శ్రీ మద్భాగవతము - నవమ (9వ) స్కందము

Table of Contents

8 - సగరుని చరితము

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- రోహితుని పుత్రుడు హరితుడు. హరితుని పుత్రుడు చంపుడు. ఆయన చంపాపురిని నిర్మించెను. చంపుని పుత్రుడు సుదేవుడు. సుదేవుని పుత్రుడు విజయుడు.

ఆ విజయుని పుత్రుడు భరుకుడు. భరుకుని పుత్రుడు వృకుడు. వృకుని పుత్రుడు బాహుకుడు. బాహుక మహారాజుయొక్క రాజ్యమును శత్రువులు లాగుకొనగా, ఆయన భార్యతో గూడి అడవికి వెళ్లాను.

బాహుకుడు వృద్దుడై మరణించెను. ఆయన భార్య ఆయన వెంట మరణించుటకు సిద్దమాయెను. కాని, ఆమె గర్భవతి యని తెలుసుకున్న ఔర్వ మహర్షి ఆమెను వారించెను.

ఈమె గర్భవతి అనే విషయము తెలిసి సవతులు ఆమెకు అన్నములో విషమును కలిపి పెట్టిరి. అయిననూ, పిల్లవాడు ఆ విషముతో కూడియే పుట్టి సగరుడు (గరముతో, అనగా విషముతో కూడినవాడు) అని ప్రఖ్యాతి గాంచి, గొప్ప కీర్తిని పొందెను.

సగరుడు చక్రవర్తి ఆయెను. ఆయన పుత్రులు సముద్రమును త్రవ్విరి. గురువగు ఔర్వునియొక్క వచనముచే సగరుడు తాలజంఘులను, యవనులను, హైహయులను, బర్బరులను సంహరించకుండా, వారిని వికృతవేషము గలవారుగా చేసెను.

కొందరిని బోడిగుండులను, మరికొందరు గెడ్డమును, కొందరు విరబోసిన జుట్టును, మరికొందరు సగము గుండును కలిగియుండునట్లుగా ఆయన చేసెను. వారిలో కొందరికి పై వస్త్రము మాత్రమే ఉండునట్లు, మరికొందరికి పై వస్త్రము లేని విధముగా ఆయన చేసెను.

సకలప్రాణులలో ఆత్మరూపుడైయున్న శ్రీహరియే సకలవేదముల రూపములో మరియు దేవతల రూపములో ప్రకటమైనాడు. సగరుడు జగ న్నాథుడగు ఆ శ్రీహరిని అశ్వమేధయాగములను చేసి ఆరాధించెను. ఆ రాజు ఔర్వమహర్షి బోధించిన పద్ధతిలో ఆ యాగములననుష్ఠించెను.

ఆ సగరుడు అశ్వమేధమును చేస్తూ యజ్ఞపశువగు గుర్రమును (సంచారము కొరకై) విడిచి పెట్టెను. దానిని ఇంద్రుడు అపహరించెను.

సుమతి (సగరుని ఒక భార్య) పుత్రులు గర్వించినవారు. వారు తండ్రి ఆదేశమును పాలించువారై గుర్రమును వెదుకుతూ భూమిని అన్ని వైపులా త్రవ్విరి.

అరవై వేలమంది సగరపుత్రులు ఈశాన్యదిక్కునందు కపిలభగవానుని సమీపములో గుర్రమును చూచిరి. గుర్రమును అపహరించిన చోరుడు వీడే; (కపటియై) కన్నులను మూసుకొని యున్నాడు; ఈ పాపిని చంపుడు! చంపుడు! అంటూ వారు ఆయుధములను పైకెత్తి ఆయనకు యెదురుగా వెళ్లిరి. అపుడా కపిల మహర్షి కన్నులను తెరచి చూచెను.

మహేంద్రుడు చేసిన మోసము (గుర్రమును కపిలుని ప్రక్కన కట్టి వేయుట) చే ఆ సగరపుత్రులు వ్యామోహితులై మహాత్ముడగు కపిలుని యెడల అపరాధమును చేసిరి. ఆ అపరాధమే వారిని చంపినది. వారి దేహములలోని అగ్నియే వారిని పూర్తిగా క్షణములో బూడిదగా చేసినది.

సగరమహారాజుయొక్క పుత్రులు కపిల మహర్షియొక్క కోపా గ్నిచే దహించబడినారు అనే మాట సరిగాదు. సత్త్వగుణనిధానమగు కపిల భగవానుడు జగత్తును పావనము చేసే రూపము గలవాడు. ఆయన యందు తమోగుణప్రధానమగు క్రోధము ఉండునని ఊహించగలమా?(లేము). భూమియొక్క దుమ్ముతో ఆకాశమునకు సంసర్గమును భావన చేయ గలమా?(లేము).

కపిల మహర్షి సాంఖ్యము రూపములో దృఢమైన నావను ఈ లోకములో ప్రవర్తిల్ల జేసెను. మోక్షమును కోరే సాధకుడు ఆ నావతో దాట శక్యము కాని మృత్యుమార్గమైన సంసారమనే సముద్రమును తరించగల్గును. కపిల మహర్షి సర్వజ్ఞుడు, పరమాత్మ స్వరూపుడు. ఆయనకు శత్రుమిత్రులనే భేదబుద్ధి ఎట్లు ఉండును?(ఉండదు).

సగర మహారాజునకు కేశిని అనే మరో భార్యయందు అసమంజసుడు అనే పుత్రుడు కలిగెను. అసమంజసుని పుత్రుడు అంశుమంతుడనే పేరుతో ప్రసిద్ధి గాంచెను. అంశుమంతుడు తన తాతయగు సగరునకు హితమును చేయుటయందు ప్రీతిని కలిగి యుండెను.

అసమంజసుడు పూర్వజన్మలో యోగియై సంగము (బంధుమి త్రాదులయందలి ఆసక్తి) కారణముగా యోగాభ్యాసమునుండి విచలితుడై నాడు. ఆ పూర్వజన్మస్మృతి ఆయనకు గలదు. కావుననే, ఆయన తన పేరుకు తగ్గట్లుగా జనులకు తాను ప్రతికూలుడనే భావమును కలిగించెను.

అసమంజసుడు లోకములో నిందించబడే పనులను, బంధువులకు ప్రియము కాని పనులను చేసెడివాడు. ఆటలాడుచున్న పిల్లలను సరయూ నదిలో పారవేస్తూ, జనులకు భయమును గొల్పెడివాడు.

ఇటువంటి ప్రవర్తన గల అసమంజసుని సగర మహారాజు పుత్రపై మను త్రోసిపుచ్చి దేశమునుండి బహిష్కరించెను. యోగమహిమ గల ఆ అసమంజసుడు తాను నదిలో పారవేసిన పిల్లలను మరల వారి తల్లిదండ్రులకు అప్పజెప్పి, తాను అయోధ్యను వీడి అడవికి వెళ్లిపోయెను.

ఓ పరీక్షిన్మహారాజా! అయోధ్యానగరప్రజలు అందరు తిరిగి వచ్చిన పిల్లలను చూచి విస్మయమును చెందిరి. సగర మహారాజు కూడ (అ సమంజసుని బహిష్కరించినందుకు) పశ్చాత్తాపమును పొందెను.

గుర్రమును వెదుకుమని సగర మహారాజు అంశుమంతుని ఆదేశించెను. ఆయన తన పినదండ్రులు త్రవ్విన మార్గము వెంట వెళ్లగా, బూడిదకు సమీపమునందున్న గుర్రము కనబడెను.

అచట కపిలమహర్షిగా అవతరించియున్న శ్రీహరి కూర్చుండి యుండెను. అంశుమంతుడు గొప్పవాడు. ఆయన దోసిలి యొగ్గి నమస్క రించి, ఏకాగ్రమగు చిత్తముతో ఆ మహర్షిని స్తుతించెను.

అంశుమంతుడిట్లు పలికెను --- స్వయంభువుడగు బ్రహ్మగారైననూ తనకంటే అతీతుడవైన నిన్ను ఈ నాటికీ సమాధియందు చూడలేకున్నారు, యుక్తులతో తెలియలేకున్నారు. అట్టిచో, ఆ బ్రహ్మగారి మనస్సు శరీరము-బుద్దుల ద్వారా సృష్టించబడిన దేవతలు-పశువులు-మానవులు అనే వివిధసృష్టులలో అంతర్గతులమై అజ్ఞానులమగు మేము నిన్ను తెలియజాలమని వేరుగా చెప్పవలయునా?

సత్త్వరజస్తమోగుణముల అధీనములోనుండి శ్రీహరియొక్క మాయచే మోహితమైన బుద్ధి గల జనులు దేహముతో తాదాత్మ్యమును పొందినవారై బాహ్యవిషయములను తెలియుచుందురే గాని, తమయందే ఆత్మరూపముగానున్న నిన్ను గుర్తించలేరు. వారికి జాగ్రత్స్వప్నముల యందు బాహ్యమునందలి శబ్దాది విషయములు, నిద్రయందు అజ్ఞానము  మాత్రమే అనుభవమునకు వచ్చుచుండును.

మాయాశక్తియొక్క సత్త్వరజస్తమోగుణములు భేదబుద్దిని కలిగించి జనులను వ్యామోహములో పడవేయుచుండును. కాని, సనకసనందనాదులు ఆత్మస్వరూపమునందలి నిష్ఠచే ఆ వ్యామోహమును నశింపజే సుకున్నారు. అట్టి జ్ఞానులు నిన్ను ధ్యానించెదరు. శుద్ద జ్ఞప్తి స్వరూపుడవగు అట్టి నిన్ను మూడుడనగు నేను ఎట్లు ధ్యానించ (విచారము చేసి తెలియ) గల్గుదును?

జీవులు మాయాశక్తియొక్క గుణములకు అధీనులై కర్మలను చేసి దేహములను పొందుచుందురు. కాని, పుణ్యపాపములనుండి విముక్తుడవగు నీయందు మాయాశక్తి, దాని గుణములు, తతయుక్తములగు కర్మలు, వాటిచే ఈయబడే దేహములు అనునవి లేవు. కార్యకారణములకు, నామరూపములకు అతీతుడవగు నీవు జ్ఞానమును ఉపదేశించుటకై దేహమును స్వీకరించి (అవతరించి) నావు. కాలాతీతుడవు, పూర్ణుడవు అగు నిన్ను మేము నమస్కరించుచున్నాము.

ఈ లోకము నీ మాయాశక్తిచే రచించబడినది. కామము, లోభము, ఈర్ష్య, మోహము (వివేకము లేకుండుట) అనువాటిచే జనుల బుద్దులు విశేషముగా భ్రమకు లోనగుచుండును. అట్టి జనులు ఇల్లు-వాకిలి-ధనము మొదలగునవి శాశ్వతమని భావిస్తూ (సంసారములో) తిరుగాడుచుందురు.

ఓ భగవానుడా! సకలప్రాణుల ఆత్మవు నీవే. మాకు ఉండే వ్యామోహమనే పాశము కామనలకు, వాటిచే ప్రేరితములైన కర్మలకు, వాటికి ఆశ్రయమగు ఇంద్రియములకు మూలమై యున్నది. ఈ నాడు నిన్ను దర్శించుటచే దృఢమగు ఆ మోహపాశము తెగిపోయినది.

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! కపిల మహర్షి మహిమను అంశుమంతుడు ఈ విధముగా కీర్తించెను. అప్పుడు భగవానుడు ఆయనను అనుగ్రహించ సంకల్పించి, ఇట్లు పలికెను.

శ్రీభగవానుడిట్లు పలికెను --- ఓ కుమారా! ఈ గుర్రము నీ తాత గారి యజ్ఞపశువు. దీనిని తీసుకు వెళ్లుము. నీ తండ్రులు ఇచట దహించబడి బూడిదయైనారు. వీరికి గంగాజలములతో తర్పణములను చేయుట యోగ్యముగా నుండును. వీరి ఉద్ధారమునకు మరియొక ఉపాయము లేదు.

అంశుమంతుడు ఆ కపిల మహర్షికి ప్రదక్షిణము చేసి తల వంచి నమస్కరించి ప్రసన్నునీ చేసుకొనెను. అపుడాతడు గుర్రమును తీసుకువచ్చెను. సగరుడా యజ్ఞపశువుతో అశ్వమేధ యాగములో మిగిలియున్న కర్మకాండను పూర్తి చేసెను.

సగరుడు రాజ్యమును అంశుమంతునకు అప్పజెప్పెను. ఆయ నకు కోరికలేమియు లేవు. ఆయన ఔర్వుడు ఉపదేశించిన ఉపాయముననుష్ఠించి, అజ్ఞానబంధమునుండి విముక్తుడై సర్వోత్తమమైన గతి (మోక్షము) ని పొందెను.

శ్రీమద్బాగవత మహాపురాణమునందు తొమ్మిదవ స్కంధములో సగరుని వృత్తాంతమును వర్ణించే ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (8).