భాగవత మహా పురాణము
12 - సముద్ర మథనము - శివుడు మోహినిని చూచి మోహపడుట
శ్రీబాదరాయణిరువాచ ।
బాదరాయణ వ్యాసుని పుత్రుడగు శుకమహర్షి ఇట్లు పలికెను --- మధువు అనే రాక్షసుని చంపిన శ్రీహరి యువతి రూపముతో రాక్షసులను మోహింపజేసి దేవగణములకు అమృతమును త్రాగించెననే విషయమును కైలాసవాసియగు శివుడు వినెను. అపుడా వృషభధ్వజుడు పార్వతీదేవితో వృషభమునధిష్టించి శ్రీహరి ఉన్న చోటికి వెళ్లాను. సకలభూతగణ ములు ఆ శివుని చుట్టువారి ముందుకు నడిచిరి.
శ్రీహరి భగవానుడు పార్వతితో గూడియున్న ఆ శివుని సాదర ముగా సత్కరించేను. ఆయన కూడ శ్రీహరిని తిరిగి పూజించి సుఖముగా కూర్చుండి చిరునవ్వుతో ఇట్లు పలికెను.
శ్రీమహాదేవ ఉవాచ ।
శ్రీమహాదేవుడు ఇట్లు పలికెను --- ఓ దేవదేవా! నీవే జగద్రూప ముగా ప్రకటమై జగత్తునంతనూ వ్యాపించి జగత్తును పాలించుచున్నావు. సకలపదార్థముల స్వరూపము, కారణము నీవే. సర్వమును శాసించువా డవు నీవే.
ఈ జగత్తునకు ఆదిమధ్యాంతములు ఆ పరబ్రహ్మనుండియే కలు గుచున్ననూ, అవి అవినాశియగు ఆ పరబ్రహ్మయందు లేవు. ఆ పరబ్ర హ్మయే దృక్-దృశ్యములుగా, భోక్తృ-భోగ్యములుగా ప్రకటమగుచున్నది. శ్రుతిప్రసిద్ధమైన అఖండమగు సత్, ఏకరసమగు చిత్ అయిన ఆ పర బ్రహ్మ నీవే.
కోరికలను విడచి మోక్షమును మాత్రమే కోరే మహర్షులు ఇహపర ములయందలి ఆసక్తిని విడిచి పెట్టి, నీ పాదపద్మమును మాత్రమే ఉపాసిం చెదరు.
పూర్ణము, అవినాశి, నిర్గుణము, ఆనందఘనము, అవికారి అగు పరబ్రహ్మ నీవే. నీయందు శోకము లేశమైననూ లేదు. నీకంటే భిన్నముగా రెండవది లేదు. కాని నీవు సర్వము కంటే విలక్షణుడవు. జగత్తుయొక్క సృష్టి స్థితిలయములకు కారణము నీవే. సర్వమునకు ఆత్మ నీవే. జగత్తునకు కర్మఫలదాతయగు నాథుని అపేక్ష గలదు. అట్టి జగన్నాథుడవు నీవే. కాని, నీకు జగత్తుయొక్క అపేక్ష లేదు.
స్థూలసూక్ష్మములు, కార్యకారణములు కూడ నీవు ఒక్కడివే. బంగారమును ఆభరణముగా చేసినా, చేయకున్నా అది కేవలము బంగా రము మాత్రమే. అదే విధముగా, ఈ జగత్తులో కనబడే భేదము యథార్థత త్వమగు నీయందు లేదు. జనులు అజ్ఞానముచే నీయందు భేదమును ఆరోపించుచున్నారు. ఎందుకంటే, నీకు వాస్తవముగా ఉపాధి (తన ధర్మ ములను తనకు సమీపమునందున్నదానియందు ప్రసరింపజేసినదా యన్నట్లు ఉండేది) తోడి సంబంధము లేదు. అయిననూ, సత్త్వరజస్తమోగు ణములయందు నీవు ప్రతిఫలించి వికల్పములు భాసించుచున్నవి.
కొందరు (వేదాంతులు) నీవే పరబ్రహ్మవనియు, కొందరు (మీమాంసకులు) నీవు ధర్మస్వరూపుడవనియు, కొందరు (సేశ్వర సాంఖ్యులు) నీవు ప్రకృతిపురుషులకు అతీతుడవైన పరమేశ్వరుడవనియు, కొందరు (పాంచరాత్రులు) నీవు తొమ్మిది (విమల - అసంగత, ఉత్కర్షిణి - ఉత్కర్ష గలది, జ్ఞాన, క్రియ, యోగ - గుణముల కలయిక, ప్రహ్వి -
యము, సత్య, ఈశాన, అనుగ్రహ) శక్తులతో కూడియున్న పరమేశ్వరుడవ నియు, మరికొందరు (పాతంజలులు) నీవు వినాశము లేని స్వతంత్రుడవైన మహాపురుషుడవనియు తెలియుచున్నారు.
ఓ ఈశ్వరా! నేను గాని, రెండు పరార్దముల ఆయుర్దాయము గల బ్రహ్మగారు గాని, సత్త్వగుణప్రధానమగు సృష్టిలో భాగమైన మరీచి మొద లగు మహర్షులు గాని నీ సృష్టియొక్క రహస్యమును తెలియకున్నారు. అట్టిచో, నీ మాయచే అపహరించబడిన వివేకజ్ఞానము గలవారై, సర్వకాల ములలో అమంగళమైన రాజస తామస ప్రవృత్తులు గల రాక్షసులు, మాన వులు మొదలగువారు తెలియజాలరని వేరుగా చెప్పవలయునా?
జ్ఞానస్వరూపుడవైన అట్టి నీవు నీచే రచించబడిన ఈ జగత్తును, దాని సృష్టిస్థితిలయములను, ప్రాణుల కర్మలను, వాటికీ జననమరణరూప మగు బంధమును, దానినుండి విముక్తిని కూడ తెలియుదువు. వాయువు ఆకాశమును వ్యాపించినట్లుగా, నీవు చరాచరమగు జగత్తునంతనూ ఆత్మ రూపముగా వ్యాపించి యున్నావు.
నీవు సత్త్వరజస్తమోగుణములను ఉపాధిగా చేసుకొని అవతరించి రమించెదవు. అట్టి నీ అవతారములను నేను చూచితిని. నీవు దాల్చిన స్త్రీరూపమును కూడ నేను చూడగోరుచున్నాను.
నీవు స్త్రీరూపమును దాల్చి రాక్షసులను మోహింప జేసి, దేవత లకు అమృతమును త్రాగించితివి. ఆ రూపమును చూడగోరి మేము వచ్చి నాము. ఆ రూపమును చూడాలని మాకు చాల కుతూహలము గలదు.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా శూలధారియగు శివుడు ప్రార్థించగా, విష్ణు భగవానుడు గంభీరమగు (ఇతరులు తెలియజా లని) భావముతో నవ్వి, ఆ కైలాసవాసికి ఇట్లు బదులిచ్చెను.
శ్రీభగవానువాచ ।
శ్రీహరి భగవానుడిట్లు పలికెను --- దేవకార్యములను చక్కబెట్టే నేను అమృతకలశము చేయి జారిపోయినప్పుడు రాక్షసులకు మోహ మును కలిగించుటకై స్త్రీరూపమును దాల్చితిని.
ఓ దేవశ్రేష్ఠా! సంకల్పమునుండి కామము ఉదయించును. కామ మును ఉద్దీపింప జేసే అట్టి ఆ రూపమును కాముకులు చాల సమ్మానించే దరు. దానిని చూడగోరే నీకు ఆ రూపమును నేను చూపించెదను.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా పలుకుతూనే శ్రీహరి భగవానుడు అచ్చటనే అంతర్ధానమాయెను. శివుడు పార్వతితో గూడి అన్ని వైపులా చూచుచుండెను.
తరువాత శివుడు అచటి ఉద్యానవనమునందు ఒక గొప్ప యువ తిని చూచెను. ఆ ఉద్యానములో చెట్లయందు రంగు రంగుల పువ్వులు, ఎర్రని చిగుళ్లు ఉండెను. ఆ యువతి విలాసగా బంతితో ఆడుచుండెను. ఆమె కటిభాగము పై ప్రకాశించే చీరను దాల్చి వడ్డాణమును పెట్టుకొనెను.
ఆమె బంతిని వంగి తీసుకొని ఎగిరి పట్టుకొనేటప్పుడు కంపించే స్తనముల మరియు గొప్ప హారముల పెను భారముచే ఆమె నడుము ప్రతి అడుగునందు విరిగిపోవుచున్నదా యన్నట్లు ఉండెను. ఆమె చిగుళ్లవలె కోమలములైన పాదములతో ఇటునటు నడచుచుండెను.
దిక్కులయందు బంతి ఎగురుచుండగా దానికేసే చూచుచుండు టచే ఆమె కనుగ్రుడ్లు మిక్కిలి ఉద్వేగమును పొందుచుండెను. చంచల మైన ఆమె కన్నులు విశాలముగ నుండెను. ఆమె చెవులయందలి కుండల ముల కాంతులు బడి చెక్కిళ్లు మెరయుచుండెను. ఆమె ముఖమునకు నల్లని ముంగురులే అలంకారమాయెను.
ఆమె తన అందమైన ఎడమ చేతితో జారిపోవుచున్న కోకముడిని, విడిపోవుచున్న జుట్టు ముడిని మరల ముడి వేయుచుండెను. మరియొక చేతితో ఆమె బంతిని కొట్టుతూ, తన చమత్కారముచే జగత్తునకు అధిక మగు వ్యామోహమును కలిగించుచుండెను.
ఆమెను చూచి శివుడు తనకు సమీపమునందు పార్వతి, తన గణ ములు ఉన్నారనే సంగతినే విస్మరించెను. ఈ విధముగా ఆ యువతి బంతి ఆట ఆడుతూ కొద్దిగా సిగ్గుపడి అస్పష్టమైన చిరునవ్వుతో శివునిపై ఒక కడ గంటి చూపును విసరగా, ఆయన ఆ చూపునకు మోసపోయెను. ఆయన ఆమెను చూడగా తిరిగి ఆమె ఆయనకేసి చూచుటచే, ఆయన మనస్సు కలవరపడెను.
ఆమె చేతినుండి జారిన ఆ బంతి కొంత దూరము పోగా, ఆమె దానిని వెన్నంటి వెళ్లుచుండెను. ఆమెను శివదేవుడు నిరంతరముగా చూచుచుండెను. ఇంతలో గాలికి ఆమె నాజూకైన చీర, మొలనూలుతో సహా ప్రక్కకు తొలగెను.
ఈ విధముగా అందమైన కడగంటి చూపులతో మనస్సును రంజిం పజేసే ఆ సుందరిని శివుడు చూచెను. ఆమె కూడ ఆయన వైపు వక్రముగా చూచెను. అపుడు ఆయన ఆమెపై మనసు పడేనట.
ఆమె శివుని వివేకమును హరించివేసెను. ఆమెను చూచుటచే శివునియందు కామోద్రేకము కలిగి ఆయన స్వాధీనతను, లజ్జను కూడ కోల్పోయెను. పార్వతీ దేవి చూచుచుండగనే, ఆయన ఆమెను లెక్క చేయకుండా ఆ యువతి ఉన్న చోటకు వెళ్లాను.
కొద్దిగా తొలగిన వస్త్రము గల ఆ యువతి తన వద్దకు శివుడు వచ్చుచుండుటను చూచి చాల సిగ్గుపడి నవ్వుతూ చెట్లమధ్యలో దాగు కుంటూ ఒకచోట స్థిరముగా నిలబడలేదు.
ఆమె శివ భగవానుని మనస్సును దోచివేయగా, ఆయన మన్మథు నకు వశుడాయెను. గజేంద్రుడు ఆడు ఏనుగును వలె, ఆయన ఆమెను అనుసరించి వెళ్లాను.
ఆయన అధికమగు వేగముతో ఆమెను వెంబడించెను. ఆమె ఇష్ట పడకున్ననూ, ఆయన ఆమె జుట్టుముడిని పట్టుకొని దగ్గరగా తీసుకొని రెండు చేతులతో కౌగిలించుకొనెను.
శివ భగవానుడు గజేంద్రుడు ఆడు ఏనుగును వలే ఆమెను కౌగి లించుకొనెను. అపుడామె ఇటునటు గుంజుకొనగా, ఆమె జుట్టు చెల్లాచెద రాయేను.
ఓ మహారాజా! శ్రీహరిచే నిర్మించబడిన మాయయైన ఆ సుందరి దేవశ్రేష్ఠుడగు శివుని భుజముల మధ్యనుండి తనను విడిపించుకొని వేగ ముగా పారిపోయేను.
ఈ రుద్రుడు మోహినీరూపములోనున్న ఆ విష్ణువు వెళ్లిన మార్గ ములో వెనుక పరుగెత్తెను. విష్ణువు యొక్క లీలలు అచ్చెరువును గొల్పు ను. ఆ సమయములో రుద్రుని ఆయన శత్రువగు మన్మథుడు జయించి నాడా యన్నట్లుండెను.
ఆడు ఏనుగు వెనుక మదించిన గజేంద్రుడు వలె ఆ రుద్రుడు మోహిని వెంట పరుగెత్తుచుండగా, అమోఘమగు ఆయన బీజము స్కన్న మాయెను.
ఓ మహారాజా! మహాత్ముడగు ఆ రుద్రుని బీజము భూమిపై పడిన చోటల్లా వెండి బంగారముల గనులు తయారైనవి.
నదులు, సరస్సులు, పర్వతములు, అడవులు, ఉద్యానవనములు ఇత్యాదిగా ఎక్కడెక్కడైతే మహర్షులు ఉండిరో, రుద్రుడు ఆ స్థానముల న్నింటియందు తన సన్నిధిని అనుగ్రహించెను.
ఓ మహారాజా! బీజము సన్నము కాగానే రుద్రుడు తాను విష్ణు మాయచే జడుడనైతినని తెలుసుకొనెను. వెంటనే ఆయన ఆ వ్యామోహ మునుండి నివృత్తుడాయెను.
తరువాత రుద్రుడు జగత్తునకు ఆత్మరూపుడైన శ్రీహరియొక్క మహిమను గుర్తించేను. శ్రీహరి శక్తి తెలియ శక్యము కానిది. అపుడాయన తాను జడుడగుట ఆశ్చర్యము కాదనియే భావించెను.
మధువు అనే రాక్షసుని (భోగాసక్తిని సంహరించిన శ్రీహరి తన పురుషరూపమును దాల్చెను. ఆయనకు రుద్రుడు విషాదము గాని, బిడి యము గాని లేకుండా కనబడెను. ఆయన చాల ప్రీతిని జెంది ఇట్లు పలికే ను.
శ్రీభగవానువాచ ।
శ్రీహరి భగవానుడిట్లు పలికెను --- ఓ రుద్రా! నీవు దేవతలలో శ్రేష్ఠుడవు. నేను స్వేచ్చ చే స్త్రీరూపములోనుండగా, నీవు నా మాయచే మోహితుడవైననూ, నీ అంతట నీవు నీ స్వరూపమునందు నిలిచియుం డుట చాల మంగళకరము.
నా మాయ అనేకములగు విలాసలను, హావభావములను విశేష ముగా ప్రకటించును. దానిని చిత్తజయము లేనివారు తరించలేరు. అధిక ముగా భోగములయందు తగుల్కొన్న ఏ వ్యక్తి దానిని అధిగమించ గల్గును? కాని నీవు అధిగమించితివి.
సృష్టిస్థితిలయములకు నిమిత్తమైన కొలమును బట్టి కాలరూపుడ నగు నేను సత్త్వరజస్తమోగుణములనే అంశలుగా మాయాశక్తిని ఉపాధిగా స్వీకరించేదను. ఆ ఈ మాయ నిన్ను మోహితుని చేయబోదు.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ మహారాజా! లక్ష్మీదేవి వక్షః స్థలము పై పుట్టుమచ్చయై ఉండే శ్రీహరి భగవానుడు రుద్రుని సత్కరించే ను. ఆయన తన గణములతో కూడి శ్రీహరికి ప్రదక్షిణము చేసి, ఆయన వద్ద సెలవు తీసుకొని తన ధామమునకు వెళ్లాను.
భరతవంశీయుడవగు ఓ మహారాజా! తరువాత మహర్షులు స్తుతిం చుచుండగా, శివ భగవానుడు తన అర్ధాంగియగు పార్వతీదేవితో ఆ మాయను గురించి ప్రీతితో వర్ణించి చెప్పెను.
పుట్టుక లేనివాడు, సర్వాతిశాయి ప్రకాశ స్వరూపుడు అగు పురు: షోత్తమునియొక్క మాయను నీవు చూచితివా? శ్రీహరి అంశలలో నేను. శ్రేష్టుడను. అయిననూ, నేనే ఆ మాయచే మోహమును పొందగా, ఇంద్రి యములకు బానిసలై యుండే ఇతరుల గురించి చెప్పున దేమున్నది?
వేయి సంవత్సరముల తరువాత నేను ధ్యానమును విరమిం చినప్పుడు నీవు నా దగ్గరకు వచ్చి, నీవు ధ్యానించేది ఎవరిని? అని ప్రశ్నిం చితివి. నేను ధ్యానించే కాలాతీతమైన ఆ పూర్ణ పరబ్రహ్మము సాక్షాత్తుగా ఈ శ్రీహరియే. శ్రీహరిని కాలము పరిచ్చేదము చేయలేదు. ఆయనను వేదములు వర్ణించలేవు.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ వత్సా! ఈ విధముగా శార్జము అనే ధనస్సు గల శ్రీహరియొక్క పరాక్రమమును నీకు వర్ణించి చెప్పితిని. ఆయన సముద్రమథనమునందు కూర్మరూపముతో పెద్ద పర్వ తమును తన వీపుపై మోసెను.
ఈ గాథను పలుమార్లు కీర్తించువాడు, ప్రవచనమును చెప్పగా వినువాడు ఎక్కడైననూ చేపట్టే మంచి ఉద్యమము ఏ కాలమునందైననూ నిష్పలము కాబోదు. ఎందుకంటే, పవిత్రకీర్తియగు శ్రీహరియొక్క గుణము లను శాస్త్రము బోధించిన విధముగా వర్ణించినచో, సంసారములోని సకల ములైన శ్రమలు దూరమగును.
శ్రీహరి కపటముగా యువతి వేషమును ధరించి దేవశత్రువులగు రాక్షసులను మోహింప జేసి, శ్రేష్ఠులగు దేవతలకు సముద్రమథనము వలన పుట్టిన అమృతమును భుజింప జేసెను. ఎందుకంటే, దేవతలు ఆయన పాదమును శరణు వేడిరి. దుష్టులకు ఆయన పాదముల మహిమ తెలియదు. కేవలము భక్తిచే మాత్రమే ఆయన శరణు లభించును. ఆయన దగ్గరకు చేరిన భక్తులకు ఆయన కోరికలను ఈడేర్చును. అట్టి శ్రీహరికి నేను నమస్కరించుచున్నాను.
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో సముద్రమథన వృత్తాంతములో మోహినీ అవతారమును వర్ణించే పన్నెండవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 12 of the Bhāgavata Mahā Purana is as follows:
Hearing of Bhagavān Vishṇu's captivating incarnation as Mohinī-mūrti, Mahādeva Śiva traveled to Vaikunṭha alongside Mother Pārvatī to request a direct vision of that form. Responding to His request, Bhagavān manifested Mohinī-mūrti in a beautiful garden. Mesmerized by Her transcendent beauty, Mahādeva Śiva briefly chased Her, demonstrating the formidable power of Bhagavān's illusory potency (*Māyā*). Realizing Her divine identity, Mahādeva Śiva quickly regained His composure, and Bhagavān praised Śiva for His unrivaled mastery over material illusion.