శ్రీ మద్భాగవతము - నవమ (9వ) స్కందము
23 - యయాతి పుత్రులగు అను – ద్రుహ్యు - తుర్వసు యదువుల వంశముల వర్ణనము
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- (యయాతి పుత్రుడగు) అనువునకు సభానరుడు, చక్షువు, పరోక్షుడు అనే ముగ్గురు పుత్రులు ఉండిరి. సభానరునీ పుత్రుడు కాలనరుడు. కాలనరునీ పుత్రుడు సృంజయుడు. సృంజయుని పుత్రుడు జనమేజయుడు. జనమేజయుని పుత్రుడు మహాశీలుడు. మహాశీలుని పుత్రుడు మహామనసుడు. మహామనసునకు ఉశీనరుడు, తితిక్షువు అనే ఇద్దరు పుత్రులు ఉండిరి.
ఉశీనరునకు శిబి, వనుడు, శమి, దక్షుడు అనే నలుగురు పుత్రులు ఉండిరి. శిబికి కూడ వృషాదర్బుడు, సువీరుడు, మద్రుడు, కైకేయుడు అనే నలుగురు పుత్రులు ఉండిరి.(మహామనసుని పుత్రుడగు) తితిక్షువుయొక్క పుత్రుడు రుశద్రథుడు. రుశద్రథుని పుత్రుడు హేముడు. హేముని పుత్రుడు సుతపసుడు. సుతపసుని పుత్రుడు బలి.
బలి మహారాజుయొక్క భార్యయందు (ఉతథ్యుని పుత్రుడగు) దీర్ఘతమసుడనే మహర్షి వలన అంగుడు, వంగుడు, కలింగుడు, సుహ్ముడు, పుండ్రుడు, అంధ్రుడు అనే పుత్రులు కలిగిరి.
వారు తమ తమ పేర్లతో తూర్పు దిక్కునందు ఈ ఆరు రాజ్యములనేర్పాటు చేసిరి. అంగుని పుత్రుడు ఖనపానుడు. ఖనపానుని పుత్రుడు దివిరథుడు. దివిరథుని పుత్రుడు ధర్మరథుడు. ధర్మరథుని పుత్రుడు చిత్రరథుడు. చిత్రరథునకు సంతానము లేదు. ఆయనకే రోమపాదుడు అనే ప్రసిద్ధి కూడ గలదు. ఆయన దశరథుని మిత్రుడు.
దశరథుడు తన కుమార్తెను రోమపాదునకు పెంపుడు ఇచ్చెను. రోమపాదుని రాజ్యములో వర్షదేవుడు వర్షించకపోతే, సుందరులగు యువతులు హరిణీ-విభాండకుల పుత్రుడగు ఋష్యశృంగుని వద్దకు వెళ్లిరి. వారు ఆయన యెదుట సంగీతముతో మరియు వాద్యధ్వనులతో కూడిన నాట్యమును ప్రదర్శించిరి. ఆయన యెదుట విలాసలను ప్రదర్శించి, ఆయనను ఆలింగనము చేసుకొని, ఆయనకు బహుమతులనిచ్చి, రాజధానికి తీసుకు వచ్చిరి (అపుడు వర్షములు పడెను). ఆ ఋష్యశృంగుడు శాంతను వివాహ మాడెను.
ఆ ఋష్యశృంగుడు ఇంద్రదేవతాకమగు ఇష్టిని చేసి, దాని ప్రభావముచే రోమపాద మహారాజునకు సంతానము కలుగునట్లు చేసెను. అదే యాగముచే పుత్రసంతానము లేని దశరథుడు కూడ పుత్రులను గనెను.
రోమపాదుని పుత్రుడు చతురంగుడు. చతురంగుని పుత్రుడు పృథులాక్షుడు. పృథులాక్షునకు బృహద్రథుడు, బృహత్కర్ముడు, బృహదానువు అనే పుత్రులు గలరు. వారిలో మొదటివాడగు బృహద్రథుని పుత్రుడు బృహన్మనసుడు. బృహన్మనసుని పుత్రుడు జయద్రథుడని పురాణవేత్తలు చెప్పిరి.
ఆ జయద్రథునకు సంభూతియందు విజయుడు జన్మించెను. విజయుని పుత్రుడు ధృతి. ధృతియొక్క పుత్రుడు ధృతవ్రతుడు. ధృతవ్రతుని పుత్రుడు సత్కర్ముడు. సత్కర్ముని పుత్రుడు అధిరథుడు.
ఆ అధిరథునకు సంతానము లేకుండెను. కుంతీదేవి కన్యగనుండ గనే శిశువును కని ఆ శిశువు (కర్ణుడు) ను ఒక పెట్టెలో పెట్టి విడిచి పెట్టెను. అధిరథుడు గంగాతీరమునందు విహరిస్తూ ఆ శిశువును చేరదీసి తన పుత్రునిగా చేసుకొనెను.
మహారాజగు కర్ణునియొక్క పుత్రుడు వృషసేనుడు.(యయాతి పుత్రుడగు) ద్రుహ్యునియొక్క పుత్రుడు బభ్రువు. బభ్రువుయొక్క పుత్రుడు సేతువు. సేతువుయొక్క పుత్రుడు ఆరబ్దుడు. ఆరబ్దునియొక్క పుత్రుడు గాంధారుడు. గాంధారునియొక్క పుత్రుడు ధర్ముడు. ధర్ముని యొక్క పుత్రుడు ధృతుడు.
ధృతుని పుత్రుడు దుర్మనసుడు. దుర్మనసుని పుత్రుడు ప్రచేతసుడు. ప్రచేతసునకు వందమంది పుత్రులు కలిగిరి. వారు ఉత్తరదిక్కును ఆశ్రయించి, మ్లేచ్చులకు రాజులయిరి.(యయాతి పుత్రుడగు) తుర్వసుని పుత్రుడు వహ్ని, వహ్నియొక్క పుత్రుడు భర్గుడు. భర్గునియొక్క పుత్రుడు భానుమంతుడు.
ఆ భానుమంతుని పుత్రుడు త్రిభానువు. ఈ త్రిభానుని పుత్రుడగు కరంధముడు గొప్ప దానబుద్ధి గలవాడు. కరంధముని పుత్రుడు మరుతుడు. మరుతునకు పుత్రులు లేకపోవుటచే, ఆయన పూరువంశమునందు పుట్టిన దుష్యంతుని తన పుత్రునిగా స్వీకరించెను.
మానవులలో శ్రేష్ఠుడవగు ఓ పరీక్షిన్మహారాజా! ఆ దుష్యంతుడు రాజ్యమునందు కామన గలవాడు. పూరువంశీయులకు మాత్రమే రాజ్యాధికారము ఉండెను. కావున, మరుతునిచే పుత్రునిగా స్వీకరించబడిన దుష్యంతుడు మరల తన పౌరవవంశమునే స్వీకరించేను. నేనిప్పుడు యదువుయొక్క వంశమును వర్ణించెదను. యదువు యయాతియొక్క పెద్ద కుమారుడు. చాల పవిత్రమగు ఈ వంశవర్ణనము మానవుల సకలదో షములను హరించివేయును.
యదువుయొక్క వంశమును గురించి విన్న మానవుడు సకలపాపములనుండి విముక్తుడగును. ఆ వంశమునందే పరబ్రహ్మ భగవానుడు మానవరూపమును దాల్చి అవతరించెను.
యదువునకు సహస్రజిత్తు, క్రోష్ట, నలుడు, రిపువు అనే నలుగురు పుత్రులు గలరు. వారిలో పెద్దవాడగు సహస్రజిత్తునకు శతజిత్తు పుత్రుడు. మహాహయుడు, వేణుహయుడు, హైహయుడు అనువారలు శతజిత్తు యొక్క పుత్రులు.
హైహయుని పుత్రుడు ధర్ముడు. ధర్ముని పుత్రుడు నేత్రుడు. నేత్రుని పుత్రుడు కుంతి. కుంతియొక్క పుత్రుడు సోహంజీ. సోహంజి యొక్క పుత్రుడు మహిష్మంతుడు. మహిష్మంతుని పుత్రుడు భద్రసేనుడు.
భద్ర సేనునకు దుర్మదుడు, ధనకుడు అనే ఇద్దరు పుత్రులు కలిగిరి. ధనకునకు కృతవీర్యుడు, కృతాగ్ని, కృతవర్మ, మరియు కృతాజసుడు అనే నలుగురు పుత్రులు కలిగిరి.
కృతవీర్యుని పుత్రుడు అర్జునుడు. ఆతడు ఏడు ఖండములకు ప్రభువు ఆయెను. ఆతనికి శ్రీహరి అంశావతారమైన దత్తాత్రేయుని వలన యోగము మరియు యోగసిద్ధులు లభించెను.
యజ్ఞము, దానము, తపస్సు, యోగము, జ్ఞానము, పరాక్రమము, విజయము, దుష్టశిక్షణము మొదలగు గుణములయందు మహారాజులు ఎవరైననూ కార్తవీర్యార్జునుని సామ్యమును నిశ్చయముగా పొందలేరు.
ఏలయనగా, క్షీణించని శక్తి గల ఆ కార్తవీర్యార్జునుడు ఎనభై అయిదు వేల సంవత్సరముల కాలము నిరంతరముగా క్షీణించని ఆరు ఇంద్రియముల భోగములననుభవించెను. ఆయనకు తన సంపద నష్టమైన ఘటన ఏదీ స్మృతిలో లేదు. ఆయనను స్మరించువారలకు కూడ సంపద నష్టము కాదు.
ఆ కార్తవీర్యార్జునునకు పది వేల మంది పుత్రులు గలరు. కాని, (పరశురామునితోడి) యుద్ధమునందు జయధ్వజుడు, శూరసేనుడు, వృషభుడు, మధువు, ఊర్జితుడు అనే అయిదుగురు మాత్రమే ప్రాణములతో బయట పడిరి.
జయధ్వజుని పుత్రుడు తాలజంఘుడు. ఆయనకు వందమంది పుత్రులు ఉండిరి. వారు తాలజంఘ క్షత్రియులు అనే పేరును బడసిరి. సగర మహారాజు ఔర్వ మహర్షినుండి ఆగ్నేయాస్త్రమును పొంది, దానితో ఆ తాలజంఘులను సంహరించెను.
ఆ తాలజంఘులలో పెద్దవాడు వీతిహోత్రుడు.(కార్తవీర్యార్జునుని పుత్రుడగు) మధువునకు వందమంది పుత్రులు గలరు. వారిలో వృష్టి పెద్ద వాడు. ఈ యదువు, వృష్టి, మధువుల వలననే వంశము ప్రవర్తిల్లినది. ఆ వంశీయులు క్రమముగా యాదవులు, వృష్ణులు, మాధవులు అనే పేరుతో ప్రసిద్ధిని బడసినారు.
యదువుయొక్క పుత్రుడు క్రోష్టువు. క్రోష్టువు యొక్క పుత్రుడు వృజినవంతుడు. వృజినవంతుని పుత్రుడు శ్వాహి. శ్వాహియొక్క పుత్రుడు రుశకుడు. రుశకుని పుత్రుడు చిత్రరథుడు. చిత్రరథుని పుత్రుడు శశబిందువు. ఆయన చాల గొప్పవాడు. ఆయన గొప్ప యోగియే గాక, గొప్ప భోగి కూడ ఆయెను. పరాజయము నెరుగని ఆ శశబిందు చక్రవర్తి ఏనుగు, గుర్రము, రథము మొదలైన పదునాలుగు రకముల శ్రేష్ఠవస్తువులను కలిగియుండెను.
చాల గొప్ప కీర్తి గల ఆ శశబిందువునకు పదివేల మంది భార్యలుండిరి. ఆయన వారియందు పదివేల లక్షల పుత్రులను కనెను.
ఆ వంద కోట్ల పుత్రులలో పృథుశ్రవసుడు, పృథుకీర్తి మొదలైన ఆర్గురు ప్రముఖులు. వారిలో పృధుశ్రవసునకు ధర్ముడని ప్రసిద్ధి గాంచిన పుత్రుడు ఉండెను. ధర్ముని పుత్రుడగు ఉశనుడు వంద అశ్వమేధ యాగ ములను చేసెను. ఉశనుని పుత్రుడు రుచకుడు. రుచకునకు అయిదుగురు పుత్రులు ఉండిరి. వారి పేర్లను వినుము.
పురుజీత్తు, రుక్ముడు, రుక్మేషువు, పృథువు, మరియు జ్యాముఘుడు అనునవి ఆ రుచకుని పుత్రుల పేర్లు. వారిలో జ్యామఘునకు తన భార్యయగు శైబ్యయందు సంతానము కలుగలేదు. అయినా, ఆయన భార్య వలన భయము వలన ఇంకో స్త్రీని వివాహమాడలేదు. కానీ, శత్రు రాజు పై జయించిన సందర్భములో, శత్రురాజుయొక్క అంతఃపురము నుండి భోజవంశమునకు చెందిన భోజ్య అనే కన్యను తీసుకొని వచ్చేను.
రథమునందున్న ఆ భోజ్యను పరిశీలనగా చూచిన శైబ్య కోపించి నదై భర్తయగు జ్యామఘునితో నిట్లనెను -- ఓ మోసగాడా! రథములో నా స్థానములో నీవీమెను ఎక్కించితివి. ఈమె ఎవరు?
నీ కోడలు, అని జ్యామఘుడు చెప్పెను. అపుడా శైబ్య చిరునవ్వు తో -- నాకు పిల్లలు లేరు, పైగా సవతి కూడ లేనిదానను, నాకు కోడలు అని చెప్పుట సత్యము ఎట్లు అగును?--అని భర్తను ప్రశ్నించెను. అపుడా రాజు -- ఓ మహారాణీ! నీకు పుట్టబోయే కొడుకు ఈమెను వివా హము చేసుకొనగలడు -- అని పలికెను.
జ్యామఘుని ఆ మాటను విశ్వేదేవతలు మరియు పితృదేవతలు కూడ అనుమోదించిరి. కొంత కాలమునకు శైబ్య గర్బమును దాల్చి, పండువంటి పిల్లవానిని కనెను. ఆ బాలకునకు విదర్బుడని పేరు. ఆ బాలుడే పెరిగి పెద్దవాడై సాధ్వియగు భోజ్యను వివాహమాడెను. ఈ విధముగా ఆమె యథార్థముగనే శైబ్యకు కోడలు ఆయెను.
శ్రీమద్బాగవత మహాపురాణమునందు తొమ్మిదవ స్కంధములో యయాతి పుత్రులగు అను-ద్రుహ్యు-తుర్వసు-యదువుల వంశములను వర్ణించే ఇరువది మూడవ అధ్యాయము ముగిసినది (23).
