శ్రీ మద్భాగవతము - నవమ (9వ) స్కందము
2 - పృషధ్రుడు మొదలగు మనుపుత్రుల వంశములు
ఈ విధముగా (పుత్రునకు రాజ్యమును అప్పజెప్పి) తన పుత్రు డగు సుద్యుమ్నుడు అడవికి వెళ్లగా, వైవస్వత మనువు (శ్రాద్ధదేవుడు) పుత్రులను గోరి యమునా నదీతీరమునందు నిరంతరముగా వంద సంవ త్సరములు తపస్సును చేసెను.
ఆ తపస్సులో మనువు సంతానము కొరకై జగన్నాథుడగు శ్రీహరి భగవానుని ఆరాధించి, పదిమంది తనతో సమానులైన పుత్రులను పొందే ను. వారిలో ఇక్ష్వాకుడు పెద్దవాడు.
మనువు పుత్రుడగు పృషధ్రుని గురువగు వసిష్ఠుడు గోవులను రక్షించే పనిలో నియమించెను. ఆతడు రాత్రియందు సావధానముగా వీరా సనము (కత్తి చేతబట్టి మేల్కొనియుండుట) నందున్నవాడై గోవులను పాలించెను.
ఒకనాడు రాత్రి వర్షము పడుచుండెను. అపుడు గోశాలలోనికి ఒక పెద్ద పులి ప్రవేశించెను. పరుండియున్న గోవులు భయపడి పైకి లేచి ఆ గోశాలలో తిరుగాడ జొచ్చినవి.
బలశాలియగు ఆ పులి ఒక గోవును పట్టుకొనగా, ఆ గోవు భయ ముతో కంగారు పడి ఆక్రోశించెను. దాని ఆ దీనమైన ఆక్రందనను విని పృషధ్రుడు పరుగు దీ సెను.
మేఘములు కారణముగా నక్షత్రముల కాంతి కూడ లేని ఆ రాత్రి చీకటిలో పృషధ్రుడు సరిగా చూడలేకపోయెను. ఆయన పెద్ద పులి అని శంకించి ఒక కపిల గోవుయొక్క తలను నరికెను.
కత్తి కొన తగిలి చెవి తెగిపోగా పెద్దపులి కూడ చాల భయపడెను. మార్గమునందు రక్తము స్రవించుచుండగా, అది ఆ గోశాలనుండి బయటకు పారిపోయెను.
పృషధ్రుడు శత్రువీరులను దునుమాడే వీరుడు. తన చేతిలో పెద్ద పులియే చచ్చినదని ఆయన తలపోసెను. రాత్రి తెల్లవారిన పిదప ఆయన చచ్చి పడియున్న కపిలగోవును చూచి దుఃఖమును పొందెను.
పృషధ్రుడు చేయాలనుకోకుండగనే పాపమును చేసెను. అయిన నూ, కులగురువగు వసిష్ఠుడు ఆయనను ఇట్లు శపించెను -- ఈ కర్మచే నీవు క్షత్రియాధముడుగనైననూ మిగిలియుండవు; శూద్రుడవు కమ్ము.
కులగురువు ఈ విధముగా శపించగా, వీరుడగు పృషధ్రుడైతే శాపమును స్వీకరించెను. ఆయన ఊర్ధ్వరేతస్కుడై మునులకు ప్రియమైన బ్రహ్మచర్య వ్రతమును దృఢముగా పాటించెను.
సర్వప్రాణుల హితమును గోరే ఆ పృషధ్రుడు సర్వమునందు సమత్వము (ఈశ్వరుని దర్శించుట) ను కలిగియుండెను. సర్వమునకు స్వరూపమై సర్వము రూపములోనున్నవాడే అయిననూ, సర్వమునకు అతీతుడై దోషరహితుడగు వాసుదేవ భగవానునియందు ఆయనకు భక్తిచే సర్వాతిశాయియగు ప్రేమ కలిగెను.
ఆ పృషధ్రుడు సంసారాసక్తిని విడిచి పెట్టినవాడై ప్రసన్నమైన అంతఃకరణమును కలిగియుండెను. ఆయన ఇంద్రియనిగ్రహము కలవాడ గుటచే భోగవస్తువులను ప్రోగు చేయలేదు. ఆయన అనుకోకుండా ఈశ్వరేచ్ఛచే లభించినదానితో తనకు బ్రదుకుదెరువును కల్పించుకొనెను.
ఆయన సావధానుడై బుద్ధిని తన సచ్చిత్స్వరూపమునందు నిలిపి అట్టి ఆత్మనిష్ఠచేతనే సంతుష్టుడై ఈ లోకములో సంచరించెను. ఆయన చూచుటకు మందుడుగను, గ్రుడ్డి-చెవిటివాడు వలెను కనబడెడివాడు.
ఈ విధముగా జీవనము గడుపుతూ ఆ పృషధ్రుడు అడవికి వెళ్లగా, అచట ఆయనకు ఎగసిపడే కార్చిచ్చు తారసిల్లెను. ఆయన దేహము దానిలో దగ్ధము కాగా, ఆయన పరబ్రహ్మలో విలీనమయ్యెను (జీ వన్ముక్తుడు విదేహముక్తిని పొందెను).
మనువుయొక్క ఆఖరి పుత్రుడగు కవికి ఇంద్రియభోగముల యందు తృష్ణ లేకుండెను. ఆతడు యువకుడుగ నుండగనే రాజ్యమును విడిచి పెట్టి బంధువులతో గూడి అడవికి వెళ్లి, తన చిత్తమును స్వయంప్ర కాశ స్వరూపుడగు పూర్ణబ్రహ్మయందు నిలిపియుంచి, పరమాత్మను చేరు కొనెను.
మనుపుత్రుడగు కరీషునినుండి కారీషులు అనే క్షత్రియజాతులు ఉద్భవించెను. వేదవేత్తలయందు భక్తి మరియు ధర్మమునందు ప్రేమ గల ఆ కారూషులు ఉత్తరదేశమును పాలించిరి.
ధృష్టుని పుత్రుడు ధారిష్టుడు. ఆయన క్షత్రియుడే అయిననూ, ఈ లోకమునందే బ్రాహ్మణత్వమును పొందెను. నృగుని పుత్రుడు సుమతి. సుమతి పుత్రుడు భూతజ్యోతి. ఆయన పుత్రుడు వసువు.
వసువుయొక్క పుత్రుడు ప్రతీకుడు. ప్రతీకుని పుత్రుడు ఓఘవం తుడు. ఓఘవంతుని పుత్రుని పేరు కూడ ఓఘవంతుడే. ఓఘవంతునకు ఓఘవతి అనే కన్య కూడ ఉండెను. ఆమెను సుదర్శనుడు వివాహమాడేను.
(మనుపుత్రుడగు) నరిష్యంతుని పుత్రుడు చిత్రసేనుడు. చిత్రసే నుని పుత్రుడు ఋక్షుడు. ఋక్షుని పుత్రుడు మీడ్వంతుడు. మీడ్వంతుని పుత్రుడు కూర్చుడు. కూర్చుని పుత్రుడు ఇంద్ర సేనుడు.
ఇంద్రసేనుని పుత్రుడు వీతిహోత్రుడు. వీతిహోత్రుని పుత్రుడు సత్యశ్రవసుడు. సత్యశ్రవసుని పుత్రుడు ఉరుశ్రవసుడు. ఉరుశ్రవసుని పుత్రుడు దేవదత్తుడు.
ఆ దేవదత్తునకు అగ్నిదేవుడు స్వయముగా అగ్నివేశ్యుడనే పుత్రుడై జన్మించి, కానీనుడనియు మరియు జాతూకర్ణ్య మహర్షి అనియు ప్రఖ్యాతిని గాంచెను.
ఓ మహారాజా! ఆ అగ్నివేశ్యునినుండి ఆగ్నివేశ్యాయనము అనే బ్రాహ్మణుల వంశము ఉద్భవించెను. నేనింతవరకు నరిష్యంతుని వంశ మును గురించి చెప్పితిని. ఈపైన దిష్టుని వంశమును గురించి చెప్పెదను.
దిష్టుని పుత్రుడు నాభాగుడు. ఈ నాభాగుడు వేరు, రాబోయే నాభాగుడు వేరు. ఈ నాభాగుడు తాను చేసిన కర్మను బట్టి వైశ్యుడైనాడు. దాని పుత్రుడు భలందనుడు. భలందనుని పుత్రుడు వత్సప్రీతి.
వత్సప్రీతి పుత్రుడు ప్రాంశుడు. ప్రాంశుని పుత్రుడు ప్రమతి. ప్రమతి పుత్రుడు ఖనిత్రుడు. ఖనిత్రుని పుత్రుడు చాక్షుషుడు. చాక్షుషుని పుత్రుడు వివింశతి.
జనులను పాలించే ఓ పరీక్షిన్మహారాజా! వివింశతి పుత్రుడు రంభు డు. రంభుని పుత్రుడు ధర్మాత్ముడగు ఖనినేత్రుడు. ఖనినేత్రునకు కరంధ ముడనే పుత్రుడు ఉండెను.
ఆ కరంధముని పుత్రుడు అవీక్షిత్తు. అవీక్షిత్తుయొక్క పుత్రుడగు మరుత్తు చక్రవర్తి ఆయెను. అంగిరసుని పుత్రుడగు సంవర్తుడు మహా యోగి. ఆయన మరుత్తునిచే యజ్ఞమును చేయించెను.
మరుత్తుని యజ్ఞమువంటి యజ్ఞమును చేసినవారు మరెవ్వరూ లేరు. ఆ యజ్ఞములో పాత్రలు మొదలగు సర్వము కూడ బంగారముతో చేయబడి ప్రకాశించేను.
ఆ యజ్ఞములో ఇంద్రుడు సోమరసముతో మరియు బ్రాహ్మణులు దక్షిణలతో హర్షమును పొందిరి. మరుద్గణములు వడ్డనవారు కాగా, విశ్వేదే వతలు సభాసదులైరి.
మరుత్తుని పుత్రుడు దముడు. దముని పుత్రుడు రాజ్యవర్ధనుడు. రాజ్యవర్ధనుని పుత్రుడు సుధృతి. సుధృతి పుత్రుడు నరుడు.
నరుని పుత్రుడు కేవలుడు. కేవలుని పుత్రుడు బంధుమంతుడు. బంధుమంతుని పుత్రుడు వేగవంతుడు. వేగవంతుని పుత్రుడు బంధువు. బంధువు పుత్రుడు తృణబిందు మహారాజు.
ఆ తృణబిందువు సేవించదగిన సద్గుణములకు నిలయము. అప్స రసలలో శ్రేష్ఠురాలగు అలంబుషా దేవి ఆయనను వివాహమాడెను. ఆయ నకు అనేక పుత్రులు, ఇడవిడ అనే కన్య కూడ కలిగిరి.
విశ్రవస మహర్షి యోగులలో శ్రేష్ఠుడగు తన తండ్రి పులస్త్యుని నుండి సర్వోత్తమమైన (ఇహపరదాయకమగు) విద్యను గ్రహించెను. ఆయనకు ఆ ఇడవిడయందు కుబేరుడు పుత్రుడై జన్మించెను.
విశాలుడు, శూన్యబంధువు, ధూమ్రకేతువు అనువారలు తృణబిం దుని పుత్రులు. వారిలో విశాల మహారాజు వంశకర్త. ఆయన వైశాలీ నగర మును నిర్మించెను.
విశాలుని పుత్రుడు హేమచంద్రుడు. హేమచంద్రుని పుత్రుడు ధూమ్రాక్షుడు. ధూమ్రాక్షుని పుత్రుడు సంయముడు. సంయముని పుత్రులు కృశాశ్వుడు మరియు దేవజుడు.
కృశాశ్వుని పుత్రుడు సోమదత్తుడు. సోమదత్తుడు అనేకములైన అశ్వమేధ యాగములచే అన్నమునకు (భూమికి, వాక్కునకు) ప్రభువగు పూర్ణ-ఈశ్వరుని ఆరాధించెను. ఆయన యోగిపుంగవులగు నారదాదులను ఆశ్రయించి సర్వోత్తమ ఫలమైన మోక్షమును పొందెను.
సోమదత్తుని పుత్రుడు సుమతి. సుమతి పుత్రుడు జనమేజయుడు. ఈ హేమచంద్రుడు మొదలుగా గల వైశాల నగర రాజులు తృణబిందువు యొక్క కీర్తిని నిలబెట్టిరి.
శ్రీమద్బాగవత మహాపురాణమునందు తొమ్మిదవ స్కంధములో పృషధ్రుడు మొదలగు మనుపుత్రుల వంశములను వర్ణించే రెండవ అధ్యాయము ముగిసినది (2).
