శ్రీ మద్భాగవతము - నవమ (9వ) స్కందము
19 - యయాతి గీతి
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా స్త్రీకి వశవర్తుడై ఆ యయాతి విషయభోగముల ననుభవించుచుండెను. భోగముల వలన ఆత్మస్వరూపము కప్పివేయబడునని ఆయన గుర్తించి విరక్తుడాయెను. అపుడాయన తన ప్రియురాలగు దేవయానికి ఈ కథ (గీత) ను చెప్పెను.
భృగుకులసంజాతవగు ఓ దేవయానీ! ఈ లోకములో నా వలెనే స్త్రీకి వశుడై భోగపరాయణుడై ఉండే వానికి అనుభవమునకు వచ్చే ఈ కథను వినుము. గ్రామము (ఇంద్రియసమూహము) నందు నివసించేనావంటి భోగపరాయణునిపై వనమునందు నివసించే (అంతర్ముఖులై యుండే) ధీరులు (ఆత్మానాత్మవివేకము గలవారు) జాలిపడెదరు.
ఒకానొక ఒంటరి మేకపోతు అడవిలో తనకు ఇష్టమయ్యే వస్తువు కొరకు వెదుకుచుండెను. తన కర్మకు వశమై నూతిలో పడియున్న ఒక ఆడుమేకను అది చూచెను.
ఆ మేకపోతునకు ఆడుమేకపై కామన కలిగెను. అది నూతినుండి ఆడుమేకను పైకి తీసే ఉపాయమును గురించి ఆలోచించెను. అది నూతి గట్టుపై తన కొమ్ముల కొనలతో మట్టిని పెల్లగించి నూతి లోపలినుండి పైకి వచ్చే దోవను తయారు చేసెను.
మిక్కిలి సుందరియగు ఆ ఆడుమేక నూతినుండి పైకి వచ్చి తనను పైకి తీసిన ఆ మేకపోతునే ప్రేమించెను సుమా! జుట్టు నిండిన గెడ్డమును కలిగి బలిసియున్న ఆ మేకపోతు ప్రీతిని వర్షించునది. సంభోగ సమర్థమగు ఆ మేకపోతుపై ఆ ఆడుమేకకు చాల ప్రేమ కలిగెను. అంతేగాక, అనేకములగు ఆడుమేకలు సుందరమైన ఆ మేకపోతును పరిశీలనగా చూచి, దానిని కామించినవి.
ఆ ఒక్క మేకపోతు అనేకములగు ఆడుమేకలకు ప్రీతిని వర్ధిల్ల జేయుచుండెను. కామమనే పిశాచముచే ఆవేశించబడిన ఆ మేకపోతు తనను తానే విస్మరించి విహరించెను.
ఒకనాడు అదే మేకపోతు పూర్వము నూతిలో పడిన ఆడుమేక కంటే కూడ మిక్కిలి ప్రియమైన మరియొక ఆడుమేకతో విహరించుచుండెను. ఆ ఆడుమేక మేకపోతుయొక్క ఆ ప్రవృత్తి (మరియొక ఆడుమేకతో విహరించుట) ని చూచి ఓర్వలేకపోయెను.
కాముకుడైన ఆ మేకపోతు మిత్రుని రూపములోనున్న కపటస్వభావుడు. ఆతడు చూపే ప్రేమ క్షణికము మాత్రమే. ఆ ఆడు మేక దుఃఖితురాలై ఇంద్రియములకు వశుడై యున్న ఆ మేకపోతును విడిచి పెట్టి తన ప్రభువు (తండ్రి) వద్దకు వెళ్లిపోయెను.
స్త్రీకి వశవర్తియై దీనుడైయున్న ఆ మేకపోతు కూడ మే మే అనే ధ్వనిని చేస్తూ ఆ ఆడుమేకను ప్రసన్నము చేసుకొనుటకై దాని వెంట వెళ్లెను. మార్గమునందు ఆ ఆడు మేకతో జత గట్టుటకు ప్రయత్నించిననూ, మేకపోతునకు అది చేతగాలేదు.
ఆ ఆడుమేక ప్రభువు (తండ్రి) ఒకానొక బ్రాహ్మణుడు. ఆయన కోపముతో పోతు మేకయొక్క వ్రేలాడుచున్న అండమును కోసివేసెను. కాని, ఆయన అనేకములగు ఉపాయములు తెలిసినవాడు. తన కుమార్తెయగు ఆడుమేకకు ప్రయోజనమును చేకూర్చుటకై ఆయన పోతుమేకకు అండము మరల అదుకుకొనునట్లు చేసెను.
ఓ కల్యాణీ! అండమును అదికించిన తరువాత ఆ పోతుమేక తనకు నూతియందు దొరికిన ఆడుమేకతో కూడి చాల కాలము కామనలననుభవించెను. అయిననూ, ఆ పోతుమేకకు ఈనాటికీ కామనల యెడల సంతృప్తి కలుగలేదు.
అందమైన కనుబొమలు గల ఓ దేవయానీ! నేను కూడ అదే స్థితిలో ఉన్నాను. నేను నీ ప్రేమకు కట్టివేయబడి నీ మాయచే వ్యామోహితుడనై నా స్వరూపమును నేను తెలియకున్నాను.
భూలోకములో ఎంత ధాన్యము, బార్లీ మొదలైన పంటలు గలవో, పాడిపశువులు బంగారము ప్రియురాండ్రు (పరిచారికలు) గలరో, అవి అన్నీ కలిసి కూడ కామనలచే వినష్టుడైన వ్యక్తి మనస్సునకు సంతృప్తిని (పూర్ణత్వమును) కలిగించ లేవు.
విషయభోగములయందలి తృష్ణ విషయభోగములను అనుభవించుటచే ఏ నాడైననూ చల్లారదు. అగ్ని తాను పయనించిన దారినంతనూ మసి చేయును. ఆ అగ్నికి నేతిని పోస్తే చల్లారదు; పైగా, మరింత వర్ధిల్లును. అదే విధముగా భోగానుభవములచే సర్వమును నాశము చేసే భోగతృష్ణ మరింత అధికముగా వర్ధిల్లును.
సకలప్రాణులలో ఒకే పరమాత్మ సమానముగా ఉన్నాడు. కావున, ఆ పరమాత్మనే దర్శించి ఏ ప్రాణియందైననూ అశోభనమగు వైషమ్యభావమును ఏనాడైతే వ్యక్తి చేయడో, ఆ నాడు అట్టి సమదర్శనము గల వ్యక్తికి సకలదిక్కులు ఆనందమును పొందించును.
దుర్బుద్ధి గలవారు భోగములయందలి తృష్ణను విడిచి పెట్టలేరు. వ్యక్తియొక్క దేహము ముసలిదనముచే శిథిలమగుచున్ననూ, వాని తృష్ణ మాత్రము శిథిలము కాదు. దుఃఖములకు నిలయమగు అట్టి తృష్ణను కల్యాణములను కోరువాడు తొందరగా విడిచి పెట్టవలెను.
తల్లితో గాని, చెల్లెలుతో గాని, కుమార్తెతో గాని ఒకే ఆసనము నందు కూర్చుండరాదు. ఇంద్రియముల సముదాయమునకు చాల బలము గలదు. అది విద్వాంసునియైననూ (భోగతృష్ణలోనికి) లాగివేయును.
నేను వేయి సంవత్సరములనుండి నిరంతరముగా ఇంద్రియభోగముల ననుభవించుచునే యున్నాను. అయినప్పటికీ, ఆయా కాలములయందు ఆ భోగముల పై తృష్ణ ఉదయించుచునే యున్నది.
కావున, నేనీ భోగములయందలి తృష్ణను విడిచి పెట్టెదను. నేను పరబ్రహ్మయందు మనస్సును నిలిపి సుఖదుఃఖాది ద్వంద్వములకు అతీతుడనగుదును. నేను అహంకారము లేనివాడనై మృగములతో బాటుగా అడవిలో సంచరించెదను.
కనబడే (ఇహలోకమునందలి) మరియు వినబడే (పరలోకమునందలి) భోగములు మిథ్య. వాటియందు తగుల్కొన్న మానవుడు సంసారమునందు బద్ధుడై తాను వినాశమును పొందును. ఈ సత్యమును తెలుసుకొని సాధకుడు అట్టి భోగముల గురించి ధ్యానించరాదు; వాటిని భోగించరాదు. అట్టి వివేకము గల సాధకుడు ఆత్మజ్ఞానమును పొందును.
నహుషపుత్రుడగు యయాతికి కామనలు తొలగిపోయెను. ఆయన భార్యతో ఈ విధముగా పలికి, పూరువునకు ఆతని యౌవనమును ఇచ్చివేసి, తన ముసలిదనమును తాను స్వీకరించెను.
ఆయన ఆగ్నేయదిక్కునందు ద్రుహ్యుని, దక్షిణమునందు యదువును, పడమర దిక్కునందు తుర్వసుని, ఉత్తరమునందు అనువును ప్రభువుగా నియమించెను.
సకలభూమండలముయొక్క సంపదలకు సర్వాధికమగు యోగ్యత గలవాడు పూరువు. యయాతి ఆ పూరువును చక్రవర్తిగా అభిషేకించి, అన్నలను ఆయన అధీనములో ఉంచి, తాను అడవికి వెళ్లెను.
ఆ యయాతి అనేక సంవత్సరములు నిరంతరముగా ఆరు ఇంద్రియములతో విషయభోగముల ననుభవించెను. కాని, ఆయన అట్టి ఆరు ఇంద్రియముల సుఖములను క్షణకాలములో, రెక్కలు వచ్చిన పక్షిగూడును వలె, విడిచి పెట్టెను.
లోకప్రసిద్ధి చెందిన ఆ యయాతి సకలములైన ఆసక్తులను విడిచిపెట్టెను. జీవుని లింగదేహము మూడు గుణముల కార్యము. దానిని ఆయన జ్ఞానాగ్నిచే పూర్తిగా వినష్టము చేసెను. ఆయన ఆ అడవిలో భగవానుని ఉపాసనచే పొందబడే మోక్షమును పొందెను. ప్రకృతికి అతీతము, గుణసంగము లేనిది, సకలజగత్తునకు అధిష్ఠానము, చైతన్యఘనము అగు పరబ్రహ్మయందు ఆయన విలీనమాయెను.
ఆ గీతిని విని దేవయాని తనను యయాతి నిందించుచున్నాడని తలచెను. స్త్రీపురుషుల మధ్యనుండే ప్రేమకు వియోగము కలిగినప్పుడు కలవరము కలుగను. అది లేకుండా నుండుటకై యయాతి ఈ గీతిని పరిహాసమును చెప్పినట్లు చెప్పినాడని ఆమె తలపోసెను.
భృగువంశీయురాలగు ఆ దేవయాని తండ్రి-భర్త మొదలగు బంధువులతోడి సహవాసము చలివేంద్రము వద్ద బాటసారులు కలుసుకొనుట వంటిదేనని గుర్తించెను. మానవులందరు ఈశ్వరుని అధీనములో ఉన్నవారై అవిద్యకు లోబడి ఇట్టి బంధములను నిర్మించుకొనెదరు. ఈ జగత్తు స్వప్నమువలె మిథ్యయని ఆమె తెలుసుకోనెను. ఆమె పతిపుత్రరా జ్యాదులన్నింటియందు ఆసక్తిని విడిచిపెట్టి, మనస్సులో శ్రీకృష్ణుని పూర్తిగా నింపుకొని, తన లింగశరీరము (వ్యక్తిత్వ పరిచ్ఛేదము) ను భంగము చేసుకొనెను (ఈశ్వరునిలో విలీనమయ్యెను).
ఓ శ్రీహరీ! సకలజగత్తునకు సత్తాస్ఫూర్తులననుగ్రహించే చైతన్యఘనుడవు నీవే. జగత్తును సృష్టించి సకలప్రాణులకు ఆశ్రయమైనది నీవే. గుణప్రవాహమునకు అతీతమగు శాంతతత్త్వము నీవే. దేశకాలపరిచ్ఛేదములకు అతీతుడవగు నీ కొరకు అనేక నమస్కారములు -- అని దేవయాని పలికెను.
శ్రీమద్భాగవత మహాపురాణమునందు తొమ్మిదవ స్కంధములో యయాతి గీతిని వర్ణించే పందొమ్మిదవ అధ్యాయము ముగిసినది.
