శ్రీ మద్భాగవతము - షష్థమ (6వ) స్కందము
5 - దక్షుడు నారదుని శపించుట
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- విష్ణువుయొక్క మాయాశక్తిచే వర్ధిల్లజేయబడిన సామర్థ్యము గల ఆ దక్షుడు పంచజనుని కుమార్తెయగు అసిక్నియందు హర్యశ్వులు అనే పేరు గల పదివేలమంది కొడుకులను కనెను.
దానియందు స్నానము చేసినంతనే వారి హృదయములలోని మాలిన్యము విశేషముగా నిర్మూలించబడెను. వారికి పరమహంసలకు చెందిన ఆత్మధర్మమునందు గట్టిగా నిశ్చయబుద్ది కలిగేను. అయిననూ, వారు తండ్రి ఆదేశముచే నియంత్రించబడి, కఠినమగు తపస్సును మాత్రమే చేయుచుండిరి. ఈ విధముగా సంతానవృద్ధి కొరకు ఉద్యుక్తులై యున్న ఆ హర్యశ్వులను దేవర్షియగు నారదుడు చూచెను.
అపుడు నారదమహర్షి వారితోనిట్లనెను --- అయ్యో! ఓ హర్యశ్వు లారా! మీరు ప్రజాపతులే అయిననూ, మూర్ఖులే. భూమి అంతమును చూడకుండా, మీరు ప్రాణులనెట్లు సృష్టించగలరు?
అంతే గాక, ఒకే పురుషుడు గల దేశమును, బయటకు వచ్చే దారి కనబడని సొరంగమును, అనేకరూపములు గల యువతిని, వేశ్యకు భర్త యగు పురుషుని, వేర్వేరు దిక్కులలో ప్రవహించే నదిని, ఇరవై అయిదు వస్తువులు గల అద్బుత గృహమును, ఒకచోట ఉండి చిత్రమగు కథలను చెప్పే హంసను, చురకత్తులతో పజ్రములతో చేయబడి తనంత తానే తిరిగే చక్రమును తెలుసుకోకుండా, మూర్ఖులగు మీరు విద్వాంసుడగు మీ తండ్రిగారి ఆదేశమును పాటిస్తూ, సృష్టిని ఎట్లు చేయగలరు? ఆయన తనకు తగిన ఆదేశమునిచ్చినాడు. అయ్యో!
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- దేవర్షియగు నారదుడు విషయ మును దాచి పెట్టి చాల మాటలను చెప్పెను. హర్యశ్వులు వాటిని విని ఆ మాటలలోని రహస్యమును తమంత తాముగా బుద్దిని ఉపయోగించి తమకు సహజముగానున్న విచారశక్తితో ఆలోచించిరి.
భూమియొక్క అంతము చూడకుండా, అని నారదుడనెను. దానిలో భూమియనగా దేహేంద్రియమనస్సంఘాతము. దీనియందు అభి మానముగల జీవుడు దీనిచే బంధించబడును. ఆ అభిమానమును మట్టుబె ట్టకుండగా, బంధ హేతువులగు కర్మలను చేయుటవలన ఒరిగేదేమున్నది?
ఈశ్వరుడు అద్వితీయుడు, ఈశ్వరభావము, రక్షించే శక్తి, కీర్తి, శ్రీ, జ్ఞానము, వైరాగ్యములు పూర్ణముగా నున్న ఆ ఈశ్వరుడు తనకు తానే ఆధారుడై ప్రకృతికి అతీతుడుగ నున్నాడు. ఆయనయే జీవులయందు జాగ్ర త్స్వప్నసుషుపులు అనే మూడు అవస్థలకు అతీతమైన తురీయ-ఆత్మత త్వమై యున్ననూ, సంసారమునకు అతీతుడుగనే యున్నాడు. అట్టి ఈశ్వరుని ఆత్మరూపముగా దర్శించకుండా, మోక్షమునకు పనికి రాని కర్మల వలన మానవునకు ఒరిగేదేమున్నది? (ఒకే పురుషుడున్న రాష్ట్రము)
పాతాళమును చేరినవాడు మరల తిరిగి రాడు. అదే విధముగా, మానవుడు తనకు అంతరతమమగు ఆత్మజ్యోతిరూపముగానున్న ఈశ్వ రుని తెలుసుకున్నచో, మరల జన్మ ఉండదు. అట్టి ఆత్మతత్త్వమును తెలు సుకోకుండా, మిథ్యాఫలములనిచ్చే కర్మల వలన ఒరిగేదేమున్నది? (బయట పడే దారి లేని బిలము)
ఈ లోకములో మానవుని బుద్ధి తిరుగుబోతు స్త్రీవలె అనేకరూప ములను దాల్చును. సత్త్వరజస్తమోగుణముల కార్యమగు. ఈ బుద్దితోడి తాదాత్మ్యమును సాధకుడు వివేకముచే అంతము చేయవలెను. అది చేయ కుండా, అశాంతిని పెంచే కర్మలను చేయుట వలన ఒరిగేదేమున్నది?
ఈ బుద్ది కులట వంటిది. దానితోడి తాదాత్మ్యము వలన తన స్వాతంత్యము (అసంగత్వము) ను పోగొట్టుకొని, కులటయొక్క భర్త వలె, ఆ బుద్దియందలి పరిణామములతో మమేకమై సంసారదుఃఖముననుభవి స్తూ, మానవుడు తన స్వరూపమును తెలియలేకున్నాడు. ఈ లోకములో అట్టివానికి ఆ అజ్ఞానమును తొలగించలేని కర్మల వలన ఒరిగేదేమున్నది?
సృష్టిప్రళయములను చేసే మాయాశక్తియే రెండు వైపులకు ప్రవ హించే నది. భక్తిజ్ఞానములే ఆ నదినుండి బయటపడునట్లు చేసే ఏరు కట్ట లవంటివి. జీవుడు ఆ గట్టు చేరుకోకుండా నదీవేగము వంటి కామక్రోధా దుల వేగము అడ్డుపడును. అట్టి మాయను గురించి తెలుసుకోకుండా సంసారములో గర్వించియున్న అజ్ఞానికి, సంసారములోనికి పడద్రో సే కర్మల వలన ఒరిగేదేమున్నది? (ఉభయతోవాహా నదీ - యొక్క వివరణము)
మూలప్రకృతి (ఈశ్వరుని మాయాశక్తి), మహత్తత్వము (సమష్టి బుద్దిశక్తి), అహంకారము (సమష్టి), అయిదు సూక్ష్మభూతములు, మన స్సు, ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, ఐదు స్థూలభూ తములు, పరిచ్ఛిన్న జీవభావము అనే ఇరవై అయిదు తత్త్వముల సమాహా రమగు ఈ దేహేంద్రియమనస్సంఘాతమునకు ఉనికిని, ప్రకాశమును ఇచ్చే అద్భుతమగు అద్దము వంటిది ఆత్మ. అట్టి సచ్చిదాత్మయే మానవుని అంతరతమమగు స్వరూపము. ఈ జన్మలో దానిని తెలుసుకోకుండా, తన స్వరూపమును కప్పిపుచ్చే కర్మల వలన ఒరిగేదేమున్నది?
ఈశ్వరుని ప్రతిపాదించి బంధమోక్షముల వ్యవస్థను బోధించే అధ్యాత్మశాస్త్రము హంస వంటిది. అది నీరక్షీరవివేకమువలె దృ శ్యమునుండి దృక్-స్వరూపమును వివేచించును. దానిని అభ్యసించి ఆత్మ స్వరూపమును తెలియవలెను. అది చేయకుండా, బహిర్ముఖుని చేసే కర్మల వలన ఒరిగేదేమున్నది? (హంసం చిత్రకథమ్ అనుదాని వివరణ).
స్వతంత్రముగా గిర గిర తిరుగుతూ జగత్తునంతనూ తన వాడి కోరలలో పిప్పి చేసే కాలమనే చక్రమును తెలుసుకోకుండా, ఆ కాలప్రవా హములోనికి నెట్టివేసే కర్మల వలన ఈ లోకములో ఒరిగేదేమున్నది?
శాస్త్రము తండ్రివంటిది. అది సంసారమును నివృత్తి చేసే ఆత్మ జ్ఞానమును బోధించుచున్నది. త్రిగుణకార్యమగు సంసారమునందే నమ్మ కము గల మానవుడు సంసారనివృత్తికి దారి చూపే ఆ ఆత్మజ్ఞానము కొరకు ఏల ప్రయత్నము నారంభించును? (జన్మనిచ్చిన తండ్రి ఆజ్ఞ కంటే జ్ఞానమునిచ్చే తండ్రి వంటి శాస్త్రమే ఉపాదేయము).
ఓ పరీక్షిన్మహారాజా! అందరు కలిసి ఒకే విధముగా ఆ హర్య శ్వులు ఈ ఉపదేశమునందు నిశ్చయబుద్ధి గలవారై, ఆ నారదునకు ప్రదక్షి ణము చేసి, ఆత్మజ్ఞానము కొరకు ప్రయత్నించిరి. ఈ జ్ఞానము వలన కలిగే మోక్షమునందు పునర్జన్మ ఉండదు.
ఇంద్రియాధిపతియగు శ్రీహరి సంగీతస్వరములనే శబ్దబ్రహ్మరూ పముగా సంగీతజ్ఞులకు ఆవిర్భవించును. నారదముని అట్టి శ్రీహరి పాదప ద్మమునందు ఏకాగ్రమగు చిత్తమును దృఢముగా నిలిపి, లోకములను సంచరించెను.
సచ్చీలముతో శోభిల్లే తన పుత్రులు నారదుని కారణముగా గృహ స్థధర్మమును విడిచి కనబడకుండా పోయినారని విన్న దక్ష ప్రజాపతి దుఃఖ మును, పరితాపమును పొందెను. మంచి సంతానము గల తల్లిదండ్రులకు ఆ సంతానమే దుఃఖములకు ఆలవాలము అగుచుండును గదా!
స్వయంభువుడగు బ్రహ్మగారు ఆ దక్షుని ఓదార్చిరి. తరువాత మరల దక్షునకు పంచజనుని కుమార్తెయగు అసిక్నియందు వేయి మంది శబలాశ్వులనే పుత్రులు కలిగిరి.
తండ్రియగు దక్షుడు వారిని కూడ సంతానమును కనుడని చక్కగా ఆదేశించెను. వారు అట్లు చేయుటకే వ్రతమును దాల్చి, (తపస్సు కొరకై నారాయణసరస్సునకు వెళ్లిరి. వారి అన్నలు సిద్ధి పొందిన స్థానమదియే.
ఆ సరస్సులో స్నానము చేసినంతనే వారి అంతఃకరణములలోని మాలిన్యము తొలగిపోయెను. వారచట సర్వోత్తమమగు (పరబ్రహ్మరూపమగు) ఓంకారమును జపిస్తూ, గొప్ప తపస్సును చేసిరి.
వారు కొన్ని నెలలు నీటిని మాత్రమే త్రాగి, మరి కొన్ని నెలలు వాయువును మాత్రమే భక్షించి, ఈ క్రింది మంత్రమును జపిస్తూ, వాక్కు లకు ప్రభువగు శ్రీహరిని ఆరాధించిరి.
ఓమ్ నారాయణుడు పూర్ణుడు, సర్వమునకు ఆత్మ, పరిశుద్దమగు అంతఃకరణములో ఆవిర్భవించువాడు, పరమహంసల రూపములోనుండు వాడు. ఆయనను నమస్కరించి ధ్యానించుచున్నాము.
ఓ మహారాజా! వారీ విధముగా ప్రతిసృష్టిని చేయవలెనని నిశ్చ యించుకొని యుండిరి. నారదముని వారి దగ్గరకు కూడ వెళ్లి, ఇదివరలో చెప్పినట్లుగానే దాపరికముతో గూడిన వచనములను చెప్పెను.
ఓ దక్ష పుత్రులారా! మీకు అన్నలయందు ప్రేమ మెండు. మీరు నా ఉపదేశమును విని, వారు అనుసరించిన మార్గమును తెలుసుకొనుడు.
అన్నగారు నడిచిన శ్రేష్ఠమగు మార్గములో నడిచే ధర్మవేత్తయగు తమ్ముడు పుణ్యమే తోడు కాగా స్వర్గములో సోదరప్రేమ గల మరుత్తులతో గూడి ఆనందించును.
శ్రేష్ఠుడవగు ఓ రాజా! నారదుని దర్శించుట వ్యర్ధము కాదు, ఆయన ఇంతమాత్రము చెప్పి వెళ్లిపోయెను. వారు కూడ తమ అన్నల దారినే అనుసరించిరి.
పరమాత్మను దర్శించే అంతర్ముఖమార్గము మానవునకు సమీచీ నమైనది, సుఖకరము. ఆ మార్గములో వెళ్లిన ఆ సోదరులు, గడచిపోయిన రాత్రులు వలె, ఈ నాటికి కూడ తిరిగి రాలేదు.
అదే కాలములో దక్ష ప్రజాపతికి అనేకములగు చెడు శకునములు కనబడెను. నారదుడు తన పుత్రులను పూర్వమునందు వలెనే గృహస్థాశ్ర మమునుండి చెడగొట్టినాడని ఆయన వినెను.
ఈ దక్షుడు పుత్రశోకముచే మూర్చిల్లెను. తరువాత ఆయనకు నారదునిపై కోపము కలిగెను. నారదుని చూచిన వెంటనే కోపముతో క్రింది పెదవి అధికముగా వణుకుచుండగా, ఆయన ఇట్లనెను.
దక్షుడిట్లు పలికెను --- అయ్యో! నీవు సాధువుల వేషములోనున్న దుష్టుడవు. సత్పురుషులమగు మాకు అపకారమును చేసితివి. పిల్లలకు భిక్షుకుల మార్గము (సన్న్యాసము) ను ఉపదేశించితివి.
ఓరీ పాపీ! దేవ-పితృ-ఋషి-ఋణములనుండి నా పుత్రులింకనూ విముక్తులు కాలేదు. వారు కర్మలను చేయలేదు. కర్మల అని త్యత్వమును విచారించి తెలుసుకొనలేదు. అట్టి నా పుత్రులకు నీవు ఇహప రలోకములు రెండింటియందు సుఖమునకు విఘాతమును కలిగించితివి.
దయ లేని నీవు ఈ విధముగా నా పుత్రుల మతిని చెడగొట్టితివి. శ్రీహరి అనుచరుల మధ్యలో తిరిగే నీవు ఆయన కీర్తిని కూడ చెడగొట్టెదవు. నీకు సిగ్గు లేదు.
ఈ ప్రేమభావమును చంపి వైరము లేనివారితో కూడ వైరమును పూనే నిన్ను మినహాయిస్తే, భగవద్భక్తులు అన్ని కాలములలో ప్రాణు లననుగ్రహించుటకు వ్యగ్రులుగా నుండెదరు. ఇది నిశ్చయము.
ఇంద్రియనిగ్రహము వలన సంసారాసక్తియొక్క పాశములు తెంచ బడునని నీవు తలపోయవచ్చును. కాని, నీవంటి జ్ఞానము లేని అసత్యసా ధువులు కారణముగా ఈ తీరున వ్యక్తులకు వైరాగ్యము ఉదయించదు.
ఇంద్రియభోగములననుభవించకుండా మానవుడు అవి దుఃఖ హే తువులని తెలుసుకోలేడు. కావున, వ్యక్తి వాటిని అనుభవించి తనంత తానుగా వైరాగ్యమును తేలికగా పొందును. ఇతరులచే చలింపజేయబడిన బుద్ధి గల వ్యక్తికి అంత తేలికగా వైరాగ్యము అలవడదు.
గృహస్థులమగు మేము కర్మలను చేయాలనే సంకల్పములో నుండెదము. సత్పురుషులమగు మాకు నీవు సహించ శక్యము కాని అప కారమును చేసితివి. నీ అపకారమును నేను సహించితిని.
సంతానతంతువును తెంపిన ఓ మూర్ఖుడా! నీవు మాకు మరల అపకారమును చేసితివి. కావున, లోకములలో తిరుగాడే నీకు స్థిరమగు స్థానము లేకుండు గాక!
సత్పురుషులచే కొనియాడబడే నారదుడు ఆ శాపమును, సరే అని పలికి స్వీకరించేను. సాధువు అనే పదమునకు నిర్వచనము ఏమనగా, తాను తిరిగి అపకారమును చేయుటకు సమర్థుడైననూ ఇతరులు చేసిన అపకారమును సహించువాడే సాధువు.
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి ఆరవ స్కంధములో దక్షుడు నారదుని శపించుటను వర్ణించే ఐదవ అధ్యాయము ముగిసినది(5).
