతుడా ! నీవు అన్ని విషయములు తెలిసినవాడవుకదా !
సూతుడిట్లు చెప్పెను :-
ఓ ఋషులారా! మీరందరు వినుడు. నేను ప్రయాగక్షేత్రము యొక్క మాహాత్మ్యమును విస్తరముగా చెప్పుదును. అక్కడ భగవంతుడగు బ్రహ్మ నీవసించి యుండును.
మహాత్ముడైన ధర్మరాజుకొరకు మార్కండేయ మహామునిచేత ఏ ప్రకారముగా చెప్పబడినదో దానిని నేను మీకు తెలియజెప్పుదును.
తమ దాయాదులైన కౌరవులందరినీ యుద్ధములో చంపి, యుధిష్ఠిరుడు తన సోదరులతో గూడ గొప్ప శోకముతో కూడినవాడై మోహమును పొందెను.
తరువాత కొద్ది కాలమునకు గొప్ప తపశ్శక్తి కలిగిన మార్కండేయముని హస్తిన పురమునకు విచ్చేసి రాజద్వారము వద్ద నిలిచి ఉండెను.
ఆ మునిని చూచి ద్వారపాలుడు ఆ వృత్తాంతమును శీఘ్రముగా రాజునకు తెలియజేసెను. “ఓ రాజా! మార్కండేయముని మిమ్ము దర్శించుటకు వచ్చి ద్వారము వద్ద వేచియున్నాడు” అని.
వెంటనే ధర్మరాజు శీఘ్రముగా ద్వారము వద్దకు వచ్చి, “ఓ మహామునీ! మా భవన ద్వారమునకు విచ్చేసిన మీకు స్వాగతము” అని పలికెను.
ఈనాడు నా జన్మ సార్థకమైనది. నేడు నా వంశము పవిత్రము చేయబడినది. ఓ మునీశ్వరా! నీవు సంతోషించినప్పుడు నా పితృదేవతలిప్పుడు తృప్తులైనారు.
యుధిష్ఠిరుడు, మహాత్ముడైన ఆ మునిని సింహాసనముపై కూర్చుండబెట్టి, పాదములు కడిగి, అర్ఘ్యము మొదలగు వానితో పూజించెను.
కుశల ప్రశ్నలు అడుగబడిన మార్కండేయుడు ధర్మరాజుతో ఇట్లనెను. పండితుడవైన ధర్మజా! అన్నియు తెలిసి కూడా నీవు ఎందుకు మోహము చెందుతున్నావు?
తరువాత రాజగు ధర్మరాజు తలవంచి నమస్కరించి ఇట్లుపలికెను. “మునీశ్వరా! ఏ ఉపాయముతో నేను పాపము నుండి విముక్తుడనగుదునో సంగ్రహాముగా తెలుపుము”.
గడచిన యుద్ధములో, మాచేత, కౌరవులచేత గూడ నిరపరాధులైన చాలా మంది మనుష్యులు చంపబడినారు. ఓ మునిశ్రేష్ఠా! దానికి పాప నివృత్తిని గూర్చి తెలుపుము.
హింసనుండి పుట్టినది, పూర్వ జన్మములందు చేయబడినదియు అగు పాపము నుండి ఏ ఉపాయముతో విముక్తులగుదుమో, దానిని నీవు మాకు చెప్పదగియున్నావు.
మార్కండేయుడిట్లు చెప్పెను :-
మహాభాగుడవైన ఓరాజా! నీవు దేనిని గూర్చి నన్ను అడుగుచున్నావో, దానిని చెప్పెదను వినుము. ప్రయాగక్షేత్రమునకు వెళ్ళుట శ్రేష్ఠమైనది అది పాపములను నశింపజేయును.
ఓ రాజు! ఆ ప్రయాగలో మహాదేవుడగు శివుడు పూర్వము నివసించెను, భగవంతుడగు బ్రహ్మదేవుడు స్వయంభువు, దేవతలతో సహ అక్కడ నిలిచియున్నాడు.
ధర్మరాజు పలికెను :-
మహాత్మా! ప్రయాగ క్షేత్రమునకు వెళ్ళినందుకు ఫలమును వినగోరుచున్నాను. అక్కడ మరణించిన వారికి గతి ఎటువంటిది? స్నానము చేసిన వారికే ఫలము కలదు?
ఎవరు ప్రయాగక్షేత్రములో నివసింతురో, వారికి ఎటువంటి ఫలము కలుగును? మీకు తెలిసిన ఈ విషయమును నాకు తెలుపుము. నీకు నమస్కారము
మార్కండేయముని యిట్లు చెప్పెను :-
కుమారా! పూర్వ కాలములో మహర్షులచేత చెప్పబడుచుండగా నాచేత వినబడినది, ప్రయాగలో స్నానము చేయుట వలన కలుగునది అగు ఫలమును నేను మీకు చెప్పగలను.
ఇది ప్రజాపతి యొక్క క్షేత్రముగా మూడు లోకముల యందు ప్రసిద్ధమై యున్నది. ఇక్కడ స్నానము చేసినవారు మరణించిన తరువాత పునర్జన్మలేని వారుగా ఉత్తమగతిని పొందుదురు.
అక్కడ బ్రహ్మ మొదలగు దేవతలందరు కూడి యుండి రక్షణ భారమును వహింతురు. సమస్త పాపములను నశింపజేయునట్టి ఇతర తీర్థస్థలములు ఇంకను చాలా కలవు.
వానిని గూర్చి వివరించుటకు కొన్ని వందల సంవత్సరముల కాలములో గూడా శక్తుడను కాను. ప్రయాగ తీర్థము యొక్క ప్రశస్తిని ఇక్కడ సంగ్రహముగా తెలియజేయగలను.
అరువది వేల ధనుస్సులు గంగానదిని కాపాడుచున్నవి. ఏడు అశ్వములు వాహనములుగా కలిగిన సూర్యుడు ఎల్లప్పుడు యమునా నదిని రక్షించుచున్నాడు.
ప్రయాగ క్షేత్రములో ప్రత్యేకముగా ఇంద్రుడు స్వయముగా నివసించుచున్నాడు. సమస్త దేవతలచే అధిష్ఠింపబడిన మండలమును విష్ణువు కాపాడుచున్నాడు.
శూలమును చేతి యందు ధరించిన మహేశ్వరుడు అక్కడి మట్టిచెట్టును ఎల్లప్పుడు కాపాడుచుండును. సమస్త పాపములను నశింపజేయు మంగళకరమైన తీర్థ స్థలమును దేవతలు రక్షించుచుందురు.
తమ కర్మ సంబంధము చేత ఆవరింపబడిన జనులు ఆ స్థానమును పొందజాలరు. ఓ రాజా! ఎవనికైతే చిన్నదైన పాపమైనను కొంచెము మిగిలియున్నప్పటికిని,
ప్రయాగక్షేత్రమును మనస్సులో స్మరించినవానికి, ఆ తీర్థమును చూచినవానికి, దాని యొక్క నామమును కీర్తించినప్పటికి ఆ నరుని పాపలేశము పూర్తిగా నశించును.
ఓ రాజా! అయిదు కుండముల మధ్యలో గంగానది ప్రవహించుచోట ఆ ప్రదేశములోని మృత్తికను లేపనము చేసికొనుట వలన కూడా మనుష్యుడు పాపముల నుండి విడుదల చెందును.
ప్రయాగక్షేత్రమును ప్రవేశించు మనుష్యుని యొక్క పాపము ఆ క్షణములోనే నశించును. వేల యోజనముల దూరములో నుండి కూడా ఏ మనుజుడు గంగానదిని స్మరించునో,
అట్టివాడు పాపకర్మములు చేసినవాడైనను ఉత్తమమైన పుణ్యగతిని పొందును. గంగను కీర్తించుట వలన పాపము నుండి దూరుడగును. దానిని చూచి శుభములు పొందును.
ఆ గంగలో ఆచమనము చేసి దేవలోకములో పూజింపబడును. ఓ రాజా! రోగగ్రస్తుడు కాని, దీనుడుకాని, కోపమునకు వశమైనవాడు గాని అగునరుడు పూర్వోక్త ఫలమును పొందును.
ఆ ప్రయాగము తమ పితృదేవతలను తరింపజేయునది, అన్ని పాపములను నశింపజేయునది కూడా, ఎవరిచేత ప్రయాగములో నివాసము చేయబడునో, వారీ చేత సంసారమను సముద్రము దాటబడిన దగును.
గంగాయమునల సంగమ ప్రదేశముచేరి ప్రయత్న పూర్వకముగా ప్రాణములను విడిచినచో, తాను కోరుకున్న కోరికలను పొందునని మునిశ్రేష్ఠులు తెలుపుచున్నారు.
మెరయుచున్న బంగారు రంగు కాంతి కలిగిన, సూర్యమండల ప్రాంతములో సంచరించునవి, సమస్త మణులతో నిర్మింపబడినవి, పలు విధముల పతాకములతో కూడిన దివ్య విమానములతో, శ్రేష్ఠ వనితలు నిండి యుండగా శుభ లక్షణములు కలిగి సంతోషించును. గీత వాద్యముల ధ్వనులతో నిద్రనుండి మేలుకొలుపబడును.
ఎప్పటి వరకు తన పూర్వజన్మను స్మరించుకొనడో, అంతకాలము స్వర్గములో పూజింపబడును. కర్మ ఫలము క్షీణించిన మనుష్యుడు ఆ స్వర్గము నుండి జారినవాడై, బంగారము రత్నములు నిండుగ కల సంపన్నమైన వంశములో జన్మించును మరల ఆ పుణ్యతీర్థమునే స్మరించి దాని వలన మరల అక్కడికి చేరుకొనును.
తన దేశములో కాని, అడవిలో కానీ, పరదేశములోకాని, తన యింటిలోకాని ప్రయాగక్షేత్రమును స్మరించుచు ఎవడు తన ప్రాణములు వీడుచునోవాడు బ్రహ్మలోకమును చేరు కోనునని మునిశ్రేష్ఠులు చెప్పుచున్నారు. ఎక్కడ భూమి బంగారు మయమో, వృక్షములు అన్ని కోరికలను ఫలింప జేయునో, ఎచట ఋషులు, మునులు, సిద్ధులు ఉందురో ఆ లోకమునకతడు వెళ్ళును. వేల కొలది స్త్రీలతో నిండి, మనోహరమైన, శుభకర గంగా నది యొడ్డున, సిద్ధులు, చారణులు, గంధర్వులచేత, దేవదానవులచేత అతడు పూజింపబడును.
తరువాత స్వర్గము నుండి తొలగి జంబూ ద్వీపమునకు ప్రభువు కాగలడు. తరువాత మంగళకరమైన కార్యమును గూర్చి మరల మరల ఆలోచించువాడై, గుణవంతుడు, శీలము కలవాడుగా అగునని పెద్దల వలనవినుచున్నము. కర్మచేత, మనస్సుచేత, మాటచేత కూడా సత్యమునందు, ధర్మము నందు ప్రతిష్ఠింపబడినవాడగును.
గంగా యమునా నదుల మధ్య భాగములో ఎవడైతే అన్నదానము చేయునో, బంగారము లేదా ముత్యము మరియేదేని వస్తువు నిచ్చునో, తన పని సందర్భమున కాని, మరణించిన తల్లిదండ్రుల కర్మల సమయమున గాని తీర్థ స్థలములో ఏ మనుష్యుడు పూజించునో, అతనికి దానఫలము నను భవించునంత కాలము తీర్థ స్థలపుణ్యము లభించదు అది నిరర్థకమగును.
అందువలన తీర్థ స్థలములో, దేవతా మందిరములలో, పుణ్య స్థలములలో అన్ని నిమిత్తముల యందు దానము స్వీకరించకూడదు. బ్రాహ్మణుడీ విషయములో అప్రమత్తుడుగా నుండవలెను.
కపిల వర్ణము, పొటల వర్ణము, నలుపు కలిగిన ఆవును, బంగారు కొమ్ములు కలదానిని, వెండి గిట్టలు కలదానిని, వెడల్పు చెవులు కలది, బాగుగా పాలిచ్చునదగు ఆవును ఎవడు దానము చేయునో అట్టివాడు,
ఓ శ్రేష్ఠుడా! దానికి ఎన్ని రోమములుండునో అన్ని వేల సంవత్సరముల కాలము దాత రుద్రలోకములో పూజలందుకొనుచుండును.
శ్రీ కూర్మపురాణములో ప్రయాగ మాహాత్మ్యములో ముప్పది యారవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 36 of the Kūrma Mahā Purana is as follows:
Sūta describes the supreme majesty of Prayāga, the king of all holy pilgrimage sites, situated at the confluence of the holy rivers Gangā, Yamunā, and the invisible Sarasvatī. Prayāga is revealed as the sacrificial altar of Brahmā, guarded personally by Bhagavān Vishṇu and Mahādeva. A single bath at the Saṅgama during the holy month of Māgha bestows unimaginable spiritual merit equal to performing a hundred Ashvamedha sacrifices.