13 - నిమి మహారాజు చరితము

శ్రీశుక ఉవాచ

నిమిరిక్ష్వాకుతనయో వసిష్ఠమవృతర్త్విజమ్

ఆరభ్య సత్రం సోఽప్యాహ శక్రేణ ప్రాగ్వృతోఽస్మి భోః

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఇక్ష్వాకుని పుత్రుడగు నిమి సత్రయాగమును ప్రారంభించి, వసిష్ఠుని ఋత్విక్కుగా వరించెను. ఆయన ఇట్లు బదులు చెప్పెను -- ఓ మహారాజా! ఇంద్రుడు నన్ను ముందుగా (తన యజ్ఞమునకై ఋత్విక్కుగా) వరించినాడు.

తం నిర్వర్త్యాగమిష్యామి తావన్మాం ప్రతిపాలయ తూష్ణిమాసీద్గృహపతిస్సోఽపీంద్రస్యాకరోన్మఖమ్  

ఆ యజ్ఞమును నిర్వర్తించి నేను తిరిగి వచ్చెదను; అంతవరకు నా కొరకై వేచియుండుము, అని వసిష్ఠుడు చెప్పెను. గృహయజమానియగు నిమి మిన్నకుండెను. వసిష్ఠుడు ఇంద్రుని యజ్ఞమును నిర్వర్తించెను.

నిమిశ్చలమిదం విద్వాన్ సత్రమారభతాత్మవాన్

ఋత్విగ్భిరపరైస్తావన్నాగమద్యావతా గురుః

ఈ జీవితము చంచలమైనదనే వివేకము నిమికి గలదు. గురువగు వసిష్ఠుడు ఎంతకైననూ రాకపోవుటచే, ఆయన ఇతరులగు ఋత్విక్కులతో సత్రయాగమునారంభించెను.

శిష్యవ్యతిక్రమం వీక్ష్య నిర్వర్త్య గురురాగతః

అశపత్పతతాద్దేహో నిమేః పండితమానినః

ఇంద్రుని యజ్ఞమును నిర్వర్తించి తిరిగి వచ్చిన గురువగు వసి ష్ణుడు నిమి తన ఆజ్ఞను ఉల్లంఘించుటను గాంచి ఇట్లు శపించెను -- తాను పండితుడనని గర్వించే ఈ నిమి మరణించు గాక!

నిమిః ప్రతిదదే శాపం గురవేఽధర్మవర్తినే

తవాపి పతతాద్దేహో లోభాద్ధర్మమజానతః

ధర్మము చేయుటయందు విలంబము తగదు అనే ధర్మమును గురువగు వసిష్ఠుడు ఉపేక్షించి శాపమునిచ్చినాడు. రెండు యజ్ఞముల దక్షి ణలను పొందవలెననే లోభము ఆయనకుండెను. కావున, నిమి తిరిగి ఆయన కూడ మరణించునని శాపమునిచ్చెను.

ఇత్యుత్ససర్జ స్వం దేహం నిమిరధ్యాత్మకోవిదః

మిత్రావరుణయోర్జజ్ఞే ఉర్వశ్యాం ప్రపితామహః

ఆత్మజ్ఞానమునందు నిమి గొప్పవాడు. ఆయన ఇట్లు పలికి తన దేహమును విడిచి పెట్టెను. మా ముత్తాతయగు వసిష్ఠుడు కూడ మరణించి మిత్రావరుణులకు ఉర్వశియందు పుత్రుడై జన్మించెను.

గంధవస్తుషు తద్దేహం నిధాయ మునిసత్తమాః

సమాప్తే సత్రయాగేఽథ దేవానూచుస్సమాగతాన్

నిమియొక్క ఋత్విక్కులైన మహర్షులు నిమియొక్క ఆ దేహ మును పరిమళ తైలమునందు భద్రము చేసిరి. సత్రయాగము. పూర్తి అయిన పిదప, అచటకు వచ్చియున్న దేవతలనుద్దేశించి వారిట్లు పలికిరి.

రాజ్ఞో జీవతు దేహ్వోSయం ప్రసన్నాః ప్రభవో యది

తథోత్యుక్తే నిమిః ప్రాహ మా భూమ్మే దేహబంధనమ్

సమర్ధులగు మీరు ప్రసన్నులైనచో, మహారాజుయొక్క ఈ దేహము బ్రదుకు గాక! అని మహర్షులు పలుకగా, దేవతలు తథాస్తు! అని రి. కాని, నిమి ఇట్లు పలికెను -- నాకు దేహముయొక్క బంధము కలుగ కుండు గాక!

యస్య యోగం న వాంఛంతి వియోగభయకాతరాః

భజంతి చరణాంభోజం మునయో హరిమేధసః  

మననశీలురై శ్రీహరియందు బుద్ధిని లగ్నము చేసినవారలు దేహ ముతోడి సంయోగము (జన్మ) ను కోరుకోనరు. ఏలయనగా, దేహముతోడి వియోగము (మరణము) వలన వారు భయభీతులగుదురు. వారు శ్రీహరి పాదపద్మములను (మోక్షము కొరకై) సేవించెదరు.

దేహం నావరురుత్సేఽహం దుఃఖశోకభయావహమ్

సర్వత్రాస్య యతో మృత్యుర్మత్స్యానాముదకే యథా  

దేహము దేహపీడకు, మనోవ్యథకు మరియు భయమునకు నిల యము. అట్టి దేహమును పొందాలనే కోరిక నాకు లేదు. దేహమును పొందుట వలన ఈ జీవునకు అంతటా, నీటిలోని చేపలకు (పెద్ద చేప) వలె, మరణము సిద్దముగా నుండును.

దేవా ఊచుః

విదేహ ఉష్యతాం కామం లోచనేషు శరీరిణామ్

ఉన్మేషణనిమేషాభ్యాం లక్షితోఽధ్యాత్మసంస్థితః

దేవతలిట్లు పలికిరి -- నిమి దేహము లేకుండగనే దేహధారులగు ప్రాణుల అధ్యాత్మము (దేహేంద్రియమనస్సంఘాతము) నందలి కన్నుల యందు యథేచ్చగా నివసించు గాక! ఆయన ఉనికిని కను రెప్పల తెరచు కొనుట మరియు మూయబడుట సూచించును.

అరాజకభయం నౄణాం మన్యమానా మహర్షయః

దేహం మమంథుస్స్మ నిమేః కుమారస్సమజాయత

రాజు లేనిచో మానవులకు భయము కలుగునని తలపోసి ఆ మహర్షులు నిమియొక్క దేహమును మథించగా, పుత్రుడు కలిగెను.

జన్మనా జనకస్సోSభూద్వైదేహస్తు విదేహజః

మిథిలో మథనాజ్జాతో మిథిలా యేన నిర్మితా  

అసాధారణముగా జన్మించుటచే ఆయనకు జనకుడనియు, దేహము లేని నిమి వంశములో జన్మించుటచే వైదేహుడనియు, దేహ మును మథించుట వలన పుట్టుటచే మిథిలుడనియు ఆయనకు పేర్లు. ఆయన నిర్మించిన నగరమే మిథిల.

తస్మాదుదావసుస్తస్య పుత్రోSభూన్నందివర్ధనః

తతస్సు కేతుస్తస్యాపి దేవరాతో మహీపతే  

ఓ పరీక్షిన్మహారాజా! ఆ జనకుని పుత్రుడు ఉదావసువు. ఉదావ సుని పుత్రుడు నందివర్ధనుడు. నందివర్ధనుని పుత్రుడు సుకేతువు. సుకే తుని పుత్రుడు దేవరాతుడు.

తస్మాద్ఛృహద్రథస్తస్య మహావీర్యస్సుధృత్పితా

సుధృతేర్ధృష్టకేతురై హర్యశ్వోSథ మరుస్తతః  

దేవరాతుని పుత్రుడు బృహద్రథుడు. బృహద్రథుని పుత్రుడు మహావీర్యుడు. మహావీర్యుని పుత్రుడు సుధృతి. సుధృతి పుత్రుడు ధృష్టకే తువు. ధృష్టకేతుని పుత్రుడు హర్యశ్వడు. హర్యశ్వుని పుత్రుడు మరువు.

మరోః ప్రతీపకస్తస్మాజ్జాతః కృతిరథో యతః

దేవమీడస్తస్య సుతో విశ్రుతోథ మహాధృతిః

మరువు పుత్రుడు ప్రతీపకుడు. ప్రతీపకుని పుత్రుడు కృతిరథుడు. కృతిరథుని పుత్రుడు దేవమీఢుడు. దేవమీఢుని పుత్రుడు విశ్రుతుడు. విశ్రు తుని పుత్రుడు మహాధృతి.

కృతిరాతస్తతస్తస్మాన్మహారోమాథ తత్సుతః

స్వర్ణరోమా సుతస్తస్య హ్రస్వరోమా వ్యజాయత

ఆ మహాధృతి పుత్రుడు కృతిరాతుడు. కృతిరాతుని పుత్రుడు మహారోముడు. మహారముని పుత్రుడు స్వర్ణరోముడు. స్వర్ణరోముని పుత్రుడు హ్రస్వరోముడు.

తతస్సీరధ్వజో జజ్ఞే యజ్ఞార్థం కర్షతో మహీమ్

సీతా సీరాగ్రతో జాతా తస్మాతీరధ్వజస్స్మృతః

హ్రస్వరోముని పుత్రుడు సీరధ్వజుడు. ఆయన యజ్ఞము కొరకై భూమిని దున్నుచుండగా, నాగలి చాలునుండి సీతాదేవి పుట్టెను. కావున నే, ఆయనకు సీరధ్వజుడు (నాగలీయే కీర్తిని తెలుపునదిగా గలవాడు) అనీ పిలువబడెను.

కుశధ్వజస్తస్య పుత్రస్తతో ధర్మధ్వజో నృపః

ధర్మధ్వజస్య ద్వౌ పుత్రౌ కృతధ్వజమితధ్వజౌ

సీరధ్వజుని పుత్రుడు కుశధ్వజుడు. కుశధ్వజుని పుత్రుడు ధర్మ ధ్వజ మహారాజు, ధర్మధ్వజునకు కృతధ్వజుడు, మితధ్వజుడు అనే ఇద్దరు పుత్రులు ఉండిరి.

కృతధ్వజాత్కేశిధ్వజః ఖాండిక్యస్తు మితధ్వజాత్

కృతధ్వజసుతో రాజన్నాత్మవిద్యావిశారదః  

ఓ పరీక్షిన్మహారాజా! కృతధ్వజుని పుత్రుడు కేశిధ్వజుడు. ఆయన సుస్పష్టమైన ఆత్మజ్ఞాననిష్ఠ గలవాడు. మితధ్వజుని పుత్రుడు ఖాండిక్యుడు.

ఖాండిక్యః కర్మతత్త్వజ్ఞో భీతః కేశిధ్వజాద్ద్రుతః

భానుమాంస్తస్య పుత్రోభూచ్ఛతద్యుమ్నస్తు తత్సుతః

కర్మస్వరూపమునెరింగిన ఖాండిక్యుడు కేశిధ్వజునకు భయపడి పారిపోయేను. ఆయన పుత్రుడు భానుమంతుడు. భానుమంతుని పుత్రుడు శతద్యుమ్నుడు.

శుచిస్తత్తనయస్తస్మాత్సనద్వాజస్తతోభవత్

ఊర్ధ్వకేతుస్సనద్వాజాదజోథ పురుజిత్సుతః

ఆ శతద్యుమ్నుని పుత్రుడు శుచి, శుచి పుత్రుడు సనద్వాజుడు. ఆ సనద్వాజుని పుత్రుడు ఊర్ధ్వకేతువు. ఊర్ధ్వకేతువు పుత్రుడు అజుడు. అజుని పుత్రుడు పురుజిత్తు.

అరిష్టనేమిస్తస్యాపి శ్రుతాయుస్తత్సుపార్శ్వకః

తతశ్చిత్రరథో యస్య క్షేమధిర్మిథిలాధిపః  

పురుజిత్తు పుత్రుడు అరిష్టనేమి. అరిష్టనేమి పుత్రుడు శ్రుతాయు వు. శ్రుతాయువు పుత్రుడు సుపార్శ్వకుడు. సుపార్శ్వకుని పుత్రుడు చిత్ర రథుడు. చిత్రరథుని పుత్రుడగు క్షేమది మిథిలకు ప్రభువు.

తస్మాత్సమరథస్తస్య సుతస్సత్యరథస్తతః

ఆసీదుపగురుస్తస్మాదుపగుప్తోఽగ్నిసంభవః  

క్షేమధి పుత్రుడు సమరథుడు. సమరథుని పుత్రుడు సత్యరథుడు. సత్యరథుని పుత్రుడు ఉపగురువు. ఉపగురువునకు అగ్ని అంశతో ఉపగుపు డనే పుత్రుడు కలిగెను.

వస్వనంతోఽథ తత్పుతో యుయుధో యత్సుభాషణః

శ్రుతస్తతో జయస్తస్మాద్విజయోఽస్మాదృతస్సుతః  

ఉపగుపుని పుత్రుడు వస్వనంతుడు. వస్వనంతుని పుత్రుడు యుయుధుడు. యుయుధుని పుత్రుడు సుభాషణుడు. సుభాషణుని పుత్రుడు శ్రుతుడు. శ్రుతుని పుత్రుడు జయుడు. జయుని పుత్రుడు విజయుడు. విజయుని పుత్రుడు ఋతుడు.

శునకస్తత్సుతో జజ్ఞే వీతహవ్యో ధృతిస్తతః

బహులాశ్వో ధృతేస్తస్య కృతిరస్య మహావశీ

ఆ ఋతుని పుత్రుడు శునకుడు. శునకుని పుత్రుడు వీతహవ్యుడు. వీతహవ్యుని పుత్రుడు ధృతి. ధృతి పుత్రుడు బహులాశ్వుడు. బహులా శ్వుని పుత్రుడు కృతి. కృతి పుత్రుడు మహావశి.

ఏతే వై మైథిలా రాజన్నాత్మవిద్యావిశారదాః

యోగేశ్వరప్రసాదేన ద్వంద్వైర్ముక్తా గృహేష్వపి

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే నవమస్కంధే త్రయోదశోఽధ్యాయః

ఓ పరీక్షిన్మహారాజా! వీరందరు మిథిలుని వంశమునకు చెందినవా రు. యోగేశ్వరులగు యాజ్ఞవల్క్యాదుల అనుగ్రహముచే వీరందరికి సుస్స ష్టమైన ఆత్మజ్ఞాననిష్ఠ ఉండెడిది. కావుననే, వీరు గృహస్థులై ఉండియు, రాగద్వేషాది ద్వంద్వములకు అతీతులై యుండెడివారు.

శ్రీమద్బాగవత మహాపురాణమునందు తొమ్మిదవ స్కంధములో నిమియొక్క వంశమును వర్ణించే పదమూడవ అధ్యాయము ముగిసినది.