వామన మహా పురాణము లోని సరో మహాత్మ్యము
అధ్యాయము 3
మహర్షే పరాజయం పొందిన దేవతలాతర్వాత ఏం చేశారు? దేవాదిదేవుడైన విష్ణువు ఎలా వామన రూపం ధరించాడు?
ముల్లోకాలు బలికి స్వాధీనం కావడంతో ఇంద్రుడు తన మాతృస్థానమైన చక్కని మేరుగిరికి వెళ్లి తన తల్లి అయిన అదితితో సంగ్రామ భూమిలో దానవులచేత ఆదిత్యులంతా నిర్జింపబడిన వృత్తాంతం వివరించాడు.
పుత్రా! మరుద్గణాల సహాయంతో కూడ నీవు విరోచనసుతుడు బలిని జయించలేనంటివి. అట్టిచో విష్ణువొకడు తప్ప వేరెవ్వరూ ఆతనిని జయించలేరు. కనుక మనం మీ తండ్రి బ్రహ్మజ్ఞుడైన కశ్యపుని వద్దకువెళ్లి బలిదైత్యుని పరాభవించునుపాయం అడుగుదము. పద. అంతటనాదేవతలు అదితితో గూడి కశ్యపుడుండు చోటికి వెళ్లి అచట పరమతపోనిధి మరీచ పుత్రుడు ఆద్యదేవ గురుడు దివ్యబ్రాహ్మ వర్చస్వి, రెండవ భాస్కరునివలె, అగ్నిశిఖవలె తేజరిల్లుచూ ఉన్న ఆ మహనీయుని దర్శించారు. ఆ తపస్వి దండం, కృష్ణాజినాంబరం, వల్కలాజినం ధరించి ఆజ్యగంధయుక్తమైన హోమాగ్నిలా స్వాధ్యాయనిరతుడై యున్నాడు. అతడు బ్రహ్మవాదులు సత్యవాదులగు సురాసురులకు గురువు, అప్రతిమానమైన బ్రహ్మతేజంతో వెలిగిపోతున్నాడు. సర్వలోకస్రష్ట ప్రజాపతులలోనుత్తముడు. అలాంటి కశ్యప బ్రహ్మను దర్శించి ఆదిత్యులతో కూడిన ఆ దేవవీరులంతా, బ్రహ్మమానస పుత్రులు బ్రహ్మకువలెనమస్కరించి అంజలి ఘటించి ఇలా విన్నవించారు. యుద్ధంలో బలి దైత్యుడింద్రునకజేయుడై యున్నాడు. ఈ సంకట సమయంలో దేవతల శ్రేయస్సుకు పుష్టివృద్ధికి తగిన ప్రయత్నం చేయండి. తన పుత్రుల దీనవచనాలు విని కశ్యపుడు, విధాతను దర్శించుటకై బ్రహ్మలోకానికి వెళ్ళ నిశ్చయించుకున్నాడు.
దేవరాజా! మనమందరమిప్పుడు పరమాద్భుతమైన బ్రహ్మ సదనానికి వెళ్లి ఆయనకీపరాజయగాథను తెలుపుదము. అంతట కశ్యపాశ్రమమునకువెళ్ళిన దేవతలందరు నచట నుండి మహర్షి గణాల చేత కొలవబడుతున్న బ్రహ్మ నెలవుకు బయలుదేరారు. ఆ మహాబలులందరు కామగమనం కలిగిన దివ్యయానాల మీద నెక్కి త్రుటికాలంలో తేజోమయమైన బ్రహ్మలోకాన్ని చేరుకున్నారు. అవ్యయుడు తపోరాశి అయిన బ్రహ్మను దర్శించే కుతూహలంతో వారు, సువిశాలమైన సామగానంతో, భ్రమరఝుంకారాలతో ప్రతిధ్వనిస్తూ శ్రేయాలొనగూర్చి శత్రునాశనం చేయగల మనోహరమైన ఆ బ్రహ్మ సభను చూచి పరమానందం పొందారు. బహ్వృచ ప్రముఖులచేత, క్రమపాదాక్షర సమన్వితంగా, ఆయా సంబద్ధ క్రతువుల కనుగుణంగా చదువబడే ఋగ్వేద మంత్రములనా విబుధవర్యులు ఆలకించిరి. యజ్ఞప్రశంసతో బాటు శిక్షాస్త్రంలో పారీణులయిన ద్విజులయు, వేదార్థం తెలిసినవారు సర్వవిద్యాకోవిదులు లౌకిక విద్యల్లో గూడ ప్రవీణులగు వారల ప్రవచనాలను ఆ పుణ్యవ్రతులయిన దేవతలు తత్తత్ప్రదేశాలలో వినగాలిగారు. జపహోమనిరతులైన ఆ కశ్యపకుమారులు(దేవతలు) ఆ సభా మధ్యంలో శ్రీమంతుడు సురాసురగురుడు లోకపితామహుడునైన బ్రహ్మను చూచారు. ప్రజాపతులందరు ఆయనను ఉపాసిస్తున్నారు. దక్షుడు, ప్రచేతసులు, పులహమరీచులు, భ్రుగువు, అత్రి, వశిష్టుడు, గౌతమనారదులు మొదలయిన బ్రహ్మణ్యులు, విద్యలు, అంతరిక్షం, వాయువు తేజం నీరు భూమి శబ్ద స్పర్శ రూపరసగంధాలు ప్రకృతి వికృతులు, మహత్తు, కారణం, సాంగోపాంగాలయిన నాలుగువేదాలు, నయ, క్రతు, సంకల్ప ప్రాణాలు అన్నీ దేహం ధరించి ఆ బ్రహ్మనుపాసిస్తున్నారు. వీరేగాక యింకా ఎందరెందరో ఆ మహనీయుని ఆరాధిస్తున్నారు.
అర్థధర్మకామాలు, క్రోధహర్షాలు, శుక్రబృహస్పతి సంవర్త బుధశనైశ్చర రాహు మొదలయిన సర్వగ్రహాలు ఆయనను సేవిస్తున్నారు. బ్రహ్మ విదులయిన మరుత్తులు, విశ్వకర్మ, వసువులు, సూర్యచంద్రులు, దివారాత్రులు, పక్షాలు, మాసాలు, షడ్రుతువులు సేవిస్తూ ఉండగా సర్వకామ్యాలు సమకూర్చే ఆ దివ్యసభలోనికి కశ్యపుడు తన సుతులగు దేవతలందరతో కలిసి ప్రవేశించాడు. బ్రహ్మర్షి సమూహంతో సేవించబడుతూ, బ్రాహ్మిశ్రీ (లక్ష్మీ)లు సంభావించగా మనస్సున కాహ్లాదం గొలిపే ఆ పేరోలగంలో ఉత్తమోత్తమమైన ఆసనం మీద కూర్చున్న ఆ బ్రహ్మ దేవునకు బ్రహ్మర్షులతో సహా అందరు తలలు వంచి ప్రణామాలు చేశారు. అలా ఆ పరమాత్మకు నమస్కరించి పాపరహితులు, కల్మషదూరులునైన ఆ సురలు స్వస్థచిత్తులై నిలువబడిరి. దేవా ప్రముఖుడైన కశ్యపునితో కూడి ఏతెంచిన ఆ దేవ సమూహాన్ని చూచి దేవేశ్వరుడగు విరించి యిలా అన్నాడు.
అధ్యాయము 3 complete
