శ్రీ మద్భాగవతము - షష్థమ (6వ) స్కందము

Table of Contents

11 - వృత్రాసురుని వీరవాణి

            శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! వారి నాయకుడగు వృత్రుడు ఈ విధముగా ధర్మబద్ధమైన మాటను చెప్పెను. కాని, వివేకము లేని ఆ రాక్షసులు భయభీతులై పారిపోవుటయే లక్ష్యముగా పెట్టుకొని, ఆయన మాటను స్వీకరించనే లేదు.

ఓ మహారాజా! కాలము కలిసి వచ్చిన దేవతలు రాక్షస సైన్యమును నాయకుడు లేని సైన్యమును వలె, చెల్లాచెదరు చేసి తరిమి వేయు చుండిరి. రాక్షసశ్రేష్ఠుడు, ఇంద్రశత్రువు అగు వృత్రుడీ దృశ్యమును చూచి, చాల కోపముతో దానిని సహించలేక పరితాపమును పొందెను. అపుడా తడు వేగముగా తన బలమునొడ్డి, ముందుకు వచ్చుచున్న దేవ సైన్యమును నిలువరించి ఇట్లు పలికేను.

వీరు ఇప్పుడే తల్లి ఒడినుంచి వచ్చినవారు. కావుననే, పారిపోవుచున్నారు. వారిని వెనుకనుండి కొట్టుట వలన ప్రయోజనమేమున్నది? శూరులమనుకొనే వారు భయపడినవారిని వధించుట ప్రశంసారము కాదు. దాని వలన స్వర్గాది పుణ్యలోకములు కూడ లభించవు.

ఓ అల్పులారా! మీకు యుద్ధమునందు ఉత్సాహము, హృదయ మునందు ధైర్యము ఉన్నచో, ఇంద్రియభోగములయందు తృష్ణ లేనిచో, క్షణకాలము నా ముందు నిలువుడు.

మహాబలశాలియగు వృత్రుడు కోపించి ఈ విధముగా పలికి, తన శరీరముతో శత్రువులగు దేవగణములకు భయమును గొల్పుచూ, సింహ నాదము చేయగా, ఆ ధ్వనికి ప్రాణులు మూర్చిల్లెను.

వృత్రుని ఆ గర్జనచే దేవగణములన్నియు, నెత్తిపై పిడుగు పడిన వారు వలె, మూర్చిల్లి నేలపై బడిపోయిరి.

యుద్ధరంగమునందు గొప్పగా గర్వించి శూలమును పైకెత్తి పట్టు కొనియున్న వృత్రుడు తన బలముతో భూమిని కంపింప జేయుచుండెను. దేవతలు ఆయనను చూచి భయపడి కళ్లను మూసుకొనిరి. తామరతూళ్ల గుంపులోనికి ఏనుగుల గుంపునకు నాయకుడై మదించియున్న గజేంద్రము వలె, ఆతడు దేవ సైన్యములో ప్రవేశించి, వారిని తన కాళ్లతో తొక్కి వేసెను.

ఆ పరిస్థితిని చూచి సహించలేని వజ్రధారియగు ఇంద్రుడు, తన మీదకు తన శత్రువగు వృత్రుడు దూసుకువచ్చుచుండగా, పెద్ద గదను ఆతనిపై విసిరెను. ఆ గదను ఓర్చుకొనుట చాల కష్టము. కాని, తన మీదకు వచ్చుచున్న ఆ గదను వృత్రుడు అవలీలగా ఎడమ చేతితో పట్టుకొనెను.

`          ఓ మహారాజా! ఇంద్రశత్రువు, భయంకరమగు పరాక్రమము గలవాడు అగు ఆ వృత్రునకు చాల కోపము వచ్చెను. ఆతడు యుద్దరంగములో బిగ్గరగా సింహనాదమును చేసి, ఆ గదతో మహేంద్రుని వాహనమగు ఐరావతమును కొట్టెను. ఆతని ఆ పనిని అందరు ప్రశంసించిరి.

వృత్రుడు గదతో కొట్టగా పగిలిన ముఖము గల ఆ ఐరావతము, వజ్రముచే కొట్టబడిన పర్వతము వలె, అధికమగు పీడను పొంది, గిరగిర తిరుగుతూ రక్తమును గ్రక్కుతూ, ఇంద్రునితో సహా ఏడు ధనుస్సుల దూరము వెనుకకు తగ్గాను.

తన వాహనము మూర్చిల్లుటచే ఇంద్రుడు మనస్సులో భేదమును పొందెను. కాని, ఆ సమయములో ఉదారస్వభావుడగు వృత్రుడు మరల గదను ఆయనపై ప్రయోగించలేదు. ఇంతలో ఇంద్రుడు గాయపడిన తన ఏనుగును అమృతము చిలికే తన చేతితో తడిమి, నొప్పిని తొలగించి, మరల యుద్దములో నిలిచి యుండెను.

ఓ పరీక్షిన్మహారాజా! తన శత్రువు, తన సోదరుని చంపినవాడు అగు ఆ ఇంద్రుడు యుద్ధము చేయు కోరికతో వజ్రమును ధరించియుండ గా వృత్రుడు చూచెను. ఇంద్రుడు చేసిన క్రూరమగు పాపకృత్యము ఆతని తలపునకు వచ్చి మనస్సు శోకముతో, మరియు సోదరునియందలి ఆస క్తితో నిండెను. ఆతడు నవ్వుతూ ఇంద్రునితో నిట్లనెను.

ఓరీ పరమదుష్టుడా! నీవు నా సోదరుడు, నీకు గురువు, బ్రాహ్మణుడు అగు విశ్వరూపుని చంపిన హంతకుడవు. దైవవశముచే నీవీనాడు నా యెదుట నిలిచి యున్నావు. నాకు ఆనందము! నేనీనాడు తొందరగా నా శూలముతో రాయివంటి నీ హృదయమును ముక్కలు చేసి తండ్రి ఋణమును తీర్చుకొనెదను.

నీవు స్వర్గమునందలి కామననే గాని, దయను ఎరుగవు. మా అన్నగారు విశ్వరూపుడు ఆత్మజ్ఞానియైన బ్రాహ్మణుడు. పాపమునెరుగని ఆయన దీక్షలోనుండగా నీవు ఆయనను నమ్మించి, కత్తితో ఆయన తలలను పశువు తలను నరికినట్లుగా నరికితివి.

నిన్ను సిగ్గు, సంపద, దయ, కీర్తి - అనునవి విడిచి పెట్టినవి. నీవు చేసిన పాపపు పనికి నిన్ను నరమాంసభక్షకులు కూడ నిందించెదరు. నీ దేహమును నేను శూలముతో ముక్కలు చేయగా, నీవు కష్టపడుతూ మరణించెదవు. అట్టి నీకు దహనసంస్కారము కూడ ఉండబోదు. నీ దేహ మును గ్రద్దలు చక్కగా భక్షించ గలవు.

 కొందరు మూర్ఖులు ఈ యుద్ధరంగములో క్రూరుడవగు నిన్ను అనుసరిస్తూ, నాపై ప్రయోగించుటకై అస్త్రముల నెక్కు పెట్టి యున్నారు. నేను వారి మెడలను వాడియగు నా త్రిశూలముతో ముక్కలుగా చేసి, (ఆ రక్తమాంసములతో) భూతనాయకులను వారి గణములను తృప్తిపరచెదను.

వీరుడవగు ఓ ఇంద్రా! అట్లు గాక, నీవే ఇచట నీ వజ్రముతో నన్ను కొట్టి నా తలను నరికే పక్షములో, నేను నా శరీరముతో ప్రాణులకు ఆహారమును కల్పించి, ఋణవిముక్తుడనై స్వాభిమానము గల వారు పొందే లోకములను పొంది, అచట వారీ పాదములకు మ్రొక్కెదను.

ఓ దేవేంద్రా! నీ శత్రువునగు నేను నీ యెదుటనే నిలిచి యున్నాను. నీవు నాపై అమోఘమగు వజ్రమునేల ప్రయోగించవు? నీవు ఇంతకు ముందు ప్రయోగించిన గదవలె వ్యర్థమగునేమోయని సందేహించకుము. వజ్రము లోభినుండి ప్రయోజనమున పేక్షించి చేసే యాచనవంటిది కాదు. అది వ్యర్థము కాబోదు.

 ఓ ఇంద్రా! నీ వజ్రమును శ్రీహరి తేజస్సు, దధీచి తపస్సు నిశ్చయముగా తేజస్వంతము చేసినవి. శ్రీహరి ప్రేరణ కూడ నీకు గలదు. నీవు దానితోనే నీ శత్రువునగు నన్ను సంహరించుము. శ్రీహరి ఎటువైపు ఉంటే, విజయము సంపద సద్గుణములు అటువైపు ఉండును.

నేను సంకర్షణదేవుని ఆజ్ఞానుసారముగా నా మనస్సును ఆయన పాదపద్మముపై ఏకాగ్రము చేసెదను. నీ వజ్రము నా దేహముతో బాటుగా విషయభోగములయందలి పాశమును కూడ తెగగొట్టును. నేను భోగవాసనలను పరిత్యజించి, ఆత్మజ్ఞానులు పొందే మోక్షమును పొందగలను.

దేవలోక భూలోక రసాతలలోకములయందలి సంపదలను అనన్యమగు భక్తి గల తన భక్తులకు భగవానుడు ఈయడు. ఏలయనగా, వాటి వలన మానవునకు ద్వేషము, భయము, మనస్సంతాపము, గర్వము, కలహము, దుఃఖము కలుగును. వాటిని రక్షించుటకై అధికమగు శ్రమ మాత్రమే మిగులును గదా!

ఓ ఇంద్రా! మన ప్రభుడు వ్యక్తికి ధర్మార్థకామములకు చెందిన ఆయాసమును అంతమొందించును. దాని చేతనే భగవానుని అనుగ్రహమును మనము ఊహించవలెను. భోగపరాయణులకు పొంద శక్యము కాని ఆ అనుగ్రహము ఏకాంతభక్తులకు తేలికగా లభించును.

ఓ శ్రీహరీ! నేను మరల నీ పాదములే ఏకైకమగు ఆశ్రయముగా గల భక్తుల దాసుని అనుసరించే దాసుడనై జన్మించెదను గాక! ఆ జన్మలో నా మనస్సు ప్రాణనాథుడవగు నీ గుణములనే స్మరించు గాక! నా పొగింద్రి యము నీ గుణములనే కీర్తించు గాక! నా దేహము నీ పూజనే చేయుగాక!

అన్ని సౌభాగ్యములకు నిధియగు ఓ శ్రీహరీ! నేను నిన్ను విడిచి నీనుండి వేరై, స్వర్గపదమును గాని, ధ్రువస్థానమును గాని, బ్రహ్మపదవిని గాని, చక్రవర్తి పదవిని గాని, రసాతలమునకు ఆధిపత్యమును గాని, యోగ సిద్ధులను గాని, పునర్జన్మ లేని మోక్షమునే గాని కోరను.

పద్మమువంటి కన్నులు గల ఓ శ్రీహరీ! రెక్కలు రాని పక్షులు తల్లి కొరకు, ఆకలిచే పీడించబడే లేగదూడలు తల్లి పాల కొరకు, ఖిన్నురాలగు ప్రియురాలు పొరుగు దేశము వెళ్లిన ప్రియుని కొరకు వలె, నా మనస్సు నిన్ను చూచుటకు తహతహ లాడుచున్నది.

ఓ ప్రభూ! నా కర్మలచే నేను సంసారచక్రములో పడి తిరుగుచున్నాను. నాకు పవిత్రకీర్తివగు నీ భక్తులతోడి మైత్రి కలుగు గాక! దేహము, సంతానము, భార్య, ఇల్లు అనువాటియందు నా చిత్తము తగుల్కొని యున్నది. నాకు వాటియందు మైత్రి కలుగకుండు గాక! అట్టి ఆసక్తి గలవాని మైత్రి కూడ నాకు కలుగకుండు గాక!

శ్రీమద్బాగవత మహాపురాణమునందలి ఆరవ స్కంధములో వృత్రాసురుని

వీరవాణిని వర్ణించే పదునొకండవ అధ్యాయము ముగిసినది (11).