శ్రీ మద్భాగవతము - షష్థమ (6వ) స్కందము
4 - హంస గుహ్య స్తోత్రము
పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- తమరు స్వాయంభువ మన్వంతరములో దేవతలు, అసురులు, మానవులు, వాగులు, పశువులు, పక్షులయొక్క సృష్టిని సంగ్రహముగా (మూడవ స్కంధములో) చెప్పితిరి.
పూజనీయుడవగు ఓ మహర్షీ! అదే సృష్టియొక్క విస్తారమును, ప్రకృతికి అతీతుడగు భగవానుడు ఏ శక్తిచే తరువాతి సృష్టిని కొనసాగిం చెనో ఆ వివరములను నేను తెలియ గోరుచున్నాను.
సూత మహర్షి ఇట్లు పలికెను --- ఓ గొప్ప మహర్షులారా! బాద రాయణ వేదవ్యాసుని పుత్రుడగు శుకుడు గొప్ప జ్ఞాని. ఆయన రాజర్షియగు పరీక్షిత్తు వేసిన చక్కని ప్రశ్నను అభినందించి, ఇట్లు పలికెను.
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ప్రాచీనబర్హిషుని పుత్రులగు ప్రచేతసులు పదిమంది సముద్రము లోపలినుండి బయటకు వచ్చి, చెట్లతో నిండియున్న భూమిని చూచిరి.
తపస్సుచే వారి కోపము ప్రజ్వరిల్ల జేయబడెను. వారు చెట్లపై కోపించి వాటిని తగులబెట్ట గోరి, నోటినుండి గాలిని మంటలను సృష్టించిరి.
కురువంశోద్దారకుడవగు ఓ పరీక్షిన్మహారాజా! ఓషధులకు ప్రభు వు, మహాత్ముడు అగు చంద్రుడు ఆ అగ్ని వాయువులు ఆ చెట్లను తగుల బెట్టుచుండగా చూచి, వారి కోపమును నిశ్చయముగా చల్లార్చువాడై ఇట్లు పలికెను.
మీరు ప్రజలను వర్ధిల్ల జేయగోరే ప్రజాపతులని చెప్పుచున్నారు. అట్టి మీరు దీనముగా నిలిచిన చెట్లకు ద్రోహమును తల పెట్టుట తగదు.
ఆహా! ప్రజాపతులకు ప్రభుడు, నాశము లేనివాడు, సర్వసమర్థుడు (వ్యాపకుడు) అగు శ్రీహరి భగవానుడు చెట్లను, పంట మొక్కలను ప్రాణు లకు బలమునిచ్చే ఆహారము కొరకై సృష్టించెను.
చరములగు పక్ష్యాదులకు అచరములగు పళ్లు మొదలగునవి, కాళ్లతో నడిచే పశ్వాదులకు కాళ్లు లేని మొక్కలు మొదలగునవి ఆహారమ గుచున్నవి. చేతులు గల మానవులకు చేతులు లేని చెట్లు ఆహారమును సమకూర్చుచున్నవి. రెండు కాళ్ల మానవులకు నాలుగు కాళ్ల ఎద్దులు మొదలగు జంతువులు పంటలను పండించుటలో తోడ్పడుచున్నవి.
ఓ పుణ్యాత్ములారా! మీ తండ్రియగు ప్రాచీనబరీషుడు, దేవదేవు డగు శివుడు కూడ మిమ్ములను సంతానమును సృష్టించుడని ఆదేశించి నారు గదా! అట్టి మీరు చెట్లను తగులబెట్టుట ఉచితము ఎట్లగును?
మీ తండ్రి, తాత, ముత్తాతలు కూడ సేవించిన సన్మార్గము (శాం తి) ను మీరు కూడ ఆశ్రయించుడు. మండి పడే కోపమును తగ్గించుడు.
పిల్లలకు తల్లిదండ్రులు, కన్నుకు రెప్ప, స్త్రీకి భర్త, భిక్షుకులకు గృహస్థుడు, అజ్ఞానులకు పండితుడు రక్షకుడు మరియు హితచింతకుడు అగుచున్నారు. అదే విధముగా, ప్రజలకు రాజు రక్షకుడు, హితచింతకుడు.
సర్వేశ్వరుడగు శ్రీహరి ప్రాణుల దేహములయందు ఆత్మరూపుడై ప్రకటమగుచున్నాడు. ఈ సర్వము ఆయన నివాసస్థానమనియే తెలుసుకో నుడు. మీరట్లు చేసినచో, ఆయన మీ విషయములో ప్రీతుడగును.
ఆకాశమునుండీ కోపము దేహము లోనికి హఠాత్తుగా ఊడిపడి నదా యనిపించును. లేదా, హృదయాకాశమునుండి భయంకరమగు కోపము ఉబికివచ్చును. అట్టి కోపమును ఎవడైతే ఆత్మవిచారముచే ఉప సంహరించునో, అట్టివాడు త్రిగుణాత్మకమగు సంసారము నతిక్రమించును.
దీనమగు వృక్షములను తగులబెట్టుటను చాలించుడు. మిగిలిన చెట్లకు మీకు మంగళమగుగాక! ఈ శ్రేష్ఠయగు కన్యను చెట్లే పాలించినవి. ఈమెను మీరు భార్యగా స్వీకరించుడు.
ఓ పరీక్షిన్మహారాజా! ఓషధులకు రాజగు చంద్రుడీ విధముగా వారి కోపమును చల్లార్చెను. ప్రమౌచ అనే అప్సరస కుమార్తె, సుందరియగు మారిష అనే కన్యను వారికి అప్పజెప్పి, ఆయన నిష్క్రమించెను. అపుడు వారామెను ధర్మబద్ధముగా వివాహమాడిరి.
వారికి ఆమెయందు దక్షుడు పుట్టెను. దక్షుడు ప్రాచేతసుడు (ప్రచే తసుల పుత్రుడు) అని ప్రసిద్ధియే గదా! ఆ దక్షుని ప్రజాసృష్టిచే ముల్లోక ములు అంతటా నిండినవి.
దక్షునకు కుమార్తెలయందు ప్రేమ మెండు. ఆయన బీజముచే మరియు మనస్సంకల్పముచే కూడ ప్రాణులను సృష్టించేను. నేనా వివర ములను చేప్పెదను. సావధానముగా వినుము.
దక్ష ప్రజాపతి ముందుగా మనస్సంకల్పముతోనే దేవతలు, అసు రులు, మానవులు మొదలగు ప్రాణులను సృష్టించేను. ఈ ప్రాణులకు ఆకా శము, నేల, నీరు నివాసస్థానములు.
ఆ ప్రజాసృష్టి వర్ధిల్లుట లేదని ఆ ప్రజాపతి గమనించెను. అపుడా యన వింధ్యయొక్క పాదపర్వతములను చేరుకొని, చేయుటకు శక్యము కాని తపస్సును చేసెను.
అచట అఘమర్షణమని ప్రసిద్ధి గాంచిన, పాపములను పోగొట్టే గొప్ప తీర్థము గలదు. దానియందు ఆయన మూడు పూటలా స్నానము చేస్తూ తపస్సుచే శ్రీహరిని ప్రసన్నుని చేసుకొనెను.
ఇంద్రియాతీతుడగు శ్రీహరి భగవానుని ఆ ప్రజాపతి హంసగు హ్యము (పరమహంసల రహస్యము) అనే స్తోత్రముతో స్తుతించి, ప్రస న్నుని చేసుకొనెను. నీకా స్తోత్రమును నేను చెప్పెదను.
పరమేశ్వరుని అమోఘమగు చైతన్యశక్తినుండియే త్రిగుణాత్మిక యగు మాయ ప్రకటమైనది. త్రిగుణకార్యమగు దేహేంద్రియమనస్సంఘా తమునందు ఆ చైతన్యముయొక్క ప్రతిఫలనమే జీవుడు. ఈ విధముగా ఆ పరమేశ్వరుడే మాయాశక్తికి, జీవులకు నియామకుడగుచున్నాడు. త్రిగుణకా ర్యమగు జగత్తునందు సత్యత్వబుద్ధి గలవారు ఆయన స్వరూపమును తెలి. యలేరు. ఆయన ప్రత్యక్షాది ప్రమాణములకు గోచరము కాడు. స్వయంప్ర కాశ స్వరూపుడగు అట్టి పరమేశ్వరుని కొరకు నమస్కరించుచున్నాను.
జీవేశ్వరులు సర్వకాలమిత్రులు. నగరమనదగిన ఈ దేహము నందు జీవునితో బాటుగా మిత్రుడగు ఈశ్వరుడు కూడ సర్వజగత్సాక్షియై కలిసి నివసించుచున్నాడు. కాని, జీవుడు తన మిత్రుని గుర్తించ లేకున్నా డు. శబ్దము మొదలగు విషయములు చెవి మొదలగు ఇంద్రియములచే ప్రకాశింప జేయబడునే గాని, ఆ ఇంద్రియములను ఈ విషయములు ప్రకా శింప జేయలేవు. అదే విధముగా, జీవుడు నిత్యదృక్-స్వరూపుడగు ఈశ్వ రుని తన జ్ఞానములో విషయముగా చేయలేడు. అట్టి సర్వేశ్వరునకు నేను నమస్కరించుచున్నాను.
శరీరము, ప్రాణములు, ఇంద్రియములు, మనోవృత్తులు, ఆకా. శము వాయువు అగ్ని జలము పృథివి అనే అయిదు స్థూలభూతములు, శబ్దము స్పర్శ రూపము రసము గంధము అనే అయిదు సూక్ష్మభూత ములు ఇవన్నీ కలిసి ఒక సంఘాతము. ఈ సంఘతమునకు ద్రష్టయగు జీవుడు ఈ సంఘాతమునకు అతీతుడై, వీటినన్నింటినీ మాత్రమే గాక, క్రమముగా సత్త్వరజస్తమోగుణకార్యములగు సుఖదుఃఖమోహములను కూడ తెలియుచున్నాడు. కాని, ఆ జీవుడు తనకంటె అతీతమైన దేశకాలపరిచ్చేద రహితమైన సర్వజ్ఞుడగు ఈశ్వరుని తన జ్ఞానములో విషయముగా చేయలేడు. అట్టి ఈశ్వరుని నేను స్తుతించుచున్నాను.
ఇంద్రియవ్యాపారములను, మననాది వ్యాపారములను కూడ కట్టి బెట్టినప్పుడు, నామరూపములను తెలుసుకుంటూ ఉండే మనస్సు తన స్వరూపమునందు విలీనమగును. అప్పుడు జీవుడు తన స్వరూపమగు అద్వితీయ-ఆత్మయందు నిలిచియుండును. ఈ విధముగా జీవుడు ఆ ఈశ్వరుని ఆత్మరూపముగా పొందగల్గును. ఆ విధముగా శుద్దమగు అంతః కరణములో ఆత్మరూపముగా ప్రకాశించే సర్వజ్ఞుడగు ఈశ్వరుని కొరకు నమస్కారము..
అవ్యక్తము, మహత్తు (బుద్ధిశక్తి), అహంకారము, మనస్సు, అయిదు సూక్ష్మభూతములు వెరసి ఈ తొమ్మిది పరమేశ్వరుని శక్తులగు సత్త్వరజస్తమోగుణముల కార్యములు. వీటితో ఈశ్వరుడు మానవుని హృద యము లోపల గూఢముగా స్థిరముగా నున్నాడు. కట్టెయందు దాగియున్న అలౌకికమగు అగ్నిని వేదవేత్తలు పది హేను సామధేనీ మంత్రములను పఠిస్తూ మథించి ప్రకటము చేసెదరు. అదే విధముగా మనోనిగ్రహమునభ్య సించే మహాత్ములు వివేకపూర్ణమగు బుద్ధితో ఆ ఈశ్వరుని ఈ సంఘాత మునుండి వివేచించి, ఆత్మరూపముగా దర్శించెదరు.
సకలభేదములతో గూడిన మాయాకార్యమగు జగత్తును నిషేధిం చగా దుఃఖస్పర్శ లేకుండగా నా హృదయములో ప్రకటమయ్యే ఆనందానుభవమే ఆ ఈశ్వరుడు. ఈ జగత్తులోని సకలనామరూపములు ఆయ నయే. అనిర్వచనీయ మాయాశక్తి గల ఆయన నాపై ప్రసన్నుడగు గాక!
మనము వాక్కుతో దేనిని ఇదమిత్తముగా నిర్దేశిస్తామో, ఇంద్రియ ములతో గాని మనస్సుతో గాని బుద్దిచే గాని తెలుసుకుంటామో, అది సత్త్వరజస్తమోగుణముల కార్యమే యగును గాని, ఈశ్వరుని స్వరూపము కాజాలదు. త్రిగుణకార్యమగు జగత్తుయొక్క సృష్టిస్థితిలయములకు అధి స్థానమగు ఈశ్వరుని, జగన్ని షేధమునకు అవధిగా మాత్రమే తెలియుట సంభవము. ఈ విధముగా జగత్తు ఈశ్వరునకు తటస్థ లక్షణమగుచున్నది.
పరబ్రహ్మ ఈ తన జగత్తును తనయందు తననుండి తనచే తాను తన కొరకు ప్రకటించి సర్వమును తానే చేస్తూ, చేయిస్తున్నాడు. ఆ చేసే ప్రక్రియ కూడ పరబ్రహ్మయే. కార్యకారణములకు పూర్వమే స్వయంసిద్ధ మైయున్న పరబ్రహ్మ ఆ కార్యకారణములన్నింటికీ హేతువు. అట్టి పర బ్రహ్మ అఖండము, అద్వితీయము.
వాదులు, ప్రతివాదుల వివాదసంవాదములకు మూలము ఆ పర మేశ్వరుని మాయాశక్తులే. ఆ మాయాశక్తులే వీరి బుద్దులలో మరల మరల వ్యామోహమును కలిగించుచుండును. అనంతములగు గుణములు కలిగి సర్వమును వ్యాపించియున్న ఆ పరమేశ్వరునకు నమస్కారము.
యోగశాస్త్రము (నిష్కామ కర్మ మరియు భక్తి) ఈశ్వరునకు నామరూపములు గలవనియు, జ్ఞానయోగము ఈశ్వరునకు నామరూప ములు లేవనియు, ఈ విధముగా భిన్నములు మరియు పరస్పరవిరుద్ద ములు అగు ప్రతిపాదనములను చేయుచున్నట్లు కన్పట్టును. కానీ, ఈ రెండు యోగములు ఒకే పరమాత్మ తత్త్వమునందు నిష్ఠ గలవియై, దానినే తాత్పర్యముగా ప్రతిపాదించుచున్నవి. వాటికి మూలములో ఒక నొక మూలతత్త్వము రెండింటికీ అనుకూలమైనది మరియు రెండింటికీ సమానమైనది గలదు. అదియే సకలభావాభావముల నిషేధములకు అవధి. యైన ఆత్మరూపముగా తెలియబడే పరబ్రహ్మ.
తన పాదముల మూలమును సేవించే భక్తులననుగ్రహించుటకై నామరూపములు, దేశకాలపరిచ్చేదములు లేని భగవానుడు అవతరించి లీలలను చేసి నామములను, రూపములను కూడ పొందెను. అయిననూ, నామరూపములకు అతీతుడుగనే యున్న ఆ భగవానుడు నాపై ప్రసన్ను డగు గాక!
ఈశ్వరుడు సకలప్రాణుల దేహములలో ఆత్మరూపముగా నున్నా డు. అయిననూ, జనులు సాధారణములైన ఆయా ఉపాసనలను చేస్తూ, ఈశ్వరుని ఆయా దేవతల రూపములో కొల్చెదరు. ఆయన ఆ ఉపాసన లకు తగ్గట్లుగా, వాయువు పృథివీలక్షణమగు గంధమును పట్టుకొని తాను గంధము గలది వలె కనబడినట్లుగా, ఆయా రూపములు కలవాడుగనే కన్పట్టును. అట్టి పరమేశ్వరుడు నా మనోరథమునీడేర్చు గాక!
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- కురువంశములో శ్రేష్ఠుడవగు ఓ పరీక్షిన్మహారాజా! చక్కగా స్తోత్రమును చేసే దక్షుడు ఆ అఘమర్షణతీర్థ మునందు ఈ విధముగా స్తుతించగా, భక్తవత్సలుడగు ఆ భగవానుడు ఆయనకు సాక్షాత్కరించేను.
ఆయన గరుత్మంతుని భుజములపై పాదములనుంచి, వ్రేలాడే ఎనిమిది పెద్ద బాహువులయందు చక్రము, శంఖము, కత్తి, డాలు, బాణ ము, ధనస్సు, త్రాడు, గదలను ధరించియుండెను.
పీతాంబరుడగు ఆ శ్రీహరి మేఘమువలె నల్లనివాడు. ఆయన ముఖము, కన్నులు ప్రసన్నముగ నుండెను. ఆయన దేహమునంతనూ వనమాల వ్యాపించి యుండెను. ఆయన వక్షఃస్థలముపై శ్రీవత్సము మరియు కౌస్తుభము ప్రకాశించుచుండెను.
గొప్ప కిరీటము, కంకణములు, మొసలి ఆకారములోనుండే కుండ లములు, ఒడ్డాణము, ఉంగరములు, కంఠహారము, కాలియందెలు, భుజకీ ర్తులను అలంకరించుకొని ఆయన ప్రకాశించుచుండెను.
ముల్లోకములకు ప్రభువగు ఆయన ముల్లోకములకు మోహమును కలిగించే రూపమును దాల్చియుండెను. నారదుడు, నందుడు మొదలగు అనుచరులు, లోకపాలకులు ఆయనను చుట్టువారి యుండిరి.
ఆయన వెనుక సిద్దులు, గంధర్వులు, చారణులు గానము చేస్తూ స్తుతించుచుండిరి. ఆ గొప్ప అద్భుతమగు రూపమును చూచి, దక్ష ప్రజా పతి తత్తరపాటు చెందెను. ఆయన హృదయము గొప్ప హర్షముతో నిండి పోయెను. అపుడాయన నేలపై కర్రవలే సాష్టాంగనమస్కారమును చేసెను.
కొండ కాలువలు సరస్సును నింపివేసినట్లుగా, ఉత్కటమగు ఆనందముతో మనస్సునకు ద్వారములవంటి ఆయన ఇంద్రియములు పూర్తిగా నిండిపోయెను. కావుననే, ఆయన ఏమీ చెప్పలేక పోయెను.
భక్తుడగు దక్ష ప్రజాపతి సంతానమును కోరువాడై ఆ విధముగా శ్రీహరికి ప్రణమిల్లెను. సకలప్రాణుల హృదయములోని భావములకు సాక్షి యగు జనార్దనుడు (దుష్టజనులను పీడించువాడు) అపుడు ఇట్లు పలికెను.
శ్రీభగవానుడు ఇట్లు పలికెను --- ప్రచేతసుల పుత్రుడవగు ఓ మహానుభావా! నీవు తపస్సుచే చక్కటి సిద్ధిని పొందితివి. ఏలయనగా, నీవు నాయందు అనన్యమగు శ్రద్ద గలవాడవై, నాయందు అతిశయించిన భక్తిని పొందితివి.
ఓ ప్రజాపతీ! నీవు జగత్తునకు వృద్ధి కలిగించుటకై తపస్సును చేసి తివి. కావున, నేను నీపై ప్రసన్నుడనైతిని. నా కోరిక కూడ ప్రాణులు సంపద లను పొందాలనియే.
బ్రహ్మగారు, శివుడు, మీరు ప్రజాపతులు, మనువులు, లోకపాల కులు -- ప్రాణుల అభివృద్ధికి కారణమగు వీరందరు నా విభూతులే.
ఓ ప్రజాపతీ! తపస్సే నా ప్రాణము, ఉపాసనయే శరీరము, విహి తకర్మయే ఆకారము, చక్కగా చేసిన క్రతువులే అవయవములు, ధర్మమే మనస్సు, దేవతలే ప్రాణములు.
సృష్టికి పూర్వములో నేను మాత్రమే కేవలసత్తారూపుడనై యుంటి ని. లోపల (ద్రష్ణ) గాని, బయట (దృశ్యము) గాని రెండవది ఏదీ లేదు. నామరూపములుగా ప్రకటము కాని చైతన్యము మాత్రమే ఉండెను. అప్పుడు అంతా గాఢనిద్రయా అన్నట్లుండెను.
అనంతములగు గుణములు గల నేను కాలమునకు అతీతుడను. నాయందు త్రిగుణాత్మకమగు మాయాశక్తి వలన గుణముల కార్యమగు బ్రహ్మాండాకారము ఏ కాలమునందు ప్రకటమయ్యెనో, అదే కాలములో ఆ బ్రహ్మాండమునందే సర్వకారణుడు, స్వయంభువుడు, యథార్థమగు పుట్టుక లేనివాడు అగు బ్రహ్మగారు కూడ ప్రకటమయ్యెను.
దేవోత్తముడగు బ్రహ్మగారు నా శక్తిచే వర్ధిల్లజేయబడినవాడే. అయిననూ, సృష్టికార్యమునందు ఉద్యుక్తుడైనప్పుడు, ఆయన తనను తాను అసమర్థుడనా యన్నట్లు తలపోసెను.
అప్పుడు నేను ఉపదేశించగా బ్రహ్మదేవుడు తీవ్రమగు తపస్సును చేసెను. ఆ తపస్సుచే లభించిన సామర్థ్యము గల బ్రహ్మగారు మొట్టమొద టగా జగత్తును సృష్టించే ప్రజాపతులైన మిమ్ములను తొమ్మిదిమందిని సృష్టించెను.
ఓయీ ప్రజాపతీ! అసిక్ని అని ప్రసిద్ధి గాంచిన ఈమె పంచజన ప్రజాపతియొక్క కుమార్తె. ఈమెను నీవు భార్యగా స్వీకరించుము.
భార్యాభర్తలగు మీరిద్దరు కలిసి జీవించుడు. ఈమెతో గూడి నీవు మరల ఈ సంతానముయొక్క సృష్టిని అధికముగా చేయగలవు.
నీ తరువాతి ప్రాణులన్నియు నా మాయచే జంటలుగా ఏర్పడి జీవించగలవు. మరియు, మానవులు మొదలగు ప్రాణులు నాకు పూజాదిక మును సమర్పించెదరు.
జగత్తును వర్ధిల్లజేయు శ్రీహరి భగవానుడు ఇట్లు పలికి, ఆ దక్ష ప్రజాపతి చూచుచుండగనే, కలలో దొరికిన వస్తువు వలె, అచటనే అంతర్దానమాయెను.
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి ఆరవ స్కంధములో హంసగుహ్యస్తోత్రమును వర్ణించే నాల్గవ అధ్యాయము ముగిసినది (4).
