వామన మహా పురాణము లోని సరో మహాత్మ్యము

అధ్యాయము 8

ఓ విప్రులారా ! తన వారావిధంగా తెజోహీనులగుటచూచి రాక్షసేశ్వరుడైన బలి తన తాతయైన ప్రహ్లాదుని యిలా ప్రశ్నించాడు.

పితామహా! మనవారలైన దైత్యులందరు అగ్నిదగ్ధులయినట్లు తేజస్సు కోల్పోయినారు. ఆకస్మికంగా మనవారు బ్రహ్మదండ తాడితులయినారా ఏమి? అది వారలదురదృష్టమా లేక దైత్యవంశ నాశనానికి విధి ప్రయోగించిన అభిచారకృత్యా ప్రయోగమా ? ఇందులకు కారణమేమి?

బ్రాహ్మణులారా ! మనుమడువేసిన ప్రశ్నవిని ప్రహ్లాదుడు బాగా ఆలోచించి అతనితో నిట్లనియెను.

కొండలు కదలాడుతున్నవి. భూమి తన స్థైర్యాన్ని కోలుపోతున్నది. ఉన్నట్టుండి సాగరాలు క్షోభిస్తున్నాయి. దైత్యులు నిస్తేజితులవుతున్నారు. సూర్యోదయ సమయాన ఎప్పటిమాదిరి గ్రహాలు తమ తమ కక్ష్యలలో నడవడంలేదు. చూడగా యిది దేవతలకభ్యుదయ కాలమనిపిస్తోంది. ఈ ఉత్పాతాలకు ఏదో పెద్ద కారణమే ఉండాలి. దీనిని మనం తేలికగా త్రోసివేయకూడదు.

దానవేశ్వరుడగు బలితో ఇలా చెప్పి అసురోత్తముడగు ప్రహ్లాదుడు ఏకాగ్రచిత్తముతో మనోజగత్తులో శ్రీహరిని వెదకనారంభించాడు. అలా ధ్యాన పరుడైన ఆ ప్రహ్లాదునకు అదితి గర్భస్థుడై వామనాకృతిలోనున్న బాలుడు కనిపించెను. ఆ చిన్న శిశువులో వశువులు, రుద్రాశ్వినులు, మరుత్తులు, సాధ్యులు, విశ్వేదేవులు ఆదిత్యులు గంధర్వోరగ రాక్షసులు, విరోచనుడు ఆయన కుమారుడు బలి, జంభ కుజంభ నరకబాణాది అన్య రాక్షసులు, తనతోబాటు పంచభూతాలు సాగర సరిద్ ద్వీప సరోవరాలు నరమృగ పక్ష్యాదులు సరీసృపాదులతో కూడిన భూమండలం, విధాతయైన బ్రహ్మ, భవుడు గ్రహనక్షత్రాది జ్యోతిర్మండలం దక్షాది ప్రజాపతులు మొదలు సమస్త విశ్వాన్ని చూచి ఆశ్చర్యచకితుడై వెంటనే ప్రకృతిస్థుడై ఆ ప్రహ్లాదుడు దైత్యరాజు బలితో యిలా అన్నాడు. రాజా! నీవు మీ వారలు తేజోహీనులగుటకు కారణం నేను తెలుసుకున్నాను. దానిని సాకల్యంగా వినుము.

అయోని, జగద్యోని, దేవదేవుడు, జగత్తుకు ముందు పుట్టినవాడు మొదలులేనివాడు, విశ్వానికి మొదలయినవాడు వరదాతలలో శ్రేష్టుడు శ్రీహరి, పరావరేశ్వరుడు అందరకు పరమగతియగువాడు, సమస్తమైనమానం (కొలత)లకు ప్రమాణం ఈరేడు లోకాధిపతులకు అధిపతి అయిన ఆ జగన్నాథుడు ఊహకందని ప్రభువు విశ్వస్థితి (వ్యవస్థ)నుద్ధరించుటకై సామాన్యునివలె గర్భస్థుడైనాడు! ప్రభువులకు ప్రభువు, పరములకు పరముడు తుద నడిమి చివర అంటూలేని భగవంతుడు, తన కలాంశతో ముల్లోకాలను సనాధం చేయుటకై అదితి గర్భంలో అవతరించాడు! ఓ దైత్యపతీ : రుద్రుడు బ్రహ్మ యింద్రుడు సూర్య చంద్ర మరీచ్యాదులు ఏ అప్రమేయుని స్వరూపం తెలియజాలకున్నారో ఆ వాసుదేవుడు తన అంశతో అవతరించాడు. వేదవిదులెవ్వని నాశరహితుడని చెప్పుదురో, జ్ఞానాగ్నిదగ్ధపాపులెవనిలో లయమందుందురో , ఎవనిలో లయించిన వారు మరల జన్మించరో అట్టివాసుదేవపరమాత్మకు ప్రణామములు. అనంతమైన జీవరాసులెవనినుండి సముద్రంలోలేచే కెరటాలులాగా నిరంతరం ఉద్భవిస్తూ ఉంటాయో, మరల యేదివ్యతత్తంలో అవన్నీ లయమైపోవునో అట్టిఅచింత్య స్వభావుడగు వాసుదేవునకు ప్రణామాలు. ఎవడు కన్నులకు రూపగ్రహణశక్తిని చర్మమునకు స్పర్శశక్తి, నాలుకకు రసగ్రాహిత్వం ముక్కుకు వాసనచూచుశక్తినీ ప్రదానం చేస్తూ తాను ఆ ఘ్రాణ చక్షుః శ్రవణాలు లేకుండా ఉంటాడో పరమార్థదృష్టితో చూస్తే ఎవడు స్వయంప్రకాశియో, సర్వేశ్వరుడో, యుక్తిచేత తెలియదగిన శరణ్యుడోపాపరహితుడో అట్టి పూజనీయుడగు శ్రీహరికి పరమ ప్రభువుకు నమస్కరించుచున్నాను. ఏ శక్తి సంపన్నుడీభూమినంతనూ ఒక్కపంటితో ఎత్తినాడో, సకలసృష్టినీ ధరించుచున్నాడో, మరల ఈ జగత్తునంతనూ తనలోకి చేర్చుకొని యోగనిద్రలో ఉంటాడో అట్టిపూజ్యుడగు విష్ణుదేవునకు ప్రణామం చేస్తున్నాను. మాతృగర్భంలో కలాంశతో ప్రవేశించిన మాత్రాన్నే మహాదైత్యయోధుల తేజస్సునంతటినీ ఎవడు హరించివైచెనో, అట్టి అనంతునకు ఈశ్వరునకు సంసారవృక్షాన్ని చేధించే కుఠారరూపి అయిన ప్రభువుకు నమస్సులు. ఓ రాక్షసేంద్రులారా! అలాంటి జగత్ప్రభుడైన దేవదేవుడు తన పదునారవ కలాంశతో దేవమాత అదితి గర్భగతుడైనాడు. అతడే మీ తేజోబలాలను హరించియున్నాడు.

తాతా! మనకు భయోత్పాతకుడైన ఆ హరి ఇంతకూ ఎవడు ? ఆ వాసుదేవుని మించిన బలాఢ్యులు నా వద్ద ఎందరో ఉన్నారు. విప్రచిత్తి, శిబి, శంకు అయఃశంకు, అశ్వశిరుడు, హయశిరుడు, భంగకారుడు, మహాహనువు, ప్రతాపి, ప్రఘసుడు, శంభువు కుక్కురాక్షుడు దుర్జయుడు యింకా ఎందరెందరో మొనగాళ్ళు దైత్యదానవులున్నారు. వీరందరు మహాబలవీర్య సంపన్నులు భూమిభారాన్నంత మోయ సమర్థులు. వీరిలో ఏ ఒక్కరి సగం బలానికి గూడ కృష్ణుడు సరిపోలడు.

మనుమడి మాటలు వింటూనే దైత్యసత్తముడు ప్రహ్లాదుడా వైకుంఠపతిని దూషిస్తున్న బలిని చురచుర చూస్తూ యిలా గర్జించాడు. దైత్యదానవులకు వినాశకాలం సమీపించినది. కనుకనే నీకీ విపరీత బుద్ధి దాపురించినది. నీ వంటి పాప సంకల్పుడైన రాజనామధారి తప్ప ఆదేవ దేవుని, జగద్విభుని, ఆజుడు మహాభాగుడగు వాసుదేవుని గూర్చి యిలాంటి వాక్యాలు, మరెవ్వడూ నోట రానీయడు. నీవు చెప్పుకున్న ఈ దైత్య దానవులు, బ్రహ్మాది దేవతలు, జంగమ స్థావరాంతాలైనవిభూతులు, నీవు, నేను, గిరివననదీ సముద్ర ద్వీపాదులతో కూడిన చరాచర జగత్తంతయూ, ఆ విశ్వవంద్యుడూ సర్వవ్యాపీ అయిన పరమాత్మ యొక్క అల్పాంశం నుండి ప్రభవించినది. నీవు తప్ప ఆ దేవదేవుని గురించి యిలా ఎవడు మాటాడగలడు ? సర్వనాశనం దిశగా పరుగిడుతున్న అవివేకిని దుర్భుద్ధివీ, అహంకారివీ, గురుజనశాసనాతిక్రముడవునగు నీవు మాత్రమే ఇలా ప్రేలదగియున్నావు! నేనెంత దౌర్భాగ్యుడను! నీవంటి దేవావమానిని కన్న అధమునకు తండ్రిననిపించుకున్నాను. అనంతమైన సంసారపాశ సంఘాలను తెగటార్చే కృష్ణుని పట్ల భక్తి విషయం అలా వదలి వేద్దాం. నాపట్లనైనా నీకు కించిత్తు గౌరవం ఉండవద్దా: నాయీ దేహం కన్నా నాకు కృష్ణుడే ప్రియుడనే విషయం లోకమంతా ఎరుగును, నీకు గూడ తెలుసు. శ్రీహరి నాకు ప్రాణాలకంటే ఎక్కువన్న విషయం తెలిసి కూడ నా పెద్దరికాన్ని మంటగలిపి ఆ మహనీయుని నిందించావు. ఓ బలీ! రాక్షసా! విరోచనుడు నీకు గురువు. వానికి తండ్రి అయిన నేను గురువును. జగత్తుకంతకూ గురుడైన ఆ నారాయణుడు అలాంటి నాకు గురువు. అలాంటి సర్వగురువులకు గురులైన హరిని నీవు నిందించావు. కాబట్టి నీ వైశ్యర్య పదవినుంచి భ్రంశం పొందుతావు! బలిరాజా! ఆ జనార్ధనుడు సర్వ లోకాధినాదుడు నేను నీకు గురువును కనుక, నీవునన్నవమానించరాదు. ఈ మర్యాదలనన్నింటినీ కాలదన్ని ఆ జగద్గురువును నిందించిన నీవు శాపార్హుడవు. నీవాడిననిందా వాక్యాలు నాకు తలగొట్టిన దానికన్నా ఎక్కువ అవమానకారణాలు. కాబట్టి నీవు రాజ్య భ్రష్టుడవై పతనం పొందగలవని యిదిగో శపిస్తున్నాను. ఈ సంసారసముద్రం దాటడానికి కృష్ణుని మించిన నావలేదు. ఇక నేను అచిరకాలాన్నే నీవు రాజ్యాన్ని కోలుపోవుట చూడగలను.

అధ్యాయము 8 complete