వామన మహా పురాణము లోని సరో మహాత్మ్యము

అధ్యాయము 12

బుద్ధిమంతుడగు మార్కండేయుని మాట విని సరస్వతి ప్రవాహరూపంతో కురుక్షేత్రంలో ప్రవేశించింది. ఆ పుణ్యసలిల రంతుకం చేరి కురుక్షేత్రాన్ని తడుపుతూ పశ్చిమ దిశగా మళ్ళింది. అక్కడ మహర్షి సేవితాలయిన వేయి తీర్థాలున్నవి. పరమేష్ఠి కృపవల్ల వాటిని వర్ణిస్తాను వినండి. పవిత్ర తీర్థాలను స్మరిస్తే పుణ్యం చూస్తే పాపక్షయం, స్నానం చేస్తే పరమ దుశ్చేష్టితులకు గూడ ముక్తి కలుగుతాయి. ఎవరు తీర్థాలను స్మరిస్తారో అచట దేవా ప్రీతికరాలయిన కార్యాలు చేస్తారో స్నానాలు చేస్తారో వాని పట్ల శ్రద్ధ గలిగి ఉంటారో వారంతా ఉత్తమ గతులను పొందుతారు. అపవిత్రుడైన పవిత్రుడైనా, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే కురుక్షేత్రాన్ని స్మరించినంతనే మానవునకు బాహ్య అంతరశుచిత్వం కలుగుతుంది. ఇంతే కాదు. నేను కురుక్షేత్రం వెళ్తాను. అక్కడ నివాసం చేస్తాను. అనునోటపలికినంత మాత్రాన్నే పాపక్షయం కలుగుతుంది. బ్రహ్మజ్ఞానం, గయాశ్రాద్ధం, గోగ్రహంలో మరణం, కురుక్షేత్రవాసం వల్ల నాలుగు విధాల ముక్తులు చెప్పబడినవి. సరస్వతీ దృషస్వతీ ఈ రెండు దేవనదుల మధ్యగల భూమి దేవనిర్మితమైంది. దానిని బ్రహావర్తమంటారు. దూరాన ఉంటూ కూడ నేను కురుక్షేత్రం వెళ్తాను. అక్కడ ఉంటాను. అని నిరంతరం అంటూ ఉండే వాని సర్వ పాపాలు పోతాయి. అచట సరస్సులో స్నానం చేస్తూ సరస్వతీ తీరాన ఉండే వారికి బ్రహ్మ జ్ఞానం కలుగుటలో సందేహం లేదు.

దేవతలు, ఋషులు, సిద్ధులు కురుజాంగలాన్ని సదాసేవిస్తారు. ఆ కారణాన వారు బ్రహ్మను తమలోనే చూడగలుగుతున్నారు. క్షణ భంగురమైన మానవజీవితాన్ని పొంది, మోక్షమును కోరువారు జితేంద్రియులై ఈ క్షేత్రాన్ని సేవిస్తారు. ఎంతటి దురాచారులైననూసరే అనేక జన్మార్జితాలయిన పాపాలనుంచి ముక్తులై తమహృదయాల్లో ఆ పవిత్ర బ్రహ్మతత్వాన్ని చూడగలుగుతారు. నిత్యమూ బ్రహ్మదేవుని కురుక్షేత్రాన్ని సన్నిహిత సరోవరాన్ని భజించే మానవులు పరమపదప్రాప్తి పొందుతారు. గ్రహ నక్షత్ర తారలకైనా కాలంతీరిన తర్వాత పతనం పొందుతామనే భయం ఉండవచ్చు గాని కురుక్షేత్రంలో మరణించువారలకు అలాంటి భయం ఉండదు. బ్రహ్మ మొదలగు దేవతలు ఋషులు సిద్ధులు యక్షులు గంధర్వాప్సరసాదులు తమ తమ పదవులు నిలబెట్టుకొనుటకు ఆ క్షేత్రాన్ని సేవిస్తారు. అక్కడకు వెళ్లి శ్రద్ధతో స్థాణుసరోవరంలో స్నానంచేస్తే మనస్సులోని కోరికలన్నీ సిద్ధిస్తాయి. సందేహం లేదు. వ్రతనిష్ఠతో ఆ సరోవరానికి ప్రదక్షిణం చేసి, రంతుకానికి వెళ్లి మరల మరల క్షమాయాచన చేస్తూ సరస్వతి నదిలో స్నానం చేసి యక్షుని దర్శించి ధూప దీపపుష్పనైవేద్యాదులతో పూజించి ఓ యక్షేంద్రా! నీ అనుగ్రహం వల్లనే నేను తలపెట్టిన ఈ తీర్థ అరణ్య సరోవరాల పర్యటనం నిర్విఘ్నంగా నేరవేరుగాక, అని ప్రార్థించవలెను.

అధ్యాయము 12 complete