శ్రీ మద్భాగవతము - షష్థమ (6వ) స్కందము

Table of Contents

15 - అంగిరసుడు చిత్రకేతువునకు వైరాగ్యమునుపదేశించుట

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- చిత్రకేతు మహారాజు మరణించిన కొడుకు ప్రక్కన మరణించినవానిని బోలి పడియుండెను. ఆ విధముగా శోకముచే పరాభూతుడై యున్న రాజునకు మంచి మాటలను బోధిస్తూ, అంగిరసుడు మరియు నారదుడు ఇట్లు పలికిరి.

ఓ మహారాజా! నీవీ బాలకుని గురించి శోకించుచుంటివి. ఈ సృష్టి యందు పూర్వజన్మలో, ఈ జన్మలో మరియు రాబోయే జన్మలో నీకు ఈ బాలకుడేమగును? నీవు వీనికీ ఎన్నవ తండ్రివి?

ప్రవాహవేగముచే ఇసుక కణములు ఒకదానితో మరియొకటి కలిసి విడిపోవుచుండును. అదే విధముగా కాలవేగమునందు ప్రాణులు ఒకరితో మరియొకరు కలిసి విడిపోవుచుందురు.

ధాన్యపు గింజలనుండి మరికొన్ని ధాన్యపు గింజలు పుట్టి మరల నశించుచుండును. ఇదే విధముగా, కొన్ని జీవులు ఈశ్వరుని మాయాశక్తిచే ప్రేరితులై మరికొన్ని జీవులకు సంతానమై పుట్టెదరు. పుట్టినవారు అటులనే నిలిచియుందురను నియమము లేదు. పుట్టినవారు గిట్టుచుందురు.

 ఓ రాజా! మేము, నీవు, వీరలు, కదిలే మరియు కదలని ప్రాణులు అనే మనమందరము సమకాలీనులము. పుట్టుటకు ముందు గాని, మరణీం చిన తరువాత గాని మనము లేము. కావున, ఇప్పుడు కూడ లేము. (త్రికాలములలో బాధితము కానిదే సత్యము. కేవలము వర్తమాన కాలములో ఉన్నట్లు కనబడేది కనబడుటయే గాని వాస్తవముగా ఉండుట కాదు).

సకలజీవులకు శాసకుడు, పుట్టుక లేనివాడు అగు శ్రీహరికి ఈ జగ ద్వ్యాపారమునందు సాధించదగిన ప్రయోజనమేమియు లేదు. చిన్నపిల్లలు ఆట కొరకు ఇసుకలో ఇళ్లను కట్టి కూల్చుచుందురు. అదే విధముగా, ఆయన అస్వతంత్రములగు ఈ ప్రాణులను సృష్టించి, వాటి ద్వారా ఇతర ప్రాణులను సృష్టిస్తూ, రక్షిస్తూ, వాటి ద్వారానే సంహరించుచుండును.

ఓ రాజా! ఒక గింజనుండి మరియొక గింజ పుట్టునట్లుగా, దేహమునకు దేహముతోడి కలయిక వలన మరియొక దేహము పుట్టును. ఆ దేహమునకు అభిమానియగు దేహి కూడ దేహముతో బాటే పుట్టినట్లు కొన వచ్చును. కాని, ఘటాది కార్యములయందు వస్తువైన మట్టి వలె, దేహి మాత్రమే నిత్యుడుగా నుండును. (దేహములు నశించును).

మట్టి ఒక్కటియే. కొని, దానియందు ఘటవ్యక్తీ (ఒకానొక ఘటము), ఘటజాతి (ఘటసామాన్యము) అనునవి కల్పితములు. అదే విధముగా, ఒకే పరమాత్మయందు అనాదినుండియు అజ్ఞానముచే ఈ దేహము దేహి అనే విభాగము కల్పించబడినది.

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఆ మహర్షులిద్దరు ఈ విధముగా ఆ చిత్రకేతు మహారాజును ఓదార్చిరి. అపుడాయన మనస్సునందలి దుఃఖముచే వాడిపోయిన ముఖమును చేతితో తుడుచుకొని ఇట్లు పలికెను.

మీరిద్దరు మలినమగు వేషముతో, మీ గురించి ఎవ్వరికైననూ తెలియని విధముగా, ఇచటకు విచ్చేసితిరి. మీరు జ్ఞానసంపద గలవారు. మహాత్ములలో మహాత్ములు. మీరెవరు?

బ్రహ్మజ్ఞానులు భగవానునకు ఆత్మరూపులు. వారు నావంటి భోగాసక్తమగు బుద్ధి గలవారలకు బోధించుట కొరకై పిచ్చివారి లక్షణ ములతో భూమిపై యథేచ్ఛగా సంచరించుచుందురు.

సనత్కుమారుడు, నారదుడు, ఋభువు, అంగిరసుడు, దేవలుడు, అసితుడు, అపాంతరతముడు, వ్యాసుడు, మార్కండేయుడు, గౌతముడు, వసిష్ఠుడు, భగవాన్ పరశురాముడు, కపిలుడు, బాదరాయణ వ్యాసుని పుత్రుడగు శుకుడు, దుర్వాసుడు, యాజ్ఞవల్క్యుడు, జాతూకర్ణ్యుడు, ఆరుణి, రోమశుడు, చ్యవనుడు, దత్తాత్రేయుడు, ఆసురి, పతంజలి, వేదశిర మహర్షి, బోధ్యముని, పంచశిరసుడు, హిరణ్యనాభుడు, కౌసల్యుడు, శ్రుత దేవుడు, ఋతధ్వజుడు మొదలగు సిద్ధపురుషులు అనేకులు లోకమునకు ఆత్మజ్ఞానముననుగ్రహిస్తూ సర్వస్వతంత్రులై సంచరించెదరు.

నేను భోగాసక్తుడనై పశుప్రాయముగా బ్రదుకుచున్నాను. నా బుద్ధి వ్యామోహితమై యున్నది. నేను అజ్ఞానమునందు, తమోగుణమునందు మునిగి యున్నాను. కావున, సమర్థులగు మీరిద్దరు నాలో జ్ఞానమనే దీప మును వెలిగించుడు..

ఓ మహారాజా! నేను అంగిరసుడను. పుత్రుని కోరే నీకు పుత్రుని అనుగ్రహించినది నేనే. ఈయన సాక్షాత్తు బ్రహ్మపుత్రుడు, పూజనీయుడు అగు నారద మహర్షి.

ఓ మహారాజా! పురుషోత్తముని భక్తుడవగు నీవు ఈ విధముగా పుత్రశోకముచే తరించ శక్యము కాని అజ్ఞాసోంధకారములో మునిగి యున్నావనియు, నీవు అట్లు అగుటకు తగదనియు తెలుసుకొని, మేమిద్దరము నిన్ను అనుగ్రహించుటకై ఇచటకు విచ్చేసినాము. వేదవేత్తల యెడల భక్తి గలవాడు, భగవద్భక్తుడు దుఃఖముతో క్రుంగిపోవుట తగదు.

ఇదివరలో నేను నీ గృహమునకు వచ్చినప్పుడే నీకు సర్వోత్కృష్టమగు ఆత్మజ్ఞానమును ఇచ్చియుండెడి వాడను. కాని, నీవు దానికంటే భిన్నముగా పుత్రునియందు పట్టుదలను కలిగియుంటివి. ఆ విషయమును గమనించి, నేను అప్పుడు నీకు పుత్రుని మాత్రమే అనుగ్రహించితిని.

పుత్రుడు గలవారు పొందే దుఃఖమును ఇప్పుడు నీవు అనుభవించుచునే యున్నావు. ఇదే విధముగా భార్య, ఇల్లు, ధనములు, పలు రకముల ఐశ్వర్యములు, సంపదలు, శబ్దస్పర్శరూపరసగంధములనే ఇంద్రియభోగములు, సామ్రాజ్య వైభవములు, భూమి, రాజ్యము, సేన, ఖజానా, సేవకులు, అమాత్యులు, మిత్రజనులు అనే సర్వము కూడా అనిత్యమే.

ఓ శూర సేన మహారాజా! ఇవన్నీ గంధర్వనగరము (ఆకాశములో కనబడిన కల్పితమగు నగరము), కల, ఇంద్రజాలము, కల్పనావిలాసముల లోని వస్తువులు వలే మిథ్య. ఇవి మానవునకు శోకమును, వ్యామోహమును, భయమును మరియు దుఃఖమును మిగుల్చును.

ఈ భోగములు వాస్తవములు కాకున్ననూ యథార్థములు వలె భాసించి, మరు క్షణము అదృశ్యమగుచుండును. కావున, ఇవి మనస్సు యొక్క కల్పనలు మాత్రమే. కర్మవాసనలచే ప్రభావితుడైన వ్యక్తి భోగము లను గురించి ధ్యానించుచుండును. వాని మనస్సే అనేక కర్మలను చేయు చుండుటకు నిమిత్తమగును.

దేహధారియొక్క ఈ దేహమునకు మూలములో ద్రవ్యము, క్రియాశక్తి, జ్ఞానశక్తి గలవు. ఈ దేహమే దేహధారికి పలువిధముల క్లేశముల ను, సంతాపములను కలిగించునని చెప్పబడినది.

కావున, ప్రసన్నమగు మనస్సుతో ఆత్మస్వరూపమును విచారించుము. నానాత్వవిశిష్టమగు ఈ ప్రపంచము యథార్థము అనే సంసారాసక్తిని విడిచి పెట్టుము. మనస్సును ఆత్మస్వరూపమునందు విలీనము చేసి, ఆత్మ నిష్ఠుడవై యుండుము.

నారద మహర్షి ఇట్లు పలికెను --- నీవు నానుండి మోక్షసాధనమగు ఈ మంత్రమును స్వీకరించుము. దీనిని ఏడు రాత్రులు దాటి ధారణ చేయు సాధకునకు సంకర్షణ ప్రభుని దర్శనము కలుగును.

ఓ మహారాజా! శివుడు మొదలగు పూర్వీకులు ఆ సంకర్షణ దేవుని పాదమూలమునాశ్రయించి, నానాత్వవిశిష్టమగు ప్రపంచము యథార్థమనే ఈ భ్రాంతిని విడనాడి, వెంటనే ఆయన మహిమను (మోక్షమును) పొందిరి. దానితో సాటి గాని, దానికంటే గొప్పది గాని మరియొక గతి లేదు. నీవు కూడ తొందరలోనే ఆ మోక్షపదమును పొందగలవు.

శ్రీమద్బాగవత మహాపురాణమునందలి ఆరవ స్కంధములో అంగిరసుడు

చిత్ర కేతువునకు వైరాగ్యమునుపదేశించుటను వర్ణించే

పదునైదవ అధ్యాయము ముగిసినది (15).