శ్రీ మద్భాగవతము - షష్థమ (6వ) స్కందము
8 - నారాయణ కవచము
పరీక్షిన్మహారాజు ఇట్లు ప్రశ్నించెను --- ఓ పూజనీయా! నారాయణుని రూపమే అయి ఉన్న కవచవిద్యచే రక్షించబడిన వేయి కన్నుల ఇంద్రుడు శత్రుసైనికులను వారి వాహనములతో బాటుగా జయించి ముల్లో కముల సంపదననుభవించెను. ఆ కవచమును నాకు చెప్పుడు. ఆ కవచము రక్షించుచుండగా, ఇంద్రుడు యుద్ధమునందు శస్త్రధారులగు శత్రువులను నిర్జించిన విధమును కూడ చెప్పుడు.
సాధకుడు భయము వచ్చినప్పుడు నారాయణ కవచమును ఈ విధముగా కట్టుకొనవలెను. కాళ్లు చేతులు కడుగుకొని, దర్భపవిత్రమును ధరించి, ఉత్తరముఖముగా కూర్చుండి, ఆచమనము చేసి, మౌనముగా పవిత్రమగు హృదయముతో తన అవయవములయందు చేతులయందు, ఓo నమో నారాయణాయ మరియు ఓం నమో భగవతే వాసుదేవాయ (వాసుదేవ భగవానుని కొరకు నమస్కారము) అనే రెండు మంత్రములతో న్యాసమును చేయవలెను. ముందుగా ఓం నమో నారాయణాయ అనే మంత్రముయొక్క ఎనిమిది అక్షరములను ఓంకారమునకు జేర్చి, క్రమముగా పాదములు, మోకాళ్లు, తొడలు, ఉదరము, హృదయము, వక్షఃస్థలము, నోరు, తలలయందు న్యాసము చేయవలెను. లేదా, దీనికి విపరీత క్రమములో మంత్రములోని అక్షరములను వెనుకనుండి ఆరంభించి, తలతో ఆరంభించి న్యాసము చేయవలెను.
తరువాత, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే పన్నెండు అక్షరముల మంత్రముతో ఓo తో మొదలిడి యకారము వరకు ఒక్కొక్క అక్షరమును ఓంకారమునకు జోడించి, రెండు చేతుల ఎనిమిది వ్రేళ్లయందు (బొటనవ్రేళ్లను మినహాయించి), రెండు బొటనవ్రేళ్లయొక్క నాలుగు కణుపులయందు, వెరసి పన్నెండు స్థానములలో కరన్యాసమును చేయవలెను.
ఓం విష్ణవే నమః (విష్ణువు కొరకు నమస్కారము) అనే మంత్రము యొక్క ఓంకారమును హృదయమునందు, వి-కారమును తలపై, షకారమును కనుబొమల మధ్య, ణకారమును పిలకపై న్యాసము చేయవలెను.
వేకారమును రెండు కళ్లయందు, నకారమును అన్ని కీళ్లయందు న్యాసము చేయవలెను. ఓం మః అస్త్రాయ ఫట్ అని చెప్పి దిగ్బంధమును చేయవలెను. ఈ విధముగా వివేకియగు సాధకుడు ఓం విష్ణవే నమః అనే మంత్రము రూపముగా గలవాడు అగును.
ప్రకృతికి అతీతుడగు నారాయణుడు ధ్యానము చేయదగినవాడు. ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము అనే ఆరు శక్తులను నిండా కలిగియున్న నారాయణుని ఆత్మరూపముగా ధ్యానించవలెను. జ్ఞానము, తేజస్సు, తపస్సులు మూర్తీభవించిన ఈ క్రింది (నారాయణ కవచ) మంత్రమును జపించవలెను.
శంఖము, చక్రము, డాలు, కత్తి, గద, బాణము, ధనుస్సు, పాశములను ఎనిమిది బాహువులలో ధరించి, పక్షిరాజగు గరుడుని వీపుపై పద్మములవంటి పాదములనుంచిన శ్రీహరిని ఎనిమిది ఐశ్వర్యములు (అణిమ - సూక్ష్మరూపమును పొందుట, లఘిమ - తేలికగా నగుట, ప్రాప్తి - దేనినైనా పొందగల్గుట, ప్రాకామ్యము - ఎదురులేని ఇచ్చాశక్తి, మహిమ - పెద్దగా అగుట, ఈశిత్వము - సర్వమును శాసించుట, వశిత్వము - సర్వ మును తన వశములో నుంచుకొనుట, కామావసాయిత - కోరికలకు అతీతుడుగా నుండుట) సేవించుచున్నవి. ఓంకారస్వరూపుడగు ఆయన నాకు సర్వదేశకాలములయందు రక్షణను కలిగించు గాక!
మత్స్యమై అవతరించిన శ్రీహరి నన్ను నీళ్లలో వరుణుని పాశమగు జలజంతువుల గణములనుండి రక్షించు గాక! మాయచే పొట్టి బ్రహ్మచారి రూపమును దాల్చి మూడు అడుగులతో జగత్తును కొలిచిన వామనమూర్తి నన్ను నేలపై రక్షించు గాక! ఈ జగద్రూపముగా ప్రకటమైయున్న శ్రీహరి నన్ను ఆకాశములో రక్షించు గాక!
అడవి, రణరంగము మొదలగు సంకటస్థానములలో రాక్షససేనా నాయకులకు శత్రువగు నృసింహ ప్రభుడు రక్షించుగాక! ఆయన పెద్ద అట్ట హాసనమును చేయగా, దిక్కులు ప్రతిధ్వనించి గర్భములు జారిపోయినవి.
యజ్ఞములే అవయవములుగా గలిగి, తన కోరచే భూమిని పైకి తీసుకువచ్చిన వరాహమూర్తి నన్ను మార్గమునందు కాపాడుగాక! పరశురాముడు నన్ను పర్వత శిఖరములపై కాపాడు గాక! మరియు లక్ష్మణునితో కూడియుండువాడు, భరతుని అన్నగారు అగు శ్రీరాముడు మమ్ములను పరదేశయాత్రయందు రక్షించు గాక!
భయమును కలిగించే తామస ధర్మమునుండి, అన్ని పొరపాట్ల నుండి నారాయణుడు నన్ను రక్షించు గాక! నరుడు నాకు గర్వము కలుగకుండా రక్షించు గాక! యోగేశ్వరుడగు దత్తాత్రేయుడు నాకు భక్తిజ్ఞానములు లేని స్థితినుండి రక్షించు గాక! గుణాతీతుడగు కపిల భగవానుడు నన్ను కర్మల బంధము (సంసారము) నుండి రక్షించు గాక!
సనత్కుమారుడు కామవేగమునుండియు, హయగ్రీవుడు ప్రయాణములో మార్గములో పొరపాటున దేవతల యెడల జరిగే అపరాధములనుండియు, దేవర్షులలో శ్రేష్ఠుడగు నారదుడు పురుషోత్తముని ఆరాధనకు వచ్చే ఆటంకములనుండియు, కూర్మరూపుడగు శ్రీహరి సకలనరకముల (దుఃఖముల) నుండియు నన్ను రక్షించు గాక!
ధన్వంతరి భగవానుడు నన్ను హితము కాని పదార్థములను తినుటనుండియు, మనోజయము గల ఋషభదేవుడు సుఖదుఃఖాది ద్వంద్వముల వలన కలిగే భయమునుండి, యజ్ఞస్వరూపుడగు శ్రీహరి లోకాపవాదమునుండి, బలరాముడు జనులు పెట్టే కష్టములనుండి, సర్పరాజగు శేషుడు కోపమునకు వశమగుటనుండి (విషసర్పమునుండి) రక్షించు గాక!
పూజనీయుడగు వ్యాస మహర్షి అజ్ఞానమునుండియు, బుద్ధుడు వేదవిరుద్ధమతానుయాయుల గణమునుండి మరియు ధర్మాచరణములో జరిగే మరుపునుండియు, ధర్మరక్షణ కొరకై అనేకములగు అవతారములను దాల్చిన కల్కి కాలమునందు వచ్చే కలి (కలహ) దోషమునుండియు నన్ను రక్షించు గాక!
గదాధారియగు కేశవుడు (అందమైన జుట్టు గలవాడు) ఉదయమునందు, మురళి పట్టుకున్న గోవిందుడు (గోవులను పాలించువాడు) పగటి రెండవ జాములో, గొప్ప శక్తి అనే ఆయుధము గల నారాయణుడు (సకల ప్రాణులే నివాసముగా గలవాడు) పగటి మూడవ జామునందు, గొప్ప చక్రము చేతియందు గల విష్ణువు (సర్వవ్యాపకుడు) మధ్యాహ్నమునందు నన్ను రక్షించు గాక!
భయంకరమగు ధనస్సు గల మధుసూదనుడు పగటి చివరి భాగమునందు, త్రిమూర్తియగు మాధవుడు (లక్ష్మీపతి) సాయంకాలమునందు, రాత్రి ఆరంభములో హృషీ కేశుడు (ఇంద్రియాధిపతి), అర్ధరాత్రి వరకు మరియు అర్ధరాత్రి తరువాత ఒకే (అద్వితీయుడగు) పద్మనాభుడు (పృథివీ పద్మము ఆకాశరూపమగు నాభియందు గలవాడు) నన్ను రక్షించు గాక!
శ్రీవత్సము వక్షఃస్థలమునందు గల ఈశ్వరుడు రాత్రి చివరయందు, కత్తిని ధరించిన జనార్దన (దుష్టజనులను పీడించే) ప్రభుడు వేగుజామునందు, దామోదరుడు (నడుముకు త్రాడు కట్టబడినవాడు) రెండు సంధ్యలయందు, జగన్నాథుడు కాలమూర్తియగు శ్రీహరి భగవానుడు తెల్లవారిన సమయమునందు నన్ను రక్షించు గాక!
ఓ సుదర్శనమా! ప్రళయకాలాగ్నివలె కాలిపోయే ధారలు గల నీవు భగవానుడు ప్రయోగించగా అంతటా తిరుగుతున్నావు. గాలి తోడైన అగ్ని ఎండు గడ్డిని వలె, నీవు శత్రుసైన్యమును వెంటనే పూర్తిగా తగుల బెట్టుము (సుదర్శనము తగుల బెట్టును).
ఓ కౌమోదకీ గదా! నీనుండి రాలే నిప్పు కణములు పిడుగుల వలె తగులును. నీవు పరాజయమునెరుంగని శ్రీహరికి ప్రియమైన దానవు. నీవు మాకు శత్రువులగు కూష్మాండములు, వినాయకులు, భూతములు, గ్రహములు (ప్రేతములలో భేదములు), యక్షులు, రాక్షసులను పిండి పిండి చేయుము.
ఓ గొప్ప శంఖమా! శ్రీకృష్ణునిచే పూరించబడే నీ ధ్వని శత్రువుల హృదయములను భయముతో వణుకునట్లు చేయును. రాక్షసులు, ప్రమథగణములు, ప్రేతములు, మాతృకలు, పిశాచములు, బ్రహ్మరాక్షసులు మొదలగు క్రూరమగు చూపులు గల ప్రాణులను తరిమి వేయుము.
వాడి పదును గల ఓ గొప్ప కత్తీ! ఈశ్వరునిచే ప్రయోగించబడిన నీవు నా శత్రువుల సైన్యమును అతిశయించి ఛేదించుము. వంద చంద్రాకారపు బుడిపెలు గల ఓ డాలూ! పాపపు చూపులు గలవారు, పాపులు అగు శత్రువుల కన్నులను నీవు కప్పివేసి, వారికి చూపు లేకుండా చేయుము.
కుజుడు మొదలగు గ్రహములు, తోకచుక్కలు, మానవులు, ప్రాకే జంతువులు, కోరలు గల క్రూరమృగములు, ప్రేతములు, పంచభూతములు, పాపులగు ప్రాణులు అనువాటి వలన మాకు కలిగే భయము భగవానుని నామరూపములను, ఆయుధములను కీర్తించుట వలన వెంటనే పూర్తిగా తొలగిపోవు గాక! మాకు మంచి మార్గములో ఆటంకమును కలిగించువారు పూర్తిగా నాశమును పొందెదరు గాక!
పూజనీయుడు, వేదమూర్తి అగు గరుడుడు బృహద్రథంతరము మొదలగు సామములచే చక్కగా స్తుతించబడుచుండును. ఆ ప్రభుడు కష్టములన్నింటినుండి గట్టెక్కించు గాక! విష్వక్సేనుడు (అంతటా తన కిరణములు గల సూర్యుని రూపములోనున్న శ్రీహరి, లేక పార్షదుడు) ప్రభువు నామముల ప్రభావముచే రక్షించు గాక!
శ్రీహరి పేర్లు, రూపములు, వాహనములు, ఆయుధములు, ఆయన అనుచరులలో ప్రముఖులు మా బుద్ధి, ఇంద్రియములు, మనస్సు, ప్రాణములను ఆపదలన్నింటినుండి రక్షించు గాక!
రూపము గల పృథివి జలము అగ్ని, రూపము లేని వాయువు ఆకాశము అనే సర్వము పరమార్థములో భగవానుడే అనేది యథార్థము గదా! ఈ సత్యముచే మా ఉపద్రవములన్నీ నశించు గాక!
అద్వయ-ఆత్మ అనుభవము గలవారికి సర్వజ్ఞుడు, సర్వవ్యాపి అగు ఆ శ్రీహరి భగవానునియందు భేదము వాస్తవముగా లేదు. అయిననూ, ఆయన తన మాయచే భూషణములను, ఆయుధములను, ఆకారములను, నామములను, జ్ఞానము ఐశ్వర్యము మొదలగు శక్తులను ధరించుచున్నాడు. ఇది యథార్థము. ఈ యథార్థమగు ప్రమాణముచే ఆయన తన రూపములన్నింటిచే మమ్ము అన్ని దేశకాలములలో రక్షించు గాక!
నృసింహ భగవానుని తేజస్సు ముందు సూర్యాది తేజస్సులు వెలవెల బోవుచుండెను. ఆయన తన అట్టహాస ధ్వనిచే నాలుగు దిక్కులయందు, నాలుగు మూలలయందు, క్రింద, పైన, లోపల, బయట, అన్ని వైపులా జనుల భయమును పోగొట్టును.
ఓ ఇంద్రా! నారాయణ రూపమగు ఈ కవచమును నేను నీకు చెప్పితిని. దీనిని రక్షణకవచముగా చేసుకొని నీవు రాక్షస సేనానాయకులను తేలికగా జయించ గలవు.
ఈ కవచమును ధారణ చేయు వ్యక్తి ఎవనినైతే కంటితో చూచునో, లేదా కాలితో చక్కగా స్పృశించునో, వాని భయము వెంటనే దూరమగును.
ఈ కవచమంత్రమును ధారణ చేయు వ్యక్తికి, రాజు బందిపోట్లు గ్రహములు మొదలగువాటి వలన గాని, పెద్దపులి మొదలగు క్రూరజంతువుల వలన గాని, ఏ కాలములోనైననూ ఏ దేశమునందైననూ దేనివలనై ననూ భయము కలుగదు.
పూర్వము కౌశికుడనే బ్రాహ్మణుడొకడు ఉండెను. ఆతడు ఈ కవచమంత్రమును ధారణ చేసి, ఎడారిలో యోగమునభ్యసిస్తూ ప్రాణములను విడిచిపెట్టెను.
ఒకనాడు గంధర్వపతియగు చిత్రరథుడు స్త్రీలతో చుట్టువారబడి విమానములో, ఆ బ్రాహ్మణుడు మరణించిన స్థానమునకు పైనగా వెళ్లాను.
వెంటనే ఆతడు తలక్రిందులుగా విమానముతో సహా నేల గూలెను. ఆయనకు చాల ఆశ్చర్యమయ్యెను. అపుడు వాలఖిల్య మహర్షుల సలహా ప్రకారముగా, ఆతడు ఆ బ్రాహ్మణుని అస్థులను తీసుకొని, తూర్పుగా ప్రవహించే సరస్వతీ నదిలో కలిపి, స్నానము చేసి, తన లోకమునకు వెళ్లెను.
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఎవడైతే దీనిని ఏదో ఒకప్పుడు వినునో, సాదరముగా ధారణ చేయునో, అట్టివానికి ప్రాణులు నమస్కరించును. వానికి అన్ని విధముల భయమునుండి విముక్తి కలుగును.
ఈ కవచమంత్రమును వంద యజ్ఞములు చేసిన ఇంద్రుడు విశ్వరూపునినుండి పొంది, దాని బలముచే యుద్దములో రాక్షసులను విశేషముగా జయించి, ముల్లోకముల సంపదను అనుభవించెను.
శ్రీమద్భాగవత మహాపురాణమునందలి ఆరవ స్కంధములో నారాయణ
కవచమును వర్ణించే ఎనిమిదవ అధ్యాయము ముగిసినది.
