భాగవత మహా పురాణము
23 - వామనావతారము – బలి సుతలమునధిష్ఠించుట
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఆదిపురుషుడగు శ్రీహరి ఈ విధముగా పలుకగా, సత్పురుషులందరిలో శ్రేష్ఠుడగు ఆ బలియొక్క కంఠము భక్తిచే గద్దదమై మాట బొంగురువోయెను. ఆతని కన్నులు కన్నీ టీచే ఆకులమయ్యెను. మహానుభావుడగు ఆ బలి చేతులను జోడించి ఇట్లు పలికెను.
బలిరువాచ ।
బలి ఇట్లు పలికెను --- ఆశ్చర్యము! నీకు నమస్కరించుటకు చేసిన ప్రయత్నము శరణు వేడిన భక్తులకు సమ్మతమైన పురుషార్థము (మోక్షము) ను సంపాదించుటకు సావధానమై (సమర్థమై యున్నది. ఏల యనగా, లోకపాలకులగు దేవతలు కూడ ఇదివరలో పొందని అనుగ్ర హమును నీవు అధముడగు రాక్షసుని (నా) పై చూపితివి.
శ్రీశుక ఉవాచ ।
అపుడు బలి నాగపాశబంధమునుండి విముక్తుడాయెను, ఆయన రాక్షసులతో గూడి శ్రీహరికి, బ్రహ్మగారికి, రుద్రునకు నమస్కరించి, సంతో షముతో అక్కడనుండి సుతలమును ప్రవేశించెను.
ఈ విధముగా వామన భగవానుడు ఇంద్రునకు స్వర్గమును సమ ర్పించి, అదితియొక్క కోరికను పూర్తి చేసి, ఉపేంద్రుడై సకలజగత్తును పాలించెను.
శ్రీహరి అనుగ్రహమును పొంది బలి నాగపాశములనుండి విము క్తుడాయెను. వంశమును నిలబెట్టే తన మనుమడైన బలిని చూచి భక్తితో వినమ్రుడైన ప్రహ్లాదుడు ఇట్లు పలికెను.
ప్రహ్లాద ఉవాచ ।
సకలజగత్తుచే నమస్కరించబడే బ్రహ్మాదులచే కూడ నమస్కరిం చబడే పాదములు గల నీవు రాక్షసులమగు మాకు ద్వారపాలకుడవు అగు చున్నావు. ఇట్టి అనుగ్రహమును బ్రహ్మగారు గాని, లక్ష్మీదేవి గాని, రుద్రుడు గాని పొంది యుండలేదు. ఇతరులగు ఇంద్రాదులు పొందలేదని వేరుగా చెప్పవలయునా?
ఓ శరణాగతవత్సలా! బ్రహ్మగారు మొదలైనవారు నీ పద్మముల వంటి పాదముల మకరందమును సేవించి మహిమలను పొందుచున్నారు. మేము పుట్టుక చేతనే దుష్టులము, చెడు ప్రవర్తన గలవారము. అట్టి మేము అట్టి నీయొక్క దయాదృష్టికి గోచరులమైనాము. ఇది ఎట్లు సంభవమైనది?
నీవు ఊహకు అందని నీ యోగమాయయొక్క లీలచే భువనము లను రచించిన నిపుణుడవు. సర్వముయొక్క యథార్థతత్త్వము నీవే. కావు న, నీవు సర్వమును సమముగా దర్శించేదవు. అయిననూ, నీ చేష్ట (దుష్ట శిక్షణము, శిష్టరక్షణము ఇత్యాది) విచిత్రమైనది. భక్తులయందు, అభక్తుల యందు నీ స్వభావము భిన్నముగా నుండుట కూడ ఆశ్చర్యమే! అయితే, నీవు కల్పవృక్షమువంటి వాడవు. తనను సమీపించినవారిని మాత్రమే అను గ్రహించే కల్పవృక్షము వలే నీవు నీ యెడల భక్తిని చేయువారిని అనుగ్ర హించెదవు.
శ్రీభగవానువాచ ।
శ్రీభగవానుడిట్లు పలికెను --- ఓ వత్సా! ప్రహ్లాదా! నీకు మంగళ మగు గాక! సుతలమునందలి నివాసమునకు బయలు దేరుము, నీవచట నీ మనుమనితో కలిసి ఆనందిస్తూ, బంధువులకు సుఖమును కలిగించుము.
అచట గదను చేతితో పట్టుకొని సావధానముగా నిలిచియున్న నన్ను నీవు ప్రతిదినము చూడగలవు. నన్ను చూచుటచే మహానందము (ఆ త్మానందము) ను పొందే నీకు కర్మలకు కారణమగు అజ్ఞానము నశించిపో వును.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ మహారాజా! సకల రాక్షస సే నలకు ప్రభువగు ప్రహ్లాదుడు స్వచ్చమగు ఆత్మజ్ఞానము గలవాడు. ఆయన సరే అని శ్రీహరి భగవానుని ఆదేశమును బలితో సహా తలవంచి స్వీకరించి, జగత్కారణుడగు ఆ పురుషోత్తమునకు ప్రదక్షిణము చేసి నమస్కరించేను. అపుడు ఆయనయొక్క అనుమతిని పొంది ప్రహ్లాదుడు బలితో గూడి సుతలమును ప్రవేశించెను.
ఓ మహారాజా! శుక్రాచార్యుడు ఆ బ్రహ్మవేత్తల సభలో ఋత్వి క్కుల మధ్యలో వామనునకు సమీపమునందే కూర్చుని యుండెను. అపుడు పాపములను పోగొట్టే ఆ నారాయణుడు ఆయనతో ఇట్లు పలికెను.
ఓ మహర్షీ! నీ శిష్యుడు యజ్ఞమును విస్తారముగా చేయుచుండ గా, దానియందు కర్మలోపము కలిగినది. దానిని నీవు పూర్తి చేయుము. కర్మలయందు కలిగే వైషమ్యము (లోపము) బ్రహ్మవేత్తల చూపుచేతనే సమము (పూర్ణము) అగును.
శుక్ర ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- యజ్ఞపురుషుడవగు నీవే కర్మ లను ప్రవర్తిల్ల జేసే యజ్ఞేశ్వరుడవు. బలి నిన్ను సర్వస్వమును అర్పించి పూజించినాడు. అట్టి బలియొక్క కర్మలో తేడా (లోపము) కు అవకాశమే క్కడిది?
యజ్ఞములో మంత్రము, అనుష్ఠాన క్రమము, దేశము, కాలము, దానమునకు పాత్ర మరియు ద్రవ్యములను బట్టి వచ్చిన లోపములన్నియు, నీ నామమును చక్కగా కీర్తించినచో, తొలగిపోయి కర్మ పూర్ణమగును.
ఓ పరమేశ్వరా! అయిననూ, నేను నీవు చెప్పిన ఆజ్ఞను పాలించే దను. మానవులకు నీ ఆజ్ఞను పాలించుటయే సర్వోత్తమమైన శ్రేయస్సు (మోక్షము).
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- పూజనీయుడగు శుక్రాచా ర్యుడు ఈ విధముగా శ్రీహరియొక్క ఆదేశమును అంగీకరించి, ఋత్వి క్కులతో మరియు మహర్షులతో గూడి బలియొక్క యజ్ఞములోని లోప మును సరిదిద్ది యజ్ఞమును పూర్ణము చేసెను.
ఓ మహారాజా! శ్రీహరి వామనుడై ఈ విధముగా బలినుండి భూమిని (తద్ద్వారా మూడు లోకములను) యాచించి తన సోదరుడగు మహేంద్రునకు, పూర్వము శత్రువులచే లాగుకొనబడిన స్వర్గమును అప్ప జెప్పెను.
ప్రజాపతులకు తండ్రియగు బ్రహ్మగారు కశ్యపునకు అదితికి ప్రీతిని కలిగించి సకలప్రాణులకు కల్యాణమును చేయుటకై వామనుని లోక ములకు, లోకపాలకులకు ప్రభువును చేసెను. దేవర్షులు, పితృదేవతలు, మనువులు, దక్షుడు భృగువు అంగిరసుడు మొదలగువారు, సనత్కుమారు డు, రుద్రుడు కూడ ఆ బ్రహ్మగారికి ఈ కార్యములో తోడుగా నుండిరి.
బ్రహ్మగారు సకలప్రాణుల అభివృద్ధి కొరకై సమర్థుడగు వామనుని ఉపేంద్రుని చేసి -- వేదములు, సకలదేవతలు, ధర్మము, కీర్తి, సంపద, మంగళకార్యములు, వ్రతములు, స్వర్గము, మోక్షము -- అనువాటికి ప్రభు వునుగా వ్యవస్థ చేసెను. ఓ మహారాజా! అప్పుడు సకలప్రాణులు మిక్కిలి ఆనందించినవి.
తరువాత ఇంద్రుడు లోకపాలకులతో గూడి బ్రహ్మగారి అనుమ తితో వామనుని దేవవిమానములో ముందు కూర్చుండబెట్టి దేవయానమా ర్గముచే స్వర్గమునకు తీసుకువెళ్లాను.
ఉపేంద్రుని భుజములచే రక్షించబడిన ఇంద్రుడు ముల్లోకముల అధికారమును పొందెను. భయము తొలగిపోవుటచే ఆయన సర్వోత్కృష్ట మైన సంపదతో గూడి ఆనందించెను.
ఓ మహారాజా! బ్రహ్మగారు, రుద్రుడు, సనత్కుమారుడు, భృగువు మొదలగు మహర్షులు, పితృదేవతలు, సకలప్రాణులు, సిద్ధులు, విమానములయందున్న గంధర్వులు మొదలగువారు విష్ణువుయొక్క ఆ చాల గొప్ప లీలను చూచి గొప్ప ఆశ్చర్యమును పొందిరి. వారా లీలను గానము చేస్తూ, తమ తమ స్థానములకు వెళ్లిరి. వారు అదితిని కూడ కొని యాడిరి.
ఓ మహారాజా! నీవు నీ వంశీయులను ఆనందింప జేసితివి. నేను నీకు ఈ వృత్తాంతమునంతనూ చేప్పితిని. గొప్ప పరాక్రమము గల శ్రీహరి యొక్క వృత్తాంతమును విన్నవారి పాపములు దూరమగును.
అధికముగా పరాక్రమించే (బ్రహ్మాండమును కొలిచే పెద్ద అడుగులు వేసిన) శ్రీహరియొక్క మహిమను హద్దువరకు (నిశ్శేషముగా) కీర్తిం చిన మానవుడు భూమియందలి ధూళి రేణువులను లెక్కించినవాడే యగును (అనగా, అది సంభవము కాదు). పూర్ణుడగు భగవానుని మహిమయొక్క హద్దును చూచిన మానవుడు పుట్టలేదు, ఇప్పుడు జీవించి లేడు, భవిష్యత్తులో పుట్టబోడు అని మంత్రద్రష్టయగు వసిష్ఠ మహర్షి ప్రవ చించెను.
అనియు,
అనియు మంత్రములు గలవు.
దేవదేవుడగు శ్రీహరి చేసే లీలలు ఆశ్చర్యమును గొల్పును. ఆయనయొక్క ఈ వామనావతార వృత్తాంతమును వినువాడు పరమ గతి (మోక్షము) ని పొందును.
దేవకార్యమగు యజ్ఞాదులయందు గాని, పితృదేవతల శ్రాద్ధము నందు గాని, మానవులకు చెందిన వివాహము మొదలగు కర్మలయందు గాని ఈ వృత్తాంతమును కీర్తించినచో, ఆ కర్మ సుసంపన్నమగునని మహా త్ములు చెప్పెదరు.
శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో వామనావతారవృత్తాంతములో బలి సుతలమునధిష్ఠించుటను వర్ణించే ఇరువది మూడవ అధ్యాయము ముగిసినది (23).
Summary of chapter 23 of the Bhāgavata Mahā Purana is as follows:
King Bali accepted Bhagavān's decree with deep gratitude and departed for Sutala alongside Prahlāda Mahārāja. Śukrācārya completed the remaining rituals of the sacrifice to rectify all flaws. Bhagavān Vāmanadeva restored the heavenly kingdom to King Indra and the devatās, completing His divine mission. Lord Brahmā and all celestial beings praised Vāmanadeva, celebrating the triumph of Vaidika Dharma and the protection of the universe.