భాగవత మహా పురాణము
5 - సముద్ర మథనము - విరాట్ పురుషుని స్తుతి
శ్రీశుక ఉవాచ ।
ఓ మహారాజా! గజేంద్రుని విముక్తి అనే ఈ శ్రీహరియొక్క పవిత్ర మగు లీల పాపములను పోగొట్టును. దీనిని నేను నీకు చెప్పితిని. ఇప్పుడు రైవత మన్వంతరమును గురించి వినుము.
తామసుని సోదరుడు రైవతుడని ప్రసిద్ధిగాంచినవాడు అయిదవ మనువు. ఆయనకు అర్జునుడు, బలి, వింధ్యుడు, మహావీర్యుడు మొదలగు పుత్రులు గలరు. వారిలో అర్జునుడు పెద్దవాడు.
ఓ మహారాజా! ఆ మన్వంతరములో విభువు ఇంద్రుడు. భూతర యులు, సుమేధసులు మొదలగువారు దేవగణములు. హిరణ్యరోముడు, వేదశిరసుడు, ఊర్ధ్వబాహువు, వేదశ్రీ మొదలగువారు సప్తర్షులు.
ఆ సప్తర్షులలోనివాడగు శుభ్రునకు భార్య వికుంఠ. స్వయముగా శ్రీహరీ భగవానుడు తన అంశచే వైకుంఠుడు అనే పేరుతో, వైకుంఠులనే దేవశ్రేష్ఠులతో బాటుగా వారిద్దరికి సంతానమై జన్మించెను.
లక్ష్మీదేవి ప్రార్థించగా ఆమెకు ప్రీతిని కలిగించుటకై వైకుంఠుడు వైకుంఠమనే లోకమును రచించెను. సకలప్రాణులు ఆ లోకమునకు నమ స్కరించెదరు.
ఆ వైకుంఠునియొక్క ప్రభావమును గురించి, సర్వశ్రేష్టమైన ఆవి ర్భావము గల దయాళుత్వము మొదలగు గుణములను గురించి ఇదివ రలో చెప్పితిని. ఎవడైతే భూమియందలి రేణువులను లెక్కించగల్గునో, అట్టివాడు మాత్రమే విష్ణువుయొక్క గుణములను వర్ణించగల్గును.
చక్షువుయొక్క పుత్రుడు, చాక్షుషుడు అని ప్రసిద్ధిని గాంచినవాడు ఆరవ మనువు. పూరువు, పూరుషుడు, సుద్యుమ్నుడు మొదలగువారు చాక్షుష మనువుయొక్క పుత్రులు.
ఓ మహారాజా! ఆ మన్వంతరమునందు ఇంద్ర పదవిలో నుండు వాడు మంత్రద్రుముడు. ఆప్యులు, పరావతులు మొదలగు గణములు దేవ తలు. హవిష్మంతుడు, వీరకుడు, భృగువు మొదలగువారు సప్తర్షులు.
ఆ మన్వంతరమునందు కూడ స్వయంప్రకాశ స్వరూపుడు, జగ న్నాథుడు అగు శ్రీహరి భగవానుడు అంశచే వైరాజునకు సంభూతియందు పుత్రుడై జన్మించి, అజితుడు అనే పేరుతో ప్రసిద్ధి గాంచెను.
అజితుడు సముద్రమును మథించి దేవతలకు అమృతమును సంపాదించి పెట్టెను. నీటియందు తిరుగుతున్న మందర పర్వతము (కవ్వము) ను ఆయన తాబేలు రూపములో నిలబెట్టెను.
రాజోవాచ ।
పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- ఓ మహర్షీ! భగవానుడు పాల సముద్రమును ఎవరి కొరకై ఏ విధముగా మథించెను? ఆయన తాబేలు రూపముగా పర్వతమును మోయుటకు కారణమేమి?
దేవతలు అమృతమును పొందిన విధమెట్టిది? ఆ తరువాత. ఇంకా ఏమి జరిగెను? భగవానుని ఈ అత్యద్భుతమగు లీలను గూర్చి చెప్పడు.
సత్త్వగుణప్రధానులగు భక్తులకు ప్రభువగు శ్రీహరియొక్క మహి మను తమరు చక్కగా వర్ణించి చెప్పుచుండగా, చాల కాలమునుండి తాప ముతో వేగిపోవుచున్న నా చిత్తము అధికమగు తృప్తిని చెందుట లేదు (అనగా, చాలుననిపించుట లేదు).
సూత ఉవాచ ।
సూత మహర్షి ఇట్లు పలికెను --- ఓ మహర్షులారా! శుక మహర్షి ద్వీపనివాసియగు వ్యాసుని పుత్రుడు. ఆయనను పరీక్షిత్తు ఈ విధముగా చక్కగా ప్రశ్నించగా, ఆయన ఆ రాజును అభినందించి, శ్రీహరియొక్క మహిమను గురించి చెప్పుటకు ఉపక్రమించెను.
శ్రీశుక ఉవాచ ।
ఒకప్పుడు యుద్ధములో వాడి ఆయుధములు గల రాక్షసులు దేవ తలను పీడించిరి. ఆ దేవతలు చాల సంఖ్యలో యుద్ధభూమిలో నేలగూలి ప్రాణములను గోల్పోయి మరల లేవకుండిరి.
ఓ మహారాజా! ఒకప్పుడు దుర్వాసుని శాపముచే ఇంద్రునితో సహా ముల్లోకములు సంపదలను కోల్పోయినవి. అప్పుడు యజ్ఞయాగాది కర్మలు కూడ నష్టమైనవి.
ఈ పరిస్థితిని చూసి మహేంద్రుడు, వరుణుడు మొదలగు దేవతా గణములు తమలో తాము సలహా సంప్రదింపులను చేస్తూ ఆలోచించిరి. అయిననూ, వారికి ఆ పరిస్థితినుండి బయట పడే ఉపాయము తోచలేదు.
తరువాత వారందరు మేరు పర్వత శిఖరము పైనున్న బ్రహ్మగారి సభకు వెళ్లి, ఆ పరమేష్ఠికి ప్రణమిల్లి జరిగిన వృత్తాంతమునంతనూ విన్న వించిరి.
బలహీనులై కాంతిని కోల్పోయి ఉన్న ఇంద్రుడు, వాయువు మొద లగు దేవతలను సర్వసమర్థుడగు ఆ పరమేష్ఠి చూచెను. అమంగళము లగు విషయములతో నిండియున్న లోకములను, సిరిసంపదలతో వెలిగిపోతున్న రాక్షసులను కూడ ఆయన చూచెను. ఆపుడాయన ఏకాగ్రమగు చిత్తముతో పురుషోత్తముని చక్కగా స్మరించగా, ముడుచుకుపోయిన ఆయన ముఖము ఆనందముతో వికసించెను. అపుడా బ్రహ్మదేవుడు దేవతలనుద్దే శించి ఇట్లు పలికెను.
నేను, రుద్రుడు, మీరు, రాక్షసులు, మానవులు, పశుపక్ష్యాదులు, చెట్టుచేమలు, చెమటనుండి పుట్టే పేలు మొదలగునవి ఇత్యాది సకల ప్రాణులు పరబ్రహ్మయొక్క అవతారమైన విరాట్-పురుషుని స్వల్పమైన అంశచే సృష్టించబడినారు. అవినాశియగు అట్టి పరబ్రహ్మను మనము శరణు వేడెదము.
పరమేశ్వరునకు వధించదగినవాడు గాని, రక్షించదగినవాడు గాని, ఉపేక్షించదగిన పక్షము గాని, ఆదరించదగిన పక్షము గాని లేవు. అయిన ప్పటికీ, ఆయన ఆయా కాలములయందు సృష్టిస్థితిలయముల కొరకై క్రమముగా రజస్సత్త్వతమోగుణములను ఉపాధిగా స్వీకరించుచున్నాడు.
ప్రాణుల కల్యాణము కొరకై సత్త్వగుణోపాధిని స్వీకరించిన ఆ ఈశ్వరునకు ఇది లోకమర్యాదలను రక్షించే కాలము. కావున, జగత్తునకు తండ్రియగు ఆ పరమేశ్వరుని మేము శరణు వేడుచున్నాము. ఆయనకు దేవతలయందు ప్రీతి మెండు. దేవతలకు ఆయన ప్రియుడు. తన భక్తుల మగు మనకు ఆయన సుఖమును కలిగించగలడు.
శ్రీశుక ఉవాచ ।
లోపల బయట శత్రువులను నియంత్రించిన ఓ మహారాజా! బ్రహ్మగారు దేవతలతో ఇట్లు పలికి వారితో గూడి సాక్షాత్తుగా అపరాజితుడగు శ్రీహరియొక్క ధామమునకు వెళ్లాను. ఆ ధామము అజ్ఞానమునకు అతీతమైనది.
ఓ మహారాజా! వారు శ్రీహరి గురించి ఇదివరలో వినియున్ననూ, అచటనైతే వారికి శ్రీహరియొక్క స్వరూపము కానరాలేదు. అపుడు బ్రహ్మ గారు ఇంద్రియములను వశము చేసుకొని వేదవాక్కులతో శ్రీహరిని స్తుతిం చెను.
బ్రహ్మోవాచ ।
అఖండ సచ్చిత్స్వరూపుడగు ఈశ్వరునియందు వికారములే మియు లేవు. జగత్కారణుడగు ఆయన కాలమునకు అతీతుడు. ఆయన సకలప్రాణుల హృదయగుహయందు ఆత్మరూపముగా ప్రకటమగుచున్నాడు. ఆయన నిరవయవుడు. ఆయన స్వరూపము సుతరాము ఊహకు అందేది కాదు, వాక్కుతో విర్వచించేది కాదు. మనస్సు ఎంత వేగము గలది అయినా, ఆయన స్వరూపమును అందుకోలేదు. సర్వోత్కృష్ణుడు, దేవనాయకుడు అగు ఆ శ్రీహరికి మేము నమస్కరించుచున్నాము.
పరమేశ్వరుడు ప్రాణుల హృదయములో ప్రాణము-మనస్సు-బు ద్ధి-దేహములకు సర్వావస్థలలో లుప్తము కాని ద్రష్టయై ఉన్నాడు. జగత్తులో శబ్దస్పర్శరూపరసగంధములుగను, ప్రాణులయందు చెవి-చర్మము-కన్ను -జిహ్వ-ముక్కు అనే ఇంద్రియములగను కూడ ఆయనయే భాసించుచున్నాడు. భోగవాసనలు గల జీవునియందుండే అజ్ఞానము-జ్ఞానము అనే రెండు పక్షములు ఆయనయందు ఉండవు. వినాశము లేని ఆయనయందు వెలితి, దుఃఖము లేవు. సర్వవ్యాపకుడగు ఆయన మూడు యుగములలో ఆవిర్భవించును. ఆయనను మేము శరణు వేడుచున్నాము.
అనాదియగు ఈ జీవుని సంసారచక్రమును అనాదియగు మాయా శక్తి వేగముగా త్రిప్పుచున్నది. మనస్సే ప్రధానముగా గల ఈ చక్రమునకు పది హేను ఆకులు (కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, పంచ ప్రాణ ములు), మూడు తూములు (సత్త్వరజస్తమోగుణములు), ఎనిమిది కడక మ్మీలు (పంచభూతములు, మనస్సు, బుద్ధి, అహంకారము) గలవు. మెరుపు వలె చంచలమైన ఈ చక్రమునకు ఇరుసు ఆ ఈశ్వరుడేనని మహా త్ములు చెప్పెదరు. ఆ ఈశ్వరుని మేము శరణు వేడుచున్నాము.
ఏకరసమగు జ్ఞానమే స్వరూపముగా గల పరబ్రహ్మ ప్రకృతికి అతీ. తము. అది ఇంద్రియములకు గాని, మనస్సునకు కాని గోచరము కాదు. దేశకాలపరిచ్చేదములు లేని ఆ పరబ్రహ్మ అందమైన పక్షివంటి జీవుని ప్రక్కనే (హృదయములో) స్థిరముగా (అంతర్యామియై) ఉన్నాడు. ఆయ నను పొందే సాధనము భక్తియోగము. వివేకులు దానితో ఆయనను ఉపాసించెదరు.
ఈశ్వరుని మాయను ఎవడైననూ తరించలేడు (ఆయన అనుగ్రహ, ముతోనే మాయను తరించుట సంభవము). దానిచే వ్యామోహమును పొందియున్న జీవుడు తన స్వరూపమును తెలియలేకున్నాడు. మాయాశక్తి ని, దాని సత్త్వరజస్తమోగుణములను వశము చేసుకొనియున్న ఆ పరమేశ్వ రుని మేము నమస్కరించుచున్నాము. ఆయన సకలప్రాణులలో సమాన ముగా ప్రాణరూపుడై సంచరించుచున్నాడు.
ఈ దేవతలమగు మేము, మహర్షులు కూడ నీకు ప్రియమగు శరీర మైన సత్త్వగుణము మాత్రమే ప్రధానముగా ఉండుపిట్లు సృష్టించబడిన ము. అయిననూ, బయట ఉనికి రూపముగాను, లోపల తెలివి రూపము గాను ప్రకటమైయున్న ఈశ్వరుని సూక్ష్మతత్త్వమును తెలియలేకున్నాము. రజస్తమోగుణములు ప్రధానముగా గల అసురులు మొదలగువారు తెలియ జాలరని వేరుగా చెప్పవలయునా?
నాలుగు విధముల ప్రాణుల (తల్లి గర్భమునుండి పుట్టేవి, గ్రుడ్డు నుండి పుట్టేవి, కాలుష్యమునుండి పుట్టే పేలు మొదలగునవి, నేలను చీల్చి పుట్టే చెట్టుచేమలు) సృష్టితో విలసిల్లే ఈ భూమి ఈశ్వరునిచేతనే సృష్టించ బడి (విరాడ్రూపుడగు) ఈశ్వరునకు పాదములై యున్నది. స్వతంత్రుడైన ఆ పురుషోత్తముని ఈశ్వరభావము సర్వోత్తమమైనది. దేశకాల పరిచ్చేద ములు లేని ఆ ఈశ్వరుడు ప్రసన్నుడగు గాక!
గొప్ప శక్తి గల నీరు కారణముగానే ముల్లోకములలోని ప్రాణులు మాత్రమే గాక, సకలలోకపాలకులు కూడ పుట్టి జీవిస్తూ వర్దిల్లుచున్నారు. పరమైశ్వర్యసంపన్నుడైన విరాడ్రూపుడగు పరబ్రహ్మయొక్క రేతస్సే నీరు. ఆ పరబ్రహ్మ మాపై ప్రసన్నమగు గాక!
స్వర్గనివాసులగు దేవతలకు బలము, ఆహారము, ఆయుర్దాయము చంద్రుడే. చంద్రుడే చెట్టుచేమలకు ప్రభువై ప్రాణుల ఉత్పత్తిని ఘటిల్ల జేయుచున్నాడు. అట్టి చంద్రుడు సర్వైశ్వర్య సంపన్నుడగు విరాట్ పురు షునకు మనప్పవి మహర్షులు చెప్పుచున్నారు. ఆ ఈశ్వరుడు మాపై ప్రసన్నుడగు గాక!
వేదోక్తమైన కర్మలు నిమిత్తముగా ఆవిర్భవించిన అగ్నిదేవుడు సర్వజ్ఞుడు. ఆయన సముద్రము మధ్యలో బడబాగ్ని రూపములోనుండి నీటిని పరిణమింప జేయుచుండును. ఆయనయే ప్రాణుల ఉదరములో పలనుండి అన్నము మొదలగు ఆహారపదార్థములను పక్వము చేయును. ఆయనయే ఆ విరాట్ పురుషుని నోరు. సర్వోత్కృష్టమగు ఈశ్వరభావము గల ఆ విరాట్ పురుషుడు నాపై ప్రసన్నుడగు గాక!
వేదస్వరూపుడైన సూర్యుడు ఉత్తరాయణ పుణ్యమార్గమునకు అధిష్టాన దేవత. ఆయన బింబమునందు పరబ్రహ్మను ఉపాసించువారలకు ఆయన ముక్తిస్వరూపుడై అనుగ్రహించును. కాలరూపుడై ఆయనయే సకల ప్రాణులను అంతము చేయును. అట్టి ఈ సూర్యుడు విరాట్ పురుషునకు కన్ను. మహావిభూతియగు ఆ విరాట్ పురుషుడు మాపై ప్రసన్నుడగును గాక!
కదిలే మరియు కదలని ప్రాణులలోని ప్రాణము, మనోబలము, దేహబలము, ఇంద్రియముల పాటవము కూడ వాయుదేవుని వలననే సంపన్నమగుచున్నవి. మనము కూడ, చక్రవర్తిని అనుచరులు వలె, ఆ వాయుదేవుని అనుసరించియే నిలిచియున్నాము. అట్టి వాయువు ఆ విరాట్ పురుషుని ప్రాణశక్తినుండి ఆవిర్భవించెను. పరబ్రహ్మయొక్క సర్వోత్కృ ష్టమగు విభూతియైన ఆ విరాట్ పురుషుడు మాపై ప్రసన్నుడగు గాక!
విరాట్ పురుషుని చెవినుండి దిక్కులు, హృదయమునుండి ఇంద్రి యములు, నాభినుండి ఆకాశము ప్రకటమయ్యేను. కర్మ-జ్ఞానేంద్రియము లు, అంతఃకరణము, పంచప్రాణములు, దేహములకు ఆశ్రయము ఆకా శమే. పరమైశ్వర్యశాలి ఆ విరాట్ పురుషుడు మాపై ప్రసన్నుడగు గాక!
ఆయన బలమునుండి ఇంద్రుడు, ప్రసన్నతనుండి దేవతలు, కోప మునుండి రుద్రుడు, బుద్ధినుండి బ్రహ్మగారు, ఇంద్రియములనుండి వేద ములు మరియు మహర్షులు, జననేంద్రియమునుండి ప్రజాపతి ప్రకటమైనా రు. గొప్ప విభూతులకు నిధానమగు ఆ విరాట్ పురుషుడు మాపై ప్రసన్ను డగును గాక!
విరాట్ పురుషునియొక్క వక్షఃస్థలమునుండి మహాలక్ష్మి, నీడ నుండి పితృదేవతలు, స్తనమునుండి ధర్మము, వెనుక భాగమునుండి అధర్మము, శిరస్సునుండి ద్యులోకము, విహారమునుండి అప్సరసలు ప్రకటమైరి. మహావిభూతియగు ఆ విరాట్ పురుషుడు మాపై ప్రసన్నమగు గాక!
ఆ విరాట్ పురుషుని ముఖమునుండి వేదవేత్తయగు బ్రాహ్మణుడు మరియు రహస్యమయమగు వేదము, రెండు చేతులనుండి క్షత్తియుడు మరియు బలము, రెండు తొడలనుండి వైశ్యుడు మరియు నైపుణ్యము, పాదములనుండి వేదవిరుద్ధమగు ప్రవృత్తి మరియు శూద్రుడు ఆవిర్భవించిరి. అట్టి మహావిభూతియగు విరాట్ పురుషుడు మాపై ప్రసన్నుడగు గాక!
ఆ విరాట్ పురుషుని క్రింది పెదవినుండి లోభము, పై పెదవి నుండి ప్రీతి, ముక్కునుండి కాంతి, స్పర్శనుండి పశువులకు మరియు పశు వులవంటి అజ్ఞానులకు హితమైన కామము, కనుబొమలనుండి యముడు, కనురెప్పలనుండి కాలము ప్రకటమైనవి. మహావిభూతియగు ఆ విరాట్ పురుషుడు మాపై ప్రసన్నుడగు గాక!
పంచభూతములు, కాలము, జీవుల కర్మఫలము, సత్త్వరజస్తమో గుణములు, వివిధపదార్థముల మధ్యనుండే తేడాను నిర్ధారించే విశేష ములు అనునవి ఇదమిత్తముగా నిర్వచించ శక్యము కానివి. వీటికి ఉపాదా నము ఆ విరాట్ పురుషుని మాయాశక్తియే. వివేకులు ఈ సర్వమును నామ రూపములుగా గుర్తించి వాటి అధిష్ఠానమగు పరమాత్మయే సత్యమనే జ్ఞాన ముతో ఈ నానాత్వమును జ్ఞానముచే నిషేధించెదరు. అట్టి మహావిభూతి యగు ఆ విరాట్ పురుషుడు మాపై ప్రసన్నుడగు గాక!
పరమేశ్వరునియందు సత్త్వరజస్తమోగుణముల రూపములో నుండే ప్రకృతి శక్తులు విలీనమై యుండును. మాయాశక్తిచే రచితములైన గుణకార్యములయందు ఈశ్వరునకు ఆసక్తి (నేను-నాది అనే అభిమానము) లేదు. వాయువు అంతటా సంచరించినా, దేనితోనైననూ సంగము వాయువునకు ఉండదు. అదే విధముగా, ఈశ్వరుడు జగత్తుతో సంగము లేకుండగనే లీలలను వెలయించును. ఆయన పూర్ణ-ఆనందఘనమగు తన స్వరూపమునందు నిష్ఠ కలిగి యుండును. ఆ ఈశ్వరుని కొరకు నమస్కార మగు గాక!
చిరునవ్వుతో గూడిన నీ పద్మమువంటి ముఖమును మేము చూడ గోరుచున్నాము. కావున, అట్టి నీవు నీ రూపము మా ఇంద్రియములకు గోచరమయ్యే విధముగా దర్శనమిమ్ము.
ఓ ప్రభూ! పూజనీయుడవగు నీవు భక్తుల కోరికపై యథేచ్చగా ఆయా కాలములయందు (ధర్మమునకు గ్లాని కలిగినప్పుడు) ఆయా (కృ ప్లాది) రూపములను దాల్చి, మాకు శక్యము కాని (రాక్షస సంహారము మొదలైన) కర్మలను నీవే స్వయముగా చేయుచుందువు.
ఇంద్రియభోగములయందు తగుల్కొని పీడను పొందే ప్రాణులు చేసే కర్మలలో క్లేశము అధికము, ఫలము అల్పము. ఒకప్పుడు అవి పూర్తిగా నిష్పలములు కూడ అగును. కాని, నీకు అర్పించే కర్మలు అట్టివి కావు. అనగా, అట్టి నిత్యకర్మలలో క్లేశము తక్కువ. అవి అంతఃకరణశుద్ధి ద్వారా మోక్ష హేతువులు కూడ అగును.
అల్పమైన కర్మాభాస (సాంగోపాంగముగా పూర్ణము కానిది) యై ననూ ఈశ్వరునకు అర్పించినచో, అది నిష్పలము కాబోదు. ఎందుకంటే, ఆ ఈశ్వరుడు వ్యక్తికి ప్రియమైన ఆత్మ మరియు హితకారి.
చెట్లు వ్రేళ్లకు నీళ్లను పోసినచో, దాని మ్రానునకు కొమ్మలకు కూడ పోసినట్లే యగును. అదే విధముగా, విష్ణువునారాధించినచో సర్వులను మాత్రమే గాక, స్వరూపము (ఆత్మ) ను కూడ ఆరాధించినట్లే యగును.
ఓ దేవా! నీ లీలలు ఊహకు అందవు. గుణకార్యమగు జగత్తునకు ప్రభుడవగు నీయందు స్వతహాగా గుణములు లేవు. అయిననూ, ఇప్పుడు ఈ స్థితికాలమునందు నీవు సత్త్వగుణము ఉపాధిగా కలిగియున్నావు. నీకు నమస్కారము.
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో సముద్ర మథనవృత్తాంతమునందు విరాట్ పురుషుని స్తుతిని వర్ణించే అయిదవ అధ్యాయము ముగిసినది (5) .
Summary of chapter 5 of the Bhāgavata Mahā Purana is as follows:
Śrī Śukadeva Gosvāmī details the fifth (Raivata) and sixth (Cākshusha) Manvantaras, highlighting the Avatāras Vaikunṭha and Ajita. During the Cākshusha era, after being weakened by the curse of Sage Durvāsā and defeated in battle by the empowered asuras under King Bali, the devatās fled Svargaloka. Led by Lord Brahmā and Mahādeva Śiva, the devatās assembled on the northern shore of the Ocean of Milk and offered heartfelt prayers to Bhagavān Ajita, who manifested before them in blinding radiance and advised them to form a temporary truce with the asuras to churn the Ocean of Milk for the nectar of immortality (*Amṛta*).