8. వివాహ ధర్మములందు స్త్రీ విషయమున నరవృత్త వర్ణనము

బ్రహ్మోవాచ :

శ్లో ॥ కర్తవ్యం యధ్గృహస్థేన తదిదానీం నిబోధత గదతో ద్విజశార్దూల! విస్తరాచ్ఛాస్త్రతస్తథా

వైవాహికేఽ గ్నౌ కుర్వీత గృహ్యం కర్మయధావిధి శుభదేశాశ్రయశ్చైవ పత్నీవైవాహికీ గృహే

స్వాశ్రయేణ వినాశక్యం న యస్మాద్రక్షణాదికమ్ విత్తానామవదారాణా మతస్త ద్విధిరుచ్యతే

హేతవోహి త్రివర్గస్య విపరీతాస్తుమానద అరక్షణాద్భవంతస్మాదమిషాం రక్షణం మతమ్

నిసర్గాత్పుంస్య సంతోషాద్గుణదోష విమర్శతః దుష్టానాంచాపి సంసర్గాద్రక్ష్యా ఏవచయోషితః

పురుషస్థాన వేశ్మాని త్రివిధం ప్రాహురాశ్రయమ్ విత్తానాంరక్షణాద్యర్థమపూర్వాధిగమాయచ

కులీనో నీతిమాన్ప్రాజ్ఞః సత్యసంధోదృఢవ్రతః వినీతో ధార్మిక స్త్యాగీ విజ్ఞే యోపురుషాశ్రయః

నగరేఖర్వటే ఖేటే గ్రామేచాఫి క్రమాగతే యాత్రావశాద్వానీవ సేద్ధార్మికోద్యజనాన్వితే

గురుణానుమతస్తత్ర గ్రామణ్యాదిజనేన ప్రతివేశ్మాద్యబాధేన శుద్ధం కుర్యాన్నివేశనమ్ ద్వారచత్వర శాతానాం సర్వకారుక వేశ్మనామ్ ద్యూతసూనాసురావేశనటరాజానుజీవినామ్

పాఖండదేవ వీథీనాం రాజమార్గకులస్యచ దూరాత్సుగుప్తం కర్తవ్యాజీవికా విభవోచితా

తా॥ బ్రహ్మదేవుఁడిట్లనెను శాస్త్రవిధిననుసరించి గృహస్థుడు చేయవలసిన కర్తవ్యమునిప్పుడు విపులముగా చెప్పెదను. తెలిసికొనుడు శుభదేశమునాశ్రయించి విధివత్పాణిగ్రహణము చేసిన భార్యతో గృహమున నివసించుచు, వైవాహికాగ్నియందు యథావిధిగ గృహ్యకర్మలను నిర్వర్తించుచుండవలెను. స్వకీయమైన గృహములేకుండ ధనములను స్త్రీలను రక్షించుట మొదలగునవి సాధ్యముకాదు. కాబట్టి ఆవిధీ చెప్పబడుచున్నది. ధనము, స్త్రీ త్రివర్గసాధనకు కారణములు కావున వానిని తప్పక రక్షింపవలెను. రక్షింపకున్న విపరీతములు సంభవించును. గుణదోషములను విచారించుచు, స్వాభావికముగా పురుషునియందలి అసంతుష్టినుండియు, దుష్టసంసర్గమునుండియు స్త్రీలను రక్షింపుచునే యుండవలయును. ధనముల రక్షణ కొఱకును, ధర్మసాధన కొఱకునునైన ఆశ్రయము పురుషుఁడు, స్థానము, గృహము అని మూడు విధములు, కులీనుఁడు, నీతిమంతుడు, ప్రాజ్ఞుఁడు, సత్యసంధుఁడు, దృఢవ్రతుఁడు, వినీతుఁడు, ధార్మికుడు, త్యాగియగువానిని 'పురుషాశ్రయము'గా నెఱుంగవలెను. నగరమునకాని, కొండదొననాశ్రయించియుండు పల్లెలోగాని, పంటకాపులు, వర్తకులుండెడి పల్లెలో గానీ, తన పూర్వులు నివసించుచువచ్చుచున్న గ్రామమందుగాని, యాత్రావశమున తానుచూచిన ధార్మిక జసులుండు గ్రామమున గాని నివసింపవలెను. గుర్వాజ్ఞతో లేక గ్రామముఖ్యులు మొదలగు వారీ ఆజ్ఞతో ఇరుగుపొరుగు ఇండ్లనుండి ఏ బాధయు లేకుండునట్లుగా తన యింటినీ శుద్దమొనర్చుకొనవలెను. ద్వారములు, ముంగిటీయిండ్లు (అగ్నిశాలలు) కంసాలులు, సాలె, మంగలి, చాకల, ముచ్చి మొదలగు వారి యిండ్లు, జూదగృహములు, వథస్థానములు, మద్యశాలలు, నటులు, రాజోద్యోగులుండుచోట్లు. నాస్తికుల వసతులు, దేవస్థాన వీధులు, రాజమార్గములు, రాజగృహములు మొదలగు వానికి దూరముగా, సుగుప్తముగా, విభవములతో కూడినదిగా గృహమును నిర్మించుకొనవలెను.

శ్లో ॥ సాపిధానైక నిష్కాశం శుద్ధపృష్ఠం సమంతతః సద్వృత్తాప్త జనాకీర్ణమదుష్టప్రాతివేశకమ్

ప్రాగుదక్ప్రవణే దేశే వాస్తు విద్యావిధానతః ప్రవిభక్త క్రియాకాంక్షం సర్వర్తుక మనోహరమ్

అర్చాస్నానోదకాగారా గోష్ఠాగారామహాన సైః యుక్తం గోవాజిశాలాభిః సదాసీభృత్యకాశ్రయైః

బహిరంతఃపురస్త్రీకం సర్వోపకరణైర్యుతమ్ విభక్తశయనోద్దేశ మాప్తవృద్దై రధిష్ఠితమ్

అరక్షణార్ధిదారాణాం వర్ణసంకరజాదయః దృష్టాహి బహవో దోషాస్తస్మాద్రక్ష్యాః సదా స్త్రియః

న హ్యాసాం ప్రమదం దద్యాన్న స్వాతంత్ర్యం న విశ్వ సేత్ విశ్వస్తవచ్చ చేష్టేత న్యాయ్యం భర్త్సనమాచరేత్

నాధికారం క్వచిద్దద్యాదృతే పాకాదికర్మణః స్త్రీణాం గ్రామీణ వత్తా హిభోగాయాలం సుశాసితా

నిత్యం తత్కర్మయోగేన తాః కర్తవ్యానిరంతరాః ఇత్యేవం సర్వదా వ్యాప్తేః స్యాద్యవిద్యా నిరాశ్రయా

దౌర్గత్యమతిరూపం చాప్యసత్సంగః స్వతంత్రతా పానాశన కథాగోష్ఠి ప్రియత్వాకర్మశీలతా

తా ॥ గృహము మఱుఁగుతో కూడిన తెల్లు కసవులేనిదిగను (ధనము దాచు గుప్తస్థలము గలదిగను) వెనుక భాగమంతటను పరిశుద్దముగా నుండునదిగను, సచ్చరిత్రులు, ఆప్తులుగలదిగను, సత్ర్పవర్తకులైన పొరుగువారు గలదియును అయియుండలేను. వాస్తుశాస్త్ర పద్ధతిగ తూర్పు, ఉత్తరము పల్లముగా నుండు ప్రదేశమున ఆయక్రియల కాయా విభాగములుండునట్లు అన్ని ఋతువులలోను మనోహరముగా నుండునట్లు నిర్మింపవలెను. పూజామందిరము, స్నానశాల, ఉదకారము, పశుశాల, పాకశాల, అశ్వశాల మొదలగువానితో గూడి దాసదాసీజనముతో నిండియుండవలెను, అంతఃపురస్త్రీలుండుటకు (బహిష్టులుండుటకును) వేర్వేరు విభాగములుండవలెను. సకలమైన సాధన సంపత్తితో కూడియుండవలెను. శయనాగారము విడిగానుండవలెను. ఆప్తులు, వృద్ధులు ఇంటనుండవలెను. స్త్రీలకు సరియైన రక్షణలేకుండినయెడల వర్ణ సంకరులు పుట్టుట మొదలగు దోషములెన్నియో కనబడుచున్నవి. కావున స్త్రీలనెల్లవేళల రక్షింపుచుండవలెను. వీరికి అతిశయించిన సంతోష స్వాతంత్ర్యములనీయరాదు. విశ్వసించుచున్నట్లు ప్రవర్తింపవలెనే కాని విశ్వసింపరాదు. న్యాయమైన బెదురులోనుంచవలెను. పాకాది కర్మలలో తప్ప ఎట్టి అధికారము నీయరాదు. పాకాది కర్మలో నియుక్తము చేయవలెను. స్త్రీలకు గ్రామీణత్వమే భోగమునకు చాలును. చక్కగాశాసింపబడినవారై నిత్యమును వారు ఏదో ఒక పనిలో నిమగ్నమై యుండవలెను. ఇట్లేప్పుడును వారు కర్మయోగముననున్నయెడల అవిద్య నిరాశ్రయముగనుండదు. మిక్కిలి సౌందర్యము, దుష్ట జన సహవాసము, స్వేచ్ఛ, తినుట, త్రాగుట, కథా గోష్టులయందిచ్ఛ, పనిలేకుండుట అనునవి దుర్గతిని కలిగించునవి.

శ్లో ॥ కుహకేక్షణికాముండా భిక్షుకీ సూతికాదిభిః గోప్రసంగై స్తథాసద్భిర్లింగియాచక శిల్పిభిః

సంవాహోద్యాన యాత్రానూద్యానేష్వామంత్రణాదిషు ప్రసంగస్తీర్ధయాత్రార్ధం ధర్మేషు ప్రకటేషుచ

విప్రయోగః సదా భర్త్రా తజ్ఞాతి కుల నిః స్వతా అమాధుర్య కదర్యత్వే భృశం పుంసాంచవాచ్యతా

అతిక్రౌర్యమతిక్షాంతి రత్యంతా భీతి పాతనమ్ స్త్రీభిర్జితత్వమత్యర్థం సత్యంతాస్తా: సదోషతా:

స్త్రీణాం పత్యురధీనత్వాత్పుమానేవహినింద్యతే భర్తురేవహితజ్జాడ్యం యద్భృత్యానామయోగ్యతా

తస్మాద్యథోదితా స్త్వేతా రక్ష్యాః శాసనతాడనైః తాడనైశ్చయథాకాలం యథావత్సముపాచరేత్

పరిగృహ్య బహూన్దారానుపచారైః సమోభవేత్ యథాక్రమోచితైః కర్మదాన సత్కార వాసనైః

ప్రధమోభిజనో ధర్మో యోగ్యత్వంచ సుపుత్రతా పక్షేవిత్తం విశేత్ స్త్రీణాం మానస్తత్కారణంతథా

తస్మాన్మానో న కర్తవ్యోహేయశ్చాపి న తత్కృతః గురుత్వేలాఘవేవాపి సతాంకార్యం నిబంధనమ్

ఆకస్మికే ప్రయుంజానః ప్రేక్షావాన్మాన లాఘవే నయత్కించ న కారిత్వచ్చాయమేవైతి లాఘవమ్

తా ॥ మోసకారి, వేల్పుసాని, బోడితలగలది, బిచ్చగత్తె, బాలెంతరాలు మొదలగువారితోను సైగలు చేయువారు (నేత్రభాష మాటాడువారు), దుష్టులు, తాగటదమ్ములు (జీవనార్థము సన్యాసి వేషము ధరించినవారు), యాచకులు, శిల్పులు (నటాదికళాకారులు) మొదలగువారితోను. అంగమర్దనాది క్రియలకైపోవుట, యాత్రలు, ఉద్యానవనములకు పోవుట, బంధువులనాలింగనాదులచే సంతోషపరచుట, (వీడుకోట్లు), తీర్థయాత్రాప్రసంగము చేయుట, బాహాటముగ ధార్మిక స్థలములయందు తిరుగుట. దీర్ఘకాలము భర్తకు దూరముగనుండుట, భర్తృసంబంధమైన వారిని దూరీకరించియుండుట, కటువుగ ప్రవర్తించుట, పిసినారితనము, పురుషులతో అతిమాత్రముగ మాట్లాడుట. మిక్కిలి క్రూరత్వము, మిక్కిలి ఓర్పు కలిగి యుండుట మిక్కిలి నిర్భయత్వము, ఏ స్త్రీలకైనను అత్యంతముగా వశమైపోవుట, ఇవియన్నియు స్త్రీవిషయమున దోషములు. స్త్రీలకు పురుషుఁడధీనమగుటవలన పురుషుడే నిందింపదగినవాఁడగును. భృత్యుల అయోగ్యతకు కూడ యజమాని జాడ్యమే కారణము. అందువలన స్త్రీలను, భృత్యులను శాసన తాడనములచేత రక్షింపుచుండవలెను. తాడనాదులు ఎంతకాలము ఎట్లు అవశ్యకమో అంతకాము అట్లు ఆచరింపుచుండవలెను.  పురుషుడు బహుభార్యలను పరిగ్రహించుటచేత ఉచితమగు క్రమమున, కర్మము, దానము, సత్కారము, వస్త్రము (నీరాజనము) మొదలగు ఉపచారములతో సంపూర్ణుడగును. మొదట కులము, ఆ పై ధర్మము, ఆపిదప యోగ్యత, ఆ మీదట సుపుత్రులు కలుగుట, దానికితోడు ధనముకూడ చేరిన పక్షమున స్త్రీలకు ఔన్నత్యము సమకూరును. అది దాని కట్లు కారణమగుచున్నది. అందువలన మొదటనే కొలఁదులు తూచుట హేయము. అట్లేవరును చేయలేదు. చేయకూడదు. గురుత్వలఘుత్వములెట్లున్నను మంచితనమ ప్రమాణముగా సంబంధము ఏర్పాటు చేసికొనవలయును. బుద్ధిమంతుడైవడైన అకస్మాత్తుగనే గురుత్వ లసుతనుల వేంచెవేని ఏదో ఒకటి అనాలోచితముగా చేసినవాడగుటచేత అతడే ఎమునందుకు సాగుకు

శ్లో ॥  యథా మానాపమానౌ హి ప్రయుజ్యేతానిమిత్తతః తన్నిమిత్తా జనత్యాగే ప్రయతంతే తదాశ్రితాః

ఏతదేవ హ్యపత్యానాం జ్ఞేయం మానన కారణమ్ యత్స్వాపత్యనిమిత్తేషు ప్రధానే కులయోగ్యతే

తత్సంయోగాత్సుఖం పుంసాం మహద్దు:ఖం వియోగతః తత్ర్పాప్తి: ప్రతిహాతవ్యాస్వార్థాయైవ ప్రియాణ్యపి

అతఃస్వార్థైక నిష్ఠోఽయం లోకః సర్వోఽవసీయతే తత్రసిద్ధిర్భవేద స్తమానాద్ర్భాంతి విధాయకః

 తతో దారాదికా భృత్యానియంతవ్యాస్తథాద్విజాః! యథేహాముత్రవా శ్రేయః ప్రాప్నుయాదుత్తరోత్తరమ్

స్త్రీణాం ధర్మార్థకామేషు నాతి సంధానమాచరేత్ తాసాం తేష్వభిసంధానాద్భవేదాత్మాభిసంహిత:

జాయాత్వర్థం శరీరస్య నృణాంధర్మాదిసాధనే నా తస్తాసు వ్యథాంకాంచిత్ప్రతి కూలం సమాచరేత్

యజ్ఞోత్సవాదౌ నా కస్మాత్కాంచిదాసాం విశేషయేత్ వస్త్రతాంబూల దానాదౌ ప్రతిప త్తౌ సమోభవేత్

ప్రియాప్రియత్వంభేదోహి కామతస్తురహోగతః ఉపచారైః పునర్వాక్యైస్తుల్యవృత్తి: ప్రశస్యతే

ఆర్తవేతుపునఃసర్వా ఉపగమ్యాః ప్రియాఇవ పూర్వాభిజాత ధర్మార్థా పుత్రిణీచోత్తరోత్తరమ్

తా॥ ఇట్లు నిర్నిమిత్తముగ గురుత్వలఘుత్వములనెన్నినచో తదాశ్రితులును అవే కారణములుగలవారై ఏకాంతమందు వానినే తిరిగి ప్రచురము చేయుటకు పూనుకొందురు. ఇదియే వారి సంతానముల యోగ్యతాయోగ్యతల నిర్ణయించు. కారణమగును. ఏలయనగా తమతమ పిల్లల వివాహాదుల గుణించిన విచారణలందు కులము, యోగ్యత రెండును ప్రధానములగును గదా!. అవిరెండును కలిసియుండుటయే మనుష్యులకు సుఖదాయకమగును. రెంటిలో ఏ ఒకటియైనను చెడి వేరైపోయినను గొప్పదుఃఖము కలిగించును. కాబట్టి స్వార్థము కొఱకే అట్టి దుఃఖము ప్రాప్తింపకుండ నిరోధింపవలెను. ఇష్టమైనవియైనను అట్టి వదంతులను అడ్డుకొనవలెను. స్వార్థమునందే నిష్ఠగల లోకము సర్వము నెఱుంగును. 'అస్తమానము' (అస్తమించిన మాసము) భ్రమలను కలిగించునను ప్రసిద్ధి కలదుకదా!. అందువలన మునుముందు ఇహపరములనుగాని శ్రేయఃప్రాప్తికొఱకుగాని భార్యమొదలగు స్త్రీలను, సేవకులను శాసించి అదుపులోనుంచవలెను. ధర్మార్థకామ విషయములందు స్త్రీలకు మోసము చేయరాదు. అట్లు త్రివర్గ విషయములందు వారితో కపటవర్తనము చేసినందువలన తననుండి తాను వేరైన వాఁడగును. ధర్మాదీసాధనమునందు మనుష్యులకు భార్య యనునదీ అర్థశరీరము. అందువలన ఆయా కర్మలయందు ఆమెకు వ్యధ కలిగింపరాదు. ఎంతమాత్రమైనను ప్రతికూల వర్తనము పనికిరాదు. యజ్ఞములు, ఉత్సవములు మొదలగు వాని యందు వారితో అకస్మాత్తుగా విభేదింపరాదు. వస్త్రతాంబూలదానాదికమందు గౌరవమునందు తాను సమానుడేయగును. కామము వలన ఏకాంతమునందేర్పడిన భేదము, ప్రియాప్రియత్వములను, ఉపచారములతోను, అనునయ వాక్యములతోను పోగొట్టి తుల్యవృత్తిననుసరించుట ప్రశస్తమైనది. ఋతుకాలమందైననో అందఱను ప్రియులవలెనే అంగీకరింపవలెను. స్త్రీ, మొట్టమొదట ధర్మార్థములను, పిమ్మట పుత్రులనుబడసి కామపురుషార్థము సాధింపఁదగియున్నది.

శ్లో ॥ ఉదగ్గచ్ఛేదనేనైవ విధినా నిత్యమార్తవే తుల్యవృత్తిర్యథాకాలం స్వంస్వంవాసమఖండయన్.

నిత్యపర్యాయ వాసానామపాదానమసూన్విదుః ఋతుదుఃఖం ప్రమోదశ్చ తథాపూర్వ సమాగత :

అన్యయా సహ యద్దు:ఖం సదసదా రహోగతమ్ ఉత్కంఠతం వాయత్కించిత్సపత్నీషు న తద్వ సేత్

యత్కించి దన్యసంబంధమన్యథా కథితం మిథః తస్యకుర్యాదనిర్వేద మాత్మనైవ విచింతయేత్

అన్యోన్యమత్సరాఖ్యానైర్నతావాచాపి భర్త్సయేత్ గుణదోషాచ విజ్ఞాయ స్వయం కుర్యాన్న నిష్కలౌ

వస్త్రాలంకార భోజ్యాదౌ తదపత్యేష్వనుక్రమాత్ మాతృదోషాననాదృత్య తుల్యదృష్టిః పితాభవేత్

అన్యస్యాన్యగతైర్దోషై ర్దూషణం నహీ నీతిమత్ యత్తు తేషామ పత్యం తు తత్తుల్యముభయోరపి

ప్రీతిం ద్వేషమభిప్రాయం శౌచాశౌచ గతాగమాన్ బహిరంతశ్చ జానీయాద్దాస గూఢచరైః సదా

ఆత్మానమపి విజ్ఞాయ చిత్తవృత్తే రనీశ్వరమ్ విశ్వసేత కథం స్త్రీషు సర్వావినయధామసు

వృద్ధదాస్యః క్రమాయాతా ధాత్ర్యశ్చపరిచారికాః తన్మాతృ పితృకార్యాశ్చ షండవృద్ధాశ్చరా మతాః

తా॥ ఈ వీధి చేతనే 'సమాన వృత్తి' ఎంతకాలముండునో అంతకాలము తమతమ నివాసములను ఒక్కటిగా చేయుచు ఎప్పుడును ఋతుకాలాభిగమనము చేయవలెను. నిత్యము పర్యాయముగానుపయుక్తములగు వసతి స్థలములను “అసువుల'నుగా ప్రాణములుగా తెలియుదురు. ఋతుదుఃఖమును గాని సంతోషమునుగాని అటుల పూర్వము వచ్చియుండినదానిని. మంచిదైనను చేడుదైనను అన్యస్త్రీ తోడి ఏకాంతమునందలి దుఃఖముగాని, ఉత్కంఠగాని భార్యలతోడునందు ప్రస్తావింపరాదు. ఇతరస్త్రీ సంబంధమైన ఏకాంతము ఏ కొంచెమైనను 'అన్యథా'గా చెప్పఁబడును. దానికి బాధపడక తనకు తానే విచారించుకొనవలెను. పరస్పర క్రోథవాక్యముల సందర్భమున వారిని మాటలతోనైన బెదరింపరాదు. గుణదోషములను తెలిసికొని తమను తాము నిస్తేజులుగా చేసి కొనరాదు. వస్త్రములు, అలంకారములు, భోజ్యపదార్థములు, ఆమె సంతానము-వీనియందు తల్లిదోషములెంచక, తండ్రి సమాన దృష్టిగలవాడగును. ఒకరి దోషములను మఱియొకరికి చెప్పుచు దూషించుట నీతికాదు. ఇది వారివారి సంతాన విషయమునందును ఉభయపక్షములకు సమానముగ వర్తించును. ప్రీతిని, ద్వేషమును, అభిప్రాయమును, శౌచాశౌచములను, రాకపోకలను, ఇంట, బయట ఎప్పుడును. భృత్యులమూలమున గూఢచారులమూలమున నెఱుంగుచుండవలెను. అదుపులేని తన చిత్తవృత్తిని తెలిసికూడ, అన్ని అవినయములకు నిలయములైన స్త్రీల చిత్తవృత్తులయందు విశ్వాసముంచుట ఎట్లు?. వృద్ధురాండ్రైనదాసీ స్త్రీలు, ఎప్పుడును వచ్చుచుండు దాదులు, పరిచారికలు, వారితల్లిదండ్రులు, పేడివారు, ముసలివారు, చోరులుగా తేలియవలెను.

శ్లో ॥ వివిధైస్తత్కథాఖ్యానైస్తుల్యశీల దయాన్వితైః ప్రవిశ్యాంతరభిప్రాయం విద్యాత్కాలే ప్రయోజితైః

తేషు తేషు కథార్దేషు కథ్యమానేషు లక్షయేత్ ముఖాకారాదిభిర్లింగై రభిప్రాయం మనోగతమ్

సీతారుంధతి సంబంధైస్తథా శాకుంతలాదిబిః సదసచ్చరితాఖ్యానైర్భావం విద్యాత్ప్ర వృత్తితః

తద్దుష్టానామదుష్టేషు సాధూనామీతదేషుచ ప్రీతిః కథా ప్రబంధేషు స్యాత్సఖ్యం పురుషేష్వితః

ఏవ మాగమ దుష్టాభ్యామనుత్యాచ తత్త్వతః స్త్రీణాం విదిత్వాభిప్రాయం వర్తే తాశుయథోచితమ్

స్త్రీభ్యోవిప్రతిపన్నాభ్యః ప్రాణైరపి వియోజనమ్ దృష్టంహిచ యథారాజ్ఞామతో రక్షేత్ప్ర యత్నతః

వేణ్యాగూఢేన శస్త్రేణ హతో రాజా శుభధ్వజః మేఖలామణీనా దేవ్యా సౌవీర్యశ్చనరాధిపః

భౌత్రాదేవీ ప్రయుక్తేన భద్ర సేనోనిపాతితః తథాపుత్రేణ కారూషో ఘాతితో దర్పణాసినా

ద్వౌకాశీరాజౌవై వంద్యౌ చానందాపుర యోషితా విషం ప్రయుజ్య పంచత్వమానీతో పూజితాత్మకౌ

ఏవమాది మహాభాగా రాజానో బ్రాహ్మణాశ్చహ స్త్రీభిర్యత్రని పాత్యంతే తత్రాన్యేష్విహకాకధా?

తా ॥ వారల శీలములవంటి శీలములతో, దయలవంటి దయలతో కూడిన వివిధములైన కాలోచితములైన కథలతో, ఆఖ్యానములతో వారి మనోవృత్తులలోనికి ప్రవేశించి, వారి యాంతరభిప్రాయముల నెఱిఁగికొనవలెను. ఆయా కధార్థములను చెప్పుచున్నప్పుడు, వారి ముఖభంగిమల చేతను, భావద్యోతక చిహ్నములతోను, వారి మనోగతాభిప్రాయమును పసికట్టవలెను. సీత, అరుంధతి, శకుంతల మొదలగు వారి కథలతోడను, అటులే దుష్టచారిత్రులైన వారి కథలతోడను ప్రవృత్తిననుసరించినను తెలిసికొనవలెను. దుషులలో మంచివారు, సాధువులలో దుషులు అయిన పురుషులయందు, కథా, ప్రబంధముల యందును, ప్రీతి సఖ్యము కలుగును. ఇట్టి ఆగమ దుష్టుల నుండి, తత్త్వతః స్త్రీల అభిప్రాయమును అను మానము చేతెలిసికొని సత్వరమే యధోచిత వర్తనమునకు పూనుకొనవలెనె. కలహించిన లేక విరోధపడిన స్త్రీలవలన రాజునకు ప్రాణాపాయము కూడ చరిత్రలో చూడబడినది. అందుచే అట్టి స్థితినుండి ప్రయత్నపూర్వకముగ రక్షణ పొందవలెను. జడలో రహస్యముగ దాచబడిన శస్త్రముచేత శుభధ్వజుడను రాజు హతుడయ్యెను. సౌవీర రాజ్యాధిపతి రాణియొక్క మొలనూలుకు గల మణిచేత చంపబడెను. భద్రసేనుడను రాజును అతని రాణి తన సోదరునితో కలిసి సంహరించెను. అటులే కారూషుడను రాజు తనకొడుకు చేత, కత్తివంటీ అద్దపుముక్కచేత చంపబడెను. వంద్యులును, ఉత్తములైన ఇద్దఱు కాశీరాజులను, ఆనందాపుర స్త్రీ విషము ప్రయోగించి చంపెను. ఈ విధముగ రాజులు, బ్రాహ్మణులును స్త్రీలచేత చంపబడిరనగా నిక నితరుల కథ యేమి చెప్పవలెను ?.

శ్లో ॥ తస్మాన్నిత్యాప్రమత్తేన జాయారక్ష్యాశ్చ నిత్యశః యధావదుప చర్యాశ్చగుణదోషానురూపతః

వైషమ్యాదుపచారాణాం వికారైశ్చానిమిత్తజైః విశే షేణ సపత్నీకై రకస్మాచ్చాపి వేదనైః

అసంభాగేచ వాగ్ధండ పారుష్యాదప్రసంగతః ప్రద్వేషో భర్తరి స్త్రీణాం ప్రకోపశ్చాపి జాయతే

తతశ్చాయాతి వార్థక్యముద్వోడు శ్చాపి శత్రుతామ్ తస్మాన్న తాన్ప్రయుంజీత దోషాన్దారవినాశకాన్

న చైతాః స్వకులాచార మధర్మం వాపిచాంజసా సగుణం చాప్యు పేక్షంతే ప్రకృత్యాముపీడితాః

సతీత్వే ప్రాయశః స్త్రీణాం ప్రదృష్టం కారణత్రయమ్ పరపుంసామసంప్రీతిః ప్రియేప్రీతిః స్వరక్షణే

 తస్మాత్సురక్షితా నిత్యముపచారై ర్యథోచితైః సుభృతా నిత్య కర్మాణః కర్తవ్యాయోషితః సదా

ఉత్తమాం సామదానాభ్యాం మధ్యమాభ్యాంతు మధ్యమామ్ పశ్చిమాభ్యాముభాభ్యాంచ అధమాం సంప్రసాధయేత్

భేద దండౌ ప్రయుజ్యాపి ప్రాగపత్యాద్య పేక్షయా తచ్ఛిష్టానాం తదా పశ్చాత్సామదానప్రసాధనే

యాస్తు విధ్వస్తచారిత్రా భర్తుశ్చాహిత కారకాః త్యాజ్యాఏవస్త్రియఃసద్భిఃకాలకూట విషోపమా  

ఇష్టాః కులోద్గతాః సాథ్వ్యీ వినీతా భర్తృవత్సలాః సర్వదాసాధనీయాస్తా: సంప్రదాయోత్తరోత్తరైః

ఏవమేవ యథోద్దిష్టం స్త్రీవృత్తం యోనుతిష్ఠతి ప్రాప్నోత్యేవస సంపూర్ణం త్రివర్గం లోకసంభవమ్

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్థ సాహస్ర్యాం సంహితాయాం బ్రహ్మేపర్వణి

వివాహ ధర్మేషు స్త్రీ విషయే నర వృత్తవర్ణనం నామాష్టమోఽధ్యాయః

తా॥ కాఁబట్టి ఎల్లప్పుడును జాగరూకతతో భార్యలను కాపాడుచుండవలెను. గుణదోషముల ననుసరించి యధోచితముగ వారికి ఉపచారములు చేయుచుండవలెను. ఉపచారములలోని ఎగుడుదిగుడులచేత, అకారణముగ కలిగిన వికారములచేత, ముఖ్యముగా సవతుల సంబంధమైన ఈర్ష్యల చేత, హఠాత్తుగ కలగిన వేదనలచేత. పక్షపాతమునందు, అసందర్భముగ కఠినమైన మాటలనుట, తీవ్రముగ దండించుట మొదలగు కారణముల వలన భర్త పై స్త్రీలకు విశేషమైన కోపము ద్వేషము పుట్టును. అట్లు శత్రుత్వమును లేవనెత్తెడు ద్వేషము నుండి ముసలితనము వచ్చును. కాబట్టి భార్యల వినాశమునకు కారణములగు నట్టి దోషములను చేయరాదు. పీడితులైన ఈ భార్యలు, అధర్మమేమైనను, తమ కులాచారమును వెంటనే వదలి పెట్టకుందురా ? సహజముగనే తమ సద్గుణములను ఉపేక్షింపకుందురా ? స్త్రీల పాతివ్రత్యమునకు ప్రాయికముగ మూడు కారణములు కనబడుచున్నవి. ఒకటి పరపురుషులయందు ప్రీతి లేకుండుట. రెండు తన భర్తయందు ప్రేమ ఉండుట. మూడు తన రక్షణ. అందువలన ఆమె నెల్లప్పుడును యథోచితమైన ఉపచారములతో చక్కగా రక్షింపు చుండవలెను. స్త్రీలు నిత్యోపచారములతో మంచి భార్యలుగా మలచదగిన వారు. ఉత్తమ స్త్రీని సామదానములచేత, మధ్యమ స్త్రీని దానభేదములచేత, అధమురాలిని భేద దండములచేత సాధించి లోబరచుకొనవలెను. అధమ స్త్రీ యెడ మొదట భేద దండములను ప్రయోగించియు తత్సంతానా పేక్ష చేత సామదానములను కూడ పిదప ప్రయోగించుట స్త్రీ ప్రసాధనలో శిష్టులకు కర్తవ్యము. హీన చరిత్రలై భర్తకు అపకారము చేసెడి స్త్రీలు కాలకూట విషముతో సమానమైనవారు. అట్టి స్త్రీలను సజ్జనులు విడిచి పెట్టవలెను. ఇష్టులు,కులమునకు కీర్తిదెచ్చువారు, సాధ్వీమణులు, పవిత్ర చరిత్రలు, భర్తృ ప్రేమ గలవారు అయిన స్త్రీలు ఎప్పుడును ఉత్తరోత్తర సంప్రదాయములచేత ఆదరింపదగినవారు. ఇట్లుద్దేశింపబడిన స్త్రీవృత్తము ననుసరించి ఎవడు మెలగునో వాడు ఇహలోక సంబంధములగు ధర్మార్థకామములను సంపూర్ణముగా పొందును.

ఇది శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్యమహాపురాణమునందలి బ్రహ్మపర్వమున వివాహ ధర్మముల యందలి స్త్రీ విషయ సంబంధమున నరవృత్తవర్ణనమను ఎనిమిదవ అధ్యాయము.