23 - యయాతి పుత్రులగు అను – ద్రుహ్యు - తుర్వసు యదువుల వంశముల వర్ణనము

శ్రీశుక ఉవాచ

అనోస్సభానరశ్చక్షుః పరోక్షశ్చ త్రయస్సుతాః

సభానరాత్కాలనరస్సృంజయస్తత్సుతస్తతః

జనమేజయస్తస్య పుత్రో మహాశీలో మహామనాః

ఉశీనరస్తితిక్షుశ్చ మహామనస ఆత్మజౌ  

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- (యయాతి పుత్రుడగు) అనువునకు సభానరుడు, చక్షువు, పరోక్షుడు అనే ముగ్గురు పుత్రులు ఉండిరి. సభానరునీ పుత్రుడు కాలనరుడు. కాలనరునీ పుత్రుడు సృంజయుడు. సృంజయుని పుత్రుడు జనమేజయుడు. జనమేజయుని పుత్రుడు మహాశీలుడు. మహాశీలుని పుత్రుడు మహామనసుడు. మహామనసునకు ఉశీనరుడు, తితిక్షువు అనే ఇద్దరు పుత్రులు ఉండిరి.

శిబిర్వనశ్శమిర్ధక్షశ్చత్వారోశీనరాత్మజాః

వృషాదర్భస్సువీరశ్చ మద్రః కైకేయ ఆత్మజాః

శిబేశ్చత్వార ఏవాసంస్తితిక్షోశ్చ రుశద్రథః

తతో హేమోSథ సుతపా బలిస్సుతపసోSభవత్  

ఉశీనరునకు శిబి, వనుడు, శమి, దక్షుడు అనే నలుగురు పుత్రులు ఉండిరి. శిబికి కూడ వృషాదర్బుడు, సువీరుడు, మద్రుడు, కైకేయుడు అనే నలుగురు పుత్రులు ఉండిరి.(మహామనసుని పుత్రుడగు) తితిక్షువుయొక్క పుత్రుడు రుశద్రథుడు. రుశద్రథుని పుత్రుడు హేముడు. హేముని పుత్రుడు సుతపసుడు. సుతపసుని పుత్రుడు బలి.

అంగవంగకలింగాద్యాస్సుహ్మపుండ్రాంధ్రసంజ్ఞితాః

జజ్ఞిరే దీర్ఘతమసో బలేః క్షేత్రే మహీక్షితః  

బలి మహారాజుయొక్క భార్యయందు (ఉతథ్యుని పుత్రుడగు) దీర్ఘతమసుడనే మహర్షి వలన అంగుడు, వంగుడు, కలింగుడు, సుహ్ముడు, పుండ్రుడు, అంధ్రుడు అనే పుత్రులు కలిగిరి.

చక్రుస్స్వనామ్నా విషయాన్ షడిమాన్ ప్రాచ్యకాంశ్చ తే

ఖనపానోSoగతో జజ్ఞే తస్మాద్దివీరథస్తతః  

సుతో ధర్మరథో యస్య జజ్ఞే చిత్రరథోSప్రజాః

రోమపాద ఇతి ఖ్యాతస్తస్మై దశరథస్సఖా

వారు తమ తమ పేర్లతో తూర్పు దిక్కునందు ఈ ఆరు రాజ్యములనేర్పాటు చేసిరి. అంగుని పుత్రుడు ఖనపానుడు. ఖనపానుని పుత్రుడు దివిరథుడు. దివిరథుని పుత్రుడు ధర్మరథుడు. ధర్మరథుని పుత్రుడు చిత్రరథుడు. చిత్రరథునకు సంతానము లేదు. ఆయనకే రోమపాదుడు అనే ప్రసిద్ధి కూడ గలదు. ఆయన దశరథుని మిత్రుడు.

శాంతాం స్వకన్యాం ప్రాయచ్చదృష్యశృంగ ఉవాహ తామ్

దేవేవర్షతి యం రామా ఆనిన్యుర్హరిణీసుతమ్   నాట్యసంగీతవాదిత్రైర్విభమాలింగనార్హణైః

దశరథుడు తన కుమార్తెను రోమపాదునకు పెంపుడు ఇచ్చెను. రోమపాదుని రాజ్యములో వర్షదేవుడు వర్షించకపోతే, సుందరులగు యువతులు హరిణీ-విభాండకుల పుత్రుడగు ఋష్యశృంగుని వద్దకు వెళ్లిరి. వారు ఆయన యెదుట సంగీతముతో మరియు వాద్యధ్వనులతో కూడిన నాట్యమును ప్రదర్శించిరి. ఆయన యెదుట విలాసలను ప్రదర్శించి, ఆయనను ఆలింగనము చేసుకొని, ఆయనకు బహుమతులనిచ్చి, రాజధానికి తీసుకు వచ్చిరి (అపుడు వర్షములు పడెను). ఆ ఋష్యశృంగుడు శాంతను వివాహ మాడెను.

స తు రాజ్ఞోనపత్యస్య నిరూప్యేష్టిం మరుత్వతః

ప్రజామదాద్దశరథో యేన లేభేఽప్రజాః ప్రజాః

ఆ ఋష్యశృంగుడు ఇంద్రదేవతాకమగు ఇష్టిని చేసి, దాని ప్రభావముచే రోమపాద మహారాజునకు సంతానము కలుగునట్లు చేసెను. అదే యాగముచే పుత్రసంతానము లేని దశరథుడు కూడ పుత్రులను గనెను.

చతురంగో రోమపాదాత్పృథులాక్షస్తు తత్సుతః

బృహద్రథో బృహత్కర్మా బృహద్భానుశ్చ తత్సుతాః

ఆద్యాద్బృహన్మనాస్తస్మాజ్జయద్రథ ఉదాహృతః  

రోమపాదుని పుత్రుడు చతురంగుడు. చతురంగుని పుత్రుడు పృథులాక్షుడు. పృథులాక్షునకు బృహద్రథుడు, బృహత్కర్ముడు, బృహదానువు అనే పుత్రులు గలరు. వారిలో మొదటివాడగు బృహద్రథుని పుత్రుడు బృహన్మనసుడు. బృహన్మనసుని పుత్రుడు జయద్రథుడని పురాణవేత్తలు చెప్పిరి.

విజయస్తస్య సంభూత్యాం తతో ధృతిరజాయత

తతో ధృతవ్రతస్తస్య సత్కర్మాSధిరథస్తతః  

ఆ జయద్రథునకు సంభూతియందు విజయుడు జన్మించెను. విజయుని పుత్రుడు ధృతి. ధృతియొక్క పుత్రుడు ధృతవ్రతుడు. ధృతవ్రతుని పుత్రుడు సత్కర్ముడు. సత్కర్ముని పుత్రుడు అధిరథుడు.

యోSసౌ గంగాతటే క్రీడన్మంజూషాంతర్గతం శిశుమ్

కుంత్యాపవిద్ధం కానీనమనపత్యోకరోత్సుతమ్

ఆ అధిరథునకు సంతానము లేకుండెను. కుంతీదేవి కన్యగనుండ గనే శిశువును కని ఆ శిశువు (కర్ణుడు) ను ఒక పెట్టెలో పెట్టి విడిచి పెట్టెను. అధిరథుడు గంగాతీరమునందు విహరిస్తూ ఆ శిశువును చేరదీసి తన పుత్రునిగా చేసుకొనెను.

వృష సేనస్సుతస్తస్య కర్ణస్య జగతీపతేః

ద్రుహ్యోశ్చ తనయో బభ్రుస్సేతుస్తస్యాత్మజస్తతః

ఆరబ్ధస్తస్య గాంధారస్తస్య ధర్మస్తతో ధృతః

మహారాజగు కర్ణునియొక్క పుత్రుడు వృషసేనుడు.(యయాతి పుత్రుడగు) ద్రుహ్యునియొక్క పుత్రుడు బభ్రువు. బభ్రువుయొక్క పుత్రుడు సేతువు. సేతువుయొక్క పుత్రుడు ఆరబ్దుడు. ఆరబ్దునియొక్క పుత్రుడు గాంధారుడు. గాంధారునియొక్క పుత్రుడు ధర్ముడు. ధర్ముని యొక్క పుత్రుడు ధృతుడు.

ధృతస్య దుర్మనాస్తస్మాత్ప్రచేతాః ప్రాచేతసం శతమ్

మ్లేచ్చాధిపతయోభూవన్నుదీచిం దిశమాశ్రితాః

తుర్వసోశ్చ సుతో వహ్నిర్వ హ్నేర్భర్గోథ భానుమాన్

ధృతుని పుత్రుడు దుర్మనసుడు. దుర్మనసుని పుత్రుడు ప్రచేతసుడు. ప్రచేతసునకు వందమంది పుత్రులు కలిగిరి. వారు ఉత్తరదిక్కును ఆశ్రయించి, మ్లేచ్చులకు రాజులయిరి.(యయాతి పుత్రుడగు) తుర్వసుని పుత్రుడు వహ్ని, వహ్నియొక్క పుత్రుడు భర్గుడు. భర్గునియొక్క పుత్రుడు భానుమంతుడు.

త్రిభానుస్తత్సుతోస్యాపి కరంధమ ఉదారధీః

మరుతస్తత్సుతోపుత్రః పుత్రం పౌరవమన్వభూత్

ఆ భానుమంతుని పుత్రుడు త్రిభానువు. ఈ త్రిభానుని పుత్రుడగు కరంధముడు గొప్ప దానబుద్ధి గలవాడు. కరంధముని పుత్రుడు మరుతుడు. మరుతునకు పుత్రులు లేకపోవుటచే, ఆయన పూరువంశమునందు పుట్టిన దుష్యంతుని తన పుత్రునిగా స్వీకరించెను.

దుష్యంతస్స పునర్బేజే స్వం వంశం రాజ్యకాముకః

యయాతేర్జ్యేష్ఠపుత్రస్య యదోర్వంశం నరర్షభ

వర్ణయామి మహాపుణ్యం సర్వపాపహరం నృణామ్

మానవులలో శ్రేష్ఠుడవగు ఓ పరీక్షిన్మహారాజా! ఆ దుష్యంతుడు రాజ్యమునందు కామన గలవాడు. పూరువంశీయులకు మాత్రమే రాజ్యాధికారము ఉండెను. కావున, మరుతునిచే పుత్రునిగా స్వీకరించబడిన దుష్యంతుడు మరల తన పౌరవవంశమునే స్వీకరించేను. నేనిప్పుడు యదువుయొక్క వంశమును వర్ణించెదను. యదువు యయాతియొక్క పెద్ద కుమారుడు. చాల పవిత్రమగు ఈ వంశవర్ణనము మానవుల సకలదో షములను హరించివేయును.

యదోర్వంశం నరశ్శ్రుత్వా సర్వపాపైః ప్రముచ్యతే

యత్రావతీర్ణో భగవాన్ పరమాత్మా నరాకృతిః

యదువుయొక్క వంశమును గురించి విన్న మానవుడు సకలపాపములనుండి విముక్తుడగును. ఆ వంశమునందే పరబ్రహ్మ భగవానుడు మానవరూపమును దాల్చి అవతరించెను.

యదోస్సహస్రజిత్ర్కోష్టా నలో రిపురితి శ్రుతాః

చత్వారసూనవస్తత్ర శతజిత్ప్రథమాత్మజః

మహాహయో వేణుహయో హైహయశ్చేతి తత్సుతాః  

యదువునకు సహస్రజిత్తు, క్రోష్ట, నలుడు, రిపువు అనే నలుగురు పుత్రులు గలరు. వారిలో పెద్దవాడగు సహస్రజిత్తునకు శతజిత్తు పుత్రుడు. మహాహయుడు, వేణుహయుడు, హైహయుడు అనువారలు శతజిత్తు యొక్క పుత్రులు.

ధర్మస్తు హైహయసుతో నేత్రః కుంతేః పితా తతః

సోహంజిరభవత్కుంతేర్మహిష్మాన్ భద్ర సేనకః

హైహయుని పుత్రుడు ధర్ముడు. ధర్ముని పుత్రుడు నేత్రుడు. నేత్రుని పుత్రుడు కుంతి. కుంతియొక్క పుత్రుడు సోహంజీ. సోహంజి యొక్క పుత్రుడు మహిష్మంతుడు. మహిష్మంతుని పుత్రుడు భద్రసేనుడు.

దుర్మదో భద్ర సేనస్య ధనకః కృతవీర్యసూః

కృతాగ్నిః కృతవర్మా చ కృతౌజా ధనకాత్మజాః  

భద్ర సేనునకు దుర్మదుడు, ధనకుడు అనే ఇద్దరు పుత్రులు కలిగిరి. ధనకునకు కృతవీర్యుడు, కృతాగ్ని, కృతవర్మ, మరియు కృతాజసుడు అనే నలుగురు పుత్రులు కలిగిరి.

అర్జునః కృతవీర్యస్య సప్తద్వీపేశ్వరోభవత్

దత్తాత్రేయాద్ధరేరంశాత్ప్రాప్తయోగమహాగుణః  

కృతవీర్యుని పుత్రుడు అర్జునుడు. ఆతడు ఏడు ఖండములకు ప్రభువు ఆయెను. ఆతనికి శ్రీహరి అంశావతారమైన దత్తాత్రేయుని వలన యోగము మరియు యోగసిద్ధులు లభించెను.

న నూనం కార్తవీర్యస్య గతిం యాస్యంతి పార్థివాః యజ్ఞదానతపోయోగశ్రుతవీర్యజయాదిభిః  

యజ్ఞము, దానము, తపస్సు, యోగము, జ్ఞానము, పరాక్రమము, విజయము, దుష్టశిక్షణము మొదలగు గుణములయందు మహారాజులు ఎవరైననూ కార్తవీర్యార్జునుని సామ్యమును నిశ్చయముగా పొందలేరు.

పంచాశీతిసహస్రాణి హ్యవ్యాహతబలస్సమాః

అనష్టవిత్తస్మరణో బుభుజేSక్షయ్యషడ్వసు

ఏలయనగా, క్షీణించని శక్తి గల ఆ కార్తవీర్యార్జునుడు ఎనభై అయిదు వేల సంవత్సరముల కాలము నిరంతరముగా క్షీణించని ఆరు ఇంద్రియముల భోగములననుభవించెను. ఆయనకు తన సంపద నష్టమైన ఘటన ఏదీ స్మృతిలో లేదు. ఆయనను స్మరించువారలకు కూడ సంపద నష్టము కాదు.

తస్య పుత్రసహస్రేషు పంచైవోర్వరితా మృధే

జయధ్వజశ్శూరసేనో వృషభో మధురూర్జితః  

ఆ కార్తవీర్యార్జునునకు పది వేల మంది పుత్రులు గలరు. కాని, (పరశురామునితోడి) యుద్ధమునందు జయధ్వజుడు, శూరసేనుడు, వృషభుడు, మధువు, ఊర్జితుడు అనే అయిదుగురు మాత్రమే ప్రాణములతో బయట పడిరి.

జయధ్వజాత్తాలజంఘస్తస్య పుత్రశతం త్వభూత్

క్షత్రం యత్తాలజంఘాఖ్యమౌర్వతేజోపసంహృతమ్

జయధ్వజుని పుత్రుడు తాలజంఘుడు. ఆయనకు వందమంది పుత్రులు ఉండిరి. వారు తాలజంఘ క్షత్రియులు అనే పేరును బడసిరి. సగర మహారాజు ఔర్వ మహర్షినుండి ఆగ్నేయాస్త్రమును పొంది, దానితో ఆ తాలజంఘులను సంహరించెను.

తేషాం జ్యేష్ఠో వీతిహోత్రో వృష్టిః పుత్రో మధ్స్స్మృతః

తస్య పుత్రశతం త్వాసీద్వృష్టి జ్యేష్ఠం యతః కులమ్  

మాధవా వృష్ణయో రాజన్ యాదవాశ్చేతి సంజ్జితాః

ఆ తాలజంఘులలో పెద్దవాడు వీతిహోత్రుడు.(కార్తవీర్యార్జునుని పుత్రుడగు) మధువునకు వందమంది పుత్రులు గలరు. వారిలో వృష్టి పెద్ద వాడు. ఈ యదువు, వృష్టి, మధువుల వలననే వంశము ప్రవర్తిల్లినది. ఆ వంశీయులు క్రమముగా యాదవులు, వృష్ణులు, మాధవులు అనే పేరుతో ప్రసిద్ధిని బడసినారు.

యదుపుత్రస్య చ క్రోష్టోః పుత్రో వృజినవాంస్తతః

శ్వాహిస్తతో రుశేకుర్వై తస్య చిత్రరథస్తతః

శశబిందుర్మహాయోగీ మహాభోజో మహానభూత్

 చతుర్దశమహారత్నశ్చక్రవర్త్యపరాజితః

యదువుయొక్క పుత్రుడు క్రోష్టువు. క్రోష్టువు యొక్క పుత్రుడు వృజినవంతుడు. వృజినవంతుని పుత్రుడు శ్వాహి. శ్వాహియొక్క పుత్రుడు రుశకుడు. రుశకుని పుత్రుడు చిత్రరథుడు. చిత్రరథుని పుత్రుడు శశబిందువు. ఆయన చాల గొప్పవాడు. ఆయన గొప్ప యోగియే గాక, గొప్ప భోగి కూడ ఆయెను. పరాజయము నెరుగని ఆ శశబిందు చక్రవర్తి ఏనుగు, గుర్రము, రథము మొదలైన పదునాలుగు రకముల శ్రేష్ఠవస్తువులను కలిగియుండెను.

తస్య పత్నీసహస్రాణాం దశాSSసన్సుమహాయశాః

దశలక్షసహస్రాణి పుత్రాణాం తాస్వజీజనత్

చాల గొప్ప కీర్తి గల ఆ శశబిందువునకు పదివేల మంది భార్యలుండిరి. ఆయన వారియందు పదివేల లక్షల పుత్రులను కనెను.

తేషాం తు షట్ప్రధానానాం పృథుశ్రవస ఆత్మజః

ధర్మో నామోశనా తస్య హయమేధశతస్య యాట్

తత్సుతో రుచకస్తస్య పంచాసన్నాత్మజాశ్శృణు

ఆ వంద కోట్ల పుత్రులలో పృథుశ్రవసుడు, పృథుకీర్తి మొదలైన ఆర్గురు ప్రముఖులు. వారిలో పృధుశ్రవసునకు ధర్ముడని ప్రసిద్ధి గాంచిన పుత్రుడు ఉండెను. ధర్ముని పుత్రుడగు ఉశనుడు వంద అశ్వమేధ యాగ ములను చేసెను. ఉశనుని పుత్రుడు రుచకుడు. రుచకునకు అయిదుగురు పుత్రులు ఉండిరి. వారి పేర్లను వినుము.

పురుజిద్రుక్మరుక్మేషుపృథుజ్యామఘసంజ్ఞితాః

జ్యామఘస్త్వప్రజోSప్యన్యాం భార్యాం శైబ్యాపతిర్భయాత్

 నావిందచ్ఛత్రుభవనాద్భోజ్యాం కన్యామహారషీత్

పురుజీత్తు, రుక్ముడు, రుక్మేషువు, పృథువు, మరియు జ్యాముఘుడు అనునవి ఆ రుచకుని పుత్రుల పేర్లు. వారిలో జ్యామఘునకు తన భార్యయగు శైబ్యయందు సంతానము కలుగలేదు. అయినా, ఆయన భార్య వలన భయము వలన ఇంకో స్త్రీని వివాహమాడలేదు. కానీ, శత్రు రాజు పై జయించిన సందర్భములో, శత్రురాజుయొక్క అంతఃపురము నుండి భోజవంశమునకు చెందిన భోజ్య అనే కన్యను తీసుకొని వచ్చేను.

రథస్థాం తాం నిరీక్ష్యాహ శైబ్యా పతిమమర్షితా

కేయం కుహక మత్స్థానం రథమారోపితేతి వై

రథమునందున్న ఆ భోజ్యను పరిశీలనగా చూచిన శైబ్య కోపించి నదై భర్తయగు జ్యామఘునితో నిట్లనెను -- ఓ మోసగాడా! రథములో నా స్థానములో నీవీమెను ఎక్కించితివి. ఈమె ఎవరు?

స్నుషా తవేత్యభిహితే స్మయంతీ పతిమబ్రవీత్

అహం వంధ్యాSసపత్నీ చ స్నుషా మే యుజ్యతే కథమ్

జనయిష్యసి యం రాజ్ఞి తస్యేయముపయుజ్యతే  

నీ కోడలు, అని జ్యామఘుడు చెప్పెను. అపుడా శైబ్య చిరునవ్వు తో -- నాకు పిల్లలు లేరు, పైగా సవతి కూడ లేనిదానను, నాకు కోడలు అని చెప్పుట సత్యము ఎట్లు అగును?--అని భర్తను ప్రశ్నించెను. అపుడా రాజు -- ఓ మహారాణీ! నీకు పుట్టబోయే కొడుకు ఈమెను వివా హము చేసుకొనగలడు -- అని పలికెను.

అన్వమోదంత తద్విశ్వేదేవాః పితర ఏవ చ

శైబ్యా గర్భమధాత్కాలే కుమారం సుషువే శుభమ్

స విదర్భ ఇతి ప్రోక్త ఉపయేమే స్నుషాం సతీమ్

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం

నవమస్కంధే త్రయోవింశోSధ్యాయః

జ్యామఘుని ఆ మాటను విశ్వేదేవతలు మరియు పితృదేవతలు కూడ అనుమోదించిరి. కొంత కాలమునకు శైబ్య గర్బమును దాల్చి, పండువంటి పిల్లవానిని కనెను. ఆ బాలకునకు విదర్బుడని పేరు. ఆ బాలుడే పెరిగి పెద్దవాడై సాధ్వియగు భోజ్యను వివాహమాడెను. ఈ విధముగా ఆమె యథార్థముగనే శైబ్యకు కోడలు ఆయెను.

శ్రీమద్బాగవత మహాపురాణమునందు తొమ్మిదవ స్కంధములో యయాతి పుత్రులగు అను-ద్రుహ్యు-తుర్వసు-యదువుల వంశములను వర్ణించే ఇరువది మూడవ అధ్యాయము ముగిసినది (23).