శ్రీ మద్భాగవతము - నవమ (9వ) స్కందము
6 - మాంధాత చరితము - సౌభరి చరితము
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- అంబరీషునకు వీరూపుడు, కేతుమంతుడు, శంభుడు అనే ముగ్గురు పుత్రులు ఉండిరి. వీరూపుని పుత్రుడు పృషదశ్వుడు కాగా, పృషదశ్వుని పుత్రుడు రథతరుడు.
రథతరునకు సంతానము కలుగలేదు. అపుడాయన వంశపరంప రను నిలబెట్టుడని కోరగా అంగిరసుడు ఆయన భార్యయందు బ్రహ్మవ ర్చస్సు గల పుత్రులను కనెను.
రథీతరవంశీయులలో శ్రేష్ఠులైన వీరైతే రథోతరుని భార్యకు కలిగిన సంతానమే అయినా, ఆంగిరస గోత్రీయులుగా ప్రసిద్ధికెక్కినారు. ఈ విధ ముగా వీరు క్షత్రియగోత్రముతో కూడుకున్న బ్రాహ్మణులై రెండు వంశ ములు గలవారైనారు.
మనువు తుమ్ముచుండగా ఆయన ముక్కునుండి ఇక్ష్వాకువు పుట్టె ను. ఆ ఇక్ష్వాకువునకు వందమంది పుత్రులు ఉండిరి. వారిలో వికుక్షి, నిమి, దండకుడు పెద్దవారు.
ఓ పరీక్షిన్మహారాజా! ఆ వంద మందిలో ఇరవై అయిదు మంది ఆర్యావర్తములోని తూర్పు దిక్కునందు, ఇరవై అయిదు మంది పశ్చిమ దిక్కునందు, ముగ్గురు మధ్యభాగమునందు, మిగిలినవారు (నలభై ఏడ్గురు) మిగిలిన దిక్కులయందు రాజులుగా నుండిరి.
ఒకనాడు ఆ ఇక్ష్వాకువు అష్టకాశ్రాద్దమును చేయుచూ పుత్రుని ఇట్లు ఆదేశించెను -- ఓ వికుక్షీ! తొందరగా వెళ్లి పవిత్రమైన మాంసమును తీసుకురమ్ము,
సరే! అని పలికి వీరుడగు ఆ వికుక్షి అడవికి వెళ్లి, శ్రాద్దమునకు యోగ్యములైన పశువులను చంపెను. ఆతడు అలసిపోయెను, పైగా ఆకలి గొనియుండెను. శ్రాద్దము సంగతి మరచి ఆతడు కుందేటిని తినెను.
ఆతడు మిగిలిన మాంసమును తండ్రికి సమర్పించెను. అపుడు ఇక్ష్వాకువు తన గురువగు వసిష్ఠుని శ్రాద్దసంస్కారము కొరకు ప్రేరేపించగా, ఆయన ఇట్లనెను -- ఇది చెడ్డది, శ్రాద్ధకర్మకు అనర్హము.
ఇక్ష్వాకుని పుత్రుడగు వికుక్షి శాస్త్రనియమమును విడిచి పెట్టి చేసిన ఆ పనిని గురించి గురువగు వసిష్ఠుడు చెప్పగా తెలుసుకున్న ఇక్ష్వాకువు కోపముతో తన పుత్రునీ దేశమునుండి బహిష్కరించెను.
యోగియగు ఆ ఇక్ష్వాకువు జ్ఞానదాతయగు వసిష్ఠునితో తత్త్వవిచారమును చక్కగా చేసెను. దాని ప్రభావముచే ఆయన జ్ఞానయోగనిష్ఠ గలవాడై దేహత్యాగమును చేసి పరబ్రహ్మను పొందెను.
తండ్రియగు ఇక్ష్వాకువు మరణించిన పిదప వికుక్షి తిరిగి రాజ్యమునకు వచ్చి పృథివిని పాలిస్తూ యజ్ఞములతో శ్రీహరిని ఆరాధించెను. ఆయనకు శశాదుడు (కుందేటిని తిన్నవాడు) అనే పేరు ప్రసిద్ధి గాంచేను.
ఆ వికుక్షియొక్క పుత్రుడు పురంజయుడు. ఆయనను ఇంద్రవాహుడు అనియు, కకుత్స్థుడు అనియు కూడ పిలిచెడివారు. ఆయన చేసిన కర్మలను బట్టి ఈ పేర్లు వచ్చినవి. ఆ వివరములను వినుము.
కృతయుగాంతమునందు దేవతలకు రాక్షసులతో జగత్తును అంతము చేసే యుద్దము జరిగెను. ఆ యుద్దములో దేవతలు రాక్షసుల చేతిలో ఓడి, వీరుడగు పురంజయుని సహాయకునిగా ఎన్నుకొనిరి.
ఇంద్రుడు తనకు వాహనము కావలెనని పురంజయుడు కోరెను. దేవదేవుడు, జగత్తునకు ఆత్మ, జగన్నాథుడు అగు విష్ణువు చెప్పగా, ఇంద్రుడు పెద్ద యెద్దు ఆయెను.
ఆ పురంజయుడు యుద్ధమును చేయగోరి కవచమును వేసుకొని దేవలోకమునకు చెందిన ధనుస్సును మరియు వాడి బాణములను తీసుకొని ఎద్దుపై మూపురము వద్ద కూర్చుండెను. దేవతలు ఆయనను స్తుతించుచుండిరి.
పూర్ఖుడు, ప్రకృతికి అతీతముగా ఆత్మరూపుడై యున్నవాడు అగు విష్ణువు యొక్క తేజస్సు పురంజయుని వర్దిల్లజేసెను. ఆయన దేవతలతో గూడి పశ్చిమదిక్కునందున్న రాక్షసుల నగరమును ముట్టడించెను.
ఆ రాక్షసులతో పురంజయునకు సంకులమైన యుద్ధము జరిగెను. చూచువారలకు ఆ యుద్దము రోమాంచమును కలిగించెను. ఆ యుద్దములో తనను ఎదిరించిన రాక్షసులను ఆయన బాణములతో యముని వద్దకు పంపెను.
బాణములచే కొట్టబడుచున్న రాక్షసులకు ఆ పురంజయుని బాణములకు ఎదురుగా నిలబడుట ప్రళయకామునందలి అగ్నికి ఎదురుగా నిలబడుట వలె దుస్సహమాయెను. వారాయన ఎదుట పడకుండా తప్పించు కోని తన నివాసము (పాతాళము) నకు పారిపోయిరి.
రాజర్షియగు ఆ పురంజయుడు సంపదలతో కూడియున్న రాక్షసుల నగరమును, వారి సకలధనమును జయించి వజ్రపాణియగు ఇంద్రునకు సమర్పించెను. పురమును జయించుటచే పురంజయుడనియు, ఎద్దు మూపురము పై కూర్చుండుటచే కకుత్స్థుడనియు, ఇంద్రుడు వాహనముగా గలవాడగుటచే ఇంద్రవాహుడనియు పేర్లతో ఆయన వ్యవహరించబడెను.
పురంజయుని పుత్రుడు అనేనసుడు. అనేనసుని పుత్రుడు పృథువు. పృథుని పుత్రుడు విశ్వరంధి. విశ్వరంధి పుత్రుడు చంద్రుడు. చంద్రుని పుత్రుడు యువనాశ్వుడు.
ఆ యవనాశ్వుని పుత్రుడు శాబస్తుడు. ఆయన శాబస్తీ నగరమును నిర్మించెను. ఆయన పుత్రుడు బృహదశ్వుడు కాగా, బృహదశ్వుని పుత్రుడు కువలయాశ్వకుడు.
ఆ కువలయాశ్వకుడు బలశాలి. ఆయన ఉత్తంక మహర్షికి ప్రీతిని కలిగించుట కొరకై తన ఇరవై ఒక్క వేల పుత్రులతో చుట్టువారబడినవాడై ధుంధువు అని ప్రసిద్ధి గాంచిన రాక్షసుని సంహరించెను.
కువలయాశ్వకుడు ధుంధుమారుడు (ధుంధువును చంపినవాడు) అనీ ఖ్యాతిని పొందెను. ఆయన పుత్రులు ఇరవై ఒక్క వేలమందిలో ముగ్గురుని మినహాయించి మిగిలినవారు అందరు ధుంధువు నోటినుండి వెలువడే అగ్నిలో కాలిపోయిరి.
భరత వంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! దృఢాశ్వుడు, కపిలాశ్వుడు, భద్రాశ్వుడు అనునవి వారి ముగ్గురి పేర్లు. దృఢాశ్వునీ పుత్రుడు హర్యశ్వుడు కాగా, హర్యశ్వుని పుత్రుడు నికుంభుడు.
నికుంభుని పుత్రుడు బర్హణాశ్వుడు. బర్హణాశ్వుని పుత్రుడు కృశాశ్వుడు. కృశాశ్వుని పుత్రుడు సేనజిత్తు. సేనజిత్తు పుత్రుడు యువనాశ్వుడు. సంతానము లేని యువనాశ్వుడు దుఃఖితుడై వందమంది భార్యలతో గూడి వానప్రస్థాశ్రమము (అడవికి తపస్సునకై వెళ్లుట) లోనికి వెళ్లాను. అచట దయామయులగు మహర్షులు చాల ఏకాగ్రమగు చిత్తముతో ఈయ నచే ఇంద్రదేవతాకమైన యాగమును చేయించిరి.
యువనాశ్వ మహారాజునకు రాత్రి చాల దాహము వేసెను. ఆయన యజ్ఞశాలలో ప్రవేశించి చూడగా, అచట వేదవేత్తలు నిద్రించుచుండిరి. అపుడాయన తానే మంత్రించిన నీటిని తీసుకొని త్రాగేను.
ఓ పరీక్షిన్మహారాజా! ఆ మహర్షులు నిద్ర లేచి నీరు లేని కలశమును చూచి వెంటనే ఇట్లు ప్రశ్నించిరి -- ఇది యెవరి పని? పుత్రసంతానమును కలిగించే నీటిని త్రాగినదెవరు?
అప్పుడు ఈశ్వరునిచే పేరితుడైన మహారాజే ఆ నీటిని త్రాగినాడని తెలిసి ఆ మహర్షులు ఆశ్చర్యపడి, ఆహా! దైవబలమే బలము, అంటూ ఈశ్వరుని కోరకు నమస్కారమును చేసిరి.
తరువాత కాలము సంప్రాప్తమైనప్పుడు యువనాశ్వుని ఉదర మును కుడివైపు పగులగొట్టి పుత్రుడు పుట్టెను. ఆతడు చక్రవర్తి ఆయెను.
ఈ పిల్లవాడు చనుబాల గురించి అధికముగా వెక్కి వెక్కి ఏడ్చు. చున్నాడు. ఈ బాలుడు ఏమి త్రాగవలెను?(అని మహర్షులు పలికిరి). నన్ను (నా వేలిని త్రాగగలడు. బాబూ! ఏడ్వకుము, అంటూ ఇంద్రుడు తన చూపుడు వేలిని ఆ బాలుని నోటియందు ఉంచెను.(ఇంద్రుడు మాం ధాతా - నన్ను త్రాగగలడు, అని చెప్పుట వలన ఆ బాలకునకు మాంధాత అనే పేరు కలిగెను).
ఆ పిల్లవాని తండ్రియగు యువనాశ్వుడు దేవతల మరియు మహర్షుల అనుగ్రహము వలన మరణించలేదు. ఆయన అచటనే తపస్సును చేసి మోక్షమును పొందెను.
ఓ రాజా! ఇంద్రుడు ఆ బాలకునకు త్రసద్దస్యువు అని పేరు పెట్టెను. ఏలయనగా, ప్రజలకు ఉపద్రవమును కలిగించే రావణుడు మొదలగువారు ఆతని కారణముగా ఆందోళన చెంది భయపడెదరు.
తరువాత యువనాశ్వుని పుత్రుడగు మాంధాత చక్రవర్తి శ్రీహరి యొక్క తేజస్సుచే సమర్థుడాయెను. ఆయన ఏకచ్ఛత్రాధిపతియై ఏడు ఖండములతో కూడియున్న భూమిని శాసించెను.
మాంధాత ఆత్మజ్ఞానియే అయిననూ, యజ్ఞస్వరూపుడగు శ్రీహరిని అధికమగు దక్షిణలు గల యజ్ఞములతో ఆరాధించేను. సర్వదేవ తాస్వరూపుడగు శ్రీహరి సర్వమునకు ఆత్మ. స్వయంప్రకాశస్వరూపుడగు శ్రీహరి ఇంద్రియగోచరుడు కాడు.
పురోడాశము మొదలైన ద్రవ్యము, మంత్రము, విధి, యజ్ఞము, యజమానుడు, ఋత్విక్కులు, ధర్మము, దేశకాలములు అనే ఈ సర్వము ఆ శ్రీహరి స్వరూపమే.
ఎక్కడనైతే సూర్యుడు ఉదయిస్తాడో, ఎక్కడ అస్తమిస్తాడో, ఆ రెండు స్థానముల మధ్యనున్న భూభాగమంతయు మాంధాతయొక్క సామ్రాజ్యమేనని పెద్దలు చేప్పెదరు.
మాంధాత శశబిందువు కుమార్తెయగు బిందుమతియందు పురుకుత్సుడు, అంబరీషుడు మరియు యోగి. ముచుకుందుడు అనే ముగ్గురు పుత్రులను, ఏభైమంది అమ్మాయిలను కనెను. ఆ అమ్మాయిలు సౌభరిని భర్తగా వరించిరి.
సౌభరి మహర్షి యమునానది నీటియందు మునిగి తపస్సు చేయుచుండగా, సంభోగధర్మమునందున్న చేపల రాజుయొక్క సుఖానుభవము ఆయన కంటబడెను. దానిచే ఆయనయందు కామన పుట్టి, మాంధాత మహారాజును తనకు ఒక కన్యను ఇచ్చి వివాహము చేయుమని కోరెను. అపుడా మహారాజు ఇట్లు పలికెను -- ఓ మహర్షీ! స్వయంవరములో మీకు నచ్చిన కన్యను మీరు స్వీకరించుడు.
ఆ సౌభరి ఇట్లు తలపోసెను -- వీడు దేహము ముడతలు పడి జుట్టు నెరసియున్న ముసలివాడు; తల వణుకుతో ప్రీతిని కలిగించని ఈతనిని యువతలు ఇష్టపడరు; అని తలచి ఈ మహారాజు నాకు ఇట్టి బదులు (స్వయంవరమని) చెప్పినాడు.
దేవతాస్త్రీలు కూడ నన్ను ఇష్టపడే విధముగా నన్ను నేను మార్చుకొనెదను. ఇక మహారాజుల స్త్రీలు నన్ను ఇష్టపడెదరని వేరుగా చెప్పవలయునా? ఈ విధముగా సర్వసమర్థుడగు సౌభరి నిశ్చయించు కొనెను.
సౌభరి మహర్షిని ద్వారపాలకుడు సమృద్ధితో నిండియున్న రాజకన్యల అంతఃపురములోనికి ప్రవేశ పెట్టెను. ఏభైమంది రాజకన్యలు ఆయనను ఒక్కనినే భర్తగా వరించిరి.
ఈతడు నాకు తగ్గవాడే గానీ, నీకు కాదు -- అంటూ ఆ రాజకు మార్తెలు తమ మధ్యనుండే ప్రేమను విడిచి పెట్టి భర్త విషయమై అధిక ముగా కలహించుకొనిరి. వారి మనస్సు ఆయన పైన మాత్రమే లగ్నమై యుండెను.
ఋగ్వేదాధ్యాయియగు ఆ సౌభరి మహర్షి అంతులేని తన తపస్సుయొక్క సమృద్ధి కారణముగా ఆ రాజకుమార్తెలతో గూడి మిక్కిలి విలువైన ఉపకరణములతో కూడియున్న ప్రాసాదమునందు రమించెను. ఆ ప్రాసాదమునందలి స్త్రీపురుషులు చక్కగా అలంకరించుకొని యుండెడివారు. ఆయన తన భార్యలతో గూడి సర్వకాలములలో మిక్కిలి విలువైన శయ్యలను, ఆసనములను, వస్త్రములను, భూషణములను, స్నానముల ను, అనులేపములను, భోజనములను, మాలలను అనుభవించేను. పలువి ధముల ఉద్యానములయందు చెంగల్వల గుంపులతో ప్రకాశించే స్వచ్చజ లముల సరస్సులలో క్రీడించెను. ప్రాసాదమునందు వందిమాగధులు, ఉద్యానములయందు పక్షులు, చెంగల్వల సరస్సులయందు తుమ్మెదలు ఆయన వెనుక గానము చేసెడివి.
ఏడు ఖండముల పృథివికి ప్రభువగు మాంధాత కూడ చక్రవర్తి యొక్క సమృద్ధితో కూడియున్న ఆ సౌభరియొక్క గృహస్థజీవితమును చూచి ఆశ్చర్యపడి (తాను సార్వభౌముడననే) గర్వమును విడిచి పెట్టెను.
ఈ విధముగా సౌభరి గృహస్థ భోగములయందు తగుల్కొని, కన్ను-ముక్కు మొదలగు భోగసాధనములగు ఇంద్రియముల ద్వారా రూపము-గంధము మొదలగు విషయభోగములననుభవించెను. నేతిచుక్కలను వేయుచున్నచో, మంట చల్లారదు. అదే విధముగా, ఇంద్రియభోగములనెంత అనుభవించిననూ, ఆయనకు సంతుష్టి కలుగలేదు.
ఋగ్వేదాచార్యుడగు సౌభరి ఒకనాడు ప్రశాంతముగా కూర్చుని యుండెను. చేపల కలయికను చూచీన కారణముగా తన మనస్సునకు ఆసక్తి కలిగి తపస్సునకు హాని కలిగినదని ఆయన గ్రహించెను.
అయ్యో! జనులారా! మంచి నడవడియే నిష్ఠగా తపస్సును చేసిన నాకు పట్టిన ఈ వినాశమును చూడుడు. నేను నీటి లోపల చేపల కలయికను చూచి, చిరకాలము పట్టుతో చేసిన తపస్సునుండి జారిపోయితిని.
మోక్షమును కోరే సాధకుడు దాంపత్యధర్మము గలవారల సంగమును విడిచి పెట్టవలెను. సాధకుడు ఇంద్రియములను బాహ్యమునందలి విషయములయందు ప్రవర్తిల్లనీయరాదు. సాధకుడు ఏకాంతములో ఒంటరియై మనస్సును అనంతుడగు ఈశ్వరునియందు లగ్నము చేయవలెను. సాధకుడు సంగము చేస్తే, ఆ భగవంతుని ఉపాసించే సత్పురుషులతో మాత్రమే చేయవలెను.
నేను ముందులో ఒంటరిగా తపస్సు చేసుకోనెడివాడను. ఇంతలో నీటియందు చేపల కలయికను చూసి, తరువాత ఏభైమంది భార్యలతో మరియు అయిదు వేలమంది పుత్రులు-పుత్రికలు-పరిచారకలు మొదలగు వారితో తాదాత్మ్యమును పొంది ఏభైగను, అయిదు వేలుగను అయితిని. మాయాశక్తియొక్క మూడు గుణములచే నా వివేకము అపహరించబడుట చే, ఇహపరముల కర్మలకు చెందిన కోరికల అంతమును నేనింకనూ చేరలే కున్నాను. ఇంద్రియభోగములే పురుషార్థమనే బుద్ధిని కలిగియున్నాను.
ఈ విధముగా సౌభరి చాల కాలము గృహములోనుండి, తరువాత భోగములను త్యజించి అడవికి (తపస్సు కొరకై) వెళ్లాను. ఆయన భార్యలకు భర్తయే దైవము. వారు కూడ ఆయన వెంట వెళ్లిరి.
వివేకియగు ఆ సౌభరి ఆ అడవియందు కఠోరమైన తపస్సును చేయగా, ఆయన దేహము చిక్కిపోయెను. ఆయన అగ్నులను తన యందు ఆరోపించుకొని జీవభావమును పరమాత్మయందు విలీనము చేసెను (మోక్షమును పొందెను).
ఓ పరీక్షిన్మహారాజా! తమ భర్తయగు సౌభరి పరమాత్మయందు లయమై మోక్షమును పొందుటను ఆయన భార్యలు చూచిరి. ఆయన మహిమచే, చల్లారిన అగ్నియందు జ్వాలలు విలీనమయ్యే తీరున, వారు కూడ ఆయనను అనుసరించిరి (మోక్షమును పొందిరి).
శ్రీమద్బాగవత మహాపురాణమునందు తొమ్మిదవ స్కంధములో మాంధాత చరీతమును, సౌభరి చరితమును వర్ణించే ఆరవ అధ్యాయము ముగిసినది (6).
