భాగవత మహా పురాణము
14 - ఊర్వశీ పురూరవుల చరితము
శ్రీశుక ఉవాచ ।
అథాతశ్శ్రుయతాం రాజన్ వంశస్సోమస్య పావనః ।
యస్మిన్నైలాదయో భూపాః కీర్త్యంతే పుణ్యకీర్తయః ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! సూర్యవం శమును గురించి చెప్పితిని. ఈ వంశకీర్తనము చిత్తశుద్దికి హేతువు. కావున, ఈ పైన చంద్రవంశమును గురించి చెప్పెదను, వినుము. ఆ వంశములో పవిత్రమగు కీర్తిగల ఐలుడు మొదలగు రాజులు కీర్తించబడెదరు.
సహస్రశిరసః పుంసో నాభిహ్రదసరోరుహాత్ ।
జాతస్యాసీత్సుతో ధాతురత్రిః పితృసమో గుణైః ॥
అనంతమగు శిరస్సులు గల పురుషోత్తముని నాభీ అనే సరస్సులో పుట్టిన పద్మమునుండి బ్రహ్మగారు ప్రకటమయ్యెను. బ్రహ్మగారి పుత్రు డగు అత్రి గుణములలో తండ్రితో సమానమైనవాడు.
తస్య దృగ్భ్యోఽభవత్పుత్రస్సోమ్యోమృతమయః కిల ।
విప్రౌషధ్యుడుగణానాం బ్రహ్మణా కల్పితః పతిః ॥
ఆ అత్రీయొక్క ఆనందబాష్పములనుండి అమృతస్వరూపుడగు చంద్రుడు పుత్రుడై జన్మించెను. ఆయనను బ్రహ్మగారు వేదవేత్తలకు, చెట్టు చేమలకు, నక్షత్రముల గణములకు ప్రభువుగా ఏర్పాటు చేసెను.
సోఽయజద్రాజసూయేన విజిత్య భువనత్రయమ్ ।
పత్నీం బృహస్పతేర్దర్పాత్తారాం నామాహరద్బలాత్ ॥
ఆ చంద్రుడు ముల్లోకములను జయించి రాజసూయ యాగమును చేసెను. అపుడు గర్వము పెరిగి, ఆయన తారయని ప్రసిద్ధి గాంచిన బృహస్పతియొక్క భార్యను అపహరించెను.
యదా స దేవగురుణా యాచితోభీక్ ష్ణశో మదాత్ ।
నాత్యజత్తత్కృతే జజ్ఞే సురదానవవిగ్రహః ॥
దేవతలకు గురువగు బృహస్పతి పలుమార్లు కోరిననూ చంద్రుడు గర్వము వలన ఆమెను విడిచి పెట్టలేదు. ఆమె కారణముగా దేవతలకు, రాక్షసులకు వైరము ఏర్పడెను.
శుక్రో బృహస్పతేర్ద్వేషాదగ్రహీత్సాసురోడుపమ్ ।
హరో గురుసుతం స్నేహాత్సర్వభూతగణావృతః ॥
శుక్రాచార్యుడు బృహస్పతి తనను ద్వేషించుటచే, రాక్షసుల అను మతితో చంద్రుని పక్షమును వహించెను. సకలభూతగణములచే చుట్టువార బడి యుండే రుద్రుడు, బృహస్పతి తనకు గురువగు అంగీరసుని పుత్రు డైన కారణముగా, అనురాగముతో ఆయన పక్షమున నిలిచెను.
సర్వదేవగణో పేతో మహేంద్రో గురుమన్వయాత్ । సురాసురవినాశోభూత్సమరస్తారకామయః ॥
దేవేంద్రుడు సకలదేవతాగణములతో గూడి బృహస్పతి పక్షమును సమర్దించెను. అప్పుడు తార నిమిత్తముగా జరిగిన యుద్దములో దేవతలు మరియు రాక్షసులు కూడ వినాశమును చెందిరి.
నివేదితోథాంగిరసా సోమం నిర్బర్త్స్య విశ్వకృత్ ।
తారాం స్వభర్ర్తే ప్రాయచ్ఛదంతర్వత్నీమవైత్పతిః ॥
తరువాత అంగిరసుడు బ్రహ్మగారికి నివేదించగా, ఆయన చంద్రుని బెదిరించి తారను ఆమె భర్తయగు బృహస్పతికి అప్పజెప్పెను. కాని, ఆమె గర్భవతియని ఆయనకు తెలిసిపోయెను.
త్యజ త్యజాశు దుష్ప్రజ్ఞే మత్ క్షేత్రాదాహితం పరైః ।
నాహం త్వాం భస్మసాత్కుర్యాం స్త్రీయం సాంతానికస్సతి ॥
ఓసీ! నీవు దుర్బుద్ధి గలదానవు. ఇతరులచే (శత్రువులచే) ఆధానము చేయబడిన గర్భమును నాకు చెందిన క్షేత్రమునుండి దూరము చేయుము, దూరము చేయుము. అట్లు చేసినచో, నీవు యోగ్యురాలవు అగుదువు. నీవు దోషము చేసిననూ, నీవు స్త్రీవీ అయినందువలన, పైగా నేను సంతానమును కోరుచుండుట వలన, నేను నిన్ను బూడిదగా చేయ కుందును గాక!
తత్యాజ ప్రీడితా తారా కుమారం కనకప్రభమ్ ।
స్పృహామాంగిరసశ్చక్రే కుమారే సోమ ఏవ చ ॥
తార సిగ్గు పడి బంగరు కాంతులు విరజిమ్మే పుత్రుని విడిచి పెట్టే ను. ఆ కుమారుని అంగిరసపుత్రుడగు బృహస్పతి మరియు చంద్రుడు కూడ కోరిరి.
మమాయం న తవేత్యుచ్చైస్తస్మిన్ వివదమానయోః ।
పప్రచురృషయో దేవా నైవోచే వ్రీడితా తు సా ॥
ఈ బాలకుడు నావాడు, నీవాడు కాడు, అంటూ బృహస్పతి, చంద్రుడు వివాదపడుచుండిరి. అప్పుడు మహర్షులు, దేవతలు తారను ప్రశ్నించిరి. కాని, ఆమె సిగ్గు పడి సమాధానమును చెప్పనే లేదు.
కుమారో మాతరం ప్రాహ కుపితోలీకలజ్ఞయా ।
కిం న వోచస్యసద్వృత్తే ఆత్మావద్యం వదాశు మే ॥
ఆ బాలకుడు కోపించి తల్లితో ఇట్లు పలికెను -- దుష్టమగు నడ వడి గలదానా! సమాధానమును చెప్పవేమి? నీ సిగ్గు మిథ్య (వ్యర్థము), నీవు చేసిన చెడు పనిని గురించి నాకు వెంటనే చెప్పుము.
బ్రహ్మా తాం రహ ఆహూయ సమప్రాక్షీచ్చ సాంత్వయన్ ।
సోమస్యేత్యాహ శన కైస్సోమస్తం తావదగ్రహీత్ ॥
బ్రహ్మగారు ఆ తారను ఏకాంతములోనికి పిలిచి బుజ్జగిస్తూ ప్రశ్నించగా, చంద్రుని పిల్లవాడు అని ఆమె మెల్లగా చెప్పెను. అప్పుడు ఆ బాలకుని చంద్రుడు తీసుకొనెను.
తస్యాత్మయోనిరకృత బుధ ఇత్యభిధాం నృప ।
బుద్ధ్యా గంభీరయా యేన పుత్రేణాపోడురాట్ ముదమ్ ॥
ఓ పరీక్షిన్మహారాజా! ఆ బాలకునకు స్వయంభువుడగు బ్రహ్మ గారు బుధుడు అని పేరు పెట్టెను. సూక్ష్మబుద్ధియగు ఆ పుత్రునితో కూడి నక్షత్రరాజగు చంద్రుడు ఆనందమును పొందెను.
తతః పురూరవా జజ్ఞే ఇలాయాం య ఉదాహృతః ।
తస్య రూపగుణౌణౌర్యశీలద్రవిణవిక్రమాన్ ॥
శ్రుత్వోర్వశీంద్రభవనే గీయమానాన్ సురర్షిణా ।
తదంతికము పేయాయ దేవీ స్మరశరార్దితా ॥
ఆ బుధునకు ఇలయందు పురూరవుడనే పుత్రుడు కలిగేనని ఇది వరలో చెప్పబడినది. దేవర్షియగు నారదుడు ఆ పురూరవుని రూపమును, గుణములను, పెద్ద మనస్సును, సచ్చీలమును, సంపదను, పరాక్రమ మును గురించి ఇంద్రుని భవనములో వర్ణించి చెప్పెను. ఆ విషయము లను విన్న ఊర్వశీదేవి మన్మథుని బాణములచే పీడను పొందినదై ఆ పురూరవుని వద్దకు వచ్చివేసెను.
మిత్రావరుణయోశ్శాపాదాపన్నా నరలోకతామ్ ।
నిశమ్య పురుషశ్రేష్ఠం కందర్పమివ రూపిణమ్ ।
ధృతిం విష్టభ్య లలనా ఉపతస్థే తదంతికే ॥
మిత్రావరుణుల శాపముచే ఊర్వశి మనుష్యభావమును పొందెను. పురుషులలో శ్రేష్ఠుడు మరియు మన్మథునివలే అందగాడు అగు పురూర వుని గురించి విని, ఆ సుందరి ధైర్యమును చిక్కబట్టి ఆయన వద్దకు వచ్చి చేరెను.
స తాం విలోక్య నృపతిర్హర్షేణోత్ఫుల్లలోచనః ।
ఉవాచ శ్రోక్ష్ణయా వాచా దేవీం హృష్టతనూరుహః ॥
ఆ ఊర్వశీదేవిని చూచినంతనే పురూరవ మహారాజునకు హర్ష ముతో కన్నులు విప్పారి, శరీరమంతయు గగుర్పాటు కలిగెను. ఆయన మధురమగు వాక్కుతో ఆమెను ఉద్దేశించి ఇట్లు పలికెను.
రాజోవాచ ।
స్వాగతం తే వరారో హే ఆస్యతాం కరవామ కిమ్ ।
సంగమస్వ మయా సాకం రతిర్నౌ శాశ్వతీస్సమాః ॥
పురూరవ మహారాజు ఇట్లు పలికెను -- ఓ సుందరీ! నీకు స్వాగత ము. కూర్చుండుము. మేము నీకు ఏమి చేయవలెను? నీవు నాతో గూడి చక్కగా రమించుము. మన యిద్దరీ విహారము చాల సంవత్సరములు నిరంతరముగా కొనసాగు గాక!
ఉర్వశ్యువాచ ।
కస్యాస్త్వయి న సజ్జేత మనో దృష్టిశ్చ సుందర ।
యదంగాంతరమాసాద్య చ్యవతే హ రిరంసయా ॥
ఊర్వశి ఇట్లు పలికెను --- సుందరుడవగు ఓ రాజా! ఏ స్త్రీయొక్క చూపు మరియు మనస్సు నీయందు లగ్నము కాకుండును? నిన్ను ఏకాంతమునందు పొంది రమించవలెనని మనస్సు ఉవ్విళ్లూరుచు న్నది సుమా!
ఏతావురణకౌ రాజన్ న్యాసౌ రక్షస్వ మానద ।
సంరం స్యే భవతా సాకం శ్లాఘ్యః స్త్రీణాం వరస్స్మృతః ॥
మర్యాదను కాపాడే ఓ రాజా! ఈ రెండు పొట్టేళ్లను నీవద్ద ఉంచెద ను. వీటిని నీవు కాపాడుము. నీవు అట్లు చేసినచో, నేను నీతో కూడి రమించెదను. అప్సరసలకు (నీవంటి) కొనియాడ దగిన వ్యక్తియే భర్తయని చెప్పబడినది.
ఘృతం మే వీర భక్ష్యం స్యాన్నేక్షే త్వాన్యత్ర మైథునాత్ ।
వివాససం తత్తథేతి ప్రతి పేదే మహామనాః ॥
ఓ వీరుడా! నేను నెయ్యిని మాత్రమే ఆహారముగా తీసుకొనెదను; సంభోగమునందు తప్ప నీవు నాకు నగ్నముగా కనబడరాదు; అని ఊర్వశి షరతులను విధించేను. ఆనందముతో నిండియున్న మనస్సు గల ఆ మహా రాజు ఆ షరతులను యథాతథముగా అంగీకరించెను.
అహో రూపమహో భావో నరలోకవిమోహనమ్ ।
కో న సేవేత మనుజో దేవీం త్వాం స్వయమాగతామ్ ॥
మానవలోకమునకు వ్యామోహమును కలిగించే నీ రూపము, నీ హావభావములు అచ్చెరువును గొల్పుచున్నవి. ఆహా! అప్సరసవగు నీవే స్వయముగా వచ్చినప్పుడు, ఏ మానవుడు నిన్ను సేవించకుండును?
తయా స పురుషశ్రేష్ఠో రమయంత్యా యథార్హతః ।
రేమే సురవిహారేషు కామం చైత్రరథాదిషు ॥
అప్సరసల ప్రభావమునకు తగ్గట్లుగా ఆమే పురుషశ్రేష్ఠుడగు ఆ మహారాజును రమింపజేసెను. ఆయన ఆమెతో గూడి దేవతలు విహరించే చైత్రరథము, నందనము మొదలగు ఉద్యానములయందు యథేచ్ఛగా విహరించేను.
రమమాణస్తయా దేవ్యా పద్మకింజల్కగంధయా ।
తన్ముఖామోదముషితో ముముదేఽహర్గణాన్ బహూన్ ॥
పద్మముల పుప్పొడియొక్క పరిమళము వంటి పరిమళము గల ఆ అప్సరసతో గూడి ఆ మహారాజు చాల నెలలను, సంవత్సరములను ఆనందముగా గడి పెను. ఆమే ముఖపరిమళముచే ఆయన ప్రలోభితుడా యెను.
అపశ్యన్నుర్వశీమింద్రో గంధర్వాన్ సమచోదయత్ ।
ఉర్వశీరహితం మహ్యమాస్థానం నాతిశోభతే ॥
ఇంద్రునకు ఊర్వశి కానరాలేదు. ఊర్వశి లేని నా ఆస్థానము అధి కముగా శోభిల్లుట లేదని చెప్పి, ఆయన ఆమెను తీసుకురండని గంధర్వు లను ప్రేరేపించెను.
తే ఉపేత్య మహారాత్రే తమసి ప్రత్యుపస్థితే ।
ఉర్వశ్యా ఉరణౌ జహ్రుర్న్యస్తౌ రాజని జాయయా ॥
పురూరవుని ప్రియురాలగు ఊర్వశి ఆయన వద్ద రెండు పొట్టేళ్లను భద్రముగా కాపాడుటకై ఉంచినది. అర్ధరాత్రమునందు చీకటి దట్టముగా నుండగా, ఆ గంధర్వులు వచ్చి ఆ రెండు పొట్టేళ్లను లాగుకొని పోయిరి.
నిశమ్యాక్రందితం దేవీ పుత్రయోర్నీయమానయోః ।
హతాస్మ్యహం కునాథేన నపుంసా వీరమానినా ॥
ఊర్వశి ఆ పొట్టేళ్లను తన పుత్రులను వలె పాలించెను. గంధ ర్వులు లాగుకొని పోవుచుండగా అవి పెట్టిన మొరను విని ఆమె ఇట్లు పలి కెను -- నా భర్త దుష్టుడు, నపుంసకుడు. కాని, తాను వీరుడనని ఆతడు తలపోయును. అట్టి భర్త కారణముగా నేను భ్రష్టురాలనైతిని.
యద్విశ్రంభాదహం నష్టా హృతాపత్యా చ దస్యుభిః ।
యశ్ళేతే నిశి సంత్రస్తో యథా నారీ దివా పుమాన్ ॥
నేను నా ప్రియుని నమ్మి నష్టపోయినాను. నా స్వంతపిల్లలవంటి పొట్టేళ్లను చోరులు అపహరించినారు. ఈయన పగలైతే మగవాడే గాని, రాత్రి మాత్రము భయపడి స్త్రీవలె నిద్రించుచున్నాడు.
ఇతి వాక్సాయకైర్విద్దః ప్రతోత్త్రైరివ కుంజరః ।
నిశి నిస్త్రింశమాదాయ వివస్త్రోఽభ్యద్రవద్రుషా ॥
ఈ విధముగా ఊర్వశి, ఏనుగును అంకుశములతో పొడిచినట్లుగా, వాక్కులనే బాణములతో పురూరవుని పొడిచెను. అపుడాయన ఆ రాత్రి యందు నగ్నముగా కోపముతో కత్తిని పట్టుకొని చోరులు వెళ్లిన దిక్కువైపు పరుగెత్తాను.
తే విసృజ్యోరణౌ తత్ర వ్యద్యోతంత స్మ విద్యుతః ।
ఆదాయ మేషావాయాంతం నగ్నమైక్షత సా పతిమ్ ॥
ఆ గంధర్వులు పొట్టేళ్లను అక్కడనే విడిచి పెట్టి మెరుపులు మెరి యునట్లు చేసిరి. పురూరవ మహారాజు ఆ పొట్టేళ్లను తీసుకొని వచ్చుచుండెను. కానీ, ఆయన దిగంబరుడై యుండెను. ఆ మెరుపుల వెలుతురులో ఊర్వశీ నగ్నుడైయున్న తన భర్తను చూచెను.
ఐలోపి శయనే జాయామపశ్యన్ విమనా ఇవ ।
తచ్చిత్తో విహ్వలశ్శోచన్ బభ్రామోన్మత్తవన్మహీమ్ ॥
ఇలాపుత్రుడగు పురూరవునకు శయ్యయందు తన భార్యయగు ఊర్వశి కానరాలేదు. ఆయన మనస్సు మిక్కిలి చెడి దుఃఖించెను. వ్యాకుల మైన చిత్తముతో ఆయన ఆమెనే ధ్యానిస్తూ పిచ్చివాడు వలె అస్వస్థుడై భూలోకములో తిరుగాడెను.
స తాం వీక్ష్య కురుక్షేత్రే సరస్వత్యాం చ తత్సఖీః ।
పంచ ప్రహృష్టవదనాః ప్రాహ సూక్తం పురూరవాః ॥
ఆ పురూరవునకు కురుక్షేత్రములో సరస్వతీ నదీతీరమునందు ఆ ఊర్వశి కనబడెను. ఆమెతో బాటుగా హర్షముతో నిండిన ముఖములు గల అయిదుగురు చెలికత్తెలు కూడ ఉండిరి. ఆపుడాయన ఈ క్రింది విధముగా మధురమగు పలుకులను పలికెను. ఆయన పలుకులు వేదప్రసిద్దమగు సూక్తము రూపములో నుండెను.
అయే జాయే తిష్ఠ తిష్ఠ ఘారే న త్యక్తుమర్హసి ।
మాం త్వమద్యాప్యనిర్వృత్య వచాంసి కృణవావహై ॥
ఓ ప్రియురాలా! నిలు, నిలు. నాకు ఈ నాడైనా సంతోషమును కలిగించకుండా భయంకరమగు విరహదుఃఖములో పారవేయుట నీకు తగ దు. మనము మాటలాడుకొనవలెను.
సుదేహాయం పతతత్ర దేవి దూరం హృతస్త్వయా ।
ఖాదంత్యేనం వృకా గృధ్రాస్త్వత్ప్రసాదస్య నాస్పదమ్ ॥
ఓ దేవీ! నీవు నా ఈ సుందరమైన దేహమును దూరముగా విడిచి పెట్టి వెళ్లిపోతివి. నీ అనుగ్రహమునకు నోచుకోని ఈ దేహము ఇక్కడనే పడిపోవును. దీనిని తోడేళ్లు, గ్రద్దలు భక్షించును.
ఉర్వశ్యువాచ ।
మా మృథాః పురుషోసి త్వం మా స్మ త్వాద్యురృకా ఇమే ।
క్వాపి సఖ్యం న వై స్త్రీణాం వృకాణాం హృదయం తథా ॥
ఊర్వశి ఇట్లు పలికెను --- నీవు మరణించరాదు. నీవు మగవాడ వు. తోడేళ్లు వంటి ఈ ఇంద్రియములు నీన్ను భక్షించకుండు గాక!(ఇంద్రి యములను జయించుము). స్త్రీలకు ఏ వ్యక్తియందైననూ ప్రేమ, స్థిర ముగా నుండదు. స్త్రీల హృదయము తోడేళ్ల హృదయము వంటిది (క్రూర మైనది).
స్త్రీయో హ్యకరుణాః క్రూరా దుర్మర్షాః ప్రియసాహసాః ।
ఘ్నంత్యల్పార్థేపి విశ్రబ్ధం పతిం భ్రాతరమప్యుత ॥
ఏలయనగా, స్త్రీలు దయ లేనివారు, క్రూరమగు స్వభావము గల వారు. వారికి సహనము సున్న. వారు తమకు నచ్చిన వాని (వస్తువు) విష యములో ఎంతటికైననూ తెగించెదరు. వారు చిన్న ప్రయోజనము కొరకై ననూ భర్తను, సోదరునీ కూడ దెబ్బ తీసెదరు. ఇతరులను లెక్క చేయరనీ వేరుగా చెప్పవలయునా?
విధాయాలీకవిశ్రంభమజ్ఞేషు త్యక్తసౌహృదాః ।
నవం నవమభీప్సంత్యః పుంశ్చల్య స్వైరవృత్తయః ॥
స్వైరవృత్తి గల స్త్రీలు మూర్ఖులకు కపట విశ్వాసమును కలిగించి, ప్రేమను విడిచి పెట్టి, కొత్త కొత్త ప్రియులను కోరుకుంటూ యథేచ్ఛగా సంచరించెదరు.
సంవత్సరాంతే హి భవానేకరాత్రం మయేశ్వర ।
వత్స్యత్యపత్యాని చ తే భవిష్యత్యపరాణి భోః ॥
ఓ ప్రభూ! నీవు సమర్థుడవు. సంవత్సరము తరువాత నీవు ఒక రాత్రి నిశ్చయముగా నాతో గడుపగలవు. పైగా, నీకు ఇంకనూ సంతాన ములు కలుగగలవు.
అంతర్వత్నీముపాలక్ష్య దేవీం స ప్రయయౌ పురమ్ ।
పునస్తత్ర గతోబ్దాంతే ఉర్వశీం వీరమాతరమ్ ॥
ఉపలభ్య ముదా యుక్తస్సమువాస తయా నిశామ్ ।
అథైనముర్వశీ ప్రాహ కృపణం విరహాతురమ్ ॥
ఊర్వశి గర్భవతి అనే విషయమును గమనించి ఆ పురూరవుడు తన నగరమునకు వెళ్లాను. సంవత్సరము తరువాత ఆయన మరల ఆ కురు క్షేత్రమునకు వెళ్లి ఊర్వశిని చూచెను. ఆమె అప్పటికే వీరుడగు పుత్రునకు జన్మనిచ్చేను. ఆయన ఆమెతో కూడి ఆనందముగా ఆ రాత్రిని చక్కగా గడి పెను. మరునాడు ఆమెతోడి వియోగముచే వ్యాకులుడై దీనుడై యున్న ఈ మహారాజును ఉద్దేశించి ఆమె ఇట్లు పలికెను.
గంధర్వానుపధావేమాంస్తుభ్యం దాస్యంతి మామితి ।
తస్య సంస్తువతస్తుష్టా అగ్నిస్థాలీం దదుర్నృప ।
ఉర్వశీం మన్యమనస్తాం సోబుధ్యత చరన్ వనే ॥
ఈ గంధర్వులను నీవు స్తుతించుము, వారు నన్ను నీకు ఈయగ లరు, అని ఊర్వశి చెప్పగా, ఆయన వారిని చక్కగా స్తుతించెను. ఓ పరీక్షి న్మహారాజా! గంధర్వులు సంతోషించి ఆయనకు అగ్నిని స్థాపించే పాత్రను ఇచ్చిరి (అగ్నియందు హోమమును చేసి దేవలోకమును పొందుమని వారి అభిప్రాయము). కాని, ఆ మహారాజు ఆ పాత్రయే ఊర్వశియని తలపోసె ను. ఆయన అడవిలో సంచరిస్తూ, అది కేవలము పాత్రయేనని తెలుసుకో నెను.
స్థాలీం న్యస్య వనే గత్వా గృహానాధ్యాయతో నిశి ।
త్రేతాయాం సంప్రవృత్తాయాం మనసి త్రయ్యవర్తత ॥
ఆ పురూరవ మహారాజు ఆ పాత్రను అడవిలో వదిలి, తన ఇంటికి వెళ్లి, ఆ ఊర్వశినే ధ్యానించుచుండెను. ఇంతలో త్రేతాయుగము ప్రారంభ మయ్యెను. అప్పుడు ఆయన హృదయములో కర్మను బోధించే మూడు (ఋగ్యజుస్సామలు) వేదములు ప్రకటమయ్యెను.
స్థాలీస్థానం గతోశ్వత్థం శమీగర్భం విలక్ష్య సః ।
తేన ద్వే అరణీ కృత్వా ఉర్వశీలోకకామ్యయా ॥
ఉర్వశీం మంత్రతో ధ్యాయన్నధరాగణిముత్తరామ్ ।
ఆత్మానముభయోర్మధ్యే యత్తత్ప్రజననం ప్రభుః ॥
ఆ పురూరవ మహారాజు అడవిలో అగ్నిపాత్రను వదలి పెట్టిన చోటికి వెళ్లాను. అచట జమ్మి చెట్టు మొదట్లో మొలిచియున్న రావి చెట్టును చూచెను. దాని కట్టెతో రెండు నిప్పును మథించే కొయ్యలను చేసెను. అపుడాయన ఊర్వశియొక్క లోకమును పొందే కోరికతో, క్రింది కొయ్యను ఊర్వశినిగా, పై కొయ్యను తననుగా, వాటి మధ్యలోనుండే కట్టెను పుత్రునిగా మంత్రపూర్వకముగా ధ్యానిస్తూ అగ్నిని మథించెను.
తస్య నిర్మంథనాజ్ఞాతో జాతవేదా విభావసుః ।
త్రయ్యా స విద్యయా రాజ్ఞా పుత్రత్వే కల్పితస్త్రీవృత్ ॥
ఆ కట్టెను మథించుట వలన అగ్ని పుట్టెను. ఈ అగ్నిని ఆరాధిం చుట వలననే మానవుడు సకలసంపదలను పొందును. మూడు వేదముల జ్ఞానముతో ఆ పురూరవ మహారాజు అగ్నిని ఆహవనీయము, గార్హపత్య ము, అనాహార్య పచనము అనే మూడు రూపములుగా విభాగము చేసి, ఆ అగ్నిని తన పుత్రుడుగా చేసుకొనెను.
తేనాయజత యజ్ఞేశం భగవంతమధోక్షజమ్ ।
ఉర్వశీలోకమన్విచ్ఛన్ సర్వదేవమయం హరిమ్ ॥
ఊర్వశీలోకమును కోరే ఆ పురూరవ మహారాజు ఆ అగ్ని ద్వారా యజ్ఞేశ్వరుడగు శ్రీహరి భగవానుని ఆరాధించెను. సకలదేవతాస్వరూపు డగు శ్రీహరి ప్రత్యక్షాది ప్రమాణములకు గోచరుడు కాడు.
ఏక ఏవ పురా వేదః ప్రణవస్సర్వవాజ్మయః ।
దేవో నారాయణో నాన్య ఏకోగ్నిర్వర్ణ ఏవ చ ॥
పూర్వము (కృతయుగములో) సకలవాక్కులకు బీజమైన ఓంకార మొక్కటియే వేదము. దేవుడు నారాయణుడే కాని, మరియొకడు కాడు. అగ్ని ఒక్కటియే ఉండెడిది (మూడు కాదు). వర్ణము కూడ ఒక్కటీ (హంస) మాత్రమే ఉండెడిది.
పురూరవస ఏవాసీత్రయీ త్రేతాముఖే నృప ।
అగ్నినా ప్రజయా రాజా లోకం గాంధర్వమేయివాన్ ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే నవమస్కంధే చతుర్దశోSధ్యాయః ॥
ఓ పరీక్షిన్మహారాజా! త్రేతాయుగము ఆరంభములో పురూరవ మహారాజు ద్వారానే మూడు వేదములు ఆవిర్భవించేను. ఆ రాజు ఆ అగ్నిని ఆరాధించి, సంతానమును పొంది గంధర్వలోకమును చేరుకొనెను.
శ్రీమద్భాగవత మహాపురాణమునందు తొమ్మిదవ స్కంధములో ఊర్వశీ-పురూరవుల వృత్తాంతమును వర్ణించే పదునాల్గవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 15 of the Bhāgavata Mahā Purana is as follows:
This chapter details the descent of Bhagavān Paraśurāma, the warrior-sage Avatāra of Bhagavān Vishṇu born as the son of Sage Jamadagni and Reṇukā in the Bhṛgu line. When the tyrannical monarch Kārtavīryārjuna (ruler of the Haihaya dynasty) visited Jamadagni's hermitage, the sage received the king's vast army with royal hospitality through the power of his divine Surabhi cow. Driven by greed, Kārtavīryārjuna forcibly stole the cow and calf. Learning of this impiety, Bhagavān Paraśurāma wielded His formidable axe, attacked the king's capital of Māhishmatī, severed Kārtavīryārjuna's one thousand arms, and eliminated his entire army, retrieving the sacred cow to His father's ashram.