18 - యయాతి చరితము

శ్రీశుక ఉవాచ

యతిర్యయాతస్సంయాతియతీర్వియతి: కృతః

షడిమే నహుషస్యాసన్నింద్రియాణీవ దేహినః

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ప్రాణధారులకు శ్రోత్ర-త్వజ్ నేత్ర-జిహ్వా-ఝణములు మరియు మనస్సు అనే ఆరు ఇంద్రియములు న్నట్లే -- (ఆయువు పుత్రుడైన) నహుషునకు యతి, యయాతి, సంయా తి, ఆయతి, నియతి మరియు కృతి అనే ఆర్గురు పుత్రులు (వశవర్తులై కార్యకారులై ఉండిరి.

రాజ్యం నైచ్చద్యతిః పిత్రా దత్తం తత్పరిణామవిత్

యత్ర ప్రవిష్టః పురుష ఆత్మానం నావబుధ్యతే  

తండ్రి యతికి రాజ్యమునిచ్చెను. కాని, ఆయన దానికి ఇష్టపడలే దు. ఎందుకంటే, రాజ్యమును స్వీకరిస్తే వచ్చే పరిణామములు (అనర్థములు) ఆయనకు తెలియును. రాజ్యవ్యవహారములలో ప్రవేశించిన వ్యక్తి ఆత్మస్వరూపమును తెలియలేడు.

పితరి భ్రంశితే స్థానాదింద్రాణ్యా ధర్షణాద్ద్విజైః

ప్రాపితేఽజగరత్వం వై యయాతిరభవన్నృపః

నహుషుడు ఇంద్రపత్నియగు శచీదేవి పొందును కోరుట అనే దోషము కారణముగా అగస్త్యాది మహర్షులచే శపించబడి ఇంద్రపదము నుండి భ్రష్టుడై కొండచిలువ యైనాడు. ఆ సమయములో యయాతి రాజాయెను.

చతసృష్వాదశద్దిక్షు భ్రాతౄన్ భ్రాతా యవీయసః

కృతదారో జుగోపోర్వీం కావ్యస్య వృషపర్వణః  

యయాతి తన తమ్ములను నలుగురిని నాలుగు దిక్కులయందు ప్రజాపాలన కొరకు నియోగించెను. ఆయన తాను శుక్రాచార్యుని కుమార్తె ను, మరియు వృషపర్వుడనే రాక్షసరాజు కుమార్తెను వివాహమాడి రాజ్య మును పాలించెను.

రాజోవాచ

బ్రహ్మర్షిర్భగవాన్ కావ్యః క్షత్రబంధుశ్చ నాహుషః

రాజన్యవిప్రయోః కస్మాద్వివాహః ప్రతిలోమకః  

పరీక్షిన్మహారాజు ఇట్లు ప్రశ్నించెను --- పూజనీయుడగు శుక్రాచా ర్యుడు బ్రహ్మర్షి. కానీ, నహుషుని పుత్రుడగు యయాతియైతే క్షత్రియుడు. రాజునకు బ్రాహ్మణయువతితో ఈ తల్లక్రిందులు వివాహము జరుగుటకు కారణమేమి?

శ్రీశుక ఉవాచ

ఏకదా దానవేంద్రస్య శర్మిష్ఠా నామ కన్యకా

సఖీసహస్రసంయుక్తా గురుపుత్ర్యా చ భామినీ

దేవయాన్యా పురోద్యానే పుష్పితద్రుమసంకులే

వ్యచరత్కలగీతాలినలినీపులినేఽబలా

రాక్షసరాజగు వృషపర్వునకు శర్మిష్ఠయని ప్రసిద్ధి గాంచిన యువతియగు కుమార్తె గలదు. ఆ సుందరి ఒకనాడు వేయి చెలికత్తెలు వెంటరాగా, దానవగురువగు శుక్రాచార్యుని కుమార్తెయైన దేవయానితో కలిసి నగరమునందలి ఉద్యానవనములో విహరించెను. పుష్పించిన చెట్లు దట్టముగానున్న ఆ ఉద్యానమునందలి సరస్సులలో వికసించిన పద్మములయందున్న తుమ్మెదల మధురమగు గానముతో ఆ సరస్సుల ఇసుకతిన్నెలు ప్రతిధ్వనించుచుండెను.

తా జలాశయమాసాద్య కన్యాః కమలలోచనాః

తీరే న్యస్య దుకూలాని విజహ్రుస్సించతీర్మిథః  

కలువ కన్నుల ఆ కన్యలు సరస్సును చేరి ఒడ్డుపై వలువలనుంచి ఒకరిపైనొకరు నీటిని చిమ్ముకుంటూ విహరించిరి.

వీక్ష్య వ్రజంతం గిరిశం సహ దేవ్యా వృషస్థితమ్

సహసోత్తీర్య వాసాంసి పర్యధుర్వ్రీడితాః స్త్రియః  

ఇంతలో పార్వతీదేవితో గూడి నందిని యెక్కి వెళ్లుచున్న కైలాస పతియగు శివుడు ఆ యువతుల కంటబడెను. వెంటనే వారు ఒడ్డునకు వచ్చి వస్త్రములను కప్పుకొనిరి.

శర్మిష్ఠాజానతీ వాసో గురుపుత్ర్యాస్సమవ్యయత్

స్వీయం మత్వా ప్రకుపితా దేవయానీదమబ్రవీత్  

శర్మిష్ఠ హడావిడిలో శుక్రాచార్యుని కుమార్తెయగు దేవయాని యొక్క చీరను గుర్తుపట్టక తనది అని తలచి ధరించెను. దీనితో దేవయాని చాల కోపించి ఇట్లు పలికెను.

అహో నిరీక్ష్యతామస్యా దాస్యాః కర్మ హ్యసాంప్రతమ్

అస్మద్ధార్యం ధృతవతీ శునీవ హవిరధ్వరే  

ఆహా! ఈమె చేసిన అనుచితమగు పనిని కనుడు! యజ్ఞములో ఆడుకుక్క హవిస్సును ముట్టుకున్నట్లుగా, మాచే ధరించబడే వస్త్రమునీమె ధరించినది.

యైరిదం తపసా సృష్టం ముఖం పుంసః పరస్య యే

ధార్యతే యైరిహ జ్యోతిశ్శివః పంథాశ్చ దర్శితః  

వేదవేత్తలు ఈ జగత్తును తమ తపశ్శక్తిచే సృష్టించిరి. వారు పురుషోత్తముని ముఖరూపులు. వారు ఈ లోకములో చైతన్యరూపుడగు పరబ్రహ్మను తమ హృదయమునందు ధారణ చేయుదురు. వారు జనులకు మంగళకరమగు వేదమార్గమును నిర్దేశించేదరు.

యాన్ వందంత్యుపతిష్ఠంతే లోకనాథాస్సురేశ్వరాః

భగవానపి విశ్వాత్మా పొవన శ్శ్రీనికేతనః  

లోకపాలకులైన దేవశ్రేష్ఠులు వేదవేత్తలకు నమస్కరించి స్తుతించెదరు. జగత్తునకు సత్తాస్ఫూర్తులననుగ్రహించే శ్రీహరి భగవానుడు కూడ అటులనే చేయును. లక్ష్మికి నివాసస్థానమగు ఆ శ్రీహరి లోకములను పావనము చేయును.

వయం తత్రాపి భృగవశ్శిష్యోస్యా నః పితాఽసురః

అస్మద్ధార్యం ధృతవతీ శూద్రో వేదమివాసతీ  

అట్టి వేదవేత్తలగు బ్రాహ్మణులయందు కూడ మేము భృగువంశీయులము. ఈమె తండ్రియగు వృషపర్వుడు మాకు శిష్యుడు. ఈ దుష్టురాలు, వేదమునకు అనర్హుడు వేదమును వలె, మేము ధరించే వస్త్రమును తాను ధరించినది.

ఏవం శపంతీం శర్మిష్ఠా గురుపుత్రీమభాషత

రుషా శ్వసంత్యురంగీవ ధర్షితా దష్టదచ్ఛదా

శుక్రాచార్యుని పుత్రికయగు దేవయాని ఇట్లు తిట్టుచుండగా, ఈ విధముగా తిరస్కారమునకు గురియైన శర్మిష్ఠ కోపముతో క్రింది పెదవిని కొరుకుతూ, పామువలె దీర్ఘముగా నిట్టూర్చుచున్నదియై ఇట్లు పలికెను.

ఆత్మవృత్తమవిజ్ఞాయ కత్థసే బహు భిక్షుకి

కిం న ప్రతీక్షసేస్మాకం గృహాన్ బలిభుజో యథా

ఓ దేవయానీ! నీవు బిచ్చగత్తెవు. నీ బ్రదుకుదెరువును తెలుసుకోకుండా అధికముగా వదరుచున్నావు. మా ఇంటివద్ద మేము వేసే అన్నము కొరకు నీవు, కాకులు మరియు కుక్కలు వలె, ఎదురుచూచేదానవు కావా?

ఏవంవిధైస్సుపరుషైః క్షిప్త్వాఽఽచార్యసుతాం సతీమ్

శర్మిష్ఠా ప్రాక్షిపత్కూపే వాస ఆదాయ మన్యునా  

శుక్రాచార్యుని పుత్రికయగుటచే దేవయాని పూజకు అర్హురాలు. కాని, శర్మిష్ఠ ఆమెను ఈ విధమైన పరుషవాక్కులతో తిట్టి, ఆమె వస్త్రమును లాగుకొని నూతిలో పడద్రోసెను.

తస్యాం గతాయాం స్వగృహం యయాతిర్మృగయాం చరన్

ప్రాప్తో యదృచ్ఛయా కూపే జలార్థీ తాం దదర్శ హ  

అప్పుడు శర్మిష్ఠ తన యింటికి వెళ్లాను. ఇంతలో యయాతి వేటాడుతూ ఈశ్వరేచ్ఛచే అనుకోకుండా దప్పికను తీర్చుకొనుటకై నూతి వద్దకు వచ్చి ఆ దేవయానిని చూచెను.

దత్త్వా స్వముత్తరం వాసస్తస్యై రాజా వివాససే

గృహీత్వా పాణినా పాణిముజ్జహార దయాపరః

యయాతి మహారాజు దయాపరుడు. వస్త్రము లేని ఆమెకు ఆయన తన ఉత్తరీయమునిచ్చి, ఆమె చేతిని తన చేతితో పట్టుకొని పైకిలాగెను.

తం వీరమాహౌశనసీ ప్రేమనిర్భరయా గిరా

రాజంస్త్వయా గృహీతో మే పాణిః పరపురంజయ  

శుక్రాచార్యుని కుమార్తెయగు దేవయాని వీరుడగు ఆ యయాతిని ఉద్దేశించి ప్రేమతో నిండిన వాక్కుతో ఇట్లు పలికెను -- శత్రువుల నగరములను జయించే ఓ రాజా! నీవు నా చేతిని పట్టుకొంటివి.

హస్తగ్రాహోఽపరో మా భూద్గృహీతాయాస్త్వయా హి మే

ఏష ఈశకృతో వీర సంబంధో నౌ న పౌరుషః

యదిదం కూపలగ్నాయా భవతో దర్శనం మమ

నీవు పట్టుకున్న నా చేతిని మరియొక వ్యక్తి పట్టుకొననే రాదు (అనగా నాకు పాణిగ్రహణము మరియొక వ్యక్తితో కానే రాదు). మన యిద్దరి ఈ సంబంధము ఈశ్వరకృతమే గాని, మానవులచే చేయబడినది కాదు. ఏలయనగా, నూతిలో పడియున్న నాకు నీ దర్శనము (ఈశ్వరేచ్ఛచేతనే) కలిగినది.

న బ్రాహ్మణో మే భవితా హస్తగ్రాహో మహాభుజ

కచస్య బార్హస్పత్యస్య శాపాద్యమశపం పురా  

ఓ రాజా! నీ భుజములు గొప్పవి సుమా! నాకు వివాహము కొబోయేది బ్రాహ్మణునితో కాదని బృహస్పతి పుత్రుడగు కచుడు ఇదివరలో నన్ను శపించినాడు. ఆతనిని నేను కూడ (నీవు నేర్చిన విద్య నీకు ఫలించదని) శపించితిని.

యయాతిరనభిప్రేతం దేవోపహృతమాత్మనః

మనస్తు తద్గతం బుద్ధ్వా ప్రతిజగ్రాహ తద్వచః  

తాను కోరని ఈ సంబంధమును ఈశ్వరుడే తనకు కలిగించినాడనియు, తన మనస్సైతే ఆమెయందు లగ్నమైనదనియు తెలుసుకున్న యయాతి ఆమె వచనమును అంగీకరించెను.

గతే రాజని సా వీరే తత్ర స్మ రుదతీ పితుః

న్యవేదయత్తతస్సర్వముక్తం శర్మిష్ఠయా కృతమ్  

ఆ యయాతి మహారాజు వెళ్లిన తరువాత దేవయాని ఏడుస్తూ తండ్రి దగ్గరకు వచ్చి, శర్మిష్ఠ తనను నిందిస్తూ పలికిన పలుకులను, తనకు చేసిన ఆ పనిని అంతనూ తండ్రియగు శుక్రాచార్యునకు విన్నవించెను.

దుర్మనా భగవాన్ కావ్యః పౌరోహిత్యం విగర్హయన్

స్తువన్ వృత్తిం చ కాపోతీం దుహిత్రా స యయౌ పురాత్  

పూజనీయుడగు ఆ శుక్రాచార్యుని మనస్సు చెడిపోయెను. ఆయన పురోహిత వృత్తిని గర్హించెను. అంతకంటె పావురముల వలె పొలములలో క్రింద పడిన గింజలను ఏరుకొని తిని బ్రదుకుట శ్రేష్ఠమని ఆయన అట్టి బ్రదుకు దెరువు (ఉంఛవృత్తి) ను స్తుతించెను. ఆయన కుమార్తెతో గూడి నగరమును విడిచిపెట్టి వెళ్లెను.

వృషపర్వా తమాజ్ఞాయ ప్రత్యనీకవివక్షితమ్

గురుం ప్రసాదయన్మూర్ధ్నా పాదయోః పతితః పథి  

ఆ శుక్రాచార్యుడు తన శత్రువులగు దేవతల పక్షమున చేరి వారికి హితమును చెప్పగోరుచున్నాడని వృషపర్వ మహారాజు తలచెను. ఆయన వెంటనే మార్గమునందున్న ఆచార్యుని ప్రసన్నుని చేసుకొనుటకై ఆయన రెండు పాదములకు తల వంచి ప్రణమిల్లెను.

క్షణార్ధమన్యుర్భగవాన్ శిష్యం వ్యాచష్ట భార్గవః

కామోఽస్యాః క్రియతాం రాజన్నైనాం త్యక్తులిహోత్సహే  

పూజనీయుడగు శుక్రాచార్యుని కోపము అర్ధక్షణము మాత్రమే ఉండును. ఆయన శిష్యుడగు వృషపర్వునితో నిట్లు పలికెను -- ఓ రాజా! ఈ దేవయాని కోరికను నెరవేర్చుము. తల్లి లేని ఈ పిల్లను ఉదాసీనముగా విడిచి పెట్టే శక్తి నాకు లేదు.

తథేత్యవస్థితే ప్రాహ దేవయానీ మనోగతమ్

పిత్రా దత్తా యతో యాస్యే సానుగా యాతు మామను  

అటులనే అని వృషపర్వుడు అంగీకరించి నిలిచియుండెను. అప్పుడు దేవయాని తన మనస్సులోని మాటను ఇట్లు చెప్పెను -- నా తండ్రి నన్ను ఎవరికి ఇచ్చి వివాహము చేయునో, వారి గృహమునకు నేను వెళ్లునప్పుడు, శర్మిష్ఠ తన చెలికత్తెలతో బాటుగా నా వెంట రావలెను.

స్వానాం తత్సంకటం వీక్ష్య తదర్థస్య చ గౌరవమ్

దేవయానీం పర్యచరత్ స్త్రీసహస్రేణ దాసవత్  

శుక్రాచార్యుడు రాజ్యమును విడిచిపెట్టుట వలన తన తండ్రికి విపత్తు కలుగుననియు, శుక్రాచార్యుని నిలబెట్టుకొనుట రాజ్యముయొక్క సుస్థిరతకు చాల ప్రముఖమైన విషయమనియు శర్మిష్ఠ గుర్తించేను. ఆమె వేయిమంది చెలిగత్తెలతో గూడి దేవయానికి దాసి వలె పరిచర్యలను చేసెను.

నాహుషాయ సుతాం దత్త్వా సహ శర్మిష్ఠయోశనా

తమాహ రాజన్ శర్మిష్ఠామాధాస్తల్పే న కర్హిచిత్

శుక్రాచార్యుడు తన కుమార్తెయగు దేవయానిని నహుషుని పుత్రుడగు యయాతికిచ్చి వివాహము చేసెను. శర్మిష్ఠ దేవయాని వెంట వెళ్లెను. అపుడు శుక్రాచార్యుడు యయాతితో నిట్లనెను -- ఓ రాజా! ఏనాడైననూ శర్మిష్ఠతో సంబంధమును పెట్టుకొనకుము.

విలోక్యౌశనసీం రాజన్ శర్మిష్ఠా సప్రజాం క్వచిత్

తమేవ వవ్రే రహసి సఖ్యాః పతిమృతౌ సతీ  

కొంత కాలమునకు దేవయానికి సంతానము కలిగెను. యోగ్యురాలైన శర్మిష్ఠ ఆ పరిస్థితిని గమనించి ఒకనాడు ఏకాంతములో, తన చెలికత్తెయగు దేవయానియొక్క భర్తయైన ఆ యయాతినే వరించెను.

రాజపుత్ర్యాఽర్థితోఽపత్యే ధర్మం చావేక్ష్య ధర్మవిత్

స్మరన్ శుక్రవచః కాలే దిష్టమేవాభ్యపద్యత  

రాజపుత్రికయగు శర్మిష్ఠ తనకు సంతానము కావలెనని ధర్మము తెలిసిన యయాతిని కోరెను. ఆయన కూడ ధర్మమును పరిశీలించెను. పైగా, ఆయనకు శుక్రాచార్యుని హెచ్చరిక కూడ గుర్తులోనుండెను. అయిననూ, ఆయన ఆ సమయములో అది (శర్మిష్ఠతోడి పొందు) దైవనిర్ణయమేనని భావించెను.

యదుం చ తుర్వసుం చైవ దేవయానీ వ్యజాయత

ద్రుహ్యుం చానుం చ పూరుం చ శర్మిష్ఠా వార్షపర్వణీ  

దేవయానికి యదువు, తుర్వసుడు అనే పుత్రులు కలిగిరి. వృషపర్వుని కుమార్తెయగు శర్మిష్ఠకు కూడ ద్రుహ్యువు, అనువు, పూరువు అనే పుత్రులు కలిగిరి.

గర్భసంభవమాసుర్యా భర్తుర్విజ్ఞాయ మానినీ

దేవయానీ పితుర్గేహం యయౌ క్రోధవిమూర్ఛితా

వృషపర్వాసురుని కుమార్తెయగు శర్మిష్ఠ తన భర్తయగు యయాతి వలన సంతానమును పొందినదని దేవయానికి తెలిసెను. ఆ అభిమానవతి కోపముచే ఆవేశించబడినదియై తన తండ్రియగు శుక్రాచార్యుని ఇంటికి వెళ్లిపోయెను.

ప్రియామనుగతః కామీ వచోభిరుపమంత్రయన్

న ప్రసాదయితుం శేకే పాదసంవాహనాదిభిః

యయాతికి దేవయానియందు ప్రేమ గలదు. కావుననే, ఆయన కూడ ఆమె వెంట వెళ్లెను. మార్గములో మంచి మాటలతో, పాదములను స్పృశించుట, ప్రయాణములో సహకరించుట మొదలగు క్రియలతో ఆమెను ప్రసన్నురాలను చేయుటకు యత్నించి ఆయన విఫలుడాయెను.

శుక్రస్తమాహ కుపితః స్త్రీకామానృతపూరుష

త్వాం జరా విశతాం మంద విరూపకరణీ నృణామ్  

కోపించిన శుక్రాచార్యుడు యయాతితో నిట్లనెను -- ఓరీ మూర్ఖా! నీకు స్త్రీలయందు లోభము ఎక్కువ. అసత్యమును చెప్పుటకు వెనుకాడని వ్యక్తివి నీవు. మానవులకు వికృతరూపమును కలిగించే ముసలితనము నిన్ను (వెంటనే) ప్రవేశించు గాక!

యయాతిరువాచ

అతృప్తోఽస్మ్యద్య కామానాం బ్రహ్మన్ దుహితరి స్మ తే

వ్యత్యస్యతాం యథాకామం వయసా యోఽభిధాస్యతి  

యయాతి ఇట్లు పలికెను --- ఓ మహర్షీ! నీ కుమార్తెతో గూడి నేను అనుభవించిన భోగముల యెడల నాకింకనూ తృప్తి కలుగలేదు. (శుక్రాచార్యుడు ఇట్లు పలికెను) -- ఎవడైతే నీతో తన యౌవనమును మార్పిడి చేయుటకంగీకరించునో, వానితో యథేచ్ఛగా నీ ముసలితనమును మార్పు చేసుకొనెదవు గాక!

ఇతి లబ్ధవ్యవస్థానః పుత్రం జ్యేష్ఠమవోచత

యదో తాత ప్రతీచ్ఛేమాం జరాం దేహి నిజం వయః  

మాతామహకృతాం వత్స న తృప్తో విషయేష్వహమ్

వయసా భవదీయేన రం స్యే కతిపయాస్సమాః  

ఈ విధముగా యయాతి శుక్రాచార్యునినుండి ముసలితనమును వినిమయము చేసే వ్యవస్థను పొందెను. ఆయన తన పెద్ద కొడుకగు యదువుతో నిట్లనెను -- ఓ కుమారా! నాకు మీ తాతగారు (శుక్రాచార్యుడు) కలిగించిన ఈ ముసలితనమును నీవు స్వీకరించి నీ యౌవనమును నాకిమ్ము. ఓ కుమారా! నాకింకనూ ఇంద్రియభోగములయందు తృప్తి కలు గలేదు. నేను నీ మౌవనముతో కొన్ని సంవత్సరములు నిరంతరముగా రమించెదను.

యదురువాచ

నోత్స హే జరసా స్థాతుమంతరా ప్రాప్తయా తవ

అవిదిత్వా సుఖం గ్రామ్యం వైతృష్ణ్యం నైతి పూరుషః  

యదువు ఇట్లు పలికెను --- తమకు మధ్యవయస్సులో సంప్రాప్తమైన ముసలిదనమును స్వీకరించి ముసలివాడనై జీవించుటకు నాకు ఉత్సాహము లేదు. ఇంద్రియసుఖములననుభవించకుండా వ్యక్తికి వైరాగ్యము కలుగదు.

తుర్వసుశ్చోదితః పిత్రా ద్రుహ్యుశ్చానుశ్చ భారత

ప్రత్యాచఖ్యురధర్మజ్ఞా హ్యనిత్యే నిత్యబుద్ధయః

భరతవంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! యయాతి తుర్వసుని, ద్రుహ్యుని, మరియు అనువును కూడ అదే విధముగా ఆదేశించగా, వారు తమ యౌవనమునిచ్చుటకు నిరాకరించిరి. ఎందుకంటే, వారికి ధర్మము తెలియదు. పైగా, అనిత్యమగు యౌవనమునందు నిత్యమనే ధారణ వారికి ఉండెను.

అపృచ్ఛత్తనయం పూరుం వయసోనం గుణాధికమ్

న త్వమగ్రజవద్వత్స మాం ప్రత్యాఖ్యాతుమర్హసి  

యయాతియొక్క చిన్న కొడుకగు పూరువు వయస్సులో చిన్నవాడే అయినా, గుణములలో అధికుడు. యయాతి ఆతనితో నిట్లనెను -- ఓ కుమారా! నీవు నీ అన్నలవలె నన్ను తిరస్కరించుట తగదు.

పూరురువాచ

కో ను లోకే మనుష్యేంద్ర పితురాత్మకృతః పుమాన్

ప్రతికర్తుం క్షమో యస్య ప్రసాదాద్విందతే పరమ్  

పూరువు ఇట్లు పలికెను --- ఓ మహారాజా! లోకములో తనకు జన్మనిచ్చిన తండ్రియొక్క ఋణమును తీర్చగల వ్యక్తి ఎవడైనా గలడా?(లేడు). తండ్రియొక్క అనుగ్రహము వలన పుత్రునకు ఉన్నతమైన శ్రేయస్సు లభించును.

ఉత్తమశ్చింతితం కుర్యాత్ప్రోక్తకారీ తు మధ్యమః

అధమోఽశ్రద్ధయా కుర్యాదకర్తోచ్చరితం పితుః  

తండ్రి మనస్సులోని మాటను పైకి చెప్పకుండానే నిర్వర్తించే పుత్రుడు ఉత్తముడు. తండ్రి చెప్పిన దానిని చేయువాడు మధ్యముడు. తండ్రి చెప్పిన దానిని శ్రద్ధ లేకుండా చేయువాడు అధముడు. తండ్రి చెప్పిన దానిని అసలే చేయనివాడు తండ్రియొక్క మాలిన్యమువంటి వాడు మాత్రమే.

ఇతి ప్రముదితః పూరుః ప్రత్యగృహ్ణాజ్జరాం పితుః

సోపి తద్వయసా కామాన్ యథావజ్జుజుషే నృప

ఓ పరీక్షిన్మహారాజా! ఇట్లు పలికీ పూరువు ఆనందముతో తండ్రి యొక్క ముసలిదనమును స్వీకరించెను. అపుడా యయాతి పూరువు యొక్క యౌవనమును పొంది భోగములను యథేచ్ఛగా సేవించెను.

సప్తద్వీపపతిస్సమ్యక్ పితృవత్పాలయన్ ప్రజాః

యథోపజోషం విషయాన్ జుజుషేఽవ్యాహతేంద్రియః  

భరతవర్షములలోని తొమ్మిది ద్వీపములలో ఏడింటికి ప్రభువు యయాతియే. ఆయన ప్రజలను తండ్రివలె చక్కగా పాలించెను. ఆయన అలుపునెరుగని ఇంద్రియములతో విషయభోగములను తనకు ప్రీతి కలిగేటంతవరకు సేవించెను.

దేవయాన్యప్యనుదినం మనోవాగ్దేహవస్తుభిః

ప్రేయసః పరమాం ప్రీతిమువాహ ప్రేయసీ రహః  

ప్రియురాలగు దేవయాని కూడ ప్రతిదినము ఏకాంతమునందు తన ప్రియుడగు యయాతికి మనస్సుతో అతిశయించిన ప్రేమను చూపి, వాక్కుతో మధురముగా మాటలాడి, దేహముతో పరిచర్యలను చేసి, ఇంకా అభీష్టమగు వస్తువులను సమర్పించెను. ఈ విధముగా ఆమె ఆయనకు సర్వాతిశాయియగు ప్రీతిని కలిగించెను.

అయజద్యజ్ఞపురుషం క్రతుభిర్భూరిదక్షిణైః

సర్వదేవమయం దేవం సర్వవేదమయం హరిమ్  

సకలదేవతలు యజ్ఞేశ్వరుడగు శ్రీహరియొక్క రూపములు మాత్రమే. సకలవేదములు కూడ ఆయన స్వరూపమే. అట్టి శ్రీహరి దేవుని యయాతి అధికమగు దక్షిణలనిచ్చి క్రతువులను చేసి ఆరాధించెను.

యస్మిన్నిదం విరచితం వ్యోమ్నీవ జలదావలిః

నానేవ భాతి నాభాతి స్వప్నమాయామనోరథః

ఈ జగత్తు స్వప్నము వలె, ఇంద్రజాలము వలె కేవలము మనస్సుయొక్క విలాస మాత్రమే. ఈ జగత్తు ఆత్మరూపుడగు శ్రీహరి (అధిష్ఠానము) యందు, మేఘపంక్తి ఆకాశమునందు వలె, ప్రకటమగుచున్నది. ఈ జగత్తు ఆ శ్రీహరియొక్క ప్రకాశమునందే ప్రకాశించుచున్నది. సుషుప్తి ప్రళయములయందు ఆ శ్రీహరియందే విలీనమై భాసించుట లేదు.

తమేవ హృది విన్యస్య వాసుదేవం గుహాశయమ్

నారాయణమణీయాంసం నిరాశీరయజత్పృభుమ్  

సకలజగన్నివాసుడు మరియు చైతన్యస్వరూపుడు అగు నారాయణుడు సకలప్రాణులలో హృదయమనే రహస్యస్థానమునందు నివసించును. యయాతి కామనలను విడిచిపెట్టి సూక్ష్మాతిసూక్ష్ముడు మరియు జగన్నాథుడు అగు ఆ నారాయణుని మాత్రమే హృదయమునందు నిలిపి, ఆయనను యజ్ఞముల ద్వారా ఆరాధించెను.

ఏవం వర్షసహస్రాణి మనష్షష్ఠైర్మనస్సుఖమ్

విదధానోపీ నాతృప్యత్సార్వభౌమః కదింద్రియైః

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం

నవమస్కంధే అష్టాదశోSధ్యాయః

యయాతి చక్రవర్తియే అయిననూ, వేలాది సంవత్సరములు నిరంతరముగా కామభోగములను శ్రోత్ర-త్వఙ్-నేత్ర-జిహ్వా-ఘ్రాణములు మరియు నునస్సు అనే దుష్టములగు (బహిర్ముఖములైన) ఇంద్రియములతో అనుభవించుచున్ననూ, సంతృప్తిని చెందలేదు.

శ్రీమద్భాగవత మహాపురాణమునందు తొమ్మిదవ స్కంధములో యయాతి చరితమును వర్ణించే పదునెనిమిదవ అధ్యాయము ముగిసినది.