వామన మహా పురాణము లోని సరో మహాత్మ్యము
అధ్యాయము 13
పౌరాణిక శ్రేష్టా! మాకిప్పుడు సప్తవనాలు, నవనదులు తీర్థాలు వానిలో స్నానం చేస్తే వచ్చే ఫలం, ఏ ఏ తీర్థాలను ఏ ఏ విధాన సేవిస్తే యేయే ఫలం కలుగుతుందో ఆ వివరమంతా చెప్పండి.
ఓ ఋషులారా! కురుక్షేత్ర మధ్య భూమిలో ఏడువనాలున్నవి. వాటి పేర్లు పవిత్రాలు. అవి సర్వపాపాలను హరిస్తాయి. పవిత్రమైన కామ్యకవనం, అదితివనం, వ్యాసవనం, ఫలకీవనం, సూర్యవనం, మధువనం, శీతవనం యివన్నీ సర్వకల్మషాలను హరిస్తాయి. యిక నదుల వివరం వినండి. సరస్వతి, వైతరణి, ఆపగా, గంగ, మధుస్రవ, వాసు, కౌశికి, దృషద్వతి, హిరణ్యవతి ఈ నవనదులు పరమ పవిత్రాలు సకల పాపనాశకాలు. వీనిలో సరస్వతి తప్ప మిగిలినవన్నీ వర్షాకాలంలో ప్రవహిస్తాయి. వర్షాకాలంలో గూడ వీటి ఉదకానికి రజస్వల దోషమంటదు. అవి పవిత్రమైన జలాలు. అందుకు కారణం అక్కడ ఉన్న పున్యతీర్తాలే సుమా!
మునులారా! యిక ప్రేమతో మహిమాన్వితమైన తీర్థ స్నాన ఫలం వినండి. వానిని స్మరించినా లేక సమీపించినా సర్వకల్మషాలు నశిస్తాయి. మొదల యాత్రికుడు రంతుకానికి వెళ్లి మహాబలుడైన ద్వారపాలకుడు యక్షునకు మ్రొక్కి తీర్థయాత్ర ప్రారంభించాలి. అక్కడ నుంచి అదితివనానికి వెళ్ళాలి. అక్కడ ఆ దేవమాత కఠోరమైన తపస్సుచేసి వామనుని పుత్రునిగా పొందింది. అచట స్నానం చేసి అదితి దర్శనం చేసినచో, సర్వదోష రహితుడు, శూరుడు శతసూర్యకాంతి గల విమానం మీద తిరుగునట్టి పుత్రుడు కలుగును. అక్కడ నుంచి సవనమనే ప్రసిద్ధి చెందిన విష్ణుస్థానానికి వెళ్ళాలి. అక్కడ ఎల్లవేళల హరి సన్నిహితుడై యుంటాడు. అక్కణ్ణుంచి విమల తీర్థంలో మునిగి విమలేశ్వరుని దర్శించినచో నిర్మలమైన స్వర్గం రుద్రలోకం పొందవచ్చు. శ్రీహరిని బలరాముని ఒకే చోట అసీనులగుట చూచినచో కలిదోషాలు వదలి ముక్తి పొందవచ్చును. అచట నుంచి ముల్లోకాలలో విఖ్యాతి గాంచిన పరిప్లవ తీర్థానికి వెళ్లి స్నానం చేసి వేదాలచే పరివేష్టితుడైన బ్రహ్మదేవుని దర్శించాలి. బ్రహ్మ వేదాల అనుగ్రహం వల్ల పవిత్రమైన స్వర్గం పొందవచ్చును. అచట నుండి కౌశికి సంభవ తీర్థంలో సంగమం అయ్యేచోట, సంగమ జలాల్లో స్నానం చేస్తే మానవుడు పరమపదాన్ని పొందుతాడు. తర్వాత పాపాలు పోగొట్టే ధరణి తీర్థంలో మునిగినచో నరుడుక్షాంతి కలవాడై ఉత్తమ పదం పొందుతాడు. ఆ తీర్థంలో స్నానం చేసినంతనే ఆ ధరణి మాత ప్రాణుల సర్వాపరాధాలు క్షమిస్తుంది, అక్కణ్ణుంచి దక్షాశ్రమంలో దక్షేశ్వర మహాదేవుని దర్శిస్తే అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని నరుడు పొందుతాడు. తర్వాత శాలూకినీ తీర్థంలో స్నానం చేసి అచట వేంచేసిన హరిహరులను భక్తితో పూజిస్తే పాపరహితులై యిష్టమైన లోకాలను పొందుతారు. అచట నుంచి సర్పిర్దధి అనే ప్రసిద్ధమైన నాగతీర్థంలో మునిగినచో సర్ప విషభయాలుండవు. విప్రోత్తములారా! అచట నుంచి రంతుక ద్వారపాలుని వద్దకు వెళ్లి ఒక రాత్రి గడిపి ఆ పవిత్ర తీర్థంలో స్నానం చేసి జాగ్రత్తగా రెండవ ద్వారపాలుని పూజించాలి. తర్వాత బ్రాహ్మణులను భుజింపజేసి ద్వారపాలునకు మ్రొక్కి యక్షేశ్వరా! నా అపరాధాలు క్షమించుము. నీ ప్రసాదం వల్ల సర్వకిల్బిషాలు తొలగి నేను కోరిన సిద్ధి లభించునట్లొనరింపుమని అతనిని ప్రసన్నుని గావించుకొనవలెను. అక్కడనుంచి రాక్షసులకు భయంకరంగా, రుద్రుని చేత నిలుపబడిన అయిదు సరస్సుల పంచనద తీర్థంగా లోక ప్రసిద్ధి గాంచిన తీర్థానికి వెళ్ళాలి. అక్కడ త్రిలోకఖ్యాతి పొందిన కోటి తీర్థం ఉంది. రుద్రుడు కోటి తీర్థాలను అచట సమావేశపరిచాడు. ఆ పవిత్రతీర్థంలో స్నానం చేసి కోటీశ్వర మహాదేవుని దర్శించినచో అయిదు యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుంది.
అచటనే సర్వదేవతలచే ప్రతిష్ఠింపబడిన వామనదేవుని సన్నిధిలో స్నానంచేసి మానవుడు అగ్నిష్టోమ యజ్ఞఫలం పొందగలడు. జితేంద్రియుడు శ్రద్ధాన్వితుడునగువాడు అశ్వినితీర్థం సేవించి రోపసంపదను యశస్సును పొందగలడు. విష్ణువుచే కీర్తింపబడిన వారాహతీర్థంలో మునిగి శ్రద్ధాళువు పరమపదాన్ని పొందుతాడు. బ్రాహ్మణోత్తములారా! అక్కడ నుంచి పవిత్రమైన సోమతీర్థం వెళ్ళాలి. అచటనే చంద్రుడు తపస్సు చేసి రోగవిముక్తుడయ్యాడు. అచటి తీర్థంలో మునిగి సోమేశ్వర స్వామి దర్శనం చేసినవారలు రాజసూయ యాగఫలం పొందుతారు. వారల వ్యాధులు సర్వదోశాలు తొలగి చిరకాలం చంద్రలోకంలో నివసిస్తారు. అక్కడే ఉన్న భూతేశ్వర, జ్వాలామాలేశ్వరుల లింగాలను అర్చించిన వారికి పునర్జన్మ ఉండదు. ఏకహంస తీర్థంలో మునిగిన వారలకు వేయిగోవుల దానమిచ్చినఫలం కలుగును. అచటనుండి వెళ్లి కృతశౌచ క్షేత్రంలో తీర్థసేవచేసి నరుడు శుచియై పుండరీక యజ్ఞఫలం పొందుతాడు. ఆటనుండి ముంజవట తీర్థంలో ముంజవటేశ్వరుని అర్చించి, ఒక రాత్రి ఉపవసించినచో గాణపత్యము ప్రాప్తించును. అచటనే మహాగ్రాహి యక్షిణి తీర్థమున్నది. అచట స్నానం ఉపవాసంచేసి యక్షిణీ దేవతను ప్రసన్నురాలిని గావించుకొనుచో ఘోరపాపాలన్నీ నశించును. ఆ ప్రదేశం కురుక్షేత్రం యొక్క పుణ్యవర్ధక ద్వారంగా ప్రసిద్ధిచెందింది. దానికి ప్రదక్షిణం చేసి బ్రాహ్మణ సమారాధన చేయాలి. అటనుండి జమదగ్నిపుత్రుడు పరశురాముడు ప్రతిష్టించిన పుష్కరతీర్థంలో పితృదేవతలనర్చించినరాజు ఆశ్వమేధఫలం పొంది ధన్యుడౌతాడు. అచ్చోట కార్తీకమాసంలో కన్యాదానం చేసిన వానిని ప్రసన్నులై దేవతలు కోర్కెలన్నీ సిద్ధింపజేస్తారు. అచట నుండు ద్వారపాలుడు, కపిలుడనే మహాయక్షుడు, పాపులకు విఘ్నాలు కలిగించి వేదిస్తాడు. ఉదూఖలమేఖల అనే అతని భార్య మహాయక్షిణి ఎల్లప్పుడు దుందుభిని మ్రోగిస్తూ యిలా అన్నది. యుగంధర తీర్థంలో పెరుగుతిని, అచ్యుత తీర్థంలో ఉపవాసం చేసి, అట్లేభూతాలయ తీర్థంలో స్నానం చేస్తే ణీ కొడుకుతో జీవించగలవు. ఈ విషయం నీకు పగటివేళ చెప్పుచున్నాను. రాత్రికాగానే నిన్ను తప్పక భక్షిస్తాను. ఆ మాటలకు భయపడి ఆ స్త్రీ దీనస్వరంతో నన్నేలాగయినా కాపాడుమని వేడుకొనగా దయతలచి ఆ యక్షిణి ఉపాయం చెప్పింది. సూర్యగ్రహణ సమయంలో ఎప్పుడైనా యిచటి సన్నిహితతీర్థంలో మునిగినచో పవిత్రురాలవై స్వర్గానికి పోగలవు.
అధ్యాయము 13 complete
