శ్రీ మద్భాగవతము - షష్థమ (6వ) స్కందము

Table of Contents

10 - దేవాసుర యుద్ధము

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- జగత్తునకు సుఖమును కలిగించే శ్రీహరి భగవానుడు ఇంద్రుని ఈ విధముగా ఆదేశించి, దేవతలు చూచుచుండగా అచటనే అంతర్ధానమాయెను.

భరతవంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! దేవతలు అథర్వణవేదీ యుడగు దధీచి మహర్షిని అదే విధముగా కోరిరి. అప్పుడాయన సంతోషిస్తూ, చిరునవ్వుతో వారితోనిట్లనెను.

దేవతలారా! దేహధారులకు మరణసమయములో సహించ శక్యము కాని ఉపద్రవము (పీడ) కలిగి మూర్చ కూడ వచ్చును. ఆ విష యము మీకు తెలియదా యేమి?

ఈ లోకములో జీవించ గోరే ప్రాణులకు దేహము మిక్కిలి ప్రియ తమమైనది, అభీష్టమైనది. స్వయముగా విష్ణువే కోరిననూ, దానిని ఇచ్చు టకు ఎవడు సాహసించును?

దేవతలిట్లు పలికిరి --- ఓ మహర్షీ! భూతదయ, పవిత్రమగు కీర్తి, పవిత్రమగు కీర్తి గలవారిచే కూడ కొనియాడదగిన కర్మలు గల నీవంటి మహాత్ములగు పురుషులకు విడిచి పెట్ట శక్యము కానిది ఏమి ఉండును?

జనులకు తమ పనియే ప్రధానముగా నుండును. వారు ఇతరుల కష్టమును తెలుసుకొనరు. తెలుసుకొనేవారైనచో, ఇతరులను ఈ విధముగా యాచించరు. దాత సమర్థుడైనచో, ఇతరులు యాచించినప్పుడు కాదనడు.

దధీచి మహర్షి ఇట్లు పలికెను --- నేను మీనుండి ధర్మమును వినగోరి మిమ్ములను నిరాకరించినట్లు మాటలాడినాను. ఇదిగో! నేను ప్రియమైన దేహమును మీ కొరకు విడిచి పెట్టుచున్నాను. ఈ దేహము నన్ను ఒకనాడు విడిచి పెట్టేదే.

ఓ ప్రభువులారా! ఏ మానవుడైతే భూతదయ గలవాడై, అనిత్యమగు దేహముతో ధర్మమును చేసి కీర్తిని సంపాదించడో, అట్టివానిని గురించి చెట్టు చేమలు కూడ శోకింప దగినదే.

మానవుడు ప్రాణుల దుఃఖముచే తాను దుఃఖమును, వాటి సుఖ ముచే తాను హర్షమును పొందవలెను. పవిత్రమగు కీర్తి గలవారలు ఉపా సించే వినాశము లేని ధర్మము ఇంత మాత్రమే.

            ధనము, బంధువులు, దేహము క్షణకాలములో ముక్కలయ్యేవే గాని, పురుషార్థమునకు పనికి వచ్చేవి కావు. ఇవి అంతతో గత్వా ఇతరులకు మాత్రమే పనిని ఇచ్చును. మానవుడు వీటితో పరోపకారమును చేయకపోవుట, అయ్యో! ఎట్టి దీనత! అయ్యో! ఎట్టి కష్టము!

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- అథర్వవేదీయుడగు దధీచి ఈ విధముగా నిశ్చయించుకొని, పరబ్రహ్మస్వరూపుడగు శ్రీహరి భగవానుని యందు మనస్సును విలీనము చేసి, దేహమును విడిచి పెట్టెను.

పరమాత్మతత్త్వము నెరింగిన దధీచికి కర్మబంధము నశించెను. ఆయన ఇంద్రియములను, ప్రాణములను, మనస్సును, బుద్ధిని వశము చేసుకొని, సర్వోత్తమమగు చిత్తేకాగ్రతను పొందియుండెను. ఆయనకు తెలి యకుండానే దేహత్యాగము సంపన్నమయ్యెను.

తరువాత విశ్వకర్మ దధీచి మహర్షియొక్క ఎముకలతో వజ్రమును నిర్మించెను. బలమును , పొంది, భగవానుని తేజస్సుతో కూడియున్న ఇంద్రుడు గొప్ప ఏనుగుపై కూర్చుండి దానిని పైకెత్తి పట్టుకొని శోభిల్లెను. దేవగణములన్నియు ఆయనను చుట్టువారి యుండెను. మహర్షుల గణము లాయనను స్తుతించుచుండెను. ఆయన ' ముల్లోకములను ఆనందింప జేయుచున్నాడా యన్నట్లు ఉండెను.

ఓ మహారాజా! వృత్రుడు రాక్షస సేనానాయకులతో కూడియుండె ను. ఇంద్రుడు కోపించి వృత్రుని నరుకుటకై, రుద్రుడు యముని పైకి వలె, వేగముగా బలముతో ఆతని పైకి దండెత్తెను.

అప్పుడు మొదటి మహాయుగములో త్రేతాయుగము ఆరంభములో నర్మదానదీతీరమునందు దేవతలకు, రాక్షసులతో మిక్కిలి భయంకరమగు యుద్ధము జరిగెను.

ఓ మహారాజా! రుద్రులు, వస్తువులు, ఆదిత్యులు, అశ్వినీ దేవతలు, పితృదేవతలు, అగ్ని, మరుత్తులు, ఋభువులు, సాధ్యులు, విశ్వేదేవతలతో కూడియున్న దేవరాజగు ఇంద్రుడు వజ్రమును ధరించి యుద్దములో తనదైన శోభతో ప్రకాశించేను. వృత్రుడు అగ్రేసరుడుగా గల రాక్షసులు ఆయనను చూచి సహించ లేకపోయిరి.

నముచి, శంబరుడు, అనర్వ, ద్విమూర్దుడు, ఋషభుడు, అంబ రుడు, హయగ్రీవుడు, శంకుశిరసుడు, విప్రచిత్తి, అయోముఖుడు, పులోమ, వృషపర్వుడు, ప్ర హేతి, హేతి, ఉత్కలుడు, సుమాలి, మాలి మొదలగు దితిపుత్రులు, దనుపుత్రులు, యక్షులు, రాక్షసులు వేలసంఖ్యలో, యమున కైననూ సమీపించ శక్యము కొని ఇంద్రుని సేనానాయకుని త్రోసుకొని నిర్బ యముగా ముందుకు దూసుకు పోయిరి. బంగరు ఆభరణములను ధరించి, గర్వించియున్న ఆ రాక్షసులు సింహనాదమును చేయుచుండిరి. గదలు, గుదియలు, బాణములు, ఈటెలు, సమ్మెటలు, చిల్లకోలలు, శూలములు, గండ్ర గొడ్డళ్లు, కత్తులు, ఫిరంగులు, ఇనుప ముండ్ల కర్రలతో వారు దేవత లను పీడించిరి. వారు దేవనాయకులపై అన్ని వైపులనుండియు శస్త్రముల ను, అస్త్రములను వర్షముగా కురిపించిరి.

వారిపై బాణములు పుంఖానుపుంఖములుగా అన్ని వైపులనుండియు పడుచుండెను. ఆకాశములో మేఘములచే కప్పివేయబడిన నక్షత్రములు వలె, ఆ దేవనాయకులు బాణములచే కప్పబడి కానరాకుండిరి.

హస్తలాఘవము గల దేవతలు ఆ శస్త్రముల మరియు అస్త్రముల పరంపరల వర్షములను ఆకాశములోనే ఛిన్నాభిన్నము చేయగా, అవి దేవ సైనికుల దరిదాపులకు రాలేక పోయినవి.

అప్పుడు రాక్షసుల వద్ద శస్త్రాస్త్రములు ఖర్చు అయిపోగా, వారు దేవ సైన్యము పై పర్వత శిఖరములను, చెట్లను, రాళ్లను వర్షించిరి. దేవతలు వాటిని కూడ ముక్కలు ముక్కలుగా చేసిరి.

వృత్రుని నాయకత్వములో రాక్షసులు దేవ సైన్యముపై శస్త్రముల ను, అస్త్రములను వర్షించిననూ, వారు చెక్కు చెదరకుండ క్షేమముగా నుండిరి. తరువాత వారు చెట్లను, రాళ్లను, పలు రకముల పర్వత శిఖరము లను ఇంద్రుని సైనికులపై వర్షించిననూ, వారికి గాయమే కాలేదు. ఈ స్థితిని చూచి, రాక్షసులు భయపడిరి.

అల్పులు మహాత్ములపై ప్రయోగించే తిట్లతో కూడిన పరుషవచన ములు వారిపై ఎట్టి ప్రభావమును చూపలేవు. అదే విధముగా, శ్రీకృష్ణుని అనుగ్రహము గల దేవగణములపై రాక్షసులు మరల మరల చేసిన దాడుల న్నియు వ్యర్థములే ఆయెను.

శ్రీహరియందు భక్తి లేని ఆ రాక్షసులకు యుద్ధమునందలి గర్వము తొలగిపోయెను. వారి మనోబలమంతయు శత్రువులచే తీసుకొనబ డెను. ఈ విధముగా యుద్దమునకు ఆరంభములోనే తమ శ్రమ వ్యర్థమగు టను గాంచి, వారు తమ ప్రభువగు వృత్రుని విడిచి పెట్టి పారిపోవుటకు నిశ్చ యించుకొనిరి.

స్వాభిమానము గల వృత్రాసురుడు తన అనుచరులగు ఆ రాక్ష సులు పారిపోవుచుండుటను గాంచెను. తీవ్రమగు భయముతో తన సైన్యము చెల్లాచెదరై పారిపోవుచుండుటను చూచిన ఆ వీరుడు నవ్వి ఇట్లు పలికెను.

పురుషులలో గొప్ప వీరుడగు వృత్రుడు సమయోచితముగా, స్వాభిమానము గలవారల మనస్సును హరించే ఈ మాటను పలికెను --- ఓ విప్రచిత్తీ! నముచీ! పులోమా! మయా! అనర్వా! శంబరా! నా మాటను వినుడు.

ఈ లోకములో సర్వత్రా పుట్టినవానికి మరణము నిశ్చితము. భగవంతుడు దానికి నివారణోపాయమును కూడ పెట్టలేదు. అట్టి మరణము వలన పుణ్యలోకము కీర్తి కూడ లభించే పక్షములో, అట్టి యోగ్యమగు మరణము సంప్రాప్తమైనప్పుడు, దానిని ఎట్టివాడు వరించకుండును?

ఈ లోకములో రెండు గొప్ప మరణములు గలవు. వాటిని పొందుట చాల కష్టము. భక్తిజ్ఞానములయందు ప్రీతి గల సాధకుడు ప్రాణాయామమును చేసి భగవంతుని ధ్యానిస్తూ దేహమును విడిచి పెట్టుట మొదటిది. వీరుడు యుద్ధరంగమునుండి వెనుదిరుగకుండా ముందుకు దూసుకు పోయి శత్రువుల ప్రహారమునకు గురియై యుద్దభూమియందు మరణిం చుట రెండవది.

శ్రీమద్బాగవత మహాపురాణమునందలి ఆరవ స్కంధములో దేవాసుర

యుద్దమును వర్ణించే పదవ అధ్యాయము ముగిసినది (10).