శ్రీ మద్భాగవతము - నవమ (9వ) స్కందము
16 - పరశురామ చరితము - శునశ్శేపోపాఖ్యానము
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- కురువంశము నానందింపజేసే ఓ పరీక్షిన్మహారాజా! తండ్రి ఈ విధముగా ఆదేశించగా, పరశురాముడు సరే యని పలికెను. అపుడాయన సంవత్సరకాలము నిరంతరముగా తీర్థ స్థలములలో సంచరించి ఆశ్రమమునకు తిరిగి వచ్చెను.
ఒకనాడు రేణుక (పరశురాముని తల్లి) గంగానదీతీరమునకు వెళ్లేను. అచట ఆమెకు పద్మముల మాలను ధరించి అప్సరసలతో గూడి విహరి స్తున్న గంధర్వరాజు చిత్రరథుడు కనబడెను.
నీటికొరకై గంగానదికి వెళ్లిన రేణుకాదేవి జలకాలాడుచున్న చిత్రరథుని చూస్తు భర్త హోమమునకు సమయమాసన్నమైనదనే సంగతిని విస్మరించెను. పైగా, ఆమెకు కొద్దిగా చిత్రరథునిపై కోరిక కూడ కలిగెను.
ఆ విధముగా కాలము అతీతమగుటను ఆమె గమనించి, జమ దగ్ని మహర్షి శాపమునిచ్చునేమో యని భయపడెను. ఆమె తిరిగి వచ్చి నీటి కలశమును మహర్షి యెదుటనుంచి చేతులు జోడించి నమస్కరించి నిలబడెను.
జమదగ్ని మహర్షికి తన భార్య మానసికముగా పరపురుషుని కోరినదని తెలిసిపోయెను. ఆయన తీవ్రముగా కోపించి, ప్రియమగు పుత్రులారా! ఈ పాపిని సంహరించుడు, అని ఆదేశించెను. కానీ, వారా ఆదేశ మును పాటించలేదు.
తండ్రియగు జమదగ్ని ఆజ్ఞాపించగా పరశురాముడు తల్లిని, సోద రులను కూడ సంహరించేను. ఎందుకంటే, జమదగ్ని మహర్షికి ఉన్న యోగ-తపశ్శక్తుల ప్రభావమును ఆయన బాగా యెరుగును.
సత్యవతీపుత్రుడగు జమదగ్ని చాల సంతోషించి పరశు రాముని వరమును కోరుమని ప్రోత్సహించేను. మరణించిన తల్లి, సోదరులు తిరిగి జీవించవలెననియు, వారికి తాము సంహరించబడితిమనే స్మృతి ఉండకూ డదనియు ఆయన వరమును కోరెను.
వారు నిద్రనుండి లేచినారా యన్నట్లు అనాయాసముగా క్షేమ ముగా లేచి నిలుచుండిరి. తండ్రియొక్క తపశ్శక్తి తెలిసినవాడగుట చేతనే పరశురాముడు తాను ప్రేమించే తల్లిని, సోదరులను సంహరించెను.
ఓ పరీక్షిన్మహారాజా! కార్తవీర్యార్జునుని పుత్రులను పరశురాముడు పరాజితులను చేసెను గదా! వారు తమ తండ్రియొక్క వధను స్మరిస్తూ ఎక్కడనైననూ సుఖమును పొందలేకపోయిరి.
ఒకనాడు పరశురాముడు సోదరులతో గూడి అడవికి వెళ్లాను. దానిని అవకాశముగా చేసుకొని కార్తవీర్యుని పుత్రులు తమ పాత వైర మును సాధించగోరి ఆశ్రమమునకు వచ్చి పడిరి.
జమదగ్ని మహర్షి అగ్నిహోత్ర గృహములో కూర్చుండి అంతఃకర ణమును పవిత్రకీర్తియగు శ్రీహరి భగవానునిపై నిలిపి యుంచెను. పాపక ర్మను చేయుటకే నిశ్చయించుకున్న ఆ కార్తవీర్యుని పుత్రుల కంట ఆయన పడెను. వారాయనను సంహరించిరి.
ఆ క్షత్రియాధములు మిక్కిలి క్రూరులు. పరశురాముని తల్లియగు రేణుక దీనముగా బ్రతిమిలాడిననూ, వారు వినిపించుకోలేదు. వారు ఆ జమదగ్ని తలను బలాత్కారముగా నరికి తమతో తీసుకుపోయిరి.
పతివ్రతయగు రేణుకాదేవి శారీరక మానసిక వ్యథలచే పీడించబ డుతూ తన గుండెలపై తానే బాదుకుంటూ, ఓ పుత్రా! రామా! రామా! రమ్ము, అని బిగ్గరగా ఆక్రోశించెను.
పరశురాముడు ఆశ్రమమునకు దూరమునందుండగనే ఓ రామా! అనే ఆక్రందనమును వినెను. ఆ ఆక్రందనములో దుఃఖము మిళితమై యుండెను. దానిని విని ఆయన వేగముగా ఆశ్రమమును చేరెను. ఆయ నకు సంహరించబడిన తన తండ్రి కనబడెను.
అప్పుడు శరీరపీడ, ఉక్రోషము, అధికమగు మానసిక దుఃఖము అనువాటి వేగముచే పరశు రాముడు వ్యామోహితుడాయెను. ఆయన ఇట్లు విలపించెను -- అయ్యో! ఓ తండ్రీ! నీవు ధర్మమునందు నిష్ఠగల సాధు పురుషుడవు. నీవు మమ్ములను విడిచి పెట్టి స్వర్గమును చేరితివి.
పరశు రాముడు ఈ విధముగా విలపించి, తండ్రి దేహమును సోద రులకు అప్పజెప్పి, తాను గండ్ర గొడ్డలిని పట్టుకొని, క్షత్రియులను వినా శము చేయుటకు నిశ్చయించుకొనెను.
ఓ పరీక్షిన్మహారాజా! బ్రహ్మహత్య చేసిన రాజకుమారుల నిమిత్త ముగా మాహిష్మతీ నగరముయొక్క శోభ నష్టమయ్యెను. పరశు రాముడు ఆ రాజకుమారుల తలలతో నగరమధ్యములో పెద్ద పర్వతమును నిలబెట్టి, వారి రక్తముతో ఘోరమైన నదిని నిర్మాణము చేసెను.
ఓ పరీక్షిన్మహారాజా! క్షత్రియులు అత్యాచారములను చేయుచుం డెను. అప్పుడు సర్వసమర్థుడగు పరశు రాముడు తన తండ్రి వధను నిమి త్తముగా చేసుకొని, ఇరవై ఒక్క పర్యాయములు భూమిపై క్షత్రియులు లేకుండా చేసెను. ఆయన కురుక్షేత్రమునందలి సమంతపంచకమునందు వారి రక్తజలముతో నిండియున్న అయిదు సరస్సులను నిర్మించెను.
ఆయన తండ్రి తలను తెచ్చి దర్భలయందు మొండెముతో అతి కించెను. ఆయన తానే యగు సకలదేవతాస్వరూపుడైన శ్రీహరి భగ పొనుని యజ్ఞములతో ఆరాధించెను.
ఆయన తూర్పు దిక్కును హోతకు, దక్షిణ దిక్కును బ్రహ్మకు, పడమర దిక్కును అధ్వర్యునకు, ఉత్తర దిక్కును ఉద్గాతకు ఇచ్చెను.
ఆయన ప్రస్తోత మొదలగు ఇతరులైన ఋత్విక్కులకు ఆగ్నే యము మొదలగు విదిక్కులను, కశ్యపునకు మధ్యభాగమును, యజ్ఞము. లోని హెచ్చుతగ్గులను సర్దుబాటు చేసే ఉపద్రష్టకు ఆర్యావర్తమును, యజ్ఞములను చూచే సభాసదులకు మధ్యభాగము తరువాత ఉన్న భూభా గమును ఇచ్చెను.
తరువాత ఆయన వేదరూపిణియగు సరస్వతీనదియందు అవభృ థస్నానమును చేసి సకలపాపములనుండి వినిర్ముక్తుడాయెను. ఆ నదీతీర మున ఆయన మేఘములు తొలగిపోయిన సూర్యుడు వలే ప్రకాశించెను.
ఆ జమదగ్నికి స్మరణరూపము (సంకల్పమయము) అగు దేహ ము లభించెను. ఆయన పరశురాముని పూజలనందుకొని, సప్తర్షిమండల ములో ఏడవ మహర్షి ఆయెను.
ఓ పరీక్షిన్మహారాజా! జమదగ్ని పుత్రుడు, కలువ కన్నులవాడు అగు పరశురామ భగవానుడు రాబోయే (సావర్టీ) మన్వంతరములో వేద ములను నిశ్చయముగా ప్రవర్తిల్ల జేసే మహర్షి (వేదాచార్యుడు) కాగలడు.
పరశురాముడు ఈ నాటికి మ హేంద్ర పర్వతముపై ఉన్నాడు. ఆయన ఇతరులను శిక్షించుట మొద లైన హింసను విడనాడి, ప్రసన్నమగు అంతఃకరణమును కలిగియున్నాడు. సిద్దులు, గంధర్వులు, చారణులు ఆయన చరితమును కీర్తించుచుందురు.
జగద్రూపుడు, జగత్తునకు ఆత్మ, జగన్నాథుడు అగు శ్రీహరి భగవానుడు ఈ విధముగా భృగువంశీయులయందు పరశురాముడై అవత రించి, భూమికి పెద్ద భారముగా తయారైన అనేక మహారాజులను సంహ రించెను.
గాధియొక్క పుత్రుడు విశ్వామిత్రుడు. చక్కగా ప్రజ్వరిల్ల జేయబ డిన అగ్నివలె ఆయన గొప్ప తేజశ్శాలి, ఆయన తపస్సుయొక్క ప్రభావ ముచే తన క్షత్రియత్వమును విడిచి పెట్టి బ్రహ్మవర్చస్సును పొందెను.
ఓ పరీక్షిన్మహారాజా! విశ్వామిత్రునకు నూటొక్కమంది పుత్రులు గలరు. వీరిలో మధ్యవాడు మధుచ్ఛందసుడు. వారందరు అదే పేరుతో మధుచ్ఛందసులు అనియే ప్రసిద్ధి గాంచిరి.
విశ్వామిత్రుడు భృగువంశీయుడగు శునశ్శేపుని తన పుత్రునిగా చేసుకొనెను. అజీగర్తుని పుత్రుడైన ఆ శునశ్శేపునకే దేవరాతుడు (దేవత లచే ఈయబడినవాడు) అనియు పేరు గలదు. విశ్వామిత్రుడు తన పుత్రు లను ఆ శునశ్శేపుని అన్నగా చేసుకొనుడని ఆదేశించెను.
హరిశ్చంద్రుని యజ్ఞమునకు పురుషపశువుగా శునశ్శేపుని ఆతని తల్లిదండ్రులు అమ్మివేసిరి. అపుడాయన బ్రహ్మగారు మొదలైన దేవతలను స్తుతించి (యూపమునకు కట్టివేసిన) పాశముల బంధమునుండి విముక్తుడా యెను.
(హరిశ్చంద్రుని)వరుణయజ్ఞమునందు దేవతలు భృగువంశీయు డగు శునశ్శేపుని విముక్తుని చేసిరి. కావుననే, ఆయన గాధివంశీయులలో దేవరాతుడు (దేవలతలచే ఈయబడినవాడు) అని ప్రఖ్యాతిని గాంచినాడు.
మధుచ్ఛందసులలో పెద్దవారైన ఏభై మందికి శునశ్శేపుడు తమకు జ్యేష్ఠుడగుట మంచిది అనిపించలేదు. వారు అందుకు అంగీకరించ లేదు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి కోపించి వారిని, ఓరీ దుష్టులారా! మీరు మ్లేచ్చులు కండు, అని శపించెను.
తరువాత మధుచ్ఛందసుడనే ఆ మధ్యముడు ఏభైమంది కనిష్ణు లతో గూడి విశ్వామిత్ర మహర్షితో ఇట్లు పలికెను -- తమరు మాకు దేనిని ఆజ్ఞాపిస్తే (శునశ్శేపుని జ్యేష్ఠునిగా స్వీకరించుట), దానియందు మేము నిలిచి యుండెదము.
వారు మంత్రద్రష్టయగు శునశ్శేపుని పెద్ద అన్ననుగా స్వీకరించి, మేము నీ అనుయాయులము అని ఆయనతో చెప్పిరి. ఆ తన పుత్రులను ద్దేశించి విశ్వామిత్ర మహర్షి ఇట్లు పలికెను -- మీరు నా మర్యాదను పాలించి నన్ను యోగ్యులగు పుత్రులు గలవానినిగా చేసిరి. కావున, మీకు కూడ యోగ్యులగు పుత్రులు కలిగెదరు.
కుశవంశీయులగు ఓ పుత్రులారా! దేవరాతుడనే ఈ శునశ్శేపుడు నాకు యోగ్యుడైన పుత్రుడు, మీ గోత్రమునకు చెందిన కుశికుడే -- అని విశ్వామిత్రుడు పలికెను. విశ్వామిత్రునకు అష్టకుడు, హారీతుడు, జయుడు, క్రతుమంతుడు, గాలవుడు మొదలగు ఇతరపుత్రులు కూడ గలరు.
ఈ విధముగా విశ్వామిత్రుని పుత్రులలో కొందరు శపించబడి, కొందరు అనుగ్రహించబడుటచే, కౌశికగోత్రము పలువిధములుగా అయిన ది. పైగా, కౌశికులగు విశ్వామిత్ర పుత్రులు ఈ విధముగా దేవరాతుని అన్నగా స్వీకరించుటచే వారి ప్రవర కూడ మారి, వారు దేవరాత ప్రవర గలవారైరి.
శ్రీమద్బాగవత మహాపురాణమునందు తొమ్మిదవ స్కంధములో పరశురాముని చరితమును మరియు శునశ్శేపుని గాథను వర్ణించే పదునారవ అధ్యాయము ముగిసినది .
