భాగవత మహా పురాణము
24 - మత్స్యావతార వృత్తాంతము
రాజోవాచ ।
పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- ఓ పూజనీయా! శ్రీహరి అద్బుతమగు లీలలు గలవాడు. ఆయన యోగమాయచే దాల్చిన మొట్ట మొదటి అవతారము మత్య్సరూపమును అనుకరించినది. ఆ గాథను నేను వినగోరుచున్నాను.
తమోగుణప్రధానమగు స్వభావము గల చేపయొక్క రూపమును జనులు ఏవగించు కొనెదరు. సహించ శక్యము కాని అట్టి రూపమును స్వతంత్రుడగు శ్రీహరి కర్మపరతంత్రుడగు జీవుడు వలె ఎందుకొరకు దాల్చెను?
ఓ పూజనీయా! పవిత్రకీర్తియగు శ్రీహరియొక్క చరితము సకల మానవులకు సుఖమును కలిగించును. ఈ వృత్తాంతమునంతనూ నీవు మాకు ఉన్నది ఉన్నట్లుగా చెప్ప దగుదువు.
సూత ఉవాచ ।
సూతుడిట్లు పలికెను --- పరీక్షిన్మహారాజు ఇట్లు పలుకగా వ్యాస పుత్రుడగు శుకమహర్షి, విష్ణువు మత్స్యావతారమునెత్తి చేసిన లీలల వృత్తాంతమును చెప్పెను.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- శ్రీహరి స్వతంత్రుడే. కాని గోవులు, వేదవేత్తలు, దేవతలు, సత్పురుషులు, వేదములు, ధర్మము మరియు సత్పురుషుల సంపదలను కూడ రక్షించగోరి ఆయన దేహము లను దాల్చును.
గొప్ప, చిన్న ప్రాణులలో సంచరించే వాయువు వాటి గొప్పదన మును గావి, అల్పత్వమును గాని తాను పొందదు. అదే విధముగా, పరమే శ్వరుడు నిర్గుణుడు. కావున, సకలప్రాణులలో ఆత్మరూపముగా నున్ననూ, ఈశ్వరునకు అంతఃకరణముయొక్క గుణములను బట్టి గొప్పదనము గాని, అల్పత్వము గాని సంక్రమించదు.
ఓ మహారాజా! గడచిన కల్పముయొక్క ఆఖరునందు బ్రహ్మ గారు నిద్రించుట అనే నిమిత్తమును బట్టి బ్రాహ్మము అనే ప్రళయము ఏర్పడెను. అప్పుడు భూలోకము మొదలైన లోకములు సముద్రములో మునిగి పోయినవి.
కాలము సంప్రాప్తమైనప్పుడు బ్రహ్మగారికి నిద్ర వచ్చి, ఆయన నిద్రించ గోరెను. అపుడు ఆయన నోటినుండి బయల్వెడలిన వేదములను ఆయనకు సమీపములోనున్న బలశాలియగు హయగ్రీవాసురుడు అపహ రించేను.
రాక్షసశ్రేష్ఠుడగు హయగ్రీవుడు చేసిన ఆ పనిని తెలుసుకొని, సర్వేశ్వరుడగు శ్రీహరి భగవానుడు చేప రూపమును దాల్చెను.
ఆ కల్పములో సత్యవ్రతుడనే పేరు గల గొప్ప రాజర్షి ఉండెను. నారాయణ భక్తుడగు ఆయన నీటిని మాత్రమే ఆహారముగా తీసుకోని తప స్సును చేసెను.
ఆ సత్యవ్రతుడే ఈ గొప్ప కల్పమునందు శ్రాద్ధదేవుడని ప్రసిద్ధి గాంచిన ఈ సూర్యపుత్రుడు. ఈయననే శ్రీహరి మనువు అనే స్థానము నందు స్థాపించినాడు.
ఒకనాడు ఆయన కృతమాలానదిలో నీటితో తర్పణములను చేయుచుండగా, ఆయన దోసిలిలోని నీటిలో ఏదో ఒక చేప వచ్చి చేరెను.
భరతవంశీయుడవగు ఓ రాజా! ద్రవిడదేశ ప్రభువగు సత్యవ్రతుడు దోసిలియందున్న చేపను నీటితో బాటుగా నదియొక్క నీటిలో విడిచి పెట్టె ను.
గొప్ప కరుణామయుడగు ఆ రాజును ఉద్దేశించి ఆ చేప మిక్కిలి కరుణముగా ఇట్లు పలికెను -- ఓ రాజా! నీవు దీనులయందు ప్రేమ గలవా డవు. దీనురాలనగు నేను తమ జాతికే చెందిన ప్రాణులను చంపే జలజం తువుల వలన భయపడియున్నాను, నన్ను ఈ నదీజలములయందు ఎట్లు విడిచి పెట్టెదవు?
తనను అనుగ్రహించుటకై విష్ణువు చేప రూపమును ధరించి వచ్చి నాడని ఆ మహారాజునకు తెలియదు. ఆయన ప్రేమతో ఆ చేపను రక్షించుటకే మనస్సులో నిశ్చయించెను.
ఆ చేపయొక్క అతిదీనమగు మాటలు విని దయామయుడగు ఆ రాజు దానిని కలశములోని నీటిలో వేసి ఆశ్రమమునకు తీసుకు వెళ్లెను.
ఆ చేప ఒకే ఒక రాత్రిలో ఆ కమండలమునందు తనకు దానిలో చోటు చాలని విధముగా పెరిగెను. అపుడది ఆ రాజుతో నిట్లనెను.
ఇచట ఈ కమండలములో ఇరుకులో కష్టపడుతూ నివసించుట నావలన కాదు. కావున, నాకు మిక్కిలి విశాలమగు నివాసమును ఏర్పాటు చేయుము. అచట నేను సుఖముగా నివసించెదను.
ఆ రాజు ఆ చేపను అచటనుండి తీసుకువెళ్లి నూతి నీటిలో వేసె ను. నూతిలో వేయబడిన ఆ చేప గంటలో మూడు మూరలు పెరిగెను.
ఓ మహారాజా! నాకీ నుయ్యి సుఖముగా నివసించుటకు చాలుట లేదు. నేను నిన్ను శరణు వేడినాను. కావున, నాకు విశాలమగు స్థానమును ఏర్పాటు చేయుము.
ఓ మహారాజా! ఆ రాజు ఆ చేపను ఆ నూతినుండి తీసి సరస్సు నందు వేసెను. ఆ ఈ గొప్ప చేప నిరంతరముగా పెరిగి ఆ సరస్సును ఆవరించెను.
ఓ రాజా! నాకు నీరే నివాసము. ఈ సరస్సులోని నీరు నా సుఖవిహారమునకు సరిపడుట లేదు. నన్ను రక్షించే ఉపాయమును చేయుము. నీరు ఎన్నటికీ క్షీణించని అగాధమగు సరస్సులో నన్ను ఉంచుము.
ఆ చేప ఇట్లు పలుకగా, ఆ రాజు ఆ చేపను క్షీణించని నీరు గల సరస్సులలో, ఒకదాని కంటే మరియొకటి పెద్దదిగా ఉండే సరస్సులలో వేసెను. ఆ చేప ఆ సరస్సుతో సమానముగా పెరుగుచుండెను. అపుడాయన ఆ చేపను సముద్రములో వేసెను.
ఆయన ఆ చేపను సముద్రములో వేయుచుండగా అది ఇట్లనెను -- ఓ వీరా! దీనిలో చాల బలము గల మొసళ్లు, తిమింగలములు మొదల గునవి గలవు. అవి నన్ను తినివేయును. కావున, నన్ను దీనియందు విడిచి పెట్టుట నీవంటి వీరునకు తగదు.
ఈ విధముగా మధురమైన మాటలను పలికి మోహ పెట్టుచున్న ఆ చేపతో రాజు ఇట్లనెను -- చేప రూపముతో మమ్ములను మోహ పెట్టు చున్న వీవు ఎవరివి? .
నీ వంటి పరాక్రమము గల నీటి జంతువును మేము ఇదివరలో చూడనూలేదు, విననూలేదు. నీవు ఒకే రోజులో పెరిగి వంద యోజన ముల విస్తారము గల సరస్సును నిండా వ్యాపించితివి.
నీవు సాక్షాత్తుగా అవినాశియగు నారాయణ భగవానుడవు. ఇది నిశ్చయము. నీవు ప్రాణులననుగ్రహించుట కొరకై చేపల రూపమును దాల్చినావు.
ఓ పురుషోత్తమా! జగత్తుయొక్క సృష్టిస్థితిలయములకు ప్రభుడవు నీవే. నీకు నమస్కారము. ఓ ప్రభూ! నీ భక్తులమగు మేము నిన్ను శరణు వేడుచున్నాము. మాకు. సత్యమైన ఆత్మ, ముఖ్యమైన ఆశ్రయము నీవే.
నీవు అవతారములనెత్తి చేసే లీలలన్నీ ప్రాణుల అభ్యుదయము. కొరకు హేతువులగుచున్నవి. నీవీ రూపమును దేనికొరకై ధరించితివో, నేను తెలియ గోరుచున్నాను.
పద్మమువంటి కన్నులు గల ఓ శ్రీహరీ! దేహము మొదలగు అనా త్మపదార్థములయందు ఆత్మభావము గల రాజాదులను నీకంటే భిన్నమైన వారిని ఆశ్రయించుట వ్యర్థము. నీ పాదపద్మములను శరణు వేడుట ఆ విధ ముగా వ్యర్థము కాదు. ఎందుకంటే, నీవు సకలప్రాణులకు హితకారివి; సక లప్రాణులకు ప్రియమైన ఆత్మవు నీవే. కావుననే, నీవు ఆశ్చర్యమును గొలిపే ఈ రూపమును మాకు చూపితివి.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- జగన్నాథుడగు శ్రీహరి పరమ (నిష్కామ) భక్తులకు ప్రియమైనవాడు, వారియందు ప్రీతి గలవాడు. ఆయన యుగాంతములో ప్రళయ సముద్రమునందు విహరించగోరి చేప రూపును దాల్చెను. ఈ విధముగా పలుకుచున్న సత్యవ్రత మహారాజునుద్దే శించి, ఆయనకు ప్రియమును చేయగోరి ఆ భగవానుడిట్లు పలికెను.
శ్రీభగవానువాచ ।
శ్రీమత్స్య భగవానుడిట్లు పలికెను --- (అంతః) శత్రువులను అణ గదొక్కిన ఓ మహారాజా! ఈనాటినుండి రాబోయే ఏడవ రోజున భూః-భు వః-సువః అనే మూడు లోకములు ప్రళయ సముద్రమునందు మునిగిపో గలవు.
అప్పుడు ముల్లోకములు నిశ్చయముగా ఆ ప్రళయ జలముల యందు మునిగిపోగా, నాచే పంపబడిన ఒకానొక విశాలమైన నౌక నీ వద్దకు రాగలదు.
అపుడు నీవైతే సకలములైన మొక్కలను మరియు చిన్న పెద్ద విత్త నములను సంగ్రహించుము. సప్తర్షులు నీకు తోడు కాగలరు. సకలప్రాణులు నీ గొప్పదనమును వర్దిల్ల జేయగలవు. నీవా పెద్ద నౌకను ఎక్కుము. అంతా వ్యాపించియున్న ఆ ప్రళయ సముద్రములో కాంతి ఉండదు. అయిననూ, నీవు మహర్షుల తేజస్సు చేతనే దైన్యము లేకుండా సంచరించ గలవు.
మిక్కిలి బలమైన గాలీలో ఆ నావ అల్లల్లాడిపోవును. నేను అప్పుడు అచటకు వచ్చెదను. నీవా నావను మహాసర్పమగు వాసుకితో నా కొమ్మునకు గట్టిగా కట్టివేయుము.
ఓ మహారాజా! నీవు, మహర్షులు ఆ నౌకలో కలిసియుండగా, బ్రహ్మగారి రాత్రి (ప్రళయము) సాగినంత కాలము నేనా నావను సముద్ర ములో లాగుతూ విహరించెదను.
నీవు చక్కని ప్రశ్నలను వేయుచుండగా, పరబ్రహ్మ అని మహర్షు. లచే ప్రతిపాదించబడే నా స్వరూపమును నేను వివరించి చెప్పగలను. నా అనుగ్రహముచే నీవా పరబ్రహ్మను హృదయమునందు సాక్షాత్కరించు కొనగలవు.
శ్రీహరి సత్యవ్రత మహారాజును ఈ విధముగా ఆదేశించి అంతర్దా నము చెందేను.. ఇంద్రియాధిపతియగు శ్రీహరి ఆదేశించిన ఆ సమయము : కొరకై ఆ రాజు నిరంతరముగా ప్రతీక్షించుచుండెను.
రాజర్షియగు ఆ సత్యవ్రతుడు తూర్పు వైపు కొనలు ఉండునట్లుగా దర్భలను పరచి, ఈశాన్యమునకభిముఖముగా కూర్చుండి, మత్స్యరూపు డగు శ్రీహరియొక్క పాదములను ధ్యానించెను.
తరువాత పెద్ద మేఘములు వర్షించుచుండగా వర్ధిల్లి చెలియలి కట్టను దాటి సముద్రము భూమినంతనూ ముంచెత్తుచుండుటను ఆ మహా రాజు చూచెను.
ఆ రాజు భగవానునీ ఆదేశమును గురించి తలపోస్తూండగానే అచ టకు వచ్చిన నౌక కనబడెను. ఆతడు ఓషధుల (పంటధాన్యముల) మరియు వృక్షముల బీజములను తీసుకొని, మహర్షులతో గూడి ఆ నౌకపై ఎక్కేను.
సంతోషించిన ఆ మహర్షులు ఇట్లు పలికిరి -- ఓ రాజా! నీవు శ్రీహరిని ధ్యానించుము. ఆయన నిశ్చయముగా మనలనీ కష్టమునుండి రక్షించి, సుఖమును కలిగించగలడు.
తరువాత ఆ మహారాజు ధ్యానించగా, శ్రీహరి లక్షయోజనముల నిడివి గల బంగరు చేపట్టే ఆ మహాసముద్రములో ఆవిర్భవించెను. ఆ చేపకు ఒక కొమ్ము ఉండెను.
పూర్వము శ్రీహరి చెప్పిన విధముగా ఆ రాజు వాసుకినాగును మోకుగా చేసి ఆ నావను చేప కొమ్మనకు గట్టిగా కట్టెను. అపుడాయన సంతోషించి, మధువు అనే రాక్షసుని చంపిన శ్రీహరిని ఇట్లు స్తుతించెను.
రాజోవాచ ।
సత్యవ్రత మహారాజు ఇట్లు పలికెను --- జనులు ఈ లోకములో అనాదియగు అజ్ఞానముచే కప్పివేయబడిన ఆత్మతత్త్వవివేకము గలవారై, ఆ అజ్ఞానముచే కలిగించబడిన సంసారములో నిరంతరముగా పరిశ్రమిస్తూ వ్యాకులురై యుండెదరు. వారు అనుకోకుండా (ఈశ్వరేచ్చచే) నిన్ను శరణు వేడి నిన్నే (ఆత్మరూపముగా) పొందెదరు. నీవు గురువులకు గురుడవు. నీవు మాకు మోక్షమునిమ్ము.
అవివేకియగు ఈ మానవుడు తాను చేసిన కర్మలచే తానే బద్దుడ గును. మానవుడు సుఖమును కోరి కర్మలను చేసి దుఃఖమును మూటగట్టును. వాని ఈ అజ్ఞానము శ్రీహరిని సేవించుటచే తొలగిపోవును. అట్టి శ్రీహరి మాకు గురువు. ఆయన మా హృదయమునందలి అజ్ఞానగ్రంథిని పోనాడు గాక!
రుద్రుని రోదనమునుండి పుట్టిన వెండి అగ్నియొక్క సంపర్కము వలన తనలోని మాలిన్యమును పోగొట్టుకొని తనదైన రంగును పొందును. అదే విధముగా మానవుడు శ్రీహరిని సేవించి తనలోని అజ్ఞానమనే మాలి వ్యమును పోగొట్టుకోని జ్ఞానముచే తన స్వరూపమును పొందును. అవినా శియగు అట్టి ఈశ్వరుడు గురువులకు కూడ పూజనీయుడు. అట్టి శ్రీహరి మాకు గురువు అగుగాక!
దేవతలు, గురువులు, ఇతర జనులు కూడ కలిసియేననూ తమంత తాముగా నీ అనుగ్రహములో పదివేలవ వంతులోని లేశము నైననూ మానవునకు చేయజాలరు. అట్టి సర్వేశ్వరుడవగు నిన్ను నేను శరణు పొందుచున్నాను.
అవివేకి అజ్ఞానియగు వ్యక్తిని గురువుగా చేసుకున్నచో, గ్రుడ్డివాడు మరియొక గ్రుడ్డివానిని మార్గదర్శకునిగా చేసుకున్నట్లుండును. నీకు సూర్యుడు కన్ను. సకలములైన ఇంద్రియములను ప్రకాశింపజేసే చైత న్యము నీవే. కావుననే, ఆత్మతత్త్వమును తెలియగోరే మేము. సర్వజ్ఞుడ వగు అట్టి నిన్ను గురువుగా ఎన్నుకున్నాము.
అజ్ఞానియగు జనుడు అజ్ఞానియగు జనునకు అర్థకామములకు చెందిన అయోగ్యమగు బుద్దిని ఉపదేశించగా, వాడు దాని కారణముగా చీకటివంటి దాట. శక్యము కాని సంసారము (నరకము) ను పొందుచున్నాడు, కాని, నీవు వినాశము లేని మరియు వ్యర్థము: కాని ఆత్మజ్ఞానమునుప దేశించెదవు. దాని వలన మానవుడు తేలికగా తన స్వరూపమును తెలుసు కొని తద్వారా మోక్షమును పొందును.
సర్వమానవులకు నీవు హితకారివి, ప్రియమగు ఆత్మరూపుడవు, ఈశ్వరుడవు మరియు గురుడవు. మానవుడు పొందే జ్ఞానము, మరియు అభీష్టసిద్ది కూడ నీ రూపములే. అయినప్పటికీ, మానవుడు కామనల యందు గట్టిగా తగుల్కొన్నవాడై బుద్ధియందు వివేకమును కోల్పోయి, తన హృదయమునందే ఉన్న నిన్ను తెలియలేకున్నాడు.
ఓ భగవానుడా! దేవనాయకుడవగు నీవు మాత్రమే ప్రార్థించదగిన ఈశ్వరుడవు. అట్టి నిన్ను నేను తత్త్వమునుపదేశించుమని శరణు వేడుచు న్నాను. నీవు తత్త్వమును ప్రకాశింప జేసే వచనములను ఉపదేశించి, నా హృదయమునందున్న కామనలు అనే ముడులను ఛేదించుము. ఆపైన వీ స్వరూపమును ప్రకాశింప జేయుము.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- సత్యవ్రత మహారాజు ఇట్లు పలుకగా, శ్రీహరి భగవానుడు మహాసముద్రమునందు విహరిస్తూ ఆయ నకు ఆత్మస్వరూపమును ఉపదేశించెను. జగత్కారణుడు, పూర్ణుడు అగు ఆ భగవానుడు చేప రూపమును దాల్చి యుండెను గదా!
ఆయన తనచే ప్రణీతమైన మత్స్యపురాణమనే సంహిత (అనేక విషయముల సంకలనము) ను, తన స్వరూపముయొక్క రహస్యమును కూడ సత్యవ్రత మహారాజునకు నిశ్శేషముగా బోధించెను. ఆ పురాణసం హితయందు ఆత్మజ్ఞానము, భక్తియోగము, కర్మలు కూడ ప్రతిపాదించబడి యున్నవి.
మహర్షులతో గూడి నౌకయందు కూర్చున్న ఆ రాజు మత్స్య భగ వానునిచే ప్రవచించబడిన కాలాతీతమగు పరబ్రహ్మను గురించి, ఆత్మ స్వరూపమును గురించి శ్రవణము చేసి, సందేహములను తీర్చుకొనెను.
మత్స్యరూపుడగు ఆ శ్రీహరి హయగ్రీవాసురుని సంహరించి వేద ములను తీసుకువచ్చేను. పూర్వమునందలి ప్రళయము పూర్తి కాగానే నిద్ర లేచిన బ్రహ్మగారికి ఆయన ఆ వేదములను సమర్పించేను.
ఆ సత్యవ్రత మహారాజు ఆత్మస్వరూపమును పరోక్షముగా తెలి యుటయే గాక, స్వానుభవముగా సాక్షాత్కరించుకొనెను. ఆయన విష్ణువు యొక్క అనుగ్రహము వలన ఈ కల్పమునందు సూర్యుని పుత్రుడగు (వైవ స్వత) మనువు ఆయెను.
మాయాశక్తిచే చేప రూపును దాల్చిన శార్జధారియగు శ్రీహరి రాజర్షియగు సత్యవ్రతునకు చేసిన ఉపదేశము (వారిద్దరి సంభాషణము) యొక్క ఈ గొప్ప వృత్తాంతమును విన్న వ్యక్తి పాపమునుండి విముక్తుడగు ను.
శ్రీహరియొక్క ఈ మత్స్యావతారమును మానవుడు ప్రతి దినము కీర్తించినచో, అట్టివాని సంకల్పములు సిద్ధించుటయే గాక, ఆతడు సర్వోత్త మమగు ఫలమైన మోక్షమును కూడ పొందును.
బ్రహ్మగారు తన సృష్టిశక్తిని ఉపసంహరించి ప్రళయకాలమునం దలి నీటిలో నిద్రించుచుండగా, ఆయన ముఖమునుండి బయల్వెడలిన వేదములను రాక్షసుడు (హయగ్రీవుడు) అపహరించెను. అపుడు శ్రీహరి ఆ రాక్షసుని సంహరించి వేదములను తీసుకువచ్చి బ్రహ్మగారికి అప్పజే ప్పెను. సకలజగత్కారణుడగు ఆ శ్రీహరి మాయచే లీల కొరకై చేప రూపు దాల్చి, సత్యవ్రతునకు మహర్షులకు పరబ్రహ్మస్వరూపమును బోధించెను. అట్టి శ్రీహరికి నేను నమస్కరించుచున్నాను.
శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో మత్స్యావతారమును వర్ణించే ఇరువది నాల్గవ అధ్యాయము ముగిసినది (24).
అష్టమ స్కంధము ముగిసినది.
Summary of chapter 24 of the Bhāgavata Mahā Purana is as follows:
The Eighth Skanda concludes with the historical account of Bhagavān Matsya at the close of the Cākshusha Manvantara. While King Satyavrata of Draviḍadeśa was offering water in the Kṛtamālā River, a tiny fish appeared in his hands, begging for protection. The king placed it in a pot, but the fish rapidly expanded, outgrowing wells, lakes, rivers, and eventually the entire ocean. Recognizing the fish as Bhagavān Vishṇu, Satyavrata offered prostrations. Bhagavān Matsya warned him of an impending cosmic deluge (*Pralaya*) in seven days and instructed him to collect seeds, plants, animals, and assemble with the Saptarshis aboard a golden boat dispatched by His potency. When the deluge arrived, Satyavrata tied the boat to the horn of the colossal golden fish using Vāsukī as a rope. As the boat floated upon the cosmic waters, Bhagavān Matsya imparted the Matsya Purāṇa, slew the demon Hayagrīva, and restored the stolen Vedas to Lord Brahmā, installing Satyavrata as Vaivasvata Manu in the new era.