శ్రీ మద్భాగవతము - షష్థమ (6వ) స్కందము
6 - దక్షుని కన్యల వంశావళి
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ప్రచేతసుల పుత్రుడగు దక్షుని స్వయంభువుడగు బ్రహ్మగారు ఓదార్చెను. తరువాత దక్షునకు అసిక్ని యందు అరవైమంది కుమార్తెలు కలిగిరి. వారికి తండ్రియందు ప్రేమ మెండు.
ఆయన ధర్మునకు పదిమందిని, తార్క్ష్యుడు అనే పేరు గల కశ్యప ప్రజాపతికి పదముగ్గురిని, చంద్రునకు ఇరవై ఏడుగురిని, భూతునకు ఇద్దరి ని, అంగిరసునకు ఇద్దరిని, కృశాశ్వునకు ఇద్దరిని, తార్క్ష్యుడు అని పేరు గల కశ్యపునకే మిగిలిన నలుగురిని ఇచ్చి వివాహము చేసెను.
వీరి పేర్లను, వీరి సంతానము పేర్లను నేను చెప్పెదను. వినుము. వీరి సంతానముతో, మరల వారి సంతానముతో ముల్లోకములు పూర్తిగా నిండిపోయెను.
భాను, లంబ, కకుభ, జామి, విశ్వ, సాధ్య, మరుత్వతి, వసు, ముహూర్త, సంకల్ప అనువారలు ధర్ముని భార్యలు. వారి పుత్రులను
ఓ పరీక్షిన్మహారాజా! భాను పుత్రుడు దేవఋషభుడు. ఆయన పుత్రుడు ఇంద్ర సేనుడు. లంబ పుత్రుడు విద్యోతుడు. ఆతని పుత్రులు స్తనయిత్నువులు (మేఘములు, అనగా మేఘాభిమాని దేవతలు).
కకుభకు సంకటుడు పుత్రుడు. సంకటునకు కీకటుడు పుత్రుడు. కీక టునకు భూదుర్గములు (అభిమాని దేవతలు) పుత్రులు. జామి పుత్రుడు స్వర్గుడు (స్వర్గము). స్వర్గుని పుత్రుడు నంది (ఆనందము).
విశ్వ పుత్రులు విశ్వేదేవతలు. వారికి సంతానము లేదని చెప్పెదరు. సాధ్య పుత్రులు సాధ్యగణము. వారి పుత్రుడు అర్థసిద్ధి.
మరుత్వతికి మరుత్వంతుడు, జయంతుడు అనే ఇద్దరు పుత్రులు కలిగిరి. జయంతుడు వాసుదేవుని అంశయగు ఉపేంద్రుడని చెప్పెదరు.
ముహూర్తకు ముహూర్తములకు అభిమానులగు దేవతల గణ ములు జన్మించెను. ఆ దేవతలు ప్రాణులకు వారి వారి కర్మఫలములను తమ తమ కాలముల (ముహూర్తముల) యందు ఇచ్చుచుందురు.
సంకల్పకు సంకల్పుడు (సంకల్పము) అనే పుత్రుడు గలడు. వానికి కాముడు అనే పుత్రుడు గలడు (సంకల్పమునుండి కోరిక పుట్టుట). వసువు అనే కన్యకు వస్తువులు అనే ఎనమండుగురు పుత్రులు గలరు. వారి పేర్లను వినుము.
ద్రోణుడు, ప్రాణుడు, ధ్రువుడు, అర్కుడు, అగ్ని, దోషుడు, వసు వు, విభావసువు అనునవి వారి పేర్లు. ద్రోణునకు అభిమతీ అనే భార్య యందు హరుడు, శోకుడు, భయుడు మొదలగు పుత్రులు కలిగిరి. (తాను అల్పుడనని భావించే జీవునకు దేహమునందలి అభిమానము వలన హర్షము శోకము భయము మొదలగునవి కలుగుచుండును).
ప్రాణునకు (ప్రాణశక్తి) ఊర్జస్వతి (బలము గలది) భార్య. వారికి సహుడు (సహనము), ఆయువు (ఆయుర్దాయము), పురోజవుడు (ముం దుకు వేగముగా నడచుట) అనువారు పుత్రులు. ధ్రువునకు భార్యయగు ధరణి (భూమి) వివిధములగు పురములను కనేను (పురములకు ఆశ్రయము య్యెను).
అర్కునకు వాసన అనే భార్యయందు తరుడు మొదలగు పుత్రులు కలిగిరి (పూర్వసంస్కారములనుండి తృష్ణ ఉదయించుట). అగ్నికి వసోర్ధార (నేతిని ధారగా అర్పించే హోమము) అనే భార్యయందు ద్రవిణకుడు (సంపద) మొదలగు పుత్రులు కలిగిరి (వసోర్ధార అనే హోమ మును చేసినచో సంపదలు మొదలగునవి కలుగును).
అగ్నికే కృత్తికలు అనే భార్యలయందు స్కందుడు పుట్టెను. స్కందునకు విశాఖుడు మొదలగువారు పుత్రులు. దోషునకు శర్వరి అనే భార్యయందు శ్రీహరి అంశయగు శిశుమారుడు జన్మించెను.
వసువునకు ఆంగిరసియందు శిల్పాచార్యుడగు విశ్వకర్మ పుట్టెను. విశ్వకర్మ పుత్రుడు చాక్షుష మనువు. ఆయన పుత్రులు విశ్వేదేవతలు మరియు సాధ్యులు.
విభావసువునకు భార్యయగు ఉషయందు వ్యుష్టుడు, రోచిషుడు, ఆతపుడు అనే పుత్రులు కలిగిరి (సూర్యుడు ఉషఃకాలములో ఉదయించిన ప్పుడు వేకువ కాంతి ఎండలు వరుసగా కలుగును). ఆతునకు పంచయా ముడనే పుత్రుడు కలిగెను. వాని వలననే ప్రాణులు తమ కర్మలను చేసు కుంటూ తెలివిగా నుండును .(అయిదు జాముల పగలు సమయములో ఎండ కాయును, జనులందరు తెలివిగానుండి పనులను చేసుకొనెదరు).
భూతుని మొదటి భార్య సరూప. ఆమెకు కోట్ల సంఖ్యలో రుద్రులు పుట్టిరి. వీరిలో రైవతుడు, అజుడు, భవుడు, భీముడు, వాముడు, ఉగ్రుడు, వృషాకపి, అజైకపాత్తు, అహిర్భుధ్యుడు, బహురూపుడు అనువారలు రుద్రుని అనుచరులు. భూతములు, వినాయకులు భూతుని రెండవ భార్య సంతానము. వారు భయమును గొల్పుచుందురు.
అంగిరస ప్రజాపతియొక్క మొదటి భార్యయగు స్వధ పితృదేవత లను కనెను. రెండవ భార్యయగు సతి అథర్వవేదు (వేదము) నే పుత్రునిగా భావించెను.
కృశాశ్వునకు మొదటి భార్యయగు అర్చిస్సునందు ధూమ్రకేశు డు, రెండవ భార్యయగు ధిషణయందు వేదశిరసుడు దేవలుడు వయు నుడు మనువు అను నలుగురు పుత్రులు కలిగిరి.
తృక్షుని పుత్రుడగు కశ్యప ప్రజాపతికి వినత, కద్రువు, పతంగి, యామిని అనే భార్యలు గలరు. పతంగీ పక్షులను, యామిని మిడతలను కనెను.
వినతకు గరుడుడు, అనూరుడు అనే ఇద్దరు పుత్రులు కలిగిరి. గరుడుడు సాక్షాత్తుగా యజ్ఞేశ్వరుడగు శ్రీహరికి వాహనము కాగా, అనూ రుడు సూర్యునకు సారథి ఆయెను. కద్రువు అనేకులగు నాగులను కనెను.
భరతవంశీయుడవగు ఓ మహారాజా! కృత్తిక మొదలగు నక్షత్ర ములు చంద్రుని భార్యలు. చంద్రుడు దక్షుని శాపము వలన క్షయరోగ ముచే పీడించబడెను. ఆయనకు వారియందు సంతానము కలుగలేదు.
చంద్రుడు దక్షుని ప్రసన్నునిగా చేసుకొని, కృష్ణపక్షములో తన నుండి ఖండించబడిన కళలను తిరిగి పొందెను. తరువాత, ప్రాణుల తల్లుల పేర్లను వినుము. వీరు కశ్యప ప్రజాపతియొక్క భార్యలు. వీరినుండియే ఈ ప్రాణి సమూహము పుట్టినది. అదితి, దితి, దనువు, కాష్ఠ, అరిష్ట, సురస, ఇల, ముని, క్రోధవశ, తామ్ర, సురభి, సరమ, తిమి అనే వారి పేర్లు మంగ భకరమైనవి. తిమికి జలజంతువుల గణములు సంతానము కాగా, హింసించే జంతువులు సరమ సంతానము.
ఓ మహారాజా! సురభికి గేదెలు, గోవులు మొదలగు రెండు గిట్టల జంతువులు, తాత్రకు డేగలు గ్రద్దలు మొదలగు హింసను చేసే పక్షులు, మునికి అప్సరసల గణములు జన్మించినవి.
ఓ మహారాజా! క్రోధవశకు త్రాచుపాము మొదలగు విషసర్పము లు, ఇలకు చెట్టుచేమలు, సురసకు రాక్షసులు సంతానమై జన్మించిరి.
అరిష్టకు గంధర్వులు, కాష్ఠకు గుర్రము మొదలగు ఒంటి గిట్ట జంతువులు పుట్టినవి. దనువునకు అరవై ఒక్క పుత్రులు గలరు. వారిలో ప్రముఖులైన దానవుల పేర్లను వినుము.
ద్విమూర్డుడు, శంబరుడు, అరిష్టుడు, హయగ్రీవుడు, విభావసు వు, అయోముఖుడు, శంకుశిరసుడు, స్వర్భానువు, కపిలుడు, అరుణుడు.
పులోముడు, వృషపర్వుడు, ఏకచక్రుడు, అనుతాపనుడు, ధూమ్ర కేశుడు, విరూపాక్షుడు, విప్రచిత్తి, దుర్జయుడు అనువారలు దానవులు.
స్వర్భానువు కుమార్తెయగు సుప్రభను నముచి వివాహమాడెను. నహుషపుత్రుడు, బలశాలియగు యయాతి వృషపర్వుని కుమార్తెయగు శర్మిష్ఠను వివాహమాడెను,
దనువు పుత్రుడగు వైశ్వానరునకు అందమగు రూపము గలవారు, ఉపదానవి, హయశిర, పులోమ, కాలక అనే నలుగురు కుమార్తెలు గలరు.
హిరణ్యాక్షుడు ఉపదానవిని, క్రతువు హయశిరను వివాహమాడిరి. బ్రహ్మగారు ప్రేరేపించగా పూజనీయుడగు కశ్యప ప్రజాపతి వైశ్వానరుని మిగిలిన ఇద్దరు కుమార్తెలను, అనగా పులోమను కొలకను కూడ, వివాహ మాడెను. పులోమ సంతానము పౌలోములు, కాలక సంతానము కాలకే యులు అనే దనువంశీయులగు రాక్షసులు. వీరు యుద్ధమునందు శోభిల్లే వీరులు.
ఓ పరీక్షిన్మహారాజా! పౌలోమ కాలకేయ వంశములకు చెందిన అరవై వేలమంది దానవులు (నివాతకవచులు) యజ్ఞములను చెడగొట్టెడివా రు. వారిని నీ తండ్రి అభిమన్యుని తండ్రియగు అర్జునుడొక్కడే స్వర్గము నకు వెళ్లినప్పుడు సంహరించి, ఇంద్రునకు ప్రీతిని కలిగించేను.
విప్రచిత్తికి సింహికయందు నూట ఒక్కమంది పుట్టిరి. వారిలో పెద్ద వాడు రాహువు. మిగిలిన వందమందికి కేతువులు అని పేరు. రాహువు గ్రహము అయ్యెను.
మంగళమగు గాక! ఈ పైన అదితి వంశమును క్రమముగా చేప్పె దను. వినుము. ఆ వంశములో సర్వవ్యాపకుడగు నారాయణ దేవుడు తన అంశచే (వామనుడై) అవతరించేను.
వివస్వంతుడు, అర్యముడు, పూష, త్వష్ట, సవిత, భగుడు, ధాత, విధాత, వరుణుడు, మిత్రుడు, ఇంద్రుడు, పెద్ద అడుగులు వేసిన వామ నుడు అదితి పుత్రులు. (పన్నెండుగురు ఆదిత్యులు)
వివస్వానునకు గొప్ప సౌభాగ్యవతియగు సంజ్ఞయందు శ్రాద్ధదేవ (వైవస్వత) మనువు, యమదేవుడు యమున అనే కవలలు కలిగిరి. ఇంతే గాక, ఆమె భూలోకములో ఆడు గుర్రమై అశ్వినీ కుమారులను కనెను.
వివస్వానునకు రెండవ భార్యయగు ఛాయయందు శనైశ్చరుడు, సావర్ణి మనువు, తపతి అనే కన్య పుట్టిరి. తపతి సంవరణుడు అనే రాజును భర్తగా వరించేను.
అర్యముని భార్య మాతృక. వారికి చర్షణులు అనే పుత్రులు కలిగి రి. వారు వివేకజ్ఞానము గలవారగుటచే, వారిని ఆధారముగా చేసుకొని, బ్రహ్మగారు మానవజాతిని రచించిరి.
పూషకు సంతానము లేదు. పూర్వము దక్షయజ్ఞమునందు దక్షు నిపై కోపించిన శివుని చూచి, ఈ పూష పళ్లను ఇకిలించి నవ్వగా, వీరభద్రుడు ఆతని పళ్లను విరుగగొట్టెను. కావుననే, ఆతడు పిండిని తినును.
దైత్యుల చెల్లెలు, రచన అని ప్రసిద్ధి గాంచినది అగు కన్యక త్వష్టకు భార్య. వారిద్దరికి సంనివేశుడు, పరాక్రమశాలియగు విశ్వరూపుడు జన్మించిరి.
ఒకప్పుడు అంగిరసుని పుత్రుడు, దేవగురువు అగు బృహస్పతి ఇంద్రునిచే అవమానించబడి దేవతలను విడిచి పెట్టెను. అప్పుడు దేవగణ ములు, తమ శత్రువులగు దైత్యుల చెల్లెలు కొడుకే అయిననూ, విశ్వరూ పుని పురోహితునిగా వరణము చేసిరి.
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి ఆరవ స్కంధములో దక్షుని కన్యల వంశావళిని వర్ణించే ఆరవ అధ్యాయము ముగిసినది .
