1 - సుద్యుమ్న మహారాజు వృత్తాంతము

రాజోవాచ

మన్వంతరాణి సర్వాణి త్వయోక్తాని శ్రుతాని మే

వీర్యాణ్యనంతవీర్యస్య హరేస్తత్ర కృతాని చ  

పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను -- పదునాలు మన్వంతరముల ను, వాటియందు అనంతశక్తిశాలియగు శ్రీహరి తన మహిమను ప్రకటిస్తూ చేసిన కర్మలను కూడ తమరు వర్ణించి చెప్పగా, నేను వింటిని.

యోసౌ సత్యవ్రతో నామ రాజర్షిర్ద్రవిడేశ్వరః

జ్ఞానం యోతీతకల్పాంతే లేభే పురుష సేవయా

గడచిన కల్పముయొక్క అంతమునందు సత్యవ్రతుడని ప్రసిద్ధి గాంచిన రాజర్షి ద్రవిడదేశమునకు ప్రభువుగ నుండెను. ఆయన మత్స్య మూర్తియగు శ్రీహరిని సేవించి ఆత్మజ్ఞానమును పొందెను.

స వై వివస్వతః పుత్రో మనురాసీదితి శ్రుతమ్

త్వత్తస్తస్య సుతాశ్చోక్తా ఇక్ష్వాకుప్రముఖా నృపాః  

ఆ సత్యవ్రతుడే ఈ కల్పమునందు సూర్యుని పుత్రుడై శ్రాద్ధదేవుడనే మనువు ఆయెననియు, ఇక్ష్వాకుడు మొదలగువారు ఆయన పుత్రుల నియు నీవు చెప్పగా వింటిని.

తేషాం వంశం పృథగ్బ్రహ్మన్వంశానుచరితాని చ

కీర్తయస్వ మహాభాగ నిత్యం శుశ్రూషతాం హి నః  

ఓ మహర్షీ! నీవు మహాత్ముడవు. ఆ ఇక్ష్వాకుడు మొదలగువారి యొక్క వేర్వేరు వంశములను, వారి వంశములలో జన్మించినవారల తరు వాతి వృత్తాంతములను వర్ణించి చెప్పుము. మాకు నిరంతరముగా వినాలనే కోరిక గలదు.

యే భూతా యే భవిష్యాశ్చ భవంత్యద్యతనాశ్చ యే

 తేషాం నః పుణ్యకీర్తీనాం సర్వేషాం వద విక్రమాన్  

ఆ వంశములో గడచిన కాలములోని వారు, వర్తమానములో నున్నవారు, భవిష్యత్తులో రాబోవువారు అగు రాజులందరియొక్క పరాక్ర మములను గురించి మాకు చెప్పడు. వారి కీర్తి పవిత్రమైనది.

సూత ఉవాచ

 ఏవం పరీక్షితా రాజ్ఞా సదసి బ్రహ్మవాదినామ్

పృష్టః ప్రోవాచ భగవాన్ శుకః పరమధర్మవిత్

సూత మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా బ్రహ్మవేత్తల సభ యందు పరీక్షిన్మహారాజు పూజనీయుడైన శుక మహర్షిని ప్రశ్నించగా, పర మధర్మమగు భక్తిలో విద్వాంసుడగు ఆ మహర్షి ఇట్లు బదులు చెప్పెను.

శ్రీశుక ఉవాచ

శ్రూయతాం మానవో వంశః ప్రాచుర్యేణ పరంతప

 న శక్యతే విస్తరతో వక్తుం వర్షశ తైరపి

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- (లోపలి) శత్రువులను తపింప జేసిన ఓ మహారాజా! నేను మనువుయొక్క వంశములోని ప్రముఖములైన విషయములను చెప్పెదను, వినుము. ఆ వంశమును విస్తారముగా వర్ణించుటకు వందలాది సంవత్సరములైననూ చాలదు.

పరావరేషాం భూతానామాత్మా యః పురుషః పరః

స ఏవాసీదిదం విశ్వం కల్పాంతేన్యన్న కించన  

ఈ కనబడే జగత్తు ప్రళయమునందు ఆ పురుషోత్తముడుగనే యుండెను. ఇతరము ఏదియు లేకుండెను. పెద్ద-చిన్న ప్రాణులన్నింటికీ ఆత్మ (స్వస్వరూపము) ఆ పురుషోత్తముడే.

తస్య నాభేస్సమభవత్పద్మకోశో హిరణ్మయః

తస్మిన్ జజ్ఞే మహారాజ స్వయంభూశ్చతురాననః  

ఓ పరీక్షిన్మహారాజా! ఆ పురుషోత్తముని నాభినుండి ప్రకాశించే బంగరు పద్మము పుట్టెను. దానియందు నాలుగు మోముల బ్రహ్మగారు ప్రకటమాయెను. బ్రహ్మగారు స్వయంభువుడు (పుట్టుక లేని చైతన్యమే స్వరూపముగా గలవాడు).

మరీచిర్మనసస్తస్య జజ్ఞే తస్యాపీ కశ్యపః

దాక్షాయణ్యాం తత్వోదిత్యాం వివస్వానభవత్సుతః  

ఆ బ్రహ్మగారి సంకల్పమునుండి మరీచి మహర్షి పుట్టెను. మరీచికి కశ్యపుడు పుత్రుడు. కశ్యపునకు దక్షుని కుమార్తెయగు అదితియందు అధిక మగు ప్రకాశము గల సూర్యుడు పుత్రుడై పుట్టెను.

తతో మనుశాద్ధదేవస్సంజ్ఞాయామాస భారత

శ్రద్ధాయాం జనయామాస దశ పుత్రాన్ స ఆత్మవాన్ ఇక్ష్వాకునృగశర్యాతిదిష్టధృష్ణకరూషకాన్

 నరిష్యంతం పృషధ్రం చ నభగం చ కవిం విభుః

భరత వంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! ఆ సూర్యునకు సంజ్ఞ యందు శ్రాద్ధదేవ మనువు పుత్రుడై పుట్టెను. శక్తిమంతుడు మరియు మనీ షి అగు ఆ మనువునకు శ్రద్ధయందు పదిమంది పుత్రులు కలిగిరి. ఇక్ష్వాకు వు, నృగుడు, శర్యాతి, దిష్టుడు, ధృష్టుడు, కరూషకుడు, నరిష్యంతుడు, పృషధ్రుడు, నభగుడు, కవి అనునవి వారి పేర్లు.

అప్రజస్య మనోః పూర్వం వసిష్ఠో భగవాన్ కిల

మిత్రావరుణయోరిష్టిం ప్రజార్థమకరోత్ప్రభుః  

ఇక్ష్వాకుడు మొదలగు పుత్రులు పుట్టుటకు ముందు, వైవస్వత మనువునకు సంతానము లేకుండెను. సమర్థుడగు వసిష్ణ భగవాడు అప్పుడు సంతానము కొరకై మనువుచే మిత్రుడు-వరుణుడు దేవతలుగా గల యజ్ఞమును చేయించేనట.

తత్ర శ్రద్దా మనోః పత్నీ హోతారం సమయాచత

దుహిత్రర్థముపాగమ్య ప్రణిపత్య పయోవ్రతా

ఆ యజ్ఞమునందు మనువుయొక్క ధర్మపత్నియగు శ్రద్దాదేవి యజ్ఞనియమముననుసరించి కేవలము పాలను మాత్రమే ఆహారముగా తీసుకొనుచుండెను. ఆమె హోత (హోమమునకు ముందు దేవతలను ఆహ్వానించే ఋత్విక్కు) వద్దకు వెళ్లి ఆయనకు ప్రణమిల్లి, తనకు కుమార్తె కలుగునట్లుగా దేవతలను ప్రార్థించుమని కోరెను.

ప్రేషితోధ్వర్యుణా హోతా ధ్యాయంస్తత్సుసమాహితః

 హవిషి వ్యచరత్తేన వషట్కారం గృణన్ ద్విజః

అధ్వర్యుడు హోమమును చేయుమనీ నిర్దేశించగానే హోతయగు బ్రాహ్మణుడు హవిస్సును చేతిలోకి తీసుకొనెను. ఆయన మిక్కిలి ఏకాగ్ర మగు చిత్తముతో శ్రద్ధ చెప్పిన ఆ వచనమునే ధ్యానిస్తూ, వషట్ అనే మంత్రమునుచ్చరించి ఆ హవిస్సును హోమము చేసెను.

హోతుస్తద్వ్యభిచారేణ కన్యేలా నామ సౌభవత్

తాం విలోక్య మనుః ప్రాహ నాతిహృష్టమనా గురుమ్

ఆ విధముగా హోత తప్పుగా సంకల్పించి హోమమును చేయు టచే ఇల (వాక్కు) అని ప్రసిద్ధి గాంచిన కన్య పుట్టెను. ఆమెను చూచి మనువు చాల సంతోషపడలేదు, ఆయన గురువగు వసిష్ఠునితో నిట్లనెను.

భగవన్ కిమిదం జాతం కర్మ వో బ్రహ్మవాదినామ్

 విపర్యయమహో కష్టం మైవం స్యాద్బ్రహ్మవిక్రియా  

ఓ పూజనీయా! బ్రహ్మవేత్తలగు మీయొక్క కర్మ విపరీతము ఎట్లు అయినది? అయ్యో కష్టము! ఈ తీరున మంత్రము విపరీతము కారాదు.

యూయం మంత్రవిదో యుక్తాస్తపసా దగ్ధకిల్బిషాః

కుతస్సంకల్పవైషమ్యమనృతం విబుధేష్వివ  

తమరు మంత్రవేత్తలు, తపస్సంపన్నులు. మీయందు సకలదోష ములు దహించి వేయబడినవి. అట్టి మీరు చేసిన సంకల్పము విపరీతమగు టకు కారణమేమి? దేవతల (విద్వాంసుల) యందు అసత్యము ఉండగల్గునా? 

తన్నిశమ్య వచస్తస్య భావాన్ ప్రపితామహః

 హోతుర్వ్యతిక్రమం జ్ఞాత్వా బభాషే రవినందనమ్  

పూజనీయుడగు వసిష్ఠుడు మనువునకు ముత్తాత. ఆయన సూర్య పుత్రుడగు మనువు చెప్పిన ఆ మాటను విని హోత విపరీతముగా చేసినా డని తెలుసుకొనెను. అపుడాయన మనువుతో నిట్లనెను.

ఏతత్సంకల్పవైషమ్యం హోతుస్తే వ్యభిచారతః

తథాపి సాధయి ష్యే తే సుప్రజాస్త్వం స్వతేజసా

నీ హోత అసందర్భముగా ధ్యానమును చేయుట వలననే, ఈ విధముగా నీ సంకల్పమునకు విపరీతమగు ఫలము కలిగినది. అయిననూ పోయినదేమీ లేదు. నేను నా తేజస్సుతో నీకు చక్కని పుత్రసంతానము కలుగునట్లు చేసెదను.

ఏవం వ్యవసితో రాజన్ భగవాన్ స మహాయశాః

అస్తౌషీదాదిపురుషమిలాయాః పుంస్త్వకామ్యయా

పూజనీయుడగు వసిష్ఠుడు గొప్ప కీర్తి గలవాడు. ఆయన ఈ విధ ముగా నిశ్చయించుకొని, ఇలను మగవానిగా మార్చాలనే కోరికతో జగత్కా రణుడగు పురుషోత్తముని స్తుతించెను.

తస్మై కామవరం తుష్ణో భగవాన్ హరిరీశ్వరః

దదావిలాభవత్తేన సుద్యుమ్నః పురుషర్షభః  

జగన్నాథుడగు శ్రీహరి భగవానుడు ఆ వసిష్ఠుని యెడల సంతోషించి కోరిన వరమును ఇచ్చెను. ఆ వరముచే ఇల సుద్యుమ్నుడనే గొప్ప పురుషుడుగా మారిపోయెను.

స ఏకదా మహారాజ విచరన్మృగయాం వనే

వృతః కతిపయామాత్యైరశ్వమారుహ్య సైంధవమ్  

ఓ పరీక్షిన్మహారాజా! ఒకనాడా సుద్యుమ్నుడు కొందరు మంత్రులు చుట్టువారి రాగా, సింధుదేశమునందు పుట్టిన (మంచి) గుర్రము నెక్కి అడవికి వేటకు వెళ్లాను.

ప్రగృహ్య రుచిరం చాపం శరాంశ్చ పరమాద్భుతాన్

 దంశితోనుమృగం వీరో జగామ దిశముత్తరామ్  

వీరుడగు సుద్యుమ్నుడు కవచమును వేసుకొని, అందమైన ధను స్సును మరియు మిక్కిలి అచ్చెరువును గొలిపే బాణములను కూడ పట్టు కొని, మృగముల వెంబడి ఉత్తరదిక్కు వైపునకు వెళ్లాను.

స కుమారో వనం మేరోరధస్తాత్ప్రవివేశ హ

 యత్రాస్తే భగవాన్ శర్వో రమమాణస్సహోమయా  

ఆ సుద్యుమ్న కుమారుడు మేరు పర్వతమునకు క్రిందనుండే ఇలావృతమనే అడవిలోనికి ప్రవేశించెను. ఆ అడవిలో సంహారకర్తయగు శివ భగవానుడు పార్వతితో కూడి రమించుచుండును.

తస్మిన్ ప్రవిష్ట ఏవాసా సుద్యుమ్నః పరవీరహా

అపశ్యత్ స్త్రీయమాత్మానమశ్వం చ వడవాం నృప

ఓ పరీక్షిన్మహారాజా! సుద్యుమ్నుడు శత్రువీరులను దునుమాడే వీరుడు. ఆతడు ఆ అడవిలోనికి ప్రవేశిస్తూనే, తాను స్త్రీగను మరియు తన గుర్రము అడు గుర్రముగను మారిపోయినట్లు కనుగొనెను.

తథా తదనుగాస్సర్వే ఆత్మలింగవిపర్యయమ్

దృష్ట్వా విమనసో భూవన్ వీక్షమాణాః పరస్పరమ్

ఆ సుద్యుమ్నుని అనుచరులందరు తాము కూడ సుద్యుమ్నుని వలెనే స్త్రీలమైతిమని కనుగొని, ఒకరినొకరు చూచుకొనుచుండిరి. వారి మనస్సులు చెడిపోయెను.

రాజోవాచ

 కథమేవంగుణో దేశః కేన వా భగవాన్ కృతః

ప్రశ్నమేనం సమాచక్ష్వ పరం కౌతూహలం హి నః  

పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను -- పూజనీయుడవగు ఓ శుక మహర్షీ! ఆ స్థానమునకు ఆ లక్షణము (మగవానిని స్త్రీగా చేయుట) ను ఎవరు ఎట్లు కలిగించిరి? ఈ ప్రశ్నకు బదులిండు. ఎందుకంటే, మాకీ విష యమును తెలుసుకోవాలనే అధికమగు ఉత్కంఠ గలదు.

శ్రీశుక ఉవాచ

ఏకదా గిరీశం ద్రష్టుమృషయస్తత్ర సువ్రతాః

దిశో వితీమీరాభాసాః కుర్వంతస్సముపాగమన్

చక్కని ప్రతనిష్ఠగల మహర్షులు ఒకనాడు రుద్రుని దర్శించుటకై ఆ ఇలావృత వనమునకు విచ్చేసిరి. వారి కాంతులచే దిక్కుల చీకట్లు తొల గిపోయెను. వారి ప్రకాశము ముందు సర్వము వెలవెల బోవుచుండెను.

తాన్ విలోక్యాంబికా దేవీ వివాసా ప్రీడితా భృశమ్

భర్తురంకాత్సముత్థాయ నీవీశ్వథ పర్యధాత్  

వస్త్రము తొలగియున్న పార్వతీదేవి వారిని చూచి చాల సిగ్గుపడి రుద్రుని అంకమునుండి వెంటనే పైకి లేచి, నడుము చుట్టూ వస్త్రమును సర్దుకొనెను.

ఋషయోపి తయోర్వీక్ష్య ప్రసంగం రమమాణయోః

 నివృత్తాః ప్రయయుస్తస్మాన్నరనారాయణాశ్రమమ్

పార్వతి, రుద్రుడు పరస్పరము అధికమగు ఆసక్తితో రమించుటను గాంచిన ఆ మహర్షులైతే అచటనుండి వెనుకకు మరలి, నరనారాయణుల ఆశ్రమమునకు వెళ్లిరి.

తదిదం భగవానాహ ప్రియాయాః ప్రియకామ్యయా

స్థానం యః ప్రవిశేదేతత్స వై యోషీద్భవేదితి

అప్పుడు రుద్ర భగవానుడు తన ప్రియురాలగు పార్వతికి ప్రియ మును చేయగోరి ఇట్లు పలికెను -- ఎవడైతే ఈ స్థానమునకు వచ్చునో, అట్టివాడు స్త్రీ అయి తీరును, అని.

తత ఊర్ద్వం వనం తద్వై పురుషా వర్జయంతి హి

 సా చానుచరసంయుక్తా విచచార వనాద్వనమ్

రుద్రుని ఆ విధముగా శపించిన తరువాతి కాలములో మగవారు ఆ ఇలావృత వనమునకు ఆమడ దూరములో నుండజోచ్చిరి. ఇలగా మారిన సుద్యుమ్నుడు స్త్రీలుగా మారిన తన అనుచరులు వెంటరాగా, అచట ఒక ఉద్యానమునుండి మరియొక ఉద్యానమునకు విహరించెను.

అథ తామాశ్రమాభ్యాశే చరంతీం ప్రమదోత్తమామ్

స్త్రీభిః పరివృతాం వీక్ష్య చకమే భగవాన్ బుధః

తరువాత తన ఆశ్రమమునకు దగ్గరలో స్త్రీలు చుట్టువారి రాగా విహరించుచున్న ఆ ఇలను బుధుడు చూచెను. మత్తెక్కించే సుందరులలో గొప్పదియగు ఆమెను బుధుడు కామించెను.

సాపి తం చకమే సుభ్రూస్సోమరాజసుతం పతిమ్

స తస్యాం జనయామాస పురూరవసమాత్మజమ్  

బుధుడు ఓషధులకు ప్రభువగు చంద్రుని పుత్రుడు. చక్కని కను బొమలు గల ఆ ఇల బుధుని ప్రేమించి ఆయన తన భర్త కావాలని కోరేను. బుధునకు ఆమెయందు పురూరవుడనే పుత్రుడు కలిగేను.

ఏవం స్త్రీత్వమనుప్రాప్తస్సుద్యుమ్నో మానవో నృపః

సస్మార స్వకులాచార్యం వసిష్ఠమితి శుశ్రుమ  

మనుపుత్రుడగు సుద్యుమ్న మహారాజు ఈ విధముగా స్త్రీగా మారిపోయెను. ఆయన తమ కులగురువగు వసిష్ఠుని స్మరించెనని మేము వీంటిమి.

స తస్య తాం దశాం దృష్ట్వా కృపయా భృశపీడితః

సుద్యుమ్నస్యాశయన్ పుంస్త్వముపాధావత శంకరమ్

            ఆ వసిష్ఠుడు సుద్యుమ్నుని ఆ అవస్థను గాంచి, దయచే మన స్సులో చాల కష్టపడెను. అపుడాయన సుద్యుమ్నుడు మరల మగవాడు కావాలనే కోరికతో శంకరుని సేవించెను.

తుష్టస్త స్మై స భగవానృషయే ప్రియమావహన్

స్వాం చ వాచమృతాం కుర్వన్నిదమాహ విశాం పతే

ఓ పరీక్షిన్మహారాజా! ఆ శంకర భగవానుడు ఆ వసిష్ట మహర్షి విష యములో సంతుష్టుడాయెను. ఆయన ఆ మహర్షికి ప్రీతిని కలిగించ గోరెను. ఆయన తన శాపవాక్యమును కూడ సత్యము చేయుచున్నవాడై, ఇట్లు పలికెను.

మాసం పుమాన్ స భవితా మాసం స్త్రీ తవ గోత్రజః

 ఇత్తం వ్యవస్థయా కామం సుద్యుమ్నోన్వతు మేదినీమ్

నీ శిష్యుడగు సుద్యుమ్నుడు నిండా నెల రోజులు మగవాడుగను, ఇంకో నెల స్త్రీగను అగును. ఈ విధమైన ఏర్పాటుతో ఆతడు యథేచ్చగా భూమిని పాలించుగాక!

ఆచార్యానుగ్రహాత్కామం లబ్ధ్వ పుంస్త్వం వ్యవస్థయా

 పాలయామాస జగతీం నాభ్యనందన్ స్మ తం ప్రజాః  

గురువగు వసిష్ఠుని అనుగ్రహము వలన సుద్యుమ్నుడు తాను కోరుచున్న మగదనమును ఒక పద్ధతిలో (నెల రోజులు మగ, నెల ఆడ) పొంది, భూమిని యథేచ్చగా పాలించెను. కానీ, జనులు ఆయనను (నెల రోజులు కనబడక పోవుటచే) మెచ్చలేదు.

తస్యోత్కలో గయో రాజన్ విమలశ్చ సుతాస్త్రయః

దక్షిణాపథరాజానో బభూవుర్ధర్మవత్సలాః

ఆ సుద్యుమ్నునకు ఉత్కలుడు, గయుడు, విమలుడు అనే ముగ్గురు కొడుకులు కలిగిరి. వారు ధర్మమునందు ప్రేమ గలవారు. వారు దక్షిణదేశమునకు రాజులైరి.

తతః పరిణతే కాలే ప్రతిష్టానపతిః ప్రభుః

పురూరవస ఉత్సృజ్య గాం పుత్రాయ గతో వనమ్

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే నవమస్కంధే ప్రథమోధ్యాయః

ప్రతిష్టాన నగరమును రాజధానిగా చేసుకొని పాలించిన సుద్యుమ్న మహారాజు తరువాత చాల కాలమునకు పెద్దవాడాయెను. అపుడాయన రాజ్యమును తన పుత్రుడగు పురూరవునకు అప్పజెప్పి వన మునకు (తపస్సు కొరకై) వెళ్లాను.

శ్రీమద్భాగవత మహాపురాణమునందు తొమ్మిదవ స్కంధములో సుద్యుమ్న చరితమును వర్ణించే మొదటి అధ్యాయము ముగిసినది (1).