13 - దక్షకన్యాఖ్యాతి వంశము

సూతుడిట్లు చెప్పను :

భృగువుకు ఖ్యాతియను భార్య యందు నారాయణుని పత్నీ యగులక్ష్మీ దేవి జనించినది. ధాత, విధాత అను ఇద్దరు దేవ పురుషులు మేరువుకు అల్లుండ్రయిన వారు కూడా కలిగిరి.

ఆయతీ, నియతి అని మహాత్ముడైన మేరువు యొక్క కూతుళ్లిద్దరు కలరు. వారియందు ధాత, విధాత అను వారిచేత ఇరువురు కుమారులు కలిగిరీ.

ప్రాణుడు, మృకండువు అని ఆ కుమారుల పేర్లు. వారిలో మృకండువువలన మార్కండేయుడు జన్మించినాడు. ప్రాణునికి వేద శిరసుడు అను తేజస్సు కల పుత్రుడుదయించెను.

సంభూతి అను నామె మరీచి వలన పూర్ణమాసుని పుత్రుడుగా కనెను. ఇంకను అన్ని మంచి లక్షణములుకల నలుగురు కన్యలనుగూడ ప్రసవించినది.

వారిలో పెద్దది తుష్టి, తరువాత వృష్టి, కృష్టి అపచితీ అనువారు ఆ కన్యలు. పూర్ణమాసునికి విరజుడు, పర్వతుడు అని ఇద్దరు కుమారులు కలిగిరీ.

పుజాపతి యగు పులహునికి క్షమ అను భార్య సుతులను కనెను. శ్రేష్ఠుడైన, సహనశీలుడు, ముని శ్రేష్ఠుడు అగు కర్దమునీ కూడ పుత్రునిగా పొందెను.

అట్లే తపస్సు చేత కడిగి వేయబడిన పాపములు కల చిన్న కుమారుని పొందెను. అనసూయాదేవి అత్రి మహాముని వలన పాపరహితులైన పుత్రులను ప్రసవించెను. (7).

చంద్రుని, దుర్వాసుని, యోగి యగు దత్తాత్రేయుని కుమారులు గో ఆమె పొందినది. అంగీరసుని కూతురు స్మృతి మంచి లక్షణములు కలది.

సీసుమతీని రాకను అనుమతిని కుమార్తెలుగా పొందినది. పులస్త్యుడు ప్రీతి యందు దంభోజీ అను కుమారుని పొందెను.

అతడు పూర్వ జన్మలో స్వాయంభువ మన్వంతరములో అగస్త్యుడుగా పేర్కొనబడినాడు. తరువాత దేవ బాహువను రెండవ సంతానముగా కన్య ప్రీతి యందు కలిగెను.

సంతతి అను వనిత క్రతువు వలన అరువది వేల పుత్రులను పొందినది, వారందరు కూడ ఊర్ధ్వరేత స్కులుగా, వాలఖిల్యులు అని చెప్ప బడినారు.

వసిష్టుడు ఊర్జయను స్త్రీయందు ఏడుగురు కుమారులను పొందెను. తామరల వంటి కన్నులు కల, సమస్తమైన ప్రకాశముతో కూడిన ఒక కన్యను గూడ పొందినాడు.

రజస్సు, మాత్రుడు, ఊర్ద్వబాహువు, సవనుడు, అనగుడు, సుతపుడు, శుక్రుడు అను నీ యేడుగురు గొప్పబలముకల అతని కుమారులు.

విప్రులారా ! బ్రహ్మయొక్క కుమారుడు, రుద్ర రూపుడైన ఏ యీ అగ్నికలడో, అతని వలన స్వాహా దేవి గోప్పబలము గల, ఉదారులైన ముగ్గురు పుత్రులను పొందినది.

పావకుడు, పవమానుడు, శుచి అని రూపభేదములను బట్టి అగ్ని మూడు విధములుగా ఉండును. అరణి నుండి మథింపదగినది పవమానము, విద్యుత్సంబంధమైనది పావకము అనబడును.

సూర్య మండలములో ఉండి జ్వలించుచున్న యీ అగ్ని ‘శుచి’ అను పేరుతో వ్యవహరింపబడును. వారి సంతతి యందు ఇంకను నలుబది యైదు మంది కలరు.

పవమానుడు, పావకుడు, శుచి అను మూడగ్నులు, వారి తండ్రితో కూడ నలుబది యైదుమంది చేరగా మొత్తము నలుబది తొమ్మిది అగ్నులుగా పేర్కొనబడినవి.

వీరందరు తపస్సు కలవారుగా, యజ్ఞములందు భాగముకలవారుగా, రుద్రస్వరూపులుగా, మూడు పుండ్ర రేఖలతో గుర్తించబడిన శిరస్సులు కలపొరుగా చెప్పబడుచున్నారు.

యజ్ఞము చేయనివారు, యజ్ఞకర్తలు అగు బ్రహ్మకుమారులైన పితృదేవతలు కలరు. వారికి అగ్నిష్వాత్తులని, బర్హిషదులని రెండు విధముల విభాగము చేయ బడినది.

వారి వలన స్వధ అను పత్ని మేన, ధారిణి అను పుత్రికలను కనేను . ముని శ్రేష్ఠులారా ! ఆ ఇరువురు యోగము నవలంబించినవారు, వేదాంతవిద్యను ప్రకటించు వారుగా ఉండిరి.

వారిలో మేస అను సొమే మైనాకుని, అతని తమ్ముడైన క్రౌంచపర్వతమును పుత్రులుగా పొందెను. సమస్త లోకములను పవిత్రము చేయు ఒకే ఒక గంగానది హిమవంతుని నుండి జనించేను.

తనయోగశక్తి అను అగ్ని బలము వలన ఆ మేన మహేశ్వరీ దేవిని పుత్రికగా పొందినది. శ్రేష్ఠమైన దేవి యొక్క గొప్పతనము ఉన్నది ఉన్నట్లుగా పూర్వము చెప్పబడినది.

కమలముతో సమానమైన ముఖముకల ధారిణి మేరుపర్వతరాజుకు భార్య. ధాత, వీధాత అను వారు మేరువుకు అల్లుండ్రు.

దక్షుని పుత్రికల సంతాన క్రమము మీకు ఈ విధముగా నాచేత వివరించబడినది. ఇక మనువు యొక్క సృష్టి క్రమమును తెలిసికొనుడు.

శ్రీ కూర్మ పురాణములో పదుమూడవ అధ్యాయము సమాప్తము.