22 - పాంచాల – కురు - మగధ వంశముల వర్ణనము

శ్రీశుక ఉవాచ

మిత్రేయుశ్చ దివోదాసాచ్చ్యవనస్తత్సుతో నృప

సుదాసస్సహదేవోSథ సోమకో జంతుజన్మకృత్

తస్య పుత్రశతం తేషాం యవీయాన్ పృషతస్సుతః

ద్రుపదో ద్రౌపదీ తస్య ధృష్టద్యుమ్నాదయస్సుతాః  

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! ముద్గలుని పుత్రుడగు దివోదాసునకు మిత్రేయువు పుత్రుడు. మిత్రేయువునకు చ్యవ నుడు, సుదాసుడు, సహదేవుడు, సోమకుడు అనే నలుగురు పుత్రులు ఉండిరి. వారిలో సోమకునకు వందమంది పుత్రులు కలిగిరి. వారిలో జంతువు పెద్దవాడు కాగా, పృషతుడు కనిష్ఠుడు. పృషతుని పుత్రుడు ద్రుపదుడు. ద్రుపదునకు ద్రౌపది అనే కుమార్తె, మరియు ధృష్టద్యుమ్ను డు, శిఖండి మొదలగు పుత్రులు ఉండిరి.

ధృష్టద్యుమ్నాద్ధృష్టకేతుర్భార్మ్యాః పంచాలకా ఇమే

యోSజమీఢసుతో హ్యన్య ఋక్షస్సంవరణస్తతః

ధృష్టద్యుమ్నుని పుత్రుడు ధృష్టకేతువు. భర్మ్యాశ్వుని వంశమునకు చెందిన ఈ రాజులు పాంచాలురు (పంచాల దేశరాజులు) అనబడుదురు. అజమీడునకు ఋక్షుడనే మరియొక పుత్రుడు గలడు. ఆ ఋక్షుని పుత్రుడు సంవరణుడు.

తపత్యాం సూర్యకన్యాయాం కురు క్షేత్రపతిః కురుః

పరీక్షిత్సుధనుర్జహ్నుర్నిషధాశ్వః కురోస్సుతాః  

సంవరణునకు సూర్యుని పుత్రికయగు తపతియందు కురువు జన్మించి కురుక్షేత్రమునకు అధిపతి ఆయెను. ఆయనకు పరీక్షిత్తు, సుధనువు, జహ్నువు, నిషధాశ్వుడు అనే నలుగురు పుత్రులు కలిగిరి.

సుహోత్రోభూత్సుధనుషశ్చ్యవనోథ తతః కృతీ

వసుస్తస్యోపరిచరో బృహద్రథముఖాస్తతః

కుశాంబమత్స్యప్రత్యగ్రచేదిపాద్యాశ్చ చేదిపాః

సుధనువుయొక్క పుత్రుడు సుహోత్రుడు. సుహోత్రుని పుత్రుడు చ్యవనుడు. చ్యవనుని పుత్రుడు కృతి. కృతియొక్క పుత్రుడు ఉపరిచర వసువు. ఉపరిచర వస్తువునకు బృహద్రథుడు, కుశాంబుడు, మత్యుడు, ప్రత్యగ్రుడు, చేదిపుడు మొదలగు పుత్రులు కలిగిరి. వీరిలో బృహద్రథుడు పెద్దవాడు. వీరు చేదిదేశమునకు ప్రభువులైరి.

బృహద్రథాత్కుశాగ్రోభూదృషభస్తస్య తత్సుతః

జజ్ఞే సత్యహిత్వోపత్యం పుష్పవాంస్తత్సుతో జహుః

అన్యస్యాం చాపి భార్యాయాం శకలే ద్వే బృహద్రథాత్  

బృహద్రథుని పుత్రుడు కుశాగ్రుడు. కుశాగ్రుని పుత్రుడు ఋషభుడు. ఋషభుని పుత్రుడు సత్యహితుడు. సత్యహితుని పుత్రుడు పుష్పవంతుడు. పుష్పవంతుని పుత్రుడు జహువు. బృహద్రథునకు ఇద్దరు భార్యలు గలరు. వారిలో రెండవ భార్య (ఒకే శరీరముయొక్క) రెండు ముక్కలను ప్రసవించెను.

తే మాత్రా బహిరుత్సృష్టే జరయా చాభిసంధితే

జీవ జీవేతి క్రీడంత్యో జరాసంధోభవత్సుతః  

తల్లి ఆ రెండు ముక్కలను బయట పారవేసెను. జర అనే రాక్షసి ఆటలాడుతూ, ఆ ముక్కలను రెండింటినీ తీసుకొని బ్రదుకుము, బ్రదుకుము, అని పలుకుతూ దగ్గరకు చేర్చి సంధానము చేయగా, ఆ శిశువు బ్రదికెను. ఆ శిశువే బృహద్రథునకు జరాసంధుడు (జరచే సంధానము చేయబడినవాడు) అనే పుత్రుడు ఆయెను.

తతశ్చ సహదేవోభూత్సోమాపిర్యచ్చ్రుతశ్రవాః

పరీక్షిదనపత్యోభూత్సురథో నామ జాహ్నవః

జరాసంధుని పుత్రుడు సహదేవుడు. సహదేవుని పుత్రుడు సోమాపి. సోమాపియొక్క పుత్రుడు శ్రుతశ్రవసుడు. కురుపుత్రుడగు పరీక్షిత్తునకు సంతానము కలుగలేదు, కురుపుత్రుడగు జహ్నువునకు సురథుడని ప్రసిద్ది గాంచిన పుత్రుడు కలిగెను.

తతో విదూరథస్తస్మాత్సార్వభౌమస్తతోSభవత్

జయ సేనస్తత్తనయో రాధికోఽతోఽయుతో హ్యభూత్

సురథుని పుత్రుడు విదూరథుడు. విదూరథుని పుత్రుడు సార్వభౌ ముడు. సార్వభౌముని పుత్రుడు జయసేనుడు. జయ సేనుని పుత్రుడు రాధికుడు. రాధికుని పుత్రుడు అయుతుడు.

తతశ్చ క్రోధనస్తస్మాద్దేవాతిథిరముష్య చ

ఋష్యస్తస్య దిలీపోఽభూత్ప్రతీపస్తస్య చాత్మజః

అయుతుని పుత్రుడు క్రోధనుడు. క్రోధనుని పుత్రుడు దేవాతిథి. దేవాతిథియొక్క పుత్రుడు ఋష్యుడు. ఋష్యుని పుత్రుడు దిలీపుడు. దిలీ పుని పుత్రుడు ప్రతీపుడు..

దేవాపిశ్శంతనుస్తస్య బాహ్లీక ఇతి చాత్మజాః

పితృరాజ్యం పరిత్యజ్య దేవాపిస్తు వనం గతః

ప్రతీపునకు దేవాపి, శంతనుడు, బాహ్లికుడు అనే పుత్రులు కలిగి. వారిలో దేవాపీ తండ్రినుండి సంక్రమించిన రాజ్యాధికారమును విడిచి పెట్టి అడవికి వెళ్లాను.

అభవచ్చంతనూ రాజా ప్రాజ్మహాభిషసంజ్ఞితః

యం యం కరాభ్యాం స్పృశతి జీర్ణం యౌవనమేతి సః

శాంతిమాప్నోతి చైవాగ్ర్యాంకర్మణా తేన శంతనుః

శంతనుడు రాజు ఆయెను. ఆయనకు పూర్వజన్మలో మహాభిషుడు అని పేరు. ఆ శంతనుడు ఏయే ముదుసలిని తన రెండు చేతులతో స్పృశించునో, ఆయా వ్యక్తి యౌవనమును పొందును. అంతేగాక, ఆ వ్యక్తికి ఉత్కృష్టమైన శాంతి లభించును. ఆ విధముగా స్పృశించి శాంతిని కలిగించుటచేతనే ఆయనకు ఆ శంతనుడు (శాంతిని విస్తరింప జేయువాడు) అనే పేరు సార్థకమాయెను.

సమా ద్వాదశ తద్రాజ్యే న వవర్ష యదా విభుః

శంతనుర్బ్రహ్మ ణైరుక్తః పరివేత్తా త్వమగ్రభుక్

రాజ్యం దేహ్యగ్రజాయాశు పురరాష్ట్రవీవృద్ధయే

ఆ శంతను మహారాజుయొక్క రాజ్యములో వర్షాధిపతి పన్నెండు సంవత్సరములలో ఒక్కనాడైననూ వర్షించలేదు. అప్పుడు శంతునునితో బ్రహ్మవేత్తలు ఇట్లు చెప్పినారు -- అన్న ఉండగా నీవు ఆయన రాజ్య మును భోగించుచున్నావు. కావున, నీవు కూడ పరివేత్త (అన్నకంటె ముందుగా వివాహమును చేసుకొనువాడు) వంటివాడవే అగుదువు. ఆ దోషమును నివారించి, పురమునకు రాష్ట్రమునకు అభివృద్ధిని కలిగించు టకై వెంటనే రాజ్యమును అన్నకు అప్పజెప్పుము.

ఏవముక్తో ద్విజైర్జ్యేష్ఠం ఛందయామాస సోఽబ్రవీత్

తన్మంత్రిప్రహితైర్వి ప్రైర్వేదాద్విభ్రంశీతో గిరా

వేదవాదాతివాదాన్వై తదా దేవో వవర్ష హ

వేదవేత్తలీ విధముగా పలుకగా శంతనుడు అడవిలోనున్న అన్నగారగు దేవాపిని ప్రార్థించెను. కానీ, అంతకు ముందే శంతనుని మంత్రి (అశ్మ రావుడు) కొందరు వేదవేత్తలను (శంతనునకు తెలియకుండా) దేవాది వద్దకు పంపెను. వారు దేవాపికి పాఖండమతమును బోధించి వేదధర్మము నుండి భ్రష్టుడగునట్లు చేసిరి. అట్లు భ్రష్టుడైన దేవాపి శంతనునితో వేదధర్మమును నిందించే వచనములను పలికెను.(తద్ద్వారా ఆయన రాజ్యార్హతను కోల్పోయి, శంతనునియందలి పరివేత్తను పోలిన దోషము తొలగిపో యెను). అప్పుడు మాత్రమే పర్జన్యదేవుడు ఆ రాజ్యములో వర్షించెను.

దేవాపిర్యోగమాస్థాయ కలాపగ్రామమాశ్రితః

సోమవంశే కలౌ నష్టే కృతాదౌ స్థాపయిష్యతి

దేవాపి యోగసాధనను చేస్తూ కలాపగ్రామమునాశ్రయించి ఉన్నాడు. కలియుగములో చంద్రవంశము వినష్టమగును. అప్పుడు మరల కృతయుగారంభమునందు దేవాపి చంద్రవంశమును స్థాపించగలడు.

బాహ్లికాత్సోమదత్తోSభూద్భూరిర్భూరిశ్రవాస్తతః

శలశ్చ శంతనోరాసీద్దంగాయాం భీష్మ ఆత్మవాన్

సర్వధర్మవిధాం శ్రేష్టా మహాభాగవతః కవిః

 (ప్రతీపుని పుత్రుడగు)బాహ్లికునకు సోమదత్తుడు అనే పుత్రుడు ఉండెను. సోమదత్తునకు భూరి, భూరిశ్రవసుడు, శలుడు అనే ముగ్గురు పుత్రులు కలిగిరి.(ప్రతీపుని మరియొక పుత్రుడగు) శంతనునకు గంగ యందు భీష్ముడు కలిగెను. ఆ భీష్ముడు మనోజయము గలవాడు. ఆయన సకలధర్మములను తెలిసినవారిలో శ్రేష్ఠుడు, గొప్ప భగవద్భక్తుడు, మరియు జ్ఞాని.

వీరయూథాగ్రణీర్యేన రామోSపి యుధి తోషితః

శంతనోర్ధాశకన్యాయం జజ్ఞే చిత్రాంగదస్సుతః  

భీష్ముడు వీరుల సైన్యమునకు నాయకుడు (సకలవీరులలో అగ్రేసరుడు). ఆయన యుద్దములో పరశురాముని కూడ మెప్పించినాడు. శంతనునకు దాశరాజుయొక్క కుమార్తె (సత్యవతి) యందు చిత్రాంగదుడనే పుత్రుడు జన్మించెను.

విచిత్రవీర్యశ్చావరజో నామ్నా చిత్రాంగదో హతః

యస్యాం పరాశరాత్సాక్షాదవతీర్ణో హరేః కలా  

చిత్రాంగదుని తమ్ముడు విచిత్రవీర్యుడు. చిత్రాంగదుని అదే పేరు గల గంధర్వుడు సంహరించెను. సత్యవతియందు పరాశర మహర్షి వలన సాక్షాత్తుగా శ్రీహరి తన అంశతో వ్యాసుడై అవతరించెను.

వేదగుప్తో మునిః కృష్ణో యతోSహమిదమధ్యగామ్

హిత్వా స్వశిష్యాన్ పైలాదీన్ భగవాన్ బాదరాయణః

మహ్యం పుత్రాయ శాంతియ పరం గుహ్యమిదం జగౌ

కృష్ణ ద్వైపాయన (వ్యాస) మహర్షి లోకమునందు వేదములను సంరక్షించేను (నిలబెట్టెను). ఈ భాగవతమును నేను ఆయననుండియే అధ్యయనము చేసితిని. పూజనీయుడగు ఆ బాదరాయణ (వ్యాస) మహర్షి తన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు మొదలగువారిని విడిచి పెట్టి వేదముల సారమగు ఈ భాగవతమును, కామాదిదోషములు లేని నాకు ఉపదేశించెను. ఈ భాగవతము సర్వోత్కృష్టమైనది.

విచిత్రవీర్యోSథోవాహ కాశిరాజసుతే బలాత్

స్వయంవరాదుపానీతే అంబికాంబాలికే ఉభే

తయారాసక్తహృదయో గృహీతో యక్ష్మణా మృతః  

మంగలము! శంతనుని వంశవృత్తాంతమును కొనసాగించేదము. కాశిరాజుయొక్క పుత్రికలగు అంబికను, అంబాలికను స్వయంవరము నుండి భీష్ముడు బలాత్కారముగా తీసుకొని వచ్చెను. వారినిద్దరిని విచిత్ర వీర్యుడు వివాహమాడెను. ఆయన వారిద్దరియందు ఆసక్తమైన హృదయమును కలిగియుండెను. ఇంతలో క్షయరోగము పట్టుకొని ఆయన మరణిం చెను,

క్షేత్రేSప్రజస్య వై భ్రాతుర్మాత్రోక్తో బాదరాయణః

ధృతరాష్ట్రం చ పాండుం చ విదురం చాప్యజీజనత్

విచిత్రవీర్యునకు సంతానము లేకుండెను. తల్లియగు సత్యవతి యొక్క ఆదేశముచే వ్యాస మహర్షి తన సోదరుడగు విచిత్రవీర్యుని భార్యలయందు ధృతరాష్ట్రుని, పాండువును మరియు విదురుని కనెను.

గాంధార్యాం ధృతరాష్ట్రస్య జజ్ఞే పుత్రశతం నృప

తత్ర దుర్యోధనో జ్యేష్ఠో దుశ్శలా చాపి కన్యకా

ఓ పరీక్షిన్మహారాజా! ధృతరాష్ట్రునకు గాంధారియందు వంద మంది పుత్రులు, దుశ్శల అనే కన్య కూడ జన్మించెను. ఆ పుత్రులలో దుర్యోధనుడు పెద్దవాడు.

శాపాన్మైథునరుద్దస్య పాండోః కుంత్యాం మహారథాః

జాతా ధర్మానిలేంద్రేభ్యో యుధిష్ఠిరముఖాస్త్రయః  

శాపము కారణముగా పొండు మహారాజునకు స్త్రీసహవాసము నిషేధించబడెను. ఆయన భార్యయగు కుంతియందు యమధర్మరాజు-వాయుదేవుడు-ఇంద్రుల వలన క్రమముగా ధర్మరాజు, భీముడు, మరియు అర్జునులు జన్మించిరి. వారు మహారథులు.

నకులస్సహదేవశ్చ మాద్ర్యాం నాసత్యదస్రయోః

ద్రౌపద్యం పంచ పంచభ్యః పుత్రాస్తే పితరోSభవన్  

మాద్రియందు అశ్వినీ కుమారుల వలన నకుల సహదేవులు జన్మించిరి. అయిదుగురు పాండవులకు ద్రౌపదియందు అయిదుగురు పుత్రులు కలిగిరి. వారే నీ (పరీక్షిత్తుయొక్క) తండ్రులు.

యుధిష్ఠిరాత్ప్రతివింధ్యశ్శ్రుత సేనో వృకోదరాత్

అర్జునాచ్చ్రుతకీర్తిస్తు శతానీకస్తు నాకులిః  

యుధిష్ఠిరుని పుత్రుడు ప్రతివింధ్యుడు. భీముని పుత్రుడు శ్రుతసేనుడు. అర్జునుని పుత్రుడు శ్రుతకీర్తి. నకులుని పుత్రుడు శతానీకుడు.

సహదేవసుతో రాజన్ శ్రుతకర్మా తథాSపరే

యుధిష్ఠిరాత్తు పౌరవ్యాం దేవకోఽథ ఘటోత్కచః  

భీమ సేనాద్దిడింబాయాం కాల్యాం సర్వగతస్తతః

సహదేవాత్సహోత్రం తు విజయావసూత పార్వతీ  

ఓ పరీక్షిన్మహారాజా! సహదేవుని పుత్రుడు శ్రుతకర్ముడు. ఇంతేగాక, వీరికి ఇతర సంతానము కూడ గలదు. ధర్మరాజునకు పౌరవియందు దేవకుడు, భీమునకు హిడింబయందు ఘటోత్కచుడు, కాళియందు సర్వగతుడు, సహదేవునకు పర్వతుని పుత్రికయగు విజయయందు సుహోత్రుడు జన్మించిరి.

కరేణుమత్యాం నకులో నిరమిత్రం తథాSర్జునః

ఇరావంతములూప్యాం వై సుతాయాం బభ్రువాహనమ్

మణిపూరపతేస్సోSపి తత్పుత్రః పుత్రీకాసుతః  

నకులునకు కరేణువతియందు నిమిత్రుడు, అర్జునునకు ఉలూ పియందు ఇరావంతుడు జన్మించిరి. మణిపూర దేశాధిపతియొక్క పుత్రిక యందు అర్జునునకే బభ్రువాహనుడు జన్మించెను. ఈ విధముగా ఆ బభ్రువాహనుడు అర్జునుని పుత్రుడే అయిననూ, పుత్రికాధర్మము (పుత్రిక యొక్క పుత్రుని మాతామహుడు తన పుత్రునిగా స్వీకరించుట) ను బట్టి మాతామహుని పుత్రుడు ఆయెను.

తవ తాతస్సుభద్రాయామభిమన్యురజాయత

సర్వాతిరథజిద్వీర ఉత్తరాయాం తతో భవాన్  

అర్జునునకు సుభద్రయందు నీ తండ్రియగు అభిమన్యుడు జన్మించేను. ఆయన అతిరథులనందరినీ జయించిన వీరుడు. ఆయనకు ఉత్తర యందు నీవు జన్మించితివి.

పరిక్షీణేషు కురుషు ద్రౌణేర్భ్రహ్మాస్త్రతేజసా

త్వం చ కృష్ణానుభావేన సజీవో మోచితోSనంతకాత్  

కురువంశీయులగు దుర్యోధనాదులు నశించిరి. అప్పుడు ద్రోణపుత్రుడగు అశ్వత్థామచే ప్రయోగించబడిన బ్రహ్మాస్త్రముయొక్క తేజస్సుచే నీవు కూడ మృత్యువు వాత పడితివి. కాని, శ్రీకృష్ణుడు తన మహిమచే నిన్ను మృత్యువునుండి విడిపించగా, నీవు ప్రాణములతో నున్నావు.

తవేమే తనయాస్తాత జనమేజయపూర్వకాః

శ్రుతసేనో భీమ సేన ఉగ్ర సేనశ్చ వీర్యవాన్  

ఓ కుమారా! పరాక్రమశాలురగు ఈ జనమేజయుడు, శ్రుతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు నీ పుత్రులు. వీరిలో జనమేజయుడు పెద్ద వాడు,

జనమేజయస్త్వాం విదిత్వా తక్షకాన్నిధనం గతమ్

సర్పాన్ వై సర్పయాగాగ్నౌ స హోష్యతి రుషాన్వితః  

నీవు తక్షకుని కారణముగా మరణించినావని తెలిసి ఆ జనమేజయుడు కోపించి, సర్పయాగమును చేసి, ఆ అగ్నియందు సర్పములను నిశ్చయముగా హోమము చేయగలడు.

కావ షేయం పురోధాయ తురం తురగమేధయాట్

సమంతాత్పృథివీం సర్వాం జీత్వా యక్ష్యతి చాధ్వరైః

జనమేజయుడు భూమండలమునంతను అన్ని వైపులా జయించి, కవషుని పుత్రుడగు తురుని పురోహితునిగా చేసుకొని యజ్ఞములను చేసి భగవంతుని ఆరాధించ గలడు. ఈయన అశ్వమేధ యాగములను కూడ చేయగలడు.

తస్య పుత్రశ్శతానీకో యాజ్ఞవల్క్యాత్త్రయీం పఠన్

అస్త్రజ్ఞానం క్రియాజ్ఞానం శౌనకాత్పరమేష్యతి  

ఆ జనమేజయునకు శతానీకుడనే పుత్రుడు కలుగును. ఆ శతానీకుడు యాజ్ఞవల్క్యునీనుండి వేదమును, కృపాచార్యునినుండి అస్త్రముల విజ్ఞానమును, శౌనక మహర్షి వలన వైదిక కర్మల విజ్ఞానమును మరియు పరమాత్మ జ్ఞానమును కూడ పొందగలడు.

సహస్రానీకస్తత్పుత్రస్తతశ్చైవాశ్వమేధజః

అసీమకృష్ణస్తస్యాపి నేమిచక్రస్తు తత్సుతః

ఆ శతానీకుని పుత్రుడు సహస్రానీకుడు. సహస్రానీకుని పుత్రుడు అశ్వమేధజుడు. అశ్వమేధజుని పుత్రుడు అసీమకృష్ణుడు. అసీమకృష్ణుని పుత్రుడు నేమిచక్రుడు.

గజాహ్వయే హృతే నద్యా కౌశాంబ్యాం సాధు వత్స్యతి ఉక్తస్తతశ్చిత్రరథస్తస్మాత్కవీరథస్సుతః  

హస్తినాపురమును గంగ ముంచివేయును. అప్పుడు ఆ నేమిచక్రుడు కౌశాంబియందు సుఖముగా నివసించగలడు. నేమిచక్రుని పుత్రుడు చిత్రరథుడు, చిత్రరథుని పుత్రుడు కవిరథుడు కాగలరు.

తస్మాచ్చ వృష్టిమాంస్తస్య సుషేణోSథ మహీపతిః

సునీథస్తస్య భవితా నృచక్షుర్యత్సుఖీనలః  

ఆ కవీరథుని పుత్రుడు వృష్టిమంతుడు, వృష్టిమంతుని పుత్రుడు సుషేణ మహారాజు, సుషేణుని పుత్రుడు సునీథుడు, సునీథుని పుత్రుడు నృచక్షువు, నృచక్షుని పుత్రుడు సుఖీనలుడు కాగలరు.

పరిప్లవస్సుతస్తస్మాన్మేధావీ సునయాత్మజః

నృపంజయస్తతో దూర్వస్తిమిస్తస్మాజ్ఞనిష్యతి

ఆ సుఖీనలుని పుత్రుడు పరిప్లవుడు, పరిప్లవుని పుత్రుడు సునయుడు, సునయుని పుత్రుడు మేధావి, మేధావి పుత్రుడు నృపంజయుడు, నృపంజయుని పుత్రుడు దూర్వుడు, దూర్వుని పుత్రుడు తిమి కాగలరు.

తిమేర్బృహద్రథస్తస్మాచ్చతానీకస్సుదాసజః

శతానీకాద్దుర్దమనస్తస్యాపత్యం బహీనరః

తిమియొక్క పుత్రుడు బృహద్రథుడు, బృహద్రథుని పుత్రుడు సుదాసుడు, సుదాసుని పుత్రుడు శతానీకుడు, శతానీకుని పుత్రుడు దుర్దమునుడు, దుర్దమనుని పుత్రుడు బహీనరుడు కాగలరు.

దండపాణిర్నిమిస్తస్య క్షేమకో భవితా నృపః

బ్రహ్మక్షత్రస్య వై ప్రోక్తో వంశో దేవర్షిసత్కృతః

బహీనరుని పుత్రుడు దండపాణి, దండపాణియొక్క పుత్రుడు నిమి, ఆ నిమియొక్క పుత్రుడు క్షేమక మహారాజు కాగలరు. ఈ విధముగా బ్రాహ్మణుల మరియు క్షత్రియులయొక్క వంశములకు మూలమైన సోమ వంశము చెప్పబడినది. ఈ సోమవంశము దేవతలచే మరియు మహర్షు లచే సత్కరించబడేది.

క్షేమకం ప్రాప్య రాజానం సంస్థాం ప్రాప్స్యతి వై కలౌ

అథ మాగధరాజానో భవతారో వదామి తే

కలియుగములో సోమవంశము క్షేమక మహారాజుతో నిశ్చయముగా సమాప్తిని పొందగలదు. తరువాత నీకు నేను మగధదేశమును పాలించబోయే రాజులను గురించి చెప్పగలను.

భవితా సహదేవస్య మార్జారీర్యచ్చ్రుతశ్రవాః

తతోSయుతాయుస్తస్యాపి నిరమిత్రోSథ తత్సుతః

సునక్షత్రస్సునక్షత్రాద్బృహత్సేనోSథ కర్మజిత్

తతస్సృతంజయాద్విప్రశ్శుచిస్తస్య భవిష్యతి  

 (జరాసంధుని పుత్రుడగు) సహదేవునకు మార్జారి, మార్జారికి శ్రుత శ్రవసుడు, శ్రుతశ్రవసునకు అయుతాయుపు, అయుతాయువునకు నీరమీత్రుడు, నీరమిత్రునకు సునక్షత్రుడు, సునక్షత్రునకు బృహత్సేనుడు, బృహత్సేనునకు కర్మజీత్తు, కర్మజీత్తునకు సృతంజయుడు, సృతంజయునకు విప్రుడు, విప్రునకు శుచి పుత్రులై జన్మించగలరు.

క్షేమోSథ సువ్రతస్తస్మాద్ధర్మసూత్రశ్శమస్తతః

ద్యుమత్సేనోSథ సుమతిస్సుబలో జనితా తతః  

ఆ శుచికి క్షేముడు, క్షేమునకు సువ్రతుడు, సువ్రతునకు ధర్మసూత్రుడు, ధర్మసూత్రునకు శముడు, శమునకు ద్యుమత్సేనుడు, ద్యుమత్సేనునకు సుమతీ, సుమతికి సుబలుడు పుత్రులై జన్మించగలరు.

సునీథస్సత్యజిదథ విశ్వజిద్యద్రిపుంజయః

బార్హద్రథాశ్చ భూపాలా భావ్యాస్సాహస్రవత్సరమ్

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం

నవమస్కంధే ద్వావింశోSధ్యాయః

సుబలునకు సునీథుడు, సునీథునకు సత్యజిత్తు, సత్యజిత్తునకు విశ్వజిత్తు, విశ్వజిత్తునకు రిపుంజయుడు పుత్రులై జన్మించగలరు. బృహద్ర థుని వంశమునకు చెందిన రాజులు వేయి సంవత్సరములు నిరంతరముగా పాలించగలరు.

శ్రీమద్బాగవత మహాపురాణమునందు తొమ్మిదవ స్కంధములో పాంచాల-కురు-మగధవంశములను వర్ణించే ఇరువది రెండవ అధ్యాయము ముగిసినది (22).