భాగవత మహా పురాణము
17 – వామనావతారము - అదితికి శ్రీహరి దర్శనమిచ్చుట
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ మహారాజా! తన భర్తయగు కశ్యపుడీ విధముగా ఉపదేశించగా, ఆ అదితి సుతరాము ఏమరుపాటు లేనిదై పన్నెండు రోజులు ఈ వ్రతమును అనుష్టించెను;
దేహము అనే రథమునకు బుద్దియే సారథి కాగా ఆ అదితి మనస్సు అనే కళ్లెముతో ఇంద్రియములనే పొగరుమోతు గుర్రములను అదుపు చేసెను. ఆమె స్థిరమగు బుద్ధితో సర్వేశ్వరుడగు పురుషోత్తముని ధ్యానించుచుండెను.
ఆమె ఏకాగ్రమగు బుద్దితో సర్వమునకు ఆత్మరూపుడగు వాసు దేవ భగవానునియందు మనస్సును నిలిపి పయోవ్రతము ననుష్ఠించెను.
ఓ వత్సా! జగత్కారణమగు పూర్ణ పరబ్రహ్మ నాలుగు చేతులు గల శ్రీహరియై ఆమెకు ప్రత్యక్షమయ్యెను. పీతాంబరుడగు ఆ శ్రీహరి శంఖమును, చక్రమును, గదను ధరించి యుండెను.
తన కళ్లముందు ప్రత్యక్షమైన ఆ శ్రీహరిని చూచి అదితి వెంటనే ఆదరపూర్వకముగా లేచి నిలబడి, ప్రేమతో పరవశించి సాష్టాంగ నమస్కా రమును చేసెను.
ఆమె పైకి లేచి దోసిలి యొగ్గి నిలబడెను. ఆమె కన్నులలో ఆనం దబాష్పములు నిండెను. దేహమంతయు గగుర్పాటుతో కలవరమయ్యెను. శ్రీహరి దర్శనము వలన కలిగిన సమధికమగు ఉత్సాహముచే ఆమె దేహము వణకుచుండెను. ఈ స్థితిలో ఆమె స్తుతించాలనుకున్నా స్తుతించే సామర్థ్యము లేక మిన్నకుండెను.
ఓ కురువంశ శ్రేష్టా! ఆ అదితి దేవి ప్రేమతో బొంగురుపోయిన వాక్కుతో మెల్లగా లక్ష్మీపతియగు శ్రీహరిని స్తుతించెను. ఆమె తలను పైకెత్తి జగన్నాథుడగు ఆ యజ్ఞేశ్వరుని కన్నులతో త్రాగుచున్నదా యన్నట్లు చూచుచుండెను.
అదితిరువాచ ।
అదితి ఇట్లు పలికెను --- యజ్ఞము రూపములో ప్రకటమైన ఓ పురుషోత్తమా! యజ్ఞమునకు ఫలమునిచ్చువాడవు నీవే. నీకు స్వరూపము నుండి చ్యుతి లేదు. నీ పాదములు భక్తులను పావనము చేయును. పావ నము చేసే గంగ నీ పాదములనుండి పుట్టినది. నీ కీర్తి గానము చేయువారిని పావనము చేయును, నీ నామమును వినుటచే మంగళము కలుగును. నీవు ఆపదలోనున్న భక్తుల దుఃఖమును చల్లార్చుటకై అవతరించెదవు. సర్వజగత్కారణుడవగు ఓ ఈశ్వరా! మాకు సుఖమును కలుగజేయుము. ఓ భగవానుడా! నీవు దీనులకు రక్షకుడవు. సాక్షాత్తు శ్రీహరియే యజ్ఞము రూపముగా ప్రకటమగుచున్నాడని, యజ్ఞో వై విష్ణుః, మొదలగు శ్రుతులు వక్కాణించుచున్నవి.
ఓ శ్రీహరీ! నీవు నీ ఇచ్చచే గొప్ప మాయాశక్తియొక్క రజస్సత్త్వ తమోగుణములను ఉపాధిగా స్వీకరించి క్రమముగా జగత్తుయొక్క సృష్టిస్థి తిలయములకు కారణమై, నీవే జగద్రూపముగా వెలసినావు. దేశకాలము లకు అతీతమైన నీవు శాశ్వతకాలము వర్ధిల్లే పూర్ణజ్ఞానస్వరూపమునందు నిలిచి తమస్సునకు అతీతుడవై యున్నావు. నీకు నమస్కారము.
పరమేశ్వరుడు జగత్తును సృష్టించి, రక్షించి, ఉపసంహరించుట మాత్రమే గాక, జగత్తు రూపముగా కూడ పరమేశ్వరుడే గలడు అనేది ఉప నిషత్తుల మౌలికమగు సిద్ధాంతము.
ఓ అనంతా! ప్రసన్నుడవైన నీ నుండి మానవులకు బ్రహ్మగారి ఆయుర్దాయము, అభీష్టమైన దేహము (బలము, రూపము), సాటిలేని సంపద, స్వర్గము, పృథివి, రసాతలము, ధర్మార్థకామములు, అపరోక్షమగు ఆత్మజ్ఞానము కూడ లభించును. శత్రువులపై విజయము మొదలైన కామ నలు లభించునని వేరుగా చెప్పవలయునా?
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- భరత వంశీయుడవగు ఓ మహారాజా! పద్మములవంటి కన్నులు గల శ్రీహరియే సకలప్రాణులలో దేహాదులకు సాక్షియగు ఆత్మరూపుడై యున్నాడు. అదితి ఈ తీరున స్తుతించగా, ఆ భగవానుడు ఇట్లు పలికెను.
శ్రీభగవానువాచ ।
శ్రీభగవానుడిట్లు పలికెను --- ఓ అదితీ! నీవు దేవమాతవు. దేవ తల సంపదను శత్రువులు అపహరించి వారిని తమ స్థానమునుండి వెళ్లగొ ట్టినారు. అట్టి దేవతలకు, నీకు చిరకాలమునుండి ఉన్న ఆకాంక్ష నాకు తెలియును.
మిక్కిలి గర్వించియున్న ఆ రాక్షసశ్రేష్ఠులను యుద్దములో ఓడించి తిరిగి జయలక్ష్మిని పొందిన పుత్రులతో గూడి నీవు భగవానుని ఉపాసించ గోరుచున్నావు.
నీ పెద్ద కొడుకగు ఇంద్రుడు మరియు ఇతరపుత్రులు యుద్దములో శత్రువులను సంహరించగా నీవు తిరిగి నీ స్థానమును పొంది, యుద్దములో తమ భర్తలు మరణించగా దుఃఖముతో ఏడ్చుచున్న శత్రువుల భార్యలను నీవు చూడగోరుచున్నావు.
నీ పుత్రులు కీర్తిని, సంపదను తిరిగి పొంది గొప్ప సమృద్ధి గల వారై స్వర్గాధికారమును చేజిక్కుంచుకొని విహరించుచుండగా, నీవు చూడ గోరుచున్నావు.
ఓ దేవీ! ఆ రాక్షస సేనానాయకులను ఇప్పటికిప్పుడు హఠాత్తుగా జయించుట సంభవము కాదని నా అభిప్రాయము. ఎందుకంటే, అనుకూ లుడైన కాలరూపుడగు ఈశ్వరుడు మరియు వారికి అనుకూలురై సమర్డు లైన వేదవేత్తలు వారిని రక్షించుచున్నారు. కావున, వారియందు పరాక్రమ మును చూపినచో, దాని వలన సుఖము కలుగబోదు.
ఓ దేవీ! అయినప్పటికీ, దీని విషయములో నేను ఏదేని ఉపాయ మును ఆలోచించవలెను. ఎందుకంటే, నీ వ్రతానుష్టానముచే నేను మిక్కిలి ప్రసన్నుడనైతిని. నన్ను పూజించినచో, అది శ్రద్దకు తగ్గట్లుగా ఫలముని చ్చును. కావున, నా పూజ వ్యర్థము కారాదు.
నీవు నీ సంతానముయొక్క రక్షణ కొరకై యథోచితముగా పయో వ్రతము చేసి నన్ను ఆరాధించి, చక్కగా స్తుతించితివి. నేను మరీచపుత్రు డగు కశ్యపుని తపస్సారమగు తేజస్సునందు నా అంశచే అధిష్టించి నీకు పుత్రుడనై జన్మించి, నీ పుత్రులను రక్షించగలను.
ఓ కల్యాణీ! నీవు నన్ను ఇదే రూపముతో నీ భర్తయందు నిలిచి యున్నవానినిగా భావన చేస్తూ, నీ భర్తయగు కశ్యప ప్రజాపతిని సేవించు ము. ఆయన తపస్సుచే పరిశుద్ధుడైనాడు.
ఓ దేవీ! ఎవరు ఏ విధముగా ప్రశ్నించినా నీవీ విషయమును ఇత రులకు చెప్పరాదు. ఇది దేవరహస్యము. దీనిని చక్కగా దాచి పెట్టినప్పుడు మాత్రమే సర్వము సంపన్నమగును.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- భగవానుడు ఇంత మాత్రమే పలికి అప్పుడే అక్కడే అంతర్ధానమాయెను. శ్రీహరి ప్రభుని పుత్రునిగా పొందుట దుర్లభము. అదితి అట్టి వరమును పొంది తాను కృతార్థురాలనైతి నని భావించేను. ఆమె అత్యధికమగు భక్తితో భర్తను సేవించెను.
కశ్యప ప్రజాపతి మొక్కవోని దర్శనము గలవాడు. ఆయన సమాధి అనే ఉపాయముచే శ్రీహరి తనలో అంశయై ప్రవేశించినట్లుగా కనుగొనెను.
ఓ మహారాజా! ఆ కశ్యపుడు ఏకాగ్రమగు మనస్సు గలవాడై తప స్సుచే చిరకాలమునుండి సంపాదించబడిన తేజస్సును అదితియందు, వాయువు కట్టెయందు అగ్నిని వలె, ఆధానము చేసెను.
కాలాతీతుడగు శ్రీహరి భగవానుడు అదితియొక్క గర్భమునధి. షించియున్నాడని తెలుసుకొని, తేజోమయుడగు బ్రహ్మగారు రహస్యనా మములతో ఆయనను చక్కగా స్తుతించెను.
బ్రహ్మోవాచ ।
బ్రహ్మగారు ఇట్లు పలికెను --- ఓ శ్రీహరీ! నిన్ను సకలలోక ములు కీర్తించును. నీ పరాక్రమము అనన్యము. వేదవేత్తలయందు నీకు ప్రీతి మెండు. సత్త్వరజస్తమోగుణములను ఉపాధిగా స్వీకరించే నీకు అనేక నమస్కారములు
ఓ దేవా! పృశ్నియొక్క పుత్రుడవై జన్మించిన నీవు వేదములను నీయందే కలిగియున్నావు. వేదములు నిన్నే తమయందు (ప్రతిపాద్యము కలిగియున్నవి. ముల్లోకములు నాభియందు గల నీవు ముల్లోకములకు అతీతుడవు. ప్రాణులలో అంతర్యామివై నీవు సర్వమును (సత్తాస్ఫూర్తుల తో) వ్యాపించి యున్నావు. నీకు నమస్కారము.
ఓ ఈశ్వరా! జగత్తునకు ఆదిమధ్యాంతములు నీవే. అనంతశక్తి గల నిన్ను పురుషుడు (పూర్ణుడు, ప్రాణుల దేహములయందు ఆత్మరూప ముగా నుండువాడు) అని మహాత్ములు చెప్పెదరు, లోతైన నదీప్రవా హము తనలో పడిన గడ్డి మొదలగువాటిని వలె, కాలరూపుడవగు నీవు జగత్తును (సంహారము వైపునకు) లాగుకొని పోవుచున్నావు..
ఓ దేవా! కదిలే మరియు కదలని ప్రాణులను మరియు ప్రజాపతు లను కూడ సృష్టించేది నీవే. స్వర్గవాసులు స్వర్గమునుండి జారిపోయినా రు. నీళ్లలో మునిగిపోవుచున్నవానికి నావ వలె, దేవతలకు నీవే సర్వోత్తమ మైన ఆశ్రయమగుచున్నావు.
శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో వామనావతారవృత్తాంతములో అదితికి శ్రీహరి దర్శనమిచ్చుటను వర్ణించే పదునేడవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 17 of the Bhāgavata Mahā Purana is as follows:
Pleased by Aditi's selfless devotion, Bhagavān Vishṇu promised to descend from her womb as her son to restore her children's kingdom. He instructed Aditi to keep His upcoming descent confidential and to worship Sage Kaśyapa with devotion. In due time, Bhagavān entered the womb of Aditi, causing her body to radiate intense divine light that astonished Lord Brahmā and all celestial beings, who offered exalted prayers glorifying the unborn Lord.