శ్రీ మద్భాగవతము - నవమ (9వ) స్కందము

Table of Contents

13 - నిమి మహారాజు చరితము

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఇక్ష్వాకుని పుత్రుడగు నిమి సత్రయాగమును ప్రారంభించి, వసిష్ఠుని ఋత్విక్కుగా వరించెను. ఆయన ఇట్లు బదులు చెప్పెను -- ఓ మహారాజా! ఇంద్రుడు నన్ను ముందుగా (తన యజ్ఞమునకై ఋత్విక్కుగా) వరించినాడు.

ఆ యజ్ఞమును నిర్వర్తించి నేను తిరిగి వచ్చెదను; అంతవరకు నా కొరకై వేచియుండుము, అని వసిష్ఠుడు చెప్పెను. గృహయజమానియగు నిమి మిన్నకుండెను. వసిష్ఠుడు ఇంద్రుని యజ్ఞమును నిర్వర్తించెను.

ఈ జీవితము చంచలమైనదనే వివేకము నిమికి గలదు. గురువగు వసిష్ఠుడు ఎంతకైననూ రాకపోవుటచే, ఆయన ఇతరులగు ఋత్విక్కులతో సత్రయాగమునారంభించెను.

ఇంద్రుని యజ్ఞమును నిర్వర్తించి తిరిగి వచ్చిన గురువగు వసి ష్ణుడు నిమి తన ఆజ్ఞను ఉల్లంఘించుటను గాంచి ఇట్లు శపించెను -- తాను పండితుడనని గర్వించే ఈ నిమి మరణించు గాక!

ధర్మము చేయుటయందు విలంబము తగదు అనే ధర్మమును గురువగు వసిష్ఠుడు ఉపేక్షించి శాపమునిచ్చినాడు. రెండు యజ్ఞముల దక్షి ణలను పొందవలెననే లోభము ఆయనకుండెను. కావున, నిమి తిరిగి ఆయన కూడ మరణించునని శాపమునిచ్చెను.

ఆత్మజ్ఞానమునందు నిమి గొప్పవాడు. ఆయన ఇట్లు పలికి తన దేహమును విడిచి పెట్టెను. మా ముత్తాతయగు వసిష్ఠుడు కూడ మరణించి మిత్రావరుణులకు ఉర్వశియందు పుత్రుడై జన్మించెను.

నిమియొక్క ఋత్విక్కులైన మహర్షులు నిమియొక్క ఆ దేహ మును పరిమళ తైలమునందు భద్రము చేసిరి. సత్రయాగము. పూర్తి అయిన పిదప, అచటకు వచ్చియున్న దేవతలనుద్దేశించి వారిట్లు పలికిరి.

సమర్ధులగు మీరు ప్రసన్నులైనచో, మహారాజుయొక్క ఈ దేహము బ్రదుకు గాక! అని మహర్షులు పలుకగా, దేవతలు తథాస్తు! అని రి. కాని, నిమి ఇట్లు పలికెను -- నాకు దేహముయొక్క బంధము కలుగ కుండు గాక!

మననశీలురై శ్రీహరియందు బుద్ధిని లగ్నము చేసినవారలు దేహ ముతోడి సంయోగము (జన్మ) ను కోరుకోనరు. ఏలయనగా, దేహముతోడి వియోగము (మరణము) వలన వారు భయభీతులగుదురు. వారు శ్రీహరి పాదపద్మములను (మోక్షము కొరకై) సేవించెదరు.

దేహము దేహపీడకు, మనోవ్యథకు మరియు భయమునకు నిల యము. అట్టి దేహమును పొందాలనే కోరిక నాకు లేదు. దేహమును పొందుట వలన ఈ జీవునకు అంతటా, నీటిలోని చేపలకు (పెద్ద చేప) వలె, మరణము సిద్దముగా నుండును.

దేవతలిట్లు పలికిరి -- నిమి దేహము లేకుండగనే దేహధారులగు ప్రాణుల అధ్యాత్మము (దేహేంద్రియమనస్సంఘాతము) నందలి కన్నుల యందు యథేచ్చగా నివసించు గాక! ఆయన ఉనికిని కను రెప్పల తెరచు కొనుట మరియు మూయబడుట సూచించును.

రాజు లేనిచో మానవులకు భయము కలుగునని తలపోసి ఆ మహర్షులు నిమియొక్క దేహమును మథించగా, పుత్రుడు కలిగెను.

అసాధారణముగా జన్మించుటచే ఆయనకు జనకుడనియు, దేహము లేని నిమి వంశములో జన్మించుటచే వైదేహుడనియు, దేహ మును మథించుట వలన పుట్టుటచే మిథిలుడనియు ఆయనకు పేర్లు. ఆయన నిర్మించిన నగరమే మిథిల.

ఓ పరీక్షిన్మహారాజా! ఆ జనకుని పుత్రుడు ఉదావసువు. ఉదావ సుని పుత్రుడు నందివర్ధనుడు. నందివర్ధనుని పుత్రుడు సుకేతువు. సుకే తుని పుత్రుడు దేవరాతుడు.

దేవరాతుని పుత్రుడు బృహద్రథుడు. బృహద్రథుని పుత్రుడు మహావీర్యుడు. మహావీర్యుని పుత్రుడు సుధృతి. సుధృతి పుత్రుడు ధృష్టకే తువు. ధృష్టకేతుని పుత్రుడు హర్యశ్వడు. హర్యశ్వుని పుత్రుడు మరువు.

మరువు పుత్రుడు ప్రతీపకుడు. ప్రతీపకుని పుత్రుడు కృతిరథుడు. కృతిరథుని పుత్రుడు దేవమీఢుడు. దేవమీఢుని పుత్రుడు విశ్రుతుడు. విశ్రు తుని పుత్రుడు మహాధృతి.

ఆ మహాధృతి పుత్రుడు కృతిరాతుడు. కృతిరాతుని పుత్రుడు మహారోముడు. మహారముని పుత్రుడు స్వర్ణరోముడు. స్వర్ణరోముని పుత్రుడు హ్రస్వరోముడు.

హ్రస్వరోముని పుత్రుడు సీరధ్వజుడు. ఆయన యజ్ఞము కొరకై భూమిని దున్నుచుండగా, నాగలి చాలునుండి సీతాదేవి పుట్టెను. కావున నే, ఆయనకు సీరధ్వజుడు (నాగలీయే కీర్తిని తెలుపునదిగా గలవాడు) అనీ పిలువబడెను.

 

సీరధ్వజుని పుత్రుడు కుశధ్వజుడు. కుశధ్వజుని పుత్రుడు ధర్మ ధ్వజ మహారాజు, ధర్మధ్వజునకు కృతధ్వజుడు, మితధ్వజుడు అనే ఇద్దరు పుత్రులు ఉండిరి.

ఓ పరీక్షిన్మహారాజా! కృతధ్వజుని పుత్రుడు కేశిధ్వజుడు. ఆయన సుస్పష్టమైన ఆత్మజ్ఞాననిష్ఠ గలవాడు. మితధ్వజుని పుత్రుడు ఖాండిక్యుడు.

కర్మస్వరూపమునెరింగిన ఖాండిక్యుడు కేశిధ్వజునకు భయపడి పారిపోయేను. ఆయన పుత్రుడు భానుమంతుడు. భానుమంతుని పుత్రుడు శతద్యుమ్నుడు.

ఆ శతద్యుమ్నుని పుత్రుడు శుచి, శుచి పుత్రుడు సనద్వాజుడు. ఆ సనద్వాజుని పుత్రుడు ఊర్ధ్వకేతువు. ఊర్ధ్వకేతువు పుత్రుడు అజుడు. అజుని పుత్రుడు పురుజిత్తు.

పురుజిత్తు పుత్రుడు అరిష్టనేమి. అరిష్టనేమి పుత్రుడు శ్రుతాయు వు. శ్రుతాయువు పుత్రుడు సుపార్శ్వకుడు. సుపార్శ్వకుని పుత్రుడు చిత్ర రథుడు. చిత్రరథుని పుత్రుడగు క్షేమది మిథిలకు ప్రభువు.

క్షేమధి పుత్రుడు సమరథుడు. సమరథుని పుత్రుడు సత్యరథుడు. సత్యరథుని పుత్రుడు ఉపగురువు. ఉపగురువునకు అగ్ని అంశతో ఉపగుపు డనే పుత్రుడు కలిగెను.

ఉపగుపుని పుత్రుడు వస్వనంతుడు. వస్వనంతుని పుత్రుడు యుయుధుడు. యుయుధుని పుత్రుడు సుభాషణుడు. సుభాషణుని పుత్రుడు శ్రుతుడు. శ్రుతుని పుత్రుడు జయుడు. జయుని పుత్రుడు విజయుడు. విజయుని పుత్రుడు ఋతుడు.

ఆ ఋతుని పుత్రుడు శునకుడు. శునకుని పుత్రుడు వీతహవ్యుడు. వీతహవ్యుని పుత్రుడు ధృతి. ధృతి పుత్రుడు బహులాశ్వుడు. బహులా శ్వుని పుత్రుడు కృతి. కృతి పుత్రుడు మహావశి.

ఓ పరీక్షిన్మహారాజా! వీరందరు మిథిలుని వంశమునకు చెందినవా రు. యోగేశ్వరులగు యాజ్ఞవల్క్యాదుల అనుగ్రహముచే వీరందరికి సుస్స ష్టమైన ఆత్మజ్ఞాననిష్ఠ ఉండెడిది. కావుననే, వీరు గృహస్థులై ఉండియు, రాగద్వేషాది ద్వంద్వములకు అతీతులై యుండెడివారు.

శ్రీమద్బాగవత మహాపురాణమునందు తొమ్మిదవ స్కంధములో నిమియొక్క వంశమును వర్ణించే పదమూడవ అధ్యాయము ముగిసినది.