భాగవత మహా పురాణము
1 - మన్వంతరముల వర్ణనము
రాజోవాచ ।
పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- ఓ గురుదేవా! ఈ సందర్భ ములో స్వాయంభువ మనువుయొక్క వంశమును గురించి, ప్రజాపతులు చేసిన సృష్టిని గురించి మీరు చెప్పగా నేను వినియుంటిని. ఇతర మనువు లను గురించి నాకు చెప్పుము.
ఓ మహాత్మా! ఏయే మన్వంతరములలో పురుషోత్తముడగు శ్రీహ రియొక్క అవతారములను, లీలలను మహాత్ములు వర్ణించినారో, వాటిని మాకు చెప్పడు. మేము శ్రద్ధగా వినెదము.
ఓ మహాత్మా! జగత్తును పాలించే శ్రీహరి భగవానుడు గడచిన మన్వంతరములో చేసిన లీలలను, రాబోయే మన్వంతరములో చేయబోవు లీలలను, ఈ మన్వంతరములో చేయుచున్నవాటిని మాకు చెప్పుము.
ఋషిరువాచ ।
శుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ కల్పములో స్వాయంభువుడు మొదలగు ఆర్గురు మనువులు గడచినారు. మొదటి మన్వంతరములో దేవతలు మొదలగువారి ఉత్పత్తిని గురించి నీకు చెప్పియుంటిని.
అదే స్వాయంభువమనువునకు ఆకూతి, దేవహూతి అనే కుమా ర్తెలు ఉండిరి. వారియందు భగవానుడు పుత్రుడై జన్మించి, ధర్మమును జ్ఞానమును ఉపదేశించెను..
కురువంశ శ్రేష్ఠుడవగు ఓ పరీక్షిన్మహారాజా! కపిల భగవానుడు చేసిన ఉపదేశమును నేనిదివరలో వర్ణించి చెప్పితిని. యజ్ఞ భగవానుడు చేసిన ఉపదేశమును గురించి చెప్పెదను.
స్వాయంభువ మనువు ఇంద్రియభోగములయందు విరక్తిని చెంది, రాజ్యమును విడిచి, తన భార్యయగు శతరూపతో గూడి అడవికి వెళ్లెను.
భరతవంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! ఆయన సునందా నదీ తీరమునందు ఒంటి కాలిపై నిలబడి వంద సంవత్సరములు కరమగు తపస్సును అనుష్ఠిస్తూ, ప్రతిదినము ఈ స్తోత్రమును జపించెను.
మనురువాచ ।
స్వాయంభువ మనువు ఇట్లు పలికెను --- శుద్ధచైతన్యస్వరూపు డగు భగవానుని స్పర్శచే జగత్తు చేతనమగుచున్నది (సత్తా-స్పూర్తులను పొందుచున్నది). కాని, ఈ జగత్తు ఈశ్వరునకు చైతన్యమునిచ్చుట లేదు. ప్రళయములో ఈ జగత్తు (నిద్రలో ఈ దేహము) విలీనమైననూ, ఈ భగవా నుడు తెలివిగా యుండును. ఈ జగత్తు (దేహము) ఆయనను తెలియలే దు. కాని, ఆయన క్షేత్రజ్ఞరూపుడై ఈ దేహమును తెలియుచునే యుండును.
పృథివియందలి చరాచరమగు ఈ సర్వము ఏది గలదో, అది ఆత్మచే కప్పివేయబడవలెను (సర్వము ఆత్మయేనని తెలియవలెను). అందుచేతనే, కామనలను త్యాగము చేసి సాధకుడు తన స్వరూపమును పాలించుకొనవలెను. పరధనమును గురించి తృష్ణను చేయకుము. ఈ ధన మెవ్వరిది? (ఎవ్వరిదైననూ కాదు).
చూసేది ఆత్మస్వరూపుడగు ఈశ్వరుడే. కాని, ఆయనను ఈ కన్ను చూడలేదు, మనస్సు తెలియలేదు. నిద్రలో మనస్సు, ఇంద్రియ ములు. విలీనమైననూ, ఆత్మయొక్క చూపు లోపించేది కాదు (ఆ స్థితికి కూడ సాక్షిగనే యుండును). సకలప్రాణులలో ఆ ఈశ్వరుడు ఆత్మ చైతన్యరూపుడై యున్నాడు. జీవుని సఖుడగు ఆ పరమాత్మను సేవించుడు (విచారముచే తెలుసుకొనుడు).
పరబ్రహ్మకు ఆదిమధ్యాంతములు లేవు; తన-పరాయి గాని, లోపల-బయట గాని లేవు. జగత్తునకు ఆదిమధ్యాంతములు పరబ్రహ్మ వలననే కలుగుచున్నవి. జగత్తు పరబ్రహ్మరూపమే. ఆ పరబ్రహ్మయే సత్యము (జగత్తు మిథ్య).
ఈ జగత్తు ఈశ్వరుని రూపమే. ఈ జగత్తులోని నామములన్నీ ఈశ్వరుని నామములే. అఖండసద్రూపుడు, స్వయంప్రకాశస్వరూపుడు, పుట్టుక లేనివాడు, జగత్తునకు కారణమైనవాడు అగు ఆ ఈశ్వరుడే ఈ జగ త్తుయొక్క సృష్టిస్థితిలయములను చేయుచున్నాడు. ఆయన తన విద్యాశక్తిచే మాయకు అతీతుడై నిషియుడై స్వస్వరూపమునందున్నాడు.
కావుననే, మహర్షులు అకర్తృ-ఆత్మస్వరూపముయొక్క జ్ఞాన మును పొంది జీవన్ముక్తులగుట కొరకై ముందుగా కర్మలను ఆచరించెదరు. ఎందుకంటే, కర్మలను చేయుచున్న వ్యక్తియే వాటిని భగవదర్పణము చేసి తరచుగా నైష్కర్మ్యసిద్ధిని బడయును.
సర్వేశ్వరుడగు భగవానుడు స్వరూపానుసంధానముచే పూర్ణమైన కామనలు గలవాడు. కావుననే, ఆయన సృష్టి మొదలగు కర్మలను చేసిన నూ, వాటిచే బంధించబడడు. ఎవరైతే ఆయనను అనుకరించి నిష్కామ ముగా కర్తృత్వాహంకారము లేకుండా కర్మలను చేసెదరో, వారు కర్మబంధ మునుండి విముక్తులగుదురు.
ఆ ప్రభుడు ప్రకృతిపురుషవివేకము కలవాడగుటచే సృష్టి మొద లైన కర్మలను చేయుచున్ననూ అహంకారము లేనివాడు. ఆయన పూర్ణ ఆత్మస్వరూపుడగుటచే కామనలు లేనివాడు. ఆయన రెండవది లేనివాడ గుటచే ఇతరముచే గాని, ఇతరులచే గాని ప్రేరితుడు కాని స్వతంత్రుడు. ఆయన తన స్వరూపమునందు నిలిచి సకలధర్మములను పాలించును. ఆయనను నేను శరణు వేడుచున్నాను.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా మంత్రరూపము లోనున్న ఆత్మతత్త్వమును పఠిస్తూ ఏకాగ్రచిత్తుడైయున్న ఆ మనువును చూచి, అసురులు (భోగపరాయణులు), రాక్షసులు (క్రూరకర్ములు) ఆక లితో ఆయనను తినివేయుటకై మీదకు ఉరికిరి.
ఆ విధముగా మనువును తినుటకు నిశ్చయించుకున్న ఆ రాక్షసు లను యజ్ఞుడు అనే రూపములోనున్న సర్వవ్యాపకుడగు శ్రీహరి చూచెను. ఆయన తన పుత్రులగు యాములు అనే దేవతలతో చుట్టుపొరబడి యున్న వాడై, ఆ రాక్షసులను సంహరించి తానే ఇంద్రుడై స్వర్గమును పాలించెను.
అగ్నిపుత్రుడగు స్వారోచిషుడు రెండవ మనువు - ఆయేను. ద్యుమంతుడు, సుషేణుడు, రోచిష్మంతుడు మొదలగువారు ఆయన పుత్రులు.
ఆ మన్వంతరములో రోచనుడు ఇంద్రుడు. తుషితులు, పారావ తులు మొదలగువారు దేవతలు. ఊర్జస్తంభుడు, ఊర్జుడు మొదలగు బ్రహ్మవేత్తలు సప్తర్షులుగా నుండిరి.
వేదశిరసుడు అనే మహర్షికి తుషిత అని ప్రసిద్ధి గాంచిన భార్య ఉండెను. ఆయనకు ఆమెయందు భగవానుడు అవతరించి విభుడు అనే పేరుతో ప్రసిద్ధి గాంచెను.
ఆ విభుడు బాల్యమునుండియు నైష్ఠిక బ్రహ్మచారిగనే ఉండెను. ఎనభై ఎనిమిది వేలమంది మహర్షులు ఆయననుండి ఆ బ్రహ్మచర్యవ్రత మును నేర్చుకొని పాటించిరి.
ఓ మహారాజా! ఉత్తముడని ప్రసిద్ధి గాంచిన ప్రియవ్రతుని పుత్రుడు మూడవ మనువు. పవనుడు, సృంజయుడు, యజ్ఞహోత్రుడు, ఊర్జుడు మొదలగువారలు ఆయన పుత్రులు.
వసిష్ఠుని పుత్రులగు ప్రమదుడు, ద్యుమంతుడు మొదలగువారలు ఆ మన్వంతరములోని సప్తర్షులు. సత్యులు, వేదశ్రుతులు, భద్రులు అను. వారలు దేవతలు కాగా, సత్యజిత్తు ఇంద్రుడాయెను.
పురుషోత్తమ భగవానుడు ధర్మునకు సూనృతయందు జన్మించి సత్య సేనుడని ప్రసిద్ధి గాంచేను. ఆయనకు తోడుగా సత్యవ్రతులనే దేవగణము ఉండెను.
సత్యజిత్తు అనే ఇంద్రునకు మిత్రుడై ఆ సత్య సేనుడు దుష్టులగు యక్షులను, రాక్షసులను సంహరించెను. వారు అసత్యమునందు నిష్ట గల దుష్టస్వభావులు. అంతేగాక, ఆయన ప్రాణులకు ద్రోహమును చేసే భూత ముల గణములను కూడ సంహరించెను.
ఉత్తముని సోదరుడు తామసుడు అనే ఆయన నాల్గవ మనువు. ఆయనకు పృథువు, ఖ్యాతి, నరుడు, కేతువు, శాంతుడు మొదలగు పది మంది పుత్రులు గలరు.
తామస మన్వంతరములో సత్యకులు, హరులు, వీరులు అనువా రలు దేవతలు కాగా, త్రిశిఖుడు వారికి ప్రభువగు ఇంద్రుడు. జ్యోతిర్గాము డు, కావ్యుడు మొదలగువారు సప్తర్షులు.
ఓ మహారాజా! ఆ తామస మన్వంతరములో వైధృతులని ప్రసిద్ధి గాంచిన దేవతలు కూడ గలరు. వారు విధృతి సంతానము. వారు కాలప్ర భావముచే లుప్తమైన వేదములను కాపాడినారు.
ఆ మన్వంతరమునందే భగవానుడు హరిమేధసుడు-హరిణి అనే దంపతులకు పుత్రుడై జన్మించి, హరి అని పిలువబడినాడు. ఆయన గజేం ద్రుని మొసలి బారినుండి విడిపించెను.
రాజోవాచ ।
పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- బాదరాయణ వ్యాసుని పుత్రు డవగు ఓ శుక మహర్షి! హరి మొసలికి చిక్కిన గజేంద్రుని ఏ విధముగా విడిపించెనో, మేము నీనుండి విన గోరుచున్నాము.
శ్రీహరి భగవానుని కీర్తి ఉత్తమమైనది. దానిని గానము చేసే గాథ సకలగాథలలో గొప్పది. పావనమైన శ్రీహరి గాథ సంపదలనిచ్చును. మంగళకరమగు అట్టి గాథ కల్యాణములకు నిధానము.
సూత ఉవాచ ।
ఓ మహర్షులారా! ప్రాయోపవేశమును చేసియున్న పరీక్షిత్తు ఈ . విధముగా గాథలను చెప్పడని బాదరాయణ వ్యాసుని పుత్రుడగు శుక మహర్షిని ప్రేరేపించేను. అపుడాయన ఆ రాజును అభినందించి, సభలోని మహర్షులు ఆనందముతో వినుచుండగా ఆ గాథను చెప్పెను.
శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో మన్వంతరములను వర్ణించే మొదటి అధ్యాయము ముగిసినది (1) .
Summary of chapter 1 of the Bhāgavata Mahā Purana is as follows:
This chapter documents the systematic administration of the cosmos across cyclical time, outlining the fourteen Manvantara epochs that constitute a single day of Lord Brahmā. Śrī Śukadeva Gosvāmī details the first four Manvantaras—Svāyambhuva, Svārocisha, Uttama, and Tāmasa—naming the specific Manus, their royal sons, the presiding Indras, the Saptarshis, and the divine Avatāras of Bhagavān Vishṇu who descended in each era (such as Yajña, Vibhu, Satyasena, and Hari) to preserve Vaidika order and maintain universal peace.