7 - త్రిశంకు చరితము - హరిశ్చంద్రుని వృత్తాంతము

శ్రీశుక ఉవాచ

 మాంధాతుః పుత్రప్రవరో యోఽoబరీషః ప్రకీర్తితః

 పితామహీన ప్రవృతో మౌవనాశ్వశ్చ తత్సుతః

హారీతస్తస్య పుత్రోఽభూన్మాంధాతృప్రవరా ఇమే

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- మాంధాతయొక్క పుత్రులలో అంబరీషుడు సర్వోత్తముడనీ నేను వర్ణించి యున్నాను. అంబరీషుని తాత గారైన యువనాశ్వుడు ఆయనను పుత్రునిగా స్వీకరించెను. అంబరీషుని పుత్రుడు యౌవనాశ్వుడు. యౌవనాశ్వుని పుత్రుడు హారీతుడు. వీరు మాంధాతయొక్క వంశమునకు గోత్రప్రవర్తకులైనారు.

నర్మదా భ్రాతృభిర్దత్తా పురుకుత్సాయ యోరగైః

 తయా రసాతలం నీతో భుజగేంద్రప్రయుక్తయా

నాగులు తమ సోదరియగు నర్మదను పురుకుత్సునకిచ్చి వివాహమును చేసిరి. నాగరాజగు వాసుకి ఆజ్ఞచే ఆమె తన భర్తను రసాతలమునకు తీసుకొని వెళ్లాను.

గంధర్వానవధీత్తత్ర వధ్యాన్ వై విష్ణుశక్తిధృక్

 నాగాల్లబ్దవరస్సర్పాదభయం స్మరతామిదమ్  

ఆ పురుకుత్సుడు ఆ రసాతలములో విష్ణువుయొక్క శక్తిని ధరించి నిశ్చయముగా వధకు అర్హులైన గంధర్వులను వధించేను. ఈ వృత్తాంతమును స్మరించువారలకు సర్పభయము ఉండదు అని, నాగరాజగు వాసుకి ఆయనకు వరమునిచ్చెను.

త్రసద్దస్యుః పౌరుకుత్సో యోఽనరణ్యస్య దేహకృత్

హర్యశ్వస్తత్సుతస్తస్మాదరుణోఽథ త్రిబంధనః

పురుకుత్సును పుత్రుడు త్రసద్దస్యువు. త్రసద్దస్యుని పుత్రుడు అనరణ్యుడు. అనరణ్యుని పుత్రుడు హర్యశ్వడు. హర్యశ్వుని పుత్రుడు అరుణుడు. అరుణుని పుత్రుడు త్రిబంధనుడు.

తస్య సత్యవ్రతః పుత్రస్త్రిశంకురితి విశ్రుతః

 ప్రాప్తశ్చండాలతాం శాపాద్గురోః కౌశికతేజసా

 సశరీరో గతస్స్వర్గమద్యాపి దివి దృశ్యతే

 పాతితోఽవాక్శిరా దేవై స్తేనైవ స్తంభితో బలాత్

ఆ త్రీబంధనుని పుత్రుడు సత్యవ్రతుడు. ఆయన త్రిశంకుడు అనే పేరుతో ప్రసిద్దిని గాంచినాడు. గురువగు వసిష్ఠుని శాపము వలన ఆయన కసాయి యైనాడు. కానీ, ఆయన విశ్వామిత్ర మహర్షి యొక్క తపోబలముచే బొందితోనే స్వర్గమును చేరినాడు. అప్పుడు దేవతలు ఆయనను తల క్రిందుగా త్రోసివేయగా, విశ్వామిత్రుడు తపోబలముచే ఆయనను రోదసియందు నిలబెట్టినాడు. ఇప్పటికీ ఆయన అచట అట్లే కనబడును.

త్రైశంకవో హరిశ్చంద్రో విశ్వామిత్రవసిష్ఠయోః

యన్నిమిత్తమభూద్యుద్ధం పక్షిణోర్బహువార్షికమ్  

త్రిశంకుని పుత్రుడు హరిశ్చంద్రుడు. ఆయన కారణముగనే విశ్వామిత్ర వసిష్ఠులు (పరస్పర శాపములచే) పక్షుల రూపమును పొంది చాల సంవత్సరములు యుద్ధమును చేసిరి.

సోఽనపత్యో విషణ్ణాత్మా నారదస్యోపదేశతః

వరుణం శరణం యాతః పుత్రో మే జాయతాం ప్రభో  

హరిశ్చంద్రునకు సంతానము కలుగలేదు. అపుడాయన నారదుని ఉపదేశమును బట్టి వరుణుని -- ఓ ప్రభూ! నాకు పుత్రుడు కలుగునట్లు చేయుము -- అని శరణు వేడెను.

యది వీరో మహారాజ తేనైవ త్వాం యజే ఇతి

తథేతి వరుణేనాస్య పుత్రో జాతస్తు రోహితః

ఓ పరీక్షిన్మహారాజా! నాకు పుత్రుడు జన్మించినచో, నేను వానిని నీకు సమర్పించి, ఆ విధముగా నిన్ను ఆరాధించగలను, అని హరిశ్చంద్రుడు చెప్పెను. తథాస్తు, అని వరుణుడు అనుగ్రహించగా, ఆయనకు రోహితుడనే పుత్రుడు పుట్టెను.

జాతస్సుతో హ్యనేనాంగ మాం యజస్వేతి సోఽబ్రవీత్

 యదా పశుర్నిర్ధశస్స్యాదథ మేధ్యో భవేదితి

ఓయీ! పుత్రుడు పుట్టినాడు గదా! వీనితో నన్ను ఆరాధించుము -- అని వరుణుడు హరిశ్చంద్రునితో పలికెను. పశువుగా నిర్దేశించబడిన ఈ బాలకునకు పది రోజుల వయస్సు దాటిన తరువాత యజ్ఞమునకు యోగ్యుడు అగును, అని హరిశ్చంద్రుడు చెప్పెను.

నిర్ధశే చ స ఆగత్య యజ స్వేత్యాహ సోఽబ్రవీత్

దంతాః పశోర్యజ్జా యేరన్నథ మేధ్యో భవేదితి  

పిల్లవానికి పది రోజులు దాటగానే వరుణుడు వచ్చి, ఇప్పుడు యజ్ఞమును చేయుమని హరిశ్చంద్రునితో చెప్పెను. అప్పుడు ఆయన ఇట్లు బదులిడెను -- పిల్లవానికి దంతములు వచ్చిన తరువాతనే యజ్ఞమునకు యోగ్యుడు అగును.

జాతా దంతా యజ స్వేతి స ప్రత్యాహాథ సోఽబ్రవీత్

యదా పతంత్యస్య దంతా అథ మేధ్యో భవేదితి  

పిల్లవానికి పళ్లు వచ్చినవి, ఇప్పుడు యజ్ఞమును చేయుము, అని వరుణుడు రాజునుద్దేశించి పలికెను. పాలపళ్లు ఊడిపోయిన తరువాతనే ఈ బాలకుడు యజ్ఞమునకు అర్హుడగునని ఆ రాజు చెప్పెను.

పశోర్నిపతీతా దంతా యజ స్వేత్యాహ సోఽబ్రవీత్

 యదా పశోః పునర్దంతా జాయంతేఽథ పశుశ్శుచిః

పశువుగా నిర్దేశించబడిన ఈ బాలకునకు పాలపళ్లు ఊడినవి గావున, ఇప్పుడు యజ్ఞమును చేయుమని వరుణుడు (కొంత కాలము తరువాత) రాజుతో పలికెను. ఈ బాలకునకు మరల కోత్త పళ్లు వచ్చినప్పుడు మాత్రమే ఈతడు యజ్ఞమునకు యోగ్యుడగునని రాజు పలికెను.

పునర్జాతా యజ స్వేతి స ప్రత్యాహాథ సోఽబ్రవీత్

 సాన్నాహికో యదా రాజన్ రాజన్యోఽథ పశుశ్శుచిః  

దంతములు తిరిగి వచ్చినవి గనుక, ఇప్పుడు యజ్ఞమును చేయుము -- అనీ వరుణుడు రాజునుద్దేశించి పలికెను. అపుడా హరిశ్చంద్ర మహారాజు ఇట్లు పలికెను -- ఓ వరుణ దిక్పాలకా! ఈ బాలకుడు రాజకుమారుడు. కావున, కవచమును ధరించినప్పుడు మాత్రమే యజ్ఞ పశువుయొక్క యోగ్యతను పొందును.

ఇతి పుత్రానురాగేణ స్నేహయంత్రిత చేతసా

 కాలం వంచయతా తం తముక్తో దేవస్త మైక్షత

పుత్రునియందలి అనురాగము ఆసక్తిగా మారి హరిశ్చంద్ర మహారాజుయొక్క మనస్సును వశము చేసుకొనెను. కావుననే, ఆయన ఆయా కాలములు (పది రోజులు ఇత్యాది) వచ్చినప్పుడు వాటిని తప్పించుకొనుచుండెను. ఈ విధముగా రాజు పలుకగా, వరుణ దేవుడు యజ్ఞకాలమును గురించి ఎదురు చూచెను.

రోహితస్తదభిజ్ఞాయ పితుః కర్మ చికీర్షితమ్

ప్రాణప్రేప్సుర్ధనుష్పాణిరరణ్యం ప్రత్యపద్యత           

తండ్రి చేయగోరే ఆ యజ్ఞమును గురించి రోహితుడు తెలుసుకోనేను. ఆతడు తన ప్రాణములను రక్షించుకొనగోరి, ధనుస్సును చేతబట్టి అడవికి వెళ్లాను.

పితరం వరుణగ్రస్తం శ్రుత్వా జాతమహోదరమ్

రోహితో గ్రామమేయాయ తమింద్రః ప్రత్య షేధత  

హరిశ్చంద్ర మహారాజును వరుణుడు పీడించేను. ఆయనకు నీరు పట్టి పొట్ట పెద్దది ఆయెను. ఈ విషయమును విని రోహితుడు గ్రామమునకు తిరిగి వచ్చుటకు సంసిద్ధుడగుచుండగా, ఇంద్రుడాతనిని వారించెను.

భూమేః పర్యటనం పుణ్యం తీర్థక్షేత్రని షేవణైః

రోహితాయాదిశచ్చ క్రస్సోఽప్యరణ్యేఽవసత్సమామ్

తీర్థములను, క్షేత్రములను సేవిస్తూ భూమిని పర్యటించుట పుణ్యప్రదమగునని ఇంద్రుడు రోహితుని ఆదేశించెను. ఆ రోహితుడు ఒక సంవత్సరకాలము అడవిలోనే ఉండిపోయెను.

ఏవం ద్వితీయే తృతీయే చతుర్దే పంచమే తథా

అభ్యేత్యాభ్యేత్య స్థవిరో విప్రో భూత్వాఽఽహ వృత్రహా

ఇదే విధముగా రెండవ, మూడవ, నాల్గవ, ఐదవ సంవత్సరముల పిదప కూడ వృత్రశత్రువగు ఇంద్రుడు ముసలి బ్రాహ్మణుని రూపములో మరల మరల వచ్చి రోహితుని అటులనే ఆదేశించెను.

షష్ఠం సంవత్సరం తత్ర చరిత్వా రోహితః పురీమ్

 ఉపవ్రజన్నజీగర్తాదక్షీణాన్మధ్యమం సుతమ్

రోహితుడు ఆరవ సంవత్సరమును కూడ ఆ అడవిలో గడిపి, తరువాత నగరమునకు తిరిగివచ్చుచుండెను. అపుడాతడు అజీర్తుని నుండి ఆయన మధ్యమపుత్రుని కొనుగోలు చేసేను.

శునశ్శేపం పశుం పీత్రే ప్రదాయ సమవందత

తతః పురుషమేధేన హరిశ్చంద్రో మహాయశాః

ముక్తోదరోఽయజద్దేవాన్ వరుణాదీన్మహత్కథః

విశ్వామిత్రోఽభవత్తస్మిన్ హోతా చాధ్వర్యురాత్మవాన్

జమదగ్నిరభూద్భ్రహ్మా వసిష్ఠోఽయాస్యసామగః

తస్మై తుష్టో దదావింద్రశ్శాతకౌంభమయం రథమ్  

రోహితుడు శునశ్శేపుని యజ్ఞపశువునుగా తండ్రికి సమర్పించి నమస్కరించెను. ఆపుడా హరిశ్చంద్ర మహారాజు పురుషమేధమనే యజ్ఞమును చేసి వరుణుడు, అగ్ని మొదలగు దేవతలనారాధించి, జలోదర వ్యాధినుండి విముక్తుడాయెను. ఈ విధముగా హరిశ్చంద్రుని కీర్తి, వృత్తాంతము చాల గొప్పవి. ఆ యజ్ఞమునందు విశ్వామిత్రుడు హోత కాగా, మనోనిగ్రహములో దిట్టయగు జమదగ్ని అధ్వర్యుడు, వసిష్ఠుడు బ్రహ్మ, అయా స్యుడు సామమును గానము చేసే ఉద్గాత అయిరి. ఇంద్రుడు సంతోషించి హరిశ్చంద్రునకు బంగరు రథమునిచ్చెను.

శునశ్శేపస్య మాహాత్మ్యముపరిష్టాత్ప్రచక్ష్యతే

 సత్యసారాం ధృతిం దృష్ట్వా సభార్యస్య చ భూపతేః

విశ్వామిత్రో భృశం ప్రీతో దదావవిహతాం గతిమ్

శునశ్శేపుని మాహాత్మ్యమును తరువాత చెప్పగలను. హరిశ్చంద్రుడు మరియు ఆయన భార్య కూడ సత్యమునే ధైర్యముతో పాలించిరి. అదియే వారి బలము. ఈ విషయమును చూచిన విశ్వామిత్ర మహర్షి మిక్కిలి ప్రీతిని పొంది, ఆయనకు ఆత్మజ్ఞానమునిచ్చెను. ఆత్మజ్ఞానము మోక్షఫలమును ఇచ్చును.

మనః పృథివ్యాం తామద్భిస్తేజసాపోఽనిలేన తత్

ఖే వాయుం ధారయంస్తచ్చ భూతాదౌ తం మహాత్మని

తస్మిన్ జ్ఞానకలాం ధ్యాత్వా తయాఽజ్ఞానం వినిర్ధహన్

ఆ హరిశ్చంద్ర మహారాజు మనస్సును పృథివీతత్త్వమునందు, పృథివిని జలములయందు, జలతత్త్వమును అగ్నియందు, అగ్నిని వాయు వునందు, వాయువును ఆకాశమునందు, ఆకాశమును పంచభూతములకు కారణమగు సమష్టి-అహంకారమునందు, ఆ అహంకారమును మహత్త త్వము (సమష్టి బుద్దిశక్తి) నందు విలీనము చేసెను. ఆయన ఆ మహత్తత్త్వ మునందు ఆత్మజ్ఞానమును ధ్యానించి, దానిచే అజ్ఞానమును నిశ్శేషముగా దహించెను.

హిత్వా తాం స్వేన భావేన నిర్వాణసుఖసంవిదా

 అనిర్దేశ్యాప్రతర్క్యేణ తస్థౌ విధ్వస్తబంధనః

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే నవమస్కంధ సప్తమోఽధ్యాయః

ఆ ఆత్మజ్ఞానము దుఃఖలేశము లేని ఆనందఘనము. దానియందు జ్ఞానవృత్తిరూపము కూడ విలీనమగును. దానిని ఆత్మరూపముగా తెలుసుకున్న హరిశ్చంద్రునకు అజ్ఞానబంధము నశించెను. మాటలచే వర్ణించశక్యము కానిది, మనస్సుతో ఊహించ శక్యము కానిది అగు ఆ అఖండస ద్రూపమునందు ఆయన విలీనుడై పరబ్రహ్మరూపుడాయెను.

శ్రీమద్బాగవత మహాపురాణమునందు తొమ్మిదవ స్కంధములో త్రిశంకు చరితమును, హరిశ్చంద్రుని వృత్తాంతమును వర్ణించే ఏడవ అధ్యాయము ముగిసినది (7).