శ్రీ మద్భాగవతము - షష్థమ (6వ) స్కందము
18 - మరుద్గణముల జన్మ వృత్తాంతము
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! సవితకు పృశ్ని భార్య. వారికి సావిత్రి (మంత్రమునకు అభిమాని దేవత), వ్యాహృతి (భూః భువః సువః అనే ఉచ్చారణలకు అభిమాని దేవత), త్రయి (వేదము నకు అభిమాని దేవత), అగ్నిహోత్రుడు, పశుయాగము, చాతుర్మాస్యుడు, పంచమహాయజ్ఞములు (వైదికకర్మలకు అభిమాని దేవతలు), సోముడు (ద్రవ్యములకు అభిమాని దేవతలు) సంతానముగా కలిగిరి. భగుని భార్య సిద్ధి. వారికి మహిమచు, ఎలుడు, ప్రభుడు అనే పుత్రులు. ఆశిస్సు అనే కన్య కలిగి ఆ కన్య చాల సుందరి మరియు గొప్ప ప్రతసిష్ఠ గలది. బ్రహ్మయ జ్ఞమనే వేదాధ్యయనము, దేవయజ్ఞము, అతిథిపూజ అనే నృయజ్ఞము, పితృయజ్ఞము, పశుపక్ష్యాదులకు ఆహారమునిచ్చుట అనే భూతయజ్ఞము అనునవి పంచ మహాయజ్ఞములు).
ధాతకు కుహు (అమావాస్యకు అభిమానిని చేపత), సినీవాలి (కృష్ణ చతుర్దశికి అభిమాని దేవత), రాక (పూర్ణిమ అభిమానిని), అనుమతి (శుక్ల చతుర్దశి) అను భార్యలు గలరు. వారికి వరుసగా సాయంకాలము, దర్శ (అమావాస్య), ప్రాతఃకాలము, పూర్ణమాసుడు అనే పుత్రులు కలిగిరి.
ధాత తమ్ముడు విధాత. ఆయన భార్య క్రియ. వారికి పురీష్యులు అనే పేరు గల అయిదుగురు అగ్నులు పుత్రులుగా కలిగిరి. వరుణుని భార్య చర్షణీ. బ్రహ్మపుత్రుడగు భృగువే మరల వారికి కొడుకై పుట్టెను.
యోగిపుంగవుడగు వాల్మీకి కూడ వరుణుని పుత్రుడే. ఆయన పుట్ట (వల్మీకము) నుండి పుట్టి వాల్మీకి యైనాడు. అగస్త్యుడు, వసిష్ఠుడు మిత్రుడు వరుణుల పుత్రులు.
మిత్రునకు వరుణునకు ఊర్వశి సన్నిధిలో స్థలనమైన రేతస్సును కడవయందు విడిచిరి (ఆ విధముగా అగస్త్యుడు, వసిష్ఠుడు జన్మించిరి). మిత్రునకే రేవతియందు ఉత్సర్గుడు, అరిష్టుడు, పిప్పలుడు అనే పుత్రులు కలిగిరి.
వత్సా! స్వర్గాధిపతియగు ఇంద్రునకు పులోముని కుమార్తెయగు శచీదేవియందు జయంతుడు, ఋషభుడు, మీడ్వానుడు అనే ముగ్గురు పుత్రులు కలిగిరని నేను వినియుంటిని.
శ్రీహరి మాయాశక్తిచే వామనుని రూపమును దాల్చి పెద్ద అడుగు లతో ముల్లోకములను కొలిచెను. ఆ వామనునకు కీర్తి అనే భార్యయందు బృహచ్చ్లోకుడనే పుత్రుడు కలిగెను. ఆ బృహచ్చ్లోకునకు సౌభగుడు మొద లగు పుత్రులు కలిగిరి.
శ్రీహరి కశ్యపునకు అదితియందు పుత్రుడై జన్మించెను. ఆ మహా త్ముడు ఆ అవతారములో చేసిన ప్రసిద్ధమైన కర్మలను, ఆయన గుణముల ను, పరాక్రమమును నేను తరువాత (8వ స్కంధములో) వర్ణించ గలను.
తరువాత కశ్యపునకు దితియందు పుట్టినవారి వివరములను నీకు చెప్పెదను. భగవద్భక్తులు, శోభాయుక్తులు అగు ప్రహ్లాదుడు, బలి వారి లోని వారే.
దితికి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అని ప్రసిద్ధి గాంచిన ఇద్దరు పుత్రులు మాత్రమే కలిగిరి. వారికి దైత్యులు, దానవులు కూడ నమస్కరించెదరు. వారి వృత్తాంతము ఇదివరలో (3వ స్కంధములో) వర్ణించబడినది.
జంభుని కుమార్తె కయాధువు దానవవంశమునకు చెందినది. ఆమెను ఆతడు హిరణ్యకశిపునకు ఇచ్చి వివాహము చేసెను. వారికి వరు సగా సంప్రదుడు, అనుహ్లాదుడు, ప్రదుడు, ప్రహ్లాదుడు అనే నలుగురు పుత్రులు కలిగిరి. కయాధువు చెల్లెలు సింహిక యని ప్రసిద్ధి. ఆమె భర్త విప్ర చిత్తు. వారికి పుత్రుడు రాహువు.
ఆ రాహువు అమృతమును త్రోవుచుండగా, శ్రీహరి చక్రముతో వాని తలను నరికెను. సంప్రదుని భార్య కృతి. వారికి పంచజనుడు అనే పుత్రుడు కలిగెను.
హ్రదునకు భార్యయగు ధమనియందు వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు కుమారులు కలిగిరి. ఆ ఇల్వలుడే అగస్త్యుడు అతిథిగా వచ్చిన ప్పుడు వాతాపిని వండి వడ్డించేను.
అనుహ్రదునకు సూర్యయందు బాష్కలుడు, మహిషుడు కలిగి రి. ప్రహ్లాదుని పుత్రుడు విరోచనుడు. విరోచనునకు దేవి అనే భార్యయందు బలీ జన్మించెను.
ఆ బలికి అశనయందు వందమంది పుత్రులు పుట్టిరి. వారిలో బాణుడు పెద్దవాడు. మిక్కిలి కీర్తించదగిన బలియొక్క ప్రభావమును గురించి తరువాత (8వ స్కంధము) చెప్పెదను.
బాణుడు కైలాసవాసియగు శివుని ఆరాధించి శివగణములలో ప్రముఖమగు స్థానమును పొందెను. ఈ నాటికి కూడ శివ భగవానుడు ఆతని వద్దనే ఆతని నగరమును రక్షిస్తూ నిలిచి యున్నాడు.
దితికి నలభై తొమ్మిదిమంది మరుత్తులు అనే పుత్రులు కలిగిరి. వారిలో ఎవ్వరికీ సంతానము లేదు. వారికి ఇంద్రుడు తనతో సమానమగు స్థానమునిచ్చెను.
రాజోవాచ ।
పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- ఓ ఆచార్యా! వారు సహజ మైన అసుర స్వభావమును తొలగింప జేసి, ఇంద్రునిచే తనతో సమానత్వ మును ఎట్లు పొందించ బడినారు? వారు చేసిన పుణ్యమెట్టిది?
పూజనీయుడవగు ఓ మహర్షీ! నాతో బాటుగా ఈ మహర్షులు కూడ ఆ విషయమును తెలుసుకొనుటకు శ్రద్ధను కలిగియున్నారు. కావున, నీవు మాకా విషయమును వివరించి చెప్పుము.
సూత ఉవాచ ।
సూత మహర్షి ఇట్లు పలికెను --- ఓ శౌనక మహర్షీ! నీకు సత్ర యాగము ఆశ్రయముగా నున్నది. బాదరాయణ వ్యాసుని పుత్రుడు, సర్వము తెలిసినవాడు అగు ఆ శుకుడు, పరీక్షిత్తు సాదరముగా పలికిన అర్థవంతమైన ఆ అల్పభాషణమును వినెను. ఆయన మనస్సు ఆనంద ముతో నిండిపోయెను. ఆయన ఆ ప్రశ్నను ప్రశంసిస్తూ, ఇట్లు పలికెను.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- విష్ణువు ఇంద్రునకు వెనుక సహాయకుడుగా నుండును. ఆయన ఆ విధముగా దిలీపుత్రులగు హిరణ్యక శిపు హిరణ్యాక్షులను సంహరించెను. దానిచే దితి మనస్సులో శోకము కలిగి కోపముతో మండిపడుచుండెను. ఆమె ఇట్లు తలపోయ సాగెను.
ఇంద్రుడు సోదరులను చంపిన క్రూరుడు. ఇంద్రియభోగముల యందు రమించే ఇంద్రుడు కఠినహృదయుడు. నేను ఆ పాపిని చంపించి సుఖముగా నిద్రించే రోజు ఎప్పుడు వచ్చునో గదా?
ప్రభువు అని ఇతరులచే నిర్దేశించబడిన దేహమే ఒకనాడు క్రిముల ని, మలమని, బూడిదయని పేరును పొందును. అట్టి దేహము కొరకై ప్రాణులకు ద్రోహమును చేయువాడు తన పురుషార్థము తెలిసినవాడేనా? కాదు. అట్లు చేయుట వలన లభించేది నరకము మాత్రమే.
ఇంద్రుడు ఈ దేహమే శాశ్వతమని తలపోస్తూ ఉచ్చృంఖలమగు ప్రవృత్తి కలిగియున్నాడు. వాని గర్వమునడంచే పుత్రుడు నాకు కలిగే ఉపా యము ఏమై యుండును?
ఈ విధముగా తలపోసి ఆమె భర్తను ప్రేమతో మరియు వినయ ముతో సేవించెను. ఆమె ఇంద్రియనిగ్రహము గలదియై భర్తకు నిరంతర ముగా ప్రియమునాచరించెను.
ఓ పరీక్షిన్మహారాజా! దితి భర్త ఇంగితమునెరింగి గొప్ప భక్తితో, మధురమగు సంభాషణలతో, చక్కని చిరునవ్వుతో కూడిన కడగంటి చూపు లతో కశ్యపుని మనస్సును చూరగొనెను.
కశ్యపుడు వివేకియే. కాని, తెలివి తేటలు గల దితి ఆయనను తన వశము చేసుకొనెను. ఆ విధముగా ఆయన జడుడుగా తయారై ఆమె కోరి కకు అంగీకరించెను. అంత పని చేయుట స్త్రీకి విడ్డూరము కాదు.
సృష్టి ప్రారంభములో ప్రాణులు ఏకాంతముగా నుండుటను బ్రహ్మ గారు గమనించి, తన శరీరములో సగమును స్త్రీగా చేసెను. అప్పటినుం డియు స్త్రీ పురుషుని మనస్సును అపహరించుచునే యున్నది.
వత్సా! ఈ విధముగా దితి పూజనీయుడగు కశ్యపునకు సేవ చేయగా, ఆయన చాల సంతోషించెను. ఆయన నవ్వి, ఆమెను అభినందించి, ఇట్లు పలికెను.
కశ్యప ఉవాచ ।
కశ్యపుడిట్లు పలికెను --- ఓ సుందరీ! నీలో దోషము లేదు. నేను నీ విషయములో చాల ప్రీతుడనైనాను. నీవు వరమును కోరుకొనుము. భర్త సంతోషించినప్పుడు స్త్రీకి ఈ లోకములో పొందరానిది ఏది గలదు?
స్త్రీలకు భర్తయే గొప్ప దైవమని స్మృతికారులు చెప్పినారు. లక్ష్మీ పతియగు వాసుదేవుడు సకలప్రాణుల హృదయములలో ఆత్మరూపుడై యున్నాడు.
మానవులు ఆ శ్రీహరి భగవానునే, నామరూపములచే వేర్వేరుగా కల్పించబడిన దేవతామూర్తుల రూపములో ఆరాధించుచున్నారు. స్త్రీలు భర్త రూపములోనున్న శ్రీహరిని ఆరాధించుచున్నారు.
ఓ సుందరీ! కావుననే, హితము (మోక్షము) ను కోరే స్త్రీలు భర్త శుశ్రూషయే వ్రతముగా గలవారై, ఏకాంతమగు ప్రేమతో భర్తను కొలిచేదరు. వారు సర్వప్రాణులలో ఆత్మరూపుడైయున్న శ్రీహరిని భర్తలో దర్శించే దరు.
ఓ కల్యాణీ! నీవీ విధముగా నన్ను ఇంతటి ప్రేమతో భక్తిపూర్వక ముగా పూజించితివి. కావున నేను నీ కోరికను తీర్చెదను. పతివ్రతలు కాని స్త్రీలు ఇట్టి స్థితిని పొంద శక్యము కాదు.
దితిరువాచ ।
దితి ఇట్లు పలికెను --- ఓ మహర్షీ! ఇంద్రుడు నా ఇద్దరు కొడుకు లను చంపించినాడు. అట్టి నేను ఇంద్రుని చంపే కొడుకును వరముగా కోరుచున్నాను. నా కొడుకునకు చావు ఉండరాదు. నీవు వరమునిచ్చేవాడ వైతే, ఆ వరమునిమ్ము.
వేదవేత్తయగు ఆ మహర్షి ఆ మాటను వినగానే మనస్సు చెడి, అయ్యో! ఈనాడు నాకు చాల పెద్ద అధర్మము వచ్చిపడినది అంటూ, చాల సంతాపమును పొందెను.
అయ్యో! ఈనాడు స్త్రీరూపములోనున్న మాయ నా మనస్సును వశము చేసుకున్నది. ఇంద్రియభోగములయందు రమిస్తూ దీనుడనై యున్న నేను శీఘ్రముగా నరకములో పడెదను.
ఈ విషయములో ఈమె. స్త్రీస్వభావమునే అనుసరించినది. దానిలో ఆమె తప్పు ఏమి గలదు? అవివేకినగు నేనే పురుషార్థమును విస్మ రించితిని. అయ్యో! ఇంద్రియజయము లేని నేను నిందార్హుడను.
స్త్రీల ముఖము శరత్కారపద్మమువలె వికసించి యుండును. వారి మాట చెవులకు అమృతమే. కానీ, వారి హృదయము వాడియైన కత్తి యొక్క పదను గలది. వారు చేయబోయే పనిని ఎవడు తెలియగలడు?
తమ కోరికలే తమకు ప్రియమైన స్త్రీలకు సాక్షాత్తుగా ప్రియమైన వాడు ఎవ్వడూ లేడు. వారు తమ కోరిక తీరుటకై భర్తను గాని, కొడుకును గాని, సోదరుని గాని చంపెదరు; లేదా, చంపించేదరు.
ఇచ్చెదనని ప్రతిజ్ఞ చేసి, దానిని వమ్ము చేయుట తగదు. ఇంద్రుడై ననూ వధించబడుటకు తగినవాడు కాదు. ఈ విషయములో ఇది యోగ్య ముగా నుండును.
కురువంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! పూజనీయుడు, మరీచి పుత్రుడు అగు కశ్యపునకు కొంత కోపము కలిగెను. ఆయన తనను తాను నిందించుకుంటూనే చక్కని ఆలోచన చేసి, ఇట్లు పలికెను.
కశ్యప ఉవాచ ।
కశ్యపుడిట్లు పలికెను --- ఓ కల్యాణీ! నేను చెప్పే ఈ వ్రతమును నీవు యథాతథముగా ఒక సంవత్సర కాలము ధారణ చేసే పక్షములో, దేవ తలకు మిత్రుడై ఇంద్రుని చంపే కొడుకు నీకు పుట్టగలడు.
దితిరువాచ ।
దితి ఇట్లు పలికెను --- ఓ మహర్షీ! నేను వ్రతమును ధారణ చేసే దను. ఈ వ్రతములో నేను పాటించవలసిన నియమములేవి? నేను చేయ కూడని పనులు ఏవి? నేను ఏ పనులను చేసిననూ వ్రతము చెడకుండును? ఈ వివరములను చెప్పుము.
కశ్యప ఉవాచ ।
కశ్యపుడిట్లు పలికెను --- ప్రాణులను వేటినీ హింసించరాదు. తిట్లను ఉచ్చరించరాదు. అసత్యమును పలుకరాదు. గోళ్లను, జుట్టును కత్తి రించుకొనరాదు. అపవిత్రమగు వస్తువును ముట్టరాదు.
నీళ్లను మీద పోసుకోవాలి; నీళ్లలో దిగి స్నానము చేయరాదు. కోపించరాదు; దుష్టులతో మాటలాడరాదు. ఉతకని వస్త్రమును ధరించరాదు. ఏ కాలమునందైనా ఒకసారి పెట్టుకున్న మాలను మరల పెట్టుకోరాదు.
ఇతరులు తినగా మిగిలినది, చీమలు పట్టినది, మాంసము గలది, అధర్మాచరణము గలవాడు సంపాదించినది (తీసుకు వచ్చినది), లేశమై ననూ రజస్వలయొక్క సంపర్కము గలది అగు అన్నమును తినరాదు. నీటినైతే దోసిలితో త్రాగరాదు.
స్నానము చేయకుండా గాని, ముఖము చేతులు కాళ్లు కడుగుకో కుండా గాని, సంధ్యాకాలమునందు గాని, జుట్టు విరబోసుకొని గాని, బొట్టు మొదలగు అలంకారములు లేకుండా గాని, వంటినిండా వస్త్రమును కప్పు కోకుండా గాని బయట తిరుగ రాదు; హద్దు లేకుండా మాటలాడ రాదు.
కాళ్లను కడుగుకోకుండా, అశుచిగా, తడి కాళ్లతో పరుండరాదు. ఉత్తరము వైపు గాని, పడమర వైపు గాని తల పెట్టి పరుండరాదు. ఇతరులతో కలిసి గాని, నగ్నముగా గాని పరుండరాదు. రెండు సంధ్యలలో కూడ పరుండరాదు.
అన్ని వేళలా ఉతికిన వస్త్రమును ధరించి, బొట్టు మొదలగు మంగళచిహ్నములనన్నిటిని పెట్టుకొని శుచిగా ఉండవలెను. ఉదయమే ఫలహారమును చేయుటకు ముందే గోవులను, వేదవేత్తలను, లక్ష్మీదేవిని, శ్రీహరిని పూజించవలెను.
సువాసినీ స్త్రీలకు పుష్పమాలలను, గంధమును, ఆహారమును, అలంకారములను సమర్పించి పూజించవలెను. భర్తకు కూడ అన్ని విధము లుగా సేవ చేసి స్తుతించవలెను. భర్తయొక్క తేజస్సు తన కడుపులో నున్న ట్లుగా భావన చేయవలెను.
పుత్రసంతానమునిచ్చే (పుంసవనము అనే) ఈ వ్రతమును సంవ త్సర కాలము నీవు నిర్విఘ్నముగా ధరించినచో, నీకు ఇంద్రుని చంపే కొడుకు పుట్టగలడు.
ఓ పరీక్షిన్మహారాజా! దితి గొప్ప సంకల్పశక్తి గలది. ఆమె భర్త చెప్పిన మాటను సరే అని అంగీకరించెను. ఆమె తన గర్భములో కశ్యపుని తేజస్సును ధరిస్తూ, వ్రతమును యథాతథముగా వెంటనే ఆచరించెను.
మర్యాదనిచ్చే ఓ పరీక్షిన్మహారాజా! ఇంద్రుడు తెలివైనవాడు. తన పినతల్లి అభిప్రాయమును ఆయన తెలుసుకొనెను. ఆమె ప్రతము కొరకై ఆశ్రమములోనుండగా, ఆతడు ఆమెకు నిరంతరముగా సేవ చేస్తూ, ఆమె వద్దనే కనిపెట్టుకొని ఉండెను.
ఆతడు ప్రతిదినము ఆయా సమయములయందు అడవినుండి పువ్వులు, పళ్లు, దుంపలు, సమిధలు, దర్భలు, ఆకులు, చిగుళ్లు, మట్టి, నీరు అనువాటిని తీసుకు వచ్చి సమర్పించెడి వాడు.
ఓ పరీక్షిన్మహారాజా! లేడిని చంపగోరి కిరాతుడు లేడి వేషములో తిరుగాడిన తీరున, కుటిలుడగు ఇంద్రుడు ప్రతనిష్ఠయందున్న దితియొక్క వ్రతములో లోపమును వెదికి పట్టుగొన కోరికతో, ఆమెకు పరిచర్య చేస్తూ, ఆమె వద్దనే కని పెట్టుకొని యుండెను.
ఓ పరీక్షిన్మహారాజా! దితియొక్క వ్రతములో లోపమును పట్టుకొ నుటయే ఇంద్రుని పరమలక్ష్యము. కాని, ఆతనికి అట్టి లోపమేదీ దొరకలే దు. నాకిక్కడ కల్యాణము కలిగే ఉపాయమేది? అంటూ ఆయన తీవ్రమగు చింతను పొందెను.
ఒకనాడు ప్రతముచే చిక్కియున్న ఆ దితి అన్నము తిని నోరు, చేతులు, కాళ్లు కడుగుకోకుండా, సంధ్యాకాలములో నిద్రించెను, ప్రారబ్దమే ఆమెకు అట్టి మోహమును కలిగించినది.
దితి నిద్రించి తెలివిని కోల్పోయి ఉండెను. యోగశక్తులలో సమర్థు డైన ఇంద్రుడు ఆ సందు చూచుకొని, యోగశక్తిచే ఆమె ఉదరములో ప్రవే శించెను.
ఆయన బంగరు కాంతి గల ఆ గర్భమును వజ్రముతో ఏడు ముక్కలుగా కోసెను. ఏడుస్తూ ఉన్న ఆ ఖండములను మరల, ఏడ్వవద్దు అంటూనే, ఒక్కొక్కదానిని ఏడు ముక్కలుగా నరికెను.
ఓ పరీక్షిన్మహారాజా! కోసివేయ బడుచున్న ఆ గర్బపు ముక్కలు అన్నీ చేతులు జోడించి ఇట్లు పలికెను --- ఓ ఇంద్రా! మమ్ములను చంప గోరుటకు కారణమేమి? మేము నీ తమ్ములమగు మరుత్తులము.
ఇంద్రుడు ఆ మరుద్గణములతో, మీరు నా తమ్ములు గాన భయప డకుడు అని పలికెను. వారే ఆయన అనుచరులై ఏకాంతమగు ప్రేమను చూపిరి.
శ్రీనివాసుని దయచే ద్రోణపుత్రుడగు అశ్వత్థామ వేసిన అస్త్రము నిన్ను సంహరించ లేదు. అదే విధముగా, ఆ దితియొక్క గర్బము వజ్ర ముచే చాల ముక్కలుగా నలగకొట్టబడిననూ మరణించ లేదు.
జగత్కారణుడగు పురుషోత్తముని ఒక్కసారి ఆరాధించి మానవుడు ఆయనతో ఐక్యమగును. అట్టిచో, దితి ఆ శ్రీహరిని కొంచెము తక్కువగా సంవత్సరకాలము పూజించెను. కావుననే, ఆ మరుత్తులు ఇంద్రునితో కలిసి ఏభైమంది దేవతలు అరి. సవతి తల్లి సంతానమనే (తల్లి ఆసురీ అనే) దోషబుద్ధిని ప్రక్కన బెట్టి ఇంద్రుడు (శ్రీహరి) కూడ వారికి యజ్ఞములలో సమర్పించబడే సోమరసమునందు భాగమునిచ్చెను.
దోషములు లేని ఆ దితి దేవి నిద్ర లేచి, అగ్నుల వలె వెలిగిపోతూ ఇంద్రునితో కూడియున్న పుత్రులను చూచి, చాల సంతోషించేను.
తరువాత ఆమె ఇంద్రునితో నిట్లనెను --- వత్సా! ఈ వ్రతమును చేయుట చాల కష్టము. నేను. అదితి పుత్రులకు భయమును కలిగించే సంతానమును కోరి, ఈ వ్రతము ననుష్ఠించితిని.
కుమారా! నేను కోరినది ఒక్క కొడుకైతే, నలభై తొమ్మిది మంది ఎట్లు కలిగినారు ? నీకు తెలిస్తే సత్యమును చెప్పుము. అసత్యమును చెప్పవద్దు.
ఇంద్ర ఉవాచ ।
ఇంద్రుడు ఇట్లు పలికెను --- అమ్మా! నేను స్వార్థమునందు అభి నివేశము గలవాడనే గాని, ధర్మమునందు కాదు. నాకు నీ నిశ్చయము తెలిసినది. వెంటనే నేను నీ వద్దకు చేరి, కని పెట్టుకొని యుంటిని. సందు దొరక గానే, నీ గర్బమును ఛేదించితిని. స్వార్థబుద్ధి గలవాడు ధర్మమును సరకు చేయడు.
నేను గర్బమును ఏడు ముక్కలుగా చేసితిని. అవియే ఏడు బాల కులైరి. వాటిని నేను మరల ఒక్కొక్కదానిని ఏడు ముక్కలుగా నరికితిని. అయిననూ, ఆ ముక్కలు మరణించ లేదు.
ఆ అత్యద్బుతమును చూచిన నాకు, ఇది పురుషోత్తముని పూజ వలన లభించిన ఒక గొప్ప అవాంతర ఫలము, అని నిశ్చయము కలిగెను.
ఎవరైతే నిష్కామముగా భగవంతుని ఆరాధిస్తూ మోక్షమును కూడ కోరరో, వారే తమ పురుషార్థము విషయములో నిపుణులని శాస్త్ర ములు చెప్పుచున్నవి.
భక్తునిలో ఆత్మరూపుడుగా ఉండే జగన్నాథుడగు దేవుని ఆరాధిం చినచో, ఆయన తనను తానే ఇచ్చివేయును. అట్టి దేవుని ఆరాధించి, వివేకియైనవాడెవ్వడు ఇంద్రియభోగమును కోరుకొనును? ఇంద్రియభోగ ములు కొద్దో గొప్పో నరకములో కూడ ఉండును. (అనగా, వాటి కొరకై దేవుని ఆరాధించుట వ్యర్థము).
అమ్మా! నీవు మహాత్మురాలవు. అజ్ఞానినగు నేను చేసిన అట్టి ఈ దౌర్జన్యమును నీవు క్షమించ దగును. దైవానుగ్రహముచే చచ్చిపోయిన గర్భము మరల బ్రదికినది.
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఇంద్రప్రభుని పరిశుద్దమగు భావమునకు దితి సంతోషించెను. ఆయన మరుత్తులతో గూడి ఆమెకు నమస్కరించి, ఆమె అనుమతిని బడసి, స్వర్గమును చేరుకొనెను.
ఈ విధముగా మరుత్తుల కల్యాణకరమగు జన్మవృత్తాంతమునం తనూ నీవు వేసిన ప్రశ్నకు తగినట్లుగా నేను నీకు చెప్పితిని. నేను నీకిం కనూ ఏమి చెప్పవలెను?
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి ఆరవ స్కంధములో మరుత్తుల జన్మను వర్ణించే పదునెనిమిదవ అధ్యాయము ముగిసినది (18).
