శ్రీ మద్భాగవతము - నవమ (9వ) స్కందము

Table of Contents

24 - విదర్భుని వంశము

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- విదర్బుడు ఆ భోజ్యయందు కుశుడు, క్రథుడు, రోమపాదుడు అనే ముగ్గురు పుత్రులను కనెను. వీరిలో మూడవవాడగు రోమపాదుడు విదర్బవంశీయులకు ఆనందమును కలిగిం చువాడు.

ఓ పరీక్షిన్మహారాజా! రోమపాదుని పుత్రుడు బభ్రువు. బభ్రువు యొక్క పుత్రుడు కృతి. కృతియొక్క పుత్రుడు ఉశికుడు. ఉశికుని పుత్రుడు చేది. శిశుపాలుడు, దమ ఘోషుడు మొదలగువారు ఆ చేది వంశమునకు చెందినవారే.

 (విదర్భుని పుత్రుడగు) క్రథుని పుత్రుడు కుంతి, కుంతియొక్క పుత్రుడు ధృష్టి. ధృష్టియొక్క పుత్రుడు నిర్వృతి. నిర్వృతియొక్క పుత్రుడు దశార్హుడు. దశార్హుని పుత్రుడు వ్యోముడు. వ్యోముని పుత్రుడు జీమూతుడు. జీమూతుని పుత్రుడు వికృతి. వికృతియొక్క పుత్రుడు భీమరథుడు.

ఆ భీమరథుని పుత్రుడు నవరథుడు. నవరథుని పుత్రుడు దశరథుడు, దశరథుని పుత్రుడు శకుని. శకునియొక్క పుత్రుడు కరంభి. కరంభి యొక్క పుత్రుడు దేవరాతుడు. దేవరాతుని పుత్రుడు దేవక్షత్రుడు. దేవక్షత్రుని పుత్రుడు మధువు. మధువుయొక్క పుత్రుడు కురువశుడు. కురువశుని పుత్రుడు అనువు.

ఓ ఆర్యా! అనువుయొక్క పుత్రుడు పురుహోత్రుడు. పురుహోత్రుని పుత్రుడు ఆయువు. ఆయువుయొక్క పుత్రుడు సాత్వతుడు. సాత్వతునకు భజమానుడు, భజి, దివ్యుడు, వృష్టి, దేవానృధుడు, అంధకుడు, మహాభోజుడు అనే ఏడ్గురు పుత్రులు గలరు.

ఓ మహారాజా! భజమానునకు మొదటి భార్యయందు నిమ్లాచి, కింకిణుడు, ధృష్టి అనే ముగ్గురు పుత్రులు, మరియు రెండవ భార్యయందు శతాజిత్తు, సహస్రాజిత్తు, అయుతాజిత్తు అనే ముగ్గురు పుత్రులు కలిగిరి. (సాత్వతుని ఇంకో పుత్రుడగు) దేవావృధుని పుత్రుడు బభ్రువు. వీరిద్దరి గురించి పెద్దలు ఈ (క్రింది) రెండు శ్లోకములను పఠించుచున్నారు.

బభ్రు-దేవావృధుల గురించి దూరమునుండి ఏ విధముగా (ఎంత గొప్పగా) వింటామో, దగ్గరకు వెళ్లి చూస్తే వారు ఖచ్చితముగా అటులనే యుందురు. మానవులలో బభ్రువు శ్రేష్ఠుడు. దేవావృధుడు దేవతలతో సమానమైనవాడు. బభ్రు- దేవావృధుల వంశములో పొరి తరువాత పదునా లుగు వేల అరవై  అయిదుగురు వంశీయులు వారిద్దరి ప్రభావము వలననే మోక్షమును పొందిరి (ఇవి వారి మహిమను వర్ణించే రెండు శ్లోకములు).

అంతశ్శత్రువులను తపింపజేసిన ఓ పరీక్షిన్మహారాజా! (సొత్వ తుని ఇంకో పుత్రుడైన) మహాభోజుడు కూడ (బభ్రు- దేవావృధుల వలే) ధర్మాత్ముడే. ఆయన వంశమునందు భోజులు అనే రాజులు ఉదయించిరి. (సాత్వతునీ ఇంకో పుత్రుడైన) వృష్టికి సుమిత్రుడు మరియు యుధాజిత్తు అనే పుత్రులు కలిగిరి. ఆ యుధాజిత్తునకు శిని, అనమిత్రుడు అనే పుత్రులు కలిగిరి. అనమిత్రుని పుత్రుడు నిమ్నుడు.

నిమ్నునకు సత్రాజితుడు, ప్రసేనుడు అనే పుత్రులు కలిగిరి. (యు ధాజిత్తు పుత్రుడగు) అనమిత్రుని మరియొక (యుధాజిత్తు పుత్రునికంటే భిన్నుడైన) పుత్రుడు శిని. శినియొక్క పుత్రుడు సత్యకుడు, సత్యకుని పుత్రుడు యుయుధానుడు. యుయుధానుని పుత్రుడు సాత్యకి. సాత్యకి యొక్క పుత్రుడు జయుడు. జయుని పుత్రుడు కుణి.

కుణియొక్క పుత్రుడు యుగంధరుడు. (యుధాజిత్తు పుత్రుడగు) అనమిత్రునకు వృష్టి అనే మరియొక (సాత్వతుని పుత్రుడగు వృష్టికంటే భిన్ను డైన) మూడవ పుత్రుడు కూడ గలడు. వృష్టికీ శ్వఫలుడు, చిత్రర థుడు అనే పుత్రులు ఉండిరి. శ్వఫల్కునకు గాందిని అనే భార్యయందు, ప్రఖ్యాతి గాంచిన అక్రూరుడు కాకుండా ఇంకో పన్నెండు మంది ప్రసిద్ధు లైన పుత్రులు కలిగిరి.

ఆసంగుడు, సారమేయుడు, మృదురుడు, మృదువిత్తు, గిరి, ధర్మ వృద్ధుడు, సుకర్ముడు, క్షేత్రోపేక్షుడు, అరివర్ధనుడు, శత్రుఘ్నుడు, గంధసూదుడు, ప్రతిబాహుడు అనునవి ఆ (అక్రూరుడు కాకుండా మిగిలిన) ఎన్నెండుగురి పేర్లు.

వారికీ సుచీర అనే చెల్లెలు కూడ గలదు, అక్రూరునకు కూడ దేవ వంతుడు, ఉపదేవుడు అనే ఇద్దరు పుత్రులు గలరు. (వృష్టియొక్క మరి యొక పుత్రుడగు) చిత్రరథునకు పృథువు, విదూరథుడు మొదలగు చాల మంది పుత్రులు గలరు. వారందరు వృష్టివంశీయులలో శ్రేష్ఠులే (కావుననే, ఆ వంశీయులనానందింప జేయువారు).

కుకురుడు, భజమానుడు, శుచి, కంబలబర్హిషుడు అనే నలుగురు (సొత్వతుని పుత్రుడగు అంధకుని పుత్రులు). కుకురునీ పుత్రుడు వహ్ని. వహ్నియొక్క పుత్రుడు విలోముడు.

ఆ విలోముని పుత్రుడు కపోతరోముడు. కపోతరోముని పుత్రుడు అనువు. అనువునకు తుంబురుడు మిత్రుడు. అనువుయొక్క పుత్రుడు అంధకుడు. అంధకుని పుత్రుడు దుందుభి, దుందుభియొక్క పుత్రుడు అరిద్యోతుడు. అరిద్యోతుని పుత్రుడు పునర్వసువు.

ఆ పునర్వసువునకు ఆహుకుడనే పుత్రుడు, ఆహుతి అనే కుమార్తె కూడ గలరు. ఆహుకునకు దేవకుడు, ఉగ్ర సేనుడు అనే ఇద్దరు పుత్రులు గలరు. దేవకునకు దేవవంతుడు, ఉపదేపుడు, సుదేవుడు, దేవవర్ధనుడు అనే నలుగురు పుత్రులు గలరు.

ఓ పరీక్షిన్మహారాజా! దేవవంతుడు మొదలైన ఆ నలుగురికి ఏడ్గురు చెల్లెళ్లు కూడ గలరు. ధృతదేవ, శాంతిదేవ, ఉపదేవ, శ్రీదేవ, దేవరక్షిత, సహదేవ, దేవకి అనునవి వారి పేర్లు. వారినందరిని వసుదేవుడు వివాహమాడెను.

కంసుడు, సునాముడు, న్యగ్రోధుడు, కంకుడు, శంకువు, సుహూ, రాష్ట్రపాలుడు, సృష్టి, మరియు తుష్టిమంతుడు అనువారలు (ఆహుకుని పుత్రుడగు) ఉగ్ర సేనుని పుత్రులు (తొమ్మిదిమంది).

ఉగ్రసేనునకు కంస, కంసవతి, కంక, శూరభువు, రాష్ట్రపాలిక అనే ఐదుగురు కుమార్తెలు ఉండిరి. వారిని వసుదేవుని తమ్ములు అగు దేవభాగుడు మొదలగువారు వివాహమాడిరి.

 (చిత్రరథుని పుత్రుడగు) విదూరథుని పుత్రుడు శూరుడు. శూరుని పుత్రుడు భజమానుడు. భజమానుని పుత్రుడు శిని. శినియొక్క పుత్రుడు స్వయంభోజుడు. స్వయంభోజుని పుత్రుడు హృదీకుడు.

హృదీకునకు దేవబాహువు, శతధనువు, కృతవర్మ అనే పుత్రులు గలరు. దేవమీఢుని పుత్రుడైన శూరుని భార్య మారిష అనే పేరుతో ప్రసిద్ధి గాంచెను.

ఆ శూరునకు ఆ మారిషయందు వసుదేవుడు, దేవభాగుడు, దేవ శ్రవసుడు, ఆనకుడు, సృంజయుడు, శ్యామకుడు, కంకుడు, శమీకుడు, వత్సకుడు, వృకుడు అనే పదిమంది నిష్కల్మషులగు పుత్రులు కలిగిరి.

వసుదేవుడు శ్రీహరికి జన్మను ఈయబోయే తండ్రి. కావుననే, ఆయన పుట్టినప్పుడు దేవతల దుందుభులు, భేరీలు వాటంతట అవియే మ్రోగినవి. అందువలననే, ఆయనకు ఆనకదుందుభి అనే ప్రసిద్ధి కలిగినది.

శూరుని పుత్రులగు ఈ పదిమంది సోదరులకు అయిదుగురు సోదరిలు కూడ గలరు. పృథ, శ్రుతదేవ, శ్రుతకీర్తి, శ్రుతశ్రవ, మరియు రాజాధి దేవి అనేవి ఆ అయిదుగురు కన్యల పేర్లు. తండ్రియగు శూరునకు కుంతి అనే మిత్రుడు ఉండెను. ఆ కుంతికి సంతానము లేకుండెను. శూరుడు పృథను ఆ కుంతికి పెంపుడుగా ఇచ్చెను.

ఆ కుంతి దూర్వాస మహర్షిని పరిచర్యలచే చాల సంతోష పెట్టి, ఆయననుండి దేవతలనాహ్వానించే ఉపాసనను పొందెను. ఆమె ఆ విద్యయొక్క శక్తిని పరీక్షించుటకై పరమపవిత్రుడగు సూర్యుని ఆహ్వానించెను.

అదే క్షణములో సూర్యదేవుడు ఆ కుంతి వద్దకు వచ్చి నిలబడెను. ఆయనను చూచి ఆమె మనస్సులో చాల ఆశ్చర్యపడి ఇట్లు పలికెను -- ఓ సూర్యదేవా! నేను విద్య పై నమ్మకము కలుగుట కొరకై దానిని ప్రయోగిం చితిని. నీవు నన్ను క్షమించి వెళ్లుము.

 (సూర్యదేవుడు ఇట్లు పలికెను) -- ఓ కుంతీదేవీ! నా దర్శనము వ్యర్థము కాబోదు. నేను నీకు పుత్రుని ఈయగలను. ఓ సుందరీ! కాని, నీ కన్యాత్వమునకు దోషము కలుగని విధముగా అనుగ్రహించగలను.

ఇట్లు పలికి సూర్యదేవుడు ఆమెయందు గర్భాధానమును చేసి సూర్యలోకమునకు వెళ్లాను. వెనువెంటనే రెండవ సూర్యుడువంటి బాలకుడు పుట్టెను.

ఆమె లోకమునకు భయపడి ఆ బాలకుని అతికష్టము మీద నదీ జలములయందు విడిచి పెట్టెను. ఓ పరీక్షిన్మహారాజా! మీ ముత్తాతయగు పొండువు సత్యము కొరకు పరాక్రమించే వ్యక్తి. ఆయన ఆ కుంతిని వివాహ మాడెను.

కుంతి చెల్లెలు అగు శ్రుతదేవను కరూష దేశాధిపతియగు వృద్ద శర్మ వివాహమాడెను. సనకాది మహర్షులచే శపించబడిన విజయుడు దితి యొక్క పుత్రుడగు హిరణ్యాక్షుడై జన్మించెను. ఆ హిరణ్యాక్షుడే మరల శ్రుతదేవయందు దంతవక్తడై జన్మించెను.

కేకయ దేశాధిపతియగు ధృష్టకేతువు కుంతి చెల్లెలగు శ్రుతకీర్తిని వివాహమాడెను. ఆమెకు సంతర్ధనుడు, ప్రతర్దనుడు మొదలగు అయిదు గురు పుత్రులు జన్మించి, కేకయ రాజకుమారులైరి.

జయ సేనుడు శూరుని మరియొక పుత్రికయగు రాజాధిదేవిని వివాహమాడెను. వారికి ఇద్దరు పుత్రులు (వింద-అనువిందులు) కలిగిరి. వారు అవంతీ (ఉజ్జయినీ) దేశమునకు అధిపతులైరి. చేదిదేశాధిపతియగు దమ ఘోషుడు శూరుని మరో పుత్రికయగు శ్రుతశ్రవను వివాహమాడేను.

ఆ శ్రుతశ్రవయొక్క కుమారుడే శిశుపాలుడు. వాని పుట్టుక ఇదివరలో (సప్తమ స్కంధము) చెప్పబడినది. (వసుదేవుని సోదరుడు, శూరుని పుత్రుడు అగు) దేవభాగుడు కంస (ఉగ్ర సేనుని కుమార్తె) యందు చిత్రకే తువు, బృహద్వలుడు అనే ఇద్దరు పుత్రులను కనెను.

 (వసుదేవుని మరియొక సోదరుడగు) దేవశ్రవసునకు కంసవతి (ఉగ్ర సేనుని కుమార్తె) యందు సువీరుడు, ఇషుమంతుడు అనే ఇద్దరు పుత్రులు కలిగిరి. (వసుదేవుని మరియొక సోదరుడగు) ఆనకునకు కంక (ఉగ్ర సేనుని కుమార్తె) యందు సత్యజిత్తు, పురుజిత్తు అనే ఇద్దరు పుత్రులు కలిగిరి.

 (వసుదేవుని సోదరుడగు) సృంజయునకు (ఉగ్రసేనుని పుత్రికయ గు) రాష్ట్రపాలీకయందు వృషుడు, దుర్మర్షణుడు మొదలగు పుత్రులు కలిగిరి. (వసుదేవుని సోదరుడగు) శ్యామకునకు (ఉగ్ర సేనుని పుత్రికయగు) శూరభువుయందు హరికేశుడు, హిరణ్యాక్షుడు అనే ఇద్దరు పుత్రులు కలిగిరి.

వసుదేవుని సోదరుడగు వత్సకునకు మిశ్రకేశి అనే అప్సరస యందు వృకుడు మొదలగు పుత్రులు కలిగిరి. వృకునకు దుర్వార్క్షి యందు తక్షుడు, పుష్కరుడు, శాలుడు మొదలగు పుత్రులు కలిగిరి.

 (వసుదేవుని సోదరుడగు) శమీకునకు సుదామినీయందు సుమిత్రుడు, అర్జునపాలుడు మొదలగు పుత్రులు కలిగిరి. (వసుదేవుని మరియొక సోదరుడగు) కంకునకు కూడ కర్ణికయందు ఋతధాముడు, జయుడు అనే పుత్రులు కలిగిరి.

వసుదేవునకు పౌరవి, రోహిణి, భద్ర, మధిర, రోచన, ఇల, దేవకి మొదలగు భార్యలు గలరు. వారిలో దేవకి ప్రముఖురాలు.

వసుదేవునకు రోహిణియందు బలుడు, గదుడు, సారణుడు, దుర్మదుడు, విపులుడు, ధ్రువుడు, కృతుడు మొదలగు పుత్రులు కలిగిరి.

వసుదేవునకు పౌరవియందు భూతుడు, సుభద్రుడు, భద్రవాహుడు, దుర్మదుడు, భద్రుడు మొదలుగాగల పన్నెండుమంది పుత్రులు కలిగిరి. వీరిలో భూతుడు పెద్దవాడు.

వసుదేవునకు మదిరయందు నందుడు, ఉపనందుడు, కృతకుడు, శూరుడు మొదలగు పుత్రులు కలిగిరి. కౌసల్య (భద్ర, వసుదేవుని మరి యొక భార్య) కు మాత్రము వంశమును ఆనందింపే జేసే కేశి అనే ఒకే పుత్రుడు కలిగెను.

వసుదేవునకు రోచన అనే భార్యయందు హస్తుడు, హేమాంగదుడు మొదలగు పుత్రులు, ఇలయందు ఉరువల్కుడు మొదలగు ప్రముఖులైన యాదవులు జన్మించిరి.

ఓ పరీక్షిన్మహారాజా! వసుదేవునకు ధృతదేవయందు విపృష్ణుడు అనే ఒకే పుత్రుడు కలిగెను. ఆయనకే శాంతిదేవయందు శ్రముడు, ప్రతి శ్రుతుడు మొదలగు పుత్రులు కలిగిరి.

వసుదేవునకు ఉపదేవ అనే భార్యయందు కల్పవర్షుడు పెద్దవాడుగా గల పదిమంది రాజులు జన్మించిరి. ఆయనకే శ్రీదేవయందు వసువు, హంస, సువంశుడు మొదలగు ఆర్గురు పుత్రులు కలిగిరి.

వసుదేవునకు దేవరక్షితయందు గదుడు మొదలగు తొమ్మండుగురు పుత్రులు కలిగిరి. ఆయనకే సహదేవయందు, సాక్షాత్తుగా ధర్మునకు వసువులు కలిగినట్లుగా, పురువిశ్రుతుడు మొదలైన ఎనమండుగురు పుత్రులు కలిగిరి.

ఉదారశీలుడగు వసుదేవుడు దేవకియందు కీర్తిమంతుడు, సుషేణుడు, భద్ర సేనుడు, ఋజువు, సమ్మర్ధనుడు, భద్రుడు, శేషుని అవతార మగు బలరాముడు అనే పుత్రులను, శ్రీహరితో కలిపి ఎనమండుగురిని కనేను.

ఓ పరీక్షిన్మహారాజా! దేవకీ వసుదేవులకు సాక్షాత్తు శ్రీహరియే ఎనిమిదవ పుత్రుడై జన్మించెను. వారికి సుభద్ర అనే ఒక కన్య కూడ గలదు. ఆ గొప్ప పుణ్యాత్మురాలే నీ తండ్రియొక్క తల్లి.

ఈ లోకమునందు ఎప్పుడెప్పుడైతే ధర్మము క్షీణించి పాపము పెరిగిపోవునో, అప్పుడప్పుడు జగన్నాథుడగు శ్రీహరి తానే స్వయముగా అవతరించును.

ఓ మహారాజా! జగన్నాథుడగు శ్రీహరి ప్రకృతికి అతీతుడు. దృక్స్వరూపుడైన ఆయన సకలప్రాణులలో ఆత్మరూపుడై యున్నాడు. ఆయన తన మాయాశక్తి చేతనే అవతరించి లీలలను నెరపును. ఇంతకు మినహాయించి ఆయన జన్మకు గాని, చేష్టలకు గాని మరియొక కారణము (పూర్వకర్మ, మరియు వాసనలు) లేదు.

శ్రీహరియొక్క మాయావిలాస వలననే జీవుడు జన్మించి మనుగడను సాగించి మరణించుచున్నాడు. ఆ శ్రీహరియొక్క అనుగ్రహము వ్యక్తికి ఆ మాయను నివృత్తము చేసి శ్రీహరిని పొందుటకు కారణమగును.

రాక్షసులు రాజుల రూపములో జన్మించి అనేకములగు అక్షౌహిణీల సైన్యమును ప్రోగుచేసి భూమిని ఆక్రమించి భూమికి భారమగుచుండ గా, ఆ భారమును తగ్గించుటకై శ్రీహరి ఉద్యమించినాడు.

మధువు అనే రాక్షసుని సంహరించిన శ్రీహరి సంకర్షణదేవుని అవ తారమైన బలరామునితో గూడి చేసిన (దావానల భక్షణము మొదలైన) లీలలను దేవనాయకులు కూడ మనస్సుచేనైననూ ఊహ చేయజాలరు.

శ్రీహరి కలియుగములో పుట్టబోయే భక్తులననుగ్రహించుట కొరకై మిక్కిలి పవిత్రమైన తన కీర్తిని విస్తరింప జేసెను. ఆ కీర్తిని గానము చేయు వారికి అది శరీరపీడను, మానసదుఃఖమును, మరియు అజ్ఞానమును పోగొ ట్టును.

సత్పురుషుల చెవులకు అమృతమైన శ్రీహరియొక్క యశ స్సే గొప్ప తీర్థము (పావనము  చేయునది). దానియందు చెవియే దోసిలి కాగా ఒక్కసారి ఆచమనమును చేయు వ్యక్తి (భగవానుని కీర్తిని కొద్దిగానైననూ శ్రవణము చేయు వ్యక్తి) కర్మల సంస్కారము (బంధము) ను క్షాళన చేసు కొనును (అనగా, మోక్షమును పొందును).

భోజ-వృష్టి-అంధక-మధు-శూరసేన-దశార్హ-కురు-సృంజయ - పాండు వంశీయులు నిరంతరముగా శ్రీకృష్ణ భగవానుని లీలలను కొని యాడెడివారు.

శ్రీకృష్ణుడు ప్రేమతో నిండిన చూపులతో ఉదారమైన పలుకులను చిరునవ్వుతో పలికెడివాడు. సకలావయవములయందు సుందరమైన రూపము గల ఆయన పరాక్రమముయొక్క లీలలను నేరపెడివాడు. ఈ విధముగా ఆయన మానవలోకమును రమింపజేసెను.

మొసలి ఆకారములోనున్న కుండలములచే సుందరమైన చెవు లతో శ్రీకృష్ణుని చెక్కిళ్లు ప్రకాశించుచుండెను. ఆయన ముఖము విలాసతో కూడిన నవ్వుతో శోభిల్లుచుండెను. నిత్యము ఉల్లాసముగానుండే శ్రీకృష్ణుని అట్టి ముఖమును చూపులతో త్రాగి (సాదరముగా చూచి ఆనందించే పురు షులకు, స్త్రీలకు కూడ తృప్తి కలుగకుండెను. పైగా, వారు కనులకు రెప్ప పాటును కలిగించిన నిమి మహారాజు పై కోపించెడివారు. (రెప్పపాటుకు, నిమికి గల సంబంధము కొరకు 13 వ అధ్యాయమును చూడుడు).

పురుషోత్తముడగు శ్రీహరి నిజరూపముతో జన్మించి తరువాత మనుష్యాకారమును స్వీకరించెను. ఆయన తండ్రియొక్క గృహమగు కారాగారమును విడిచి పెట్టి నందగోకులమునకు వెళ్లి అచట వారీ ప్రయోజ నములను వర్ధిల్లజేసెను. ఆయన చాలమందిని భార్యలుగా స్వీకరించి వారియందు వందలాది పుత్రులను కనెను. ఆయన క్రతువులతో తనను తానే చక్కగా ఆరాధించుకొని, తనదైన వేదమార్గమునకు జనులలో ప్రశ స్తిని కలిగించెను.

ఆ శ్రీకృష్ణుడు కురువంశీయుల లోపల పుట్టిన కలహముతో భూమికి భారమైన దుష్టులను యుద్ధమునందు సంహరింపజేసి ఆ విధ ముగా భూమియొక్క పెద్ద భారమును తొలగించెను. ఆయన ఆ యుద్ధ ములో తన చూపులతోనే మహారాజుల సైన్యమును నశింపజేసి, అర్జునుని విజయమును ఉద్ఘోషించేను. తరువాత ఆయన ఉద్ధవునికి పరతత్త్వమును బోధించి, తన ధామమగు వైకుంఠమును చేరుకొనెను.

శ్రీమద్బాగవత మహాపురాణమునందు తొమ్మిదవ స్కంధములో విదర్బుని వంశమును వర్ణించే ఇరువది నాల్గవ అధ్యాయము ముగిసినది (24).

నవమ స్కంధము ముగిసినది.

హరిః ఓమ్, తత్సత్, శ్రీకృష్ణార్పణమస్తు.