శ్రీ మద్భాగవతము - నవమ (9వ) స్కందము
10 - శ్రీరాముని చరితము
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఖట్వాంగుని పుత్రుడు దీర్ఘ బాహువు. దీర్ఘబాహువు పుత్రుడు గొప్ప కీర్తి గల రఘువు. రఘువు పుత్రుడు అజమహారాజు. అజుని పుత్రుడు దశరథుడు.
సాక్షాత్తు పరబ్రహ్మయైన ఈ శ్రీహరి భగవానుని దేవతలు ప్రార్థించగా, ఆయన తన అంశలతో కూడియున్న పూర్ణరూపముతో ఆ దశరథు నకు పుత్రుడాయెను. రామ భరత లక్ష్మణశత్రుఘ్నులు అని వారి పేర్లు.
ఓ పరీక్షిన్మహారాజా! తత్త్వవేత్తలగు మహర్షులు సీతాపతియగు ఆ శ్రీరాముని వృత్తాంతమును విస్తారముగా వర్ణించిరి. నీవు కూడ పలుమార్లు వినియుంటివి.
శ్రీరాముడు తండ్రి మాటను నిలబెట్టుటకై రాజ్యమును విడిచి పెట్టిను. ప్రియురాలగు సీత తన చేతులతో నొక్కిననూ నొచ్చుకొనే సుకుమారమైన పద్మములవంటి పాదములతో ఆయన అనేకవనములను సంచరించేను. ఆయనకు మార్గమునందు కలిగిన శ్రమను వానరాధిపతియగు సుగ్రీవుడు మరియు సోదరుడగు లక్ష్మణుడు తొలగించెడివారు. శూర్పణఖను వికృతరూపగా చేసినందువలన రావణుడు శ్రీరామునకు ప్రియురాలగు సీతతో వియోగమును కలిగించేను. దానిచే కోపమును పొందియున్న శ్రీరాముడు కనుబొమలను విరిచి సారించగా సముద్రుడు భయపడిపోయేను. తరువాత శ్రీరాముడు సేతువును కట్టి, రావణుడు మొదలగు దుష్టుల అడవికి కార్చిచ్చే తగులబెట్టెను. అట్టి కోసలాధిపతియగు శ్రీరాముడు మమ్ములను రక్షించు గాక!
విశ్వామిత్ర మహర్షియొక్క యజ్ఞములో లక్ష్మణుడు తేరిపార చూచుచుండగా, శ్రీరాముడు మారీచుడు, సుబాహుడు మొదలైన రాత్రిళ్లు సంచరించే రాక్షసవీరులను సంహరించెను.
స్వయంవరము జరిగే ప్రాసాదములో సమావేశమైరి. భయంకరమగు ఈశ్వరుని ధనుస్సును మూడువందల మంది తెచ్చి అచట ఉంచిరి. గున్న యేనుగు అవలీలగా చేరుకుగడను పట్టుకున్న విధముగా, ఆ శ్రీరాముడు ఆ ధనుస్సును చేతిలోనికి తీసుకొని, నారిత్రాడు యెక్కించి లాగి, దానిని మధ్యలో విరిచెను.
శ్రీహరి వక్షఃస్థలమునందు నివసించే సన్మానము లక్ష్మీదేవికి గలదు. ఆమెయే ఇప్పుడు సీత అనే పేరుతో వెలసినది. గుణములు, సచ్చీలము, వయస్సు, అంగములు, రూపము అనే అంశములలో ఆ సీతాదేవి రామునకు అన్ని విధములుగా తగియుండెను. ఆమెను స్వయంవరములో తన దానినిగా చేసుకొని శ్రీరాముడు అయోధ్యకు వెళ్లుచుండెను. ఆ మార్గములో ఆయన భృగువంశశ్రేష్ఠుడగు పరశురాముని మిక్కిలి బలీయమైన గర్వమును అణచివేసెను. ఆ పరశురాముడు ఇరవై ఒక్కసార్లు క్షత్రియులను సంహరించి, భూమండలమునందు క్షత్రియవంశముల బీజము లేకుండా చేసెను.
శ్రీరాముని తండ్రియగు దశరథుడు కైకేయి అనే భార్యకు వశుడు. ఆయన సత్యమనే పాశముచే కట్టివేయబడి రాముని అరణ్యవాసమునకు ఆదేశించెను. శ్రీరాముడు భార్యతో గూడి ఆ ఆదేశమును శిరసా వహించేను. ఆయన రాజ్యమును, సంపదను, ప్రేమించే తల్లి మొదలగువారిని, మిత్రులను, తాను నివసించే ప్రాసాదమును, సంసారాసక్తిని విడిచి పెట్టిన యోగి ప్రాణములను వలె, విడిచి పెట్టి అడవికి వెళ్లాను.
రాక్షసప్రభువగు రావణాసురుని సోదరి శూర్పణఖ. ఆమె శ్రీరాముని వద్దకు అపవిత్రమగు సంకల్పముతో రాగా, ఆయన ఆమె రూపమును వికృతముగా చేసెను. ఖరుడు, దూషణుడు, త్రిశిరసుడు మొదలైన ఆమె బంధువులను మరియు పదునాల్గువేల మంది రాక్షసులను శ్రీరాముడు సంహరించెను. ఆయన ధనుస్సు చేతియందు పట్టి నిలబడగా, ఆయనను ఉల్లంఘించుట శక్యము కాదు. ఆయన అడవిలో ఈ విధముగా కష్టములను సహిస్తూ సంచరించెను.
ఓ పరీక్షిన్మహారాజా! సీతయొక్క వృత్తాంతమును విన్న పది తలల రావణుని హృదయములో మన్మథుడు ఉద్దీపింప జేయబడెను. ఆయన మారీచుని ఆశ్చర్యమును గోల్పే రూపములో పంపించెను. ఆ మారీచుడు శ్రీరాముని ఆశ్రమమునుండి దూరముగా తీసుకొని పోయెను. అప్పుడు వెంటనే శ్రీరాముడు ఆ మాయలేడి రూపములో నున్న మారీచు ని, వీరభద్రుడు దక్షప్రజాపతిని వలె, బాణముతో సంహరించెను.
రాక్షసౌధముడగు రావణుడు అడవిలో రామలక్ష్మణులు దరిదాపులలో లేని సమయమునందు, తోడేలు మేకను వలె, సీతాదేవిని అపహరించెను. ఆమె విదేహరాజగు జనకుని కుమార్తె. ఈ విధముగా శ్రీరామునకు తన ప్రియురాలగు సీతాదేవితో వియోగము ఘటిలైను. ఆయన అడవిలో సోదరుడగు లక్ష్మణునితో గూడి దీనుడు వలె సంచరించెను. స్త్రీయందు ఆసక్తి గల వ్యక్తి పొందే గతిని ఆయన ఈ విధముగా లోకమునకు ప్రకటించెను.
శ్రీరాముడు మానవుడే అయినా ఆయన పాదములను బ్రహ్మగారు, శివుడు పూజించెదరు. ఆయన ప్రయోజనము (సీతను విడిపించుట) కొరకై యుద్దమును చేసిన జటాయువు ఆ కర్మచే కర్మబంధమును పోగొట్టుకొనెను. శ్రీరాముడు జటాయువునకు దహనక్రియల నాచరించి, కబంధుని సంహరించెను. తరువాత ఆయన వానరులతో మైత్రీని నెరపీ వాలినీ సంహరించెను. ఆ వానరుల ద్వారా ఆయనకు సీత జాడ (లంక) తెలిసేను. అపుడాయన వానరాధిపతియగు సుగ్రీవుని సైన్యములతో గూడి సము ద్రతీరమును చేరుకొనెను.
సముద్రము ఆటంకము కాగా శ్రీరాముడు కోపించుట అనే లీలను నేరపెను. ఆయన కోపముతో కన్నులను గిర గిర త్రిప్పుతూ చూడగా సముద్రములోని మొసళ్లు, పెద్ద చేపలు భయభ్రాంతములైనవి; సముద్ర ఘోష ఆగిపోయెను. అప్పుడు సముద్రము రూపు దాల్చి, తలపై పూజా ద్రవ్యములను ఉంచుకొని, శ్రీరాముని పాదపద్మమును చేరి ఇట్లు పలికెను.
ఓ పరబ్రహ్మ స్వరూపా! మావి మొద్దు బుద్దులు. నీవు వికారములు లేకుండగనే జగత్తునకు కారణమగుదువు. పూర్ణుడవగు నీవు లోకములకు అధీశ్వరుడవు. నిన్ను మేమైతే తెలియజాలము. నీవు సత్త్వరజస్తమోగుణములకు నీయంతవు. నీ సత్త్వగుణమునుండి దేవతాగణములు, రజోగుణమునుండి ప్రజాపాలకులు, తమోగుణమునుండి భూతనాయకులు ప్రకటమైనారు.
ఓ వీరా! యథేచ్చగా వెళ్లుము (నీకు నేను అడ్డము రాను). విశ్రవస ప్రజాపతియొక్క దుష్టపుత్రుడగు రావణుడు ముల్లోకములకు పీడను కలిగించువాడు. వానిని సంహరించి, నీ భార్యను తిరిగి పొందుము. నీవి చట సేతువును నిర్మించి నీ కీర్తిని విస్తరింప జేయుము. దిక్కులను జయిం చిన రాజులు ఇచటకు వచ్చి (సేతువును చూచి) నీ కీర్తిని గానము చేయగలరు.
కపివీరులు పర్వతశిఖరములను ఊడబెరకి సముద్రములో వేయుచుండగా వాటి పైనున్న చెట్లు కంపించుచుండెను. రఘువంశవీరుడగు శ్రీరాముడు ఈ విధముగా సముద్రము పై సేతువును కట్టెను. తరువాత సుగ్రీవుడు, నీలుడు, హనుమంతుడు ప్రముఖులుగా గల సైన్యములతో గూడి ఆయన విభీషణుని సలహాననుసరించి లంకను ప్రవేశించెను. ఆ లంకను హనుమంతుడు ఇదివరకే దహించియుండెను.
క్రీడాస్థానములు, ధాన్యపు కొట్టములు, ఖజానా, ద్వారములు, ప్రధానద్వారము, సభలు, చంద్రశాలలు, గువ్వగూళ్లు మొదలగువాటితో కూడియున్న లంకానగరమును వానరవీరుల సైన్యములు ముట్టడించినవి. వారు వేదికలను, ధ్వజములను, (గోపురముల పైనుండే) బంగరు కడనలను విరుగకొట్టి కూడళ్లను చెల్లాచెదరు చేయుచుండిరి. అట్టి లంక, ఏనుగుల గుంపులచే నది వలె, కలచివేయబడెను.
వానర సైన్యములు చేసిన పనిని చూచి రాక్షసప్రభువగు రావణుడు తన అనుచరులనందరినీ యుద్ధమునకు పంపించెను. నికుంభుడు, కుంభుడు, ధూమ్రాక్షుడు, దుర్ముఖుడు, సురాంతకుడు, నరాంతకుడు, పుత్రుడగు ఇంద్రజిత్తు, ప్రహస్తుడు, అతికాయుడు, వికంపనుడు మొదలగు వారిని పంపించెను. వారందరు మరణించిన తరువాత కుంభకర్ణుని పంపేను.
చురకత్తులు, శూలములు, ధనుస్సులు, బల్లెములు, ఈటెలు, చిల్ల కోలలు, బాణములు, ఇనుప గుదియలు, మరియు కత్తులు అనే ఆయుధ ములను కలిగియున్న ఆ రాక్షససైన్యమును ఎదుర్కొనుట చాల కష్టము. కాని, సుగ్రీవుడు, లక్ష్మణుడు, వాయుపుత్రుడు, గంధమాదనుడు, నీలుడు, అంగదుడు, జాంబవంతుడు, పనసుడు మొదలగువారు తోడు కాగా, శ్రీరా ముడు ఆ సైన్యమును ఎదుర్కొనేను.
సీతాదేవిని స్పృశించుటచే రావణునకు కల్యాణములు తొలగిపోయెను. అట్టి రావణుని అధీనములోనున్న సైన్యములో పదాతులు, రథికులు, గుర్రపు రౌతులు, ఏనుగునెక్కి యుద్ధము చేయువారు అనే నాలుగు అంగములు ఉండెను. రఘువంశశిరోమణియగు శ్రీరాముని సేనాపతులగు అంగదుడు మొదలగు వారందరు ఆ సైన్యమునెదుర్కొని ద్వంద్వయుద్ధమును చేసిరి. వారు రాక్షసులను చెట్లతో, పర్వతశిఖరములతో, గదలతో మరియు బాణములతో సంహరించుచుండిరి.
రాక్షసప్రభుడగు రావణుడు తన సైన్యము వినాశమగుచుండుటను గాంచి కోపించినవాడై, తానే రథమెక్కి శ్రీరాముని పైకి యుద్ధమునకు వచ్చెను. ఇంద్రుని సారథియగు మాతలి ఇంద్రుని ప్రకాశించే రథమును తీసుకురాగా, శ్రీరాముడు దానిపై విరాజిల్లుచుండెను. అప్పుడు రావణుడు శ్రీరాముని వాడియైన అర్ధచంద్రాకార బాణములతో కొట్టెను.
శ్రీరాముడు రావణునితో ఇట్లు పలికెను -- ఓ రాక్షసాధమా! దుష్టుడవగు నీవు మేమిద్దరము లేని సమయములో కుక్కవలె వచ్చి నా భార్యను అపహరించినావు. నీవు చేసిన ఈ పని గర్ఘ్యమైనది. కాలము యొక్క శక్తిని ఎవరైననూ ఉల్లంఘించలేరు. కాలము కర్మకు ఫలమును కర్తకు ఇచ్చితీరును. అదే విధముగా, నీవు సిగ్గు విడిచి చేసిన పనికి ఫల మును నేను నీకు ఈనాడు ఇచ్చెదను.
ఆ శ్రీరాముడు ఈ విధముగా అధిక్షేపించి ధనుస్సుపై బాణమునే క్కు పెట్టి విడిచి పెట్టెను. వజ్రమువంటి ఆ బాణము ఆ రావణుని గుండెను చీల్చివేసెను. ఆయన పది నోళ్లతో రక్తమును గ్రక్కుతూ, క్షీణించిన పుణ్యము గల పుణ్యాత్ముడు స్వర్గమునుండి వలె, క్రింద బడెను. అచటి జనులు హాహాకారములను చేసిరి.
అప్పుడు వేలాది రాక్షసస్త్రీలు మందోదరితో గూడి లంకనుండి బయటకు వచ్చి బిగ్గరగా ఏడుస్తూ ఆ స్థానమును చేరిరి.
వారి బంధువులు యుద్దములో లక్ష్మణుని బాణములచే హతులైరి. దీనురాండ్రగు ఆ స్త్రీలు తమ తమ ఆ బంధువులను కౌగిలించుకొని గుండెలు బాదుకుంటూ ఏడ్చిరి. వారి ఏడ్పు కూడ సుస్వరముగనే యుండెను.
అయ్యో! చంపబడితిమి. లోకములనేర్పించిన ఓ రావణా! నీవు లేని ఈ లంకను శత్రువులు నాశనము చేసెదరు. ఇప్పుడీ లంక ఎవరిని శరణు వేడవలెను?
ఓ రావణా! గొప్ప భాగ్యవంతుడవగు నీవు కామమునకు వశుడవై తివి. కావుననే, సీతాదేవియొక్క ఈ విధమైన తేజస్సుయొక్క ప్రభావమును తెలియకుంటివి. కావుననే, ఈ దుర్దశలోనికి త్రోసివేయబడితివి.
ఓ రావణా! నీవు నీ వంశీయులను ఆనందింప జేసితివి. కాని, ఈనాడు నీవు లేని ఈ లంక అనాథ యైనది, మేము కూడ విగతభర్తృకలైనాము. నీ దేహము గ్రద్దలకు ఆహారము కాగా, నీవు సూక్ష్మశరీరివై నరకము ననుభవించుటకు పోతివి.
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను -- మరణించిన తన బంధువులకు వ్యక్తి మరణించినప్పుడు చేయవలసిన కర్మలను చేయుమని కోసల ప్రభు డగు శ్రీరాముడు విభీషణుని ఆజ్ఞాపించెను. విభీషణుడు పితృయజ్ఞవిధాన ముతో ఆ పితృకర్మలను చేసెను.
తరువాత శ్రీరామ భగవానుడు అశోకవనములోని ఆశ్రమము నందు ఇరుగుడు చెట్టు మొదలును ఆశ్రయించుకొని కృశించియున్న సీతాదేవిని చూచెను. శ్రీరాముని విరహమే ఆమె పాలిట రోగమాయెను.
దీనురాలగు సీతయొక్క పద్మమువంటి ముఖము శ్రీరాముని చూచుటచే కలిగిన ఆనందముతో వికసించేను. తనకు మిక్కిలి ప్రియురాలగు ఆమెను చూచి శ్రీరాముడు జాలి పడెను.
శ్రీరామ భగవానుడు విభీషణునకు లంకా నగరమును, కల్పము అంతమయ్యేవరకు ఆయుర్దాయమును అనుగ్రహించి, ఆయనను రాక్షసగణములకు అధీశ్వరుని చేసెను. అపుడాయన సీతాదేవిని పుష్పక విమానములోనికి ఎక్కించేను. సోదర సమానుడగు సుగ్రీవునితో, సోదరుడగు లక్ష్మణునితో మరియు హనుమంతునితో కూడి ఆయన కూడ విమానమునెక్కెను. ఆయన ఈ విధముగా వనవాస వ్రతమును పూర్తి చేసుకొని అయోధ్యా నగరమునకు వెళ్లుచుండగా, లోకపాలకులు మార్గములో ఆయనపై పుష్పవర్షమును కురిపించిరి.
బ్రహ్మగారు మొదలగు దేవతలు ఆనందముతో శ్రీరాముని చరితమును గానము చేసిరి. శ్రీరాముడు చాల దయామయుడు. తన తమ్ముడగు భరతుడు నారబట్టలను ధరించి జటలను పెంచుకొని గోమూత్రముతో సంస్కృతమైన యవధాన్యపు అన్నమును తింటూ దర్భలు పరచిన నేలపై పరుంటూ ఉన్నాడని విని మనస్సులో చాల క్లేశమును పొందెను.
అన్నయగు శ్రీరాముడు విచ్చేయుచున్నాడని విని భరతుడు పాదుకలను తలపై నుంచుకొని తన నివాసస్థానమగు నందిగ్రామము నుండి ఆయనకు ఎదురేగెను. పౌరులు, అమాత్యులు, పురోహితులు ఆయనతో బాటు నడచిరి. జనులు వాద్యములను వాయిస్తూ గానము చేయు చుండగా, పెద్ద శబ్దము కలిగెను.
బిగ్గరగా వేదమును వల్లించుచున్న వేదవేత్తలు మరియు బంగారము తాపడము చేసిన పార్శ్వముల టెక్కెములు గల బంగరు రథములు భరతుని వెంట నడచినవి. చక్కని గుర్రములు పూన్చిన ఆ రథములు రంగురంగుల జెండాలతో అలంకరించబడెను. వాటి పైకప్పులు బంగారముతో చేసినవి. బంగరు కవచములను దాల్చిన భటులు, శిల్పుల సంఘములు, వర్తకులు, ప్రముఖ వారాంగనలు, మరియు పాదచారులగు సేవకులు కూడ భరతుని వెంట నడచిరి. చక్రవర్తికి తగియున్న ఛత్రచామరాదులను, పెద్ద చిన్న విలువైన వస్తువులను (రత్నాదులు) కూడ తీసుకొని ఆయన వెళ్లాను. శ్రీరాముని చూచి ఆయన హృదయము, దాని వెంబడి కళ్లు కూడ ప్రేమతో ఆర్ద్రములాయెను. ఆయన శ్రీరాముని పాదములపై పడెను.
భరతుడు శ్రీరాముని యెదుట పాదుకలను పెట్టి కళ్ల వెంబడి నీరు స్రవించుచుండగా దోసిలి యొగ్గి నమస్కరించెను. తరువాత ఆ శ్రీరా ముడు భరతుని రెండు బాహువులతో చాల సేపు కౌగిలించుకొని కన్నీటితో అభిషేకించెను.
శ్రీరాముడు సీతాలక్ష్మణులతో గూడి వేదవేత్తలకు, కులవృద్ధులకు తాను నమస్కరించగా, ప్రజలు శ్రీరామునకు నమస్కరించిరి.
ఉత్తరకోసలదేశ ప్రజలు చాల కాలమునకు వచ్చిన శ్రీరామప్రభుని చూచి ఆనందముతో ఉత్తరీయములను విసురుతూ పుష్పములను చల్లుతూ నాట్యమును చేసిరి.
భరతుడు పాదుకలను స్వీకరించెను. విభీషణుడు మరియు సుగ్రీవుడు ఉత్తమమైన వింజామరలను వీచుచుండగా, వాయుపుత్రుడగు హనుమంతుడు తెల్లని గొడుగును పట్టెను.
ఓ పరీక్షిన్మహారాజా! శత్రుఘ్నుడు ధనుస్సును మరియు అంబుల పొదులను, సీతాదేవి తీర్థజలముతో నిండిన కమండలమును, అంగదుడు కత్తిని, ఎలుగుబంట్ల రాజగు జాంబవంతుడు బంగరు డాలును పట్టుకొనెను.
ఓ పరీక్షిన్మహారాజా! పుష్పక విమానమునందున్న శ్రీరామ భగవానుని పరిచారికలు చుట్టూ చేరియుండగా, స్తోత్రపాఠకులు స్తోత్రములను పలుకుచుండిరి. అపుడాయన ఉదయించిన చంద్రుడు గ్రహములతో వలె ప్రకాశించెను.
సోదరులచే అభినందించబడిన ఆ శ్రీరాముడు ఉత్సవముతో విరాజిల్లే అయోధ్యా నగరములో ప్రవేశించి రాజప్రాసాదమునకు వెళ్లాను. ఆయన తండ్రి భార్యలగు కైకేయి మొదలగు వారిని, తన తల్లియగు కౌసల్యను, పెద్దలను, మిత్రులను, చిన్నవారిని సత్కరించి, వారి సత్కారములను అందుకొనెను. జానకి మరియు లక్ష్మణుడు కూడ యథాయోగ్య ముగా రాజప్రాసాదములో ప్రవేశించి, అందరితో కలుసుకొనిరి.
కౌసల్య మొదలైన ఆ తల్లులకు తమ తమ పుత్రులను చూచి, పోయిన ప్రాణములు తిరిగి వచ్చినట్లాయెను. వారు తమ పుత్రులను ఒడిలో కూర్చుండబెట్టుకొని ఆనందబాష్పముల ధారలతో అభిషేకించి, వియోగ దుఃఖములను విడిచి పెట్టిరి.
గురువగు వసిష్ఠుడు శ్రీరాముని జటలను తొలగింపజేసి, కుల పెద్దలతో గూడి, ఇంద్రుని వలెనే, శ్రీరాముని నాలుగు సముద్రముల జలములతో మరియు పంచామృతములు మొదలగువాటితో యథావిధిగా పట్టాభిషిక్తుని చేసెను.
శ్రీరాముడీ విధముగా అభిషేకము అయిన తరువాత చక్కని వస్త్ర ములను దాల్చి, పుష్పమాలను ధరించి, అలంకరించుకోనెను. ఆయన సోదరులు, భార్యయగు సీతాదేవి కూడ చక్కని వస్త్రములను ధరించి అలంకరించుకొనిరి. వారితో గూడి ఆయన గొప్పగా ప్రకాశించెను.
సోదరుడగు భరతుడు శ్రీరామునకు నమస్కరించి ఆయన సింహాసనమును గ్రహించుటకు సంతోషముతో ఒప్పుకోనునట్లు చేయగా, ఆయన అటులనే చేసెను. ఆయన రాజ్యములో ప్రజలు తమ తమ వర్ణాశ్రమములకు తగిన గుణములు గలవారై తమ ధర్మమునందు శ్రద్ధను కలిగి యుండిరి. ఆయన వారిని తండ్రి వలెనే రక్షించగా, వారాయనను తండ్రి గనే భావించిరి.
ధర్మవేత్తయైన శ్రీరాముడు రాజై సకలప్రాణులకు సుఖమును కలిగించుచుండగా, ఆ కాలము త్రేతాయుగమే అయిననూ, కృతయుగముతో సమానమైనది (నాలుగు పాదముల ధర్మము కలది) ఆయెను.
భరతవంశీయులలో శ్రేష్ఠుడవైన ఓ పరీక్షిన్మహారాజా! అడవులు, నదులు, పర్వతములు, ఉపఖండములు, ఖండములు, సముద్రములు అన్నీ ప్రజలకు అవసరములను తీర్చిడివి.
ఇంద్రియగోచరుడు కాని శ్రీహరి రాముడై అవతరించి రాజ్యమునేలుచుండగా ప్రజలకు మనోవ్యాధులు, శరీరవ్యాధులు, కదలలేని ముసలితనము, దుర్బలత్వము, శారీరకపీడ, మానసిక పీడ, భయము, శ్రమ అనునవీ లేవు. ఇంతేగాక, ప్రజలు ఎంతవరకైతే మరణించవలెనని కోరరో, అంతవరకు మృత్యువు కూడ వచ్చెడిది కాదు.
శ్రీరాముడు ఒకే భార్య అనే వ్రతమును జీవితములో పాలించెను. రాజర్షుల నడవడివంటి నడవడి గల శ్రీరాముడు పవిత్రమైన ఆచరణము గలవాడై తన గృహస్థధర్మములను తాను స్వయముగా ఆచరిస్తూ, జనులకు ఆదర్శముగా నిలిచెను.
పతివ్రతయగు సీతాదేవి ప్రేమతో, సేవతో, సచ్చీలముతో, మరియు బిడియముతో భర్తయగు శ్రీరాముని మనస్సును దోచివేసెను. ఆమె బుద్ధిశక్తితో శ్రీరాముని ఇంగితమును తెలుసుకుంటూ, వినయముతో నమ్రురాలై శ్రీరాముని సేవించెను.
శ్రీమద్బాగవత మహాపురాణమునందు తొమ్మిదవ స్కంధములో శ్రీరాముని చరితమును వర్ణించే పదవ అధ్యాయము ముగిసినది (10).
