భాగవత మహా పురాణము
20 – వామనావతారము - వామనుడు త్రివిక్రముడై రెండు అడుగులలో జగత్తును ఆక్రమించుట
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! గృహయజమానియగు బలికి కులాచార్యుడగు శుక్రుడు ఈ విధముగా ఉపదేశించేను. అపుడా చక్రవర్తి క్షణకాలము మిన్నకుండి, తరువాత సావధానముగా వినయముతో గురువగు శుక్రాచార్యునుద్దేశించి ఇట్లు పలికెను.
బలిరువాచ ।
బలి ఇట్లు పలికెను --- పూజనీయులగు మీరు చెప్పినది సత్యమే. ఇదియే గృహస్థులకు ధర్మము. ఇట్టి ధర్మము వలననే సంపద, భోగములు, కీర్తి, బ్రదుకు దెరువు ఏ కాలమునందైనమా వినష్టము కావు.
కాని, నేను ప్రహ్లాదుని మనుమడమ, అట్టి నేను బ్రాహ్మణునకు ఇచ్చెదనని ప్రతిజ్ఞ చేసి, ధనమునందలి లోభముచే మోనగాడు వలె ఎట్లు నిరాకరించగల్గుదును?
అసత్యము కంటే పెద్ద అధర్మము లేదు; అసత్యమునందు నిష్ఠ గల వ్యక్తిని మినహాయించి, నేను సర్వమును మోయగల్గుదును -- అని ఈ భూదేవి చెప్పెనట.
నేను వేదవేత్తను మోసగించుట వలన ఎంతగా భయపడెదనో, నరకము వలన గాని, దారిద్యము వలన గాని, దుఃఖ సముద్రము వలన గాని, రాజ్యాధికారము జారిపోవుట వలన గాని, మరణము వలనైననూ అంతగా భయపడను.
ఈ లోకములో ధనము మొదలైన సర్వము మరణించిన వ్యక్తిని విడిచి పెట్టును. అట్టి ధనాదికముతో వేదవేత్త సంతోషించని పక్షములో, వాటిని త్యాగముచేసి ఫలమేమి గలదు?(కావున, అడిగినదానికంటే తక్కువ ఇచ్చుట వ్యర్థము అని అభిప్రాయము).
దధీచి, శిబి మొదలైన సత్పురుషులు విడిచి పెట్ట శక్యము కాని ప్రాణములనైననూ అర్పించి ప్రాణులకు హితమును చేగూర్చెదరు. అట్టి చో, భూమి మొదలగువాటి విషయములో ఇవ్వాలా? వద్దా? అనే వికల్ప ములకు తావేదీ?
ఓ మహర్షీ! యుద్దములో వెన్ను చూపని రాక్షసశ్రేష్ఠులు ఈ భూమిలోని భోగములను అనుభవించినారు. వారి ఆ భోగములను కాలము మ్రింగివేసినది. కాని, వారీ లోకములో పొందిన కీర్తిని కాలము మ్రింగలేదు.
ఓ బ్రహ్మర్షీ! యుద్ధములో వెన్ను చూపకుండా ప్రాణములను విడిచి పెట్టువారు అనేకులు గలరు. కాని, దానము చేసే సమయము వచ్చినప్పుడు శ్రద్దతో ధనమును విడిచిపెట్టువారు ఆ విధముగా అనేకులు లేరు (ఎవరో కొద్దిమంది మాత్రమే గలరు).
స్వాభిమానము, కరుణ గల వ్యక్తికి యాచకుల కోరికలను తీర్చి దుర్గతిని పొందుట కూడ శోభగానే యుండును. అట్టిచో, మీవంటి బ్రహ్మవేత్తల కోరికను తీర్చి దరిద్రుడగుట శోభయేనని వేరుగా చెప్పవలయునా? కావున, నేను ఈ బ్రహ్మచారి కోరికను తీర్చెదను.
ఓ మహర్షీ! వేదోక్తములగు కర్మలలో పండితులైన మీరు సాదర ముగా విష్ణువును యజ్ఞము (యూపము లేనిది) లచే మరియు క్రతువు (యూపము గలది) లచే ఆరాధించెదరు. ఈతడు అట్టి ఆ వరములనిచ్చే విష్ణువే యగుగాక! లేదా, మరియొకడు కావచ్చును. నేను ఈతడు కోరిన భూమిని ఇచ్చెదను.
ఈతడు నిరపరాధినగు నన్ను అధర్మముగా విశ్వరూపమును చూపి బంధించవచ్చు గాక! బ్రాహ్మణవేషములోనుండి భయపడుచున్న ఈతడు వాస్తవములో శత్రువే అయిననూ, నేను వీనిని హింసించను.
ఈతడు నిశ్చయముగా ఉత్తమమగు కీర్తిగల విష్ణువే అయినచో, తన కీర్తి వినష్టమగుట ఆతనికి అభీష్టము కాబోదు. ఈయన నన్ను యుద్ధములో సంహరించి భూమిని తీసుకోనుగాక! లేదా, ఈతడు విష్ణువు కానిచో, నాతో యుద్ధమును చేసినచో, నాచే సంహరించబడి నేల గూలును.
శ్రీశుక ఉవాచ ।
ఈ విధముగా స్వాభిమానము గల బలి సత్యమునకు కట్టుబడి గురువుయొక్క వాక్యమునందు శ్రద్ద లేనివాడై ఆయన ఆదేశమును పాటించలేదు. దైవముచే ప్రేరితుడైన శుక్రాచార్యుడు తన శిష్యుడగు బలిని శపించెను.
నేనే పండితుడనని నీవు గట్టిగా తలపోయుచుందువు. కాని, నీవు అజ్ఞానివి. నీకు వినయము లేదు. కావుననే, నా ఆజ్ఞను ఉల్లంఘించితివి. అట్టి నీవు మమ్ములను నిర్లక్ష్యము చేయుట వలన, శీఘ్రముగా సంపదను పోగొట్టుకొనెదవు.
ఈ విధముగా తన గురువు శపించిననూ మహాత్ముడగు బలి సత్యమునుండి వైదొలగలేదు. ఆయన వామనుని పూజించి, ఆయన చేతిలో నీటిని వదిలి పెట్టి ఈ భూమిని దానము చేసెను.
మల్లెమొగ్గల మాలను ధరించియున్న బలిపత్నియగు వింధ్యావలి అప్పుడు వచ్చి, కాళ్లు కడిగే నీళ్లతో నిండియున్న బంగరు కలశమును తీసుకువచ్చెను.
యజ్ఞమును చేయుచున్న బలి స్వయముగా ఆనందముతో ఆ వామనునియొక్క శోభాయుక్తమైన పాదముల జంటను కడిగెను. జగత్తును పావనము చేసే ఆ జలములను ఆయన తలపై దాల్చెను.
అప్పుడు స్వర్గమునందు దేవతల గణములు, గంధర్వులు, విద్యాధరులు, సిద్దులు, చారణులు అందరు కూడ రాక్షసరాజగు బలియొక్క ఆ కర్మను, ఆతని సత్యసంధతను కొనియాడిరి. వారు ఆనందముతో నిండిన వారై ఆతనిని పూలవానలతో ముంచెత్తిరి.
అపుడు దుందుభులు వేలాదిగా పలుమార్లు మ్రోగినవి. గంధర్వులు, కింపురుషులు, కిన్నరులు ఈ విధముగా పాడిరి -- స్వాభిమానము గల ఈ బలి మిక్కిలి చేయ శక్యము కాని పనిని చేసినాడు. అది ఏమంటే, కోరినవాడు శత్రువు అని తెలిసి కూడా ఆయన ముల్లోకములను దానము చేసినాడు.
అవినాశియగు శ్రీహరియందు సత్త్వరజస్తమోగుణముల కార్యమగు జగత్తు అంతర్భాగమై యున్నది. ఆ శ్రీహరియొక్క ఆ పొట్టి రూపము అద్బుతముగా పెరిగెను. భూమి, ఆకాశము, దిక్కులు, స్వర్గము, పాతాళము మొదలగు లోకములు, సముద్రములు, పశుపక్ష్యాదులు, మానవులు, దేవతలు, మహర్షులు ఆ రూపములో అంతర్గతమైరి.
ఋత్విక్కులు, శుక్రాచార్యుడు, సభాసదులతో గూడియున్న బలి చక్రవర్తి అనంతశక్తిమంతుడగు శ్రీహరియొక్క ఆ దేహమును చూచెను. మూడు గుణముల కార్యమగు జగత్తునకు ఆశ్రయమగు ఆ శరీరమునందు ఆయన త్రిగుణాత్మకమగు ఈ జగత్తును చూచెను. పృథివీ మొదలగు పంచమహాభూతములు, వాక్కు మొదలగు ఇంద్రియములు, శబ్దము మొదలగు విషయములు, అంతఃకరణము, జీవులతో కూడియున్న ఈ విశ్వము ఆయనకు ఆ శరీరమునందు దర్శనమిచ్చెను.
శ్రీహరియే ఈ జగత్తునంతనూ వ్యాపించి యుండెను. ఇంద్రపదవిని ఆక్రమించి ఇంద్రుని సేనవంటి సేన గల బలి చక్రవర్తి ఆ విశ్వమూర్తి యొక్క అరికాలియందు రసాతలమును, రెండు కాళ్లయందు భూమిని, రెండు పిక్కలయందు పర్వతములను, రెండు మోకాళ్లయందు పక్షులను, రెండు తొడలయందు మరుద్గణములను చూచెను.
సర్వవ్యాపి, చాల పెద్ద అడుగులు గలవాడు అగు ఆ శ్రీహరి యొక్క వస్త్రమునందు సంధ్య, గుహ్యమునందు తాను ప్రముఖముగా గల రాక్షసులు, కటి ప్రదేశమునందు మరీచి మొదలగు ప్రజాపతులు, నాభియందు ఆకాశము, ఉదరముయొక్క వివిధభాగములయందు ఏడు సముద్రములు, వక్షఃస్థలమునందు నక్షత్రముల పంక్తి కూడ బలికి కానవచ్చెను.
ఓ రాజా! ముర అనే రాక్షసుని సంహరించిన శ్రీహరియొక్క హృదయమునందు ధర్మము, రెండు స్తనములయందు సత్యవచనము మరియు సమదర్శనము (అంతటా ఈశ్వరుని దర్శించుట), మనస్సు నందు చంద్రుడు, వక్షఃస్థలమునందు చేతియందు పద్మమును పట్టుకొని యున్న లక్ష్మీదేవి, కంఠమునందు సామలు మరియు సకలశబ్దములు కాన వచ్చెను.
ఆ విశ్వరూపుని భుజములయందు ఇంద్రుడు ప్రముఖముగా గల దేవతలు, రెండు చెవులయందు దిక్కులు, తలపై స్వర్గలోకము, జుట్టు నందు మేఘములు, ముక్కునందు వాయువు, రెండు కన్నులలో సూర్యుడు, నోటిలో అగ్ని కానవచ్చెను.
బలి పురుషోత్తముని వాక్కునందు వేదములను, నాలుకయందు జలాధిపతియగు వరుణుని, కనుబొమలయందు విధినిషేధముల శాస్త్రములను, కనురెప్పలయందు రాత్రింబగళ్లను, నుదురునందు కోపమును, క్రింది పెదవియందు లోభమును చూచెను. .
ఓ మహారాజా! బలి ఆ విశ్వరూపునియొక్క త్వగింద్రియము నందు మన్మథుని, రేతస్సునందు నీటిని, వీపునందు అధర్మమును, అడుగులను వేయుటయందు యజ్ఞమును, కదలాడే నీడయందు మృత్యువును, నవ్వునందు మాయాశక్తిని, రోమములయందు పలురకముల చెట్టుచేమలను చూచెను.
ఓ మహారాజా! వీరుడగు బలి విశ్వరూపుడగు శ్రీహరియొక్క నాడులయందు నదులను, గోళ్లయందు రాళ్లను, బుద్ధియందు స్వయంభువుడగు బ్రహ్మగారిని, ఇంద్రియములయందు దేవతల గణములను మరియు మహర్షులను, దేహమునందు చరాచరములగు సకలప్రాణులను కూడ చూచెను. సర్వము తానే అయి ఉన్న ఆ శ్రీహరియందు ఈ జగత్తును చూచీ రాక్షసులందరు భయమును పొందిరి.
సహించ శక్యము కాని తేజస్సు గల సుదర్శన చక్రము, పిడుగు వంటి ధ్వనిని చేసే శార్ఙధనుస్సు, మేఘగర్జనవంటి ధ్వనిని చేసే పాంచజమనే శంఖము, వేగము గల కౌమోదకి అనే విష్ణువుయొక్క గద, వంద బుడీపెల డాలుతో కూడియున్న విద్యాధరము (నందకము) అనే కత్తి, తరిగిపోని బాణములు గల ఉత్తమమైన అంబుల పొదులు, లోకపాలకులు, సునందుడు నందుడు మొదలగు ప్రముఖులైన విష్ణుపార్షదులు కూడ తమ తమ స్థానములలో ఆ సర్వేశ్వరుని సేవకొరకు సిద్ధముగా నుండిరి.ఓ మహారాజా! శ్రీహరి ధరించిన కిరీటము, భుజపురులు, చేప ఆకారములో ఉండే కుండలములు, శ్రీవత్సమనే పుట్టుమచ్చ, ఉత్తమమైన కౌస్తుభమాణిక్యము, మొలనూలు మరియు వస్త్రము మెరిసిపోవుచుండెను. ఆయన ధరించిన వనమాల చుట్టూ తుమ్మెదల వరుస ప్రకాశించేను. పెద్ద అడుగులు గలవాడు, గొప్ప పరాక్రమశాలి అగు శ్రీహరి ఒక కాలితో బలి చక్రవర్తి అధీనములోనున్న భూలోకమును, శరీరముతో ఆకాశమును, బాహువులతో దిక్కులను కూడ ఆక్రమించెను.
శ్రీహరి రెండవ అడుగును వేయగా, స్వర్గము ఆయనకు స్వాధీన మయ్యెను. మూడవ అడుగు వేయుటకు బలికి చెందినది లేశమైననూ మిగలలేదు. శ్రీహరి వేసిన ఆ పెద్ద అడుగు మహర్లోక-జనలోక-తపోలోక ములను దాటి సత్యలోకమును చేరుకొనెను.
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో వామనావతారవృత్తాంతములో వామనుడు త్రివిక్రముడై రెండు అడుగులలో జగత్తును ఆక్రమించుటను వర్ణించే ఇరవదియవ అధ్యాయము ముగిసినది (20).
Summary of chapter 20 of the Bhāgavata Mahā Purana is as follows:
Recognizing the child as Bhagavān Vishṇu Himself, the guru Śukrācārya urgently warned King Bali not to grant the request, explaining that this child would take away his entire empire in three steps. Śukrācārya instructed Bali to break his promise, but King Bali refused, declaring that he would never break a word given to a brāhmaṇa or to Bhagavān Himself, even if it meant total downfall. Angered by Bali's disobedience, Śukrācārya cursed him to lose all his wealth and power. Undeterred, Bali poured water to seal his promise.