భాగవత మహా పురాణము
20 - శకుంతలా దుష్యంతుల గాథ – భరతుని రాజ్య పాలనము
శ్రీశుక ఉవాచ ।
పూరోర్వంశం ప్రవక్ష్యామి యత్ర జాతోSసి భారత ।
యత్ర రాజర్షయో వంశ్యా బ్రహ్మవంశ్యాశ్చ జజ్ఞిరే ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- భరతవంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! ఇప్పుడు పూరువుయొక్క వంశమును వర్ణించెదను. ఈ వంశమునందే నీవు జన్మించితివి. ఈ వంశములో వంశవర్ధనులగు రాజర్షులు మరియు బ్రహ్మర్షులు కూడ జన్మించిరి.
జనమేజయో హ్యభూత్పూరోః ప్రచిన్వాంస్తత్సుతస్తతః ।
ప్రవీరోSథ నమస్యుర్వై తస్మాచ్చారుపదోSభవత్ ॥
పూరువుయొక్క పుత్రుడు జనమేజయుడు. జనమేజయుని పుత్రుడు ప్రచిన్వంతుడు. ప్రచిన్వంతుని పుత్రుడు ప్రవీరుడు. ప్రవీరుని పుత్రుడు నమస్యువు. నమస్యుని పుత్రుడు చారుపదుడు.
తస్య సుద్యురభూత్పుత్రస్తస్మాద్బహుగవస్తతః ।
సంయాతిస్తస్యాహంయాతీ రౌద్రాశ్వస్తత్సుతస్స్మృతః ॥
చారుపదుని పుత్రుడు సుద్యువు. సుద్యువు పుత్రుడు బహుగవుడు. బహుగవుని పుత్రుడు సంయాతి. సంయాతి పుత్రుడు అహంయాతి. అహంయాతి పుత్రుడు రౌద్రాశ్వుడు.
ఋతేయుస్తస్య కుక్షేయుః స్థండిలేయుః కృతేయుకః ।
జలేయుస్సంతతేయుశ్చ ధర్మసత్యవ్రతేయవః ॥
దశైతేప్సరసః పుత్రా వనేయుశ్చావమస్స్మృతః ।
ఘృతాచ్యామింద్రియాణీవ ముఖ్యస్య జగదాత్మనః ॥
ఆ రౌద్రాశ్వునకు ఘృతాచి అనే అప్సరసయందు -- ప్రాణికోటికి ఆత్మయైన ముఖ్య (ప్రధాన) ప్రాణమునకు పది ఇంద్రియములు (అయిదు కర్మేంద్రియములు, అయిదు జ్ఞానేంద్రియములు) వలె -- పది మంది పుత్రులు కలిగిరి. ఋతేయువు, కుక్షేయువు, స్థండిలేయువు, కృతేయువు, జలేయువు, సంతతేయువు, ధర్మేయువు, సత్యేయువు, ప్రతేయువు, వనేయువు అనునవి వారి పేర్లు. వీరిలో వనేయువు ఆఖరివాడు.
ఋతేయో రంతిభారోSభూత్తయస్తస్యాత్మజా నృప ।
సుమతిర్ధృవోSప్రతిరథః కణ్వోSప్రతిరథాత్మజః ॥
ఓ పరీక్షిన్మహారాజా! ఋతేయువుయొక్క పుత్రుడు రంతిభారుడు. రంతిభారునకు సుమతి, ధ్రువుడు, అప్రతిరథుడు అనే ముగ్గురు పుత్రులు కలిగిరి. అప్రతిరథుని పుత్రుడు కణ్వుడు.
తస్య మేధాతిథిస్తస్మాత్పృస్కణ్వాద్యా ద్విజాతయః ।
పుత్రోSభూత్సుమతే రైభ్యో దుష్యంతస్తత్సుతో మతః ॥
కణ్వుని పుత్రుడు మేధాతిథి. ఆయననుండియే ప్రస్కణ్వుడు మొదలగు బ్రాహ్మణులు ఉదయించిరి. సుమతి (రంతభారుని పుత్రుడు) యొక్క పుత్రుడు రైభ్యుడు. రైభ్యుని పుత్రుడు దుష్యంతుడు.
దుష్యంతో మృగయాం యాతః కణ్వాశ్రమపదం గతః ।
తత్రాసీనాం స్వప్రభయా మండయంతీం రమామివ ॥
విలోక్య సద్యో ముము హే దేవమాయామివ స్త్రియమ్ ।
బభాషే తాం వరారోహాం భటైః కతిపయైర్వృతః ॥
దుష్యంతుడు కొద్దిమంది భటులు చుట్టువారి రాగా వేటకు వెళ్లి, కణ్వమహర్షియొక్క ఆశ్రమస్థానమునకు వెళ్లెను. అచట కూర్చుండియున్న లక్ష్మీదేవివంటి ఒక స్త్రీని చూచెను. ఆమె తన కాంతిచే ఆ ఆశ్రమమునకే అలంకారమా యన్నట్లు ఉండెను. దేవమాయవంటి ఆ యువతిని చూచి ఆయన వెంటనే మోహమును పొందెను. అపుడాయన ఆ సుందరితో మాటలాడెను.
తద్దర్శనప్రముదితస్సన్నివృత్తపరిశ్రమః ।
పప్రచ్ఛ కామసంతప్తః ప్రహసన్ శ్లక్ష్ణయా గిరా ॥
ఆమెను చూచుటచే చాల హర్షమును పొందిన దుష్యంతునకు (వేట వలని) అలసట పూర్తిగా తొలగిపోయెను.(ఆమె యందలి) కామనచే మిక్కిలి తాపమును పొందిన ఆయన నవ్వుతూ మధురమగు వాక్కుతో ఆమెను ఇట్లు ప్రశ్నించెను.
కా త్వం కమలపత్రాక్షి కస్యాసి హృదయంగమే ।
కిం వా చికీర్షితం త్వత్ర భవత్యా నిర్జనే వనే ॥
ఓ కలువ రేకుల కన్నుల దానా! నీవెవతెవు? నీవు నా హృదయమును దోచినావు సుమా! నీవు ఎవరి దానవు? నిర్జనమగు ఈ అడవిలో నీవు ఏమి చేయగోరుచున్నావు?
వ్యక్తం రాజన్యతనయాం వేద్మ్యహం త్వాం సుమధ్యమే ।
న హి చేతః పౌరవాణామధర్మే రమతే క్వచిత్ ॥
ఓ చక్కని నడుము దానా! నీవు క్షత్రియకన్యవని స్పష్టముగా నాకు తెలియుచునే యున్నది. ఏలయనగా, పూరువంశీయుల మనస్సు ఏనాడైననూ (ఎక్కడైననూ) అధర్మమునందు రమించదు.
శకుంతలోవాచ ।
విశ్వామిత్రాత్మజైవాహం త్యక్తా మేనకయా వనే ।
వేదైతద్భగవాన్ కణ్వో వీర కిం కరవామ తే ॥
శకుంతల ఇట్లు పలికెను --- ఓ వీరుడా! యథార్థమే. నేను విశ్వామిత్రుడనే క్షత్రియుని కుమార్తెనే. నన్ను మేనక అడవిలో విడిచి పెట్టినది. ఈ విషయము కణ్వమహర్షికి తెలియును. మేము నీకు చేయదగినది ఏమైన గలదా?
ఆస్యతాం హ్యరవిందాక్ష గృహ్యతామర్హణం చ నః ।
భుజ్యతాం సంతి నీవారా ఉష్యతాం యది రోచతే ॥
పద్మముల వంటి కన్నులు గలవాడా! సంశయించకుండా కూర్చుండుడు. మా పూజను స్వీకరించుడు. మా వద్ద నివ్వెర బియ్యపు సరుకులు గలవు. తమరు వాటిని భుజించుడు. తమకు ఇష్టమైనచో, ఇచట మకాము చేయుడు.
దుష్యంత ఉవాచ ।
ఉపపన్నమిదం సుభ్రు జాతాయాః కుశికాన్వయే ।
స్వయం హి వృణతే రాజ్ఞాం కన్యకాస్సదృశం వరమ్ ॥
దుష్యంతుడిట్లు పలికెను --- అందమైన కనుబొమలు గలదానా! కుశిక వంశములో జన్మించిన నీవు ఇట్టి ఆతిథ్యమునిచ్చుట తగియేయున్నది. రాజకన్యకలు తామే తగిన వరుని ఎన్నుకొనెదరు సుమా!
ఓమిత్యు క్తే యథాధర్మముపయేమే శకుంతలామ్ ।
గాంధర్వవిధినా రాజా దేశకాలవిధానవిత్ ॥
దుష్యంత మహారాజు దేశకాలములను మరియు శాస్త్రవిధులను తెలిసినవాడు. శకుంతల తన అంగీకారమును తెలుపగానే, ఆయన ఆమెను ధర్మమును తప్పకుండా గాంధర్వవివాహ (పరస్పరము ప్రతిజ్ఞలను చేసుకొనుట) పద్ధతిలో వివాహము చేసుకొనెను.
అమోఘవీర్యో రాజర్షిర్మహిష్యాం వీర్యమాదధే ।
శ్వోభూతే స్వపురం యాతః కాలేనాసూత సా సుతమ్ ॥
రాజర్షియగు దుష్యంతుడు అమోఘమగు శక్తి గలవాడు. ఆయన తన భార్యయగు శకుంతలయందు గర్భమును ఆధానము చేసెను. తెల్లవారగానే ఆయన తన నగరమునకు వెళ్లెను. ప్రసవకాలము సంప్రాప్తము కాగా, ఆమె పుత్రుని కనెను.
కణ్వః కుమారస్య వనే చక్రే సముచితాః క్రియాః ।
బద్ధ్వా మృగేంద్రాంస్తరసా క్రీడతి స్మ స బాలకః ॥
ఆ బాలకునకు కణ్వ మహర్షి జాతకర్మ మొదలగు యథోచితము లైన సంస్కారములను అడవిలోనే నిర్వర్తించెను. ఆ బాలుడు సింహములను బలముగా బంధించి వాటితో ఆడుకొనెడివాడు.
తం దురత్యయవిక్రాంతమాదాయ ప్రమదోత్తమా ।
హరేరంశాంశసంభూతం భర్తురంతికమాగమత్ ॥
శ్రీహరియొక్క అంశయొక్క అంశతో పుట్టిన ఆ బాలకుడు ఎదురులేని పరాక్రమము గలవాడు. యువతులలో శ్రేష్ఠురాలగు శకుంతల ఆ బాలకుని తీసుకొని తన భర్తయగు దుష్యంతుని దగ్గరకు వచ్చెను.
యదా న జగృ హే రాజా భార్యాపుత్రావనిందితౌ ।
శృణ్వతాం సర్వభూతానాం ఖే వాగాహాశరీరిణీ ॥
దోషము లేని ఆ భార్యను, పుత్రుని దుష్యంత మహారాజు స్వీకరించ లేదు. అప్పుడు సకలప్రాణులు వినుచుండగా ఆకాశమునందు అశరీరవాణి ఇట్లు పలికెను.
మాతా భస్త్రా పితుః పుత్రో యేన జాతస్స ఏవ సః ।
భరస్వ పుత్రం దుష్యంత మాSవమంస్థాశ్శకుంతలామ్ ॥
పుత్రునకు తల్లి క్షేత్రము. పుత్రుడు వాస్తవములో తండ్రికి మాత్రమే చెందును. పుత్రుడు ఏ తండ్రి ద్వారా పుట్టునో, ఆ తండ్రికంటె భిన్నుడు కాడు. ఓ దుష్యంతా! పుత్రుని స్వీకరించి పాలించుము. శకుంతలను అవమానించకుము.(భరించుమని చెప్పుటచే ఆ బాలుడు భరతుడైనాడు).
రేతోధాః పుత్రో నయతి నరదేవ యమక్షయాత్ ।
త్వం చాస్య ధాతా గర్భస్య సత్యమోహ శకుంతలా ॥
ఓ మహారాజా! వంశకర్తయగు పుత్రుడే తండ్రిని యమపురికి పోకుండా (నరకములో పడకుండా) తరింప జేయును. ఈ శిశువునకు తండ్రివి నీవే. శకుంతల సత్యమునే చెప్పుచున్నది.
పితర్యుపరతే సోపి చక్రవర్తీ మహాయశాః ।
మహిమా గీయతే తస్య హరేరంశభువో భువి ॥
తండ్రియగు దుష్యంతుడు మరణించిన తరువాత ఆ బాలకుడు (భరతుడు) చక్రవర్తియై గొప్ప కీర్తిని పొందెను. శ్రీహరియొక్క అంశ వలన జన్మించిన ఆ భరతుని గొప్పదనమును భూలోకములో జనులు కీర్తించుచున్నారు.
చక్రం దక్షిణహస్తేSస్య పద్మకోశోSస్య పాదయోః ।
ఈజే మహాభిషేకేణ సోSభిషిక్తోSధిరాడ్ విభుః ॥
పంచపంచాశతా మేధ్యైర్గంగాయామను వాజిభిః ।
ఈ భరతుని కుడిచేతియందు చక్రము, రెండు పాదములయందు పద్మపు మొగ్గలు (సాముద్రిక చిహ్నములైన చక్రవర్తి లక్షణములు) ఉండెను. సర్వసమర్థుడగు ఆ భరతుడు గొప్ప అభిషేక క్రియ ద్వారా చక్రవర్తిగా అభిషిక్తుడైనాడు. ఆయన గంగాతీరమునందు ఏభై అయిదు పవిత్రములైన అశ్వమేధ యాగములను చేసి ఈశ్వరుని ఆరాధించెను.
మామతేయం పురోధాయ యమునాయామను ప్రభుః ॥
అష్టసప్తతిమేధ్యాశ్వాన్ బబంధ ప్రదదద్వసు ।
భరత చక్రవర్తి మమత పుత్రుడగు దీర్ఘతమసుని పురోహితునిగా చేసుకొని యమునా తీరమునందు డెబ్బది ఎనిమిది పవిత్రములగు అశ్వమేధ యాగములను చేసి, సంపదను దానము చేసెను.
భరతస్య హి దౌష్యంతేరగ్నిస్పాచీగుణే చితః ।
సహస్రం బద్ధశో యస్మిన్ బ్రాహ్మణా గా విభేజిరే ॥
దుష్యంత పుత్రుడగు భరతుడు సకలసద్గుణములు గల స్థానమునందు అగ్నిని స్థాపించి యజ్ఞమును చేసెను. ఆ స్థానమునందు వేయి మంది బ్రాహ్మణులు భరతునిచే ఈయబడిన గోవులను ఒక్కొక్కరు బద్ధము (13 084 గోవుల మంద) చొప్పున విభాగము చేసి తీసుకొనిరి.
త్రయస్త్రింశచ్ఛతం, హ్యశ్వాన్ బద్ధ్వా విస్మాపయన్ నృపాన్ ।
దౌష్యంతిరత్యగాన్మాయాం దేవానాం గురుమాయయౌ ॥
దుష్యంత పుత్రుడగు భరతుడు నూట ముప్పై మూడు అశ్వమేధ యాగములను చేసి రాజులను విస్మయ పరచెను. ఆయన వైభవము నిశ్చయముగా దేవతల వైభవమును కూడ అధిగమించెను. ఆయన అవిద్యను అతిక్రమించి (ఆత్మజ్ఞానమును పొంది) దేవగురువగు శ్రీహరిలో ఐక్యమాయెను.
మృగాన్ శుక్లదతః కృష్ణాన్ హిరణ్యేన పరీవృతాన్ ।
అదాత్కర్మణి మష్ణారే నియుతాని చతుర్దశ ॥
యజ్ఞములోని మష్ణారము అనే కర్మయందు ఆయన తెల్లని దంతములు గల నల్లని పదునాలుగు లక్షల గొప్ప జాతి ఏనుగులను దానముచేసెను. అవి బంగరు ఆభరణములచే అలంకరించబడి యుండెను.
భరతస్య మహత్కర్మ న పూర్వే నాపరే నృపాః ।
నైవాపుర్నైవ ప్రాప్స్యంతి బాహుభ్యాం త్రిదివం యథా ॥
మానవులు రెండు చేతులను పైకెత్తి స్వర్గమును పట్టుకొనుట ఇది వరలో జరుగలేదు, ఈ పైన జరుగబోదు. అదే విధముగా, భరతుడు చేసిన కర్మలను ఆయనకు పూర్వమునందలి రాజులు చేయలేదు, ఆయన తరువాతి రాజులు చేయబోరు.
కిరాతహూణాన్ యవనానంధ్రాన్ కంకాన్ ఖశాన్ శకాన్ ।
అబ్రహ్మణ్యాన్నృపాంశ్చాహన్ మ్లేచ్ఛాన్ దిగ్విజయేఖిలాన్ ॥
ఆయన దిగ్విజయ యాత్రయందు కిరాతులను, హూణులను, యవనులను, అంధ్రులను, కంకులను, ఖశులను, శకులను, మ్లేచ్ఛులను, వేదవిరోధులగు రాజులను అందరినీ సంహరించెను.
జిత్వా పురాSసురా దేవాన్ యే రసౌకాంసి భేజిరే ।
దేవస్త్రియో రసాం నీతాః ప్రాణిభిః పునరాహరత్ ॥
పూర్వము బలశాలురగు రాక్షసులు దేవతలను జయించి, రసాతలమును చేరిరి. అప్పుడు వారు దేవతాస్త్రీలను బలాత్కారముగా రసాతలమునకు తీసుకుపోయిరి. భరత మహారాజు ఆ దేవతాస్త్రీలను (చెర విడిపించి) మరల (స్వర్గమునకు) తెచ్చెను.
సర్వకామాన్ దుదుహతుః ప్రజానాం తస్య రోదసీ ।
సమాస్త్రీణవసాహస్రీర్దిక్షు చక్రమవర్తయత్ ॥
ఆయన పాలించుచుండగా భూలోక స్వర్గలోకములు ప్రజలకు అభీష్టములైన సకలవస్తువులను (పంటలు మొదలగువాటిని, వర్షములు మొదలగువాటిని) సమృద్ధిగా ఇచ్చినవి. ఆయన చక్రవర్తిగా ఇరవై ఏడు వేల సంవత్సరముల కాలము నీరంతరముగా దిక్కులయందు తన శాసనమును ప్రవర్తిల్ల జేసెను.
స సమ్రాడ్ లోకపాలాఖ్యమైశ్వర్యమధిరాట్ శ్రియమ్ ।
చక్రం చాస్ఖలితం ప్రాణాన్ మృషేత్యుపరరామ హ ॥
లోకపాలకులలో ప్రఖ్యాతమైన ఈశ్వరభావము, రాజాధిరాజుల సంపద, ఎదురు లేని శాసనము, ఆఖరికి ప్రాణములు కూడ మిథ్యయేనని నిశ్చయించుకొని, ఆ భరత చక్రవర్తి విరక్తుడాయేను.
తస్యాసన్ నృప వైదర్భ్యః పత్న్యస్తిస్రస్సుసమ్మతాః ।
జఘ్నుస్త్యాగభయాత్పుత్రాన్నానురూపా ఇతీరితే ॥
ఓ పరీక్షిన్మహారాజా! ఆయనకు మిక్కిలి ప్రియురాండ్రైన ముగ్గురు భార్యలు ఉండిరి. వారు విదర్భ రాజకుమార్తెలు. వారికి కలిగిన సంతానమును గురించి -- వీరు నాకు తగినవారు కారు -- అని భరతుడు పలికెను. భరతుడు తమను విడిచి పెట్టునేమో యను భయము వలన వారు ఆ పిల్లలను చంపిరి.
తస్యైవం వితథే వంశే తదర్థం యజతస్సుతమ్ ।
మరుత్ స్తోమేన మరుతో భరద్వాజముపాదదుః ॥
వంశాంకురము లేని కారణముగా ఈ విధముగా తన వంశము వ్యర్థమగుచుండగా, భరతుడు మరుత్ స్తోమమనే యజ్ఞమును చేసి మరుద్దేవతల నారాధించెను. ఆ మరుద్దేవతలు ఆయనపై ప్రసన్నులై ఆయనకు భరద్వాజుని పుత్రునిగా సమర్పించిరి.
భరద్వాజుని ఉత్పత్తి గాథ ---
అంతర్వత్న్యాం భ్రాతృపత్న్యాం మైథునాయ బృహస్పతిః ।
ప్రవృత్తో వారితో గర్భం శప్త్వా వీర్యమవాసృజత్ ॥
ఒకనాడు బృహస్పతి గర్భవతియగు తన సోదరుని (ఉతథ్యుని) భార్య (మమత) తో సంభోగము కొరకు ప్రవర్తిల్లగా, గర్భమునందలి శిశువు వారించెను. అప్పుడు బృహస్పతి కోపించి ఆ శిశువును (గ్రుడ్డివాడవు కమ్మని) శపించి వీర్యమును విడిచి పెట్టెను (దానినుండి పుత్రుడు జన్మించెను).
తం త్యక్తుకామాం మమతాం భర్తృత్యాగవిశంకీతామ్ ।
నామనిర్వచనం తస్య శ్లోకమేనం సురా జగుః ॥
తన భర్త తనను విడిచి పెట్టుననే ఆశోకతో మమత ఆ పిల్లవానిని విడిచి పెట్టుటకు సంకల్పించెను. అప్పుడు దేవతలు మమతను ఉద్దేశించి ఈ శ్లోకమును పాడిరి. మమతా-బృహస్పతుల సంవాదమైన ఈ శ్లోకములో గర్భమునందలి బాలకుని పేరు నిర్వచించ బడినది.
మూఢే భర ద్వాజమిమం భర ద్వాజం బృహస్పతే ।
యాతౌ యదుక్త్వా పితరౌ భరద్వాజస్తతస్త్వయమ్ ॥
బృహస్పతి -- ఓ మూర్ఖురాలా! ఈ పిల్లవాడు మన యిద్దరి వలన పుట్టినవాడు. కావున వీనిని పోషించుము. మమత -- ఓ బృహస్పతీ! ఈ పిల్లవాడు మన ఇద్దరి వలన జన్మించిన వాడు గావున వీనిని నీవే పోషించుము. ఈ విధముగా పలికి వారిద్దరు బాలకుని విడిచి పెట్టిరి. వారి పలుకులను బట్టి ఈ బాలకుడు భరద్వాజుడైనాడు.
చోద్యమానా సురైరేవం మత్వా వితథమాత్మజమ్ ।
వ్యసృజన్మరుత్వోబిభ్రందత్తోఽయం వితథేఽన్వయే ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమ స్కంధే వింశోSధ్యాయః ॥
ఈ విధముగా దేవతలు మమతను (భర్త త్యజించునేమోననే ఆశంక వద్దు అని) ప్రేరేపించిరి. కాని, ఆ బాలకుడు వ్యర్థుడేనని తలచి మమత వానిని విడిచి పెట్టెను. అప్పుడు మరుద్దేవతలు ఆ బాలకుని పోషించిరి. భరతుని వంశము వ్యర్థము (అంకురము లేనిది) అగుచుండగా, వారీ బాలకుని భరతునకు సమర్పించిరి.
శ్రీమద్భాగవత మహాపురాణమునందు తొమ్మిదవ స్కంధములో శకుంతలా దుష్యంతుల గాథను, భరతుని రాజ్యపాలనమును వర్ణించే ఇరువదియవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 21 of the Bhāgavata Mahā Purana is as follows:
This chapter presents the extraordinary history of King Rantideva, a noble monarch descended from Bharata who embodied ultimate selflessness, renunciation, and compassion (*Dayā*). Having distributed all his royal riches in charity, Rantideva and his family endured forty-eight consecutive days of total fasting without food or water. On the forty-ninth morning, a small quantity of food and water arrived by divine providence. As the starving family prepared to break their fast, a hungry brāhmaṇa guest arrived, and Rantideva respectfully gave him a share. Next, a śūdra guest arrived, followed by a man with hungry dogs, and Rantideva joyfully gave away the remaining food. When only a few drops of water remained to quench his burning thirst, an outcast (*Caṇḍāla*) begged for water. Rantideva handed over his last water, praying not for mystic powers or personal liberation, but only to suffer on behalf of all distressed living entities so that they might be freed from misery. Instantly, Lord Brahmā, Mahādeva Śiva, and the devatās revealed themselves, explaining they had tested his virtue, and elevated Rantideva and his associates directly to the spiritual realm.