శ్రీ మద్భాగవతము - షష్థమ (6వ) స్కందము
14 - వృత్రాసురుని పూర్వచరితము – చిత్రకేతువునకు పుత్ర వియోగము
పరీక్షిన్మహారాజు ఇట్లు ప్రశ్నించెను --- ఓ మహర్షీ! పాపియగు వృత్రుని స్వభావము రజోగుణము, తమోగుణము ప్రధానముగా గలది. అట్టివానికి నారాయణ భగవానునియందు దృఢమగు భక్తి ఎట్లు కలిగెను?
దేవతలు, మహర్షుల అంతఃకరణములు శుద్ధమగు సత్త్వగుణము ప్రధానముగా కలిగి నిర్మలముగా నుండును. మోక్షప్రదాతయగు శ్రీహరి యందు వారికి కూడ భక్తి తరచుగా ఉదయించుట లేదు.
భూమిపై ధూళికణములు ఎన్ని గలవో, ఈ జగత్తునందు ప్రాణులు అన్ని గలవని లెక్క వేసెదరు. ఈ ప్రాణులలో మానవులు మొదలగు ఏవో కొన్ని ప్రాణులు మాత్రమే ధర్మమును చేయుచున్నవి.
ఓ మహర్షీ! ధర్మమును చేయువారిలోనైననూ తరచుగా కొద్ది మంది మాత్రమే మోక్షమును కోరెదరు. మోక్షమును కోరే వేలాదిమందిలో ఒకానొకడు మాత్రమే సంసారబంధమునుండి విముక్తుడై సిద్ధిని బడయును.
ఓ మహర్షీ! సంసారబంధమునుండి విముక్తిని పొందిన సిద్దపురుషులలోనైననూ, నారాయణుడే పరమలక్ష్యముగా కలిగి మిక్కిలి శాంతమగు మనస్సు గలవాడు కోటిలో ఒక్కడు కూడ కనబడుట దుర్ఘటమే.
వృత్రుడైతే సకలప్రాణులకు పీడను కలిగించిన పొపి. భయంకరమగు యుద్ధములో వానికి శ్రీకృష్ణునియందు ఇంతటి దృఢమగు భక్తి ఎట్లు కలిగెను?
ఓ ప్రభూ! ఈ విషయములో మాకు పెద్ద సందేహము గలదు. నాకు ఈ విషయమును వినాలనే కుతూహలము గలదు. ఆహా! వృత్రుడు యుద్ధములో వేయి కన్నుల వేలుపును తన పౌరుషముతో సంతోష పెట్టెను గదా!
సూత మహర్షి ఇట్లు పలికెను --- పూజనీయుడు, వేదవ్యాస బాద రాయణుని పుత్రుడు అగు శుకమహర్షి శ్రద్ధాళువు అగు పరీక్షిత్తు వేసిన
చక్కని ప్రశ్నను విని, ఆయనను అభినందించి, ఇట్లు పలికెను.
శ్రీశుక మహర్షి ఇట్లు పలికేను --- ఓ పరీక్షిన్మహారాజా! నేనీ వృత్తాంతమును వ్యాసుని వద్ద, నారదుని వద్ద, దేవలుని వద్ద కూడ వినియుంటిని. దానిని యథాతథముగా చెప్పేదను. నీవు సావధానముగా వినుము.
ఓ మహారాజా! చిత్రకేతువు అని ప్రసిద్ధి గాంచిన మహారాజు శూర సేన దేశమునకు చక్రవర్తియై ఉండగా, భూమి ఆయనకు కోరికలనన్నింటినీ అనుగ్రహించినది.
ఆయనకు కోటిమంది భార్యలుండిరి. ఆయన సంతానమునకు అర్హుడే. అయిననూ, ఆయనకు వారియందు సంతానము కలుగలేదు.
అందము, దానగుణము, యౌవనము, గొప్ప వంశములో జన్మ, విద్య, రాజాధికారము, సంపద మొదలగు గుణములన్నియు ఆయన యందు నిండుగా నుండెను. అయిననూ, సంతానము లేని భార్యలకు భర్త యగుటచే ఆయనకు బెంగ కలిగెను.
ఆ చక్రవర్తికి సకలసంపదలు, అందమైన కన్నులు గల భార్యలు, ఈ భూమండలము పై అధికారము ఉన్ననూ, వాటి వలన ఆయనకు ప్రీతి కలుగలేదు.
పూజనీయుడగు అంగిరస మహర్షి ఈ లోకములను సంచరిస్తూ అనుకోకుండా (ఈశ్వరేచ్ఛచే) ఒకనాడా చక్రవర్తి భవనమునకు విచ్చే సెను.
రోజు ఆయనకు ఎదురేగి అర్ఘ్యము మొదలగు వాటితో యథావి ధిగా పూజించెను. ఆయన అతిథి సత్కారమును స్వీకరించి సుఖముగా కూర్చుండగా, మహారాజు సావధానుడై ఆయన దగ్గర కూర్చుండెను.
ఓ పరీక్షిన్మహారాజా! చిత్రకేతు మహారాజు వినయముతో వినమ్రుడై తనకు దగ్గరగా నేలపై కూర్చుండి యుండగా, అంగిరస మహర్షి ఆయనను సత్కారపూర్వకముగా సంబోధించి, ఇట్లు పలికెను.
అంగిరస మహర్షి ఇట్లు పలికెను --- నీకు దేహమునందు ఆరోగ్య ముగ నున్నదా? రాజప్రకృతులకు కల్యాణమేనా? మహత్తత్త్వము (సమష్టి బుద్ధి శక్తి), సమష్టి అహంకారము, అయిదు భూతములు అనే ఏడు తత్త్వ ములు జీవుని జీవునిగా నిలబెట్టును. అదే విధముగా, గురువు, మంత్రి, రాష్ట్రము, దుర్గములు, ఖజానా, న్యాయవ్యవస్థ, మిత్రరాజ్యములు అనే ఏడు ప్రకృతులు రాజును రక్షించుచుండును.
ఓ మహారాజా! రాజు తనను సాక్షాత్తుగా రాజప్రకృతులకు వశము చేసుకొని కల్యాణమును బడయును. అదే విధముగా, రాజప్రకృతులు కూడ రాజునకు వశులై, రాజుచే సమర్పించబడిన సంపదలు గలవారై కల్యాణములను బడయుదురు.
భార్యలు, ప్రజలు, అమాత్యులు, సేవకులు, వ్యాపారులు, సలహా దారులు, నగరవాసులు, పల్లెవాసులు, సామంతులు, పుత్రులు వశవర్తులై ఉన్నారా?
ఎవనికైతే తన మనస్సు వశములో నుండునో వానికి వీరందరు వశవర్తులగుటయే గాక, లోకపాలకులతో సహ సకలలోకములు ఉపేక్ష చేయకుండగా, వానికి ఉపహారములను సమర్పించును.
నీ మనస్సునకు సంతోషము లేదు. నీనుండి గాని, ఇతరులనుండి గాని నీవు కోరినది నీకు లభించలేదని నాకు తెలియుచునే యున్నది. నీ ముఖము బెంగచే వ్యాప్తమై యున్నది.
ఓ పరీక్షిన్మహారాజా! ఆ మహర్షి అన్నీ తెలిసినవాడే అయినా విన యముచే నమ్రుడై యున్న ఆ రాజును ఈ తీరున వివిధ ప్రశ్నలు వేసెను. సంతానమును కోరుచున్న ఆ రాజు ఆ మహర్షి యెదుట ఇట్లు పలికెను.
చిత్ర కేతువు ఇట్లు పలికెను --- ఓ పూజనీయా! తపస్సు, ఉపాసన మరియు చిత్తెకాగ్రతలచే నశింప జేయబడిన దోషములు గల యోగులకు దేహధారుల లోపల మరియు బయట ఉన్నది ఏది తెలియకుండును?
ఓ మహర్షీ! అయిననూ, అన్నీ తెలిసిన తమరు ప్రశ్నించుచున్నారు. తమరి ఆజ్ఞచే ప్రేరితుడనై నేను నా మనస్సులోని బెంగను చెప్పేదను.
నా వద్ద లోకపాలకులు కూడ కోరదగిన సామ్రాజ్యాధికారము, సంపదలు గలవు. ఆకలి దప్పికలతో పీడించబడుచున్నవానిని ఇతర పదార్థ ములు సంతోష పెట్టలేవు. అదే విధముగా, సంతానము లేని నాకు వీటి వలన ఆనందము కలుగకున్నది.
ఓ మహాత్మా! సంతానము లేకుండుటచే నేను నా పూర్వజులతో సహా నరకమును పొందెదను. నన్ను ఆ నరకమునుండి రక్షించుము. సంతానము కలిగినచో, మేము తరించ శక్యము కాని ఆ నరకమును తరిం చెదము. కావున, సంతానము కలిగే ఉపాయమును నాకు ఉపదేశించుము.
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- బ్రహ్మగారి పుత్రుడగు ఆ అంగిరసుడు పూజనీయుడు, కరుణామయుడు మరియు సర్వసమర్థుడు. ఆయన త్వష్ట దేవతగా గల అన్నమును హోమాగ్నియందు వండించి, త్వష్టకు హోమము చేసెను.
భరత వంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! ఆ రాజుయొక్క భార్యలలో పెద్దామె పేరు కృతద్యుతి. ఆమె గొప్ప యోగ్యురాలు. అంగిర సుడు యజ్ఞప్రసాదమును ఆమెకు ఇచ్చేను.
తరువాత బ్రహ్మపుత్రుడగు అంగిరసుడు ఆ మహారాజుతో, ఓ రాజా! నీకు ఆనందమును దుఃఖమును కూడ కలిగించే ఒక కొడుకు కలుగును, అని చెప్పి తన దారిన వెళ్లాను.
ఆ కృతద్యుతి దేవి కూడ ఆ ప్రసాదమును తినుట వలననే, చిత్రకే తువుయొక్క గర్భమును, కృత్తిక అగ్నియొక్క పుత్రుని వలె, ధరించెను.
ఓ మహారాజా! ఆమె గర్భము శూర సేన దేశప్రభుడగు చిత్రకేతువు తేజస్సుచే, మెల్లగా శుక్లపక్షచంద్రుని వలే దినదినము వర్ధిల్లెను.
తరువాత సమయము రాగానే కొడుకు పుట్టెను. ఆ వార్తను విన్న శూర సేన దేశ ప్రజలకు చాల ఆనందము కలిగెను.
మహారాజు చాల ఆనందించెను. ఆయన స్నానము చేసి పరిశుద్దుడై అలంకరించుకొని, తన పుత్రునకు వేదవేత్తలచే ఆశీర్వచనములను చేయించి జాతకర్మను కూడ చేయించెను.
ఆయన వారికి బంగారమును, వెండిని, వస్త్రములను, ఆభరణములను, గ్రామములను, గుర్రములను, ఏనుగులను, ఆరు కోట్ల పాలిచ్చే ఆవులను కూడ దానము చేసెను.
ఉదారస్వభావము గల ఆ రాజు తన పుత్రునకు ధనము, కీర్తి, ఆయుర్వృద్ది కలుగుట కొరకై, మేఘుడు ప్రాణులకు నీటిని వర్షించిన విధ ముగా, ఇతరులకు కూడ కోరికలను వర్షించేను.
నిర్గనునకు కష్టము మీద లభించిన ధనమునందు ప్రీతి అధికము గానుండును. అదే విధముగా రాజర్షి, తండ్రి అగు చిత్రకేతువునకు లేక లేక కలిగిన కొడుకు పై ప్రేమ అపుడు దినదినము వర్ధిల్లెను.
తల్లియగు కృతధ్యుతికైతే పుత్రునియందు వ్యామోహమును కలిగించే అత్యధికమగు ఆసక్తి ఉదయించెను. ఆమె సవతులకు తమకు కూడ సంతానము కలుగువలెననే కోరికచే తీవ్రమగు సంతాపము కలిగెను.
చిత్ర కేతువు ప్రతిరోజు పిల్లవానిని లాలించెడివాడు. ఆయనకు పుత్రుని కన్న భార్యయందు ఉన్న అధికమగు ప్రేమ ఇతర భార్యలయందు లేకుండెను.
వారు తమకు సంతానము లేకపోవుటచే దుఃఖిస్తూ, తమపై తామే దోషముల నారోపించుకుంటూ, తమను తాము నిందించుకొనిరి. పైగా, రాజు వారిని ఆదరించుట లేదు. ఈ విధముగా వారు చాల తాపమును పొందిరి.
సంతానము లేక, ఇంటిలో భర్తకు నచ్చుబాటు కాక, చక్కని సంతానము గల సవతులచే దాసివలె తిరస్కరించబడే పాపియగు స్త్రీయొక్క జీవితము నిందార్హము.
ప్రభువునకు పరిచర్య చేస్తూ సమ్మానమను పొందే దాసీలకు దుఃఖము ఏమి ఉండును? మనము దాసీకి దాసీలవంటి అభాగ్యులము.
ఈ విధముగా వారు తమ సవతికి పుత్రుడు రూపములో పట్టిన భాగ్యముచే మండిపోవుచుండిరి. పైగా, రాజునకు వారి ప్రవృత్తి నచ్చుబాటు కాకుండెను. దానితో, వారికీ బలమగు విద్వేషము కలిగెను.
విద్వేషముచే ఆ భార్యల వివేకజ్ఞానము నశించెను. వారు రాజు ప్రవృత్తిని సహించలేక, మిక్కిలి క్రూరమగు బుద్ధి గలవారై, ఆ బాలకునకు విషమును పెట్టిరి.
సవతులు చేసిన పెద్ద పాపము కృతద్యుతికి తెలియదు. బాల కుడు నిద్రించుచున్నాడనియే ఆమె తలచెను. ఆమె పిల్లవాడు నిద్ర లేచు నని ఎదురు చూస్తూ, ఇంటిలో తచ్చాడుచుండెను.
బుద్ధిమతియగు కృతద్యుతికి పిల్లవాడు చాల సేపు నిద్రించుచున్నా డని నిశ్చయము కలిగెను. కల్యాణీ! నా పుత్రుని తీసుకు రమ్ము, అని ఆమె దోదిని ఆదేశించెను.
ఆమె పరుండియున్న పిల్లవాని దగ్గరకు వెళ్లాను. వాని కనుగ్రుడ్లు పైకి ఉబికి యుండెను. వానిలో ప్రాణము గాని, ఇంద్రియవ్యాపారములు గాని లేవు. జీవుడు ఆ దేహమును విడిచి పెట్టెను. ఆ విషయమును తెలుసుకున్న ఆ దాసి, అయ్యో! చచ్చితిని! అంటూ నేలపై పడెను.
అప్పుడు ఆ దాది రెండు చేతులతో గుండెలను కొట్టుకుంటూ పెద్ద ఆర్తనాదమును చేసెను. ఆ ఏడుపు శబ్దమును విని వెంటనే రాణి కూడ వేగముగా తన కొడుకు వద్దకు వచ్చెను. ఆమెకు అచట చచ్చి పడియున్న పసికూన తన పుత్రుడు దర్శనమిచ్చెను.
అపుడామె మహాదుఃఖముతో వస్త్రము జారి నేలపై పడి మూర్చి లైను. ఆమె జుట్టు చెల్లా చెదరయ్యేను.
తరువాత, రాజుగారి అంతఃపురములోనుండే స్త్రీపురుషులందరు ఏడుపు విని అచటకు వచ్చిరి. ఆ ఆపద వారందరికి తమకు వచ్చిన ఆపదగనే కనబడెను. వారు అధికముగా దుఃఖించిరి. పాపము చేసిన సవతులు కూడ వచ్చి కపటముగా దుఃఖించిరి.
ఆ రోజు తన కొడుకు మరణమును కలలోనైననూ ఊహించలేదు. కొడుకు మరణవార్తను వినగానే ఆయనకు కన్నుల యెదుట చీకటి నిండెను. పుత్రునియందలి ప్రేమను నిరంతరముగా అనువృత్తి చేయుటచే ఆయన దుఃఖము మరింత పెరిగిపోయెను. దాని వలన ఆయన దారిలో మరల మరల జారి పడిపోవుచుండెను. అనుచరులు, మంత్రులు మొదలగువారు, వేదవేత్తలు చుట్టుపొరియుండగా ఆయన మూర్ఛిల్లెను.
ఆ రాజు మరణించిన పిల్లవాని పాదముల వద్ద కూలబడెను. ఆతని జుట్టు చెల్లాచెదరు కాగా, వస్త్రము జారిపోయెను. ఆయన దీర్ఘముగా నిట్టూర్చుచుండెను. కన్నీటితో ఆయన చూపు అడ్డుకొనబడగా, కంఠ మునందు డగ్గుత్తిక వలన ఆయన మాటలాడ లేకపోయెను.
అప్పుడు పతివ్రతయగు మహారాణి పెద్ద దుఃఖముతో నిండి యున్న తన భర్తను, మరణించిన తన ఏకైకసంతానమగు పిల్లవానిని చూచి, పలువిధములుగా ఏడ్చెను. ఆమెను చూచి జనులు, మంత్రులు మొదలగువారు కూడ హృదయములో దుఃఖమును పొందిరి.
ఆమె పక్షివలె స్పష్టమగు స్వరముతో పలువిధములుగా పుత్రుని గురించి శోకించుచుండగా, కుంకుమ గంధములతో అలంకరించబడిన స్తన ద్వయము కాటుక కళ్లనుండి స్రవించిన నీటి బిందువులతో తడిసిపోయెను. కేశములనుండి మాలలు జారిపోగా, ఆమె జుట్టు విరబోసుకొని యుండెను.
అయ్యో! ఓ బ్రహ్మా! నీవు మిక్కిలి మూర్ఖుడవు. ఏలయనగా, నీవు చేసిన సృష్టికి విరుద్ధముగా నీవే ఆచరించుచున్నావు. పెద్దలు బ్రతికియుండగా, పిన్నలు మరణించుట విరుద్దమే గదా! నీలో ఈ విరోధము వాస్తవ ముగా ఉన్నచో, నీవు అందరికి అమరుడైన శత్రువు అగుదువు.
ఈ లోకములో దేహధారుల జన్మమరణములకు క్రమమేదియు లేదన్నచో, నీవు ఉండి ప్రయోజనమేమి? జీవులు తమ తమ కర్మలచే పుట్టి మరణించుచుందురు. నీవు నీ సృష్టి వర్ధిల్లుటకై ప్రేమపాశమును నిర్మించితివి. దానిని నీవే ఇప్పుడు స్వయముగా తెగగొట్టుచున్నావు.
బాబూ! నేను దీనురాలను, అనాథను. నన్ను విడిచి పెట్టి వెళ్లుట నీకు తగదు. శోకముతో మగ్గిపోవుచున్న నీ తండ్రిని చూడుము. సంతానము లేనివారు తరించ శక్యము కొని నరకమును మేము నీ వలన తేలికగా తరించెదము. కాని, నీవు దయ లేని యమునితో కలిసి దూరముగా వెళ్లి పోవద్దు.
బొబూ! లెమ్ము, రాజకుమారా! నీ జతగాండ్రగు ఈ పిల్లలు చక్కగా ఆడుకొనుటకై నిన్ను పిలుచుచున్నారు. చాల సేపు నిద్రించినావు. నీకు బాగా ఆకలి వేయుచుండును. అన్నమును తినుము. పాలను త్రాగుము. నీవారమగు మా శోకములను పోగొట్టుము.
ఓ పుత్రా! నేను పుణ్యము నశించిన దానను. దయ లేని యముడు నిన్ను తిరిగి రాని మరియొక లోకమునకు కొనిపోయినాడా? ముద్దు వచ్చే చిరునవ్వు, ఆనందముతో నిండిన చూపులు గల పద్మమువంటి నీ ముఖము ఇకపై నాకు కనబడదు. నీ మధురమగు మాటలు నాకు వినరావు.
మరణించిన పుత్రుని గురించి ఆమె ఈ విధముగా పలు విధములుగా విలపించుచుండెను. చిత్రకేతువు అత్యధికమగు పీడను పొందినవాడై, ఎలుగెత్తి రోదించెను.
ఆ దంపతులు రోదించుచుండగా, వారి అనుయాయులు స్త్రీలు పురుషులు అందరు రోదించుచుండిరి. ఈ విధముగా నగరమంతయు జడముగా తయారయ్యేను.
ఈ విధముగా అచటి జనులందరు మోహమును పొంది, తెలివిని కోల్పోయి ఉండిరి. వారికి రాజు ఉండి కూడ లేనట్లాయెను. ఈ విషయము తెలిసీ అంగిరస మహర్షి నారదునితో గూడి అచటకు వచ్చెను.
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి ఆరవ స్కంధములో వృత్రాసురుని పూర్వచరితమునందు చిత్ర కేతువు పుత్రవియోగమును పొందుటను
వర్ణించే పదునాల్గవ అధ్యాయము ముగిసినది (14).
