శ్రీ మద్భాగవతము - షష్థమ (6వ) స్కందము
1 - అజామిలోపాఖ్యానము
పరీక్షిన్మహారాజు శుకమహర్షితో ఇట్లు పలికెను --- పూజనీయుడవగు నీవు ముందుగా (రెండవ స్కంధములో) నివృత్తిమార్గమును ఉన్నది ఉన్నట్లుగా చెప్పితివి. దాని వలన సాధకుడు క్రమముగా శమదమాది యోగసాధనలననుష్ఠించి, పరబ్రహ్మను ఆత్మరూపముగా తెలుసుకొని సంసారమునుండి విముక్తుడగును.
ఓ మహర్షీ! కర్మానుష్టానరూపమైన మార్గమునకు సత్త్వరజస్తమో గుణముల కార్యమైన సంసారమే విషయము. దానిని కూడ నీవు (మూడవ స్కంధములో) చెప్పితివి. ఈ కర్మమార్గము అజ్ఞానియగు సాధకునకు మరల మరల గుణముల కార్యమగు సంసారమును (దేహమును) కలిగించుచునే యుండును.
తమరు అనేకవిధములైన నరకములను కూడ (ఐదవ స్కంధములో) వర్ణించిరి. అవి నరక హేతువులగు అధర్మములను తెలుపుచున్నవి. మరియు, తమరు మన్వంతరములను కూడ వివరించి (నాల్గవ స్కంధములో) చెప్పితిరి. ఆ మనువులలో స్వాయంభువుడు మొదటివాడు.
మీరు ప్రియవ్రత-ఉత్తానపాదుల వంశమును, వారి వృత్తాంతముల ను (4,5 స్కంధములలో) చెప్పితిరి. ద్వీపములు, ఖండములు, సముద్ర ములు, పర్వతములు, నదులు, ఉద్యానవనములు, వృక్షములు అనువా టిని (5 వ స్కంధములో) వివరించితిరి.
భూమండలము, జ్యోతిర్మండలములు, బిలలోకములయొక్క సన్నివేశములను, వాటియందలి విభాగములను, వాటి లక్షణములను, వాటి కొలతలను, సర్వవ్యాపకుడగు భగవానుడు ఈ జగత్తును సృష్టించిన విధ మును మీరు వివరించి చెప్పితిరి (5 వ స్కంధము).
ఓ మహాత్మా! ఈ లోకములో మానవుడు ఏ ఉపాయముచే అనేక ములగు క్రూరములైన యాతనలు ఉండే నరకములను పొందనే పొందడో, దానిని నాకు మీరు వివరించి చెప్పదగును.
మానవుడు ఈ లోకములో మనోవాక్కాయములచే చేసిన పాప ములకు ప్రాయశ్చిత్తమును యథావిధిగా చేసుకొనవలెను. అట్లు చేయని వ్యక్తి నిశ్చయముగా మరణించిన పిదప నరకములను పొందును. ఆ నరక ములలోని దారుణమగు యాతనలను నేను నీకు వివరించి చెప్పితిని.
అందువలన మానవుడు మరణించుటకు ముందే, దేహము రోగగ్రస్తము కాకముందే, ఈ జన్మలోనే తన దోషముయొక్క ఎక్కువ తక్కువ లను పరిశీలించి, పాపమునకు నిష్కృతిని తొందరగా చేసుకొనవలెను. రోగ ములకు కారణమునెరింగిన వైద్యుడు చికిత్సను చేసినట్లే, మనము మన పాపముల హెచ్చుతగ్గులను గమనించి, ప్రాయశ్చిత్తమును చేయవలెను.
పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- వ్యక్తికి తాను చూచిన దానిని బట్టి, విన్నదానిని బట్టి ఏది పాపమో, ఏది తనకు హితము కాదో, తెలియు చునే యుండును. అయిననూ, వ్యక్తికి తన మనస్సు వశములో లేకుండుట చే, మరల పాపమునే చేయును. ఇట్టి స్థితిలో ప్రాయశ్చిత్తము ఎట్లు సంభవ మగును?
మానవుడు ఒకప్పుడు పాపమునుండి వెనుకకు తగ్గిననూ, ఏనుగు స్నానము చేసి వెంటనే దుమ్మును మీద జల్లుకొనునట్లు, మరియొకప్పుడు దానిని చేయుచునే యున్నాడు. కావున, ప్రాయశ్చిత్తములో అర్థము లేదని నా అభిప్రాయము.
కర్మలకు ఆత్మస్వరూపము తెలియనివాడు మాత్రమే అధికారి. కావున, కర్మచే సమూలముగా కర్మలు నశించుట సంభవము కాదు. ఆత్మ జ్ఞానము మాత్రమే అసలైన ప్రాయశ్చిత్తము.
ఓ మహారాజా! హితమగు ఆహారమును మాత్రమే తినువారిని రోగములు బాధించవు గదా! అదే విధముగా, నియమములను పాటించు వ్యక్తి మెల్లమెల్లగా పాపవాసనలను నివారించి క్షేమము (ఆత్మజ్ఞానము) ను పొందగల్గును.
వివేకము, ధర్మజ్ఞానము, శ్రద్ద గల సాధకులు తపస్సు, బ్రహ్మచ ర్యము, మనోనిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము, త్యాగము, సత్యము, బాహ్య-ఆంతర శౌచములు, యమములు (సత్యము, అహింస, పరధ నమును అపహరించే తలంపు లేకుండుట, బ్రహ్మచర్యము, భోగసాధనము లను ప్రోగు చేయకుండుట), నియమముల (శౌచము, సంతుష్టి, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర శరణాగతి) చే మనోవాక్కాయముల ద్వారా కలి గిన పెద్ద పాపమునైననూ, నిప్పు వెదుళ్ల పొదను వలె, నశింప జేసెదరు.
వాసుదేవుడే సర్వోత్కృష్టమగు ఆశ్రయమైన కొందరు కేవలభక్తిచే, సూర్యుడు పొగమంచును వలె, పాపమును పూర్తిగా నశింప జేసెదరు.
ఓ మహారాజా! ఇంద్రియములను శ్రీకృష్ణునకు సమర్పించి ఆయన భక్తులను సేవించే సాధకుడు ఎంతటి పవిత్రుడగునో, పాపి తపస్సు మొదలగు సాధనములచే అంతటి పవిత్రుడు కాలేడు.
సచ్చీలము గల సత్పురుషులు నారాయణుని పూర్ణముగా శరణు పొందియుందురు. ఈ లోకములో సముచితమైన క్షేమకరమగు మార్గము ఇట్టి భక్తియే. ఈ మార్గములో దేనివలనైననూ భయమునకు తావు లేదు.
ఓ మహారాజా! మద్యము కుండను నదులు పవిత్రము చేయలేవు. అదే విధముగా, నారాయణునియందు భక్తి లేనివానిని వానిచే చేయబడిన ప్రాయశ్చిత్తములు పూర్తిగా పవిత్రుని చేయజాలవు.
ఈ లోకములో ఎవరైతే శ్రీకృష్ణుని గుణములయందు ప్రేమ గల మనస్సును ఒక్కసారి ఆయన పాదపద్మములయందు లగ్నము చేయుదురో, వారు ప్రాయశ్చిత్తమును చేసినట్లే యగును. కావున, వారు కలయందై ననూ యముని, పాశములను ధరించే ఆయన కింకరులను కూడ చూడరు.
ఈ విషయములో ప్రాచీనమగు ఇతిహాసము నొకదానిని పెద్దలు చేప్పెదరు. దానిలో విష్ణుదూతలకు, యమకింకరులకు మధ్యలో జరిగిన సంభాషణము గలదు. నేను దానిని చెప్పెదను. గమనించుము.
కాన్యకుబ్జములో అజామీలుడనే బ్రాహ్మణుడు ఒకడు ఉండెను. ఆతడు దాసితో కలయికచే అపవిత్రుడై ఆ దాసినే వివాహమాడెను. ఆతని సచ్చీలము నశించెను.
ఆతడు ధనికులను బందీలుగా చేసి డబ్బు వసూలు చేసెడివాడు. జూదము, మోసగించుట, చోరీ చేయుట అనువాటిని ఆతడు నిందనీయ మైన బ్రదుకు దెరువు ఆశ్రయించెను. బాహ్యమునందు, ఆంతరము నందు కూడ శౌచము లేని ఆతడు ఈ విధముగా కుటుంబమును పోషిస్తూ, ప్రాణులను యాతన పెట్టెడివాడు.
ఓ మహారాజా! ఆతడీ విధముగా ఆ దాసితో గూడి తమ పుత్రు లను లాలిస్తూ నివసించుచుండగా, చాల కాలము గడిచి పోయేను. ఆతనికి ఎనభై ఎనిమిది ఏళ్ల వయస్సు వచ్చెను.
పెద్ద వయస్సు వచ్చిన ఆ అజామిలునకు పదిమంది కొడుకులు గలరు. వారిలో ఆఖరి పిల్లవాని పేరు నారాయణుడు. ఆ పిల్లవానియందు తల్లిదండ్రులకు ప్రీతి మెండు.
తియ్యని ముద్దు పలుకుల ఆ పిల్లవానియందు వృద్దుడగు అజామి లుని హృదయము కట్టుబడిపోయెను. ఆ పిల్లవాని ఆటపాటలను చూస్తూ, ఆతడు చాల ఆనందించెడివాడు.
అజామీలుడు పిల్లవానియందలి ప్రేమచే కట్టుబడి యుండెను. ఆతడు తాను భోజనము చేస్తూ ఆహారమును నములుతూ పిల్లవానికి కూడ తినిపించెడివాడు. తాను నీటిని త్రాగేటప్పుడు పిల్లవానిచేత కూడ త్రాగించెడివాడు. ఇట్లు వ్యామోహితుడైయున్న ఆతడు తనకు మృత్యువు సంప్రాప్తమైనదనే విషయమునే గమనించలేదు.
ఈ విధముగా కాలక్షేపము చేయుచున్న ఆ అజామీలుడు మర ణించే సమయము వచ్చినప్పుడు, ఆతని మనస్సు నారాయణుడనే తన కొడుకగు పిల్లవానియందే నిలిచి యుండెను.
అజామిలునకు ముగ్గురు పురుషులు కనబడిరి. మిక్కిలి భయ మును గొల్పే ఆ పురుషుల చేతులలో పాశములుండెను. వారు వంకర నోళ్లను, నిక్కబొడుచుకొనియున్న రోమములను కలిగియుండిరి. వారిని చూడగనే, ఆతడు దూరముగానున్న తన నారాయణుడనే పేరు గల కొడుకును పొడవైన స్వరముతో బిగ్గరగా పిలిచెను. ఆ పిల్లవాడు ఆటవస్తువు లయందు నిమగ్నుడై యుండెను.
ఓ మహారాజా! అజామీలుడు మరణిస్తూ నారాయణ నామమును పలికెను. శ్రీహరి అనుచరులు తమ ప్రభువు పేరు విని, ఆతడు శ్రీహరిని కీర్తించుచున్నాడని తలచిరి. వారు వెంటనే అచటకు వచ్చిపడిరి.
యమకింకరులు దాసిని వివాహమాడిన అజామిలుని సూక్ష్మశరీర మును హృదయము లోపలనుండి బయటకు లాగుచుండిరి. అపుడు విష్ణువు దూతలు వారిని వద్దని బలముగా నివారించిరి.
ఆ విధముగా అడ్డుకొనబడిన యమకింకరులు విష్ణుదూతలతోనిట్లనిరి --- యమధర్మరాజు శాసనమును అడ్డుకొనుటకు మీరెవరు?
మీరు ఎవని అనుచరులు? ఎక్కడనుండి వచ్చినారు? వీనిని మేము కొనిపోవుచుండగా అడ్డు తగులుటకు కారణమేమి? మీరు దేవ తలా? లేక గంధర్వాది ఉపదేవతలా? లేక, శ్రేష్ఠులైన సిద్ధపురుషులా?
పద్మదళములవంటి కన్నులు గల మీరందరు కిరీటములను కుండ లములను పెట్టుకొని, పట్టు పీతాంబరములను ధరించియున్నారు. పద్మ ముల మాలలతో ప్రకాశించే మీరెవరు?
యౌవనములోనున్న మీరందరు అందమైన నాలుగు చేతులను కలిగియున్నారు. ధనస్సు, అంబుల పొది, కత్తి, గద, శంఖము, చక్రము మరియు పద్మములతో మీరు శోభిల్లుచున్నారు.
మీ కాంతిచే చీకట్లు తొలగిపోయి దిక్కులు ప్రకాశించుచున్నవి. యమధర్మరాజు కింకరులమగు మాకు మీరు ఏల అడ్డు వచ్చేదరు?
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఆ యమదూతలిట్లు పలుకగా, వాసుదేవుని కింకరులు బిగ్గరగా నవ్వి, మేఘగర్జనవలె గంభీరమైన వాక్కుతో వారికిట్లు బదులు చెప్పిరి.
విష్ణుదూతలిట్లు పలికిరి --- మీరు నిశ్చయముగా యమధర్మరా. జుయొక్క ఆజ్ఞను పాలించేవారైతే, మాకు ధర్మముయొక్క స్వరూప మును, ప్రమాణమును, లక్షణములను కూడ చెప్పుడు.
శిక్షను వేసే విధమెట్టిది? ఎవరు ఈ శిక్షకు అర్హుడైన పాత్రుడు ? పాపకర్మను చేసే మానవులందరు శిక్షార్హులేనా? లేక, వారిలో కొందరు మాత్రమేనా?
యమదూతలిట్లు పలికిరి -- వేదవిహితమైనది ధర్మము కాగా, వేదముచే నిషేధించబడినది అధర్మము. వేదము స్వయంసిద్దము (అపౌరు షేయము). వేదము సాక్షాత్తు నారాయణుని స్వరూపమని వినియుంటిమి.
నారాయణుడు తన స్వరూపమునందు సత్త్వరజస్తమోగుణముల కార్యములగు ప్రాణులను వాటి యోగ్యతననుసరించి, ఆయా గుణములు పేర్లు మరియు రూపములతో రచించుచున్నాడు.
దేహధారియగు జీవుడు చేసే కర్మలకు సూర్యుడు, అగ్ని, ఆకాశ ము, వాయువు, ఇంద్రియములు, చంద్రుడు, సంధ్యాకాలము, రాత్రింబగ ళ్లు, దిక్కులు, నీరు, పృథివి, కాలము, ధర్మము అనేవి సాక్షులు.
మానవులు చేసే అధర్మమును ఈ సాక్షులు చూచుచునే యుండు ను. ఆ అధర్మమే శిక్షకు కారణముగా సంప్రాప్తమగును. పాపకర్మలను చేయు జనులందరు తమ తమ కర్మలకనురూపముగా శిక్షకు అర్హులే.
ఓ పుణ్యాత్ములారా!. జీవులకు గుణములతో (గుణకార్యములగు దేహేంద్రియమనస్సులతో) సంగము (అభిమానము) ఉండును. కావుననే, దేహమునందు నేను, నాది అనే అభిమానము గల వ్యక్తి కర్మలను చేయ కుండా ఉండలేడు, కావున, ఆ విధముగా కర్తృత్వాభిమానముతో కర్మలను చేయు జనులకు ఒకప్పుడు పుణ్యము, మరియొకప్పుడు పాపము సంప్రా ప్తమగుచునే యుండును.
మానవుడు ఈ లోకములో ఏ విధముగా ఎంత ధర్మమును గాని, అధర్మమును గాని చేయునో, అదే విధముగా ఆ కర్మయొక్క ఫలమును - అదే ప్రమాణములో పరలోకమునందు నిశ్చయముగా అనుభవించును.
ఓ గొప్ప దేవతలారా! ఈ లోకములో సత్త్వరజస్తమోగుణముల సమ్మేళనములలో భేదము ఉండుటచే, ప్రాణులలో సుఖము-దుఃఖము వాటి మిశ్రమము (లేదా, ధర్మము-అధర్మము-వాటి మిశ్రమము) అనే మూడు ప్రకారములు కొనవచ్చుచున్నవి. అదే విధముగా, పరలోకములో కూడ ప్రాణులు అనుభవించే కర్మఫలములు ఈ మూడు విధములుగా నుండునని ఊహించవచ్చును.
వర్తమానమును బట్టి భూతభవిష్యత్తుల నూహించవచ్చును. అదే విధముగా, ప్రస్తుతజన్మలోని పుణ్యపాపములను బట్టి గడచిన మరియు రాబోయే జన్మలలోని పుణ్యపాపములను అంచనా వేయవచ్చును.
మా ప్రభువగు యమ భగవానుడు పుట్టుక లేనివాడు. ఆయన ప్రాణుల హృదయములలోనుండి తన మనస్సు చేతనే ఆయా ప్రాణుల గతచరిత్రలను అవలోకించును. తరువాత, ఆయన తన మనస్సు చేతనే వారికి కలుగబోయే రూపములను కూడ విచారించి తెలుసుకొనును.
తమోగుణప్రధానుడగు అజ్ఞాని కంటికి కనబడే దేహాదులను మాత్రమే ఆరాధించును గదా! అదే విధముగా, పూర్వజన్మపు గురుతులు నశించిన వ్యక్తి పూర్వజన్మలయందలి, మరియు రాబోవు జన్మలలోని తన ధర్మాధర్మములను తెలియజాలడు.
జీవునియందు అయిదు కర్మేంద్రియములు, అయిదు జ్ఞానేంద్రి యములు, అయిదు ప్రాణములు, పదునారవదియగు మనస్సు, పదునేడవ దియగు అహంకారము అనే అంశములు గలవు. అట్టి జీవుడు చేతులు, కాళ్లు, వాక్కు, జననేంద్రియము, విసర్జనేంద్రియము అనే అయిదు కర్మేం ద్రియములతో తాను కోరే పనులను చేయుచుండును. చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు అనే అయిదు జ్ఞానేంద్రియములతో శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనే అయిదు విషయములను జీవుడు తెలుసుకొనుచుండును. అట్టి జీవుడు కర్మేంద్రియములు, జ్ఞానేంద్రి యములు, మనస్సు అనే మూడింటి విషయములను తాను స్వయముగా భోగించుచుండును.
పదునారు అంశములతో కూడిన ఈ ప్రసిద్ధమగు సూక్ష్మశరీరము సత్త్వరజస్తమోగుణముల (శక్తుల) కార్యము. దృఢమైన (భంగము చేయుట కఠినము) ఈ సూక్ష్మశరీరము జీవుని మరల మరల జన్మమరణపరంపర యనే చక్రములో పడవేసి, వానికి సుఖోద్రేకమును, దుఃఖోద్రేకమును, భయమును, పీడను కలిగించుచుండును.
అజ్ఞానియగు వ్యక్తి కామక్రోధలోభమోహమదమాత్సర్యములనే ఆరు శత్రువులను జయించలేక, తన ఇష్టము లేకున్ననూ, వాసనలచే కర్మలు చేయించబడుచున్నాడు. ఇట్టివాడు పట్టు పురుగు వలె తనను తాను కర్మలతో కప్పివేసుకొని, వ్యామోహితుడగుచున్నాడు.
ఎవ్వడైననూ ఏ కాలమునందైననూ క్షణకాలమైననూ కర్మలను చేయకుండా ఉండలేడు. సత్త్వరజస్తమోగుణాత్మకమగు ప్రకృతియొక్క కార్యమైన మనస్సునందలి వాసనలచే మానవుడు అస్వతంత్రుడై బలా త్కారముగా కర్మలను చేయించ బడుచున్నాడు.
జీవుడు కంటికి కానరాని పుణ్యపాపముల కారణముగా చావు పుట్టుకలు గల స్థూల సూక్ష్మశరీరముల సంఘాతమును పొందును. ప్రజల మగు అజ్ఞానము కారణముగా జీవుడు ఒకప్పుడు తల్లిని పోలినట్టియు, మరియొకప్పుడు తండ్రిని పోలిన దేహమును, స్వభావమును పొందును.
జీవునకు ఈ విపరీతస్థితి (చావు పుట్టుకల సంసారము) ప్రకృతికా ర్యములగు దేహేంద్రియమనస్సులయందు నేను, నాది అనే అభిమానము వలననే కలిగినది. ఈశ్వరునియందలి ప్రేమచే ఈ విపరీత స్థితి శీఘ్రముగా తొలగిపోవును.
ఈ అజామీలుడు గొప్ప విజ్ఞానము గలవాడు. ఈతడు సచ్చీల ము, మంచి నడవడి, సద్గుణములకు నిలయము. మెత్తని స్వభావము గల ఈతడు ఇంద్రియములను జయించి సత్యమునే పలుకుతూ జీవితమును ప్రతనిష్ఠతో గడి పెడివాడు. మంత్రవేత్తయగు ఈతడు బాహ్యాభ్యంతరముల యందు శౌచము గలవాడు.
సాధుపురుషుడగు ఈ అజామిలుడు అహంకారము లేకుండా, గురువులకు అగ్నులకు అతిథులకు వృద్దులకు సేవను చేసెడివాడు. సకల ప్రాణులకు హితకారి, మితభాషియగు ఈతనియందు ఇతరులలోని గుణ ములను తప్పులుగా చూపే లక్షణము లేదు.
తండ్రి ఆదేశమును పాలించే ఈ బ్రాహ్మణుడు ఒకనాడు అడవికి వెళ్లి, అచటనుండి పళ్లు పువ్వులు సమిధలు దర్భలను తీసుకొని తిరిగి వచ్చుచుండెను.
జారిపోవుచున్న కోకముడి గల ఒక వేశ్యతో బాటుగా సిగ్గు లేకుండా క్రీడిస్తూ, గర్వించియున్న ఆమెతో బాటుగా పాడుతూ కేరింతాలు కొడుతూ ఉన్న భ్రష్టుడైన ఒక శూద్రవిటుని ఆయన దారిలో చూచెను. బెల్లపు మద్యము త్రాగిన మత్తులో ఆమె కన్నులు గిరగిర తిరుగుచుండెను.
ఆ వ్యక్తి కామోద్దీపకములగు గంధాదులను పూసుకున్న చేతులతో ఆమెను కౌగిలించుకొనెను. అది చూచిన అజామిలుడు వెనువెంటనే వ్యామోహమును పొందెను. హృదయములో దాగియుండే మన్మథునకు ఆయన వశుడాయెను.
అజామీలుడు తనకు గల జ్ఞానముతో ధైర్యమును చిక్కబట్టి తనను తాను నిలదొక్కుకొనే ప్రయత్నమును చేసెను. కాని, మన్మథవికారముచే కుదిపివేయబడిన మనస్సును ఆయన నిలబెట్టుకొన లేకపోయేను.
ఆమెను చూచిన కారణముగా మన్మథుడు రూపములో పిశాచము పట్టుకొనగా, ఆతడు వివేకమును . గోల్పోయి, ఆమెను మాత్రమే మన స్సులో ధ్యానిస్తూ, తన కర్తవ్యములను విడిచి పెట్టి వేసెను.
ఈతడు పామరుల మనస్సునకు ఉల్లాసమును కలిగించే భోగ్యవ స్తువులను ఆమెకు ఇచ్చి ఆమెను ప్రసన్నురాలిని చేసుకొనుటయే పనిగా పెట్టుకొనెను. ఈ పనిలో ఈతడు తండ్రి ఆస్తిని అంతనూ ఖర్చు పెట్టెను.
వేశ్యయొక్క కడగంటి చూపులకు లొంగిపోయిన మనస్సు గల పాపాత్ముడగు ఈ అజామీలుడు బ్రాహ్మణియగు తన భార్యను తొందర లోనే విడిచి పెట్టెను. ఈతని భార్య యౌవనవతియే అయిననూ, గడుసుదన మెరుగదు. ఈతడు మంచి వంశమునకు చెందినవాడనియే ఆమె ఈతనిని వివాహమాడినది.
ఆ వేశ్యకు కుటుంబము కూడ గలదు. ఈ మూర్ఖుడు ఎక్కడో ఒక చోటనుండి న్యాయముగా గాని, అన్యాయముగా గాని ధనమును పట్టుకు వచ్చి, ఆమె కుటుంబమును పోషించెను.
యథేచ్ఛగా సంచరించి మహాత్ములచే నిందించబడిన ఈతడు శాస్త్రమునుల్లంఘించి బ్రతుకంతా పాపములను చేస్తూనే గడి పెను. ఈ తీరున, ఈతడు అంతఃకరణశుద్ది లేని జీవితమును చిరకాలము జీవించెను.
ఈతడు పాపములను చేసినాడే గాని, ప్రాయశ్చిత్తమును చేసుకో నలేదు. కావున, మేము ఈతనిని దండము చేతియందుండే యముని సన్ని ధికి గొనిపోయెదము. అచట ఈతడు శిక్షననుభవించి పవిత్రుడు కాగలడు.
శ్రీమద్భాగవత మహాపురాణమునందలి ఆరవ స్కంధములో అజామిలోపాఖ్యానమునందు మొదటి అధ్యాయము ముగిసినది (1).
