వామన మహా పురాణము లోని సరో మహాత్మ్యము
అధ్యాయము 28
ఓ పాపరహితా! చతుర్ముఖులూ, బ్రహ్మేశ్వరుల ఉత్పత్తిప్రకారం విశదంగా వినదలచుకున్నాను. ఆనతీయుడు.
ఓ నిష్పాపుడవగు మార్కండేయా! పద్మసంభవుడగు బ్రహ్మసృష్టి చేయదలచగా జరిగిన వృత్తాంతమంతా విశదీకరింతును వినుము. లోక పితామహుడగు బ్రహ్మపుట్టగానే, స్థావర జంగమాత్మకమైన భూతజాలాన్నంతా సృష్టించాడు. మరల సృష్టికి సంకల్పించుకొని, నల్ల కలువరేకుల వంటి నేత్రాలు సన్నని నడుము గలిగి నేత్రపర్వము చేయు నొక మనోహరాకృతి గల కన్యను సృష్టించాడు. ఆ బాలిక ఆందానికి ముగ్ధుడై తానే ఆమెను మైథున క్రీడకు ఆహ్వానించాడు. ఆ ఘోర పాపఫలంగా బ్రహ్మతలతెగిపోయెను. అలా తలతెగిపోయిననాతడు త్రిలోక ప్రసిద్ధము సర్వపాప క్షయకరము అయిన సాన్నిహిత్య పుణ్యసరస్సు వద్దకు వెళ్లాడు. అక్కడ ఋషి సేవితమైన పవిత్ర స్థాణుతీర్థంలో సరస్వతి నదికి ఉత్తరపుటొడ్డున చతుర్ముఖుని ప్రతిష్ఠించి ధూపదీప గంధ నైవేద్యాదులర్పిస్తూ రుద్రసూక్త పారాయణతో ప్రతినిత్యమూ ఆరాధించాడు. భక్తియుక్తుడగు నా శివపూజా ధురంధరుని వద్దకు భగవంతుడగు నీలలోహితుడు స్వయముగా వచ్చెను, అలా వచ్చిన శివుని జూచి లోక పితామహుడగు బ్రహ్మ భూమిపై సాష్ట్రాంగ ప్రణామం చేసి యిలాస్తోత్రం చేశాడు.
ఓ మహాదేవా! భూతభవ్యభవాశ్రయా! నీకు నమస్సులు! ఓ త్రిలోకపాలకా! స్తుతినిత్యా! పవిత్రదేహా, సర్వకల్మష హరా! హరా! చరాచరగురో! నీకు నమోవాకములు, రహస్య ప్రత్యక్ష విషయాలన్నీ తెలుపువాడా! వైద్యులకసాధ్యమైన సకల రోగములు నశింపజేయువాడా! దరుచర్మవాసా! శోకరహితా! నీకు ప్రణామములు! వారికల్లోల సంక్షుబ్ధ మహాబుద్ధి విఘటకా! దేవా నీ నామంజపించువారు సంసారంలో చిక్కుకొనరు. ఓ నిత్యులలో నిత్యా! త్రిలోకపాలకా! శంకరా! అప్రమేయా! వ్యాధినాశకా! పరా! అపరిమేయా! సర్వజీవప్రియా! నీకు నమోవాకములు. యోగేశ్వరా! సర్వపాప క్షయకరా! దేవా! స్థాణూ! సిద్ధా! సిద్ధులు వందిమాగధులచే స్తుతించబడువాడ! సంసార జీవులకు అందని వాడా! విశ్వరూపీ! నీకు ప్రణామములు! ఫణీంద్ర వర్ణిత మహిమాన్వితా! ఫణీంద్ర భుజబంధ కంకణధరా! ఫణీంద్ర దివ్యమాలాధరా! భాస్కరా నీకు నమో వాకములు!
"పితామహా! భవిష్యత్తులో జరుగబోవు కార్యాలకు నీవు చింతించనవసరంలేదు. పూర్వం వరాహ కల్పంలో నీ తలల్లో ఒకదానిని నేను సంహరించాను. అప్పుడు నీకు నాలుగు తలలే మిగిలాయి. అవి ఎన్నడూ సశించవు. ఈ సాన్నిహిత్య తీర్థంలో భక్తితో నా లింగ స్థాపన చేసిన సర్వపాపాల నుండి ముక్తుడవు కాగలవు. ప్రాచీన సమయాన సృష్టిచేయు కోర్కెతో నీవు నన్ను ప్రేరేపించగా నే నట్లేయని సంనిహిత సరస్సులో మునిగి చిరజాలం తపస్సు గావించగా నీవు నా కొరకు చాలాకాలం ప్రతీక్షించావు. అంతట నీవు సంకల్ప మాత్రానపుట్టించిన సృష్ఠికర్త నీతో నన్ను తాను నీళ్ళలో మునిగి ఉండగా చూచానని చెప్పాడు. తన కన్న పెద్దవారు లేనిచో తాను ప్రజాసృష్టి చేస్తాననగా అప్పుడు నీ వాతనితో నీ కన్న జ్యేష్ఠులెవరులేరు. యిక్కడ స్థాణువు విధిలేక నీళ్ళలోబడి యున్నాడు. కనుక నీవు నాకు హితం చేయవలెనని కోరావు. అంతనతడు సకల జీవరాసులను దక్షుడు మొదలగు ప్రజాపతులను సృష్టింపగా వారు జీవులనందరను నాలుగు విధాల విభజించారు. అలా సృష్టించబడిన వెంటనే ఆ ప్రజలంతా ఆకటితో అలమటిస్తూ ప్రజాపతిని భక్షింప పరుగిడినారు. ఆ ప్రజాపతి తన ప్రాణం కాపాడుకొనుటకై పితామహుని వద్దకు పరుగుతీసి ఈ జీవరాసుల జీవిత విధానాన్ని నిర్ణమించమని కోరాడు. అప్పుడు నీవు వారలకు భోజిక్ష విధానం ఏర్పాటు చేశావు. స్థావర జీవాలకు మహౌషధులను భోజనంగా చేశావు. జంగమ జీవులందరకు, వారిలో బలవంతులకు దుర్బలులను తిండిగా నియమించావు. ఈవిధంగా తమ తమ అన్నవిధానమును తెలిసికొని ఆ వచ్చిన వారంతా తమ తమ చోట్లకు తిరిగి వెళ్ళారు. అప్పటి నుంచీ జీవులంతా పరస్పరం ప్రేమతో వర్ధిల్లారు. అలా సృష్టి వృద్ధిబొందటం చూచి లోకగురువైన నీపు సంతోషించితివి. అంతట నేను జల మధ్యంనుండి బయటకువచ్చి ఆ ప్రజలను చూచి నా తేజస్సుతో వారిని నింపాను. తీవ్రమైన కోపంతో నా లింగాన్ని పెరికి సరస్సుమధ్య విసరివేశాను. అది నీటిలో పైకినిటారుగా నిలబడటంతో అప్పటి నుండి స్థాణులింగంగా విఖ్యాతమైంది. దానిని సకృత్తుగా చూచినంతనే అన్ని కిల్బిషాలు తొలగిపోతాయి. పునరావృత్తిలేని మోక్షం ప్రాప్తిస్తుంది. ఈ తీర్థంలో కృష్ణపక్షఅష్టమిరోజున నిర్మల చిత్తంతో నివసించినవాడు పరదారగమన గురుతల్పగతాది సకల పాపాలను నుండీ మక్తుడౌతాడని ఆజ్ఞాపించి ఆ మహాదేవుడక్కడనే అంతర్హితుడైనాడు.
అంతట పాపముక్తుడైన బ్రహ్మ చతుర్ముఖ భవుని పూజించి ఆ దేవదేవుని లింగాలను సరోవరం మధ్యన ప్రతిష్ఠించెను. అందులో మొదటిది హరి పార్శ్వాన ప్రతిష్ఠించబడిన మహాపుణ్య లింగం బ్రహ్మసరము. రెండవది తన ఆశ్రమంలోనే నెలకొల్పిన బ్రహ్మసదనం. దానికి తూర్పుగా మూడవ లింగం ప్రతిష్ఠించాడు. నాల్గవదైన బ్రహ్మలింగం సరస్వతీ తీరాన స్థాపించాడు. ఈ నాలుగు బ్రహ్మతీర్థాలు పరమ పవిత్రాలు. వీనిని ఉపవసించి దర్శించిన వారికి పరమగతి లభిస్తుంది. కృతయుగంలో హరి పార్శ్వంలో ఉన్న లింగాన్ని, త్రేతాయుగంలో బ్రహ్మ ఆశ్రమంలోని లింగాన్ని ద్వాపరంలో దానికి తూర్పున ఉన్నదానిని, కలియుగంలో సరస్వతి ఒడ్డునఉన్న లింగాన్ని భక్తితో దర్శించి అర్చిస్తే సర్వపాపాలు తొలగి పరమగతి లభిస్తుంది. సృష్ట్యాదిలో భగవంతుడు సరస్వతి ఉత్తర తీరాన పూజించిన మహేశ్వర లింగానికి చతుర్ముఖ లింగమని పేరు. దానికి శ్రద్ధాభక్తులతో నమస్కరిస్తే సర్వపాప పరిహారం కలుగుతుంది. కామ పశు ప్రవృత్తితో కావించిన వర్ణాంతర సంగమ దోషాలు, దూషితాన్నం భుజించిన పాపాలు నశిస్తాయి. అలాగే ద్వాపరంలో శంకరుని ఆయన ఆశ్రమంలోనే పూజిస్తే రజోగుణ సముద్భూతాలయిన వర్ణ సంకర దోషాలు తొలగిపోతాయి. ఇక ప్రతి కృష్ణపక్ష చతుర్ధశి (మాసశివరాత్రి) నాడు ఆ స్వామిని పూజించినచో అభోజ్యాన్న (తినరాని తిండ్లుతిన్న) సంభవాలైన పాపాలు నశిస్తాయి. కలియుగంలో వసిష్ఠాశ్రమంలో ఉంటూ చతుర్ముఖ లింగాన్ని స్థాపించి సర్వోత్తమ సిద్ధిపొందెను. అందుననూ శ్రద్ధాభక్తులతో నిరాహారులై జితేంద్రియలై ఆ మహాదేవుని పూజించు వారలు పరమపదవిని పొందుతారు. ఏ మాత్రము సంశయం లేదు. ఈ విధంగా మీకు మాహాత్మ్యం సమగ్రంగా వివరించాను. దీనిని విన్నమానవుడు సకల పాపములు తొలగి ముక్తి పొందుతాడు.
అధ్యాయము 28 Complete
సరో మహాత్మ్యం సహిత
శ్రీ వామన మహా పురాణం సర్వమూ సమాప్తము
